30, డిసెంబర్ 2010, గురువారం

కావ్య పఠనం మేలు

 సిరివెన్నెల  సాహిత్యం లో  లోతులు చూడటం  నేర్చుకుంటే మనిషిగా  మనం  ఎలా  ఉండాలో తేలికగా తెలిసిపోతుంది.
 గురు శుశ్రూష చేసి జ్ఞానం ఆర్జించక్కరలేదు. పురాణ ఇతిహాసాలు  చదవక్కరలేదు..
 పుస్తకాలకి అంకితమవసరం లేదు అని.. ఒక వేదికపై ఒక సెలబ్రిటి చెపుతుంటే విని అవునా! అని ఆశ్చర్వం కల్గి   దీర్ఘంగా ఆలోచించడం వారు వ్రాసిన పాటలని అదే పనిగా వినడం అలావాటు చేసుకుని సెలబ్రిటి చెప్పిన మాటకి వ్యతిరేకంగా చేయడం మొదలెట్టాను. అంటే.. కావ్య పఠనం మొదలెట్టాను. ఎందుకంటే అందులో మాధుర్యం   చెపితే అర్ధం కాదు. కావ్యామృతం  సేవించాలన్నమాట. కొన్నాళ్ళకి  కి అది మానేసాను. ఎందుకంటే.. నాకు అవి అర్ధం కాలేదు కాబట్టి. మళ్ళీ.. పాటలే వినడం  శరణ్యం.
 మా ఇల్లు ధ్వని కాలుష్యంతో నిండిపోయేది. ఇంట్లో వాళ్ళందరికీ   చెవుల్లో.. దూదులు   పెట్టేసి వాళ్ళని విననందుకు దురదృష్ట వంతుల్ని  చేసేసి  నేను పాటల పిచ్చి దానిగా ముద్ర వేయించుకుని మరీ సాధించిన సముపార్జునం  అండీ.. ఇది కనీసం నలుగురుతో పంచుకోని బ్రతుకు ఎందుకు చెప్పండి?  అందుకే ఇలా..
సరే.. సిరివెన్నెల  గురించి   చెప్పడం  కంటే వింటే మంచిది.  ఒక సమగ్ర సాహిత్యనిధిని పరిచయం చేయక్కరలేదు కదా. ఇప్పుడు ఒక పాట.  నాకు నచ్చిన  వారి రచనలలో ఒక నూలుపోగు ని నేను (అందరికి) పరిచయమార్పణమస్తు  అని సాహితి  పూర్ణ చంద్రుడికి  వందనాలు అర్పిస్తూ కీర్తిస్తూ ఆయన కలం అపురూపంగా కీర్తించిన అపురూపమైన ఆడజన్మ గురించి, ఆ పాట గురించి..
 ఎమ్.ఎమ్.కీరవాణి.. స్వరకల్పనలో గాన గంధర్వుడు.. కే.జే.ఏసుదాస్  గళ మాధుర్యంతో   "ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి" తర్వాత అంత  స్థాయిలో వచ్చి అందరి నోళ్ళలో నలిగిన పాట.
 కార్యేషు దాసీ కరణేషు మంత్రీ..
భోజ్యేషు మాతా శయనేషు రంభ..

అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకి ప్రతిరూపం ఇల్లాలమ్మ(అపు)
మగ వాడి బ్రతుకులో సగపాలు తనదిగా..
జీవితం అంకితం చేయగా (అపు)
పసుపు తాడు ఒకటే మహా భాగ్యమై
బ్రతుకుంది పడతి పతే లోకమై
మగని మంచి కోసం పడే ఆర్తిలో సతిని మించగలరా యే  ఆప్తులు..
ఏ  పూజ చేసినా యే నోము నోచినా
ఏ స్వార్ధం లేని త్యాగం భార్యగా చూపదా ముందుగా..(అపు)
కలిమి లేములన్ని ఒకేతీరుగా
కలసి పంచుకోదా  సదా తోడుగా
కలిసిరాని కాలం  వేలేవేసినా 
 విడిచి పోనీ బంధం తనై ఉండదా
సహ ధర్మచారిణే  సరిలేని వరమని..
సత్యాన్ని కనలేనినాడు మోడుగా మిగలడా పురుషుడు (అపు)
భార్యని వీడిన  మగవాడికి వీపున చెళ్ళున చరచినట్లు లేదూ !  ఇంతి ఇంతికి  ఒక కథ.  ఎంత పంచుకున్నా అది  తరగని వ్యధ. అందుకే.. మాటలతో చెప్పలేక పై చిత్రం తో నా ఆవేదన వెల్లడిస్తున్నా.
 ఈ పాట ఎవరికైనా ఇష్టం అంటే.. నాకు కోపం. ఇంత మొత్తుకోవాలా ఇంకానా! స్త్రీ విలువ ఇంకా తెలియదా అని బాధ.
సిరివెన్నెల గారు ఇంకోటి కూడా చేరిస్తే ఇంకా బాగుండేది. ఆమాట "క్షమయా ధరిత్రి" అని
సహోదరులలరా! కోపం తెచ్చుకోకండి.  నిజం తెలుసుకోండి. ఇది విన్నపం.
గతంలో ఇలా.. చెప్పినప్పుడు  సోదరులకి కోపం వచ్చింది. అందుకే ముందస్తు విన్నపం అన్నమాట.
దేనికైనా పారదర్శకత  ఉండాలి కదా. మాటైనా పాటైనా ప్రవర్తనకైనా. అందుకే విని పిసరంత వాస్తవంలో ఉందామని.. నా తపన. అంతే!
ఈ పాట చిత్రంలో సందర్భోచిత గీతంగా వుంటుంది. వాస్తవిక ప్రపంచంలో స్త్రీ పురుషులిరివురిలో సహనవంతులు సేవాభావం భాద్యత కరుణ కల్గినవారున్నారు. కాకపొతే స్త్రీ పిసరంత ఎక్కువ. వారిని ఇంకా అలాగే ఉండాలని భావించడం కూడా అత్యాస కదా ! స్త్రీ అయినా పురుషుడైనా పవిత్రబందాన్ని  పవిత్రబంధం గానే భావిస్తే గుదిబండల్లాంటి  బ్రతుకులుండవు  కదా.!
ఈ  పాట గురించిన  మాట చూసినందులకు ధన్యవాదములు

కామెంట్‌లు లేవు: