27, ఫిబ్రవరి 2013, బుధవారం

నా కెరుకగాని ప్రేమబాష

నా కెరుకగాని ప్రేమబాష

రోజూ దీపం కొండెక్కి పోతుండగా
అసహనపు ఆనవాళ్ళని విదుల్చుకుంటూ
బెట్టు చేస్తున్న నిదురమ్మని 
రారమ్మని బలవంతం చేస్తూ

మూసుకునే రెప్పల మధ్యగా 
నిన్ను కనులలో నింపుకుంటూ
మనసులో  వేయినొక్కటోసారిగా తలచుకుంటాను

దూరం తగ్గిపోయే క్షణం 
ఎన్నడొస్తుందోనని నిట్టూరుస్తూ
దుప్పటి కప్పుకున్నట్లు 
మనసు కప్పుకోవడం చేతకాక ఏమో
 కన్నీటి ధార చెక్కిళ్ళని దాటి 
దయతో ప్రక్కని తడిపెళ్లింది

ఒక ఘడియ తర్వాత  ఆలాపన
నా తలని నువ్వు చెయ్యేసి నిమిరినట్లు
ఆ అనురాగపు స్పర్శ కి 
ఎక్కడో ఏటి మధ్యన పక్షి రెక్కలు
విదిల్చిన చప్పుడు నాలో
ఉలికిపడ్డాను అటునిటు పొర్లినా 
ఆగని అలజడి

అప్రయత్నంగా పలకల పెట్టె ని తెరిచాను
అక్కడ నాకోసం ఓ .. ప్రేమ సందేశం
కాచుకుని కూర్చుంది  అందులో
ఎవరూ నేర్పకుండానే 
నువ్వు నేర్చుకున్న పాఠం ఉంది
అంతకు మించిన నిజమేదో దాగుంది
ప్రకటించే బాష తెలిసి ఉంది
అంకితమిచ్చేందుకు తగిన అర్హత ఉంది
కను చెమరింతల మధ్య 
నడిరేతిరి విరిసిన పద్మంలా 
ముఖం విచ్చుకున్నట్లు
నాలో నవ జీవం తొణికిస లాడుతున్నట్లు 
నాకు నేనే  కొత్తగా

ఈ ఎడారి జీవికి  
ఒయాసిస్ వెతుక్కునే  యాతనలేదు
చీకటిని చీల్చే కిరణాలని 
ఆహ్వానించే తపనలేదు
పేగు తెంచుకు పుట్టిన బిడ్డడి అండే చాలు
అన్నివేళలా 
అమ్మయి లాలించే  చల్లని స్పర్శ చాలు

కంటి నిండుగా మది నిండగా
ఒకే ఒక్క చంద్రుడి వెన్నెల వెలుగు చాలు
మా నిఖిల చంద్రుడి అనురాగమే  చాలు

నా కెరుకగాని  ఈ ప్రేమ బాష ఇంత గొప్పదా కన్నా !


అమ్మకే  గురువై  నేర్పావా నాన్నా!?



(ప్రేమ ఎప్పుడు ప్రకటిస్తూ ఉంటేనే ఆనందం కల్గుతుంది. ప్రకటించని ప్రేమ ఎంత గొప్పదైనా నిష్ప్రయోజనమే)

నిన్నటి రాత్రి నా మానసిక స్థితి..  చిత్రంగా,  ఖచ్చితంగా అదే సమయానికి నా కొడుకు నాకు పంపిన ప్రేమ సందేశానికి ఈ స్పందన

25, ఫిబ్రవరి 2013, సోమవారం

పుష్పవర్ణ మాసం ఒక మోహనాస్త్రం

పెన్నానదీ తీరంలో  జొన్నవాడ  గ్రామం ఉంది . అది ఒక శక్తి పీఠం గా విలసిల్లుతుంది . అక్కడ అమ్మవారి పేరు కామాక్షితాయి.

రోజువారి దర్శించుకునే  భక్తులతో పాటు అక్కడ బస చేసే వారు కూడా ఎక్కువే!  అక్కడ బస చేసేవారు ఒక రెండు మూడు రోజులకే తిరిగి వెళ్ళిపోరు కనీసం మూడు నెలలు అయినా ఉండే వాళ్ళు ఉంటారు .

అలా ఉండే వాళ్ళే దెయ్యం పట్టిందని కుటుంబ సభ్యులచే వదిలివేయబడ్డ వారు.  సదరు దెయ్యం పట్టింది అన్న వ్యక్తికి తోడుగా  ఏ ముదుసలి వారో ఉండటం కద్దు.

దెయ్యం పట్టింది అని పేరు పడ్డ అందరూ రాత్రి పన్నెండు గంటలకి ముందే కామాక్షి తాయి గర్భ గుడి  చుట్టూరా చేరి నిద్రకి ఉపక్రమిస్తారు. అర్ధ రాత్రి సమయాలలో హటాత్తుగా లేచి పిచ్చి కేకలు పెడుతుంటారు "నన్ను వదులు  వదులు " అంటూ విదిలించుకుంటారు గుడి నుండి బయటకి పారిపోయే దానికి ప్రయత్నిస్తారు. వాళ్ళని చూసి (దెయ్యం పట్టని అనుకోవాలి ) మంచివాళ్ళు "అమ్మోరి" దెబ్బకి దెయ్యం పారిపోబోజూస్తుంది .
ఇంకొన్నాళ్ళు ఇక్కడే నిదరజేస్తే దెయ్యం వదలడం ఖాయం అనుకుంటారు .

ఇలాంటి దృశ్యాలని ఒక మానసిక వైద్యుడు  చూస్తే .. దెయ్యం వాళ్లకి కాదు పట్టింది,చుట్టూ ఉన్నవారికి పట్టినట్లు ఉంది మానసిక రుగ్మత తో బాధపడే వాళ్ళని హాస్పిటల్ కి తీసుకురావాలి. మందులు ఇప్పించాలి కాని ఈ గుళ్ళు గోపురాలు వెంబడి తిప్పడం ఏమిటి అని విసుక్కోవడం ఖాయం కదా!

అదే సన్నివేశాన్ని ఒక రచయిత కాని రచయిత్రి కాని చూస్తే  ఆసక్తితో వాళ్ళని నిశితంగా పరిశీలించి వారు ఏం మాట్లాడుతున్నారో విని వారిది  ఒక రకమైన మానసిక వ్యాధి లేక బ్రాంతి లో అలా మాట్లాడుతున్నారా అని ఆలొచిస్తారు. వీలయితే వారి మాటలకి ఉన్న అంతరార్ధాన్ని గ్రహించి.. కథలు అల్లుతారు.

హేతువాదానికి భిన్నంగా తాము పుట్టి పెరిగిన వాతావరణం,కొన్ని నమ్మకాలు, పెద్దల మాటల ప్రభావం వల్ల దెయ్యాలు ఉండవచ్చేమో ! అని కూడా యోచన చెస్తారు. కొందరైతే దేవుడు , దెయ్యాలు గట్రా లేవనే గట్టి నమ్మకం లో ఉన్నప్పటికీ కూడా  దెయ్యం పట్టింది అనే మాటలకి ప్రాముఖ్యత  నిచ్చి ఊహా జనిత కథలు అల్లుతారు.

ఎందుకంటే పాఠకులు ఊహాజనిత  కథలు చదువుతూ ఆ కథల్లో పరకాయ ప్రవేశం చేసి  తమని తాము ఊహించుకోవడం కోసమో లేదా అలాంటి కథలు చదవడం అంటే సరదా కోసమో అలాంటి కాల్పనిక సాహిత్యాన్ని ఆదరిస్తారు. అటువంటి నవలలని ప్రపంచమంతా ఆదరిస్తూ ఉన్నారు కదా!.

అలా అనుకునే .. దెయ్యం పట్టిన స్త్రీ అనబడే  "వీణాధరి " గురించి ఒక కథ రూపుదిద్దుకోబడింది ఆ కథ " పుష్పవర్ణ మాసం "

ఆ కథని నేను చదివినప్పుడు నాకు కల్గిన అనుభూతి ని వర్ణించలేను . అసలు ఈ కథ పేరే ఊహా జనితం  పుష్ప వర్ణ మాసం అని మాసం లేదు కదా!

ఇక  పుష్పవర్ణ మాసం గురించి..

అనుభూతి ప్రధానంగా ఈ కథ చదివినప్పుడు .. అబ్బ ! ఎంత బావుంది ఈ కథ అనిపించడం ఖాయం నీలి మేఘం అడవితో మాట్లాడుతుందే .. ఆ బాష .. అంటే సంభ్రమంగా అక్షరాల వెంట కళ్ళు పరుగులు తీసాయి. ఆదేమిటి అన్న ఆలోచనే రాలేదు . అదొక కనీ విని ఎరుగని అనుభూతి

ఈ రచనలో వీణాధరి తల్లి ప్రకృతి  ప్రేమికురాలు మృదు స్వభావి అందంగా ఉంటుంది చక్కగా పాడు తుంది భర్త తో చీటికి మాటికి గొడవ పెట్టుకుంటుంది  ఎందుకు అంటే అతని వైఖరి ఆమెకి నచ్చి ఉండకపోవచ్చును కదా అని మనం అర్ధం చేసుకోవాలి ఆఖరికి మరణించింది తరువాత డబ్బు,నగలు,మేడలు కి ప్రాధాన్యత ఇచ్చే అమ్మమ్మ సంరక్షణలో పెరుగుతూ

పుష్ప వర్ణ మాసంలో పుట్టిన వారికి దెయ్యాలు కనబడతాయి అంట అని పడే పడే చెప్పి అమ్మమ్మ మాటల వల్ల  అతర్లీనంగా దెయ్యాలు ఉంటాయి అనే భ్రమ కల్గి ఉంది వీణాధరి కూడా స్వభావ సిద్దా తల్లితో పోల్చదగిన స్త్రీ మూర్తి .

ఆమెకి తను జీవిస్తున్న జీవితం కి ఆమె మనస్తత్వం కి అసలు పొంతన కుదరక పోవడం వల్ల అసంతృప్తి కల్గి  అతర్లీనంగా ఆమెలో దాగున్నఊహా జనిత పురుషుడే అతను. బహుశా ఆమె అమితంగా ప్రేమించే పురుషుడుని కోరుకుని ఉండవచ్చు అది ఆమెకి లభించక పోవడం వల్ల ఊహాజనిత లోకంలో ఆమె బ్రతుకుతూ ఉంటుంది

పెద్ద మేడ, వెనుక తోట, ఒంటరిగా ఉండటం  లాంటి అనువైన వాతావరణం  వల్ల ఆమె ఊహలు అతని చుట్టూ అల్లుకుంటాయి  అందరికి కనబడని అతని ని చూస్తూ  ఉంటుంది .పైగా అతను  చాలా పురాతనుడు అని అక్కడ ఏడు  మామిడి చెట్లు మరణించి మళ్ళీ నాటిన మామిడి చెట్టు పై కూర్చుని ఆతను ప్రేమించిన ఆమె కోసం ఎదురు చూస్తున్నాడని చెప్పడం ఆమె ఎవరో కాదు ఆమె మరో నేనే అని చెప్పడం కూడా ఆమె ఎంతటి అధివాస్తవికతలో ఉందొ చెప్పడం జరిగింది  ఆఖరికి అతను  ఇచ్చిన గోమేధికం  అంతకంతకు బరువు పెరిగి పోతుందని చెప్పడం కూడా దానిని ఆరగ దీయడం కూడా .

 తన గురించి  తను ఇవన్నీ చెప్పుకుంటున్నప్పుడు  విని  ఆమె బ్రాంతి లో ఉందని భావించవచ్చు .  లేదా పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తుంది అని లేదా దెయ్యం పట్టింది అని ఎవరి అవగాహన మేరకు వారు బావించడం కద్దు.

అప్పుడు నేను అనుకున్నాను పువ్వు నవ్వుతున్నట్లు లేదు!? అని ఆశ్చర్యంగా  అనడానికి,  పువ్వు నవ్వుతుంది అనడానికి తేడా ఉన్నట్లే  ఈ వీణాధరి కథ ఉంది అని.

కాల్పనిక సాహిత్యం  అయినప్పటికీ అనుభూతి ప్రధానంగా రచన సాగడం  వల్ల మిగిలిన అంశాలపై పాఠకుడి దృష్టి అంతగా మళ్ళి ఉండకపోవచ్చు .  నా ఫ్రెండ్స్ కొందరైతే ఏం కథ ఇది ..? ఒక్క ముక్క కూడా అర్ధమై చావలేదు అని విసుక్కున్నారు

మా బంధువుల ఆమె కూడా వీణాధరి లా అదిగొ..  అక్కడ ఎవరో కూర్చుని నన్ను చూస్తున్నాడు నన్ను రమ్మని పిలుస్తున్నాడు  అంటూ మాట్లాడుతూ ఉండేది . భర్త నిరాదరణ  వల్ల వైవాహిక జీవితమే ప్రధానంగా అనుకుని బ్రతికే మనిషి ఆమె.   ఎప్పుడూ భర్త గురించి ప్రేమగానో, లేదా అమితమైన ద్వేషం గానో ఉంటూ అలాగే మాట్లాడుతూ  ఉండేది అందరిని తిట్టేది తన జీవితం నాశనం కావడానికి అందరూ కారణం అని తిట్టిపోసేది. తర్వాత తర్వాత వీణాధరి లా మాట్లాడేది .  ఈ కథ చదువుతూంటే  నాకు చప్పున ఆమె గుర్తుకు వచ్చింది మానసిక వైద్యుల చుట్టూ తిరగడం తోనే ముప్పయ్యి ఏళ్ళు గడచి పోయి ఇప్పుడు కదిలిస్తే కదిలి కదిలి ఏడ్చే స్తుంది.

ఈ కథ పొడిగిస్తే ఇలాంటి విషయమే ఉంటుంది అనుకున్నాను కూడా

ఏదైనా...  పెద్దలు వారి  ఆలోచనా విధానం వల్లనో  వారి వారి  నమ్మకాలను పిల్లల ముందు పదే  పదే మాట్లాడటం జరుగుతూ ఉంటుంటుంది వీణాధరి అమ్మమ్మ కూడా   దెయ్యాలు ఉన్నాయని  వెల్లడించడం మూలంగా వీణాదరికి  కొన్ని నమ్మకాలు ఏర్పడతాయి. అందుకే  తన  మాటల్లో కూడా  నేను దెయ్యాన్ని  చూసాను అని అంటుంది  పైగా ఈ కథ అంతా తన కథనం లోనే వింటాము మూడవ వ్యక్తి ఎవరు ఉండరు కూడా కేవలం  వీణాధరి రచయిత్రి మాత్రమె ఉంటారు .  .

 మనుషులు ఎంతటి  విద్యాధికులు అయినప్పటికీ కొన్ని నమ్మకాలు ఉంటాయి అవి   అలాగే బలపడి ఉంటాయి ఆ నమ్మకం దేవుడు కావచ్చు దెయ్యం కావచ్చు   లేదా ఈ రెండింటిలో  ఏదో ఒకటికి అన్వయించుకుని బ్రాంతి  లో బ్రతకడం కావచ్చు.

విషయం ఏదైనప్పటికీ రచయిత్రి శైలి పాఠకులని మంత్రం ముగ్ధుల్ని చేసింది అనడం నిజం.  నేను ఈ కథని అనుభూతి ప్రధానం గానే చదివాను అలా చదవడమే నాకు అంతులేని ఆనందం కల్గించింది  అందుకే మళ్ళీ మళ్ళీ చదువుతూనే ఉన్నాను

ఏదైనా  సామాన్య గారి  "పుష్పవర్ణ మాసం  ఒక మోహనాస్త్రం" 

ఈ కథ చదవడానికి ఈ క్రింది  లింక్ లో వెళ్ళండి

http://www.navyaweekly.com/2012/jun/13/page62.asp


( ఈ విశ్లేషణ నేను కథని అర్ధం చేసుకున్న తీరుని బట్టి  వెల్లడించాను మరి కొందరు విశ్లేషిస్తే చూడాలని ఉంది  ఇంకా లోతుగా తెలుసుకోవాలని ఉంది )

22, ఫిబ్రవరి 2013, శుక్రవారం

నవలా పఠనం

ఈ రోజు బుక్స్ షాపు కి వెళ్లి కొని నవలలు కొని తెచ్చుకున్నాను.

అవన్నీ చదివే వరకు కాస్త ఈ బ్లాగ్ కి ( కొన్ని బ్లాగ్స్ చదవడానికి, నేను  వ్రాయడానికి ) విరామం  ఇవ్వాలి అనుకున్నాను.

ఈ మధ్య పేస్ బుక్ లో కూడా తెగ తారట్లాడుతూ ఉన్నాను. కొద్ది రోజులు మరో ప్రపంచంలో మసిలి రావాలని ఉవ్విళ్ళూరుతూ ..  లీవ్ లెటర్ కి అప్లై చేసినట్లు ఈ పోస్ట్ వ్రాస్తున్నాను.

లీవ్ శాంక్షన్ చేసేసాం వెళ్ళమ్మా ..వెళ్ళు  అనుకుంటారు అని తెలుసు. :)

వెళ్ళే ముందు ఓ ముక్క  చెప్పి పోదామని .  ఆ ముక్క ఏమంటే .. నవల  అంటే ఏమిటి  అని.

చాలా మందికి తెలుసు . అయినా నాకు తెలుసు అని చెప్పి  పోవడం  ఎందుకంటే  ఏక బిగిన పది నవలలు చదవాలని కంకణం కట్టుకున్నాను

నవల అంటే .. ఏమిటి  అసలు నవల అనే ఎందుకు అనాలి ? అన్న ఆసక్తి కలిగి తెలుసుకున్న విషయం ఇది.

నవల అనే పదం "నావెల్ " అనే ఇంగ్లీష్ పదం నుండి పుట్టింది అంట, నూతనత్వం కల్గి ఉన్నది అని అర్ధం.

తెలుగులో మొదటి నవల నరహరి గోపాల కృష్ణమ శెట్టి "శ్రీ రంగరాజ చరిత్ర" అనే నవల రంచించారు. (1872)
తర్వాత కందుకూరి వీరేశ లింగం పంతులు గారు "రాజశేఖర చరిత్ర " అనే నవల రంచించారు. వారు దానిని  "వచన ప్రబంధం " అన్నారు

నవలని తోలి రోజులలో  "ఆఖ్యాయిక , ఉపన్యాసం ,కాదంబరి " అని వ్యవహరించే వారట.

మొట్ట మొదట "నవల " అని నామకరణం చేసిన వారు.. కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి గారు.

ఆఖరికి 1896 లో వచన రచనకి నవల అనే పేరు స్థిర పడింది .

మన  తెలుగు నవలలో పేరెన్నిక గల నవల "మాలపల్లి " గొప్ప సంచలనం కల్గించింది అని చెపుతారు. ఆ నవలా రచయిత ఉన్నవ లక్ష్మి నారాయణ . . జీవితాన్ని కథా వస్తువుగా స్వీకరించి కల్పనలతో,ఊహా శక్తి తో .. వ్రాసుకుంటూ పోయే పెద్ద రచనే నవల.

మన  తెలుగు లో  పేరెన్నిక  గల ఒక వంద నవలలు అయినా  చదివి బాగా బాగా ఆకళింపు చేసుకోవాలనే నా ఆశ.

శత వసంత సాహితీ మంజీరాలు పేరిట ఆకాశ వాణి  విజయవాడ కేంద్రం ప్రసారం చేసినప్పుడు  విని అమిత ఆసక్తి  తో  చాలా నవలలు  చదివాను.

మళ్ళీ ఇప్పుడు మొదలెట్టాను   ఈ నవలా పఠనం



అన్నట్లు ఇంకో విషయం ఏమంటే  కడప ఆకాశవాణి  కేంద్రం సత్యం శంకరమంచి "అమరావతి కథలు" ప్రసారం చేస్తుంది .ప్రతి సోమవారం ఉదయం ప్రసారాలలో " క్రాంతి  రేఖలు " అనే   కార్యక్రమం లో .  ఆసక్తి కల్గిన మిత్రులు అక్కడ ట్యూన్ చేసి వినవచ్చు.

నవలా పఠనమ్ లో  మునిగి తేలుతూ అప్పుడప్పుడు తిరిగి చూడాలనిపించే  ఈ అష్టమ వ్యసనం  నన్ను వదలకుంటే  నేను మళ్ళీ ఇక్కడ ప్రత్యక్షం అవుతానేమో ... చెప్పలేను కూడా .  :)

విస్పోటనం

 కొందరి జీవితాలలో   చీకటి రాత్రి మొదలైన  సమయం. అందరూ  ఒక్కసారిగా ఉలికి పడ్డాము. జరిగిన సంఘటనలు  గతం ని గుర్తుకు తెస్తున్నాయి

గాయాలు మళ్ళీ రేగుతున్నాయి అప నమ్మకం నీడగా మారుతుంది


అది అకారణ  అణచివేత  చిహ్నం  కావచ్చు. అది  భయ భ్రాంతులకి గురి చేసే ఉగ్రవాదం కావచ్చు  ఏర్పాటు వాదం కావచ్చు.

ఏదైనా గర్హించవలసిన  విషయమే!  నగరంలో నే కాదు.. విస్పోటనం మనస్సులో కూడా



మరి కొన్ని గమనించిన విషయాలు  చూస్తే .. ఉగ్రవాదం తోనూ పోల్చ దగ్గవే!

ఎందుకో ..  కొందరి పై  అకారణ  ద్వేషాలు అంతలోనే  అవసరం కోసం నటించే స్నేహాలు

 కొందరికేమో  వెన్ను విరుపు మరి కొందరికేమో  అతి ప్రేమతో  పెద్దపీట

వడ్డించే వాడు మనవాడైతే  ఏ పంక్తిలో కూర్చుంటే ఏం లే ! అన్నట్టుగా

గురు వర్యులే  పక్షపాత వైఖరి వహించడం భారతం నాటి నుండి ఉన్నదే కదా!



కిరణాలు ఎన్ని ఉన్నా.. వెలుగు  ఒకటే ! -  ఆ వెలుగులని ఆపడం సాధ్యం  అయ్యేనా !

 వెలుగులు విరజిమ్మే కవిత్వం అంతే!

 పెల్లుబికే కవనం ని,  వెల్లులికే వమనం ని ఆపడం సాధ్యం కాదు కదా!

ఒక విషయం కని, విని ..బాదా తప్త హృదయం తొ..

( ఓ మిత్రురాలికి సపోర్ట్ గా  ఈ స్పందన )



19, ఫిబ్రవరి 2013, మంగళవారం

తంతుగా మిగిలిపోతున్న " మాంగల్యం తంతునానేనా"


ప్రేమలు - పెద్దలు = పెళ్లి

పెద్దలు  -  ప్రేమ = పెళ్ళిళ్ళు

ప్రేమలు - పెళ్ళిళ్ళు = ?

ఏమిటీ. ఈ ఈక్వేషన్స్ అంతా..తిక మక గా ఉన్నాయి. ఈమెకి ఏమైనా తిక్క ఉందా..? అనుకోకండి. నేను చెప్ప బోతున్నది..  ఒక ముఖ్య విషయం. పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో ఏదో ఒక రోజు ఈ పై మూడు చాయిస్ ల లో ఏదో ఒకటి ఎదుర్కోక తప్పదు కాబట్టి.

చాలా కాలం నుండి నేటి తరం పెళ్ళిళ్ళు ని గమనిస్తున్నాను. కొన్ని సార్లు షాక్ కొట్టినట్లు ఉంటాయి. నిర్ణయాల తప్పిదాలు వల్ల  వివాహాలు వైఫల్యం చెందుతున్నాయి. కారణం పిల్లలు లేదా పెద్దలు ఎవరైనా కావచ్చు.

నా చిన్నప్పటి ఫ్రెండ్ కి ఇద్దరు కూతుర్లు. తనని నేను కలసి చాలా సంవత్సరాలు దాటింది మా ఇద్దరి మధ్య దూరం ఓ..నాలుగు కిలోమీటర్లు అంతే!  వాళ్ళ ప్రక్కనే నాకు ఒక పరిచయస్తురాలు ఉన్నారు ఆమె చెప్పింది.. రాణి మీరు ఫ్రెండ్స్ అంట కదండీ అని. నేను తనని గుర్తు చేసుకుని అవునని చెప్పాను. 

మా పరిచయస్తురాలి ఇంటి ప్రక్కనే ఉంటున్నారని అనగానే   నేను తనని కలవాలని వెళ్లాను.  నేను ,వాళ్ళ ప్రక్క ఇంటి ఆమె ఇద్దరం కలసి ఎంత సేపు పిలిచినా .తను బయటకి రాలేదు. ఇంట్లోనే ఉంది. కానీ బయటకి రాలేదు. నేను చాలా నోచ్చుకున్నాను. తిరిగి వచ్చేసాను. మళ్ళీ ఎప్పుడు వెళ్ళకూడదు.కనిపించినా మాట్లాడ కూడదు అని నిశ్చయం చేసుకున్నాను.

తర్వాత రోజు రాణి నుండి నాకు ఫోన్ వచ్చింది. అంతకు ముందు రోజు బయటకి రాక పోవడానికి కారణం చెప్పింది. తనకి ఇద్దరు కూతుర్లు. పెద్ద అమ్మాయి..సాఫ్ట్ వేర్ జాబ్  చేస్తుంది. చడువుకునేటప్పటి నుండి తన క్లాస్ మేట్ తో ప్రేమలో ఉంది. వారు ఇద్దరు ఒకరు మద్రాస్ లో ఇంకొకరు బెంగళూరు లో జాబ్ చేస్తున్నారు. పెళ్లి ప్రయత్నాలు మొదలెట్టే టప్పటికి ఆ అమ్మాయి తన ప్రేమ గురించి చెప్పింది. తండ్రి తల్లి ఇద్దరు ఒప్పుకోలేదు. వేరే కులం,అదీ కాకుండా ప్రేమ పెళ్లి మాకు ఇష్టం లేదు అన్నారు. ఆ అమ్మాయి ఇంట్లో వారిని ఒప్పించడానికి ఒక సంవత్సరం పాటు ప్రయత్నం చేసింది. వీళ్ళు వీలు కాదు..పొమ్మన్నారు.

 ప్రేమించిన అతని తల్లిదండ్రులు పూనుకుని వారి వెళ్లి రంగ రంగ వైభవంగా చేసారు. పెళ్లి జరుగుతుందని తెలిసి కూడా వీళ్ళలో చలనం లేదు. అబ్బాయి కుటుంబం అంతా విద్యాధికులు.ఆస్తిపరులు.సంస్కార వంతులు. అయినా సరే  కులబేధం వల్ల కూతురిమీద ప్రేమని చంపుకున్నారు. నేను తనని కలవడానికి  వెళ్ళిన రోజే వారి పెద్ద అమ్మాయి పెళ్లి. అవమానం తో లోకానికి ముఖం చూపించ లేక బయటకి రాలేకపోయాను. ఎంత పని చేసింది.?  మా చుట్టాల్లో తల ఎత్తుకుని మేము ఎలా తిరగాలి అంది?

నేనైతే జాలి పడ్డాను. బంధువులు,లోకం,కులం ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటే.. ఆ అమ్మాయి ని  ప్రేమించిన అతనితో కాకుండా వేరొకరికి  ఇచ్చి పెళ్లి చేస్తే ఆ అమ్మాయి సంతోషంగా ఉండగలదా? అడిగాను. పెద్దల మాటలకి విలువ ఇవ్వవడ్డ్డా? అంది రాణి. ఆ అమ్మాయి పెళ్ళయి మూడేళ్ళు అవుతున్నా ఆ అమ్మాయి వైపు కన్నెత్తి చూడలేదు మాట్లాడ లేదు ఆ అమ్మాయి మాత్రం అత్తవారింట్లో అందరితో కలసి పోయి సంతోషంగా ఉంది.

ఇక్కడ : ప్రేమలు - పెద్దలు = పెళ్లి

అదే ఇంట్లో రెండో అమ్మాయి.. ఆ అమ్మాయి ఇంజినీరింగ్ పూర్తీ అయింది. తల్లిదండ్రుల సంగతి తెలిసి కూడా ఈ పిల్లా ప్రేమలో పడింది.అక్క పెళ్ళికి మీరు ఒప్పుకోలేదు. నా పెళ్ళికి మీరు ఒప్పుకోకపోతే చచ్చిపోతాను అంది. అప్పుడు పిల్ల వాళ్ళ బాబా యి జోక్యం చేసుకుని .." మీ అక్క చూస్తే అలా చేసింది. ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? మన కుటుంబాలు తలెత్తుకుని తిరగాలా వద్దా..? "అన్నాడంట. ఎలాగైతేనేం ఆ..అమ్మాయి మనసు మార్చి వేరొక అతనితో..వాళ్ళకి తగిన హోదా..ఆస్తి-అంతస్తు కులం చదువు,మంచి ఉద్యోగం ఉన్న అబ్బాయితో పెళ్లి కుదుర్చుకుని మొన్న డిసెంబర్ లోనే చాలా ఆడంబరంగా  పెళ్లి చేసారు. అమ్మాయికి బోలెడు నగలు,చీరలు..కారులు..అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మనసులో  మాత్రం కట్టుకున్న వాడు లేడు .

పెళ్ళైన తర్వాత మొదటి రాత్రి  చేసుకున్న అతనితో..తన ప్రేమ సంగతి చెప్పేసింది. నువ్వు నన్ను టచ్ చేస్తే చచ్చిపోతాను. నాకు శ్రీకాంత్ మాత్రమె కావాలి అని చెప్పిందట. పాపం.. ఆ నూతన వరుడు నిర్ఘాంత పోయి..ఆ ఇంటి నుండి బయట పడి.. ఆ అర్ధ రాత్రి సమయం లోనే పది కిలోమీటర్ల దూరంలో ఉన్న  తన ఇంటికి  నడుచుకుంటూ వచ్చేసాడు. తెల్లవారి పెద్దల సమక్షంలో  పంచాయితీ మొదలు.

అబ్బాయి చెపుతున్నది తప్పు. ఆతను అనుమానం పిశాచి. అమ్మాయి గురించి పెళ్ళికి ముందే ఎంక్వయిరీ  చేసాడు. అదేదో సినిమా. మజ్ను అనుకుంటా.. ఆ సినిమాలో లాగా. అందుకే అమ్మాయి అతనిని వద్దనుకుంటుంది.. అని అమ్మాయి వైపు వాళ్ళు తమ వాదన వినిపిస్తున్నారు.

ఇలా ఇప్పటికి రెండు నెలలు గడచి పోయాయి. నా స్నేహితురాలు ఒకటే ఏడుపు. పెద్ద అమ్మాయి లాగా ఇంట్లో నుండి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోక పోయిందా.. ? మేము బలవంతం చేసామని ఒప్పుకుని తర్వాత ఇలా చేసింది. కావాలనే చేసింది.. అని చెప్పింది. రాణి మాటల్లో నాకు నిజం బోధపడింది. ఆ అమ్మాయి తల్లి దండ్రుల మీద కక్ష సాధింపు చర్య గానే పెళ్ళికి ఒప్పుకుని తర్వాత ఇలా చేసింది

ఫలితం ..విడాకులు. తర్వాత ఆ అమ్మాయిని ప్రేమించిన వాడు మళ్ళీ పెళ్లి చేసుకుంటాడా లేదా అన్నది సందేహమే.! కానీ ఆమెని వివాహం చేసుకున్న అబ్బాయి పరిస్థితి ఏమిటి?

ఇక్కడ : పెద్దలు  -  ప్రేమ = పెళ్ళిళ్ళు

ఇక్కడ పెద్దల పొరబాటు వాళ్ళ మూర్కత్వపు పట్టుదల వల్ల ..ఒక పెళ్లి రెండు పెళ్ళిళ్ళు కావాల్సి ఉంది.

నాకు ఇప్పుడు చప్పున ఒక మాట గుర్తుకు వస్తుంది. ఆ మాట   మా అబ్బాయి అన్నాడు. 

 "   పెద్దవాళ్ళుపిల్లల ఇష్టాలకి విలువ ఇవ్వకపోతే.. ఇంకొకరి లవర్ ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది "    అని . 

ఆ మాటలో అర్ధం తెలిసి  నేను షాక్ అయ్యాను. నిజమే కదా!

చదువులు వల్ల, ఉద్యోగాల వల్ల  అమ్మాయిల అబ్బాయిల పరిచయాలు ప్రేమలు, ప్రేమలు అనుకునే  ఆకర్షణలు ఇవన్నీ సర్వ సాధారణం అయిపోయాయి.

 మొన్న ఈ మధ్య మా అబ్బాయి కి ఒక మ్యాచ్ వచ్చింది. అబ్బాయిని అడిగి చెపుతాను అన్నాను. నువ్వు చెపితే అబ్బాయి కాదంటాడా..? అని అడిగారు. మన పెంపకం మీద మనకి నమ్మకం మంచిదే! కానీ వాళ్ళ మనస్సులో ఏముందో తెలుసుకుని వాళ్ళకి నచ్చినట్లే చేయడం అన్ని విధాల మంచిది కదా అని చెప్పాను.

పెద్దల మనసులో ఉన్నట్లు జరగడం చాలా కష్టం. అందుకే పిల్లల ఇష్టా ఇష్టాలకే ప్రాధాన్యత  ఇచ్చి వివాహాలు జరిపించడం వల్ల పెళ్ళిళ్ళు అనే మాటని తగ్గించి పెళ్లి తో.. వాళ్ళ జేవితాలని ముడి పడేటట్లు  చేయడం పెద్దల కర్తవ్యమ్ అంటాను నేను.

మొన్న ఒక ఫ్రెండ్ మాట్లాడుతూ.. పెళ్లి అనేది కూడా ఒక గాంబ్లింగ్. లక్  ఉంటె సక్సెస్ .. లేదా ఇక అంతే ! అంది.

అవగాహన , సర్దుబాట్లు, రాజీ పడటం,  జీవితాంతం ఒక బంధం కి కట్టుబడి ఉండాలనుకోవడం లాంటివి దాదాపు అసాధ్యం అనే చెప్పాలి ఏమో.!  అమ్మయిలకైతే నగలు,చీరలు,కారులు ,ఉన్నత ఉద్యోగి,విలాసవంతమైన జీవితం..అత్తమామలు లేని వేరు కాపురం కావాలి అనే కోర్కెలు బల పడుతున్నాయి అంటే తిట్టుకుంటారే మో కాని ఇది నిజం.

ఇక అబ్బాయిల కైతే.. అందం,చదువు కావాలి, వీలయితే కట్నకానుకలు కావాలి. పెళ్ళికి ముందు ఎలా ఉన్నా.. పెళ్లి అయిన తర్వాత చక్కగా సంసారం చేసుకుంటే చాలు అనే దోరణి లో మగ పిల్లలు సర్దుకుపోతున్నారు అంటున్నారు

 కాని ..   ఇద్దరిలో ఉన్న ఇగో వల్ల , ఆర్ధిక స్వాతంత్ర్యం  వల్ల చాలా సమస్యలు  మాత్రం ఉత్పన్నం అవుతూనే ఉన్నాయి అన్నది నిజం/  అన్నింటిని అందరికి అన్వనయించడం కూడా పొరబాటే అవుతుంది కూడా.! ఇవి అన్నీ మన చుట్టూ జరిగే విషయాలలో కొన్ని కోణాలు మాత్రమే !

అంతులేని ఈ  ప్రేమలు - పెళ్ళిళ్ళు  వల్ల సమాజం  లో చాలా మార్పులు చోటు చేసుకోబోతున్నాయి.

కేవలం తంతుగా మిగిలిపోతున్నది  " మాంగల్యం తంతునానేనా" మంత్రం {శ్లోకం )  అనుకోవాల్సి వస్తుంది
   

తల్లి దండ్రులు..  ! మీ పిల్లలపై అతిగా ఆశలు పెట్టుకోవద్దు. ఆ ఆశలు నిరాశలయి.. మీరు భంగపడటం మాత్రం ఖాయం అనుకుంటున్నాను.  హాప్యీ గా వాళ్ళ పెళ్లి వాళ్ళ ఇష్టం అనుకుంటే .. అంతా  సంతోషమే కదా !!..

18, ఫిబ్రవరి 2013, సోమవారం

సఖికి ఇష్ట సఖులు వీరు


 సఖులందరికి   ఇష్ట సఖులు వీరు.

భారతీయురాలికి అమెరికన్ కరేజ్ అవార్డ్..

ఆసక్తి కలిగింది ..వెను  వెంటనే గూగులమ్మని సాయం అడిగాను.

ఇదిగో.. ఎదురుగా,వివరంగా ఈ సఖిని నిలబెట్టింది. http://en.wikipedia.org/wiki/Mallika_Dutt




అమెరికాలో గృహ హింసకి గురవతున్న దక్షిణ ఆసియా మహిళల కోసం సఖి ని ఏర్పాటు చేసారు . స్తానిక అమెరికన్ తెగల హక్కులకి సంబంధించిన కేసులలో కూడా మల్లికా దత్ వాదించారు. అలాగే డిల్లీ లో ఫోర్డ్ పౌండేషన్ అధికారిగా పని చేసినప్పుడు కూడా దళిత,ఆదివాసీల మహిళా ల హక్కుల కోసం పోరాడారు. 
 వింటుంటేనే చాలా ఉత్తేజంగా ఉంది కదా! 

అలాగే ఇంకొక మహిళా మణి పూస ని చూడండి.




ఈమె పేరు..ఈమని విజయ లక్ష్మి  ఈమె గురించి నేను ఎందుకు ఉదహరించాల్సి వచ్చిందంటే.. ఆమె గురించి చాలా ఆసక్తి కల్గించే విషయాలు చాలా ఉన్నాయి.


.ఈ లింక్స్ అన్నీ ఆమె గురించి తెలిపేవే! సింగల్ విమెన్  ఉంటూనే  కుటుంబ హింస కి వ్యతిరేకంగా ఆమె సాగించిన పోరాటం గొప్పది కదా! ఎందరికో ఆమె సహాయంగా నిలిచారు. ఒక యాక్సిడెంట్ లో మరణించారు.అమెరికన్ ప్రెసిడెంట్ :ఒబామా" చేతుల మీదుగా ఆమె కుమార్తెలిరువురు..ఆమెకి లభించిన పురస్కారాన్ని అందుకున్నారు.


http://www.thehindu.com/news/article2559603.ece


http://www.cleveland.com/open/index.ssf/2011/10/white_house_today_will_honor_s.html


http://nriinternet.com/NRI_Accidents/USA/A_Z/E/Vijaya_Emani/index.htm


http://www.clevelandpeople.com/hof/2011/hof-2011-vijaya-emani.htm


http://sepiamutiny.com/blog/2011/10/21/white-house-recognizes-vijaya-emani/

అలాగే మన హైదరాబాద్ నగరంలో కూడా.. ఒక మహిళా మణి  ఉన్నారు. 

ఆమె మెహజబీన్. మంచి కవయిత్రి.



 మైనారిటీ మహిళలు మరియు పిల్లలు సంబంధించిన సమస్యలపై అవగాహన కార్యక్రమాలు రూపొందించారు. . ఆమె హైదరాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా ఉంటూ  మైనారిటీ స్త్రీలకి  ఉచిత న్యాయ సహాయ అందిస్తుంది. దూరదర్శన్, ప్రభుత్వం TV ఛానల్ ద్వారా మహిళలకు చట్టపరమైన అవగాహన మరియు సలహా మరియు కుటుంబ సలహా కార్యక్రమం  "చేతన" నిర్వహించింది. బాల కార్మిక (నిర్మూలన) చట్టాలు సమర్థవంతంగా అమలు చేయడం కోసం  ప్రచారం చేస్తున్నారు.

ఆమె గురించి మరింత వివరంగా ఈ లింక్ లో

http://www.maachittoor.com/nellore/important-person/mahe-jabeen.html

వీరి ముగ్గురి గురించి నేను చెప్పడం కన్నా మీరే స్వయంగా తెలుసుకోవచ్చు అనే ఉద్దేశ్యం తో లింక్స్ ఇచ్చాను.
విసుగ్గా తోస్తే మన్నించండి.

 వీరందరూ స్పూర్తి కరమైన మహిళలు కదా! మరి కొందరు గురించి మరొక పోస్ట్ లో.. 


16, ఫిబ్రవరి 2013, శనివారం

కాల్లీఫ్లవర్ పచ్చడి


వంట చేయడం అంటే నాకు విసుగు. ఇంతకూ ముందు కూడా నేను ఏ వంట గురించి వ్రాసి ఉండను.ఏదో ఒక పోస్ట్ తప్ప. 
మొన్న ఈ మధ్య ..  కాలి పోర్నియా లో ఉన్న మా మరిది గారి అమ్మాయి.."భవ్య" ..చాట్ లో ఇలా అడిగింది.. ఏం చేసావు పెద్దమ్మా..అని రెండు మూడు వంటలు చెప్పాను. మరి నాకూ ..అంది. జాలి వేసింది. ఏమిటో.. ఈ విదేశాల నివాసం.ఈ పిల్లలకి ఏమి చేత కాదు. ఏమి తినలేరు అనుకున్నాను. 
మా భవ్య కి కాల్లీ ఫ్లవర్ పచ్చడి చాలా ఇష్టం. నేను అదే రోజు కాల్లీ ఫ్లవర్ పచ్చడి చేసాను. ఈ రెసిపీ చూసి భవ్య అక్కడ తయారు చేసుకుంటుందని ఓ..చిన్ని ఆశ. 












కాల్లీ ఫ్లవర్  పచ్చడి చాలా మందికి తెలిసే ఉంటుంది. కూర చేసి తినేకన్నాపచ్చి ముక్కలతో పచ్చడి చేస్తే   చాలా బాగుంటుంది

కాల్లీ ఫ్లవర్ పంట (పూల దిగుబడి ) నవంబర్ మాసం నుండి ఉంటుంది. కూరగాయల పంటలలో అన్నింటి కన్నా అత్యధిక రసాయన మందులు పిచికారీ చేసే పంట ఈ కాల్లి ఫ్లవర్. చాలా మందికి ఒక విదమైన పచ్చి వాసన రావడం వల్ల  ఈ పువ్వుల వాడటం ఇష్టం ఉండదు.  నేను అయితే.. ఈ కాల్లీ ఫ్లవర్ చూస్తేనే దూరంగా జరిగి పోతాను. కూర చేయాలంటే కూడా నాకు విముఖత ఎందుకంటే.. ఆ పూల వాసన,  (ఒక విధమైన ఏదుం వాసన) మొక్క నాటినప్పటి నుండి పంట దిగుబడి వరకు కొట్టే పురుగు మందులు,ఇంకా అందులో దాగి ఉండే పురుగులు.. అన్నీ.. అంటే అయిష్టం.


జనవరి తర్వాత అంటే పువ్వు తెల్లగా ఉండటం తగ్గిన తర్వాత ఆ పువ్వులని అసలు వాడనే  కూడదు. మంచు కురిసే సమయాల్లోనే కాల్లీ ఫ్లవర్ బాగుంటుంది ఎండలు ముదిరేటప్పటికి పురుగు ఉదృతి ఎక్కువ కూడా.. రైతు ఎలాగోలా రసాయన మందులు జల్లి పంటని మార్కెటింగ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇదంతా నాకు ఎలా తెలుసు అంటే.. మా పొలాల లొ పండించేవారు నేను అన్నీ స్వయంగా చూసిన దాన్ని కాబట్టి.

ఒక వేళ  కాల్లీ ప్లవర్ ని ఉపయోగించాలంటే.. పూవుని చిన్న చిన్న గుత్తులుగా విడదీసుకుని.. పురుగులు లేకుండా
చూసుకుని బాగా ఎక్కువ నీళ్ళల్లో ఉప్పువేసి ఒక గంట ఆ నీళ్ళ నే ఉండనివ్వాలి.  ఇలా చేయడం వల్ల  పువ్వుల లోపల ఉన్న పురుగులు వెలుపలకి వచ్చేస్తాయి. ఒక గంట తర్వాత మళ్ళీ రెండు మూడు సార్లు ..ఆ పువ్వుల గుత్తులని  కడిగి..ఉంచి పెట్టుకుని.. బాగా మరిగిన నీటిలో ఆ ముక్కలని వేసి వెంటనే నీరు వార్చేసుకోవాలి. అప్పుడు ఆ ముక్కలు అంత పచ్చి వాసన రావు. రసాయన అవశేషాలు మిగిలి ఉండవు కూడా. అప్పుడు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వాడుకోవచ్చు.

కాల్లీ ఫ్లవర్ ని  ఏక రకంగా వండకుండా.. వంకాయ,లేదా చిక్కుడు కాయ లతో కలిపి వేపుడు చేయవచ్చు. లేదా టమోటా తో కలిపి కలగలుపు కూర చేయవచ్చు. కాల్లీ ఫ్లవర్ కూర ఏ విధంగా వండినా ..ఆ కూరకి అల్లం వెల్లులి మిశ్రమం వేస్తేనే తగినంత రుచి.

ఇక ఇప్పుడు పచ్చి ముక్కల కాల్లీ ఫ్లవర్  పచ్చడి సంగతి చూద్దాం.

వేడి నీటిలో వేసి వార్చి తడి ఏ మాత్రం లేకుండా   శుభ్రంగా ఆరపెట్టిన

కాల్లీ ఫ్లవర్ ముక్కలు  సుమారు కొలతలో ఒక శేరు

కారం ఒక కప్పు  75గ్రాములు.

ఉప్పు ఒకటిన్నర కప్పు (కళ్ళు ఉప్పు = క్రిస్టల్ సాల్ట్ )

నిమ్మ పులుసు ఒక కప్పు

వెల్లులి పాయలు ఒక కప్పు ని ముద్దగా చేసి కలపాలి.

వేయించిన మెంతులు పిండి చిటెకెడు

వేరుశెనగ నూనె ఒకటిన్నర కప్పు.

పసుపు కొద్దిగా

అన్నీ కలిపి ఒక రోజు తర్వాత  ఈ పచ్చడిని వాడుకోవచ్చు.  నా  వంట మీద నమ్మకం ఉంటే మీరు ప్రయత్నించండి. :)

ఈ పచ్చడి కి తాళింపు  అవసరం లేదు. ఆవకాయ పచ్చడి లాంటిది ఈ పచ్చడి కూడా. అయితే ఒక వారం కన్నా ఎక్కువ నిలువ ఉండదు. ప్రిజ్ద్ లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది.

15, ఫిబ్రవరి 2013, శుక్రవారం

వెలుతురు బాకు

మనసు క్రోధాన రగిలినప్పుడు
వాదాలు భేదాలు ఇజాలు
తీవ్ర రూపం దాల్చినప్పుడు వికృత స్వరూపంతో
తన ఉనికిని చాటే వినాశకం హింస

దేశాల మద్య యుద్ధమా జీహద్ పేరిట చేసే ఉగ్రవాదమా
జాతుల మనుగడకై చేసే అంతర్యుద్ధమా!
కుటిల రాజకీయ తంత్రమా ఆయుధ వ్యాపారమా
ఏదైనా హింసా.. నీ పేరు వినాశకమే

విద్వంస రచనల మధ్యనూ భద్రత ముసుగులోనూ
భయం గుప్పిట్లోనూ ఏ తలుపు చాటునో నక్కి
కిటికిరెక్క మాటునో దాగి
సైనిక కవాతుల కరాళ నృత్యాలని
పిట్టలా రాలిపోతున్న ప్రాణాలనికని
రాబందుల రెక్కల చప్పుళ్ళని విని
నిలువెల్లా కంపిస్తున్నసామాన్యజీవనం
దుఃఖ విభాజనమూ శృంఖలాల విచ్చేదనమూ
తెలియని అయోమయ జనం

ఏ తల్లి రోదనో ఏ తండ్రి వేదనో ఏ చంటి బిడ్డడి దుఖమో
ప్రత్యక్ష ప్రసారాలలో చూసిన ఉన్మత్తవాదులలో
పరివర్తన కలిగేనా
హృదయ విహీనులైన వారి
జ్ఞాన చక్షువులు తెరుచుకునేనా
మానవత్వపు జీవ గంగ ఉద్భవించేనా!?
ఆ రణ రక్కసి దాడికి లక్షలాది
గుండె గాయాలు రగులుతూనే ఉన్నాయి
కవిత గేయాలు ఆలపిస్తునే ఉన్నాయి

రెండు దేశాల మద్యనో రెండు ఇజాల మద్యనో
సరిహద్దుల వెంబడి మానవత్వపు నది
మెలికెలు తిరుగుతూ ప్రవహిస్తూనే ఉంది
దానిని మళ్ళించి మన హృదయసీమల్లో
శాంతిని పండించే విత్తనాలు నాటాలి
హృదయాలని తట్టి లేపే పని మొదలెట్టాలి

ఉగ్రవాదం ఉసురు తీసేలా తిట్టిపోయడం కాదు
ఉనికిని మాపేందుకు ప్రతి గుండెలోతుల్లోకి
ప్రేమ మధువులొలికించి
అనురాగ పాశాన్ని నాటుదాం
శాంతి చినుకులలో తడిచే క్షణంకై
చకోర పక్షులై ఎదురు చూద్దాం
మతమవసరంలేని
మానవాలయాలని నిర్మింప జేసుకుందాం
మనిషి మనమున మసిలే
మానసిక చీకట్లను రూపుమాపడానికి
రహస్య ఖార్ఖానాలో తయారు చేసుకున్న
వెలుతురుబాకులతో దండయాత్ర చేద్దాం.

(2006 ముంబై ప్రేలుళ్ళ నేపధ్యంలో వ్రాసిన కవిత )


12, ఫిబ్రవరి 2013, మంగళవారం

మాటా - మంచి.


రెండు కొప్పులు  ఒకచోట కలిస్తే యుద్దాలు మొదలవుతాయి అని నానుడి.

అలాంటివి నానుడిని అప్పుడప్పుడూ అబద్దం చేస్తూ కాస్త హాస్య రసాన్ని  కలబోసుకుంటూ ముఖాలతో  పాటు మనసున నవ్వులు పూయించుకుంటూ ఉంటాం.  అలాంటి  సమయాల్లో ఈ సంభాషణ  జరిగిన సమయం ఒకటి.

ఇంతులకు బంతులన్నా, చామంతులన్నా బహు ప్రియం కదా!

ప్రియమైన ఇంతుల మనసు దోచే మాట.. ఒకటి చాలు కదా !  బహుమానాలుగా పూలమాల  ఎందుకు..అనుకుని ఒక భర్త అతని భార్య వద్దకు హడావిడిగా వెళ్ళి

నువ్వే  నా చామంతి వి    నేనేమో  నీ బంతి ని  ..అన్నాడట. కావాలని తనని తాను కొద్దిగా తగ్గించుకుని.

అంతే! తెలివికల భార్య మాటలో దొర్లిన పొరబాటుని పట్టేసి.. నాకేం తోచడం లేదండి..? ఇటురండి.. కాసేపు ఆడుకోవాలి అందిట.  :)  :)

చూసారా..!?  అక్షరం పొరబాటు మాట్లాడితేనే  ఎలాంటి ఇబ్బంది ఎదుర్కున్నాడో.. ఆ భర్త గారు.

అందుకే ..ఇతరులతో మాట్లాడేటప్పుడు అచ్చుతప్పులు లేకుండా, అక్షరం తప్పు లేకుండా, అసలు అర్ధం కాకుండా మాట్లాడకండి.

ఇలా జోక్స్ చెప్పుకుంటూ నవ్వుకుంటూ.. మాటా - మంచి..గురించి మాట్లాడుకున్నాం.

మాట వరాల మూట! మాట జారాక తిరిగి తీసుకోలేం !  కదా అనుకుంటూ నవ్వుల విషయం లో నుండి.. సీరియస్ గా ఇంకో విషయంలోకి వెళ్ళిపోయాం.

నాలుక మాట్లాడే మాటలకి శరీరం దెబ్బలకి కాయాల్సి వస్తుంది. అని చెప్పేది మా నానమ్మ.  కబీర్దాస్ పోయెట్రీ చదివినట్లు కూడా గుర్తు.  (जीभ jibh)

కొందరు అతిగా ఆవేశపడి మాటలు అనేసి తర్వాత సారీ సారీ..అనేస్తారు. సారీ అనేస్తే.. అంతకు క్రితం వారు అన్న మాటల వల్ల  గాయపడిన మనసుకి ఊరట కల్గుతుందా చెప్పండి?

ఇంకొంతమంది మనుషులని కుక్కలతో,పశువులతో పోల్చి మాట్లాడుతూ ఉంటారు. అసలు కుక్క కున్న విశ్వాసం మనిషికి ఉంటుందా చెప్పండి..? గడ్డి తిని పాలిచ్చే పశువులతో..మనుషులని పోల్చడం కూడా సమంజసం కాదేమో! పశువులే నయం .. వాటికి గడ్డి తినడమే తెలుసు. అవినీతితో అడ్డంగా బలిసే మనుషుల తీరు వాటికి తెలియదు పాపం.

అలాగే గడ్డిపోచ కన్నా..హీనం అంటూ తీసివేస్తారు. ఒకోసారి గడ్డిపోచలే వరదలో .కొట్టుకుపోకుండా కాపాడతాయి. కొందరు  ఒకోసారి గడ్డిపూవు తోనూ పోలుస్తుంటారు.బావి ఒడ్డున పెరిగే గడ్డి పూవు కి అందం ఉంది.. విలువ ఉంటుంది.

ఇలాంటి మాటలు మాట్లాడి ఇతరులని బాధపెట్టిన  తర్వాత కొన్ని బంధాలు తెగిపోవడం చూస్తుంటాము.తర్వాత  ఏమి వగచినా ఏం  ప్రయోజనం..చెప్పండి.

కొందరు సంస్కారం మెట్టు దిగజారలేక  తమ తప్పు ఏమి లేకపోయినా మౌనంగా ఉండిపోతారు. ఎదుటి వారి మౌనం ని అలుసుగా తీసుకుని  నోటి దురుసు వారు పెట్రేగి పోతూ తాము మాత్రమే  నిజాయితీపరులుగా ముద్రించుకుంటే  మాత్రం వారు సచ్చీలురు అయిపోగలరా?

 కొందరిలో రెండు నాల్కల దోరణి చూస్తుంటాం. కొందరు.. అతి మంచి తనంగా మాట్లాడుతూ వెనుక గోతులు తీస్తూ ఉంటారు. అమాయకంగా అందరిని నమ్మేయకుండా ఎవరి నైజం ఎలాంటిదో.. తెలుసుకుంటే చాలా ప్రమాదాలనుండి  ఎవరిని వారు కాపాడుకోవచ్చు కదా!

ఎవరైనా నోటిని అదుపులో ఉంచుకుంటే చాలా మంచిది.  ఎదుటివారి మంచితనాన్ని అలుసుగా తీసుకుని పెట్రేగి పొతే.. ఎప్పుడు చూస్తూ ఊరుకోరు. తగిన సమాధానం చెపుతారు. మాటకి మాట అనడం  సమాధానం కాదు
అనకుండా ఉండటమే సంస్కారం. ఎన్ని చదువులు చదువుకుంటే ఏం?  కొంతమందికి అసలు సంస్కారమే తెలియదు.ఇతరులని  నలుగురిలో చులకన చేయడం,  ఎగతాళిగా మాట్లాడటం వలన వారికి గౌరవం ఏం పెరగక పోగా పదుగురితో అసహ్యించుకోబడతారు. మనిషి విలువని పెంచి మనుగడలో గౌరవం పెంపొందించుకుంటూ మనకంటూ  నలుగురు  ఆత్మీయులను సంపాదించుకోవడమే గొప్ప విషయం.

 సంస్కారం మనిషికి ఆభరణం కావాలని కోరుకుందాం.సరేనా!

dude .. సంస్కారమే కదా..కావాల్సింది. సంస్కారంగా మెలిగిన సంస్కారం  తిరిగి వచ్చును. :)




8, ఫిబ్రవరి 2013, శుక్రవారం

ముఖ పుస్తకమా..శత మర్కటమా ?


ముఖ పుస్తక పరిచయాలు.

రాసుకోవడానికి వినడానికి  చాలా బావుంటాయి. ఎని సార్లు రాసుకున్నా ఇంకా మిగిలి ఉంటాయి అనుకుంటాను.

ఓ..వారం క్రితం ముఖ పుస్తకం  నా క్లాస్ మేట్ ఒకరిని తిరిగి పరిచయం చేసింది. నాకు చాలా సంతోషం కల్గింది. ఇలా సంతోషం మిగల్చడం మూడోసారి అనుకుంటాను.

మొదటి సారి .. ప్రతి రోజు  దూరంగా ఉన్న నా బిడ్డని కనులారా చూసుకున్నట్లు ఉన్నప్పుడు ముఖ పుస్తకం  కి థాంక్స్ చెప్పుకున్నాను.. ఎందుకంటే  ఇప్పుడు పిల్లలందరూ ముఖ పుస్తక  ప్రేమికులే కదా! నాలుగైదు  రోజులపాటు కాల్ చేయకపోయినా ఏ రోజుకా రోజు అప్ డేట్స్ చూసి బెంగ పెట్టుకోకుండా ఉంటూ  కాస్త స్తిమిత పడేదాన్ని.

ఇక రెండవసారి.. థాంక్స్ చెప్పుకోవడం ఎప్పుడంటే.. నా కవిత్వాన్ని "కవి సంగమం" లో పోస్ట్ చేసి అక్కడ వచ్చిన స్పందన చూసి సంతోష పడ్డాను. కవిసంగమం గ్రూప్ లో అందరూ నా లాంటి కవి మిత్రులే! నిజానికి నేను బ్లాగ్ లో కవితలని పోస్ట్ చేసినప్పటికన్నా కూడా ఎక్కువ స్పందన చూసాను. ఒక రకంగా చెప్పాలంటే నాకు బ్లాగ్ కన్నా కూడా ముఖ పుస్తకమే  ముందు పరిచయం.  కాని  అక్కడ కాలక్షేపపు కబుర్లు తో పొద్దు పుచ్చడం ఇష్టం లేక అంత ఎక్కువగా మసలలేక పోయాను. ఇక ఇక్కడ వద్దు అనుకుని  బ్లాగ్ క్రియేట్ చేసుకుని   పూర్తి సమయం   బ్లాగ్  కి కేటాయించాను.

ఇక మూడవసారి నా క్లాస్మేట్  ని కలిపింది. నిజానికి నా కుటుంబ సభ్యులు తప్ప ముఖపుస్తకం లో  స్నేహితులు గా ఉన్నవారు అందరూ బంధువులు,  ఇంకా ఇటీవల కాలంలో పరిచయం  అయిన వారే !. అప్పుడప్పుడూ అనుకునే దాన్ని బాల్య మిత్రులు ఎవరైనా తారసపడితే బావుండును అని. నా మనసులో కోరిక ఇన్నాళ్ళకి  నెరవేరింది. ఇలా ముఖ పుస్తకం  వల్ల లభించే  ప్రయోజనాలని స్వాగతిస్తూనే  మరి కొన్ని ప్రతికూల అంశాలు చెపుతాను..

బ్లాగ్ లో మనం వ్రాసిన విషయాన్ని చదివి కామెంట్ చేసినప్పుడు మనం మోడరేషన్ పెట్టుకుని ఉంటె ఎవరైనా అభ్యంతర కరంగా కామెంట్ చేసినా మనం అనుమతించనిదే  పబ్లిష్ అవదు కాబ్బట్టి అభ్యంతర కరంగా ఉంటే డిలిట్ చేసుకుంటాం. ముఖ చిత్రంలో పోస్ట్ వేసి తర్వాత ఎప్పుడో వీలైనప్పుడు చూసుకునేటప్పటికి ఒకోసారి అభ్యంతర కర వ్యాఖ్యలు ఉండటం మన కన్నా ముందు అందరు చూసేయడం జరుగుతుంది.

పురుషులికి  ఇబ్బంది ఉంటుందో లేదో కాని చాలా మంది  స్త్రీలకి కి కొన్ని వ్యాఖ్యలు ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటాయి. స్త్రీల ఫ్రెండ్స్ లిస్టు లో కుటుంబ సభ్యులు,బంధువులు అందరూ ఉంటారు. ఇతరులు (అంటే మన ఫ్రెండ్స్ లిస్టు లో ఉన్నవారు ) వచ్చి మన  వాల్ పై పోస్ట్ చేసే అవకాశం ఇవ్వకుండా ఉంటె మంచిది. ఈ మధ్య ఒక ఫ్రెండ్ అలా పోస్ట్ చేయడం వల్ల  వచ్చిన ఇబ్బంది గురించి చెప్పారు. .ఇతరుల వాల్ పై పోస్ట్ చేసే విషయం ఇతరుల మనోభావాలు దెబ్బ తీయకుండా  ఉంటే  మంచిది కదా!  అలాగే ఒకోకరు నిత్యం అనేక సార్లు ఏదో ఒక విషయాన్ని పోస్ట్ చేస్తూ ఉంటారు. ఏదైనా పరిమితంగా ఉంటేనే ఇతరులకి ఆసక్తి ఉంటుంది. పోస్ట్ చేసిన విషయం ఇతరులకి చేరుతుంది.

ఇంకో విషయం ఏమంటే .. ఒడో ఒక గ్రూప్ క్రియేట్ చేసి మనకున్న ఫ్రెండ్స్ లిస్టు అందరిని అందులో జత చేయడం కూడా అంత బావుండదు. కొందరు మొహమాటస్తులు ఆడ్  చేసిన మిత్రులు ఏమైనా అనుకుంటారు అని గ్రూప్ నుండి లీవ్ అవడానికి  కూడా  వెనుకాడి నిత్యం నచ్చని విషయాలు చూస్తూ చిరాకు పడతారు. మొన్నొక మిత్రురాలు చెప్పారు. తమ బంధువులు పిల్లలు అందరూ తన ఫ్రెండ్స్ లిస్టు లో ఉంటారు. వాళ్ళంతా నా పిల్లల వయసు ఉన్నవారు. నేను ఏదో ఒక గ్రూప్ లో నుండి "ప్రీమ" సబ్జక్ట్ కి స్పందించడం చూస్తే ఏమనుకుంటారో అని బాధ వ్యక్తం చేసారు. ఇది కొంచెం ఆలోచించవలసిన విషయమే! ఎందుకంటే కొన్ని విషయాలు వల్ల ఖచ్చితంగా ఇబ్బంది కలుగుతుంది

ఇంకొకరు ఏమన్నారంటే  పెళ్ళీడుకొచ్చిన పిల్లలని పెట్టుకుని ప్రేమ అంశాలు వ్రాస్తున్నారు. పిల్లలు చూస్తున్నారు అనే ఇంగిత జ్ఞానం లేకుండా అని.

 నేను చెప్పేది ఏమిటంటే.. నిజానికి స్పందనకి వయస్సుతో పని లేదు. రచయితలూ,రచయిత్రులు ఏ అంశం పైన అయినా వ్రాయ వచ్చు. కుటుంబ సభ్యులు చూస్తారు అని చెప్పి కవులు కావ్యాలు వ్రాయకుండా ఉన్నారా?  అయిదు పదులు నిండిన తర్వాత కూడా భావ కవిత్వం,ప్రేమ కవిత్వం వ్రాస్తూ ప్రసిద్దులైన వారు ఉన్నారు. రచనలు రచనలు గానే చూడాలి అని చెప్పి మందలించాను. అప్పటికి కాని వారి ఆలోచన ఎంత తప్పో  వారికి అర్ధం కాలేదు. అలా అని నిత్యం ప్రేమ,విరహం,ఆరాధన ఇలాంటి విషయాల గురించి వ్రాయడం కూడా చిరాకే! ఏదైనా నవ్యత,నాణ్యత ఉండాలి కదా!

మన పిల్లలు మనని గమనిస్తారు. వాళ్ళని మనం  గమనిస్తాము.   అలాగే ఇతరులు మనని గమనిస్తున్నారు అనుకున్నప్పుడు వివేకంతో మెలగాలి. అలా కాకుండా.. ఏది తోస్తే అది చేయడం తగదు. అందులోను స్నేహంగా ఉండాలనుకున్నప్పుడు ఇతరుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించ కూడదు.

ఇతరుల వాల్ పై ఇష్టం వచ్చిన పిక్స్ పెట్టడం, లేదా కొన్ని అభ్యంతరకర అంశాలని టాగ్ చేయడం, సభ్యత లేకుండా వ్యాఖ్య చేయడం చేయకూడదు. అలాగే ప్రతి దినం వచ్చి మెసేజ్ పెట్టె వారు ఉంటారు. అదొక ఇబ్బంది. ఇక్కడ భావాలు కలబోసుకోవడానికి,ఆలోచనలు పంచుకోవడానికి మంచి-చెడు విషయాల పట్ల అవగాహన కల్గిన్చుకోవడానికి ముఖ పుస్తకం ని ఉపయోగించుకుంటే మంచిది. పర్సనల్ మెసేజ్ స్పేస్ ని అవసరం అయితే తప్ప ఎందుకు ఉపయోగించుకోవడం అని నాకు అనిపిస్తుంది

నిత్యం నాకు చాలా ఫ్రెండ్స్ రిక్వెస్ట్  లు వస్తూ ఉంటాయి.నేను ఆచి తూచి వ్యవహరిస్తాను.ఒక నాలుగైదు నెలలపాటు వారితో ఒక్క సారి కూడా సంభాషించని పక్షంలో మంచి విషయాలు షేర్ చేసుకొని  పక్షంలో ఆ వ్యక్తులని నేను నా ఫ్రెండ్స్ లిస్టు నుండి తొలగిస్తాను. అలాగే పేక్ ఐ డి లతో వచ్చే వారు ఉంటారు. అలాగే భావ చౌర్యం చేసేవారు కూడా ఎక్కువే! అలాగే సంవత్సరాల తరబడి ఒకే అంశం పై వ్రాసేవారు ఉంటారు. ఆ హెల్ నుండి బయటపడాలనుకుంటే వదిలించుకోవడమే మంచిది.

అలాగే కవిత్వం గ్రూప్ లు కూడా.. ఎక్కువే!  అక్కడ అందరూ వ్రాసే వారే! చదివే వారు తక్కువ. మంచి కవిత్వం ని వెదికి  వెదికితే తప్ప పట్టుకోలేము. అలాంటప్పుడు రోజు ఒక కవిత కన్నా ఎక్కువ పోస్ట్ చేస్తున్న వారి కవితలని చదివి అభిప్రాయం వ్రాసే ఆసక్తి అందరికి ఉండక పోవచ్చు. ఏ  విషయమైనా "నామ్   కే వాస్తే " మిగలడం  చూస్తే ఇతరులకి షేర్ చేయడం ఎందుకు? అనవసరం  అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎప్పుడైనా ఎక్కడైనా "అతి సర్వత్ర వర్జయేత్ " కదా!  ముఖ పుస్తకమా..శత మర్కటమా ? అనుకునే స్థితి లో కూడా కొనసాగడం కూడా ఇబ్బంది కదా!

స్నేహం పేరుతొ.. అతిగా ప్రవర్తించ వద్దు..ఇతరులని ఇబ్బంది పెట్ట వద్దు. స్నేహం అయినా గౌరవం అయినా  దానిని కాపాడుకోవడం ముఖ్యం. అలా కాని పక్షంలో సైబర్ నేరాల చట్టం ఒకటి ఉంది. ఎన్ని పేక్ ఐ.డి  లతో వచ్చినా  మీ గురించి  తెలిసి పోతుంది.

ఐ .పి నెంబర్ మిమ్మల్ని పట్టి ఇస్తుంది. జర భద్రం అండీ!  కాస్త హుందాగా, భాద్యతగా మెలగండి.

6, ఫిబ్రవరి 2013, బుధవారం

మై స్పేస్ అమ్మలక్కల కబుర్లు 6

మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం . నా స్నేహితురాళ్ళు  రమ, వైష్ణవి, నేను కలసి మరొక ఫ్రెండ్ ఇంటికి లంచ్ కి వెళుతున్నాం బెంజ్ సర్కిల్ దగ్గర బస్ దిగి మాచవరం వైపు వెళ్ళడానికి  ఏలూరు రోడ్ వైపు వెళ్ళే బస్ ఎక్కాము.

ఆ టైం లో బస్ లు తక్కువ సంఖ్యలో వస్తూ ఉంటాయి. రద్దీగా ఉన్నా కూడా బస్ లో మాత్రమే  ప్రయాణం చేయాలి అని తీర్మానించుకు కూర్చున్న మా  ముగ్గురికి ఆటో లో  హాయిగా కూర్చుని ప్రయాణించే సౌలభ్యం లేకపోయింది. 
అదే మాట నేను అంటూ..ఈ  బస్ లో వేలాడే ఖర్మ పట్టింది. హాయిగా కూర్చుని వెళ్ళవచ్చు కదా?  అన్నాను 

ఇక్కడ వేలాడి  అయినా వెళతాం. ఆటోలో గమ్యస్థానం కి వెళతామో లేదో అని భయం . అంది రమ.

మరీ అంత భయం పనికి రాదండీ తెల్లవారి లేస్తే ఆటోలో పడి  ప్రయాణించే వాళ్ళు ఎందరు.? అందరికి ప్రమాదాలు ముంచు కోస్తాయా? అంది..రమ ని ఉద్దేశ్యించి వైష్ణవి.

ఆటో ల్లో ప్రమాదం రాదు.. ఎదురుగా చూడు ప్రమాదం కనబడుతుంది అన్నాను.

వాళ్ళు ఇద్దరు ఎదురుగా చూసారు."దిక్కుమాలిన దృశ్యాలన్నీ నీ కళ్ళ కే కనబడతాయి అని నవ్వారు. వాళ్ళు నవ్వవలసినంత విషయం ఏమంటే..ఒక ఇరవయి సంవత్సరాల యువతి లూజ్ హెయిర్ తో..చెవులకి లాంగ్ హేన్గింగ్స్ పెట్టుకుని బస్ లో మాకులాగానే వేలాడుతూ కనబడింది.లో వెయిస్ట్ జీన్స్ ఫాంట్ ,టైట్ టీ  షర్ట్ వేసుకుంది. కాళ్ళకి హై హీల్స్ వేయడం వల్ల అందరికన్నా  చట్టూ ఉన్న ఆడవారి అందరికన్నా ఎక్కువ ఎత్తుగా కనబడుతుంది ఆమె అలంకరణ కన్నా ఆమె వస్త్రధారణ చాలా ఎబ్బెట్టుగా ఉంది. ఇంతలో టికెట్ తీసుకోవడానికి కండక్టర్ వచ్చాడు. దాదాపుగా ఆమెని ఒరుసుకుంటూనే టికెట్ అడిగాడు. ఆ అమ్మాయి భుజానికి ఉన్న బేగ్ తీసి డబ్బు ఇచ్చి టికెట్ తీసుకునే వరకు అతని ముఖం ఆ అమ్మాయి వక్షస్థలం మీద ఆనినట్లే ఉంది. "చూస్తున్నావా? అని నా వైపు కను సైగ చేసింది."నేనేమిటి..అందరూ ఆ దృశ్యమే చూస్తున్నారు అన్నాను." నిజంగానే అందరూ ఆ అమ్మాయినే చూస్తున్నారు కూడా .

నాకు మాత్రం పురుషులు తడిమే చూపులనుండి తప్పించుకుని వచ్చి   అదేదో సబ్బుతో ప్రెష్ గా   స్నానం చేసి  చూపుల,ఆలోచనల మురికిని వదిలించుకుని హాయిగా నవ్వే  స్త్రే నటించిన వ్యాపార ప్రకటన గుర్తుకు వచ్చింది.
స్త్రీలు రోడ్డుపై నడుస్తుంటే వెంటాడే చూపులు, గుచ్చి గుచ్చి ఆబగా చూసే కళ్ళు,సొల్లు కార్చుకునే రకాలు గురించి  నాతొ పాటు స్త్రీ జాతి అందరికి కొద్దిగా గొప్పో తెలుసును. అలాగే  స్త్రీలు  అంతా తిట్టుకునే తిట్లు తెలుసు.కానీ  ఈకాలంలో ఇలాంటి వస్త్రధారణ చేసుకుని రద్దీగా ఉండే బస్ లలో ప్రయాణించే అమ్మాయిలకి ఎలాంటి ఇబ్బంది ఉండదా!? కండక్టర్ ఉశ్వాస నిశ్వాస లు  కూడా  తెలిసే విధంగా ఉంటే   కూడా ఆమె గమనించుకోదా  !?

 హి భగవాన్! ఎందుకు ఈ అమ్మాయిలూ ఇలా తయారవుతున్నారు? కోపం, ఆవేదన నాకు.
ఆ అమ్మాయి వైపు చూస్తూనే ఉన్నాను. పని ఉన్నాలేకున్నా కండక్టర్ బస్ ముందుకి వెనక్కి తిరుగుతూనే ఉన్నాడు.

ఆ అమ్మాయి అదే నిర్లక్ష్యంతో..చేతిలో ఉన్న మొబైల్ నొక్కుకుంటూ ఉంది.

రామవరప్పాడు రింగ్ వస్తుంది.  సిగ్నల్ పడ్డాయి. మళ్ళీ మేము అలాంటి దృశ్యమే చూదాల్సి వచ్చింది. మేము ప్రయాణిస్తున్న బస్ కి ముందు.. కొన్ని బైకులు ఆగి ఉన్నాయి. ఒక బైక్ పై  ముందు పురుషుడు మధ్యలో చిన్న బిడ్డని  కూర్చో పెట్టుకుని వెనుక  కూర్చున్న  యువతి కనిపించారు. ఆ యువతి చుడీదారు ధరించి ఉంది.కనీసం ఆమె ధరించిన సిల్క్ చుడీ దార్ కి కి లైనింగ్ కూడా లేదు. ట్రాన్స్పరెంట్ గా ఆమె దేహం వీపు భాగం  మొత్తం.. కనబడుతూ ఉంది.కాళ్ళు అటువైపు ఇటువైపు వేసుకుని కూర్చుండటం వల్ల ఆమె తొడ  భాగం అంతా అసహ్యంగా కనబడుతూ ఉంది.  పైగా ఆమె లోదుస్తులు కూడా కనబడుతూ ఉంటె.. మేము ప్రయాణిస్తున్న బస్ లోని వారందరూ ఆలాగే చుట్టుప్రక్కల ఆగి ఉన్న వాహనాలలో,వాహనాల పై ఉన్నవారందరి దృష్టి ఆమె వైపే ఉంది.

 ఇంతలో మాకు ప్రక్కనే సీట్లో కూర్చున్న ఒక  అరవై ఏళ్ళ స్త్రీ  గట్టిగా మాట్లాడ సాగింది. 'ఛీ ఛీ.. ఏమి మనుషులండీ! ఒంటి మీద గుడ్డలు కూడా కప్పుకోవడం రాని ఆడ కూతుర్లు రోడ్డు మీద పడితే ఎవడు పడితే వాడు చెయ్యి వేయడా? వాడు చెయ్యి వేసాడు..రేప్  చేసాడు అని  గగ్గోలు పెట్టె ముందు..మనం ఒంటి నిండా బట్టలు కట్టుకోవాలి అని తెలియదా! అదేమంటే.. మా ఇష్టం వచ్చిన బట్టలు కట్టుకునే హక్కు మాకుంది అంటారు. నీకు ఆ హక్కు ఉంది నువ్వు ఎట్టా  ఉండా చూసి ప్రక్కకు పోవడానికి వాడికి మంచి చెడు జ్ఞానం తెలిసిన వాడయి ఉండవద్దూ.. ! రోడ్డు అన్నాక నాలుగు రకాల మనుషులు తిరుగుతూ ఉంటారు. అందరూ చూసి తల తిప్పుకుని వెళ్లి పోయే వారే ఉంటారా? ఓ సారి చెయ్యేసి చూద్దాం అనుకునే అలాగా నాయాళ్ళు ఉంటారు.  మనం చదువుకుంటున్నాం కదా .కాస్తయినా ఇంగిత జ్ఞానం ఉండొద్దూ....ఇంట్లో అమ్మ-నాన్న చెప్పిన మాట వినరు.అందం అంతా విప్పేసుకుని తిరగడంలోను,విరబోసుకుని తిరగడంలోను ఉందనుకుంటారు. మన కట్టుబొట్టు సంస్కారంగా ఉంటె కదా మగవాడు గౌరవం ఇవ్వడానికి.  ఇక ప్రతి వాడు నోరు పారేసుకుంటాడు..ముళ్ళు వెళ్లి అరటి ఆకు మీద పడ్డా..అరటి ఆకు వెళ్లి ముళ్ళు మీద పడ్డా అరటి ఆకు కే  నష్టం అని ఊరికే అనలేదు...  అంటూ ఏకబిగిన మాట్లాడే సింది.

వింటున్న వాళ్ళలో అధిక శాతం మంది అవును కదా! ఆడపిల్లలకి ఎవరు చెప్పలేకపోతున్నాం.మన జాగ్రత్తలో మనం ఉంటే  నయం కదా అనుకోవడం లేదు అంటూ ఒకరు వ్యాఖ్యానించారు.

గ్రీన్ లైట్ వెలగడంతో బస్ ముందుకు కదిలింది. ఇందాక మాట్లాడిన పెద్దావిడ  మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తున్నాను.ఇంత దైర్యంగా ఎవరైనా  చెప్పగలరా!? చెపితే నేటి తరం వారు వింటారా? చాదస్తం .. వీళ్ళకి  మోడర్నిజం  గురించి ..ఏం  తెలుసు ? అంటూ గడ్డి పరకల్లా తీసి పారేస్తారు. వాళ్ళు  అలా  అంటూ  ఉంటే  ఇక ఏం చెప్పగలం.? అనుకున్నాను.

మేము దిగాల్సిన స్టాప్ వచ్చింది.ముగ్గురుం దిగేసి.. నడుచుకుంటూ వెళుతూ.. "ఆ పెద్దావిడ బాగా కడిగేసింది కదా! అన్నాను.

" ఏమిటి కడిగేసేది?  ఆమె పూర్వ కాలం మనిషి. అలాంటి వారు ఎంత మంది చెప్పినా ఈ కాలం అమ్మాయిలూ వింటారా ఏమిటీ! మా ఇష్టం అంటారు"  అంది రమ.

ఎవరయినా   తమ వ్యక్తీగతమైన  ఇష్టాలని వేరొకరి కోసమో, సమాజం కోసమో వదులుకునే ప్రసక్తి లేదు అనుకుంటే  వారు సమాజం నుండి ఎదురయ్యే ఇబ్బందులని కూడా ఎదుర్కొనడానికి  సిద్దంగా ఉండాలి కదా! అన్నాను.

"ఆలోచించాల్సిన విషయమే " అని నవ్వింది వైష్ణవి.

స్వేచ్చా,స్వాతంత్ర్యం అవసరమే! అవి సరిగా ఉపయోగించుకునేంత కాలం బాగానే ఉంటుంది. మితిమీరి తీసుకుంటే .. ?? అని ఆలోచిస్తూ.. ప్రశ్నించుకుంటూ

నాకే గనుక ఒక ఆడపిల్ల ఉంటె.. అమ్మో!  వద్దు .. అనుకుని భయపడ్డాను.

ఎందుకంటే నా ముందు తరం  స్త్రీలు, వారు ఎదుర్కున్న   సమస్యలు చూసాను. వారి తరం అంతా కొంత వరకు ఏమి తెలియని అమాయకత్వంలోనే బ్రతికారు. ఒకవేళ వారి సమస్యల గురించి  తెలిసినా పెదవి దాటి బయటకి రానీయక తప్పని సరి పరిస్తితులనుండి తప్పించుకోలేని,తెగువ చూపలేని తరం వారిది.  నా తరం వారి సమస్యలు చూసాను.ఇప్పటి తరం కి అప్పటి తరంకి మధ్య నలిగిన తరం మాది. కాస్తంత చదువులు,ఇంటాబయటా చాకిరి,సంపాదించినా ఆర్ధిక స్వాతంత్ర్యం లేకపోవడం,కుటుంబం కోసం కొవ్వొత్తిలా కరిగిపోవడం..అనుకునే తరం మాది. ఇక ఇప్పటి తరం వారి తెంపరితనం మితిమీరినట్లు అనిపించుకుంటున్న స్వేచ్చ..అలా కాలగమనం లో మార్పులు సహజమే అనుకోవాలా? లేక పెరుగుట విరుగుట కొరకు అనుకోవాలా? ఏమో నేనే చెప్పలేను.అంతా అస్పష్టం.

  (నేను వ్రాసిన  ఈ పోస్ట్ వాస్తవం.సమాజంలో పదుగురు, పదుగురి అభిప్రాయాలు కలవాలని లేవు. ఎవరి అభిప్రాయాలు వారివి.  కానీ నడకలో మాత్రం  అందరూ కలిసే వెళతాం. లాభాలు-నష్టాలు అనుభవించే వారికే తెలుస్తాయి కదా! )

4, ఫిబ్రవరి 2013, సోమవారం

కొన్ని నిజాలు మాట్లాడుకుందాం - ఆలోచనలు మార్చుకుందాం.


కొన్ని నిజాలు మాట్లాడుకుందాం  - ఆలోచనలు మార్చుకుందాం.

స్త్రీ ఎదిగింది ఎక్కడ  ఎదగనిచ్చేది ఎక్కడ ? అని ఒక ప్రశ్న వేస్తే.. కొందరి స్త్రీల  (బ్లాగర్ ల )మనసులో మాట  ఈపోస్ట్ . 

అదొక కార్పోరేట్ సంస్థ ఆడ మగ సమానస్థాయి లో వాళ్ళ వాళ్ళ పనులలో తలమునకలై ఉన్నారు.  వారు చేస్తున్న పనుల మధ్యలో ఏదైనా సమస్య తలెత్తినా..సలహా కావాలన్నా   ప్రక్కనే పని చేసుకుంటున్న తోటి ఉద్యోగిని అడిగి తెలుసుకోవడం పురుష ఉద్యోగికి మొహమాటం మాత్రమే  కాదు నామోషి తనం కూడా. మగవాడిని నాకన్నా వారికి ఎక్కువేం తెలుసు? ఒకవేళ ఒకో విషయంలో తెలిసినట్లు ఉన్నా స్త్రీ ఎప్పుడూ కూడా ద్వితీయ శ్రేణికి చెందినదే ! నేను ఇప్పుడు నా సందేహంని నివృత్తి  చేసుకోవాడానికి మాట సాయం అడిగినా లోకువ అయిపోతాననుకుంటాడు ( ఈ విషయం పురుషులందరికీ వర్తించక పోవచ్చు )

ఇది చాలా మంది పురుష ఉద్యోగులలో ఉన్న అపోహ. వారికి  తెలియని విషయాన్ని తెలుసుకోవాలన్నా, అస్పష్టంగా తోస్తున్న విషయాలపై  అవగాహన పెంచుకోవాలనుకున్నా పురుషుల ద్వారానే తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు తప్ప స్త్రీల సాయం తీసుకోరు. అలాగే స్త్రీలలో ఉన్న ప్రతిభని,శక్తి సామర్ధ్యాలని ఒప్పుకోవడానికి అయిష్టం కూడా. ఇది అసత్యం అని చాలా మంది పురుషులు అభ్యంతరం తెలిపినా సరే ఇదే నిజం !  

మనం సాధించిన అభివృద్దిలో స్త్రీల వ్యక్తి గత అభివృద్ధి శూన్యం.  చదువులు చదువుకుంటున్నారు.., ఉద్యోగం చేసుకుంటున్నారు.,పురుషులతో సమానంగా కొంతవరకైనా రాణిస్తున్నారు. కానీ స్త్రీల పట్ల పురుషులకి ఉన్న భావ జాలం ని మార్చలేక పోతున్నామనేది కఠోర సత్యం.    

మనిషి  మనసుకి ముఖం  అద్దం  లాంటిది అంటూ ఉంటారు. కానీ ఇతరుల మనసులో ఏముందో తెలుసు కోవడం కష్టం కూడా.  మనిషి లో  బాహ్యంగా కనిపించే మనిషికి అంతర్లీనంగా ఉండే మనిషి తత్వానికి పొంతనే ఉండదు. సమాజంలో అందరికి సౌమ్యుడిగా  కనబడే వ్యక్తి  ఇంట్లో అతి క్రూరత్వం ప్రదర్శిస్తాడు. అది అతని కుటుంబం కి మాత్రమే.తెలుసు.  మునుముందు కాలంలో అది ఇల్లు కానీయండి, ఆఫీస్ కానీయండి..ఎక్కడైనా సరే ..సంకుచిత మనస్తత్వాల మధ్య  అనుమానపు చూపులు ఎదుర్కుంటూ.. అపనమ్మకం నీడన బితుకు బితుకు మంటూ బ్రతికే రోజులు రానున్నాయేమో ! 

ఒక స్త్రీ ఉద్యోగిని గా మారి  బయట ప్రపంచంలోకి కాలు పెడితే లైంగిక నిబద్దత లేని వ్యక్తిగా  జమకట్టడం ఇప్పటికి ఉంది.  అలా చెప్పుకోవడం చాలా సిగ్గుపడే  విషయం కూడా. ఒక స్త్రీ యొక్క స్వేచ్చని, అభిరుచులని, అవసరాల కోసం ఉద్యోగం చేయవలసి రావడంని సానుకూల దోరణిలో అర్ధం చేసుకోవడం మానేసి చదువుల పేరిట,ఉద్యోగాల పేరిట బయట తిరుగుతూ విచ్చలవిడితనానికి పాల్పడుతున్నారనే ఆలోచనలు చేయడం సబబు కాదు. 
ఇలాంటి అనారోగ్య ఆలోచనలు చేస్తూ.. వ్యాఖ్యలు చేస్తూ.. ఆడపిల్లలని,తల్లులని,ఆఖరికి వ్రుద్దురాళ్ళు  అయిన బామ్మలని కూడా వ్యాఖ్యానించడానికి నోటిని తాటి మట్టల్లా వాడుతున్నారు. ఒకప్పుడు రాజకీయరంగంలో ఉన్న మహిళలని, కొన్ని వృత్తులలో  ఉన్న వారిని ,  సేవారంగంలో పనిచేసే స్త్రీలని, క్రీడాకారిణి  లను  శీలసంపద లేని వారిగా జమ కట్టేవారు.ఇప్పుడు చూస్తే ఏ ఒక్కరిని వదలడం లేదు. ఆఖరికి ఏడేళ్ళ పిల్లలని కూడా.  

 కొందరి మగవారి కాలక్షేపపు కబుర్లలో మహిళల లైంగిక నిబద్దత గురించే మాట్లాడాలా? వాళ్లతో కలసి శరీరాలు పంచుకునే పురుషుడు మాత్రం శీలం కోల్పోడా? శీలం అనే విషయం కి వచ్చేటప్పటికి ఆడ-మగ తేడాలు ఎందుకుండాలి? మానవ ప్రవర్తనలో సెక్స్ కి   మహత్తర శక్తి ఉందని ప్రాయిడ్ గుర్తించారు. లైంగిక అంశాల గురించి పిల్లలకు చెప్పలేకపోవడం తో పాటు  లొపభూయిష్టమైన విద్య కారణంగానే పిల్లలులో ఆసక్తి పెరిగి  అశ్లీల సాహిత్యం చదవడం తో మొదలై నలుగురు కూర్చుని స్త్రీల పై అవాకులు చవాకులు పేలడం, అకృత్యాలకి  పాల్బడటం , తమ మనసులోని వికృతాన్ని  కుమ్మరించడం, ఇంట్లోను బయట ఉన్న స్త్రీల పట్ల చులకన భావం ప్రదర్శించడం లాంటి చేస్తుంటారు. ఇలాంటివి మాట్లాడుకోవడం విన్న మరి కొందరు పురుషులు కూడా ఇలాంటి మాటలకి వెరచి తమ కుటుంబ స్త్రీలని బయటకి పంపడానికి  వెనుకాడతారు. అప్పుడు సమాజం అభివృద్ధి పథంలో కాదు తిరోగమనం లోకి పయనించక తప్పదు  అనిపిస్తుంది. 

చాలా విషయాలలో  మనం నాగరికులం అయిపోయినట్లు భావిస్తాం. మన ఆలోచనలు నాగరికంగా మారనంత కాలం మనం సాధించుకున్నది శూన్యం.    

ఇటీవల కాలంలో బయటపడిన  పురుషుల  ఆలోచనా దోరణి గమనిస్తే.. ఆడపిల్లల్ని చదువులకి బయటకి పంపగలరా !? ఎక్కడో..ఎప్పుడో ఇలాంటివి కొందరి దృష్టికి వస్తూ ఉంటాయి. పురుషులందరికీ ఇలాంటి ఆలోచనా దోరణి ఉంటే ఎంత ప్రమాదకరం . ?ఒళ్ళు  ఒణికిస్తుంది.  ఒకే కప్పు క్రింద జీవితాంతం గడపాల్సిన భార్య భర్త ల మధ్య ఇలాంటి అపనమ్మకాలు వేళ్ళూను కుంటే !? ఇప్పటికే వివాహ బంధాలు అపహాస్యం పాలవుతున్నాయి. ఆడపిల్లలకి  తగిన భద్రతా లేదు. ఇక ఇలాంటి ఆలోచనా దోరణి ప్రభలితే ఎంత కష్టం.?  

అంతెందుకు ? ఒక తండ్రి తన కూతురిని,ఒక అన్న తన చెల్లెల్ని అనుమానంగా చూడటం మొదలెడితే..ఆడపిల్లకి అంతకన్నా అవమానం ఏముంది?బాల్య వివాహాలే శరణ్యం అని తీర్మానించడం  ఏ మాత్రం  గొప్పా కాదు. కులం పేరిట,మతం పేరిట కూడా స్త్రీల పై అనుచిత  వ్యాఖ్యలు చేస్తూ అవమానిస్తున్నారు. ఇలా మాట్లాడుతుండే  వారు వారి ఆలోచనా విధానాన్ని తప్పక  మార్చుకోవాలి. టాయ్ లెట్స్ గోడలపై అసహ్యకర వ్రాతలు వ్రాయడం లాగా  తమ వాచాలతతో స్త్రీల గురించి అసహ్య కరంగా మాట్లాడటం మానుకోవాలి  లేదంటే టాయ్ లెట్స్ కన్నా అసహ్యంగా మీ మనసులు ఉన్నాయి అని అమ్మాయిలూ చెపుతారు. కనీసం భర్తగా కాదు బాయ్ ప్రెండ్ గా కూడా అంగీకరించలేని రోజులు వస్తాయి. 

స్త్రీలైనా,పురుషులయినా అసహ్యకరంగా మాట్లాడుకోవడం గమనిస్తే అలాంటి మాటలు,ఆలోచనా విధానం తప్పని చెప్పడం అత్యవసరం కూడా.    

2, ఫిబ్రవరి 2013, శనివారం

నేను వ్రాసిన కవిత ఆంగ్ల అనువాదంలో

తెలుగు అనువాదాలు బ్లాగ్ లో N S ,మూర్తి గారు నేను వ్రాసిన కవితని ఆంగ్లం లోకి తర్జుమా చేసారు.

ఆ కవిత పేరు With the Yoke You Left Half-way

ఈ పై లింక్ లో ఆంగ్లంలో అనువదించిన  కవితని, తెలుగు మూలంని చూడండి. 



నువ్వు వదిలేసిన కాడితో

ఏ ఏటికి ఆఏడు చెలమలోని  నీళ్ళులాగ
అవసరాలు ఊరుతూనే ఉంటాయని
చేసిన అప్పులు వడ్డీతో కలసి
సాలుసాలుకి రెళ్ళు దుబ్బుల్లా
పెరుగుతూనే ఉంటాయని
బాధల్లన్ని మరిచిపోవాలని
అప్పుడు ఆ  మందు తాగినావు
ఏకంగా  ఇప్పుడు ఈ మందు తాగేసి
పురుగులా మాడిపోయావు

కొంగు ముడి  పడ్డ నాటినుండి
నేను సాయంగా ఉండానన్న సంగతి మరిసేసి
నిన్ను కన్నోళ్ళకి   మనం కన్నోళ్ళకి
నన్నే ఒంటి నిట్టాడిని  చేసి పోయినాక
నన్ను గాలికి  ఒగ్గేసి నువ్వు గాలిలో కల్సిపోయాక
నేను రోజూ ధైర్యం అనే మందు తాగుతూనే ఉండాను

నువ్వు ఉన్నప్పుడు సాయం చేస్తానని రాని చేతులు
నా ముందుకొచ్చాయి  లెక్కలేనన్ని
బిక్క చచ్చి బక్క చిక్కి ఉన్న శరీరాల చుట్టూ
ఆకలి చూపులు కాకుల్లా గ్రద్ధల్లా
గిరికీలు కొడుతూనే ఉండాయి
నువ్వు చస్తే మారతాయని  అనుకున్నబాధలు
పెనంలోనుండి పొయ్యిలోకి మారినాయి
నడిరేతిరి కీచురాళ్ళ రొదలా
అప్పులాళ్ళ బాధలు,పేగులు తిప్పేసే బిడ్డల
 తీరని ఆకలి కేకలు
దాయలేని యవ్వనపు ప్రాయపు పొంగులు

మోటబాయి లోని నీళ్ళు లాగానే
నీరింకిన కళ్ళల్లో భయం
దైన్యం శూన్యం తారట్లాడుతున్నాయి
మనోల్ల చూపుల్లో చుక్కలు పొడవాలంటే
మా చుట్టూ తిరిగే చూపులకి ముళ్ళ కంచెలు కొట్టి
మా చూపులకి అగ్గి రగిలించుకుని
ఆమడ దూరంలో వాళ్ళని ఆపేసి
నువ్వు వదిలేసిన కాడితో
బతుకు సేద్యం చేస్తూనే ఉండాల
బతుకుతూనే ఉండాల బతుకుతూనే ఉండాల

ఒంటి చేత్తో ఆవలి ఒడ్డుకి చేరేదాక
బతుకుతూనే ఉండాల బతుకుతూనే  ఉండాల

(ఆంద్ర జ్యోతి ఆదివారం లో ప్రచురణ  )

1, ఫిబ్రవరి 2013, శుక్రవారం

విహంగ లో .. నా కథ


తన కోసం తను బ్రతికిన క్షణాలు ఏవి తనకి మిగిలేలా ఉంచని కుటుంబం పట్ల, జీవితం పట్ల .వైరాగ్యం కల్గింది.
ఎక్కడ పని అక్కడే ! వంట ఇంట్లో శుభ్రం చేయని గిన్నెలు, బార్దేడు పొద్దెక్కినా శుభ్రం చేయని ఇల్లు, కుర్చీలో లుంగలు చుట్టి విసిరివేయబడ్డ ఉతికిన బట్టలు తనలో పెరిగిపోతున్న బద్ధకం కి గుర్తులు మాత్రమే కాదు..జీవితాన్ని జీవించడం పట్ల ఉన్న అనాసక్త కి కారణం కూడానేమో! ఎంతసేపని పుస్తకాలు చదువుతూ,టీ .వీ చూస్తూ, కాలక్షేపపు కబుర్లు చెప్పుకుంటూ బ్రతుకు బలవంతంగా ఈడుస్తూ గడపడం?
తనకి శరీరానికి కాదు అనారోగ్యం మనసుకి. కూడా..  మనసుకి ఉన్న అనారోగ్యం వదిలితే తప్ప తనలో ఉత్సాహం రాదు అనుకుంది పద్మ.
పైన  మీరు చదివిన భాగం అంతా.. ఓ..కథ లో భాగం.
ఆ కథ  పేరు "జీవితేచ్చ "  
ఈ కథ "ఫిబ్రవరి" నెల విహంగ లో ప్రచురితమైనది. ఈ లింక్ లో "జీవితేచ్చ " ఎలాంటిదో చదవండి.