సాయం చేయడానికి చేతులు కావాలి..
శ్వేతసౌధం మీదగా పయనించి వచ్చిన గాలికి
ఉలికిపడి కనులు విప్పిన నవజాత శిశువు..
నా వారసుడే కాదు..
భావిభారతం కూడా..
పుట్టుకతో పౌరసత్వం వచ్చిందని మురిసే తండ్రిని
ఆరచేతిలో ఉసిరిలా అందే
పసిమి భవితకి సంతసించే తల్లిని దాటి
మమతల స్పర్శతో ముద్దాడుతున్న
నా చూపుడు వేలిని.. కొత్తగా ..
ఏర్పడిన అణుబంధం అంత బలంగా.. ఒడిసిపట్టుకుని..
తన మూలాలు వెతుకుతున్నట్టే ఉంది.
పాశ్చాత్యపు సంస్కృతి పొత్తిళ్ళలో ఉన్న వాడిని..
అమాంతం దొంగిలించుకు వచ్చి.
పల్లె తల్లి ఒడిలో లాలించాలనిపిస్తుంది..
ఊరి చివర వెలివేసినట్లున్న
విశాలమైన ఇళ్ళల్లో.. చలిమర చప్పుళ్ళలో..
పలకరించే దిక్కులేని వైనాలకి అందనీయక
కష్టం-సుఖం సవ్వడి వినిపించాలని ఉంది.
వాడికి ఊంగా ఊంగా..ఊసులతో పాటు
వాడి తండ్రికి వినిపించిన ఫూల్ కి చాహ్ కధ
పరమవీరచక్ర గాధలతో పాటు
పరాయి దేశంలో తానుననుభవించిన
ఫూల్ ఔర్ కంటే.. వాస్తవాలని..
హృదయానికి హత్తుకునేలా..చెప్పాలనిపిస్తుంది.
అరక దున్నుతూ.. చెలకలు వేస్తూ స్వేదం
విలువ తెలియచెప్పాలని ఉంది..
ప్రమాణాలకి.. కొలతలకి.. అందక
స్వేచ్చా జీవితాన్నిఅందించాలని..
నాగరిక చదువులకి అందనీయక
పల్లె కడుపులో.. పొదువుకోవాలని ఉంది.
ఆ చదువులే.. కదా ఆత్మీయ స్పర్శ కి
అంటరానితనాన్ని అపాదించాయని..
అరచి చెప్పాలని ఉంది..
వేళ మైళ్ళదూరంలో ఉన్న కన్న బిడ్డని
తెర మీద బొమ్మల్లా చూస్తూ ఉండటం,
మాట్లాడుతూ ఉండటం తప్ప
స్పర్శ సెన్సర్ ని కనిపెట్టటం తెలియని
శాస్త్రాన్ని పరిహసించాలని ఉంది..
సుక్షేత్రమైన పంట పొలాన్ని..
ఏడాదికి ఒక ఎకరా లెక్కన తెగనమ్మి
పదిలంగా పెంచిన ఒకే ఒక వృక్షం
పదిమందికి.. నీడ నిస్తుంది అనుకుంటే..
పెరటి చెట్టు వైద్యానికి పనికి రాని చందాన
విఫలమైన కోటి ఆశల కధ చెప్పాలనిఉంది..
ఒక తల్లి గుండెని.. నీరు చేసి..
ఒక తల్లి గుండెని.. బండగా మార్చి..
పరాయి క్షేత్రంలో వేసిరివేయబడ్డ విత్తులై.. ..
డాలర్ల కాపు కాసే చెట్లైతే.. పెరడే కాదు..
ఊరు ఊర్లే.. బావురుమంటున్న దృశ్యాలని..
ప్రత్యక్ష ప్రసారాలతొ .. చూపించాలనిపిస్తుంది.
నిర్మానుష్యంగా మారిన నా పల్లె నడిబొడ్డున..
జిల్లేళ్ళ వనాలు .. విస్తరిస్తున్నాయి..
జిల్లేడు దూదిపై కూడా..
పేటెంట్ హక్కుని సొంతం చేసుకున్నందుకు..
తీరికగా.. నిరసిద్దాం.
ఇప్పుడు.. నా.. వారసత్వ సంపదతో పాటు..
నా కయ్యలు.. నా పెయ్యలు.. నాక్కావాలి ..
శిధిలమైన ఇళ్ళ మొండిగోడలపై..
ప్రేమ పైకప్పులు వేయడానికి..
వట్టిపోయిన కొట్టాల మధ్య
తువ్వాయిల మెడలో..మువ్వల పట్టీలు కట్టటానికి..
నా.. వారసత్వ శిశువులు కావాలి..
అభేద్యమైన.. గాఢ అంధకార మేఘచ్చాయ నుండి..
నా జాతిని వెలుగులోకి నెట్టటానికి.. .. నాకిప్పుడు
సాయం చేయడానికి చేతులు కావాలి.. చేతులు కావాలి..
(నెలా నెలా వెన్నెల ఎక్స్ రే
వేదిక 21/12/2010)