జాతి పరువులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
జాతి పరువులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, మే 2016, శుక్రవారం

భారతీయులందరూ ..

ఒకానొక ఆవేశంలో వ్రాసింది ... ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా .  :)

మిత్రమా !
ఒక్కనాడన్నా మనసారా నవ్వావా?
తుమ్మల్లో పొద్దుగుంకినట్టు ముఖానికి ముళ్ళేసుకుని ఉంటావ్ !
 అయినా అమ్మనిన్ను ప్రేమగా ముద్దాడుతూనే ఉంటుంది
అన్నకెక్కువ నాకు తక్కువంటూ యాగీ చేస్తూనే ఉంటావ్
చిన్నవాడివని క్షమిస్తూనే ఉంటుంది
తక్కువ బరువేసుకుని పుట్టావని
అమ్మ నిన్ను నున్నగా రుద్ది రుద్దీ లాలి పోస్తుందే
కడుపునిండా పాలిచ్చి పెంచిందే
అన్నకి చిరుగుల బొంతేసి నీకు పట్టుపరుపునిచ్చిన తల్లినా
నువ్వు ద్రోహివంటున్నావ్

ఎవరితోనైనా మనసు విప్పి మాట్లాడలేవు
ఎవరినీ స్వచ్చంగా ప్రేమించనూ  లేవు
కనీసం నేనున్నాననే భరోసానివ్వలేవు
ధర్మపన్నాలు వల్లిస్తూనే ఉంటావ్
అవసరానికి వేరొకరి దేవుడిని,వాదానికి సమూహాలని
ఇల్లెక్కి కూయడానికి కులాన్ని అవసరానికి వాడుకుంటావ్.
కవిగా వెలగడానికి భాషని చమురుగా మార్చుకుంటావ్
ఏనాడన్నా అక్షరాలకి అనురాగాన్ని నింపావా
ద్వేషాన్ని రంగరించి  శస్త్రాలని గురిపెడుతున్నావ్
దొరకని దానికోసం అన్వేషిస్తూ ఖండాతరాలలో సంచారం చేస్తున్నావ్

వెతుకున్న కొస నీ చేతికందిందా ?
నీ విశ్వాస ఖడ్గం  పరుల విశ్వాసాలన్ని తునకలు చేయమని చెప్పిందా ?
నువ్వు పశ్చిమ మైతే నేను ప్రాగ్దిశ .
మనమాడుకుంటున్న వెలుగుల బంతి
మిగిలిన ఎనిమిది దిక్కులకి అన్యాయం చేసున్నాయని కత్తులు దూయడం లేదే !

తల్లి పాదాల క్రింద స్వర్గముందని నీ దేవుడు చెపితే
శూన్యంలో ప్రయాణించి ఆత్మ పరమాత్మైన  నను  చేరుతుందని నా తండ్రి చెపుతాడు
తల్లీ తండ్రీ ఇద్దరూ నిజమే కదా నీకూ  నాకూ.
రాళ్ళలో మాత్రమే నా  దైవం లేనప్పుడు నీకు ఆ రాతికట్టడాలతో  విశ్వాసమెందుకు!
కూల్చేసినా  బాధెందుకు ?

చెట్టు నుండి ఈ పువ్వుని కోసినట్టే  నిత్యం నీ ద్వేషాన్ని కోసి
భగవంతుని పాదాల దగ్గర పెడుతున్నాను.
పూలివ్వలేక చెట్టు అలిసింది కానీ..
నీ ద్వేషం మాత్రం ఊరుతూనే ఉందని తెలిసీ
కోయడమే మానుకున్నా.

సర్వ మానవ హితమే మన మతం అని చెప్పిన
వివేకానందుడు లాంటి మనిషి
ఎక్కడైనా కనబడతాడేమోనని వెదుకుతున్నా
హితమనే భావన ఉందా ఎక్కడైనా కనబడుతుందా
అని అడగాలని.

మీ ద్వేష దేహాల చుట్టూ గీసుకున్న బలవంతపు రేఖలని చెరిపేసి
ప్రేమపాశంతో   హత్తుకుందామనుకున్నా నువ్వు దూరం జరుగుతుంటే
 మానవ బాంబు వేమో అని అనుమానం రాకుండా ఎవరాపగలరు ?

ధనవంతుడైన దళిత కుటుంబంలో పుట్టాలి బక్క చచ్చిన బ్రాహ్మణ  కుటుంబంలో పుట్టే కన్నా అని విరక్తిగా  ఒకడ నుకుంటే -కూటికి  చస్తే చచ్చాం కానీ దళిత కుటుంబంలో పుట్టి గొడ్డు మాంసం తినడం కన్నా చావడమే మేలు అనుకునే ఇంకొకడుంటాడు.  ఎంత అరిచి గీ పెట్టినా పుట్టుకనేది మన చేతిలో లేని పని. అవకాశాలు కూడా అందరికి దక్కవు  పుట్టుకకి, అవకాశానికి మధ్య రాజకీయం నడుస్తూ ఉంటుంది. జీవులని పావులుగా చేసి ఆదుకునేది కొందరు .  ఎవడైనా బలపడాలనుకునప్పుడు  రెండు తప్పనిసరిగా కావాలి  ఒకటి ఆర్ధికంగా బలపడటం, రెండవది పాలించే స్థాయికి ఎదగ గలగడం. మూలస్థాయిలో అందరిలో ఆ అగ్ని ఉండాలి. లేనప్పుడు ఇలా కొట్టుకు చస్తూనే ఉందాం .

ఈ దేశంలో ...
ఉషోదయం కోసం పూమొగ్గలు ఎదురు చూసినట్లే
రాబందులు ఎదురుచూస్తూ ఉంటాయి
రెండిటికి తేడా ఏమిటో గ్రహిస్తే ... గర్హించాల్సినవి చాలా ఉంటాయి .  ముందుగా మనం ఉండాల్సింది మానవుడిగా ..
చేతిలో చెయ్యేసుకుని నడుద్దాం రా... మనం మనం విశ్వసించుకోవడానికి ... ఇతరులు మనని  విశ్వసించడానికి.

 మనం భారతీయులం. భారతీయులందరూ ... !?  దాయాదులు మాత్రమేనా, సహొదరీ సహోదరులు కారా !?




12, జూన్ 2014, గురువారం

జాతీయ జెండా యేనా !? కాస్ట్యూమ్స్ క్రియేటివిటీ నా?





నడి రోడ్డుపై ఒక ఆడకూతురిని ఒంటిపై నూలుపోగులేకుండా వివస్త్ర మార్చి అవమానిస్తే జాతీయ జెండాని కప్పి ఆమెగౌరవాన్ని  కాపాడటం కన్నా ఇంకేమి గౌరవం కావాలని అనుకున్న రోజులు వేరు . ఈనాడు వేరు

చీరలోని గొప్పదనం గురించి "చంద్రబోస్" ఒక పాటనే  వ్రాసి జనుల హృదయం తాకేటట్టు చేసారు 

"విదేశాల వనితలకు సారె పోసి పంపేది
భారతీయ సంస్కృతిని సగర్వంగా చాటేది
మన జాతీయ జెండాకు సమానంగా నిలిచేది"  అని 

సగౌరంగా స్థానాన్ని ఇచ్చారు మనమందరం మెచ్చాంకూడా! 

చీర కట్టడం సంగతి అలా ఉంచండి చీర కట్టడమే నామోషి అనుకునే మన "సెలబ్రిటీ " లు వారి దేహాలపై జాతీయ జెండా లోని మూడు రంగులని నింపి మనకి తలవంపులు తెచ్చేస్తున్నారు వివాదాస్పదం చేసి మరీ వార్తలలోకెక్కి బాగా పాపులారిటీ పెంచుకుంటున్నారు. ఇది  జాతీయ జెండా యేనా !?   కాస్ట్యూమ్స్ క్రియేటివిటీ నా?

ఈ రోజు రాగా కాం వారి పోస్ట్ ఒకటి చూసాను ఆ పోస్ట్ చూడగానే ఒక రకమైన విరక్తి వచ్చేసింది దేశభక్తి నరనరాన పొంగడం ఏమో కాని ఇలాంటివి చూసినప్పుడు "గుండెల్లో లేని దేశ భక్తి ని ఒంటిపై చూపే ఈ సెలబ్రిటీ లని వెంటనే "సెల్ " లో వేయాలి వీరి చేతనే ప్రతి రోజు జాతీయగీతం ఆలపింపజేయాలి మారుమూల ప్రాంతాలకి పంపి జాతీయత అంటే ఏమిటో జాతీయ జెండా కి ఉన్న విలువ ఏమిటో... ఎలా గౌరవించాలో తరగతులు నిర్వహించే శిక్ష వేయాలి " అనిపించింది 

ఇంతకీ ఈ తారాగణం ఏం చేస్తున్నారో..ఈlink చూడండి  

 ఈ పాట వినేసి "చంద్రబోస్ "గారికి ఈ పాటకి కోరియోగ్రఫీ చేసిన "సుచిత్ర చంద్రబోస్" జై చెప్పేద్దాం.. @ భారతమాతాకి జై బోలో ! 


1, ఆగస్టు 2011, సోమవారం

ఆడవారికి మాత్రమే ప్రత్యేకం..

గత కొన్ని రోజుల క్రితం  మహిళలు  వస్త్రధారణ పై తమకి స్వేచ్చ ఉండాలని..పురుషుల అణచివేతని సహించ జాలమని ...  మగువలకి  ఇష్టమైన రీతిలో.. వస్ర ధారణ చేసుకుని మరీ ప్రదర్శనలు చేసారు.అప్పుడే నాకు మన సంప్రదాయ మైన చీర గుర్తుకు వచ్చింది.ఈ పాటా గుర్తుకు వచ్చింది    . . 



చీరలోని గొప్పదనం తెలుసుకో..ఆ చీర కట్టి ఆడ తనం పెంచుకో.. చంద్రబోస్ గారు చీర గొప్పదనాన్ని పదాలలో..చెపితే..  కీరవాణి గారు స్వీయ స్వర కల్పనలో..పాడి అంత గోప్పభావం ని..పెంచే భావం.. కల్గించారు.ఈ చిత్రానికి..చంద్రబోస్ భార్య సుచిత్ర చంద్ర బోస్..దర్శ కత్వం.. వహించారు. రాఘవేంద్ర రావు గారి పర్యవేక్షణ లో.. వారి మార్కు చిత్రమే ఇది. 

పల్లకిలో పెళ్లి కూతురు ..లో..చీర పాట  మాత్రమే..వింటూ..మన  దక్షిణాది తారా మణులు కట్టిన చీర్లని చూడండి.  సోదరి మణుల్  ల్లారా!  ..ఆ చీరల అందాలు చూసి సొంతం చేసుకోవాలని షాపింగ్ కి వెళ్లి.. పర్సు బరువు దించుకుని.. ఆనక తిట్లు,మందలింపులు, ఏడుపులు,చీదుళ్ళు..వగైరాల  తర్వాత నన్ను తిట్టుకోకండి.

ఒక టాప్ సీక్రెట్ ఏమిటంటే.. కంజీవరం, ఉప్పాడ చీరలు..  ఖరీదైనవి.  ఎంబ్రాయిడరీ శారీస్ ... యాక్ ఇప్పుడు..అవుట్ అఫ్ ప్యాషన్.

పోలకం బుటీస్ శారీస్..(జార్జెట్) ప్యాషన్.తేలికైనవి,మన్నికైనవి. వయసుని..అయిదారేళ్ళు తగ్గించి,మంచి లుక్ తో..ఉండే శారీస్.. ఖరీదు ఎక్కువే.. వీడియోలో..మొదట వచ్చే చీర..టైపు..అన్న మాట.అలాటి చీరని కొనుక్కోండి. సరేనా !! 

పనిలో పనిగా.. చీర కట్టు ఫై నాకున్న గౌరవం ..అలాగే..చీర..విలువ తెలియని వారి కోసం నేను వ్రాసిన కవిత .. (అవార్డ్ కవిత ) ఈ లింక్ లో..చూడండి.  వనజవనమాలి: దేహాన్ని కప్పండి!!.                 

ఈ పోస్ట్ ఆడవారికి మాత్రమే ప్రత్యేకం. అఫ్కోర్స్ .. పురుషులకి కూడా.. అనుకోండి. 
     

16, ఫిబ్రవరి 2011, బుధవారం

ఈమనిషే దిగ జార్చిన జాతి పరువులు



గత రాత్రి.. టీ.వి. చూస్తూ..చానల్స్ మార్చుతూ..నేను చూసిన కధనం క్రొత్తది కాకపోయినా..హృదయాన్ని కలచివేసేది.. ఆడ పుట్టుక పుట్టినందుకు..భయంతో.. వణికిపోయేస్థితి.ఆడ పిల్లలు పుట్ట కూడదు.పుట్టినా..వాళ్ళని కాపాడుకోవడం.. ఎంత కష్టతరం.!? 

అడుగడుగునా సుడిగుండాలు..పసి మొగ్గలుగానే ఉన్నప్పుడు కాలరాచే మృగాలు, అమాయకత్వంని ఆసరా  చేసుకుని మాయమాటలు చెప్పి మభ్యపెట్టి కాసులకి..అమ్మే వాళ్ళు కొందరు, శరీరాలతో.. వ్యాపారం చేయించే కొందఱు.. కామా పిశాచి కోరలకి చిక్కి..ఈ.. జనారణ్యంలో.. వెలివేయబడిన ప్రాంతాల్లో.. చీకటి వికృత కోర్కెల తీర్చే..ప్ర్రాణం లేని సెక్స్ యంత్రాలు..   అంగడి బొమ్మలు. ఇంటి నుండి తప్పిపోయిన చిన్నితల్లులు, ప్రేమ పేరిట అమాయకంగా గడప దాటినా కన్నెపిల్లలు, వరకట్న పిశాచాలకి బలి అయిన ఇల్లాళ్ళు, పేదరికంతో..బాధపడే కుటుంబాలలోని స్త్రీలు.. ఇలా.. ఎందరో!


మన సమాజంలో.. వీళ్ళ గురించి మాట్లాడుకోవడం తప్పు అనుకునే సభ్యసమాజంలో. మనం బ్రతుకుతూ.. మన మద్య ఉన్నవారిలో ఉన్న   వికృతాలని కనిపెట్టలేని  కళ్ళున్న కబోదిలం మనం.

ఇలా మోసగించబడి వేశ్యావాటికలో కూరుకుపోయిన కొంత మందిని రక్షించి వారి వారి ప్రాంతాలకి పంపేముందు..మా సిటీలో వారికి.. ఆశ్రయం కల్పించినప్పుడు మేము కొంత మందిమి కలసి ఒక సంఘ సేవిక వెంట రిహబిటేషన్ సెంటర్ కి  వెళ్ళాను.

 ఆకాశవాణికి  ఒక శబ్ద చిత్రం చేయాలని ప్రయతించి.. వారి మాటలలో.. వారి గాధలన్ని విని.. మనసు వికలమై.. తీరని దుఖంతో ఆ పని చేయకుండానే వెనుదిరిగాను.. కొన్ని నెలలు నేను మనిషిని కాలేకపోయాను.   అప్పుడప్పుడు.. నా దృష్టికి వస్తూనే ఉంటాయి ఇలాటి వార్తలు.

 ఒక స్త్రీగా.. అవి వినడం కూడా భయం నాకు. నేను ఎప్పుడో.. చూసిన మానవుడు-దానవుడు  చిత్రంలో..పాట, మల్లెపువ్వు చిత్రంలో ఎవ్వరో.. ఈ.. నేరాలను అడిగేవారు ఎవ్వరో.. పాట అప్రయత్నంగా గుర్తుకొస్తూ ఉంటాయి.డా..సి.నా.రె స్పందించి వ్రాసిన పాట.. ఎప్పుడు ఆ చిత్రం గుర్తుకు వచ్చినా కదిలి కదిలి ఏడుస్తాను. "అశ్వద్ధామ" స్వర కల్పనలో.. ఎస్.పి.బాలు పాడిన పాట అది.

ఎవరు వీరు ఎవరు వీరు.. 
దేశ మాత పెదవిపైన మాసిన చిరునవ్వులు.. 
మనసులేని పిడికిలిలో..న్లిగిప్డిన  పువ్వులు..
ఎవరు వీరు ఎవరు వీరు.
ఆకలిలి అమ్ముడుపోయిన ..అపరంజి బోమ్మలు..
చెక్కిలి వన్నెలు చిరిగిన చిగురాకు కొమ్మలు..(ఎవరు వీరు)

పొరబాటుగా అబలలుగా పుట్టిన విదివంచితలు వీరు.
బుస కొట్టే కామాగ్నికి.. విసిరేసిన సమిధలు వీరు (ఎవరు)
కన్నేలుగానే పిల్లలుకన్న వింత తల్లులు..
రోమ్ముక్రింద మమత లను అణుచుకున్న పాలవెల్లులు. (ఎవరు)
  
కసిదాగిన కళ్ళు.. సల సల కాగిన కనీళ్ళు.. 
నవ్వలేక ఏడ్వలేక నిట్టూర్చే శవాలు.. 
నడిచే జీవచ్చవాలు.. 
ఎవరో..కాదు..వీరెవరో కాదు..
ఆ దేవుడు సృష్టించిన పడతులు..
ఈ.. మనిషే దిగజార్చిన పతితలు.. 
ఎవరో తెలుసా.. వీరెవరో తెలుసా..!?
మన రక్తం పంచుకున్న ఆడపడచులు.. 
మనం జారవిడుచుకున్న జాతి పరువులు..

ఈ..ఆడపడుచులు.. మన జాతి పరువులు. 
వ్యాపార రాజధానిలో.. 
మనం జారవిడుచుకున్న జాతి పరువులు.

వారి పిల్లల చదువలకి.. ఆర్ధిక సాయం చేయడం తప్ప వాళ్ళ బ్రతుకులని మార్చలేని ఈ..వ్యవస్థలో.. "భూమిక" సంపాదకురాలు.. సత్యవతి గారి..  హెల్ప్ లైన్ కొంతమందిని అయినా అలాటి వారి బారిన పడకుండా కాపాడటం.. ఎంతైనా అభినంధనీయం.

మనసుకి స్పందన కల్గితే..స్పందించండి. మీ ఇంట్లో ఆడపిల్లలనే కాదు.. బయట వారి ఆడ పిల్లలని.. భద్రంగా.. కాపాడే ప్రయత్నం చేయండి.

ఆడ పిల్లలకి.. చుట్టూ ముంచుకొచ్చే ప్రమాదాల  గురించి..అవగాహన కల్పించండి. రోడ్ యాక్సిడెంట్ ల కన్న ప్రమాదకరమైన  విషవలయంలో.. మన ఆడ పడుచలని పడనీయకండి. ఈ.. పోస్ట్ చూసినంధులకు ధన్యవాదములు.ఈ రెండు పాటలు వినేయండీ!!      



ఎవరువీరు  ఎవరు  వీరు  -- మానవుడు -దానవుడు   
ఎవ్వరో .. ఈ  నేరాలను  అడిగేవారెవ్వరో .. -- మల్లెపువ్వు