18, డిసెంబర్ 2016, ఆదివారం

అంకితమైన వేళ...

         నా ప్రధమ కథా సంపుటి "రాయికి నోరొస్తే" ఈ ఇరువురికి అంకితం ..


                                   7, డిసెంబర్ 2016, బుధవారం

ఓ ప్రేమికుడి విషాద పయనం ..

మనసుపొరల్లో ..ఆఖరి మూడు భాగాలు చదివిన తర్వాత ..నా స్పందన ఇలా ...

ఓ ప్రేమికుడి విషాద పయనం ..

గత కొద్దీ రోజులుగా స్క్రీన్ పై చదవడం అంటే విరక్తి కల్గింది. కొందరి రచనలు వైరాగ్యంలో ముంచెత్తిస్తే మరికొందరి బీభత్సమైన కవిత్వాలు చదివి భళ్ళున వాంతి చేసుకున్న భావన కల్గింది. మందెక్కువైతే మజ్జిగ పలుచన అయినట్లు పేస్ బుక్ వేదిక భావాలని పలుచన చేసి పాలరాయిమీద పాలు జారినంత తేలికగా ..ఓహ్ రచనలు చేయడమంటే ఇంత ఈజీ నా అన్నట్టు ఉంది. వీటన్నింటి మధ్యా మంచి రచనలు వెతుక్కునే ఓపికా లేకుండా పోయింది. హఠాత్తుగా మనసు పొరల్లో గురుకొచ్చింది . గత మూడు నెలలుగా కౌముది పై శీతకన్ను.


మొత్తానికి స్థబ్ధతగా ఉన్నాను అయితేనేం నిశ్చలంగా ఉన్నాను. అలాంటప్పుడైనా ఓ నాలుగు పుటల్ని మస్తిష్కంలో ముద్రించుకోవాలనిపిస్తున్నా, కారణమేమి చెప్పకుండా వచ్చి పడిన బద్దకపు శత్రువు ఓ ప్రక్క వద్దని మొత్తుకున్నా, మనసు మొరాయిస్తున్నా ఎలాగోలా కళ్ళప్పగించి అయిష్టంగానే అక్షరాలని హత్తుకునే పనిలో పడ్డాను . నాలుగు పుటలన్నది సాగి సాగి నలభై పుటల దగ్గర విరామ చిహ్నం పెట్టింది.


భువనచంద్ర గారి "మనసు పొరల్లో " ఈ సంవత్సరపు ఆఖరి సంచికలో ఆగింది . ఆగిందన్నమాటే కానీ ముగింపు కాదు అన్నట్లు ఉంది. ఈ ముగింపు నేను ఊహించిందే ! కలిసి ఉండటానికి ఎన్నో కారణాలు. మనుషులు విడిపోవడానికి ఒక్క కారణం చాలు. అంతా విధిలీల అనుకుంటూ దూరం ..దూరం ..దూరంగా జరిగిపోతాం. రాజు దోసిట్లో పడ్డ నమ్రత నక్షత్రం వ్రేళ్ళ సందుల్లోనుండి జారిపోయింది. వెన్నెల కిరణంలాంటి ఉమ నువ్వున్నావనే ఆలోచనే చాలు ఎన్ని అవాంతరాలు అయినా దాటేయగలను అని చెపుతూనే ఉంటుంది . అర అరకి ఒక్కో అనుభవాన్ని అమరికగా సర్దేసి మనసు మరణించి, మౌనం ధరించి, జ్ఞాపకాల చితి చిటపటల మధ్య ఓ ప్రేమికుడి అంతరంగం జీనా యహా మర్నా యహా .. అని విషాద గీతం పాడుకుంటుంది. మనచేత విషాద గీతాన్ని ఆలపింపజేస్తుంది. రచనలకి ఆ శక్తే లేకుంటే .. ఎన్ని పాటలు మన మనసుని తడిమి తడిమి తడిపి మరీ ఎందుకు వెళతాయి ?


అదేమిటో ..ఏ ఒంటరి ప్రేమికుడి /ప్రేమికురాలి బాధని కన్నా నా గుండె కొండంత బండని మోస్తున్నట్లు ఉంటుంది. ఈ రోగం ఇప్పటిది కాదు . ఊహ తెలిసి నప్పటి నుండి కూడా. అవి అక్షరాలే కదా అని అల్పంగా అరచేత్తో ఆవలికి తోసిపడేయలేను. అసలా అక్షరాలూ అంత అందమైన వాక్యాలుగా రూపాంతరం చెందాలంటే మనసు ఎంత స్పందించాలి . భావనలని కుంచె పట్టుకుని చిత్రించినట్లు ఎంత నగ్నంగా చిత్రీకరించాలి !? ప్రతి ప్రేమికుడి/ప్రేమిక మది కడలి తరంగాలై వాస్తవమనే తీరాన్ని తాకి నిశ్శబ్దంగా అనంత జలరాశిలో కలగలిసి పోయినట్లు ఉంటుంది .


ప్రతి కలయిక ఒక వీడ్కోలుకి నాంది అంటారు . వీడ్కోలు మాత్రం ఒక బాధాకర సన్నివేశం. ప్రేమికులకైతే అది మరింత బాధాకరం. మనసులు కలిసే ఉంటాయి. మనుషులే దూరంగా వెదజల్లబడిన విత్తనాలే పోతారు . ఎప్పుడో ఎక్కడో తారసపడుతుంటారు .


మనలో కదలాడిన భావాలని ఇతరుల వాక్యాలలో చూడటం వల్లనేమో అతిగా స్పందిస్తాం . ఆ వ్రాతలని మన వ్రాతలగానే అడాప్ట్ చేసుకుంటామేమో .. అందుకే ఆ సహానుభూతి . మార్గాలు వేరైనా ప్రయాణికుల అనుభవాలు ఇంచుమించుగా ఒకేలా ఉంటాయి . తీవ్ర ఆశా నిఘాతాన్ని తట్టుకోవడం అంత సులభమేమీ కాదు. ఎవరికీ వారు తనని తానూ తెలుసుకోవడమే జ్ఞానం. అప్పుడే ప్రపంచపు దుఃఖాన్ని తట్టుకునే శక్తి లభిస్తుంది .


దివ్వెలాంటి నీ నవ్వు చాలదా.. నా..లోన చీకట్లని ప్రారద్రోలడానికి ... అని ఆ ప్రేమికుడు భారమైన మనసుతో తన జీవన ప్రయాణం సాగించడం విషాదమైన ముగింపు .


మనసు పొరల్లో రచన ఎంతో మందిని బాగా ఆకట్టుకుంది. ఎంతోమంది వ్యాఖ్యలలో స్పందించారు. ఈ రచన ఆసాంతం చదివాక " ఓ సరైన సమయంలో ఓ సరైన కోణంలో అక్షర కిరణం పరావర్తనం చెంది సుందర రమణీయ భావాల ఇంద్రచాపం వెల్లి విరిసినట్లుంది." అనిపించింది. పడమటి సూరీడు వెనకనుండి తీక్షణంగా వీపు తడుముతుంటే ఆకుపచ్చని నది ఒడ్డున నిలబడి నల్లటి నా నీడని ఆ నీళ్ళల్లో చూసుకుంటున్నట్లు ఉంది . పచ్చని ప్రేమ జ్ఞాపకం ఎలాంటిదంటే .. "పూలు తెంపని జాజి కొమ్మ రాత్రంతా మంచు దుప్పటి క్రింద దాగి పరిమళాన్ని బందించుకుని తనకి తానే ఆస్వాదించినట్లు ఉంటుంది." మనో వికారాలకి తావు లేని ఓ యోగ స్థితిలో ఆ ప్రేమికులు ఒకొరినొకరు అర్ధం చేసుకుని విడిపోవడం మంచిదయింది. అందుకేగా ఈ మనసుపొరల్లో .. అంత సున్నితంగా మన ముందుకువచ్చింది అనిపించింది .


ఈ ధారావాహిక ప్రేమగాధలో ఎన్నో అనుభూతులున్నాయి . మంచి మంచి పాటల పరిచయాలున్నాయి. భువనేశ్వరి,పెద్దమ్మల విశాలమైన ఆలోచనలు, మంచి దృక్ఫదం ఎలా ఉంటుందో మనకి పరిచయమయ్యాయి. వెరసీ ఇది రచన అనాలని నాకనిపించడంలేదు . ఇంతకన్నా ఇంకా ముందుకు వెళ్లి మరికొన్ని విషయాలని తెలుసుకోవాలనే ఆసక్తిలేదు . ఎందుకో ఈ ముగింపు బాధాకరమైనదే అయినా ఇదే బావుంది . భువన చంద్ర గారికి అభినందనలు, ధన్యవాదాలు తప్ప ఇంకేం చెప్పగలను ... ధన్యవాదాలతో 


వనజ ..

1, డిసెంబర్ 2016, గురువారం

విన్నవించుకోనీయండి ... ఈ చిన్నమాటని..నా కథల సంపుటి "రాయికి నోరొస్తే" విడుదలైంది. అందులో నా మాట ఇలా ..

విన్నవించుకోనీయండి ... ఈ చిన్నమాటని .

చదువుకునేటప్పుడు కాలేజ్ మేగజైన్ లో వ్యాసాలూ చిన్న చిన్న కవితలు వ్రాసిన నేను తర్వాత తర్వాత ఆకాశవాణికి చిన్నచిన్న స్క్రిప్ట్ లు వ్రాసి,కవిత్వం వ్రాసి ప్రశంసలు అందుకుంటానని అప్పట్లో తెలియదు . అలాగే సొంత బ్లాగ్ ఒకటి రూపొందించుకుంటానని కూడా అనుకోలేదు. ఎప్పుడూ ఇలా చేయాలి అనుకోలేదు.చదవడం,వినడం ఒక వ్యసనం. వ్రాయడం కూడా అంతే అయింది. కాలక్షేపం కోసం కాదుగాని నాలో మెదిలే నిరంతర ఆలోచనలని పంచుకోవడం కోసం బ్లాగ్ వ్రాస్తూ వ్రాస్తూ కథలు కూడా వ్రాయడం మొదలెట్టాను.మిత్రులే కాకుండా నాకు తెలియని పాఠకులు కూడా ప్రశంసించడం ఆనందం కల్గించినప్పటికీ ఒకింత భయం కల్గింది. నేను సరిగా వ్రాస్తున్నానా అని నన్ను నేనే ప్రశ్నించుకోవడం మొదలెట్టాను . ఎంతోమంది రచయితలని చదువుతున్న నేను రచనలని బాధ్యతగా చేయాలని తెలుసుకున్నాను.

సాహిత్యం మనుషులని మారుస్తుందా అంటే మారుస్తుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. నేను,నాతో పాటు ఎందరో మిత్రులు బాహాటంగా ఒప్పుకున్న విషయం ఇది. నా అనుభవాలని ఇతరుల అనుభవాలని కూడా దృష్టిలో పెట్టుకుని , నా చుట్టూ ఉన్న సమాజాన్ని నిశితంగా పరిశీలిస్తూ రచనలు చేయడం ప్రారంభించాను. నేను వ్రాసిన ఈ కథలన్నీ చాలా వరకు నిజ జీవితంలో పాత్రలే ! వాస్తవ జీవితాలకి పావు వంతు కల్పన జోడించి పాఠకుల ముందు ఈ కథలని నిలబెట్టాను. పాఠకులు ఈ కథలని ప్రశంసించారు,విమర్శని అందించి నా కొత్త కథకి మంచి దారి చూపారు. ప్రతి కథ ప్రచురింపబడినప్పుడల్లా నేను మరింత నేర్చుకునేటట్లు సద్విమర్శలని అందించారు. అందుకే నేను ఇన్ని కథలు వ్రాయగల్గాను.

నేను అడగగానే ఎంతో ఒత్తిడితో కూడిన సమయాలలో కూడా తీరిక చేసుకుని ఉదార హృదయంతో కేవలం నాలుగు రోజులలోనే ప్రతి కథని చదివి ఏ కథకి ఆ కథ పై సమీక్ష వ్రాసి, ముందు మాట "వనవేదిక " ని వ్రాసి ఇచ్చిన "భువన చంద్ర " గార్కి వినమ్ర పూర్వకంగా శిరస్సు వంచి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

అలాగే నా తొలి స్క్రిప్ట్ నుండి ఇప్పటి వరకు నేను ఏం వ్రాసినా మెచ్చుకుని నన్ను ప్రోత్సహిస్తూ నా ప్రధమ పాఠకురాళ్ళగా ఉన్న నా ఆత్మీయ నేస్తాలు కుసుమ కుమారి గారు , వైష్ణవి లకి నా మనఃపూర్వక ధన్యవాదాలు

బ్లాగ్ వ్రాస్తూ అప్పుడప్పుడు కథలు వ్రాసిన నన్ను మీరు కథలు బాగా వ్రాస్తారు, వ్రాయడం ఆపొద్దు అంటూ ఎల్లప్పుడూ ప్రోత్సహించిన ... ప్రియనేస్తం డా.సామాన్య కిరణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు

కొత్త కలాలకి చోటునిచ్చి ప్రోత్సహించి సారంగ వెబ్ పత్రిక ద్వారా నా రచనలని పరిచయం చేసిన "కల్పన రెంటాల " గారికి "అఫ్సర్" గారికి, విహంగ వెబ్ పత్రిక "పుట్ల హేమలత "గారికి సదా కృతజ్ఞతలు.

భూమిక "కొండవీటి సత్యవతి " గారికి, కథలలో మణి పూసలని ఎరేరీ పాఠకులకి అందించే ఆంధ్రజ్యోతి ఆదివారం కథా విభాగం ఎడిటర్ "వసంత లక్ష్మి " గారికి, చినుకు "రాజగోపాల్ " గారికి మిగతా కథలని ప్రచురించిన ఇతర పత్రికల వారికి హృదయ పూర్వక ధన్యవాదాలు.

మీ కథలన్నీ ఒకచోట చదవాలి, కథా సంపుటి ఎప్పుడు తీసుకువస్తారు ..త్వరగా ఆ పని చేయండి అంటూ అలసత్వంతో ఉన్న నన్ను ముందుకు నెట్టిన అనేకానేక మిత్రులకి ఆత్మీయ వందనం.

నా అక్షరాలని ఇంత అందంగా పుస్తక రూపంలో అందించిన శ్రీ శ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వరరావు గారికి, అందమైన ముఖచిత్రాన్ని రూపొందించిన A.గిరిధర్ గారికి, డి.టి.పి చేసి నాకెన్నో సూచనలు అందించిన పద్మావతిశర్మ గారికి అందరికి ధన్యవాదాలు.

వనజ తాతినేని.

For Copies : 

Navodaya Publishers Karl Marx Road, Vijayawada - 2 Ph. 0866 2573500 

Navodaya Book House Kachiguda, Hyderabad 

Prajasakti Book House, Chikkadapally, Hyd, and its branches in A.P. 

e book : www.kinige.com 

Printed at : Sri Sri Printers VIJAYAWADA - 520 002 

Cell : 9490 634849


24, నవంబర్ 2016, గురువారం

అమ్మ మనసు
ఇదిగో ..ఇప్పుడే పుట్టినట్టు ఉంటుంది సంబరం. నా కళ్ళల్లోకి నిండు వెలుగు నిండుకున్న క్షణాలు ఇవిగో ..అంటూ ఆ క్షణాలకి వెనక్కి ప్రయాణం చేస్తుంటాయి. ఈ పేగు బందానికి అప్పుడే 29 ఏళ్ళు అంటే ఆశ్చర్యంగా ఉంటుంది. మధ్య మధ్యలో అమ్మ రెక్కల నుండి దూరంగా జరిగినప్పుడూ ప్రాణమంతా ఓ తలపుగా మారి శ్వాసంతా ఆకాంక్షగా మారి నువ్వు పచ్చగా ఉండాలని కోరుకుంటూ ఉంటుంది. ప్రేమ,భాద్యత రెండూ అమ్మాఅబ్బాయి మధ్య బలంగా అల్లుకునే ఉంటాయి. నేనెలా పెంచానో నువ్వెలా పెరిగావో సాక్ష్యంగా నీ నడక, నడత చెపుతూనే ఉంటాయి. కొన్ని ఆశలు ఆకాంక్షలు నీకు చేరువ కాబోయి అడుగు దూరంలోకి వచ్చి చటుక్కున్న వెనుతిరిగి వెళ్ళిపోయి నీకు నిరాశ మిగిల్చినా వయసుకు మించిన పరిపక్వతతో తట్టుకుని నిలబడి నడక సాగించిన నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంటుంది బంగారం. 
ఏరోనాటికల్ ఇంజినీర్ కాబోయీ, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ కాబోయీ, వెండి తెరమీద ఓ అవకాశం రాబోయి మామూలు ఇంజినీరింగ్ చదివిన పిల్లాడివి అయిపోయావు. తర్వాత మంచి భవిష్యత్ నీకు అందిన తరుణాన అడుగడుగునా భగవంతుని కృప నీకు తోడుంది.ఇతరుల పట్ల నువ్వు చూపే ఆదరణ, స్పందన,  నీ మంచి మనసు,నిజాయితీ, నీ విద్వత్తు అన్నీనీ సహజ గుణాలు. వాటిని ఇతరులు క్యాష్ చేసుకున్నంత మాత్రాన నీకు పోయేది ఏదీలేదు.చాలా విలువైన కాలం, మరికొంత ధనంతప్ప.  మనుషులపై నమ్మకం, గౌరవం అలాగే ఉండనీయి బంగారం. నీలా ఉండేవాడు ఒకడున్నాడు అని నిన్ను మోసపుచ్చే వారికి వాళ్ళ అంతరాత్మ అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది.  ఒకింత నిర్లక్ష్యం తగ్గించుకుని,ఆత్మనూన్యత తగ్గించుకుని ముందుకు దూసుకువెళ్ళు బంగారం . పోయినవాటిని గురించి బాధ లేదు, సంపాదించిన వాటి పట్ల గర్వమూ వలదు. 

నాకు అసలు సిసలైన ఆస్తులు - అంతస్తులు నీ వ్యక్తిత్వం, నీ విద్వత్తు. ఇవే మా అసలైన ఆస్తులు బంగారం. నాకు దూరంగా ఉన్న ఈ సంవత్సరాలు ఆర్ధిక అవసరాల కోసం నీ మంచి భవిష్యత్ కోసం ఏర్పడినవే .. అమ్మా - చిన్ని బంగారం మధ్యనున్న పేగు బంధానికి కాదు. ఆర్ధిక అవసరాల కన్నా మానసిక అవసరాల కోసం, మంచి చెడు విషయాలు పంచుకోవడం కోసం ప్రేమతో, ఆత్మీయతతో భగవంతుడు వేసిన అత్యుత్తమ బంధం తల్లి బిడ్డ బంధం. ఈ.. నీ పుట్టిన రోజున  ప్రేమగా, గర్వంగా నిన్ను చూసుకుని నిజంగా ఆనందపడే క్షణాలు ఇవి. గర్వంతో తుళ్ళి పడే క్షణాలు ఇవి.  నీ నడకలో రాళ్ళు ,పూలు ఏవి ఎదురైనా క్రుంగక, పొంగక మరింత సహనంతో సౌశీల్యంతో,నీ సహజ గుణాలతో లక్ష్యం వైపు సాగాలి బంగారం. ఇదే అమ్మ కోరిక. 

శ్రీశైల మల్లన్న కరుణ,కృపాకటాక్షం ఎల్లెప్పుడూ నీ పై ప్రసరించాలని "మల్లన్న" ని ప్రార్దిస్తూ .. 

ఇలాంటి పుట్టిన రోజులు నిండు నూరేళ్ళు జరుపుకోవాలని ..
చైతన్యవంతమైన జీవన గమనం తో.. 
స్ఫూర్తి కరమైన మార్గంలో నడుస్తూ.. 
సుఖసంతోషాలతో..ఆయురారోగ్యములతో.. పుత్ర పౌత్రాభివృద్దితో 
యశస్విభవ గా దేదీప్యమానంగా వెలుగొందాలని ..
మనసారా దీవిస్తూ.. 

భగవంతుని కరుణా కటాక్షములు అన్నింటా లభించాలని కోరుకుంటూ... 
హృదయపూర్వక శుభాకాంక్షలు ..

నిండు మనస్సు తో.. ఆశ్శీస్సులు .. అందిస్తూ..

ప్రేమతో..దీవెనలతో.. అమ్మ.

11, నవంబర్ 2016, శుక్రవారం

నాగలి విద్వంసం

అతని కోసం వెతుకుతున్నాను . 
వెతికి వెతికి అలసి పోయాను .
కనబడ్డప్పుడు యాధాలాపంగా చూసిన చూపే తప్ప 
ఓ తాలు నవ్వు నవ్వని పొదుపరితనం  గుర్తొస్తుంది   
గింజ నేలబడితే చిగురంత పొగరైనా కానరాకుండా 
కళ్ళకద్దుకున్న అతనిని చూసి 
అపహాస్యం చేసిన రోజొకటి జ్ఞప్తికొస్తుంది   

జనారణ్యంలో తప్పిపోయినతన్ని  ఇప్పుడు 
హృదయాన్ని కళ్ళు కుట్టి  మరీ వెతుకుతున్నా 
ఆకాశ హర్మ్యాల మధ్య అతనెక్కడ చిక్కుకున్నాడో 
పొగ గొట్టాల మధ్య మసి బారిపోయాడేమో  
ఆచూకీ దొరకని కొద్దీ అతను పదే పదే  గుర్తుకువస్తున్నాడు 
ఆరగించడానికి కూర్చున్నప్పుడల్లా ఆలోచనలని తెగ తొలిచేస్తుంటే 
కనిపిస్తే చాలు ..తినే మెతుకు మెతుకుని పువ్వులుగా మార్చి 
అతని పదములపై పరవాలని చూస్తున్నా   
ఏ బలవన్మరణ తీరంలోనో రాలి పడకూడదని ప్రార్ధిస్తున్నా

అప్పుల బాధతో బాంధవ్యం నెరిపినవాడు 
కంటి చూరుకి వేలాడే చుక్కతో ఓ బట్ట తడుపు వాన కోసం 
మోరెత్తి ఆకాశం వైపు చూపు సారించినవాడు 
వాన గొడుగు కింద ఆరు అడుగుల నటనే 
సేద్యం అని నమ్మిక కలిగినవాడు 
రాపిడి విలువ గుండెకి మట్టి విలువ 
మనిషికి తెలియాలని తాపత్రయపడినవాడు 
కుంచాల్లో  కొలవడం 
క్వింటాళ్ళలో తూకమేయడం మానేసి 
గజాల్లో నోట్ల ఎత్తుని తలకెత్తుకుంటుంటే 
చేష్టలుడిగి కట్ట తెగిన చెరువైన వాడు  
  
పచ్చదనం  కరువైన వినికిడి నుండి 
మనిషి తనం ఆవిరైపోయిన లోకుల నుండి  
ఏమీ లేని లేమితనంలో నుండి 
అలా అలా నడిచి వెళ్ళిన వైనాన్ని దైన్యాన్ని తలుచుకుని 
కన్నీరు ముంచుకొస్తుంది మున్నేరుని తలపిస్తూ 


బాల్యమంతా దానికి రెట్టింపు యవ్వనమంతా 
పచ్చటి పొలాల్లో తూనీగల్లె ఎగిరినతను 
ఎండకి చలికి గిడసబారి పోయి సత్తువ జారి
పక్వానికి రాకుండా తొడిమ ఊడిపోయిన కాయల్లే  
డొల్లుకుంటూ డొల్లుకుంటూ రద్దీ రోడ్ల కూడలిలో 
అరచెయ్యి చాపి అడుక్కుంటూ కనిపించాడు . 

పరామర్శగా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తే 
 పచ్చటి  కలలు పగిలిపోయిన జాడలు  
 ప్రక్కన నడుస్తుంటే వేదన  పండి మాగిన వాసన 
 పెదవి విప్పితే లావాలా ప్రవహించే ఆక్రోశం 
ఊరెక్కడుందీ చాటెడు నేలెక్కడుందీ 
వాన కురిసిన నగరాన్ని జేసీబీ సేద్యం చేస్తుంటే 
ఇక నాలాంటి వాడెందుకున్న మాట  
అర్ధరాత్రి అపరాత్రి చెవుల్లో గింగురుమంటుటే
అభివృద్ధి విద్వంసం  
నట్టింట్లో  నృత్యం చేస్తున్నట్లుగా ఉంది  ఫ్రీ  wifi సాక్షిగా. 


7, నవంబర్ 2016, సోమవారం

హృదయాన్ని ఊరడిల్లనీయీ

ఇదిగో వింటున్నావా ..?
ఈ రాత్రి నా నిశ్శబ్ధాన్ని
అందులో కలగలిసిన కొంత జ్వలనాన్ని
విప్లవ గీతాన్ని కన్నీటి భాషానినాదాలని
కొంచెం మనసు పెట్టి విను
 అలా వెన్నుముక  చూపకు
ఎవరి వంతులో ఉన్నది వారే అనుభవించాల్సి ఉన్నా
అయిష్టంలో నైనా వినితీరాల్సిన సమయమిది
జ్ఞాపకాల ఊరేగింపులో అడుగు కలపలేని
ఈ   నిశ్శబ్దాన్ని చెవి ఒగ్గి... కొంచమైనా విను


నా వీపున సంధించలేని ప్రశ్నోత్తరాలెన్నో ఉన్నట్లే
నీ చెంత జవాబు వ్రాయలేని లేఖలెన్నో ఉండి ఉంటాయి
వెతికి వెతికి చేజిక్కించుకోడానికి గతించిన కాలమూ
చేజారిన యవ్వనమూ అవేమన్నా వస్తువులా
బంధంలో బందీగా మారినప్పుడు
బానిసత్వానికి కొత్త అర్ధం తెలుసుకోవడమెందుకు?
కలగంటున్నావేమో... ఊగుతున్నభవిష్యత్ చిత్రపటాన్ని
 సత్యాన్ని  సత్యంగా  బోధిస్తున్న
ఈ నిశ్శబ్ధాన్ని మనసు పెట్టి విను

ఎప్పుడో దహనం కాబడిన కలల బూడిద
ఒరిసిపారే నదిలో కలిసి
పాడుకున్న పాటలోని చరణాల వలె సాగిపోతుంటే
పల్లవొకటే మిగిలి పగిలి పడుతుంది
వర్తమానంలోని  ఈ మహా నిశ్శబ్దాన్ని కొంచెమైనా  విను
నా హృదయాన్ని కొంత ఊరడిల్లనీయీ ..

ఇప్పుడు వినకపోతే మరెప్పుడూ వినలేవేమో ...
ఈ నిశ్శబ్దం చిట్లినా పెళ్ళున బ్రద్దలైనా
సరి క్రొత్త ఆత్మకి దానితో పనిలేదేమో ..

1, అక్టోబర్ 2016, శనివారం

లతాంతాలు

   ఉదయాన్నేలేచి  తన ఇంటి ముందు నిలబడి సూర్యోదయాన్ని కంటారా చూసి "పొడుస్తూ భానుడు పొన్నపువ్వు ఛాయ పొన్న పువ్వు మీద పొగడపువ్వు ఛాయ శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ " అని పాడుకుంటూ  యధాలాపంగా చుట్టూ చూసింది. తెల్లారేసరికల్లా ఆకాశంలో నల్లగా కమ్ముకొచ్చిన మబ్బులకి మల్లే  లేచొచ్చిన భవనాలని చూసి రోజూ లాగే దిగులుపడింది మోహన. ఆ దిగులుతోనే అన్యమనస్కంగా ఇంటి పని చేసుకుని ఏదో తిన్నాననిపించి  హడావిడిగా కాలేజ్ కి బయలుదేరింది.

రోడ్డుపై  వడి వడిగా నడుస్తూ కాలేజ్ గేట్ కేసి  చూసింది.  రోడ్డు ప్రక్కనే  విద్యార్ధులు  పార్క్ చేసిన అనేక ద్విచక్ర వాహనాలు. ఎక్కడో ఒకటి రెండూ ఎరుపూ  పసుపు తప్ప ఆన్నీ నల్లరంగులోనే ఉండటంతో ఉదయపు తీక్షణపు ఎండపడి  మరింత  మెరుస్తూ దూరంనుండి  చూస్తున్న మోహనకి   నల్ల సముద్రంలో అలలు కదులుతున్నట్టు,నల్ల త్రాచులు సంచరిస్తున్నట్లు ఉంది.  ఎనిమిది ఇరవయ్యి కల్లా కాలేజ్ కి చేరుకొని హమ్మయ్య అనుకుంది.

ఆ కాలేజ్ కి చాలా ప్రత్యేకతలున్నాయి. కాలేజీ  ఆవరణలోకి  విద్యార్ధుల  బైక్ లు నిషేధం. సెల్ ఫోన్ నిషేధం. ప్రతి విద్యార్ధి తప్పనిసరిగా తోటపని, వంట పని చేయాలి. మధ్యాహ్నం అక్కడే భోజనం చేయాలి వంటి నిబంధనలతో క్రమశిక్షణ పాటిస్తూ,  మంచి ఫలితాలు అందివ్వడంలో ముందంజలో ఉంది. ఆ కాలేజ్ లో తమ తమ  పిల్లలు చదువుతున్నారంటే   ప్రిస్టేజ్ గా భావించే తల్లి దండ్రులూ  వున్నారు . పిల్లలని ఆ కాలేజ్ లో చదివించుకోవాలని వచ్చిన కుటుంబాలన్నీ ఆ చుట్టుప్రక్కలే నివాసం  వుండాలనుకుంటుకున్న ఆంతర్యాన్ని గ్రహించిన బిల్డర్స్ రెండు మూడేళ్ళలోనే ఆ చుట్టుప్రక్కల ప్రాంతాన్ని   ఆధునిక మయుని నిర్మాణాలతో నింపేశారు. ఆ వూరికి పట్టణ వాతావరణం వచ్చేసింది.

ఆ కాలేజ్  గార్దెనెర్ గా ఉన్న మోహన పిల్లలందరూ క్లాసుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత   గార్డెన్ అంతా తిరుగుతుంది. కొత్తగా వేసిన చివురులని , మొగ్గలని, పూలని తాకి చీడ పీడలంటాయేమోనని పరిశీలించుకుంటుంది.

తన రూమ్ లో  కిటికీ ప్రక్కన నిలబడి కర్టెన్ ప్రక్కకి తొలగించి మోహనని  చూస్తున్నాడు రఘు.  ములగ పువ్వు రంగు చీరలో ఆమె కదిలే నదిలా ఉంది, చదవని కథలా ఉంది.  చాలారోజులనుండి  అతనాలోచనలు సూర్యకాంతి పుష్పంలా  ఆమె చుట్టూ తిరుగుతున్నాయి.  బ్యూటీ పార్లర్లు అంటని సహజ సౌందర్యం. సౌందర్యం కన్నా ఆత్మ విశ్వాసం, విజ్ఞానంతో వెలుగుతున్నకళ్ళు,  క్షణాల్లో ఎదుటి మనిషిని చదివే సునిశితశక్తి . దగ్గరికి వెళ్లి పలకరించాలనిపించింది . వరండా అంచున నిలబడి ఆమె తనవైపు చూసినప్పుడు పలకరించాలని చూస్తున్నాడు. పూలభారంతో ఒంగిపోయిన గులాబీ మొక్కకి ఆధారంగా కర్రని పాతి పురికొసతో బందిస్తున్నామె తలెత్తి అక్కడతన్ని చూసి ఉలికి పడింది.


"రెండు గులాబీలు కోసుకెళదామని నించున్నాను విత్ యువర్ పర్మిషన్ "  అన్నాడు పూలని కోయరాదు అన్న బోర్డుని చూపిస్తూ.

"అడగకుండా కోసేసుకుంటారు కొందరు. అడిగినా ఇవ్వరు కొందరు. అయినా  నా పర్మిషన్ అవసరంలేదనుకుంటా ఇక్కడ " అంటూ ఇంకో వైపుకి వెళ్ళిపోయింది. అతని ముఖం గంభీరంగా మారిపోయింది.

  ఆ సాయంత్రం అనుకోకుండా కురిసిన వర్షంతో  ఇంటి పైకప్పుపై పడుతున్న చినుకుల్లోనుండి  ఒక పావు వంతు లోపలకి కారిపోతున్నాయి .   ఇల్లంతా తడవకుండా ఉండటానికి ఇంట్లోని పాత్రలన్నీ తెచ్చి  ధార క్రింద పెడుతుంది. నిండిన వెంటనే వాటిని బయట ఒంపేసే లోపలే ఇంకొక పాత్ర నిండుతుంది  ఇంట్లోకి ద్వారానికి మధ్య గడియారంలో లోలకంలా ఊగుతూనే ఉంది మోహన. అంత వానలో ఇంటి ముందు ఎవరో ఆగిన శబ్దం. తలెత్తి చూసిన ఆమె ఆశ్చర్యపోయింది. చేతిలో పాత్రని క్రిందికి వదిలేసి ప్రక్కకి జరిగి లోపలకి రండని ఆహ్వానించక తప్పలేదు. వచ్చినతను కాలేజ్ డైరెక్టర్.  అతను తను వేసుకున్న షూ ని గుమ్మం బయటే వదిలేసి లోపలకి అడుగు పెట్టాడు. ఒకదానిలో ఒకటేసి ఓ మూలకి ఉంచిన  కుర్చీల్లో   నుండి ఒక కుర్చీని తీసి  చినుకులు పడనిచోట  వేసింది. అతను వేసుకున్న రెయిన్ కోట్ ని విప్పి అటు ఇటు చూసి తగిలించడానికి ఏమీ కనబడక తలుపుకి తగిలించాడు.

అనుకోకుండా వచ్చిన అతిధికి మర్యాదలెలా చేయాలా అని ఆలోచిస్తూ ఉన్న ఆమెని "కొంచెం మంచి నీళ్ళు ఇస్తారా " అడిగాడు .  ఆమాటైనా తనడగనందుకు సిగ్గుపడింది.  త్రాగిన గ్లాసుని ఆమె చేతిలోనున్న ట్రే లో పెడుతూ ఇల్లు బాగా కురుస్తున్నట్లు ఉంది అన్నాడు.

అవునండీ,క్రొత్త రేకులు కాక పోయినా కనీసం ప్లాస్టిక్ పట్టా అయినా కప్పించాలని అనుకున్నాను. అంతలోనే అమ్మకి  ఆరోగ్యం పాడవడం, హాస్పిటలు ఖర్చులు, చనిపోవడం మళ్ళీ  ఆ ఖర్చుల్లో ఇంటికేమీ పెట్టడానికి కుదరలేదు.  వచ్చిన అతిధి ముందు తన బీదరికమేమి సిగ్గుపడేది కాదన్నట్టు మాములుగా చెప్పింది.

"మీ అమ్మగారికి  బాగోలేనప్పుడు హాస్పిటల్ ఖర్చులకని, పోయిన తర్వాత అవసరపడతాయని డబ్బు పంపాను తీసుకోలేదు మీరు " అన్నాడు.

అంతకు  ముందే తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నాను. అవసరం లేదనిపించింది . నా జీతం డబ్బుతో  ఏడాది లోపులోనే అప్పులన్నీ  తీరిపోతాయి.  ఇకనుండి నేను ఒక్కదాన్నేకదా !

మీ అమ్మగారు  చనిపోయినప్పుడు రాలేక పోయాను. సారీ ! అన్నాడతను. మసక వెలుతురులో మౌనంగా నిలబడిన ఆమె  నయన సరస్సులో కన్నీటి పుష్పం విరిసింది.   వర్షం కురుస్తూనే ఉంది . ఇల్లు తడుస్తూనే ఉంది .

"మీరు నిలబడే ఉన్నారు కూర్చోండి" .

"మీరు అనడం ఇబ్బందిగా ఉంది. చిన్నప్పుడు పిలిచినట్టు పేరుతొ పిలిస్తే సరిపోతుంది కదా ! " అంటూ కుర్చీలో కూర్చుంది. మళ్ళీ అంతలోనే లేచి "కాఫీ కలపడానికి పాలు కూడా లేవు. అయినా అతిధి మర్యాదకేమీ లోటు రానివ్వను. అలా వర్షాన్ని చూస్తూ కూర్చోండి అయిదు నిమిషాల్లో కాఫీ పట్టుకొస్తాను " అంటూ రెండో  గదిలోకి వెళ్ళింది.

నీళ్ళలో కాఫీ పొడి మరుగుతున్నప్పుడు వచ్చే వాసనతో ఏదో క్రొత్త వాసన మిళితమై నాసికా పుటాలకి అందుతుంటే యెప్పుడెప్పుడు ఆ కాఫీ రుచి చూద్దామా అన్నట్టు ఎదురు చూడసాగాడతను. పొగలు క్రక్కుతున్న బ్లాక్ కాఫీ లాంటి ద్రవాన్ని స్టీల్ గ్లాస్ లో నిండా పోసి చెయ్యి కాలకుండా వేరొక స్టీల్ గిన్నెలో పెట్టి ఇచ్చింది. నెమ్మదిగా ఊది తలొంచి ఒక సిప్ తీసుకున్నాడు అద్భుతమైన రుచి. కాఫీ లో పంచదార బదులు బెల్లం కలిపినట్లు తెలుస్తుంది అది కాకుండా మరొకటేదో రుచి నాలికపై నాట్యం చేస్తూ వెచ్చగా లోపలకి దిగుతుంటే తెలియని ఆనందమేదో అతని కళ్ళల్లో. గ్లాస్ పెట్టిచ్చిన గిన్నె తీసి క్రిందపెట్టి రెండు చేతులతోనూ అపురూపంగా గ్లాస్ పట్టుకుని గుటక గుటక ని ఆస్వాదిస్తూ త్రాగేసి తర్వాత కూడా చేతిలోనే గ్లాస్ ని పట్టుకుని కూర్చున్న అతని చేతిలో నుండి గ్లాస్ ని తీసుకుని సింక్ లో పెట్టి వచ్చింది. కరంట్ వచ్చేటట్టు లేదు వాన తగ్గేటట్టు లేదు. దీపం వెలిగిస్తానంటూ  గ్లాస్ లాంతర్ ని వెలిగించింది ఆమె.

"ఇంకా  ఈ లాంతర్ వాడుతున్న మిమ్మల్ని  చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది మోహనా !"  అన్నాడు .

"నేనంత  ఆధునికం కాలేదు. పాత వస్తువులు,పాత అలవాట్లు మనని అంటిపెట్టుకున్నప్పుడే  కొత్తగా మనమేమి మారలేదన్న సృహలో ఉంటాం .  కొత్తెప్పుడూ  ఆసక్తిగా, ఆకర్షణీయంగా, ఉత్సాహంగా  ఉంటుంది కానీ కొత్తలో పడి  కొట్టుకుపోవడం నాకిష్టం లేదు " మాటల్లో నిర్మొహమాటం.

గడ్డకట్టిన మౌనాన్ని  కాసింత కరిగించి "ఇన్నేళ్ళు  ఎక్కడున్నారు ?  అసలు మీరు  చదివిన చదువేంటి చేస్తున్న ఉద్యోగం ఏమిటీ ? మీతో  పాటు చదివిన వాళ్ళందరూ మంచి కాలేజీలల్లో ప్రొఫెసర్స్  గానూ వేరే ఉద్యోగం లోనో   స్థిరపడిపోయారు. మీరేమో  ఇలా గార్డెనర్ అవతారమెత్తావ్.  ఆ పోస్ట్ కి వచ్చిన  మీ రెజ్యూమ్  చూసి ఆశ్చర్యపోయాను "

" మనుషులని చూసిన తర్వాత వచ్చే వికారం తగ్గడానికి పచ్చని చెట్లని చూడండి " అన్నారట ఆస్కార్ వైల్డ్. ఉద్యోగం పేరిట ఎక్కెడెక్కడో ఉన్నాం. ఎక్కడికెళ్ళినా నేనే  సర్దుకోలేకపోయాను. బయట ప్రపంచంతో కాదు నాతొ నేనే సర్దుకోలేకపోయాను ఎవరైనా ఏమైనా అంటారని నాకనిపించినప్పుడు అనే అవకాశాన్ని వాళ్ళకివ్వకుండానే నేనే రాజీనామా చేసి వచ్చేసేదాన్ని. పదేళ్ళలో ఎనిమిది ఉద్యోగాలు. ఆరు నగరాలు ఆఖరికిలా సొంత ఊరులో వచ్చి పడ్డాను. కాస్తంత హాయిగా ఉందిప్పుడు ". నవ్వింది.

"మీరొచ్చిన ఆరు నెలల్లోనే కాలేజీ ఆవరణమంతటిని భలే మార్చేసారు.  ఆఖరికి క్లాస్ రూమ్ లలో కూడా  ఇండోర్ ప్లాంట్స్ . పంకాలు తిరగాల్సిన అవసరం లేకుండా చల్లగా మార్చేసారు!  కేంపస్ సెలక్షన్స్ కోసం వచ్చిన కంపెనీల  వాళ్ళందరూ   కాలేజ్ గార్డెన్ ని, కారిడార్ ల పరిశుభ్రతని చూసి భలే మెచ్చుకున్నారు. మాక్కూడా ఇలాంటి గార్డెనర్ దొరికితే బావుండునన్నారు"   ప్రశంసించాడు. చిన్నగా నవ్వి ఊరుకుంది.

వర్షం తగ్గినట్లే ఉంది. ఇక వెళతాను. లేచి షూస్ వేసుకుని రెయిన్ కోట్ తొడుక్కుంటూ " ఏమైనా అవసరపడితే కాల్ చేయొచ్చు" అంటూ కార్డ్ ఇచ్చాడు . తీసుకుని థాంక్స్ చెప్పింది. తలమీదకి హేట్ లాక్కుని కురుస్తున్న వర్షంలో వెళుతున్న అతన్ని చూసి ఆశ్చర్యపోయింది.  కాలేజ్ నుండి కిలోమీటర్ పైనే ఉంటుంది అతని  ఇల్లు. అన్ని కార్లున్నాయి. అయినా నడిచే వచ్చాడు . తనకి  తారసపడిన చాలామంది కన్నా విచిత్రంగా ఉన్నాడితను   పదిహేనేళ్ళ క్రితం చూసిన మనిషి.  వయసు పెరుగుతున్న కొద్దీ మార్పు రావడం సహజమే అన్నట్టు ఉన్నాడిప్పుడు  అనుకుంది. రాత్రి పడుకున్న తర్వాత కూడా ముసురేసిన మబ్బులాగానే కొన్ని జ్ఞాపకాలు కూడా ఆమెని తడిమి నిలువెల్లా  తడిపేసి వెళ్ళాయి.

రెండోసారి అతనొచ్చినప్పుడు వాన లేదు కానీ  పుష్యమాసపు వెన్నెల్లో  ఇంటి ముందు దడికి అల్లుకున్నతీగపై  తెల్లని అనపపూల సౌందర్యాన్నిచూసి మైమరపులో పడినప్పుడు  ప్రక్కనే వచ్చి నిలబడి చిన్నగా దగ్గాడు. ఉల్కి పడింది.

"మీతో చిన్నపని  పడింది అందుకే రాక తప్పలేదు" అన్నాడు.

"లోపలి రండి." ఆహ్వానించింది .

"ముందుగా మీరు  నాకొక హామీ ఇవ్వాలి. మీ మార్క్ కాఫీ  వీలైతే  మీ చేతి వంట కూడా రుచి చూడాలనుకుంటున్నాను. చాలా ఆకలిగా ఉందీ  రోజు"  పొట్ట మీద చెయ్యేసుకుని చెప్పాడు.

"తప్పకుండా ! కూర్చోండి " అని కుర్చీ చూపి మంచి నీళ్ళు అందించింది.

"మధ్యాహ్నం లైబ్రరీలో బుక్స్ సర్దిస్తూ లంచ్ కి వెళ్ళలేదు.  ఆఫీస్ లో  అర్జంట్ పనులు  చేసుకుంటూ రాత్రయింది కూడా చూసుకోలేదు. ఇంటికి వెళదాం అనుకునేసరికి కార్ రిపేర్. ఇంట్లో కూడా ఎవరూ లేరు.   మీ చేతి వంట  తినాలని,మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని  రాసి పెట్టి ఉందీరోజు." సంజాయిషీగా అన్నాడు.

"కూరగాయలు కూడా ఏమీ లేవు. అనుకోకుండా ఇలా అతిధి వస్తే ఏం చేయాలి?  ఆలోచిస్తూనే కాఫీ తయారు చేయడానికి గ్యాస్ స్టవ్ అంటించబోయింది. టుపుక్ టుపుక్ మన్న శబ్దం తప్ప స్టవ్ వెలగలేదు. "గ్యాస్ నిండుకుందేమో, సిలిండర్ మార్చండి ,నేను హెల్ప్ చేయనా? " అంటూ చొరవగా ఆ గదిలోకి వచ్చేసాడు.

ఆ చొరవకి ఆమె మనసు ఉక్కిరి బిక్కిరి అవుతుంది.  "రెండో సిలిండర్ లేదు , కుంపటి వెలిగిస్తానుండండి." అంటూ  కింద అరల్లో దాగిన కుంపటి , బొగ్గుల కవరుని బయటకి తీసింది.

 ఇనుప కుంపటి నిండా  బొగ్గులు నింపి  కొబ్బరి పీచుతో వెలిగించి గుమ్మానికి ఎదురుగ పెట్టింది. బయటనుండి వీస్తున్న గాలికి రెండు నిమిషాల్లోనే కణ కణ మంటూ మండింది. ముందుగా తన మార్క్  బ్లాక్ కాఫీ కలిపి ఇచ్చింది. కాఫీ కలుపుతున్నప్పుడు తయారు చేసే  విధానాన్ని ఆసక్తిగా గమనించాడు. నీళ్ళలో  కాఫీ పొడితో పాటు కొద్దిగా  బెల్లం,  కొన్ని మిరియపు గింజలు, చిన్న ముక్క దాల్చిన చెక్క వేసింది.  అతను కాఫీ  త్రాగుతూండగా మొహమాటంగా చెప్పింది.

"ఒంటిదాన్ని, తిండి మీద శ్రద్ద లేనిదాన్ని. కూరగాయలు కూడా ఏమీ లేవు. ఏదో  ఉన్నదాంట్లో మాత్రమే మీకు భోజనం పెట్టగలను" .

"ఏమైనా పెట్టండి  తినేస్తాను . ఆఖరికి విషమైనా, అలా  అయినా మీకు  చేసిన అన్యాయానికి దండన వేసినట్టు ". తలొంచుకుని పశ్చాతాపం నిండిన గొంతుతో చెప్పాడు.

"జరిగనవన్నీనేనెప్పుడో మర్చిపోయాను. గతాన్ని తవ్వుకోవడం,బాధపడటం నాకిష్టం ఉండదు. భవిష్యత్ గురించి కూడా నేను ఆలోచించను. వర్తమానమే  ముఖ్యం నాకు". అంటూ ఆర్ కె నారాయణ్ మాల్గుడి కథలు బుక్ తెచ్చి అతని చేతిలో పెట్టి చదువుతూ ఉండండి నేను త్వరగా వంట చేసేస్తాను.

అతను ఇచ్చిన  పుస్తకాన్ని పై పైన తిరగేస్తూ కూర్చున్నాడు. చిన్న అల్యూమినియం చట్టిలో నూనె పోసి నెల్లి కాయలని,  ఎండు  మిరపకాయలని,కాస్త కొత్తి మీరని  విడి విడిగా వేయించింది. కందిపప్పుని దోరగా వేయించింది. చల్లారిన తర్వాత  కడిగి మట్టి చట్టిలో వేసి కుంపటి మీద పెట్టి, చిన్న రోటి ముందు కూర్చుని నెల్లి కాయల్ని  గింజ నలక్కుండా దంచి గింజలని వేరేసింది. వాటిలోనే  వేయించిన  కొత్తిమీర ఎండు మిరప కాయలని వేసి  మెత్తగా  నూరింది అందులో వెల్లుల్లిపాయలు జీలకర్రేసి నూరి కలిపేసి గిన్నెలోకి తీసింది. ఇంగువ, కరివేపాకు వేసి తాళింపు  పెట్టింది.  ఆమె చేసే ప్రతి పనిని శ్రద్దగా గమనిస్తున్నాడతను. ఏ పని చేసినా అందులో అంకితభావం కనబడుతుంది.

తర్వాత చిన్న గిన్నెలో బియ్యం కడిగి అత్తెసరు పెట్టొచ్చి అతని ఎదురుగా కుర్చీ జరుపుకుని కూర్చుని .. "ఇప్పుడు చెప్పండి  మీ విషయాలు. మీ పాప ఏం చదువుతుంది? బాబు  ఊటీ స్కూల్ లో చదువుతున్నాడని వాచ్ మెన్ చెపుతూ ఉంటాడు."

"అమ్మాయిని కూడా ఊటీ లోనే జాయిన్ చేసేది మా ఆవిడ. కానీ పాప నన్నొదిలి వొక్క రోజు కూడా ఉండదు. అందుకే ఇంటి నుండే స్కూల్ కి వెళుతుంది. సిక్స్త్ క్లాస్ చదువుతుంది. బాబు ఎయిత్ క్లాస్. ఇక నా భార్య లత  కూడా మంచిదే! డబ్బున్న కుటుంబంలో పుట్టానన్న అహంకారం  తప్ప చాలా విషయాల్లో ఉదారంగా ఉంటుంది. తనలాగా క్లాస్ మెంటాలిటి ఉన్నవాళ్ళతో కలిసి సర్వీస్ క్యాంప్ లు నిర్వహిస్తూ ఉంటుంది. పరిశుభ్రతంటే పిచ్చి ఇష్టం. ఇల్లంతా ఎప్పుడూ ఫైవ్ స్టార్ హోటల్ లా ఉండాలంటుంది. తనకొక గది, నాకొక గది, పాప కొక గది, బాబుకొక గది, అమ్మ కొక గది. అందరూ నిద్ర లేచాక చూసుకోవాల్సింది మనుషులని కాదు గోడలని.  మోడరన్ గా తను అలంకరించుకోవడమే కాదు ఇంటిని అలంకరిస్తుంది. ఎప్పుడూ మార్పులు చేర్పులూ,షాపింగ్ లూ . తనదంతా బిజీ ప్రపంచం.

" ఈ లోకంలో ఒకరి ప్రపంచంలో మరొకరు కలవని ప్రత్యేక ప్రపంచాలు చాలా ఉన్నాయిలెండి "

 అవునేమో ! ఆ ప్రపంచంలో మా మధ్య మాటల వారధి సెల్ ఫోన్. అప్పుడప్పుడూ కొత్త వాళ్ళ లా పలకరించుకున్నట్టు అనిపిస్తుంది కదా  రామ్ అని నవ్వుతుంటుంది. పసి పిల్ల మనస్తత్వం. ఏదైనా ఆమె అడిగినప్పుడే  ఇవ్వాలి. ప్రేమతో గిఫ్ట్ ఇచ్చినా ఆమెకి నచ్చవ్ ! నేను నిన్ను అడిగానా అంటూ గొడవపెట్టుకుంటుంది. అంతా డిమాండ్  అండ్ సప్లై లాగా అన్నమాట.  ఆఖరికి దాంపత్యమైనా సరే అంతే ! మాములుగా చెప్పాడు.  ఆ విషయాన్ని కూడా . మోహన కూడా మాములుగానే విన్నట్టు వింది.

"మిమ్మల్ని  చూస్తుంటే చాలా శాంతంగా ఉంటుంది, పదే పదే  వస్తున్నానని  ఏమీ అనుకోకండి . ఇలా రావడం వల్ల మీకేమీ ఇబ్బంది లేదు కదా?"

"నాకెలాంటి ఇబ్బంది లేదు , ఇతరులేమన్నా అనుకుంటారేమోనన్న వెరపు  అసల్లేదు. ఎవరి జీవితం వాళ్ళకి నచ్చినట్లే ఉండాలి,  భయం నుండి స్వేచ్ఛ లోకి పయనించేటప్పుడు  లోకం గురించి ఆలోచనెందుకు? "

"స్వవిషయంలో  జోక్యం చేసుకుంటున్నాననుకోకు.  మీరు అని సంభోదించే  పరాయి వాడినని నేను అనుకోవడం లేదు,  పెళ్ళెందుకు  చేసుకోలేదు?

"ఆసక్తి లేదు" .

"ఎవరినైనా ప్రేమించావా ?"

ప్రేమా ! అంటూ ఆలోచనగా చూసి " అయినా నన్నెవరు ప్రేమిస్తారు  నన్ను ప్రేమించరని తెలిసీ నేనెందుకు ఎవరినో ప్రేమించాలి ? నిస్వార్ధమైన ప్రేమలంటూ ఏవీ ఉండవనుకుంటా ? అన్నీ అవసరాలని బట్టి పుట్టే ప్రేమలే !"

"అలా ఎందుకంటావ్ !?  మనుషుల మధ్య అసలు ప్రేమలనేవీ  లేని యంత్ర యుగం రాలేదు ఇంకా ! ఇప్పుడైనా పెళ్లి చేసుకో! "

" మనుషులే యంత్రాలై బ్రతుకుతున్న రోజులివి. ఆఖరికి నా తల్లిదండ్రులనే తీసుకోండి. కోడలెలాగూ  చూడదని తెలుసు కాబట్టే నన్ను అంటిపెట్టుకుని ఉన్నారని నాకూ వాళ్ళకీ  మాత్రమే  తెలుసు. లోకానికి మాత్రం పాపం  ఆడపిల్ల!  పెళ్ళీ పెటాకులు లేకుండా ఒంటరిగా ఉంటుందని ఆ పిల్లని కనిపెట్టుకుని ఈ వయసులో ఊరూరు తిరుగుతున్నారని సానుభూతిని పొందేవారు. వాళ్ళదగ్గరున్న  డబ్బు,పొలం,నగలు అన్నీ కొడుకు పిల్లలకి ఎప్పుడో ఇచ్చేసుకున్నారు. కన్నవారి  ప్రేమలోనే నిజాయితీ లేదు అవసరాలకి పుట్టే ప్రేమల్లో నిజాయితీ ఎక్కడుంటుంది.? "ఆ గొంతులో లీలగా అణచిపెట్టుకున్న వేదన.

"వాన కురిసినప్పుడు బీటి మీద కూడా మొలకలు వస్తాయి. అలాగే ప్రేమ కూడా !  నీ వయసు కూడా పెద్ద ఎక్కువేమీ కాదు ముప్పై అయిదు ఆరు మధ్య ఉంటుందేమో కదా !

"నా వయసు భలే గుర్తుందే మీకు"

"కలిసి పెరిగిన వాళ్ళమే కదా! మూలాలని మర్చిపోయేంత గర్వం,  జరిగినవేమీ గుర్తు లేనంత మరుపు రాలేదు ఇంకా .

ఆ మాటలు విననట్టే    "మీకు  భోజనం తయారుగా ఉంది,  అయితే క్రింద కూర్చునే భోజనం చేయాలి " అంటూ వడ్డించటానికి తయారైంది

ఒక్కటే కంచం పెట్టడం  చూసి "రోజూ  ఒక్కడినే తినడం బోర్  కొడుతుంది . ఇద్దరం కలసి తిందాం నువ్వూ పెట్టుకో మోహనా."

"మీకు కంపెనీ ఇవ్వాలని తినడం లేదు నాకూ ఆకలిగానే ఉంది కాబట్టి తింటాను " అంటూ మరొక కంచం తెచ్చుకుని ఎదురుగా కూర్చుంది.

పప్పులో నెయ్యేసి కలుపుకుని ఒకసారి కొత్తిమీర పచ్చడేసుకుని ఒకసారి రెండూ కలిపి ఒకసారి తింటూ  భోజనాన్ని ఆస్వాదిస్తూ చాలా బావుంది మోహనా, థాంక్స్! అన్నాడు .

"అయ్యో ! నేనేమీ స్పెషల్ గా చేయలేదు. కనీసం మజ్జిగ కూడా లేని భోజనం పెట్టాను. అతిధికి ఇలాంటి భోజనమేనా  పెట్టడం అని నాకు నేను మొట్టికాయ వేసుకుంటున్నా" అంది నవ్వుతూ .

"దేనికైనా కాంబినేషన్ కుదరాలి.కాంబినేషన్  కుదరని వంటలు,  కాంబినేషన్ కుదరని జీవితాలు చప్పగా ఉంటాయి.ఎనీ హౌ, మంచి భోజనం పెట్టినందుకు థాంక్స్ చెప్పకుండా ఉండలేను. "వాచ్ చూసుకుంటూ రేపు   కాలేజ్ దగ్గర కలుద్దాం.  ఇక వెళ్లొస్తాను మోహనా అంటూ సెలవు తీసుకున్నాడు.

సంక్రాంతి సెలవలిచ్చే  ముందు రోజు కారిడార్ లో ఎదురైనప్పుడు " గ్రౌండ్ లో ఇంకా ఎక్కువ మొక్కలు వేస్తే బావుంటుందని అనుకుంటున్నా.  కడియం  నర్సరీకి వెళ్లి మొక్కలు కొనుక్కురావాలి. మీరు  కూడా వస్తే బావుంటుంది ". సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడతను.

"ఇబ్బందేమీ లేదు, వస్తాను  ఎప్పుడో చెప్పండి ?"

" రేపే వెళదామా ! ఎల్లుండి బాబు వస్తున్నాడు. వాడు వెళ్ళిందాకా నా సమయాలన్ని లత   చేతిలోనే ఉంటాయి.
రేపుదయం సిక్స్ కల్లా రెడీగా ఉండండి. వచ్చి పికప్ చేసుకుంటాను". తలూపింది. అతను  ఇంటికొచ్చి పికప్ చేసుకోకుండా తనే కాలేజ్ గేట్ దగ్గర వెయిట్ చేస్తూ నిలబడింది మోహన. డ్రైవింగ్ సీట్లో కూర్చున్నతను ముందు సీట్ ఆఫర్ చేసాడు. చిన్నగా నవ్వి వెనుక సీట్ లో కూర్చుంది.

దట్టమైన మంచులో ప్రయాణం నెమ్మెదిగా సాగుతుంది. నిర్భయంగా, ఒద్దికగా,సంస్కారంగా కూర్చున్న ఆమె తీరుని చూసి ఈ మనిషికి చిన్న వొంక పెడదామనుకున్నా అవకాశమే ఇవ్వదు అనుకుంటూ "మీకొక  విషయం చెప్పనా ? కారులో కూర్చున్న తీరుని బట్టే మనిషిని అంచనా వేయోచ్చని మామయ్య చెపుతారు. యజమానులందరూ కారు ముందు సీట్లో కూర్చుని దర్పం ప్రదర్శిస్తారంట. కానీ నిజమైన యజమాని వెనుక సీట్ లో  డ్రైవర్ తో సంభాషణకి అనుకూలంగా ఉండేటట్టు కూర్చుంటారట."  నవ్వేసి ఊరుకుంది.

దారిపొడవునా  ఆమె పచ్చని పైరు పొలాలని  కుడిప్రక్క పైపైకి లేస్తున్న గోరువెచ్చని సూర్యుడి అందాలని  చూస్తూ మెడకి ఎక్సర్సైజ్ ఇస్తూనే ఉంది. అతను వెనక్కి తిరిగి చూస్తూ ఆమెతో మాట్లాడుతూనే ఉన్నాడు.

"అగర్ తుమ్  మిల్ జావో జమానా చోడ్  దేంగే హమ్" ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్  ప్లే అవుతుంది. అద్దం సరిచేసుకుని అందులో కనబడే ఆమెని చూస్తూ  అతను. అదేమీ పట్టనట్లు ఆమె.  ప్రయాణం సాగుతూనే  ఉంది .  మధ్యలో ఒకచోట ఆపి కాఫీ త్రాగారు. తొమ్మిది గంటలకల్లా కడియంలో ఒక  నర్సరీకి  చేరుకున్నారు.

ఆ మొక్కలని, పూల అందాలని చూస్తూ ఆమెలో నూతన ఉత్సాహం.
"మంచు వర్షంలో స్నానం చేసినట్లున్నాయి మొక్కలన్నీ పూలన్నీ నన్ను చూడండి, నన్ను చూడండి అని పోటీ పడుతున్నాయి"

"ఇంకా ఏమనిపిస్తుంది మీకు ?" కొంత అల్లరితనం .

"పూల మంకరందాన్ని తీసుకుని ఎగిరిపోయే సీతాకోక చిలకలని, పూల మకరందాన్ని గ్రోలి కృతజ్ఞత చెపుతున్నట్లు ఝుంకారంతో పువ్వు చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నట్లు ఉన్న మధుపాన్ని చూడండి.  మనుషులు తరహా  కూడా ఇంతే అన్నట్టు ఉన్నాయి కదండీ." పంచ్  పడింది.

"ఈ  ఇండోర్ ప్లాంట్స్ విజయగర్వంతో ఊగుతున్నాయి. రంగుల్లో మాకెవరూ సాటిరారు, ఆఖరికి ఇంద్రధనుస్సు కూడా అన్నట్టు "

అతనిలో మౌనం. ఆకుపచ్చ చీరతో  నర్సరీ అంతా తిరుగుతూంటే వనకన్యలా ఉందీమె. ఈమెకి మోహన అని పేరెవరు పెట్టారో  నన్ను మోహనావలో పడేయడానికి కాకపొతే !

ఆ లిల్లీ పూలు,ఈ పారిజాతాలని  చూడండి   "గాలికి గాఢ పరిమళాలనల్లడమే తమకి చాతనవును అన్నట్టున్నాయి " వర్ణిస్తూనే ఉంది. అతను హాయిగా నవ్వేదాకా !

begonia plant  టిష్యూ కల్చర్ తో వస్తాయి ఈ కలర్స్ అన్నీ . ఇవి పాట్ ప్లాంట్స్ . ఇందులో కొన్నిరకాలు  పూలు కూడా పూస్తాయి .

aglaonema plant చైనీస్ రకం .హైబ్రీడ్స్ లో చాలా రంగులు వస్తాయి .  కారిడార్ లలో కుండీలలో బాగా పెరుగుతుంది అని వివరిస్తూనే ఉంది.

గ్లాడియోలస్ దుంపలు కావాలని అడిగింది. నల్ల గులాబీ కావాలని అడిగింది . లేవండి ఈ వాతావరణానికి రావడం కష్టం అని చెప్పారు.  .లేదు వస్తాయి కదా ! అంటుంది తను అల్లరిగా .ఏదో కుండీలలో పెంచుకోవడానికైతే వస్తాయి. క్రాఫ్ గా తీయాలంటే చాలా కష్టం.  గొప్ప విషయాన్ని  కనుగొన్నట్టు చెప్పాడతను. రఘు ముఖానికి దగ్గరగా తల వొంచి   రహస్యంగా చెప్పింది అసలు నల్ల గులాబీ ఉండదని, టిష్యూ కల్చర్లో కూడా సాధ్యపడదని.  ఎవరైనా చెపితే నమ్మకండి. ముఖ్యంగా ఆన్ లైన్ షాపింగ్ లో " నవ్వుకున్నడతాను.

caladium bulbs  తీసుకుంది. దుంపజాతికి చెందిన మొక్కలు.  ఈ మొక్కలంటే నాకు చాలా ఇష్టం . హృదయాకారంలో అకులుంటాయి . మనవాళ్ళు ఏనుగు చెవులాకుల మొక్క అంటారు .  ఈ నలుపు గులాబీ కలిసున్నఆకులు చూడండి . ఎంత బావున్నాయో !నడిచే దారి పొడవునా నాటితే చాలా బావుంటాయి. పెద్దగా పెరిగిన చెట్ల మొదట్లో కూడా వేయవచ్చు.  ఇందులో ఎనిమిది రకాలున్నాయి అన్నీ కలిపి ఒకే కుండీలో నాటితే చాలా కలర్ఫుల్ గా బావుంటాయి. ఎంతో రసికుడు దేవుడంటారు  ఇందుకే కాబోలు.  నచ్చిన మొక్కలని చూసినందుకేమో  ఉత్సాహంగా, సంతోషంగా మాట్లాడేస్తుంది.

అయితే ఆర్డర్ పెట్టి  ఇంకా ఎక్కువ తీసుకుందాం అన్నాడు . మధ్యలో ఒకసారి భార్యకి  ఫోన్ చేసి " లతా  ! ఇండోర్ ప్లాంట్స్ ఆర్కిడ్ వెండా చాలా రకాలున్నాయి. నీకిష్టం కదా తీసుకు రానా !? అని అడగడం వింది. తర్వాత తీసుకోకుండా వదిలేయడం చూసింది. అతను  ప్రక్కకి వెళ్ళినప్పుడు అవి కూడా ఆర్డర్ లో నోట్ చేసింది.
మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత  తను డిజైన్ చేసిన నమూనాలని మొబైల్ ఫోల్డర్ ఓపెన్ చేసి  తీసి చూపెట్టింది. అన్నీ బావున్నాయని మెచ్చుకున్నడతాను.

కొన్ని గ్రాప్టింగ్ చేసుకోవచ్చనీ , కొన్నింటికి సీడ్స్ ఉంటాయని , కొన్ని మొక్కలు కొమ్మలు నాటితేనే వస్తాయని వివరంగా చెప్పి భారీ ఆర్డర్ ని సగానికి తగ్గించేసి చాలా ఖర్చు తగ్గించింది. ఉన్న నాలుగు నర్సరీలని ఓపికగా చూసి కావాలసినవన్నీ కొని తిరిగి ప్రయాణమయ్యేటప్పటికి మునుమాపు వేళైంది. ఉదయం నుండి కలసి తిరగడం,మాట్లాడుకోవడం వల్ల కొంత చనువేర్పడి

ఊటీలో దొడ్డబెట్ట , బొటానికల్ గార్డెన్,  గవర్నమెంట్ రోజ్ పార్క్ చూసారా ?

"లేదు మోహనా ! నేను ఒక్కసారే వెళ్లాను. అర్జంట్ పనులవల్ల వెంటనే తిరిగి వచ్చేసాను.  వీలు  చూసుకుని వెళ్లి బాబుతో గడిపి రావాలి."

"శ్రీనగర్ లో సిరాజ్ బాగ్ తులిప్ గార్డెన్స్ చూసారా? ఆసియాలో పెద్ద గార్డెన్స్ అవి.  మార్చ్ ఏప్రియల్ నెలల్లో  వెళితే చాలా బావుంటుంది. ఫ్యామ్లీతో వెళ్ళిరండి."

"కాశ్మీర్ నచ్చనివారెవరైనా ఉంటారా ? మీకు  ఏం  నచ్చాయక్కడ ? ఏం  తీసుకొచ్చారు ? ఆసక్తిగా అడిగాడు.

"నల్ల  తులిప్ ని అక్కడే చూసాను. చాలా ఇష్టపడి దుంపలని  తెచ్చాను కానీ  పూలు పూయించలేకపోయాను అదొక కోరిక మిగిలిపోయింది. అప్పటికి ప్లోరీ కల్చర్ నాకంతగా తెలియదు. ఇప్పుడు ట్రై చేయాలి." తర్వాత  వారి మధ్య మాటల్లేవ్ ! దారి మధ్యలో ఒక అరగంట ట్రాఫిక్ జామ్.

వెనుక సీట్లో కూర్చున్న ఆమె రోడ్డు వైపు చూస్తుంది. సన్నని వెలుతురు ఆమె ముఖం పై బడి కారు సీట్ పై  బడ్డ  నీడనే చూస్తున్నాడు.  ఆమె కళ్ళు మూసి తెరిచినప్పుడల్లా  నీడలో కదులుతున్న ఒత్తైన పొడవైన కనురెప్పల అందాన్ని  అతని హృదయం ఒడిసి పట్టుకుంది. ఆనీడని  ఏ చిత్రకారుడో చూస్తే నిమిషాల్లో వెలుగు నీడల కలయికలో అద్భుత చిత్రాన్ని ఆవిష్కరించగలడనిపించింది.  అప్పటికప్పుడు పొర్లి వచ్చే ప్రేమని ప్రకటించడం కూడా అవసరమనుకున్నాడు.

లక్ష్మీకాంత్ -ప్యారేలాల్ ద్వయం మనుషులని స్వరాలతో చంపేసే పని పెట్టుకున్నారేమో అన్నట్టుండే  మహేంద్ర కపూర్  తన మనసులో మాట చెపుతున్నాడేమో ననిపించే  పాట ప్లే చేసాడతను.

బహోత్ తర్సా హై  యే దిల్ తేరే సప్నే సజాకే ,
బహోత్ తర్సా హై  యే దిల్ తేరే సప్నే సజాకే ,
యే దిల్ కి బాత్ సున్ లే మేరి బాహోం మే ఆకే
జగాకర్  అనోకి ప్యాస్ మన్ మే .యే  మీఠి ఆగ్  జో బెహకా రహీ హై ,
యే  పెహలే ప్యార్ కీ ఖుష్బూ....
తేరి సాసోంసే షాయద్   ఆ.. రహీ హై .
 మేరీ సాసొంకో  జో మెహకా రహీ హై,

పాట మొత్తం వినకుండా ఇయర్ ఫోన్స్ చెవుల్లో పెట్టుకుని తన మొబైల్ లో పాటలు వినే పనిలో పడింది ఆమె.మర్నాడుదయమే  రఘు కాలేజ్ కి వచ్చేసరికే పనిలో బిజీ అయిపోయిన ఆమెని చూసి ఆశ్చర్యపోయాడు

ఆక్వాటిక్ ప్లాంట్స్ నాటడం కోసం చిన్న చెరువుని తవ్విస్తూ  తవ్విన మట్టిలో వర్మీ  కంపోస్ట్ కలిపి కుండీలలో  సగం పైగా నింపి  ఒక ప్రక్కకి పెట్టిస్తూ ఉంది.

దగ్గరకొచ్చి "అప్పుడే పని మొదలెట్టేసారా? ఈ రోజు రెస్ట్ తీసుకావాల్సింది"

"నర్సరీ వాళ్ళు ఈ రోజు సాయంత్రానికల్లా లోడ్ పంపిస్తామని ఫోన్  చేసారు. అదీ కాకుండా సెలవలైపోయే టప్పటికి  గార్డెన్ డిజైన్ పూర్తిచేయాలి కదా !"

"అదీ నిజమే !" ఒప్పుకున్నాడతను

"మీరు వాస్తుని నమ్ముతారా ? అడిగింది . నేను నమ్మడం నమ్మకబోవడం  కన్నా నమ్మే వాళ్ళని కాదని ముందుకు వెళ్ళలేను. మామయ్య కాలేజ్ నిర్మాణమంతా  వాస్తు ప్రకారమే జరగాలని ఆర్కిటెక్చర్ కి చెప్పి చేయించారు. ఇక ఇంటి విషయమంతా లత  చూసుకుంది. తనకి వాస్తు పిచ్చి బాగానే ఉంది. ఈశాన్యం మూలన   చిన్న బరువు కూడా పెట్టనీయదు.   చెట్లు కూడా వాస్తు ప్రకారమే ఉండాలంటుంది.

 పెంగ్ షుయి స్టైల్ గార్డెన్ ఐడియా ఒకటి ఉంది. ఎన్విరాన్ మెంట్ కి చాలా మంచిది. ఇప్పుడున్న స్థలం లోనే మంచి గార్డెన్ చేయొచ్చు. మీ మామయ్యా గారి అనుమతి తీసుకుని రండి. నేను డిజైన్ చేస్తాను.

"ఈ రోజు కుదరదు.  మామయ్యింటికి రేపు వెళదాం,,మీరు కూడా వద్దురుగాని "

రఘుతో పాటు కలసి వెళ్ళకుండా ఒక్కతే  మాధవరావు గారి ఇంటికి వెళ్ళింది ." రామ్మా రా ! ఎలా ఉన్నావ్ " ఆదరంగా  ఆహ్వానించారు .

"బావున్నాను . మీ ఆరోగ్యం ఎలా ఉంది ? పిన్ని గారు బావున్నారా ?

బాగుందమ్మా ! పూజ గదిలో ఉంది. ఆమె పూజ రెండు మూడు గంటలు పడుతుంది. కూర్చో ! ఏదో గార్డెన్ డిజైన్ చేస్తానన్నావట  కదా ! రఘు చెప్పాడు.  అయినా విధ్యార్ధులతో పాటు నీక్కూడా  సెలవలే  కదమ్మా! సెలవలప్పుడైనా మీ అన్నయ్య ఇంటికి వెళ్లి రావాల్సింది.

"పనిలోనే నాకానందం దొరుకుతుంది. బాబాయి గారు.  పండగ రోజు ఇంట్లోనే ఉంటారని  ఎక్కువ సమయం తీసుకుని మీకన్నీ విపులంగా చెపుదామని ప్లాన్ తో సహా వచ్చాను". అంటూ చేతిలో పేపర్స్ తీసి  డిజైన్ చూపించి  ఏయే రకాలు మొక్కలు ఎలా వేస్తే  బావుంటుందో చెప్పింది .  విద్యార్ధులని ఎలా భాగ స్వామ్యం చెయ్యాలో ఎలాంటి దిగుబడి వస్తుందో,ఆ వచ్చిన మొత్తాన్ని పేదపిల్లలకి ఫీజుల స్కాలర్ షిప్ ఏర్పాటు చేయవచ్చో  వివరించింది.

"నువ్వు చెప్పిన విధానం నాకు బాగా నచ్చిందంమ్మా! మొత్తానికి కాలేజ్ రూపురేఖలు మర్చేస్తున్నావ్ ! నాకు తెలియక అడుగుతున్నాను . నువ్వు ఇలాంటి చిన్న ఉద్యోగం చేయడమెందుకమ్మా! ఏ  వ్యవసాయ యూనివర్సిటీ లోనో ఉద్యోగానికి వెళ్ళాల్సింది. మంచి జీతం వచ్చేది కదా !".

"నేను డబ్బుకోసం పని చేయడం లేదు బాబాయి గారు. మన ప్రాంతంలో చూడండి. వ్యవసాయం చేసేవాళ్ళే లేరు. భూములన్నీ వెంచర్లుగా మారిపోతున్నాయి. అగ్రికల్చర్ జోన్ అంటేనే  రైతులు మండి పడుతున్నారు . అందరూ సాఫ్ట్ వేర్ లు, డాక్టర్  లూ బిల్డర్స్ వ్యాపారాలు చేసేవాళ్ళే  అయిపోతే వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరూ ?,అసలు వ్యవసాయం దండగై పోతుందని వేలు పెట్టకుండానే పారిపోయే వారందరికి  వ్యవసాయం రుచి చూపించాలి. కాలేజీలో చదివే ప్రతి విద్యార్ధికి కొంత అవగాహన వస్తే కొంతమందైనా వ్యవసాయం వైపు దృష్టి మళ్ళిస్తారని నా ఆలోచన. కనీసం ఇళ్ళల్లో కూరగాయలైనా పండించుకుంటారు.  పూలు,పళ్ళు ,కూరగాయల తోటలు ఆధునిక పద్దతిలో చేస్తే మంచి లాభాలు  వస్తాయి" .

"బావుందమ్మా ! మన కాలేజ్ లో కూడా అగ్రికల్చరల్ కోర్స్ లు పెట్టడానికి అనుమతి కోరదాం. రూల్స్ అవన్నీ ఉంటాయిగా . ప్రయత్నం చేద్దాం . అన్ని రకాల బిజినెస్ లు చేసాను. బోలెడంత చచ్చింది. వ్యవసాయానికి మంచి జరుగుతుందంటే నేనెందుకు కాదంటాను.పైగా మన మూలాలన్నీ అక్కడే ఉన్నాయి కదా !"

"ప్లాంట్ టిష్యూ కల్చర్ లో స్పెషలైజ్ చేసాను . లాబ్ లలో నాలుగేళ్ళు పనిచేసాను. ఫాలీ హౌసింగ్ ఫార్మింగ్ చేయాలని  జెర్బెరా పూలపంట సాగుచేయాలని బాగా  ఉంది. శంకర్ అన్నయ్య పొలం కౌలు కన్నా ఇస్తాడేమోనని ట్రై చేసాను.ఇవ్వనన్నాడు "అంది కొంచెం నిసృహగా .

"మీనాన్న కూడా నీకన్యాయమే చేసాడనుకుంటాను ఎప్పుడూ,  బాధపడకమ్మా ! నీకు మంచే జరుగుతుందిలే ! "అన్నారు.

రిపబ్లిక్ డే రోజున జెండా అవతరణ కార్యక్రమం  తర్వాత మాధవరావు గారు తన ప్రసంగంలో  మరుసటి విద్యాసంవత్సరం నుండి వ్యవసాయ విద్యా కోర్సులు ప్రవేశ పెడుతున్నామని చెప్పి అందరిని సంతోషపరచారు. పిల్లలతో కార్యక్రమాల రూపకల్పన హడావిడిలో ఉన్న మోహన దగ్గరకి వెళ్లి  " ఇదిగోనమ్మా! ఇది నా తరపున గిఫ్ట్ " అంటూ ఒక కవర్ ఇచ్చారు .

గిఫ్ట్  !?  ఆశ్చర్యంగా చూసి "తర్వాత చూస్తాను సర్ !" " లేదమ్మా ! అది చూసినప్పుడు కల్గిన ఆనందాన్ని నేను స్వయంగా చూడాలి."

కొంచెం సంకోచంగా కవరు చించి లోపలున్న పేపర్స్ తీసి  చదువుకున్న ఆమెకి  బోలెడంత ఆశ్చర్యం,  ఆనందం. "నీతెలివితేటలు,  అంకితభావాన్ని చూసి నమ్మకంతో  నాలుగేళ్ళపాటు నా పొలాన్ని లీజుకి ఇస్తున్నాను. బ్యాంకు లోన్, లేబర్ విషయంలో నీకు సాయం చేస్తాను. మంచి పేరు రావాలి నీకు " తల మీద చేయి పెట్టి ఆశ్వీరదించారు.

"మీ నమ్మకాన్ని నిలబెడతాను సర్ "

నగరంలో ఏర్పాటు  చేసిన పుష్ప ఫల ప్రదర్శన శాలకి   కుండీలలో పెంచిన పూల  మొక్కలని, బోన్సాయ్ మొక్కలని,  టిష్యూ కల్చర్ లో రూపొందించి అధిక దిగుబడిని సాధించిన అరటి చెట్టుని గెలతో సహా   తీసుకువెళ్లి  కాలేజ్ తరపున ప్రదర్శనకి పెట్టింది మోహన.  స్టేట్ వైడ్  బెస్ట్ ఎంట్రీ అవార్డ్ సాధించిన ఆమెని మనఃస్పూర్తిగా అభినందించారు మాధవరావు గారు.

రుతువులు మారుతున్నాయి.  ఉగాది వెళ్లి శ్రీరామ నవమి వచ్చింది. ఊరంతా సీతారాముల కల్యాణం సందడి. పానకం సేవన.  చిరుజల్లుల తడిలో ఆనందంగా గంతులు. రాత్రివేళ  మండపంలో నుండి వినబడుతున్న హరికథని   శ్రద్దగా వింటూ  చెట్టున పూసిన గుండు మల్లెలని కోసి  మాలకడుతూ కూర్చుంది మోహన.

"శాస్త్రి గారు చెపుతున్న హరికథ ఆగి వినమంటుంది. మీ మల్లెల పరిమళాలేమో కాసేపాగి ఆస్వాదించి వెళ్ళమని పిలుస్తున్నాయి, నేను   లోపలకి రావచ్చా ? అని అడిగాడు  రఘురామ్.

"ఈ రోజు వాన లేకుండానే వచ్చారు. ఆతిధ్యమడుగుతారని భయమేమి లేదు లెండి. మీరడిగిన బుక్ కూడా దొరికింది . తీసుకుని వెళ్ళొచ్చు రండి ".అంటూ ఆహ్వానించింది .

"అయినా ఈ టైం లో వాక్ ఏమిటండీ ! అతిగా అలసిపోయినా నిద్ర రాదంట . అది గమనించండి. "  బుక్ తీసుకు రావడానికి లోపలకి వెళ్ళింది. ఆమె వెనకనే ఇంట్లోకి వెళ్లి కుర్చీలో కూర్చున్నాడు.

"ఒకవేళ తలుపులు మూసి ఉంటే  మిమ్మలెలా  నిద్ర లేపాలా అని ఆలోచించుకుంటూ వచ్చాను. లక్కీగా మీరు  మేలుకునే వున్నారు !? అంతా ఆ దేవుడి  దయ అని గుడి వైపు చూపించి చెప్పాడు.

" ఎందుకీ  సమయంలో ఇంటికి రావాలనుకున్నారు ? ఏమైనా  అర్జంట్ పని  పడిందా  ?"
వాచ్ చూసుకుంటూ  లేచి నిలబడి తన వెంట తెచ్చిన చిన్న బాక్స్  తెచ్చి ఆమెకిచ్చి  హ్యాపీ బర్త్ డే మోహనా ! అంటూ విష్ చేసాడు. ఆశ్చర్యంగా చూసింది. " నువ్వు పచ్చగా పది కాలాలు పాటు సంతోషంగా ఉండాలని  కోరుకుంటున్నా " అన్నాడు మళ్ళీ . అలా విష్ చేయడంలో హృదయం ఉందని ఆమెకి అర్ధం అయింది .

"విష్ చేసారు   చాలు కదా ! మళ్ళీ ఈ గిఫ్ట్ ఏమిటీ ? నాకిలాంటివన్నీ ఇష్టం లేదు,సారీ! "అంటూ అతనికి  తిరిగి ఇచ్చేయబోయింది.

"లేదు లేదు ఇది మీరు  తీసుకోవాల్సిందే .  ఈ గిఫ్ట్ ఏమిటో చూస్తే   మీరు నిజంగా  ఆనంద పడతారు, ప్లీజ్ ! ఓపెన్ చేయండి " బ్రతిమలాడాడు .

"సరే అయితే " సన్నగా పొడవుగా ఉన్న  బాక్స్ ని చుట్టిన రేపర్ ని విప్పింది. ఎర్రటి ముఖముల్ క్లాత్ అంటించిన కార్డ్ బాక్స్ అది. ఏ విలువైన నగో అయి ఉంటుంది.  తప్పకుండా తిరస్కరించాల్సిందే అనుకుంటూ చిన్నగా పై మూత తీసి చూసింది. నాలగైదు అంగుళాల పొడవుతో  విరిసి విరియని  కొంచెం నల్లగా కనబడే తులిప్   చూడగానే ఆమె పెదవులు  నెమ్మదిగా విచ్చుకున్నాయి. ఆనందంగా అతని చేయి అందుకుని "థాంక్ యూ సో మచ్" అంది. అది చూసినతని కళ్ళ లోని వెలుగులు వేయి చేతులై ఆమెని ఆత్మీయంగా చుట్టేసాయి.

"ఎలాగైతేనేం .. అన్నమాట నిలబెట్టుకుని మీరు మంచి గార్డెనర్  అనిపించారు. అసలు మన వేడి వాతావరణంలో ఈ నల్ల  తులిప్  పూయడం చాలా కష్టం. అందుకు ఎంతో  ప్రత్యేకమైన శ్రద్ద కావాలి.  మీరు సాధించారు. ఇంతే శ్రద్ధతో కాలేజ్ గ్రౌండ్ లో కూడా నల్ల తులిప్ లు  పూయించాలి "

"ఇంకా ఏమేమి కోరికలున్నాయి మీకు ? వినాలని ఉంది  చెప్పేసేయండి "

" వడ్లు ఏ చెట్టుకి కాస్తాయి అని అజ్ఞానంగా ఏ విద్యార్ధి అడగకూడదు. పిల్లలందరూ గార్డెనింగ్ ఇంటరెస్ట్ గా చేయగలగాలి. హార్టీకల్చర్ ప్రాముఖ్యత అందరికి తెలియాలి.  పంట పొలాలని  వ్యాపారంగా మార్చకూడదు, అందరికి అన్నం పెట్టే  రైతు ఎప్పుడూ నష్టపోగూడదు. రైతు ఆత్మహత్యలు  అస్సలుండకూడదు.  అదీ నా కోరిక" అంది.

మోహన మాటలకి అతని కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లాయి.  కాసేపు ఆమెనే చూస్తూ ఉండి  పోయాడు.
తర్వాత లేచి " వెళ్లొస్తాను. గుడ్ నైట్ " అంటూ  కొంచెం దూరం వెళ్ళాక  మళ్ళీ వెనక్కి తిరిగి చూసి వెళ్ళిపోయాడు.

ఉదయం రౌండ్స్ కి   వెళ్ళి వచ్చేటప్పటికి ఆఫీస్ లో కూర్చుని ఉన్నాడు మామయ్య. పేరుకి ఆ కాలేజ్ కి  చైర్మెనే కానీ ఎప్పుడో కానీ  కాలేజ్ కి  రాని మామయ్య పనిగట్టుకుని కాలేజ్ కి రావడం ఆశ్చర్యం కల్గించింది.

"ఏరా ! ఎలా ఉన్నావ్ ?"

"బాగున్నాను మామయ్యా ! ఫోన్ చేస్తే నేనే వచ్చే వాడిని కదా "

"ఇక్కడైతే నీతో ఫ్రీ గా మాట్లాడటానికి బావుంటదని  నేనే వచ్చాను. "లత ఇంటికి.వచ్చింది నిన్న. ఒకటే ఏడుపు. అత్తయ్య కూడా కంగారుపడుతుంది. విషయమేమిటో కనుక్కుందామని వచ్చాను."

"లత  అనుకున్నట్టు ఇక్కడేమీ జరగడంలేదు. కావాలని రాద్దాంతం చేస్తుందంతే !"

లత  రాద్దాంతం చేస్తుందో  లేక నువ్వు చేసిన తప్పుకి న్యాయం చెయ్యాలనుకుంటున్నావేమో తెలియదు కానీ నువ్వు నల్గురి నోటిలో నానుతున్న విషయం మర్చిపోతున్నావ్ . పిల్లలకి విద్యాబుద్దులు నేర్పించే చోట ఇలాంటి మాటలు  రావడం మంచిది కాదు.  ఏదో ఒకటి చేయి . అది చెప్పి పోవడానికే వచ్చాను. మెత్తగా చెప్పాల్సింది చెప్పేసి అంతర్లీనంగా ఏదో సూచన ఇచ్చేసి  వెళ్లి పోయాడాయన.

*************

పెదనాన్నా ! అదే నీ కూతురికి ఇలాంటి అన్యాయం జరుగుతుంటే ఊరుకుంటావా ? తప్పు చేస్తున్న ఆయన్ని మందలింఛి ఆ మోహన ఉద్యోగం పీకేసి కాలేజ్   ఛాయలకి రాకుండా చేసేవాడివి కాదు."  ప్రవహిస్తున్న కన్నీటి వాగుకి కర్చీఫ్ ఆనకట్ట వేయలేకపోతుండగా అడిగింది లత.

"రఘురామ్ అలాంటి మనిషో  కాదో నీకు తెలియదా ? పదిహేనేళ్ళుగా  భార్యగా వాడినర్ధం చేసుకున్నది ఇంతేనా !? ఆ అమ్మాయికి  ఆర్గానిక్ గార్డెనర్ గా, టిష్యూ కల్చరిస్ట్ గా మంచిపేరు ఉంది . మన కాలేజ్ లోచదివే  పిల్లలకి ఆర్గానిక్ గార్డెనింగ్ చేయడంలో శిక్షణ ఇప్పిస్తున్నాం. నువ్వే చూసావుగా, స్టేట్ వైడ్ జరిగిన పుష్పఫల ప్రదర్శనలో మన కాలేజ్ బెస్ట్ ఎంట్రీ అవార్డ్ కూడా గెలుచుకుంది. వాళ్ళిద్దరూ కలిసి నర్సరీలకి, కాన్ఫరెన్స్ లకి  కలసి వెళ్ళినంత మాత్రాన అనుమానించడం, గొడవపడటం మంచిది కాదు. నువ్వు ఆవేశాన్ని తగ్గించుకుని ఆలోచించి చూడు.  నువ్వు అప్పుడప్పుడూ సర్వీస్ కేంప్స్  నిర్వహిస్తూ ఉంటావు కదా ! ఆడమగ కలిసి పనిచేయడం లేదా  చెప్పు ?  అనునయంగా నచ్చచెప్ప జూసాడు.

"ఎంతైనా ఆమె నీ స్నేహితుని కూతురు. ఆయనేమో నీకు అత్యంత ఇష్టమైన మేనల్లుడు.  నా  కష్టం నీకు చెప్పుకుందామని వస్తే వాళ్ళనే సమర్దిస్తున్నావ్ ! నువ్వు ఇలా అంటావని తెలిసుండి కూడా రావడం నాదీ బుద్దితక్కువ."

"నేను చెప్పేది కూడా  అర్ధం చేసుకో లతా  ! మనకవకాశం ఉందికదా అని కాలేజ్ నుండి పంపేయగలం, కానీ ఊరి నుండి పంపేయగలమా? రఘుని వెళ్ళకుండా కట్టడి చేయగలవు. కానీ మనసులో ఉండకుండా కట్టడి చేయగలవా ? ఆవేశంతో నిర్ణయాలు తీసుకుని నీకు నువ్వే అన్యాయం చేసుకొంటున్నావనిపిస్తుంది."

"నేను ఏదైతే భరించలేను అనుకున్నానో అదే ఎదురవుతుంది పెదనాన్నా! "అంది  ఏడుస్తూ

"భర్త ప్రేమని సంపాదించడమంటే  అధికారం ప్రదర్శించినంత,  వస్తు సామాగ్రి సంపాదించడమంత తేలిక కాదమ్మా"
 అంటూనే  మాధవరావు గారు నిస్సహాయంగా భార్య వైపు చూసారు

ఆ చూపునర్ధం చేసుకున్నామె లత దగ్గరకి వచ్చి ఓదార్చి నేను చెప్పింది విన్న తర్వాత  ఏదైనా మాట్లాడు  అంటూ గదిలోకి, గతంలోకి తీసుకువెళ్ళింది.

ఇరవయ్యేళ్ళ క్రితం ఒకానొక సిగ్గుమాలిన పని చేసి మీ పెదనాన్న  ముందు  రఘు దోషిగా నిలబడ్డాడు .
మా ఎదురుగా పెదనాన్న  స్నేహితుడు రాఘవరావు మాస్టారు ఆయన భార్య జానకమ్మ , కూతురు మోహన.
 కందిరీగ నడుమేసుకుని సిగ్గుల మొగ్గలా ముడుచుకుపోయే మోహనని  ఎప్పుడూ ఆటపట్టిస్తూ ఉండేవాడు. ఆమె వాటిని సరదాగానే తీసుకునేది.  కాలేజ్ కి వెళ్ళడానికి రోడ్డు మీద  ఒంటరిగా నించున్నప్పుడు చూస్తే మరింత ఈలలేయాలనిపించే యవ్వనోత్సాహంలో ఉండేవాడు రఘు .

 ఒకరోజు స్కూటర్ పై  లిఫ్ట్ ఇస్తానని ఎక్కించుకుని రోడ్డుప్రక్కనే ఉన్న సపోటా తోటలోకి తీసుకెళ్ళి   బలత్కారం చేసి  తర్వాత భయమేసి ఆమెని అలాగే వదిలేసి  మాయమైపోయాడు.  మూడు  రోజులకి మన  ఇంట్లో  వాళ్ళ ముందు సిగ్గుతో తలొంచుకుని నిలబడ్డాడు

"తెలిసినవాడే, ఒక ఊరివాడే అని నమ్మినందుకు నా  బిడ్డ జీవితాన్ని ఇలా కుక్కలు చింపిన విస్తరిలా చేయోచ్చా?. అవమానంతో బావిలో దూకింది  ఆయువుండి బ్రతికింది కానీ  చస్తే మాగతి ఏమికానూ? ఎవరేమి అడిగినా పెదవిప్పి ఏమీ చెప్పదు. మూడు రోజులకి కానీ  మీ మేనల్లుడి చేసిన నిర్వాకం చెప్పింది. నలుగురికి  ఈ విషయం తెలియక ముందే మీరే ఏదో ఒక న్యాయం చేయాలి మాధవరావు గారూ "అంటూ   పమిట చెంగుని ఏడుపు వినబడకుండా నోటికి అడ్డుపెట్టుకుంది జానకమ్మ.

ఇద్దరికీ పెళ్ళిచేసేద్దాం .  రాఘవా, ఏమంటావ్ ? మీ పెదనాన్న  తీర్పు ప్రశ్న ఒకేసారి.

అలాగే ! నేను మాత్రం కట్న కానుకలేమైనా తక్కువ చేస్తానా ? పెళ్ళైన తర్వాత కూడా చదువుకుంటారు. ఆ ఖర్చు కూడా నేనే భరిస్తాను. అనంటున్నరాఘవరావు గారి మాటలని  మోహన అడ్డుకుంటూ "నాన్నా ! జరిగిన తప్పు అతనొప్పుకుంటాడా లేదా అనేది తెలుసుకోవడానికి మాత్రమే వచ్చాను. నాకు కొన్ని ఆశలుంటాయి. ఎలాంటి వాడిని చేసుకోవాలి, ఎలాంటివాడు వద్దో అన్నది నా ఇష్టం. ఇలాంటి రౌడీ ని పెళ్ళిచేసుకోవడం మాత్రం నాకిష్టం లేదు. అసలు నేను పెళ్ళే చేసుకోను." అంటూ వెళ్ళిపోయింది.

జరిగిన విషయం పట్ల అమ్మాయి చాలా  కోపంగా ఉంది.  తర్వాత నచ్చజెప్పి చూస్తాను. రఘురామ్ నువ్వు ఇచ్చిన మాట మరవొద్దు.

అలాగే మాస్టారూ ! నేనెప్పుడూ మీకిచ్చిన ఈ మాట తప్పను. మోహనని తప్పకుండా  పెళ్లి చేసుకుంటాను అని మాట ఇవ్వడం జరిగింది.

ప్రతి రోజూ కాలేజ్ లో మోహన కనబడుతూనే ఉండేది వాడికి .  చూస్తే చాలు  అసహ్యంగా ముఖం త్రిప్పుకుని వడి వడిగా వెళ్ళిపోయేదట  రఘు మాట్లాడటానికి చేసిన ప్రయత్నాలన్నీ  విఫలమయ్యేవి. ఆ సంవత్సరంతో వాడి   చదువు అయిపొయింది. తనకి  MBA చదవాలని ఉందని బొంబాయికి  వెళ్ళాలని చెప్పాడు  మరి మోహన తో పెళ్లి విషయం ఏం చేసావ్ రా !  విషయం గుర్తు చేసాడు పెదనాన్న. ఇచ్చిన మాట తప్పను. రాఘవరావు మాస్టారింటికీ వెళ్ళి వద్దాం అన్నాడు.

అందరం వెళ్లి  పెళ్లి గురించి  అడిగాము. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. మీరిలా వెంటపడితే నేనసలు ఇల్లోదిలేసి వెళ్ళిపోతాను అంటూ విసురుగా పెరట్లోకి వెళ్ళిపోయింది. మొండిది బాబు!తననుకున్నట్టే ఉండాలనుకుంటుంది. నీకు రెండేళ్ళు చదువుంది కదా! అంతలోకి తన చదువు పూర్తవుతుంది. అప్పుడు చూద్దాం. ఈ లోపు త్వరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు అంటూ రఘు చేయి పట్టుకున్నారు మాస్టారు.

రఘు  MBA అయిపోయి ఉద్యోగంలో జాయిన్ అయ్యాక ఇంకొకసారి పెళ్లి విషయం కదిలించారు.  అప్పటికే తన చదువు ముగించి కాలికట్ లో  ప్లాంట్ సైన్స్ ప్రాజెక్ట్ కొ ఆర్డినేటర్ గా ఉద్యోగం సంపాదించించి వెళ్ళిపోయింది. ఉత్తరం వ్రాసి విషయం చెపితే   సారీ నాకిష్టంలేదు. ఎన్నిసార్లడిగినా నా సమాధానం ఇదే !  అతన్ని  పెళ్లి చేసేసుకోమని చెప్పండి.  అని తిరుగు టపాలో జవాబు వచ్చింది.

చిన్న మామయ్య కూతురు లత ని చేసుకోవడం నీకిష్టమేనా ! అడిగాడు పెదనాన్న.

మీ ఇష్టం మామయ్యా! అన్నాడు తలంచుకునే ..

తొందరేం లేదు నాలుగు రోజులు ఆలోచించుకునే చెప్పు. లత తమ్ముడు కూతురైతే  చెల్లెలు కొడుకువి  నువ్వు .  నా ఆస్తి మొత్తానికి వారసులు మీ ఇద్దరూ . రెండు వైపులా కలుపుకుంటే ఎవరికీ ఈర్ష్యాద్వేషాలు లేకుండా అందరూ బాగుంటారని  నా కోరిక.

ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. నీకన్నా మా మంచి కోరే వాళ్ళు ఎవరుంటారు మామయ్యా !  నీ ఇష్టమే నా ఇష్టం "అన్నాడు .

అలా మీ ఇద్దరికీ  వైభవంగా పెళ్లి జరిగిపోయింది. ఆ అమ్మాయి జీవితమేమో  అలా అయిపొయింది లతా ! మొండిది. రోగాలు రోష్టులతో పడిపోయిన తల్లి తండ్రిని కంటికి రెప్పలా చూసుకుంది. ఏదో ఇప్పుడే కొంత స్థిమితంగా ఉంది. ఆ అమ్మాయిని అల్లరి చేసి నువ్వు అల్లరిపాలు కాకు. రఘు నీకన్యాయం చేయడు. నీ అనుమానాల నుండి బయటపడి  సానుభూతితో ఆలోచించు. ఆ అమ్మాయంటే అభిమానమే తప్ప నువ్వనుకునే సంబంధాలు పెట్టుకునే మనిషి కాదని నీకు తెలియదా !? గ్రుప్పిట బిగించి పట్టుకుంటే ఇసుక జారి పోతుంది అర్ధం చేసుకుని జాగ్రత్తగా ఉండు.  నచ్చజెప్పే ప్రయత్నం చేసిందావిడ.

"ఇదన్నమాట వీళ్ళు కలిసి తిరిగే కారణం. నిజమేమిటో ఇప్పుడేగా తెలిసింది .నేనెలాంటిదాన్నో ఇక చూస్తారు " విసురుగా వెళ్ళిపోయింది.

ఇంటి ఎదురుగా కారు   డ్రైవింగ్ సీట్ లో నుండి దిగిన ఆమెని  లత గా గుర్తించింది మోహన. ఒక నెల క్రితమే కాలేజ్ ఫెస్ట్ జరిగినప్పుడు చూసింది.  చుట్టుప్రక్కల ఇళ్ళన్నింటిని కలియజూస్తుండటం గమనించి  ఎవరి అడ్రెస్స్ కోసమో వెతుకుతుందని గ్రహించి  దగ్గరకి వెళ్లి లత  గారు నమస్తే ! అని విష్ చేసింది.

అదేమీ పట్టించుకోకుండా మీరే కదూ మోహన  ? "అవునండీ ! నాతో ఏమైనా మాట్లాడాలా, లోపలికి రండి "

" రావాల్సిన వాళ్ళు వస్తున్నారు కదా ! ఇంకా నేనెందుకు లెండి ! ఆయనెక్కడ ? కొంచెం బయటకి పిలుస్తారా? .

"ఆయనంటే  రఘురామ్ గారి గురించేనా మీరడగడం. వారిక్కడెందుకు ఉంటారు ? కాలేజ్ లో ఉండొచ్చు లేదా ఇంట్లోనే  ఉండొచ్చు. అక్కడ కెళ్ళి చూడండి ప్లీజ్ "

"మీకొక విషయం చెప్పి వెళ్లాలని వచ్చాను. ఇదిగో, దీనిని తాళి అంటారు. ఇది కట్టినవాడు ఇంట్లోకి వస్తేనే ఎవరికైనా మర్యాద  ! నా మెడలో తాళి కట్టినతను తరచూ నీ  ఇంటికి రావడం మర్యాదస్తుల లక్షణమెలా  అవుతుందేమో మీరే చెప్పండి.భర్త కోసం బాధపడుతూ  నీ ఇంటి ముందు ఏడ్చి గగ్గోలు పెట్టేసే ఆడదాన్ని కాదు.  పోలీస్ స్టేషన్ కెళ్ళి వెర్బుల్  అండ్  ఫిజికల్ అబ్యూజ్ చేస్తున్నాడని కేస్ పెట్టి భర్తని గుప్పిట్లో బంధించుకోవాలని చూసే భార్యని కాదు. బాధపడి,భంగపడి  విడాకులిచ్చేసి  వెళ్ళిపోయే రకాన్ని కాదు.  హక్కు , అందం,ఆస్తి అంతస్తు , పలుకుబడి అన్ని ఉన్నదానిన్నేను. ఆయన్ని ఎలా లాక్కెళతానో చూస్తూ ఉండండని, జస్ట్ మీకు చెప్పి వెళదామని వచ్చానంతే " మెరుపులా వచ్చి ఉరుములా ఉరిమింది

"లత  గారు  ఒకరు చేసే అన్యాయం కన్నా ఎవరికివారు చేసుకునే అన్యాయం ఎక్కువ. ఎవరిని తక్కువ చేసి మాట్లాడకండి  వెళ్ళండి ప్లీజ్ !  అంటూ అంతే మర్యాదగా బయటకి  చేయి చూపి లోపలికి  వచ్చి గేట్ మూసేసింది. ఆలోచిస్తున్న కొద్దీ మనసంతా చేదుగా అయిపొయింది మోహనకి.

ఆ మర్నాడే రీసెర్చ్ కోసమని పూణే  వెళ్లి పోయింది.  వెళ్ళేటప్పుడు మర్యాద కోసం కూడా  రఘుకి చెప్పనే లేదు. ఆర్నెల్ల తర్వాత తిరిగి వచ్చే టప్పటికి లత అపోహలన్ని తొలగిపోతాయని ఊహించింది. కానీ అవి పీటముడేసుకుని అలాగే భీష్మించుకుని కూర్చున్నాయని తెలిసినప్పుడు గంభీరంగా మారిపోయింది.

"మోహనా ! ఈ రాత్రికి ఇక్కడుండవచ్చా !"

"ఉండాలనుకుని వచ్చినప్పుడు మళ్ళీ అడగడం ఎందుకు ?"

"నిత్యం  ఇంట్లో గొడవ జరుగుతుంది. ఇంటికి వెళ్ళాలంటే భయంగా ఉంది.  అసలు ఇక్కడికి రాకూడదనుకున్నాను, వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టకూడదని అనుకున్నాను. కానీ రాక తప్పలేదు."

"ఏమైనా తిన్నారా ? "

"ఊహూ ! ప్రత్యేకంగా ఏమీ చేయొద్దు. నువ్వేం  తింటే అదే పెట్టు."

ఉడికించిన కేరట్ ని  జ్యూస్ చేసి అందులో చల్లని పాలు కలిపి ఇచ్చింది. నేలపై చాపేసి బొంతేసి గంజిపెట్టిన ఇస్త్రీ దుప్పటేసి బూరుగ దూది దిండు ఇచ్చింది. ప్రక్కనే ఇంకో చాపేసుకుని కూర్చుని "ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా  రఘూ ! మొదటిసారి ఆమె అలా సంబోదించడం.. " నీ చేయి ఇలా ఇవ్వు"  ఎడమచేతిని అతనికి అందించింది. .స్పర్శ ఒకొరి నుండి మరొకరికి ప్రవహించే సజీవమైన భాష. అతని మనసులో ఏముందో ఆమెకి విశద పరుస్తుంది.

"ఇంకా నా పై ద్వేషం అలాగే ఉందా ? "
"
 ప్రేమ కూడా లేదు" బాగా అలసిపోయారు పడుకోండి. అంది కుడి చేత్తో తల సవరిస్తూ .  ఆమె చేతిని చెంపకానించుకుని నిద్రలోకి జారిపోయాడు.

పసిపిల్లాడిలా నిద్రిస్తున్న అతన్ని చూస్తుంటే   ఆమె  అంతరాలలో చిత్రంగా ఏదో స్పందన. ఆ స్పందనలు  చిగిర్చి పుష్పించి ఫలించి అతనిని సొంతం చేసుకోవాలనే కోరికకి ఉసిగొల్పుతున్నాయి. అప్పుడెప్పుడో కాదన్నావ్, ఇప్పుడు అతను నీవాడవడం ఎలా సాధ్యం ? అంతరాత్మ హెచ్చరించింది. అవును   అతన్ని  ఎక్కువగా ప్రేమించకూడదు. ప్రేమ అధికారాన్ని కోరుకుంటుంది. కాలం చెట్టుకి చీకటి పువ్వు పూసింది,  రాలిపోతుంది,  తనూ అంతే ! కాకపొతే కొన్ని కలలు, కాసిని కన్నీళ్లు.  ఇవి చాలు ఈ జన్మకి అనుకుంటూ  అలాగే నెమ్మదిగా జారగిలపడింది కన్నీటితో సహా,
 తర్వాతెప్పుడో అతను ఉలికిపడి నిద్రలో నుండి లేచి కూర్చున్నాడు. కాళ్ళు జాపుకుని గోడకి ఆనుకుని కళ్ళు మూసుకుంది,  ఆమె చెక్కిళ్ళపై దుఃఖ చారికలు.

"నిజం చెప్పు మోహనా ! నా సాన్నిహిత్యం నీకు మాత్రం ఇష్టం కాదూ ! సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు.  క్షణకాలం ఆ కళ్ళు కళ్ళూ  ముడివేసుకున్నాయి. ఆమె తలదించుకుంది ఆయినా ఆ  కళ్ళల్లో వెలుగు  అతను  గమనించకపోలేదు. " నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు,  ప్రేమ కొక భాష ఉంటుంది  అది  వెలుగు భాష, దాచుకోవాలన్నా దాగదు "  చెప్పు మోహనా ?

మనసులో భావాలన్నీ గుదిగుచ్చి  ఆశువుగా కవిత్వం చేసి వినిపించింది

"వాన జీవితకాలమంతా కురుస్తుందని ఆశపడే మూర్ఖురాలిని కాదు. కురిసినప్పుడు దోసెడు నీళ్ళైనా దాచుకోలేని నిరుపేదరాలిని.  ఈ పేద మనసులోకి నడిచొచ్చిన నీ పాదాల కంటిన చినుకులే తప్ప ,ఈ  ఇంట కొంచెం పాధ్యమైనా లేదు  ఆతిధ్యమివ్వ సాధ్యమసలే కాదు, ఆశలేమీ లేవు ఆశయాలు తప్ప, పన్నీరసలే  లేదు  కన్నీరు తప్ప  ఈ గుండె గదిలోకి అసలు రాకోయీ అనుకోని అతిధీ ...

"నేనప్పుడూ చాలా పొరబాటు చేసాను మరొకసారి బలవంతంతో నైనా పెళ్లి చేసుకోవాల్సింది". గతాన్ని గుర్తు తెచ్చుకుని నొచ్చుకున్నాడతను.

రఘూ ! మానీ మానని గాయాలపై ఇప్పుడీ  నగిషీలు పెట్టుకోవడం ఎందుకు?

ఆత్మాభిమానం నిలుపుకోవాలనుకున్నాను కానీ ఆత్మీయమైన మనిషిని చేరనివ్వడం లేదని అప్పుడనుకోలేదు. ఒకరకమైన జఢత్వంతో ఒంటరైపోయానని ఇప్పడు తెలుస్తుంది.  అలా అని మీకిప్పుడు  సమస్యలు తేవాలని నాకు లేదు.  ఎక్కడికైనా వెళ్ళిపోవాలని చూస్తున్నాను. కానీ మధ్యలో ఈ ఫార్మింగ్ ఇవన్నీ వదిలేసి ఎలా వెళ్ళగలను? నా మీద నమ్మకంతో చాలా పనులు అప్పగించారు మీ మామయ్య.  ఆ పనులన్నీ దిగ్విజయంగా పూర్తవ్వాలి. నా స్వార్ధంతో వాటిని నాశనం చేయలేను. ఆ గొంతులోని ఆవేదనకీ చలించిపోయాడు.

నువ్వెక్కడికి వెళ్ళే ఉద్దేశ్యం పెట్టుకోకు మోహనా !  ముఖ్యంగా  ఈ రీసెర్చ్ అవీ వదిలి ఎక్కడికీ వెళ్లొద్దు. నేనే అందుకు  పరిష్కారం ఆలోచిస్తాను అన్నాడతను .
**********
కార్పెట్ పరుచుకుని క్రింద పడుకున్నతని ప్రక్కన వచ్చి కూర్చుంది లత .  లాప్టాప్  మూసి  తలకి ఉన్న హెడ్ ఫోన్స్ తీసి ప్రక్కన పెట్టి లేచి కూర్చున్నాడు రఘు.  "నేను కూడా ఇక్కడే పడుకుంటానీవేళ " కారణమేమిటో అతనికర్ధమయింది   ఏం పాట వింటున్నారు ? చొరవగా  హెడ్పోన్స్ తగిలించుకుంది ." ఏక్ ప్యార్ కా నగమా  హై మౌజోం కి రవానీ హై, జిందగీ ఔర్..  కుచ్ బీ నహీ తేరీ మేరీ కహానీ హై !" మంచి పాటే వింటున్నారు.  తుఫాన్ తో ఆనా హై , ఆ కర్ చలే జానా హై  అని కదా  తర్వాత  తుఫాన్ వెళ్లి పోతుందా మరి ? హెడ్ఫోన్ ప్రక్కన పడేసి అడిగింది. వాదనాడదల్చుకోలేదు.  అతడు మళ్ళీ  పడుకుని కళ్ళు మూసుకున్నాడు.

"మీరు  ఆ మోహన ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. కావాలంటే డబ్బులు పడేయండి."

కోపంతో దవడలు బిగుసుకుంటున్నాయతనికి. స్త్రీలని మగవాళ్ళు కించపరచడం కాదు. అనుమానాలతో వాళ్ళని వాళ్ళే కించపరచుకుంటారు. గర్భ దారిద్ర్యం కన్నా భావ దారిద్ర్యం మరీ భయంకరమైనది.   షటప్ లతా  ! కాలేజ్ కి వెళ్లి  మోహనని అవమానించి వచ్చావ్ ! నువ్వు చేసినపనికి సంజాయిషీ ఇస్తావేమోనని ఆమెకి  సారీ చెపుతావేమోనని ఎదురుచూస్తున్నాను.   ఆత్మ పరిశీలన చేసుకోవడం మానేసి ఇంటిని నరకంగా మార్చేస్తున్నావ్ !  బాగా విసిగిస్తున్నావ్, ముందిక్కడి నుండి వెళ్ళిపో !

మీ ఇద్దరి మధ్య నేను కంటకంలా మారిపోయాను కదా ! మీ  జీవితంలో నుండే వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నా ! ఆఖరి ప్రయత్నంగా మీతో చెప్పాలని అంతే ! అంది  ముక్కు ఎగబీలుస్తూ

"ఆశయాల  కోసం బ్రతికే వారు పువ్వుల్లాగా నిశ్శబ్దంగా రాలిపోతారు. అలా రాలేటప్పుడయినా రాతిదెబ్బ తగలనీయ కూడదని  చెపుతున్నాను, నీకది  నచ్చడంలేదు. నేను ఆమె వైపు కన్నెత్తి కూడా చూడనని నీకు మాటిచ్చాను అయినా నువ్వు వినడంలేదు. మనమే ఇక్కడినుండి  షిఫ్ట్  అవ్వాలని నేనాలోచిస్తున్నాను. నువ్వేమో ఆమెని ఇక్కడి నుండి తరిమేయాలని  కంకణం కట్టుకున్నావ్ ! పుట్టినూరు,సొంతిల్లు,ఉద్యోగం, ముఖ్యంగా ఆ ప్రాజెక్ట్ వదులుకుని ఆమెక్కడికి వెళుతుంది ?   కోపాన్ని అణుచుకుంటూ మాములుగా చెప్పడానికి ప్రయత్నించాడు.

"మీ నాటకాలన్నీ నాకు తెలుసు,  మీరు వెళ్ళాలనుకుంటే నేనేమి అడ్డు కాదు.   వెళ్ళే ముందు   ఆ కాగితాలపై సంతకాలు చేసి వెళ్ళిపొండి  ఇదే నా ఆఖరిమాట" అది బెదిరింపో, స్థిరమైన నిర్ణయమో రఘుకి తెలియడంలేదు.

మొబైల్ లో టెక్స్ట్ మెసేజ్.  తెరిచి చూస్తే  మోహన నుండి " ఎన్ని అవమానాలైనా తట్టుకోగలను. నా గురించి ఆలోచించకండి రఘూ!  "  ముగింపు లేఖపై తడి ఆరని  ఓ కన్నీటి సంతకం కాదు మోహన.  అభాగ్యశాలి కాదు, ఒకరు వెలిగిస్తే వెలిగేది కాదు తనని తానూ వెలిగించుకో గలదీ మోహన,  కొన్ని కావాలనుకుంటే కొన్నిటిని తట్టుకుని నిలబడాలి.  నేను నిబ్బరంగా ఉన్నాను. మీ మధ్య కలతలు రాకుండా చూసుకోండి ప్లీజ్ !

చదివి బాధగా కళ్ళుమూసుకున్నాడు. తెల్లారే లోపు మరుగుతున్నఆలోచనల్లో నుంచి  సమస్యకి పరిష్కారం  తట్టింది.  లత  పెట్టెళ్లిన కాగితాలని చేతిలోకి తీసుకున్నాడు.

ఆ పేపర్ల మధ్య నుండి కొత్త  పసుపు తాడుకు గుచ్చిన మంగళ సూత్రాలు దర్శనమిచ్చాయి.  ఆశ్చర్యంగా అవి చేతిలో పెట్టుకునే పై  పేపర్ లో వ్రాసిన విషయాన్ని చదవసాగాడు.

రఘూ ! ఏదో ఒక నిర్ణయానికి వచ్చి ఉంటేనే కదా ! ఈ పేపర్స్ తీసి ఉంటావ్ .  మీ  మనసు నాకు తెలుసు.
మీ సంబంధం నైతికమా, అనైతికమా అన్నది నాకు సంబంధం లేదు. మోహన రీసెర్చ్ కి వెళ్లి   మీకు దూరంగా ఉన్న ఆరునెలల కాలంలో ఆమె మీ మనసులో లేనిదేప్పుడూ !? వివాహేతర సంబంధాలలో భార్యకి మిగిలేది రాక్షసి  అన్న పేరొక్కటే. మీ వాళ్ళందరికి మిమ్మల్ని  కాల్చుకు తింటున్నానని  నాపై ద్వేషం. మీ పై జాలి.  ఆమె పై సానుభూతి.  అందుకే నన్ను నేనే మీ నుండి త్యజించుకుంటున్నాను.  ఒకరిచ్చే  గిఫ్ట్ అయినా  నాకు నచ్చనిది నేను తీసుకోనని నీకు తెలుసు. అలాంటిది మీ ఇద్దరూ త్యాగమూర్తులై నాకు  నీ జీవితకాలపు భార్యననే  గిఫ్ట్ ఇచ్చారని సంబరపడకండి.   భార్య  మీద నెపెమేసి గర్ల్ ఫ్రెండ్స్ ని వదిలించుకున్న బోలెడు మంది మగవాళ్ళని చూసాను.  ఇప్పుడూ మీరూ  అదే పని చేసి మోహనకి ఇంకోసారి ముఖం చాటేస్తారనే  నేనూ ఈ నిర్ణయం తీసుకున్నాను. త్యాగాలు చేయడం  మీకే కాదు, నాకూ తెలుసు.  ఈ లతకి  అలంకారమైన భార్యగా ఉండటం ఇష్టం లేదు. ఇద్దరు బిడ్డలకి  తల్లిననే ఈ పదవి చాలదా ? నాకీ  భువిని యేలడానికి. మంచి పనులకోసం మీ ఇద్దరూ కలిసి పనిచేయండి. బెస్టాఫ్ లక్ !

నిర్ఘాంతపోయాడు రఘు. "ఈ స్త్రీలు ఎంత చపలచిత్తులు !? ఎంత బలంగా అల్లుకోగలరో, అంత తేలికగా  విదిల్చుకుని పోగలరు,  కావాలంటే ప్రాణ త్యాగం చేసి  పందిరిని ఖాళీ చేసేయగలరు. సున్నితంగా కనిపించే  వీళ్ళే  దృఢమైన లతలు. లతాంతాలు. మనస్తత్వాలు వేరైనా ఆలోచనా విధానానంలో మోహన,లత ఇద్దరూ వేరు వేరు కాదు.  ఇద్దరూ ఒకటే !  ఈహృదయాన్ని  ఖాళీ చేయకుండా ఏ ఒక్కరూ తిష్ట వేసుకుని ఇక్కడ  ఉండలేరా ?  అననుకుంటూ ఆ లెటర్ తో జతపరిచిన విడాకుల పత్రాలకేసి చూస్తూ  అయోమయంగా ఉండిపోయాడు.
             

17, సెప్టెంబర్ 2016, శనివారం

మార్పు మంచిదే ..
ఈ పుష్పం పై తుహిన బిందువులు సీతాకోక చిలకలవలె వాలినట్లు 

అనంత సౌందర్యం నిండిన నీ పదముల చెంత నా మనసు నిలుచుట దుర్లభం 

విషయవాంఛల పట్ల కల్గిన అనురక్తిని ద్రుంచక 

మరులు గొల్పి ఆ భ్రాంతిలోన బడద్రోయుట నీకు వినోదం కదా ప్రభూ !

                                               తెలియని విషయం 

                                 
ఆడంబరంగా చేయు క్రియలకి భక్తి అని పేరు పెట్టుకుంటూ 
                                 
లోని శత్రువులని జయించకుండా వెలుపల పోరాటం చేస్తూ 
                                 
దోసిలి పట్టాక వచ్చిన ఫలితాన్ని చూసి 
                                 
నిందా స్తుతి చేయుట పరిపాటి కదా ఈ మనుజులకి 
                                 
వలపక్షం చూపడం నీకు రాదని తెలిసీ...
                                 
తెలియని విషయమై పోయెను కదా ప్రభూ ! .
  

10, సెప్టెంబర్ 2016, శనివారం

అవయవ దానం

అవయవదానం  -వనజ తాతినేని

రోటీ కపడా ఔర్ మకాన్
ఎవర్రా ఆ మాటంది ?
వాటికన్నా ముందు
విసర్జించడానికి స్కలించడానికి ఓ క్షేత్రం  కావాలి

మరుగుదొడ్డి కన్నా మగువ అల్పంగా  తోస్తూ  
ఆవు కన్నా ఆడది స్వల్పంగా   కనబడుతూ  
మనిషి ముఖాలతో  ఉన్మత్తులై సంచరిస్తూన్న
 కొందరికి   కామ తెగులు తగులుకుంది
సమూలంగా నాశనం చేసే మందులు కనిపెట్టండి ముందు
అదే అత్యవసరం ఇక్కడ.
చట్టాలు న్యాయాలు శిక్షలు ఏవీ పనిచేయని ఇచ్చోట
క్షణానికో కనరాని  ఆత్మహననం

అత్యాచారమన్న గరళ  వార్త విన్న ప్రతిసారి..
 స్త్రీ  ఉలిక్కిపడుతుంది అదొక  హత్యాచారమైనందుకు
స్త్రీ అత్వం  రహస్యాతి రహస్యంగా చచ్చి మరుక్షణమే పుడుతుంటుంది
ఇంకో పుట్టుక నివ్వడానికన్నట్లు  అదొక శిక్ష అవుతున్నందుకు  

తను పెంచిన మొక్క తనకే ఆహారమైనట్లు
జన్మ   ప్రదాత కామసర్ప కాటుకి  బలైపోతున్న పాపలని చూస్తేనూ
పసి పాపల పొత్తికడుపు క్రింద పట్టు కోసం
తాత దగ్గులు నేర్చుకున్నాడన్న వార్తలు విన్నప్పుడో
కలువల కళ్ళు ఎర్ర కోనేరులవుతాయి
ఆవేశం ఎఱ్ఱ  సముద్రమై చెలియలి కట్ట దాటుతుంది  

పరిమళం లేని పువ్వులా  నలుగుతున్నా
ప్రతిబింబం చూపటం ఇష్టంలేని  అద్దంలా కళ్ళు మూసుకున్నా
వంతులోంతులుగా కోర్కెల ఉధృతిని  చిత్త  ప్రవృత్తిని  పంచుకుంటూంటే
అమ్మ తనం అదః పాతాళానికి కృంగుతుంది
ఆడతనం  కృత్రిమ గౌరవాల మధ్య నలుగుతుంటుంది

అవమానపు   కుంపటిలో కాలిన శరీరానికి చికిత్స చేసి
గాయమైన  హృదయానికి  పైపూత మందు కూడా పూయలేని
న్యాయదేవత మొండి చేయి  చూసి మాట మూగపోతుంది
రావణ పాదం తాకని చోటు కీచకుల చూపు సోకని చోటు
ఏదీ లేదన్న సత్యం కలవర పెడతుంది.

చేతి సంచీలో కుక్కేయబడ్డ పసి పాప చెంత
సేవ్ గర్ల్ చైల్డ్  అన్న నినాదం
సామూహిక అత్యాచారాలు జరుగుతున్న చోట
వీడియో చిత్రాలలో రికార్డ్ అవని  అతివ ఆర్తనాదం
మేరిటల్  రేప్ లు జరుగుతున్న చోట
సేవ్ ఆర్గాజం అని గొణుక్కోవడం  అసలు పొసగడం లేదు కానీ ...
అమ్మల్లారా ...
మూకుమ్మడిగా  అవయవాల ఆయుధాలని విసర్జించేద్దాం కదలండి   .
 
అవయవదానానికి కూడా పనికిరాని అవయవాలకోసం నిత్యం
కాట్లాడే  కుక్కల్లా  పొంచి ఉండే నక్కల్లా
వేటాడే  హైనాల్లాంటి వారి నరాల తీపులకి
కోట్ల యోనులని ఈ నేల మీద పరిచి
రేప్ కోర్టులు నిర్మిద్దాం రండి
చప్పరింపులకి  ఆటలాడుకోవడానికి స్తన్యాలని
గుదిబండలాగా  పాతేసిపోదాం పదండి

కుట్టేసిన యోనులు కోసేసిన కుచద్వయాలతో
ఇంటా బయటా అర్ధరాత్రి అపరాత్రి స్వేచ్ఛగా సంచరిస్తూ
మాహాత్ముడన్న స్వాతంత్ర్యానికి భాష్యం చెపుదాం పదండి ముందుకు .

(14 సంవత్సరాల బాలికని 12 మంది సామూహిక అత్యాచారం చేశారన్న వార్త విన్నాక .... అసహ్యంతో వ్రాసిన కవిత ఇది) . 
  

28, ఆగస్టు 2016, ఆదివారం

భావచిత్రాలు

భావచిత్రాలు కొన్ని పాతవే ....

తొలకరి

మేఘరాజు భువి కన్నెపై వలపుగొన్నాడేమో
మెరుపు తీగలతో మురిపిస్తూ వచ్చి
తొలి ముద్దు ముద్రవలె
కాసిని వానచుక్కలు రాల్చి అదృశ్యమయ్యాడు
మలి ముద్దు కోసం
ముద్దరాలు నునుసిగ్గుతో  తలనెత్తి నిలిచింది పాపం.

****************

కవితై ....

పువ్వు వోలె రాలకుండినట్లు
శతాయుష్షు నిమ్మని వేడుకుంటిని విధాతని
నీ ప్రియుడి కవితలో
నిత్యమై నిలిచి ఉండెదవు పో అన్నాడు దయతో ..

*****************

శిక్ష

నువ్వు అవునంటే
నీ ఎదపై మంగళ సూత్రమై సేదదీరుతా
నువ్వు కాదంటే
భగ్నహృదయపు దివ్వెగా మలిగిపోతానంతే.. కానీ
నీ ఎడబాటుకి గురిచేసి
ఏడు జన్మలకి సరిపడా శిక్ష విధించబోకు ప్రియా !

***************

ఆదేశం

ఒక్కసారి కలలోకి వచ్చి తప్పిదం చేసినందుకే
నీ వలపు చూపుల సంకెలతో బంధించి
జీవనపర్యంతమూ కళ్ళల్లో కాపురముండమని
ఆదేశించుట న్యాయమా
కనిపెంచిన అమ్మకైనా చిన్న మాట చెప్పిరావద్దూ ..  

16, ఆగస్టు 2016, మంగళవారం

రెండు అరణ్య ప్రయాణాలు

చిమ్మ చీకటిలోనూ ..వెన్నెల కాంతులలోనూ అరణ్య శోభని కనులారాకాంచాలని ఎడతెరుగని కోరిక. నీలి కెరటాలపై  పై పైకి తేలివచ్చే చంద్రుడిని,  తీరం వొడ్డున విరిగి పడే అలల సవ్వడిలో చూడటం ఓ వింత అనుభూతి అయితే రేయీ  పగలు ఏదైనా .. చీల్చుకునివచ్చే కిరణాల వెలుగులో కూసింత వెలుగు మరింత నీడలో  అడవులలో తిరగడం ఓ సాహసమైన ప్రయాణమే !   నిశ్శబ్ద సంగీతం అంటే ఏమిటో అనుభవిస్తూ అప్పుడప్పుడూ పక్షుల జిలిబిలి సంగీతాన్ని ఆహ్లాదిస్తూ ఆ అరణ్యపు దారులలో చీకటి కొసన  వాహనపు వెలుగులకాంతిలో ప్రయాణిస్తూ ..కదిలిపోయే అడవిని ఎక్కడ నింపుకోవాలో తెలియక తికమక పడతాము.

మొట్టమొదటి సారి  నల్లమల అడవులని  జోరుగా కురుస్తున్న వర్షంలో    దోర్నాల  నుండి కర్నూలు జిల్లా ఆత్మకూరు వైపు  బస్ లో వెళుతూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాను . ఉదయకాంతి వ్యాపిస్తున్నా భానుడు కానరాని ఆకాశంలో కారు మబ్బులు కరి  రాజులా మందగమనముతో నడుస్తున్నాయి .రోడ్డికిరువైపులా మనిషి కాళ్ళు రెండూ దగ్గర పెట్టుకుంటే ఉండేంత దగ్గరగా ఒరుసుకుంటూ ఆకాశం వైపుగా దట్టంగా  పెరిగిన వృక్ష సముదాయం ... ఆ చెట్ల కొమ్మలు రోడ్డు పై ప్రయాణిస్తున్న బస్ కి  వర్షంలో తడవకుండా పట్టిన గొడుగులా అనిపిస్తే .. కొండలపై నుండి జలజలా ఉరికే వాన నీరు వరదలా మారి  బస్ ని ముంచేస్తాయా అన్నట్టు భయం కల్గించాయి. కాసేపు పిసిని గొట్టు వాడి ఏడుపులా కురుస్తున్న వాన మరి కాసేపు  తొండాలతో గుమ్మరించి పోస్తున్నట్లు వాన.నాలా కురిసే విశాలత్వం మీకుందా ..అని అడిగినట్లు అనిపించింది.వాన చెప్పిన  రహస్యాన్ని కూడా ఆలోచనల్లో  ముద్రించుకుని అలా కళ్ళు మూసుకుంటే కురుస్తున్న వాన చప్పుడు ఆరోహణావరోహణాలతో అమృతాగానంలా తోచింది మెల్లగా కళ్ళు విప్పి పైకి చూస్తే  ఎన్నడూ తలవంచని ఆకాశం కూడా ఆహరహమూ తన చూపుని క్రిందికే  దించి చూస్తున్నట్లు అనిపిస్తుంది ఎందుకో ! భువికి దివికి ఉన్న అనుబంధమేమిటో అన్న ఆలోచనలని భంగపరుస్తూ పెళ్లున విరిగిపడిన వృక్షం.అసంకల్పితంగా కీచుమని శబ్దంతో ఆగిన బస్సుతో పాటు ఒక్క క్షణం గుండె ఆగినట్టయింది.తేరుకుని  తలతిప్పి చూస్తే ఎండుటాకుల క్రింద దాగున్న బీజం ఆవలించుకుంటూ లేచి వొళ్ళు బద్దకాన్ని విదిల్చి అవతల పడేసినట్లు  మెల్లగా పైకి లేస్తూ అబ్బురంగా తోచింది.  భూమికి ఎంతో ఎత్తు లో ఆకాశం కనబడకుండా చుట్టూ ఒక్క వాహనమో లేక ఒక్క మనిషి కూడా కనబడని ఆ అరణ్యపు దారి కాస్త భయం కల్గించింది. రెండు గంటలు సాగిన ఆ ప్రయాణంలో  బస్ లో  ప్రతి ఒక్కరూ నిశ్శబ్దంలో మునిగి పోయారు. దట్టమైన అరణ్యంలో నుండి బయట పడ్డాక ..అమ్మో ! ఇక్కడ నివశించే చెంచులు,గిరిజనులు ఎలా ఉంటారో అని అనుకున్నాను. అప్పుడప్పుడూ వెళ్లి చూసేయడమే కానీ నాగరిక జీవనానికి అలవాటు పడిన మనం అక్కడ జీవించడమంటే చాలా కష్టం సుమీ అనుకున్నాను .  ఆ అడవి ప్రయాణాన్ని ఇప్పటికి మర్చిపోలేదు నేను.ఇక రెండో ప్రయాణం ... ప్రొద్దుటూరు నుండి విజయవాడ ప్రయాణంలో ..మైదుకూరు పోరుమామిళ్ల మార్గంలో అడవి అంచున ప్రయాణిస్తూ ... తమకంతో కళ్ళు విప్పార్చి చూస్తూ ఉండిపోయాను ఆ సౌందర్యం ఎలా ఉందంటే పౌర్ణమి వెళ్ళిన మూడోనాటి చంద్రుడు చిన్న గడ్డమున్న అందాల భరిణె మోములా ముద్దుగా ఉన్నాడు. పలుచని పాల వంటి వెన్నెల అడవంతా వ్యాపించి ఉంది.ఆ కొండ నిండు చందురుడుని అలంకరించుకున్న శశిధరుడి మోముని తలపించింది.కొండలకి ఆవలి వైపున చంద్రుడు. ఈవల వైపు ప్రయాణిస్తూ నేను. చీకటి తలుపులుగా మారి ఓరగా  అరణ్యాన్ని ఆకొండక్రింద గదిలో  బంధించినట్టు ఆగంతుకునిలా వెన్నెల చల్లగా జొరబడింది.  తెమ్మెర కూడా ఏవో అడవి  పూల  పరిమాళాలని మోసుకొచ్చి ఇచ్చి పొదల  నిట్టూర్పులని తిరిగి తీసుకెళుతుంది. వాటిని  చేరవలసిన చోటు వరకు చేరుస్తుందో లేదో తెలియదు. మొగలి పొదలు తమ  పువ్వుల పరిమళాన్నితామే భరించలేక  వమనం చేసుకున్నట్టున్నాయి దారంతా ఆ  పరిమళాలే !. ప్రయాణం నిమిషాలు యుగాలు గడచినట్లు భారంగా  ఉంది.  ఆకాశానికి అవనికి ఉన్న  అంతులేని స్నేహాన్ని మరొకమారు గుర్తు చేద్దామనుకున్నట్టు గూడు విడిచిన గువ్వొకటి ఎక్కడికో ఎగిరిపోతూ కనిపించింది. . దారి ప్రక్కన ఉన్న పొదలు గుస గుసలాడుకుంటూన్నట్లు చిరుగాలి అలలకి ఆకులు కదిలిస్తున్నాయి. తెల్లని మబ్బులతో చందురుడు దోబూచులాట లాడుకుంటున్నాడు.  ఆ వన జ్యోత్స్నని గాంచడానికి రెండు కళ్ళూ చాలలేదు.రోడ్డుని ఆనుకునే అక్కడక్కడా  మైదానాలు లేతాకుపచ్చతో  పచ్చిక నవ నవ  లాడుతూ వెనక్కి జారిపోతున్నాయి.ఈ రాత్రి కాలమెరుగని నిశ్శబ్ద ప్రయాణం చేద్దాం రా ... అంటూ చెలికాడిని పిలిచినట్టు వెన్నెలని తోడు రమ్మని  పిలుస్తూ  పైట చుట్టినాక వచ్చి తిష్ట వేసిన ముప్పై యేళ్ళ  అభ్యంతరాలన్నీ మరిచి విడిచి పడి పడి పచ్చికలో ఆడుకోవాలనిపించింది.
ఓస్ ..ఇంతేనా ! ఇంతకంటే దట్టమైన అరణ్యాలని చూస్తే అప్పుడు ఇంకేమంటావో... మళ్ళీ ఇంకో ప్రయాణానికి సిద్దం చేసుకో అంటుంది మనసు.  ఆ ప్రయత్నంలోనే  .. ఉన్నా నేను. అన్నట్టు మనిషి ప్రయాణం కూడా అరణ్యదుర్గమమే కదా! ఎప్పుడు ఎలా ఉంటుందో ఇసుమంతైనా ఊహించలేం కదా !