ఆసక్తి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఆసక్తి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, ఏప్రిల్ 2018, గురువారం

కథని అర్ధం చేసుకోవడం ఎలా ?

1) కథ వ్రాసిన (వ్రాయబడిన అంటే గతంలో  చాలా ఏళ్ళ క్రితం జరిగిన విషయాలని జ్ఞాపకానికి తెచ్చుకుని వ్రాసిన  ) కాలాన్ని,ఆ నాటి సామాజిక, ఆర్ధిక, రాజకీయాలని దృష్టిలో ఉంచుకుని కథని చదవడానికి పూనుకోవాలి. 

2) కథల్లో నవరసాలలో దేనికో ఒక దానికి ప్రాధాన్యత ఉంటుంది. రచయిత కోణంలోనే పరకాయ ప్రవేశం చేసి  అర్ధం చేసుకోమని ఎవరూ చెప్పరు. పాఠకులు  తమ అభిరుచి మేరకే  తమకున్న  అవగాహన మేరకే కథని అర్ధం చేసుకుంటారు. అంటే పాఠకుల  ఆలోచన, వికాస పరిధిని బట్టీ ఆ సూక్ష్మ గ్రాహ్యత లభిస్తుంది. ఉదాహరణకి ప్రపంచ పోకడలు తెలియని  పల్లెటూరి  పాఠకులకి అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్టు ఉండాలి.  వారికి ఎక్కువ సమాజ రీతికి అనుగుణంగానే కథలుండాలి  అవే నచ్చుతాయి వారికి.  అదే పల్లెటూరులో ఉన్నా ఎక్కువ  చదువుకుని అనేక  పుస్తకాలు చదివి, లేదా వివిధ దేశాలు పర్యటించడం వల్ల  విస్తారమైన లోకజ్ఞానం ఉన్నవారికి వాస్తవ జీవితాల్లో ఉన్న సంక్లిష్టత తెలిసినవారికి కథ ఎలా ఉన్నా  అర్ధంచేసుకోగలరు. కథా వస్తువు విభిన్నంగా ఉండి (సాంఘిక నియమాలని దాటి నైతిక విలువలు లోపించి,నీతి బాహ్యమైన పనులు చేసే పాత్రలున్న కథలు  ) వ్యక్తి పరిధిని దాటి సమాజ (అనేక సమూహాల)  పరిధి లోకి వెళ్ళినప్పుడు వ్యక్తి సంస్కారం (సహానుభూతి చెందడం ) ఆ కథని చదవడంలో తప్పక అవసరం అవుతుంది. జీవితాన్ని వాస్తవిక కోణంలో అర్ధం చేసుకుని యధాతదంగా తీసుకునే వారి అవగాహనకి, అవి లోపించిన వారికి ఉన్న తేడా కూడా సంస్కారమే అనుకుంటాను నేను.

(ఉదాహరణ కి చలం గారి కథలు అందరికి నచ్చవు ఆకోణంలో ఆలోచించాలి ) (కొందరికి క్రైమ్,హార్రర్,శృంగార కథలు నచ్చవు) పాఠకులలో సాధారణ పాఠకులు, రచనలు చేసే పాఠకులు, విమర్శకులు అందరూ ఉంటారు. ఎవరి దృష్టి వారిది. ఎవరైనా కథ బాగోలేదని కితాబులివ్వలేదని బెంగ పడాల్సిన పనిలేదు. ఒక కథ మంచి కథో కాదో తెలియాలంటే కనీసం వో యాబై యేళ్ళు కాలానికి తట్టుకుని నిలబడితే ..అది మంచి కథ అవుతుందని కథల వుత్శవంలో పెద్దలు చెపితే విని .. సంతోషించాను. కాలమే కదా నిగ్గు తేల్చేది అని.

ఇకపోతే నేనూ పాఠకులకి అర్ధం కాని కథ వ్రాసానని "మొదటి మరణం " ప్రచురితమైనాక తెలిసింది. చాలామంది క్లారిటీ లోపించింది అన్నారు. మరికొందరు పాఠకులు బాగా అర్ధం చేసుకున్నారు. అప్పుడు నేను పెట్టిన కథ పేరుకి, కథా ప్రారంభానికి, ముగింపుకి సమన్వయం కుదిరిందని అనిపించింది. ఒక కథని ప్రచురించే ముందు ఆ పత్రిక ఎడిటర్స్ ఆ మాత్రం జాగ్రత్త తీసుకుంటారు కదా ! అందుకే కథలని అర్ధం చేసుకునేవాల్లకి అర్ధం చేసుకున్నంత. సహ బ్లాగర్ నేను వ్రాసిన కథపై .ఇలా స్పందించారు.. మంజు యనమదల (కబుర్లు కాకరకాయలు బ్లాగు )

కథను అర్దం చేసుకోవడమిలా అనిపిస్తుంది.ఈ రోజు మనం పత్రిక ఆదివారం సంచిక మకుటంలో ప్రచురితమైన వనజ గారి కథ “మొదటి మరణం” గురించి..
" మొదటి మరణం .. ఇదేంటి !? మొదటి మరణం రెండో మరణం చివరి మరణం అంటూ వుంటాయా? కథ టైటిల్ ఇలా వుందేమిటని ఆలోచిస్తూ వున్నాను. కథని మరొకసారి చదివాను. రెండు క్లూ లు దొరికాయి. హేమ వివాహం తర్వాత పేరు మారిన వసంత అని అన్పించింది. బట్టలుతికే లక్షయ్య కూడా వురి వేసుకున్న హేమ కాళ్ళు యెత్తి పట్టుకుని వూపిరి వున్నట్టా లేనట్టా అని కనీళ్ళతో చూస్తుంటాడు. ఇక ఆఖరిగా పెళ్ళి పోటోలు చూస్తున్న వసంత దగ్గరకొచ్చి కూర్చుని మీ పెళ్ళి ఫోటోలు చూసుకుంటున్నావా.. అంటాడు కొడుకు. చనిపోయిందేమో అనుకుంటున్న హేమే వసంత అని క్షణం సేపు రిలీఫ్ కల్గినా అంతలోనే బోలెడంత దిగులు చుట్టేసింది. నిత్య గాయాలతో రోజుకో మరణాన్ని, క్షణానికో మరణాన్ని అనుభవించే స్రీలకి మొదటి,రెండు,వందల మరణాలు వుంటాయని సూక్ష్మంగా  చెప్పారు  వనజ గారు. మంచి కథ. వ్రాస్తున్నకొద్దీ పదునుదేలుతున్న మీ కలానికి అభినందనలు. మీరు మరిన్ని కధలు వ్రాయాలని కోరుకుంటూ, స్తీ సమస్యలను చెప్పడానికి మీ ఆలోచనలు వెన్నుదన్నుగా వుండాలని కోరుకుంటూ అభినందనలు."
అని వ్రాసారు . 

కథని అర్ధం చేసుకున్న మంజు యనమదల గారికి  ధన్యవాదాలు.

ఈ టపా వుద్దేశ్యం కథ  అర్ధం కాని వారికి నా మనసులో మాట చెప్పుకున్నాను అంతే ! 

18, డిసెంబర్ 2017, సోమవారం

అడవి పూవందం

ఈ అడవి పూవందం చూడండీ ! 
అచ్చు మన గోగు పువ్వు లా గా ఉంది కానీ గోగు పువ్వు మాత్రం కాదు . బ్రెజిల్ లో  బొటానిక్ గార్డెన్లో ఉంది . అలాగే అక్కడక్కడా ఆఫ్రికా అడవుల్లో కనబడుతుందని చదివాను . గూగుల్ సెర్చింగ్ లో ఈ అందం ఆకర్షించి వివరాల కోసం ప్రయత్నిస్తే చాలా కష్టం మీద వివరాలు దొరికాయి. ఆ వివరాలు చిత్రం క్రింద పొందుపరిచాను. .. చూడండి . 


Turnera subulata Sm.
Common name
English: White buttercup
Classification
Kingdom: Plantae (2505)
  Phylum: Magnoliophyta (2404)
    Class: Magnoliopsida (2036)
      Order: Malpighiales (93)
        Family: Passifloraceae (10(family description)
          Genus: Turnera (3)
           Epithet: subulata Sm. (3)

subulata => awl-shaped
Characteristics
Climate: tropical
Habit: herb
Flower colour: yellow

Flower: Botanical Garden, Brasilia, DF, Brazil; 3/2012 © (కాపీ రైట్ ఉన్న చిత్రం ఇది ) 

Pinterest సౌజన్యంతో .. ఈ చిత్రం. 



23, ఆగస్టు 2017, బుధవారం

అరె కొమ్మపై దీపం





ఏ విషయం పైన అయినా ఆసక్తి కల్గితే దాని అంతు చూడాల్సిందే అనే తత్త్వం నాది. తవ్వా ఓబుల్ రెడ్డి గారి "సూతకం"  కథలో ఒక విషయం  చదివాను  ఈ విషయం ఆరె కొమ్మని చుట్టి దానిపై దీపారాధన చేయడం  అని . 

శుభ కార్యం జరుపుకునేటప్పుడు ఆరె కొమ్మని చుట్ట జుట్టి దానిపై మట్టి ప్రమిద పెట్టి దీపారాధన చేస్తారట. అలాగే దసరా పండుగ రోజు శమీ వృక్షంతో పాటు తెల్ల ఆరె చెట్టుని పూజిస్తారట. అసలు ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయోనని వెతికితే  . గూగుల్ నాకు తెలుపు,ఎరుపు,పసుపు,గులాబీ ఇన్ని పూలు చూపింది . నల్లమల కొండలలో ఇవి బాగా ఉంటాయట. 

అయితే ఈ విషయాన్ని ఎవరూ చెప్పలేకపోయారు. ఈ మధ్య రచయిత కడప ఇన్ఫో సైట్ ని చక్కగా నిర్వహిస్తున్న తవ్వా ఓబులరెడ్డి గారిని వివరణ అడిగాను . వారు నేను పైన పోస్ట్ చేసిన చిత్రాన్ని , ఆ చెట్టు చిత్రాన్ని కూడా పంపించారు ..అలాగే వారు ఇచ్చిన వివరణ ఇది .. ఇదే చేత్తో  సూతకం కథ  లింక్ కూడా ఇస్తున్నాను.ఆసక్తి ఉంటె చదివేయండి మరి.

"అరె చెట్టు అని ఉంటుంది  దానికొమ్మతో దీపపు సమ్మె చుట్టి దానిపై ప్రమిదను వెలిగించి పెళ్ళికి ముందు జరిగే దాసంగం లేదా దాసర్లు కార్యాన్ని చేస్తారు. రాయలసీమ ఈ ఆచారం ఉంది." ఇదే అరె చెట్టు ..దీనిని శ్వేత కాంచనం అని కూడా అంటారు అని చెప్పారు.  




12, నవంబర్ 2015, గురువారం

ORACLE IN MEMORY

అమ్మ అడుగుజాడలలో అబ్బాయి .  సంతోషమే కదండీ ! మా అబ్బాయి ... "నిఖిల్ "  ఒక బ్లాగ్ వ్రాసుకుంటున్నాడు.  ఆ బ్లాగ్ పేరు : ORACLE IN MEMORY.....

ఇదిగోండి ... ఈలింక్  లో ... ఆ బ్లాగ్ .

ఈ బ్లాగ్ ని సందర్శించండి. మీ విలువైన సూచనలు,అభిప్రాయాలని .. "నిఖిల్ " కి అందించగలరు.


హృదయపూర్వక అభినందనలు ... చిన్నీ బంగారం.

"మనస్సాకాశంలో భావాలు పక్షుల్లా ఎగిరిపోతుంటాయి 
ఆలోచనలటెడారిలో వాక్యం ఎండమావిలా తోస్తుంది
ఎప్పుడో ఒకప్పుడు ... ఆలోచనలకి  అక్షరాలలో 
ఒక రూపం ఏర్పడుతుంది  
ఎంతెత్తుకి  ఎదిగినా గుమ్మంలోనుంచి  
తలొంచి లోనికి రమ్మంటుంది  అక్షర కుటీరం" 
ఈ అక్షర కుటీరంలో ... నీ ఆలోచనలన్నీ పరిఢవిల్లి  ఫలవంతం కావాలని మనసారా దీవిస్తూ ...  ప్రేమతో ...  "అమ్మ"




ఈలింక్ లో

17, జూన్ 2014, మంగళవారం

మతం మనిషికి అవసరమా !?.




మతం మనిషికి అవసరమా !?. 

ఆది మానవుడిది ఏ మతం ? పరిణామ క్రమంలో మనిషి మనుగడ మతంతోనే ముడిపడి బలపడిందా !? 

మతం మనిషికి మానసిక అవసరమా !? లేక మతమనే అవసరాన్ని సృష్టించుకున్నామా ? 

 ఇటు శ్రీలంకలో అతివాద బౌద్ధ  మతస్తులు మైనారిటీ ముస్లిం మతస్తులని ఊచకోత కోసి సింహళీయులు తమిళలపై జరిగిపిన హింసని గుర్తుకు తెస్తున్నాయి . 

అటు ఇరాక్ లో తెగలమధ్య విద్వేషాలతో లాభ పడుతున్నది ఇంకొకరు 

ఇక మనదేశంలో ముజఫర్ నగర్ లో జరుగుతున్న హింసాకాండ 

ఎక్కడ చూసినా బలవంతుల చేతిలో బలహీనుల అణచివేత

మతం పేరిట జరుగుతున్న మారణకాండ 

అన్ని దేశాలలోనూ రాజకీయ నాయకుల ఓట్ల బ్యాంకు కి మతం అవసరవతున్నప్పుడూ

మనిషి మనిషిగా బ్రతకలేకుండా మతం ముసుగులో ముఖాలు దాచుకుంటూ తమని తాము మభ్య పెట్టుకుంటూ విద్వేషాల మధ్య బతుకు దుర్భరం అవుతున్నప్పుడూ మతం అవసరమా అనిపిస్తుంది 

ధర్మం అనుకుంటూ  కొందరి విద్వేషాలకి అడ్డుకట్ట వేయలేక ఉదారవాదంతో  బ్రతికేస్తున్న హిందువులది  మతం కాదా ? ఇలా ఎన్నో ప్రశ్నలుదయిస్తున్నాయి ? 

మతం గీతం మనకొద్దు మానవత్వమే మా మతం . అందరికి అదే సమ్మతం అంటూ పసి పిల్లలకి భోధించినంత సులభం కాదేమో కదా ! 

మతం గూర్చి మనకి ఎన్నో ఆసక్తి కల్గించే విషయాలు దారావాహికంగా వచ్చే వ్యాసాలలో నేను కొన్ని చదివాను .. వీలయితే మీరు చదివి చూడండి 

మతం పునాదులు  గురించి డా|| ఆర్కే గారి వ్యాసం లోని ఒక భాగాన్ని చూడండి ప్రజాసాహితి మే నెల సంచికలో

ప్రజా సాహితి కినిగే లో కూడా  లభ్యమవుతుంది 

24, అక్టోబర్ 2013, గురువారం

సోలః సింగార్


Mohra  చిత్రంలో  నాకిష్టమైన  "Na  kajre ki dhar Na  Mothian  ki  haar  "   పాట  వింటున్నాను .

Singaar tera yovan, yovan hi tera gehna అన్న సాహిత్యం వినగానే సోలః  సింగార్  గుర్తుకు వచ్చింది 

అసలు సోలః  సింగార్ ఏమిటీ అని  చూస్తే  స్త్రీల  అలంకరణలో భాగాలైన ఇవన్నీ గుర్తుకు వచ్చాయి . కొన్ని తెలుసుకోవడానికి  గూగులమ్మ సహాయం చేసింది .

మన భారతీయ సంప్రదాయంలో వివాహానికి ఎంతో ప్రాధాన్యత ఉంది . వివాహ సమయానికి ముందు వివాహ సమయంలోను , వివాహం తర్వాత అనేక ఆనవాయితీ లు ఉన్నాయి .

వివాహ  సమయంలో  ఎక్కువగా అందరి దృష్టి  వధువు పైనే ఉంటుంది. వధువు యొక్క రూపురేఖలుతో పాటు ఆమె ధరించిన వస్త్రాలు, ఆభరణాలు , అలంకారం పైనే ఆసక్తి చూపుతారు .

వధువు అలంకరణ  పూర్తీగా ఉండాలంటే  పదహారు విధాలుగా ఉండాలని పూర్వీకుల కాలం నుండి నిర్ణయించారు . ఉత్తర,  దక్షిణ భారత దేశ వివాహ పద్దతులలో కొద్దిపాటి తేడాలున్నప్పటికీ వధువు అలంకరణ అంతా  అన్నిచోట్లా ఒకే విధంగా ఉంటుంది . "సోలః సింగార్" గా అభివర్ణించే ఈ అలంకరణ ఇలా ఉంటుంది .

ముందుగా వస్త్ర సాంప్రదాయం . మన దక్షిణాది ప్రాంతంలో పట్టుచీర జాకెట్  ధరిస్తారు. ఉత్తరాదిన లేహంగ చోళీ ధరించి  అందంగా డిజైన్ చేయబడ్డ  మేలిముసుగు ని కప్పుతారు.

వధువు ముఖం చూడగానే మనకి కనిపించే ముఖ్యమైన అలంకారం నుదుటన ధరించే తిలకం . మన ప్రాంతాలలో "కళ్యాణ తిలకం " ని దిద్దుతారు . ఉత్తర భారతంలో "బింది" లేదా బిందియా అని వ్యవహరిస్తూ ఉంటారు . ఈ బిందీ ఎరుపు రంగులో ఉండి శుభ చిహ్నంగా ఉంటుంది.

ఇక మూడవది కన్నుల కాటుక "కాజల్ " అని వ్యవహరిస్తారు . కళ్ళకి కాటుక ఇచ్చే అందం ఇంత అని చెప్పనలవి కాదు.  ఇప్పుడంటే కాటుక పెట్టుకోకపోవడం ప్యాషన్ , అయినప్పటికీ మేకప్ లో భాగంగా "ఐ "లైనర్ వాడటం మామూలైపోయింది . అలాగే కనురెప్పలు మరింత నల్లగా,దట్టంగా ,పొడవుగా కనబడటానికి "ఐ లాష్ " ఉపయోగించడం చేస్తున్నారు     కాటుకని స్త్రీల అలంకారంలో చాలా ముఖ్యం అని ఒప్పుకోవాల్సిందే మరి .

ఇక నాలుగవది .. ముక్కెర .  స్త్రీ జీవితంలో వివాహం తర్వాత ధరించే ముఖ్య చిహ్నం .  సంప్రదాయ ముక్కెర ముక్కు  నుండి   రింగుల లింక్ ల ద్వారా చెవి వరకు సాగుతూ  ఉంటుంది . . ఇప్పటి తరం అయితే వారి వారి అబిరుచిని బట్టి ముక్కెరని , లేదా పుడకని ధరిస్తున్నారు .

ఇక ఐదవ అలంకారం బంగారు ఆభరణం  "పాపిట బిళ్ళ " ఉత్తర భారతంలో ఈ ఆభరణం ని "మాంగ్ టిక్కా"    గా వ్యవహరిస్తారు . జుట్టుని రెండు భాగాలుగా విడదీసిన నిలువు పాపిడి పొడవునా నుదుటిపై వ్రేలాడుతూ వధువుకి వింత శోభని కల్గించే అలంకారం ఇది .

ఆరవది కర్ణాభరణం.... వ్రేలాడే జుంకీలు ధరిస్తారు .

.ఏడవది "హారం" మెడకి ధరించే బంగారు ఆభరణం ఇది . ఇది చాలా ప్రత్యేకంగా తయారుచేయించుకుంటారు .

 ఎనిమిది ..  గాజులు ..  మన సంప్రదాయంలో కుడి చేతికి 21 గాజులు,ఎడమ చేతికి 19 గాజులు ధరిస్తారు . వధువు ధరించే గాజులు రంగు రంగుల  మట్టి, మెటల్  గాజులతో పాటు బంగారు గాజులు తప్పనిసరిగా ధరిస్తారు .  " "చుడియాన్"  గా వ్యవహరించే  ఈ గాజులు సౌభాగ్యానికి చిహ్నంగా భావిస్తారు .

తొమ్మిదవ  అలంకారం " బాజు బాండ్ "  అంటారు . మన వాళ్ళు  'అరవంకీ" అని అంటారు. లేదా "భుజ కీర్తులు" అని కూడా అంటారు .

పదవది..  అంగుళీయకాలు  లేదా  వేలి ఉంగరాలు .  విడి విడిగా అన్ని వ్రేళ్ళకి ధరించడం  లేదా  అన్ని వ్రేళ్ళకి ధరించిన ఉంగరాల నుండి గొలుసుల ద్వారా  ముంజేతి వరకు  సాగి బ్రాస్లెట్ లా అలంకరించుకునే ఆభరణం .. దీనిని "అరసి" గా వ్యవహరిస్తారు .

పదకొండు  మెహందీ ..  ఎండిన గోరింట పొడిలో   నిమ్మ పులుసుని  చేర్చి వధువు కాళ్ళకి, చేతులకి చక్కని డిజైన్స్ తో  గోరింటని ఎర్రగా పూయిస్తారు.  ఈ అలంకరణ పూర్తయిన తర్వాతనే మిగతా అలంకరణ చేస్తారు . మన ప్రాంతంలో   అదివరకు   పారాణి  పెట్టి వారు. ఇప్పుడంతా మెహందీ డిజైన్స్ సాధారణం అయిపోయింది  .

పన్నెండవది.. నడుమకి ధరించే ఆభరణం .. "వడ్డాణం"

.పదమూదవది. కేశాలంకరణ.    అభ్యంగ స్నానంచేయించి  సాంబ్రాణి తో ఆరబెట్టి  వింత పరిమాళాలని వెదజల్లే కేశాలని అందంగా ముడి గా అమర్చి  ఆ ముడిని పూలతోను, ఆభరణాలతోనూ అలంకరింపజేస్తారు. మన ప్రాంతంలో "పూల జడ " చాలా ఫేమస్ . ఇప్పుడు ముత్యాల జడలు , బంగారు జడలు కూడా చోటు చేసుకుంటున్నాయి .

 పద్నాలుగవది .. కాళ్ళకి ధరించే కడియాలు , లేదా "పాయల్ " మువ్వల పట్టీలు . వధువు నడుస్తున్నప్పుడు చిరు ధ్వనులు చేస్తూ శుభసూచకంగా నిలుస్తాయి.

పదిహేనవది   తాంబూల సేవనం చేసి .. పరిమళద్రవ్యంని జల్లుకుని సువాసనలు చిందిస్తూ ఉంటారు .

పదహారవది ... వివాహానికి ముందు  బుగ్గన చుక్క  వివాహం తర్వాత సిందూర్, మట్టెలు  ధరించడం .ఆనవాయితీ

ఈ పదహారు అలంకరణలు (సోలః సింగార్ ) చేసుకున్న మన భారతీయ స్త్రీ  సౌభాగ్యవతిగా, ఇంటికి దీపంలా కళ కళ లాడుతూ ఉంటారు .



ఇదండీ .. సోలః  సింగార్ . కొన్ని తెలిసిన సంగతులు ,కొన్ని తెలియని సంగతులు ఆసక్తిగా తెలుసుకుని ఇలా ఒక పోస్ట్ వ్రాసేశాను . :)



12, జూన్ 2013, బుధవారం

"బ్లాగ్ కథలు - సేకరణ "

బ్లాగ్ మిత్రులకి ఒక ఆత్మీయ సందేశం .

 ఇప్పుడిప్పుడే క్రొత్తగా కలం పట్టారా?  వ్రాయాలనే ఉత్సాహం మీలో మెండుగా ఉందా? మరయితే బాగా వ్రాసేయండి .మేము బాగానే వ్రాస్తున్నాం .మా బ్లాగ్ ని ఎవరు చూడటం లేదు. మా వ్రాతలు ఎవరికీ నచ్చడం లేదా అనే అసంతృప్తి మీలో పేరుకుపోతే దానిని  ఇక ఇప్పుడు తుడిచి పెట్టేయండి

మన భావ ప్రకటనకి వేదిక మన బ్లాగ్. అందులో మీరు కూడా కథలు   వ్రాసే వుంటారు . కథ కాని కథలు చెప్పే ఉంటారు. మీరు మంచి కథకులు అనే విశ్వాసం మీకు ఉంటే  మీరు బాగా వ్రాసాను అనుకున్న కథలని  . ఇప్పటికే ఆ  కథ బ్లాగ్ లో ప్రచురింపబడి  ఉంటే . వెంటనే ఆ కథ యొక్క లింక్ ని  ఈ పొస్ట్ లో వ్యాఖ్య రూపంలో   జతపరచ వచ్చును .సులభంగా మీ కథలని ఎక్కువ మంది చదివే ఒక చక్కని అవకాశం ఇది

  మీరు వ్రాసిన చక్కని కథలని చదివి "ఆహా బ్లాగ్ లలో ఇంత మంచి కథలు ఉన్నాయా .. అని ఆశ్చర్య పోయేటట్లు చేద్దాం . అసలు మన బ్లాగ్ లు ఎందులో తక్కువ చెప్పండి ..?



ఇలా మన కథలని తెలుగు ప్రపంచానికి చేరువ చేద్దాం ..

వెంటనే మీ కథల లింక్ లని పంపండి  చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆహ్వానితులే!

"బ్లాగ్ కథలు  - సేకరణ  " కోసం ఏమైనా సందేహాలు ఉంటె ఈ మెయిల్ ఐ డి ని సంప్రదించండి

 blaagkathalu@gmail.com

7, జూన్ 2013, శుక్రవారం

"బ్లాగ్ కథలు" గురించి ఒక ఆలోచన

బ్ల్లాగ్ మిత్రులకి నమస్తే ! అందరూ బావున్నారా అండీ !?

అడివరకటి లా రోజూ పొస్ట్ వ్రాయాలనే ఉత్సాహం తగ్గక పోయినా ..ఓ ..నిరాసక్తత  అలముకుంది.   అందుకని  ఎక్కువ బ్లాగులు చదివే  పనిలోనే  ఉన్నాను.

ఏదైనా తక్కువ వ్రాసే పని లోనే ఉన్నాను కదా! !

ముఖ్యంగా నేను వ్రాసిన పోస్ట్ లలో నేను  వ్యాసాలూ మాత్రమే చక్కగా వ్రాయగల్గాను. ఒక కథ, లేదా కవిత తో  అందరిని మెప్పించడం కూడా చాలా కష్టం కూడా . కానీ నేను కథలు వ్రాయడానికే ఎక్కువ ఆసక్తిగా ఉన్నాను.

నేను వ్రాసిన కథలు ఏ పత్రికలకో పంపి ఒక అర్ధ సంవత్సరం పాటు ఎదురుచూస్తూ  అసహనంగా ఉండటం నా వల్ల  కాదు. అందుకే వ్రాసిన వెంటనే ఠపీ మని బ్లాగ్ లో పోస్ట్ చేస్తున్నాను .

ఆ కథలపై స్పందన సరిగా రాకున్నా సరే  .. ఏదో నా తృప్తి  :)

ఈ వారంలో ఒక చిత్రమైన సంగతి గమనించాను . " రాయికి నోరొస్తే !? " కథ పోస్ట్ చేసిన తర్వాత  నాలుగు రోజులకి ఈ రోజు గమనిస్తే .. ఆ కథ కి 1549  వీక్షణలు వచ్చాయి

అలాగే అప్పుడెప్పుడో వ్రాసిన కథ "జాతర " కి 831 వీక్షణలు ఉన్నాయి  ఈ కథని Ashburn Virginia  లో రోజు ఒకరు చదువుతున్నట్లు గమనించాను

బ్లాగులలో వ్రాసిన కథలకి ఎవరు ఎప్పుడూ  వారి వారి కథలకి లభించిన  స్పందనలని చెప్పినట్లు నేను గమనించలేదు

ఈ బ్లాగ్ లో ఉన్న కథలని చాలా మంది చదువుతున్నట్లు నేను గమనిస్తున్నాను . కథ గ్రూప్ లో కూడా బ్లాగ్ కథలని పరిచయం చేస్తున్నారు

నాకు ఒక ఆలోచన తోస్తుంది . ఈ బ్లాగ్ లలో ఈ 2013 లో వ్రాసిన కథలలో ఒక పది లేదా పదిహేను కథలని  ఉత్తమమైనవి ఎంపిక చేయించి "బ్లాగ్ కథలు " అనే కథా సంపుటి వేయిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వస్తుంది

 ఈ ఆలోచన ఎలా ఉంది అంటారు !? ఆసక్తి కల్గిన వారందరూ ఒకసారి కూడి సమాలోచన చేద్దాం .

పత్రికల వారికి పంపి ప్రచురింప బడలేదు ఆన్న బాధ ని ప్రక్కకి పెట్టేసి మన మన బ్లాగ్ ల లోనే కథలు వ్రాసుకుందాం . ఔత్సాహిక రచయితలూ అందరూ .. మంచి మంచి ఇతివృత్తాలతో కథ వ్రాయడం మొదలెట్టండి .

అవకాశాన్ని బట్టి అచ్చు లోనూ ..లేదా డిజిటల్ ప్రచురణ లోను "బాగు కథలు " ని  పరిచయం చేద్దాం

నా ఈ ఆలోచన చెప్పగానే ఓ.. సాహితీ సంస్థ  వారు ఉత్తమ కథలకి మూడింటికి బహుమతులు ఇద్దాం .అని సంతోషంగా ప్రకటించేశారు

ఇంతకూ ముందు "కె ఎన్ మల్లీశ్వరి గారి బ్లాగ్ కథ ల సంపుటి " అలాగే కల్పన రెంటాల గారు  బ్లాగ్ లో సీరియల్ గా వ్రాసిన  "తన్హాయి " నవలగా రావడం చూసాం కదా!

వర్ధమాన రచయిత,రచయిత్రులందరూ  కలసి మనం  కూడా ఒక ప్రయోగం చేద్దాం .. ! పోయేది ఏముంది .. ఒక ప్రయత్నం విజయవంతం లేదా అపజయం .. అంతే కదా !

 ఆసక్తి కల్గిన వారు మీ మీ స్పందనల్ని వ్యాఖ్య ల రూపంలో తెలియజేయండి..సూచనలకి ఆహ్వానం పలుకుతూ


30, నవంబర్ 2012, శుక్రవారం

అంతర్ పట్టు ..

అంతర్ పట్టు .. ఈ పదం సంస్కృత పదం అని విన్నాను.

వధూవరుల మధ్య తెర  పట్టడం అనే సంప్రదాయం మన హిందూ సంప్ర దాయంలో ఉంది కదా!

మన తెలుగు వారి పెళ్ళిళ్ళలో జీల కర్ర బెల్లం పెట్టె ముందు వదూవరుల మధ్య తెర పట్టుకుంటారు.ఆ పద్దతిని తెరసెల్లా  అని అంటారట.



ఈ మధ్య తెరసెల్లాని ని  కూడా అందంగా అలంకరించి వాడుతున్నారు. మా పెళ్లి అప్పుడైతే కొత్త దుప్పటి పెట్టుకున్నట్లు  గుర్తు లేదా..గోధుమ రంగు పట్టు పంచని తెరసెల్ల గా పట్టుకుంటారు.

ఇప్పుడు జరుగుతున్న  పెళ్ళిళ్ళలో సంప్రదాయం కూడా హంగు ఆర్భాటపు  రంగులద్దుకుని.. తళ తళ మెరిసిపోతుంది.
అందులో భాగంగానే  నాకు చేతికి పని బడింది.

అదేమంటే .. తెర సెల్లా ని ..కలశం డిజైన్ వేసి ఎంబ్రాయిడరీ చేయడం.

సరే ..పనిలో క్రొత్తదనం బావుంది..అని కలశం డిజైన్ చేసి .. ఎంబ్రాయిడరీ  చేయించాను.

ఈ డిజైన్ అలా చేసినవే.. 2.50 మీటర్ల తెరసెల్లా  కి ఉపయోగించిన మెటీరియల్ ,ఎంబ్రాయిడరీ .తెరసెల్లా  చుట్టూర  3 వరుసల లేస్ మొత్తం విలువ  దరిదాపుగా 4,000 రూపాయలు అయింది.

ఇప్పుడు ఈ తెరసెల్లా   డిజైన్ అందరి కంట పడి.. అలరిచనుంది.  మనదేశంలో ఇతరప్రాంతాలలో ,విదేశాలలో అంతర్పట్టుని  కళాత్మకంగా డిజైన్ చేసి వాడుతున్నారు. ఇప్పుడు మా పట్టణం లో కూడా ఉంది.

ఇదిగోండి.. నేను డిజైన్ చేసిన "అంతర్పట్టు"

12, జులై 2012, గురువారం

నచ్చిన అంశం

మనం ప్రతి నిత్యం ఎన్నో విషయాలని ప్రత్యక్షంగా చూసి,చదివి,విని,స్వయంగా చేయడం ద్వారా చాలా విషయాలు తెలుసుకుంటాము.

ఈ మధ్య కాలంలో నేను చదవడం ద్వారా మంచి విషయం తెలుసుకున్నాను ఈ విషయం చూడండి ..
తల్లి -తండ్రి మధ్య ఉన్న వ్యత్యాసం. అలాగే విధ్యార్ధులతో గురువుకి ఉన్న అనుబందాన్ని...ఎంత బాగా వివరించి చెప్పారో!

చదవడం పట్ల ఉన్న ఆసక్తితో.. నేను ప్రతి నిత్యం ఇలాటి విషయాలు చదివేటప్పుడు అల్లా.. మా అమ్మ బాగా గుర్తుకు వస్తూ ఉంటారు. .

అమ్మ ఇచ్చిన కాఫీ త్రాగుతూ.. దొరికిన పాత పేపరో, (సరి క్రొత్త పేపర్ ఉండేది కాదు. రెండు మూడు రోజుల నాటి పేపర్ ని మా పెదనాన్న గారిని అడిగి తెచ్చుకుని చదువుకునేవాళ్ళం) లేదా ఏ వార పత్రికనో తిరగేస్తూ ఉంటే..ఆ కాఫీ చల్లారి పోయేది. అలాగే అన్నం తింటూ చదవడం మొదలెట్టాను అంటే.. చేయి ఎండి పోయి..అన్నం ఆరిపోయి..అలా కెలుకుతూనే ఉండిపోయే దాన్ని. అప్పుడు అమ్మ బాగా తిట్టేది. పెంట కుప్పలో కాగితాలు కూడా వెతుక్కోచ్చుకుని చదువుతావు అని. అలా చదివే అలవాటు మూలంగానే కాస్తంత జ్ఞానం నేర్చుకున్నాం. .. అని ఇప్పుడు అనుకుంటాను.

ఈ నాటి యువత కి ఈ అలవాటు లేనేలేదు. మొబైల్ పోన్ లలో ఇంటర్నెట్ కనెక్షన్ లభ్యం అవడం మొదలెట్టాక పేస్ బుక్ లో చాటింగ్..లో తలమునకలై ..తల్లిదండ్రులు పలకరిస్తే చాలు విసుక్కోవడం అసహనం ప్రదర్శించడం చేస్తున్నారు. అది ఎంత వరకు సమంజసమో ఆలోచించుకుంటే మంచిది.

విపరీతమైన వత్తిడితో కూడిన చదువులు చదువుతున్నారని..పిల్లలకి చిన్న పాటి పని కూడా చెప్పకుండాను ,ఇంకా చెప్పాలంటే వారికి కావలసిన అవసరాలతో పాటు.. వారు కోరిన అన్ని గొంతెమ్మ కోర్కెలని తీరుస్తున్న కుటుంబ ఆర్ధిక పరస్థితి ఏమిటో కూడా ఆలోచించడం లేదు కూడా అనిపించింది.

అలాగే నేను చదివిన ఒక మంచి వాక్యం..మన బ్లాగ్ ల లోనే చదివాను.. నాకు చాలా బాగా నచ్చింది కూడా.
ఆ వాక్యం ఏమిటో..మీరే చూడండి.

"బాహాటంగా చెయ్యలేని పనిని రహస్యంగా కూడ చెయ్యకూడదు.."

యువత కూడా ఈ విషయాన్ని అర్ధం చేసుకుంటే బాగుండును..కదా!! ఇలాటి విషయాలని ఉత్తరాలు వ్రాసే కాలంలో చక్కగా ఫ్రెండ్స్ తో షేర్ చేసుకునే దాన్ని. ఇప్పుడు కూడా వ్రాస్తాను అనుకోండి. ఇక్కడ కూడా ఇలా వ్రాస్తూ.. హాపీగా ఫీల్ అవుతున్నాను.

సరే ఈ చక్కని విషయాన్ని కూడా చూడండి.

ఈ నెల తొమ్మిదవ తేదీ నాటి ఆంద్ర జ్యోతి దిన పత్రిక జిల్లా ఎడిషన్ లో "చుక్కాని " చూడండి.








10, ఏప్రిల్ 2012, మంగళవారం

ప్రతి ఇంట్లో ఉండాల్సిన పుస్తకం

అమ్మాయిని అత్తవారింటికి పంపించేటప్పుడు.. చెప్పవలసిన నాలుగు  మంచి మాటలు కోసం కౌన్సిలింగ్ ఇప్పించాలి.
అమ్మాయి గర్భం దాల్చిన తర్వాత కలిగే అనుమానాలకి,భయాలకి కౌన్సిలింగ్ ఇప్పించాలి.
భార్య-భర్తల మధ్య బేదాభి ప్రాయాలు వస్తే కౌన్సిలింగ్ కావాలి.
తల్లిదండ్రులకి బిడ్డలా భవిష్యత్ ఏమిటో అర్ధం కానప్పుడు పిల్లలకి కౌన్సిలింగ్ కావాలి.
ఈ కౌన్సిలింగ్ అవసరాలు బాగా పెరిగిన రోజులివి.
 నేను అయితే ఈ కౌన్సిలింగ్ ల బదులు ఒక పుస్తకం కొని ఇవ్వండి అని చెపుతాను ..ఆ పుస్తకం పెద్ద బాలశిక్ష
ఆ పుస్తకం ఉంటే.. చాలా మంది పెద్దలు మన ప్రక్కన ఉండి..మంచివిషయాలు చెపుతూ,భయాలు,సందేహాలు తీరుస్తున్నట్లే ఉంటుంది కూడా.
అమ్మాయిని అత్తవారింటికి పంపేటప్పుడు ..చెప్పవలసిన విషయాలు ఉన్నఒక  శతకం..కుమారి శతకం.ఉన్నదని..నాకు అసలు తెలియదు.అలాగే గువ్వల చెన్న .. అంటూ సాగిన పాట సిరివెన్నెల చిత్రంలో విన్నప్పుడు.. అది ఒక శతకం అని తెలియదు...
ఎప్పటిదాక అంటారా!? నేను పెద్ద బాల శిక్ష చూసేదాకా. మొదటి సారి నేను నెల్లూరు లో మా కుటుంబ స్నేహితుల ఇంట్లో .. పెద్ద బాల శిక్షని చూసాను.
చిన్నప్పుడు నేను పెదబాలశిక్ష చదవలేదు.ఎందుకో..మా ఇంట్లో ఆ "విజ్ఞాన సర్వస్వం " ఉండేది కాదు.  మా అబ్బాయి కోసం నేను "పెద్ద బాలశిక్ష' కొనుక్కుని వచ్చాను.. కానీ ఇప్పటికి రోజు ..ఆ పుస్తకం తీసుకుని చదవడం అలవాటు అయిపొయింది.
మా అమ్మ నన్ను కాపురానికి పంపేటప్పుడు.. చాలా సామాగ్రి తో పాటు... భారత,భాగవత,రామాయణ గ్రంధాలు కొని ఇచ్చింది.
ఖాళీ సమయాలలో ఈ గ్రంధాలు కూడా తప్పకుండా చదువుకో..అని. అప్పటివరకు అన్నిపుస్తకాలు చదవనిచ్చిన అమ్మ ఇప్పుడు ప్రత్యేకంగా ఇంతంత..లావు పుస్తకాలు కొని ఇచ్చింది ఏమిటి..చాదస్తం.ఆ శ్లోకాలు..అర్ధాలు చదవడం ఎవరి తరం అనుకునేదాన్నివిసుగ్గా. అదే మాట అమ్మతో అంటే..ఇలా ఈ మహాత్గ్రంధాలు ఇవ్వడం మన సంప్రదాయం అని చెప్పింది.
అంతకు ముందు..మాఇంట్లో పూజ గదిలో ఓ..పీటమీద ఆ మూడు..గ్రంధాలు ఉండేవి. "శ్రీ మద్భాగ వద్గీత " లోని ఒక శ్లోకం ని..తాత్పర్యoని ...ని పూజ ఆఖరి సమయంలో చదువుకుని..పిల్లలు ఉంటే మాకు వినిపించి.. ఆ గ్రంధాన్ని మూయకుండా ..చదివిన పేజీపైన పువ్వులు అక్షితలు ఉంచి నమస్కరించడం చేసేవారు.అమ్మ,నాయనమ్మ కూడా.  
 అలా అది చూసిన ఉత్సాహంలో పదవతరగతి పరీక్షలు వ్రాసాక సెలవలలో..ఏం తోచక "శ్రీ మద్భాగ వద్గీత" ఏక దీక్షగా చదువుతుంటే..ఈ వయసులో చదవకూడని.. లాగి పడేసేవారు. ఏమిటో..ఈ పెద్దవాళ్ళు ఎప్పుడు ఏం చేయమంటారో!వాళ్ల్లకే తెలియదు అని మనసులో స్టేట్ మెంట్ లు ఇచ్చేసుకుని... ఏ పొట్లం కట్టి ఇచ్చిన పేపర్ ముక్కతో..సహా సుదీర్ఘంగా చదివి పడేసేదాన్ని.
పదిహేడేళ్ళు నిండిన రెండు నెలలకే  చదువులు వద్దని పెళ్లి చేసి పడేసి.. ఇప్పుడు అత్తగారింట్లో..ఇంతలావు పుస్తకాలు చదువుకోమని ఇస్తారు ఏమిటీ..అని తిట్టుకున్నాను అనుకోండి. కానీ ఆ మహా గ్రంధాలు మాత్రం నాకు అసలు చదివినా తలకేక్కేవి కాదు.
కానీ ప్రతి ఇంట్లో ఉండాల్సిన .. పుస్తకం ఒకటుంది... అని తర్వాత  కదా తెలిసింది. పెళ్లి అయినాక రెండేళ్ళకి
పెద్ద బాలశిక్ష ని కొనుక్కోచ్చుకుంటే..ఇంకా చిన్న పిల్లవా!?..పెద్ద బాలశిక్ష చదవడానికి అని పరిహాసమాడితే.. అలా ఓ..లుక్ నిరసనగా పడేసి..అందులో మునిగి పోయేదాన్ని.
తర్వాత ఎవరికైనా బహుమతి ఇవాల్సి వచ్చినప్పుడు..పెద్ద బాలశిక్షని ఇవ్వడం అలవాటు చేసుకున్నాను. విదేశాలలో  ఉన్న వారికి ఎవరికైనా ఇచ్చినా బరువు ఎక్కువ ఉన్నా కూడా వేరే వస్తువులు తగ్గించుకుని పెద్ద బాలశిక్ష ని తప్పనిసరిగా తీసుకుని వెళ్ళాం అని చెపుతుంటే  చాలా సంతోషంగా కూడా ఉంటుంది.
ఇప్పటికి రోజు న్యూస్ పేపర్ తో పాటు..పెద్ద బాల శిక్ష పట్టుకోచ్చుకుని..ఓ..చేతిలో కాఫీ కప్పు..తోపాటు  అందులో ఉన్న ఆసక్తి కర విషయాలని .. కూడా  త్రాగేసి.. నిత్య నూతన పెద్ద బాలశిక్ష విద్యార్ధిని.అనిపించుకుంటాను.


గాజుల సత్యనారాయణ గారి పెద్ద బాల శిక్ష  2004  వ సంవత్సరం నుండి  ఇప్పటికి 72 ముద్రణలు అయ్యాయంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. వేల 116 రూపాయలు మాత్రమే! పది కి పైగా కాఫీలు కొంటె.. 100 ..లెక్కన ఇస్తారు.డిస్కౌంట్ ఉంటుంది. (నేను అప్పుడప్పుడు అలా కొంటూ ఉంటాను)
చిన్న పిల్లలకి ఒక బొమ్మ బహుమతిగా ఇవ్వడం కంటే ఒక పుస్తకం ఇవ్వడం బాగుంటుంది అని. ఇంగ్లిష్ డిక్ష్ట నరీ  ఇవ్వడం మానేసి ఈ మధ్య పెద్ద బాల శిక్ష ఇస్తున్నాను. గాజుల సత్యనారాయణ గారి పెద్దబాలశిక్ష కాకుండా.
.
కూడా ఉంది.
యది హాస్తి తదన్యత్ర
యన్నేహాస్తి నత్ త్ క్వచిత్ ..
మహా భారతంలో ప్రచారం పొందిన జనవాక్యం .
ఇది పెద్ద బాలశిక్షకి  వర్తిస్తుంది..కదా!
మా ఇంట్లో ఉన్న పెద్ద బాలశిక్ష.. ఎప్పుడు బహుమతి కోసమే సిద్దంగా ఉంటుంది.  మళ్ళీ కొద్ది రోజులకి వస్తుంది. నేను చెప్పే ఒక మాట ఏమనగా.. ప్రతి ఇంట్లో ఒక పెద్ద బాలశిక్ష ఉండాలి. రామాయణ,భారత ,భాగవతములు లేకపోయినా సరే!
(ఈ విషయాన్ని పంచుకోవడానికి  స్పూర్తి కరం అయిన  సామాన్య గారికి ధన్యవాదములతో)

19, అక్టోబర్ 2011, బుధవారం

నా సొంత ఇంటి కల

ప్రతి ఒక్కరికి తమ జీవితంలో సొంత ఇల్లు అనేది ఒక కల. 

ఆ కల కొంత మందికి స్వంత మవుతుంది. మరి కొందరికి కలగా మిగిలిపోతుంది. తాము కట్టుకోబోయే ఇల్లు ఇలా ఉండాలి అలా ఉండాలి అని కలలు కంటూ ఉంటారు. అసలు ఇల్లు అంటే ఎలా ఉండాలి.



ఇలా ఉండాలి అనేం లేదు కానీ ఇలా ఉంటే యెంత బాగుండునో! పట్టణం తాలూకు  రణగొణ ధ్వనుల మద్య కాకుండాహాయిగా ప్రశాంతంగా ప్రకృతి ఒడిలో మనం సేదతీరుతున్నట్లు మన ఇంటి చుట్టుపక్కల వాతావరణం ఉంటే బాగుంటుంది కదా!  


అసలు ఇల్లంటే  మనని ప్రపంచంలో ఎక్కడున్నా సరే లాక్కోచ్చేటట్టు ఉండాలి. ప్రపంచంలో స్వర్గం ఎక్కడ ఉంది అంటే అది ఖచ్చితంగా ఎవరికి  వారికి వారి ఇంట్లోనే ఉందనిపించాలి కూడా..  ఇల్లు ఒక భద్రత.  పగలల్లా ఎక్కడ తిరిగినా మనకంటూ ఒక ఇల్లుండటం   అనేది మనని నిశ్చింతగా ఉండనిస్తుంది. ప్రపంచమంతా ఎన్నో అందమైన ప్రదేశాలు, భూతల స్వర్గాలు ఉండవచ్చు ఆ ప్రదేశాలకి వెళ్లి లోకాన్ని  మరచి ఆనందంగానూ  గడపవచ్చు. కానీ కొన్నాళ్ళకి అవి మొహం మొత్తి ఇంటిని వెదుక్కుంటామంటే  మన ఇంట్లో మనం ఇష్టం వచ్చినట్లు ఉండవచ్చు. 

మనపై ఎవరి ఆక్షలు ఉండకుండా నచ్చినట్లు ఉండగల్గుతాం. పరాయి  చోటు  మనకి భద్రత నివ్వదు..స్వేచ్చ నివ్వదు.భరోసాని ఇవ్వదు.  దేవుడే ఇచ్చాడు వీధీ ఒకటి  .. ఇక ఇల్లేల సొంత ఇల్లేల అని తాత్విక పదాలు పాడుకోలేం కదా! అందుకే ఇల్లు ఒక కల.

అసలు ఇల్లుని చూడగానే ప్రశాంత వాతావరణం గోచరించాలి ఇక "ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నారు. " అంటే ఇల్లాలిని చూడకుండానే ఇల్లుని చూసి ఇల్లాలు ఎలా ఉంటుందో చెప్పగలరు అంట. బాహ్యపరంగా కాదనుకోండి.  అందుకే ఇల్లు అలా ఉండాలి అంటే నేను చెప్పిన విధం ఏమనగా.. 


ఇలా కాకపోయినా 

ఇలా   అయినా   ముగ్గు   పెట్టుకోవాలి కదా !? .


ప్రతి నిత్యం ఇంటిముందు శ్రద్దగా వేసుకున్న ముగ్గు మన సంప్రదాయాన్ని  ఆడవారి ఆరోగ్యాన్ని, ఉత్సాహంని ,శ్రద్దని తెలియ జేస్తుంది.      

ఇక లివింగ్ రూం ఎలా ఉండాలంటే చూడటానికి  ఎలాటి ఆడంబరాలు లేకుండా.అట్టహాసం లేకుండా.. సింపుల్గా     ఉండాలి.  అద్దాల అరమరలు అమర్చి వాటినిండా కిక్కిరిసినట్లు బొమ్మలు పేర్చడం కన్నా చక్కగా ఒక  అరమర ఏర్పాటు చేసుకుని 


అందులో మన అభిరుచికి తగిన విధంగా పుస్తకాలు ఉంచడం మూలంగా.. రోజు వాటిని చూస్తూ.. ఉంటె రోజుకు ఒకసారయినా ఒక పుస్తకమ యినా చదవాలనిపిస్తుంది.  ఇంట్లో అరమరలని   వస్తు సామాగ్రితో నింపే కన్నా పుస్తకాలతో నింపుకుంటే ఇల్లు అందంగా లేకపోవచ్చు కానీ  మంచి ఆలోచనలు  సదా మన తోడూ ఉండేందుకు పుస్తకాలు మనకి మేలు చేస్తాయి.

ఇక వంటిల్లు విషయానికి వస్తే కుటుంబ ఆరోగ్యం మొత్తం ఈ వంటింటి తోనే ముడి పడి ఉంటుంది. అక్కడ అందం,పరిశుభ్రత,అమరిక అన్నీ ఉండాలి. చూడగానే అందంగా ఆకర్షనీయం గా ఉండాలి. అప్పుడే మనకి మన ఇంటి పదార్దాలు మనకి నచ్చుతాయి..అందువల్ల బయట ఆహార పదార్దాల వైపుకి మనసు వెళ్ళదు. అన్నీ సౌకర్యంగా అమర్చి ఉంటె వంట చేయడం సౌఖ్యంగా ఉంటుంది. అందంగా అమర్చుకుంటే..చూడటానికి ఇంపుగాను ఉంటుంది. 





ఇక బాత్ రూం ల విషయంకి వస్తే.. చాలా మంది వాటిని పట్టించుకోరు. ఎక్కడో ఓ..మూలాన పడి ఉంటాయి. వాటిని ఎవరు చూస్తారులే అని భావిస్తారు. లివింగ్ రూమ్కి ఇచ్చిన ప్రాముఖ్యం వంట గదికి కానీ బాత్ రూమ్ల కి ఉవ్వక పోవడం చూస్తూ ఉంటాం. నేను ఎప్పుడో ఒకసారి ఓ..పుస్తకంలో చదివాను. స్నానాల గది అన్నది మనిషి అంతఃకరణనాన్ని పట్టి ఇస్తుంది అట. ఇంటి  పై పై అలంకరణలు ఆడంబరాలు అన్నీ..మనిషి బాహ్య రూపం ని ప్రదర్శిస్తే మనిషి అంతఃకరణ ని లోపలి మనసుని మన పరిశుభ్రత  ఎలా ఉందొ తెలియ చెపుతుందట.. 

   

ఇక బెడ్ రూం విషయానికి వస్తే మనం అలసి సొలసి సేదదీరడానికి.. మనదైన ప్రపంచంగా విహరించడానికి.. పడక గది  ఒక వరం. ఆ గది విషయం కి వచ్చేటప్పటికి.. అక్కడ యెంత తక్కువ సామాగ్రితో..ఉంటె అంత మంచిది. .మన  జీవనం తాలూకు ఒత్తిడులు అన్నీ మరచి మనలని మనం రీచార్జ్ చేసుకునే ప్రపంచం. తక్కువ కాంతితో.. విశాలంగా ఉండేలా.. లేదా అనిపించేలా.. ఉంటూ.. ఆ గదిలో అడుగు పెట్టగానే.. వెంటనే.. వాలిపోదాం అనిపించేలా ఉండాలి. 

అలాగే ఉంది కదా?



ఇక కిడ్స్ బెడ్ రూం ఇలా ఉంటే బాగుంటుందని నా ఆలోచన 



ఈ రూం డిజైన్ చూడండి .తక్కువ ప్లేస్ లో..బెడ్స్ అమరిపోయాయి ఎంత బాగుందో కదా?  బట్ ఇలా ఇంత ఖరీదుగా ఇల్లు నిర్మించుకునే అవకాశం  అందరికి ఉండవచ్చు. లేకపోవచ్చు..లేదా ఇంత కన్నా రిచ్ గా కూడా కట్టుకోవచ్చు. కానీ అందం తో పాటు సౌకర్యంగా సింపుల్ గా ఉండేటట్టు చూసుకోవడం అవసరం. ఎందుకంటె ఇల్లు అంటే అందరు నివశించేది..కానీ.. మహిళలు మాత్రమే శుభ్రపరచి పరిశుభ్రంగా ఉంచగల్గేది కాదు. ఇల్లు శుభ్రంగా ఉండాలంటే యెంత తక్కువుగా సామాను ఉంటే అంత మంచిది. అనవసర తాపత్రయంతో..ఎడాపెడా సామాను కొనేసి గదులు నింపినంతమాత్రాన   అందం గా ఉండదు. ఉపయోగపడే వస్తువులను మాత్రమే కొనుక్కుని వాటిని శుభ్రం  చేసుకుంటూ పొందికగా సర్దుకుని...ఉండటం మూలగా అందం ఆనందం. 

అందం వస్తువల విలువలో ఉండదు. అభిరుచిలో ఉంటుంది.కదా!.. 

మేడలలో..మిద్దేలలో.. సుఖం ఉంటుందని కాదు పూరి గుడిసేలోను ఆనందంగా ఉండవచ్చు. ఇల్లు ఎండా-వాన నుండి రక్షణే కాదు. మనిషికి చిరునామా.. జీవితాని ఓ..భద్రత.మనసుకి నిశ్చింత.  ఇదంతా ఎందుకు చెప్పాననుకుంటూన్నారా ? ఎవరు కొత్త ఇల్లు కట్టుకుంటున్నారన్నా.. గృహప్రవేశ ఆహ్వానం కి పిలిచినా.. నేను ఎప్పుడు ఓ..ఇంటి దాన్ని అవుతానో అని దిగులు ముంచుకొస్తుంది. (ఓ..ఇంటిదాన్ని అయి పాతికేళ్ళు అవుతున్దిలెండి.ఆ ఇంటి దాన్ని కాదు ) ఓ..స్వంత ఇంటి మహిళని అవుదామని కలలుకంటున్నాను.  గూగులమ్మని..ఇల్లు చూపవమ్మా అంటే ఇలా కళ్ళు చెదిరేలా చూపింది. ఆలస్యంగా అయినా ఇలాటి నిర్మాణం తోనే   ఇల్లు కట్టుకోవాలని.. ఆశ.పనిలో పనిగా..ఇల్లు ఎలా ఉంచుకోవాలో.. అప్పుడెప్పుడో..నేను చెప్పినదాన్ని   నెమరవేసుకుని.. ఇలా రాసేసి..(టైపు చేసి పడేసి) చదవడానికి మా మిత్రులు ఉన్నారులే అని ధీమా మాత్రం కాదండీ.. ఇవి చూసి  మెచ్చినా సరే లేదా ఇంతకన్నా మంచి మంచి డిజైన్ లు  ఇచ్చే వెబ్ అడ్రస్ లు  ఇచ్చినా సరే .అని అభ్యర్దిస్తూ    .. . ....  

నేను వాడిన చిత్రాలు అన్నీ (ఐడియా బుక్స్ ఆన్ హౌజ్ ) నుండి సేకరించి..అందరితో..పంచుకుంటున్నవి తప్ప దుర్వినియోగం చేస్తున్నవి కాదు..అని గమనించ మనవి.            

20, సెప్టెంబర్ 2011, మంగళవారం

నీ.... చరణ కమలాలు


నీ పదమును పూజింప ఒక పూవునైనా చాలు వనమాలీ!..అంటూ..

భక్తి భావమో, ఆరాధనా భావమో మోసుకుని వచ్చి నన్ను నేను పరిచయం చేసుకున్నాను.

అలాగే.. ఈ విశాల ప్రపంచం లోకి అడుగిడుతూ..అంటూ.. అక్కడా నా పద ముద్రనే..చిత్రంగా  ఉంచాను.ఎందుకంటే బావిలో కప్పలా ఉండే నేను ఆ పాదంతోనే  ఈ అనంత ప్రపంచంలోకి..అడుగుపెట్టాను కదా!

ఏమిటీ..ఈ పాదాల అభిమానం అనుకునే ఉంటారు..కొందరికైనా  నచ్చిందో..లేదో!? అనుకునేదాన్ని అనుకుంటున్నారా?

అలా ఏం లేదు. ఇది నా బ్లాగ్ కదా! ఇతరులకి..నచ్చలేదని నాకు అత్యంత ఇష్టమైనవి ఒదులుకోలేను. (అలా అని ఇతరులకి ఇబ్బంది కల్గించడం ఇష్టం లేదు .నలుపు-తెలుపు లలో..ఎంతో ఇష్టం గా తీర్చి దిద్దుకున్న బ్లాగ్ రూపాన్ని చదువరులకి కష్టంగా ఉందని చెప్పడంతో..మార్చుకున్నాను.)

బ్లాగ్ చిత్రాలలో.. పాదాల చిత్రాలు..నా అభిమాన చిత్రాలు.
అలాగే..ప్రొపైల్ లో..శబ్ద చిత్రణం కూడా..నీ చరణం కమలం మృదులం పాట.. ఎంపిక చేసి పెట్టాను.

ఒకరిద్దరు అడిగారు..పాదాలు మీ హాట్ పేవరేటా ? అని.  అవుననుకోండి.
కానీ.. హాట్ పేవరేట్ అనే పదం కన్నా  "చరణ కమలాలు" అంటాను. ..
"కరయుగములు, చరణంబులు,
నురము, లలాటస్థలంబు, నున్నత భుజముల్
సరిధరణిమోపి మ్రొక్కిన
బరువడి సాష్టాంగమండ్రు పరమ మునీంద్రుల్"
నీ చరణం..

చరణాబ్జముల్ సకల భ  -  క్తి రహస్యము చాటి చెప్పు. ధీవరులకిలన్.
రుణాన్వితా! గొలుపవా! -  చరణంబులు కోరి పట్ట; సద్గురుఁడ! హరీ! 

 కరుణతో కూడుకొన్నవాఁడా!  సద్గురుఁడవైన  ఓ శ్రీహరీ!   భూమిపై గల ధీ వరులకు 
 శ్రేష్టమైన నీ పాద పద్మములు సమస్తమైన భక్తి యొక్క రహస్య  మార్గములను 
 చాటి చెప్పును. మేము నిన్ను కోరి పట్టుటకై నీ పాదములను సంప్రాప్తింపఁ జేయవా..అని
హరి పాదపద్మములకు ప్రణ మిల్లుతాము.

ఆ బృందావన  విహారి.. నల్లనయ్య అంటే నాకెంతో..ఇష్టం. అందుకే.. ఆ చరణ కమలాలను పూజింప ఒక పూవునైనా చాలు అనుకుంటాను.

నా పేరు కి అర్ధం కూడా..అదే కదా!

ఇక్కడ ఈ లింక్ చూడండీ! బ్రహ్మ కడిగిన పాదము..అందరికి..ఆ పాదమే కదా శరణ్యం.
http://vanajavanamali.blogspot.com/బ్రహ్మ కడిగిన పాదము.. ఇంత కన్నా నేను ఏం చెప్పగలను? అందుకే..హరి పాదానికి..ప్రణమిల్లుతూ..

"విరించి విష్ణించి సుపూజితాభ్యాం..విభూదిపాటీర విలేపనాభ్యాం.. నమో నమః శంకర పార్వతీభ్యాం.." 

అంటూ..అనుక్షణం మహాదేవుని స్మరణలో..పునీతం కావాలనుకునే ఆకాంక్ష కల్గిన నేను..

ఆ తల్లి చరణ కమలాలకూ        
మోకరిల్లుతూనే.. 

నా బ్రతుకు నడవాలి శివవామ భాగా
నీ పాదపద్మాల భ్రమరమ్ముగా
దివ్యగంధాల వెదజల్లు నీ పాదము
దేవి హరిచందనపు లేత పల్లవము
అని ఒక భక్తుడు .. ఆ అమ్మ పాద పద్మముల ముందు మోకరిల్లినప్పుడు పాడిన  గీతాన్ని..మనం చేసుకుంటాను.



చరణాలు కొలిచే నగుమోము జూచే
సామ్రాజ్యమిచ్చావు సాకేతరామా
భక్తి సామ్రాజ్యమిచ్చావు సాకేతరామా... 


అని ఘనంగా కీర్తిన్చుకున్నా .. ఆ పాదమే కదా!... 

భరతుడుకు భరత వంశీయులకి..ఇప్పుడు భారతజాతికి..ఆదర్శప్రాయం. అలా ఆ పాద పదములకు మోకరిల్లుతూ..ఉంటాను.

ఈ పాదం పుణ్యపాదం..అంటూ..నటరాజ చరణ కమలాలకి..ఆత్మప్రణామాలు చేసుకుంటూ.. అనంత మైన అర్ధాన్ని అందించిన ఈ గీతాల ఆస్వాదనలో..రసా స్వాదనలో..

ప్రధమం ఆ భగవంతుని పాదపద్మములనే మనం దర్శించుకుంటే ..ఆయన అపార కరుణామృతాన్ని,ముక్తిని పొందుతామని చెపుతారు కాబట్టి.. ఆ చరణకమలాలకి   .. మోకరిల్లుతూ.. ఈ ఆర్తిలో..మమైకమైపోతూ..


ఈ  పాదం  పుణ్యపాదం  ఈ  పాదం   దివ్యపాదం
ఈ  పాదం  పుణ్యపాదం  ఈ  పాదం  దివ్యపాదం (ఈ )
ప్రణవ మూలనాదం    ప్రధమలోక  పాదం
ప్రణతులే    చేయలేని  … ఈ  ఈ  కరమేల   … ఈ  కరమీల …
ఈ  పాదం  పుణ్యపాదం … ధరనేలే    ధర్మపాదం …

మార్కండేయ  రక్షపాదం  మహాపాదం  ఆ …ఆ …
మార్కండేయ  రక్షపాదం … మహాపాదం …
భక్త  కన్నప్ప  కన్న  పరమపాదం  … భాగ్యపాదం …
భక్తకన్నప్ప  కన్న  పరమపాదం  … భాగ్యపాదం …
ఆత్మలింగ  స్వయంపూర్ణ  ఆ … ఆత్మలింగ  స్వయం  పూర్ణుడీ …
సాక్షాత్కరించిన  … చేయుతనీడిన  … అయ్యో   …
అందని  అనాధనైతి  … మంజునాధ …
ఈ  పాదం  పుణ్యపాదం
ధరనేలే    ధర్మపాదం
ప్రణవ  మూలనాదం    ప్రణయ  నాట్య  పాదం
ప్రణతులే  చేయలేని  … ఈ  ఈ  శిర   మేల  … ఈ  బ్రతుకేల   …
ఈ  పాదం  పుణ్యపాదం … ధరనేలే  ధర్మపాదం

భక్తీ  శిరియాలు   నేలిన   ప్రేమపాదం  ఆ …ఆ …ఆ …
భక్త  శిరియాలు  నేలిన  ప్రేమపాదం  బ్రహ్మ విష్ణులే   భజించే   ఆది  పాదం
అనాది  పాదం  … బ్రహ్మ    విష్ణు   లే    భజించిన  అనాది  పాదం
అన్నదాత  విశ్వనాధా    అన్నదాత  విశ్వనాదుడీ  …
లీల వినోదిగా   నన్నేలెగ  దిగిరాగా  అయ్యో
ఛీ   …ఫోమ్మంటిని … పాపినైతినీ …
ఈ  పాదం  పుణ్యపాదం  ఈ  పాదం  ధన్యపాదం
సకల  ప్రాణ పాదం    సర్వమోక్షపాదం
తెలుసుకోలేని … నా ఈ   తెలివేల  … ఈ  తనువేల    …
ఈ  పాదం  పుణ్యపాదం … ఈ  పాదం  … దివ్య  పా దం …
అలాగే మయూరి చిత్రంలో..ఈ పాట చూడండి ..

ఈ  పాదం  ఇలలోన  నాట్య  వేదం
ఈ  పాదం  నటరాజుకే  ప్రమోదం
కాల  గమనాల  గమకాల  గ్రంధం
ఈ  పాదం  ....

ఈ  పదమే  మిన్నాగు  తలకు  అందం
ఈ  పాదమే  ఆనాటి  బలికి  అంతం
తనలోనే  గంగమ్మ  ఉప్పొంగగా
శిలలోనే  అ  గౌతమే    పొంగగా
పాట  పాటలో  తను  చరణమైన  వేళ
కావ్యగీతిలో  తను  పాదమైన  వేళ
గానమే  తన   ప్రాణమై  లయలు  హొయలు    విరిసిన
ఈ  పాదం  ....

ఈ  పాదమే  ఆ  సప్తగిరికి  శిఖరం
ఈ  పాదమే  శ్రీ  భక్త  కమల  మధుపం
వాగ్గేయ  సాహిత్య  సంగీతమై
త్యాగయ్య  చిత్తాన శ్రీ  గంధమై
ఆ  పాదమే  ఇల  అన్నమయ్య  పదమై
ఆ  పాదమే  భరతయ్య నాట్య  పదమై
తుంబుర  స్వర  నారద  మునులు 
జనులు  కొలిచిన ఈ  పాదం  ....

ఆ పాద మనంత భావాన్ని..వేటూరి చెప్పినంత గొప్పగా ఎవరు   చెప్పగలరు? 


నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం అని..ఓ..ప్రేమికుడి..ఆరాధన అయినా .. 
చెలికాలి మువ్వల గల గలలు .. చెలికాని మురళి లో..సరిగమలు.. ఆ పాద మంజీరాల సవ్వడిలో..జత కలసిన హృదయ లయలే..కదా!

అంతెందుకు..చెరుకు వింటి వేలుపు..ఆ మన్మధుడు..ఆ పూల బాణాన్ని రతీదేవి పాదాల ముందే వేసాడట. 
ఆ పాండవ  మధ్యమముడు.. గురువు పాదపద్మముల ముందు బాణాన్ని వేసి కురుక్షేత్ర యుద్దాన్ని ఆరంభించాడట. 

శరణం నీ దివ్య చరణం.. అని వేడినవారికి..రిక్త హస్తాలు చూపబడవని..కదా అందరి నమ్మిక.

అప్పుడెప్పుడో..ఒక హిందీ చిత్రం చూసాను..  గుర్తుకురావడం లేదు.రైలు ప్రయాణంలో.. హీరో..హీరోయిన్ పాదాలను   చూసి  ప్రేమిస్తాడు.

అలాగే ఒక విషయం ఏమంటే.. మువ్వల పట్టీలను బహుమతిగా  ఇచ్చిన అబ్బాయిని అమ్మాయి ఎప్పుడు మరువదు కూడా..    


ఇన్ని చెప్పాను కదా ! ఇంకా మిగిలి ఉంది.

జన్మనిచ్చిన  తల్లిదండ్రుల చరణాలకు, విద్యా బుద్దులు నేర్పించిన సద్గురు చరణారవిందాలకు  మనం ఆజన్మాంతం రుణ పడే ఉంటాం.

అలాగే..తన తోడైనీడై నిలిచే..జీవిత భాగస్వామి చరణాలకి..ప్రేమతో..అనురక్తితో.. అనుసరించాలనే భావన నాది.

అందుకే.. చరణకమలాలు.. కి..అంకింత భావనతో..నేను..నా చిత్రాలు అన్న మాట.  

5, ఆగస్టు 2011, శుక్రవారం

ఆ..బ్లౌస్ ఖరీదు అక్షరాలా.. వన్ మిలియన్ యూరోస్

ఒక ఆసక్తికరమైన..విషయం చూడండీ!

క్రింద చిత్రం లో ఉన్న నటీ మణి .. అందరికి కాకపోయినా కొందరికి అయినా తెలుసు.


బాలీవుడ్ నటీ మణి  "మల్లికా ఆరోరా" ధరించిన జార్జెట్ శారీ..చాలా బాగుంది కదా! అందులో..పెద్ద విశేషం ఏంలేదు.కానీ.. ఆమె ధరించిన బ్లౌస్ ఉంది చూసారు..ఆ బ్లౌస్ ఖరీదు ..చెపితే..కళ్ళు తిరిగి టపీ మని  పడిపోయాను నేను.మీరు అలా పడకుండా చూసుకోండి ..మరి.

ఆ బ్లౌస్ తయారీలో.. అక్షరాలా అయిదు వందల కేరట్ విలువ కల్గిన బెల్జియం డైమండ్స్ తో..తయారు చేసారట. ఆ..బ్లౌస్ ఖరీదు అక్షరాలా.. వన్ మిలియన్ యూరోస్ ..అట.

ఏమిటో.. రాజుల సొమ్ము రాళ్ళ పాలు అనే వారు..కానీ..ఇలా.. బ్లౌస్ ల  పాలు కూడా..అన్నమాట.
ఈ బ్లౌస్ ని  ఈమె కి..ప్రదర్శించడానికి  కట్టబెట్టారో.. లేక..అచ్చంగా..ఇచ్చేసారో.. వివరంగా..తెలియదు. మొత్తానికి..ధరించి మాత్రం  హొయలు ఒలకబోస్తుంది.. చూడండీ!
  
celebritysaree.com వారి సౌజన్యం తో..  ఈ  చిత్రం సేకరణ.