27, ఫిబ్రవరి 2013, బుధవారం

నా కెరుకగాని ప్రేమబాష

నా కెరుకగాని ప్రేమబాష

రోజూ దీపం కొండెక్కి పోతుండగా
అసహనపు ఆనవాళ్ళని విదుల్చుకుంటూ
బెట్టు చేస్తున్న నిదురమ్మని 
రారమ్మని బలవంతం చేస్తూ

మూసుకునే రెప్పల మధ్యగా 
నిన్ను కనులలో నింపుకుంటూ
మనసులో  వేయినొక్కటోసారిగా తలచుకుంటాను

దూరం తగ్గిపోయే క్షణం 
ఎన్నడొస్తుందోనని నిట్టూరుస్తూ
దుప్పటి కప్పుకున్నట్లు 
మనసు కప్పుకోవడం చేతకాక ఏమో
 కన్నీటి ధార చెక్కిళ్ళని దాటి 
దయతో ప్రక్కని తడిపెళ్లింది

ఒక ఘడియ తర్వాత  ఆలాపన
నా తలని నువ్వు చెయ్యేసి నిమిరినట్లు
ఆ అనురాగపు స్పర్శ కి 
ఎక్కడో ఏటి మధ్యన పక్షి రెక్కలు
విదిల్చిన చప్పుడు నాలో
ఉలికిపడ్డాను అటునిటు పొర్లినా 
ఆగని అలజడి

అప్రయత్నంగా పలకల పెట్టె ని తెరిచాను
అక్కడ నాకోసం ఓ .. ప్రేమ సందేశం
కాచుకుని కూర్చుంది  అందులో
ఎవరూ నేర్పకుండానే 
నువ్వు నేర్చుకున్న పాఠం ఉంది
అంతకు మించిన నిజమేదో దాగుంది
ప్రకటించే బాష తెలిసి ఉంది
అంకితమిచ్చేందుకు తగిన అర్హత ఉంది
కను చెమరింతల మధ్య 
నడిరేతిరి విరిసిన పద్మంలా 
ముఖం విచ్చుకున్నట్లు
నాలో నవ జీవం తొణికిస లాడుతున్నట్లు 
నాకు నేనే  కొత్తగా

ఈ ఎడారి జీవికి  
ఒయాసిస్ వెతుక్కునే  యాతనలేదు
చీకటిని చీల్చే కిరణాలని 
ఆహ్వానించే తపనలేదు
పేగు తెంచుకు పుట్టిన బిడ్డడి అండే చాలు
అన్నివేళలా 
అమ్మయి లాలించే  చల్లని స్పర్శ చాలు

కంటి నిండుగా మది నిండగా
ఒకే ఒక్క చంద్రుడి వెన్నెల వెలుగు చాలు
మా నిఖిల చంద్రుడి అనురాగమే  చాలు

నా కెరుకగాని  ఈ ప్రేమ బాష ఇంత గొప్పదా కన్నా !


అమ్మకే  గురువై  నేర్పావా నాన్నా!?

(ప్రేమ ఎప్పుడు ప్రకటిస్తూ ఉంటేనే ఆనందం కల్గుతుంది. ప్రకటించని ప్రేమ ఎంత గొప్పదైనా నిష్ప్రయోజనమే)

నిన్నటి రాత్రి నా మానసిక స్థితి..  చిత్రంగా,  ఖచ్చితంగా అదే సమయానికి నా కొడుకు నాకు పంపిన ప్రేమ సందేశానికి ఈ స్పందన

22 వ్యాఖ్యలు:

రాజి చెప్పారు...

"ప్రేమ ఎప్పుడు ప్రకటిస్తూ ఉంటేనే ఆనందం కల్గుతుంది. ప్రకటించని ప్రేమ ఎంత గొప్పదైనా నిష్ప్రయోజనమే"

నిజమేనండీ వ్యక్తపరచని ప్రేమ ఎంత ఉన్నా లేనట్లే..
చాలా బాగా చెప్పారు..

♛ ప్రిన్స్ ♛ చెప్పారు...

చాలా బాగుంది అండి...

Padmarpita చెప్పారు...

"ప్రేమ ఎప్పుడు ప్రకటిస్తూ ఉంటేనే ఆనందం కల్గుతుంది. ప్రకటించని ప్రేమ ఎంత గొప్పదైనా నిష్ప్రయోజనమే"
Good quote...

అజ్ఞాత చెప్పారు...

good

వాసుదేవ్ చెప్పారు...

మీరెప్పుడూ ప్రేమప్రకటనలో ముందుంటారు...ఈ కవితలో ముఖ్యంగా భావాలని పేర్చినవిధానం బాగుంది.అభినందనలు

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

Beautiful poem!

Blessings my dear Nikhil :-)

భారతి చెప్పారు...

పేగు తెంచుకు పుట్టిన బిడ్డడి అండ చాలు
అన్ని వేళలా అమ్మయై లాలించే చల్లని స్పర్శ చాలు...

వనజ గారు!
ఎంత చక్కటి భావవ్యక్తీకరణ.
చాలా బాగుందండి.

జయ చెప్పారు...

వనజ గారు, ప్రతి అక్షరం మీగడ తరకలు, వెన్న ముద్దలు, తియ్యని గడ్డపెరుగంత కమ్మగా ఉందండి.

వనజవనమాలి చెప్పారు...

రాజీ గారు.. ప్రేమ ప్రకటన గూర్చి చెప్పిన మాటలు మీకు నచ్చినందుకు ధన్యవాదములు. ఎవరైనా చెప్పగల్గే నిత్య సత్యం అండీ అది. :)

ప్రిన్స్ ..బాగున్నారా? ఈ కవిత మీకు నచ్చుతుందని నాకు తెలుసు లే! :) థాంక్ యు!!

వనజవనమాలి చెప్పారు...

పద్మార్పిత గారు.. మీరు కూడా కోట్ గురించే చెపుతున్నారు. :) సంవత్సరాల నుండి మీరు వ్రాస్తున్న ఎన్నటికి తరగని సబ్జెక్ట్ ప్రేమ . ప్రకటన అత్యంత అవసరం .

మీ స్పందనకి మరీ మరీ ధన్యవాదములు.

వనజవనమాలి చెప్పారు...

కష్టే ఫలే మాస్టారూ .. ధన్యవాదములు

వనజవనమాలి చెప్పారు...

వాసుదేవ్ గారు .. మీ స్పందనకి ధన్యవాదములు

ఏ విషయం నైనా మన మనసుకి ఎలా తీసుకుంటామో దానిని బట్టే భావనలు ఉంటాయి అంటారు కదండీ! బహుశా నా కవిత్వం అంతా మనసుతో మమేకమై వ్రాసుకున్నదే!

మీ వ్యాఖ్య చాలా సంతోషం కల్గించింది

వనజవనమాలి చెప్పారు...

అవినేని భాస్కర్ .. తమ్ముడూ మరీ మరీ ధన్యవాదములు . మీ ఆశీస్సులు నిఖిల్ కి ఎప్పుడూ ఉండేవే! అందుకు ధన్యవాదములు.

వనజవనమాలి చెప్పారు...

భారతి గారు .. పిల్లలని పెద్దలు ప్రేమిస్తారు . పిల్లలు తల్లిదండ్రుల పైనా ప్రేమిస్తారు కానీ అందుకు వ్యక్తీకరణ కూడా కావాలి . పిల్లల నుండి అలాంటి వ్యక్తీకరణ వచ్చినప్పుడు తల్లిదండ్రులకి సంబరమే కదండీ!
నేను ఈ మధ్య అబ్బాయి ని బాగా మిస్ అవుతున్నాను. అందుకే ఇలాటి మనఃస్పందన .

మీకు నచ్చినందుకు ధన్యవాదములు

వనజవనమాలి చెప్పారు...

జయ గారు మీ స్పందన చాలా నచ్చింది నాకు మీ ప్రశంస అనాలి అనే కన్నా స్పందనలో మీ వ్యక్తీకరణ చాలా బాగుంది.

ప్రేమ ని వ్యకీకరించే బాష తెలిసిన నా కొడుకుని చూసి ముచ్చటపడి అల్లుకున్న స్పందన ఇది. FB లొ రోజుకీ రెండు మూడు సార్లు చాట్ చేస్తూనే ఉంటాను అయినా తనని బాగా మిస్ అవుతున్నాను


నిన్న మధ్యాహ్నం పనులు చేసుకుంటూ ఉన్నట్టుండి లేచి వెళ్ళిపోయి బుక్ పెన్ తీసుకున్నాను ఒక్క పది నిమిషాలలో వ్రాయడం అయిపోయింది

ప్రధమ శ్రోత నాకు ఇంటి పనులలో సాయం చేసే ఆమె "రమణ " అసలు చదువుకోలేదు

"ఏం చేస్తున్నారు వనజ గారు" అంది

కవిత్వం వ్రాస్తున్నా.. అన్నాను చదివి వినిపించండి అంది

పైకి చదివి వినిపించాను .. ఆఖరి లైన్ చదువుతున్నప్పటికే "రమణ" కన్నీళ్లు కార్చేస్తుంది. సరే .. ఇక నా విషయానికి వస్తే నాకే బాగా నచ్చేసింది.

ఇది ఈ కవిత్వం వెనుక కథ

మీతో ఈ విషయం పంచుకోవాలి అనిపించింది . జయ గారు మీ స్పందనకి మరీ మరీ ధన్యవాదములు

జలతారువెన్నెల చెప్పారు...

ఎంత బాగుందో!

వనజవనమాలి చెప్పారు...

Thank you very much.. "Jalataaru vennela" Sree gaaru.

Pantula gopala krishna rao చెప్పారు...

కొంచెం ఆలస్యంగా చూసేను.చాలా మంచి కవిత.ప్రేమకి వ్యక్తీకరణ చాలా ముఖ్యం.సిగ్గు వల్లో, చులకనై పోతామనో వేరే కారణం వల్లనో చాలామంది తమ ప్రేమను వ్యక్తం చేయరు.ప్రేమికులే కాదు పిల్లలూ తల్లి దండ్రులూ అయినా అంతే.ప్రేమ నిచ్చిన ప్రేమ వచ్చును అంటాడు గురజాడ.ప్రేమనివ్వడమంటే ప్రేమని వ్యక్తీకరించడమే కదా.ఈ విషయాన్ని మీరు కవితలో చెప్పిని తీరు ప్రశంసనీయంగా ఉంది.

paddu చెప్పారు...

ఆరాటపడే అమ్మ మనసుకి ,, చిన్నారి చేతి స్పర్శ మించిన బలం ఏముందండి ..

పేగు తెంచుకు పుట్టిన బిడ్డడి అండ చాలు ..
అన్ని వేళలా అమ్మఅయి లాలించే చల్లని స్పర్శ చాలు..

వనజవనమాలి చెప్పారు...

పంతుల గోపాల కృష్ణ రావు గారు మీ స్పందనకి ధన్యవాదములు

ప్రకటించే ప్రేమ మరింత ప్రేమని ప్రోది చేస్తుంది అన్నది నిజం. థాంక్స్ !!

వనజవనమాలి చెప్పారు...

పద్దు గారు మీ స్పందనకి ధన్యవాదములు .

మీరు ప్రేమించే అమ్మకి అప్పుడప్పుడు మీ ప్రేమని వ్యక్తీకరించడం మరువకండి. ఆమె కూడా ఇలా కవితలల్లుతారు . నిజమ్.

పల్లా కొండల రావు చెప్పారు...

అమ్మ ప్రేమ నిష్కల్మషమైనది. అది ప్రకటించకుండా ఉండలేదు. ప్రకటించని ప్రేమ ఎంత గొప్పదైనా నిష్ప్రయోజనమేనన్న కోట్ కూడా బాగుంది.