గబగబ నడుస్తూ పని చేసే యింటికి వెళుతుంది గంగ. చేతిలో వున్న ఫోన్ మోగింది. సరళ నుండి ఫోన్. యెత్తగానే అవతలి నుండి ప్రశ్న.
“ఎక్కడ వున్నావు”
“ మీ యింటికి దగ్గరలో వున్నానండి అపార్ట్మెంట్ లో పని చేసుకుని వస్తాను”
“నేను యింట్లో లేను కానీ నువ్వు యింటికి వెళతావుగా , నేను చెప్పిన పని చేస్తావు కదా” అదో రకం వొత్తిడి పెడుతూ అడిగింది సరళ.
ఇబ్బంది పడుతూ నిమిషం పాటు ఆలోచించి “గంట తర్వాత వెళతాను, పర్వాలేదా అండీ”
“బయటకు వచ్చాక ఫోన్ చేయి, యెక్కడో వొక చోట కాలక్షేపం చేస్తాను. చెప్పిన మాట మర్చిపోకు. బుస్స్ మనే ఆ పాము కోరలు పీకి పడేసేలా వుండాలి. ఇంకెప్పుడూ బుస కొట్టకూడదు,కాటు అసలే వేయకూడదు”
“సరేనండీ”.. నడుస్తూ ఆలోచిస్తుంది. ఇలాంటి వొక రోజే కదా..ఉన్నపళంగా తన యింటి రాతంతా మారిపోయింది అని బాధగా అనుకుంటూ రెండు నెలల కిందట జరిగిన చేదును గుర్తుచేసుకుంది గంగ.
**********
మసక చీకట్లోనే తడుము కుంటూ మెల్లగా యింటి వెనక్కి నడిచింది నర్సమ్మ. ఈడుస్తున్న కాళ్ళతో రెండడుగుల యెత్తులో వున్న బాత్రూమ్ లోకి పోవడానికి చానాసేపు పట్టింది. పది నిమిషాల తర్వాత తలుపు తీసి చుట్టూరా చూసి నివ్వెరపోయింది. ఐదారు ఆకులతో వొత్తుగా నవనవలాడుతూ గోడ వారగా పెరుగుతున్న కొత్తిమీర మడి తోటకూర మడి మాయమైపోయాయి.
“అయ్యో అయ్యో, నా ఆక్కూర మడంతా మాయమై పొయ్యింది. నిన్న పొద్దుటేల కూడా చూసేను కదా. ఏ ముదనష్టపు చేతులు పడ్డాయో,పరక్కూడా లేకుండా పీక్కుపొయ్యాయి,ఆ చేతులిరగిపోనూ ఆళ్ళకు కుష్ఠు రోగం రానూ, ఆళ్ళ అమ్మ కడుపు కాల”.. తిట్ల దండకం తో సన్నటి దుఃఖపు గొంతుతో మడి దగ్గరకు నడిచింది నర్సమ్మ.
“అత్తా, యెవరో యెందుకు చేత్తారు, నిన్న మజ్జేనం నీ కొడుకే పీక్కుపోయి అమ్మేసుకుని తాగేసాడు” అన్జెప్పి బాత్రూమ్ లోకి వెళ్ళి తలుపేసుకుంది గంగ.
“ఓరి దుర్మార్గుడా, నీకు పోయేకాలం వచ్చింది రా,” అని తిట్టుకుంటూ రేకుల వసారాలోకి జేరి మంచంపై కూలబడింది. ఇంటిని వొకసారి కలియదిప్పి చూసుకుంది. ఒక పెద్ద గది దానిముందు రేకు వసారా.అందులో చిన్న వంట గది. వసారా లో తన మంచం. గవర్నమెంట్ కట్టించిన యిల్లు అది. ఈ యింటి మీద కూడా వీడికి యిక అప్పు పుట్టనట్టు వుంది.అందినకాడికి యేదిబడితే అది యెత్తుకుపోవడమే మిగిలింది.ఇల్లు వొల్లు గుల్ల చేసుకుని నూరేళ్ళు బతికింది యెవరూ.. అందులో సగం ఆయువుంటే మా గొప్ప అనుకుంది ఖాళీ గా వున్న తన నుదుటిని తడుముకుంటూ.
తన చేత్తో తన కన్ను ని తానే పొడుచుకుంటున్నట్లు తమ బతుకుల్లో నెలకొన్న పేదరికాన్ని యెన్నడూ జయించనివ్వని వ్యసనానికి బానిసైన కొడుకుని తలుచుకుని దిగులుపడింది. కళ్లల్లో గుచ్చుకుంటున్న పొద్దుకి యెదురుగా కూర్చుని కోడలిచ్చిన టీ తాగి నెమ్మదిగా లేచి గోనెపట్టా చేతబట్టుకుని కర్రపోటు సాయంతో ఆ కాలనీ సెంటరుకు బయలుదేరింది.
మార్కెట్ లో గుత్తానికి ఆకు కూర కట్టలు కొని మార్కెట్ బయట గోనెపట్టా పరుచుకుని కూర్చునేదాకా రోజూ కోడలు వచ్చి సాయపడుతుంది. ఆ రోజు కోడలిని సాయమడగాలన్నంత బుద్ది పుట్టక ఒంటరిగానే బయలెల్లింది.
నర్సమ్మ ఆకు కూరలు అమ్ముకుంటూనే కూసింత ఖాళీ దొరికితే చాలు కట్టల మట్టి దులిసేసి చీడ పట్టిన ఆకులేరేసి పచ్చబడిన ఆకులను తుంచేసి శుభ్రం చేసి క్యారీ బేగ్ లలో పెట్టి వుంచుతుంది.ఆ పనులన్నీ చేసుకునే తీరిక ఓపిక లేని కొందరు వాటిని వతనుగా ఆమె దగ్గరే కొంటూ వుంటారు. మరికొందరు ఆమెతో కూడా గీచి గీచి బేరమాడతారు. దయాశీలురు కొందరు ఆ వయస్సులో కూడా యేదో వొక పని చేసుకుని బతకాల్సిన అవసరాన్ని గుర్తించి గ్రహించి యింకొంత డబ్బును వుదారంగా యిచ్చిపోతారు.
మధ్యలో నాలుగు ఇడ్లీలు తిని యింకోసారి టీ తాగి మధ్యాహ్నం దాకా పనిచేసుకుని యాభై వంద మధ్య డబ్బు చేసుకుని యింటికి చేరుకుంటుంది. కోడలు వుదయాన్నే వంట చేసి పెట్టి వెళ్ళి నాలుగిళ్లల్లో పనిచేసుకుని వచ్చేటప్పటికి .. నర్సమ్మ ఓ కునుకు తీసే వుంటుంది.
కానీ ఆ రోజు గంగ ఇంటికి రావడం ఆలస్యం అయింది.
నక్షత్రాలు కనబడనివ్వని కారు మేఘాలు నగరాన్ని కమ్మేసాయి. నగర శివారు రాత్రి దీపాలతో వెలుగుతుంది. మెయిన్ రోడ్ లో అడపాదడపా తిరిగే ఆటోలు తప్ప పెద్దగా సందడి లేని రోడ్డు. బస్టాఫ్ దగ్గర ఆగిన ఆటో లోనుండి దిగిన గంగ నడుస్తుంది.
వర్షాకాలపు గంభీరమైన నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ వీధి కుక్కల కాట్లాట. చేతిలోని గొడుగుని వాటికి తర్జన గా చూపిస్తూ వడి వడిగా యింటికి చేరుకుంటూ.. మొగుడిని తలుచుకుని మహానుభావుడు ఖాళీ అయిన గ్యాస్ బండ యిచ్చేసి నిండు బండ తెచ్చాడో లేదో. అప్పు దొరికిందో లేదో అనే ఆలోచనలతో యిల్లు చేరింది.
వరండాలో మంచంపై కూర్చున్న అత్త.. “ఇంత ఆలస్యమైందేమే గంగా” అని అడిగింది.
“యాభై మందికి వంట చేయడం చిన్నమాటా.. అన్ని చేసి సర్ది వచ్చేటప్పటికి యీ టైమైంది. కాళ్ళు పడిపోయినయ్యి అనుకో”
“ఆడింకా రాలేదు. నువ్వు కూడా యేమి తేకుండా చేతులూపుకుంటా వచ్చావే! అంత మందికి వండిచ్చుకుని నీకేం పెట్టలేదా” అడిగింది ఆరాగా ఆకలిగా.
“వాళ్ళ పార్టీ అవ్వలేదు,రాత్రి పన్నెండింటికి అంట. అదవకుండా చుట్టాలు తినకుండా నాకెట్టా పెడతారు”అంటూ కాళ్ళు కడుక్కొని లోపలికి నడిచింది.
“పిల్లలూ నేనూ మద్దేనం యేదో వొకటి తిన్నాం. ఇప్పుడు యేం తినాలో యేంటో చూడు. సరిగ్గా కళ్ళు కనబడని నేను యేమి వండేది యెట్టా వండేది” అంది నర్సమ్మ.
కుక్కపిల్లను వొళ్ళో కూర్చోబెట్టుకుని ఆడుకుంటున్న కృష్ణుడు తల్లిని చూసి గబుక్కున లేచాడు.
మెటల్ గాజుకు గమ్ రాసి మునివేళ్ళతో చకచక దారాన్ని అల్లుతూన్న నవ్య తల్లిని చూసింది.చేతిలో గాజుని కిందేసి వొక్క వుదుటున లేచొచ్చి తల్లిని చుట్టేసి గగ్గోలు పెట్టి యేడ్చింది. .
బడికి వెళ్ళి ఆరవ తరగతి చదువుకుంటూనే తల్లికి ఉదయం యింటి పనిలో సాయం చేయడం సాయంకాలం గాజులకు రంగులు అద్దడం రాళ్ళు అతకడం దారం చుట్టటం ద్వారా రోజుకు పాతిక ముప్పై రూపాయల సంపాదించి తల్లి చేతికిస్తుంది. అట్టాంటి పిల్ల అంతలా బావురమనడంతో బిత్తరపోయింది గంగ. .
“ఎందుకు యేడుస్తున్నావే బంగారు తల్లీ,యేం జరిగిందో నువ్వైనా చెప్పవే అత్తా” అంది కంగారుగా.
“ఏం జరగలేదులే గంగా, నువ్వు బెంబేలుపడమాకు. ఆ యెదవ సచ్చినోడు యేదో చేయబోయాడట. బిడ్డ బాగా భయపడినట్టుంది” అంది.
“ఎవడాడు?
కూతురిని వొళ్ళోకి తీసుకొని వోదార్చి కాసిని మంచినీళ్ళు తాగిచ్చి యేం జరిగిందో చెప్పమని అడిగింది.
“ఆ రమణారావు డబ్బు యిస్తానన్నాడు. ఆ యింటికి వెళ్ళి డబ్బు తీసుకురా అన్నాడు నాన్న” అంటూ మొదలెట్టి జరిగిందేమిటో మననం చేసుకుని చెప్పసాగింది నవ్య. .
**********
సన్నగా రివటలా వుండి పత్తికాయలంటి కళ్ళేసుకుని పెదాలు తడుపుకుంటూ ఆడాళ్ళని అదోరకంగా చూసే రమణారావు యింటికి వెళ్ళమంటే వెనక్కి తగ్గింది నవ్య.
“ఆ యింటికి నేనెళ్ళను నువ్వే వెళ్ళు” అంది తండ్రిని.
“ఎల్లమని చెబుతుంటే నీక్కాదు. నా నాలుగు నాకు పడితేకాని కదలవేమో” అని కసిరాడు.
అయిష్టంగానే కదిలింది.మూడొంతస్తుల ఇంటి గేటు ముందు నిలబడి బెల్ కొట్టింది నవ్య. రమణారావు కుక్క తో కూడా వచ్చి తలుపు తీసాడు.ఆ యిల్లు చిన్నతనం నుండి నవ్య కు పరిచయమే. తమ్ముడు పుట్టక ముందు తన తల్లి ఆ యింట్లో పనిచేస్తున్నప్పుడు తనను కూడా తీసుకొచ్చి పెరట్లో కూర్చోబెట్టి పని చేసుకునేది. రమణారావు భార్య సరళమ్మ. అప్పుడామె యింట్లో లేదు.
“ఎంత పెద్దదానివైపోయావే..నువ్వు అంటూ బుగ్గ గిల్లాడు... టీచరమ్మ యింట్లో లేదు. కూతురిని తీసుకుని షాపింగ్ కి వెళ్ళిందంట. కాసిని కాఫీ కలిపియ్యవే నవ్యా.. తల పగిలిపోతుంది అన్నాడు. “నాకు కాఫీ పెట్టడం రాదండీ. మీరు డబ్బులిస్తే వెళ్ళిపోతా”.. అంది జంకుగా.
“అదేం బ్రహ్మ విద్యా? నేను యెలా చేయాలో చెబుతాను నువ్వు చేద్దువుగాని. లోపలకు రా” అంటూ చొరవగా చెయ్యి పట్టుకుని వంటింట్లోకి లాకెళ్ళాడు. పాల గిన్నె పొయ్యి మీద పెట్టించి “నేను పైకి వెళ్ళి డబ్బులు పట్టుకొస్తా, పాలు పొంగకుండా చూడు” అని పైకి వెళ్ళాడు. నవ్య పాల వంక చూస్తూనే వుంది. లోలోపల బితుకు బితుకు మంటూ యేదో భయం. కొద్దిసేపటికి పిల్లిలా చప్పుడు చేయకుండా వెనక నుంచి వచ్చి కొండచిలువలా వొళ్ళంతా చుట్టేసాడు. భయంతో అరుస్తూ విదిలించుకుంటూ గుమ్మం వైపు చూస్తే. తలుపులు మూసేసి వున్నాయి. నవ్య వణికిపోతూ బిగ్గరగా అరిచినా బయటకు వినబడని పెద్ద శబ్దంతో టివి లో పాటలు.
యెరుపెక్కిన కళ్ళతో ముఖమంతా తడిచేసి గుండెలపై కర్కశహస్తాలతో తడిమి తడిమి తర్వాత అకస్మాత్తుగా నీరుకారిపోయి కుర్చీలో కూలబడిపోయాడు. షాక్ నుండి అయోమయం లోకి తర్వాత అసహ్యంలోకి మారిన ముఖంతో బయటకు రాబోతున్న నవ్య చేతిలో వెయ్యి రూపాయలు పెట్టాడు. “ఇక్కడ జరిగింది యెవరికీ చెప్పకు. అప్పుడప్పుడు వస్తూ వుండు. నీకు చాలా డబ్బులిస్తాను” అన్నాడు.
ఆ డబ్బులు అక్కడే విసిరేసి పరిగెత్తుకుని యింటికి వచ్చి పడింది. డబ్బు కోసం యెదురుచూస్తున్న తండ్రికి జరిగింది చెప్పింది. డబ్బులెందుకు పడేసి వచ్చావని తండ్రి వొక్కటిచ్చాడు. ఏడ్చుకుంటా వెళ్ళి నాయనమ్మకు చెప్పింది. అది విన్నాక ఆవేశపడిన నర్సమ్మ యెదురుగా లేని కొడుకుని తిట్టిపోసింది, దినవారాలు చేసేసింది.
తల్లితో ఆ విషయమంతా చెప్పిన నవ్య మళ్ళీ వెక్కుతూ యేడ్చింది. వింటున్న గంగ కోపంతో వణికిపోయింది. పిల్ల ఏడుపు చూసి కడుపు తరుక్కుపోయింది.తల్లి ముఖంలో కోపం, ఏడుస్తున్న అక్కను చూసి బిక్కముఖం పెట్టుకున్నాడు కృష్ణుడు.
గంగ కాసేపటికి మనస్సు చిక్కబట్టుకుని కూతురి వైపు చూసింది. నవ్య కళ్ళలో యింకా వీడని భయం. చీటికిమాటికి తాగుబోతు తండ్రి తిట్టే తిట్లకు కన్నీళ్ళు తప్ప మరే యితర కలలు కనని ఇంద్రధనుస్సు లసలే పూయని అమాయకమైన సోగ కళ్ళు అవి. అమ్మ ను యెప్పుడూ విసిగించకూడదని వొట్టు పెట్టుకున్నట్టు వుండే ముఖం. నాన్నను యేవీ తెచ్చిమ్మని అడగని నోరు అది. జరిగినదాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే యెట్టా! ఆ సంగతి మర్నాడు చూద్దాం, పిల్లలు ఆకలి తీర్చాలి ముందు అని నెమ్మదిగా లేచింది.
స్టీల్ బేసిన్ లో పిండిని ముద్దగా కలుపుతున్న తల్లి చేతి కదలికను తదేకంగా చూస్తున్నాడు కృష్ణుడు. అమ్మెందుకో బాగా కోపంగా వుందని అర్దమై దిగులేసింది. కసిగా కదిలే ఆ వేళ్ళ కదలికల్లో కట్టుకున్న వాడిపై వున్న కోపావేశాలు కళ్ళలో బిడ్డలకు పట్టెడన్నం వొండి పొట్ట నింపలేని ఆక్రోశం వాడికేమీ తెలియకపోయినా నెమ్మదిగా తల్లి పక్కనజేరి చేరాడు.
గంగ యేడేళ్ళ కొడుకు వైపు చూసింది. మాములుగా అయితే ఆమెతో పాటు పీటపై కర్రతో రొట్టెలు చేయడానికి సరదా పడేవాడు. కానీ వుదయం నుండి అర్దాకలితో వున్నాడయ్యే. ఆ పనిజోలికి వెళ్ళకుండా పక్కనే కూర్చున్నాడు. వాడి చిన్ని పొట్ట ఆకలిని కళ్ళలో వినబడని ప్రశ్నలను అర్దం చేసుకున్నది గంగ. పిండి కలిపిందే కానీ సిలిండర్ లేని పొయ్యి పై రొట్టె యెట్లా కాల్చాలో పాలుపోలేదు.మూడు రాళ్ళ పొయ్యి కింద మండటానికి కట్టెలు గతి లేని కిరోసిన్ లేని యిల్లే గాని ఆమె గుండెల్లో మొగుడు రగిలించిన నెగడు మండుతూనే వుంది. కలిపిన పిండి డిప్పను పక్కన పెట్టి వరండాలో మూలనున్న అట్టపెట్టె తెరిచి చూసింది. రొండే దోసిళ్ళు వున్న కర్ర బొగ్గుల సంచి కనబడింది. కుంపటిని తీసుకొచ్చి గుమ్మం ముందు కూర్చుని కుంపట్లో బొగ్గులేసి నిప్పు పుట్టించే పని మొదలెట్టింది.
అత్త నర్సమ్మ కోడలు గంగ ఆలోచనలు కనిపెట్టింది.
“పొద్దుననగా యెల్లాడు గేస్ బండ పట్టుకొత్తానని. ఇంతవరకు అయిపులేడు.ఏడ తాగి తందనాలు ఆడుతున్నాడో.” అంది. గంగ మాట్టాడలేదు. మళ్ళీ నర్సమ్మే అంది. “పిల్ల అంతా చెప్పేసి వుంటదని నీకు మెుకం చూపిచ్చడానికి సిగ్గేసి యేడాడ తిరుగుతున్నాడో” అంది.
అత్త వైపు చురుగ్గా చూసి “నీ కొడుకు సిగ్గు పడటమా, అదో యెనిమిదో వింత అయ్యిద్ది. గేస్ బండ తెస్తాడని నీకు నమ్మకం వుందా యేంటి, చేసే యెదవ పనుల చిట్టా రోజు రోజుకి పెచ్చరిల్లిపోతుంది. ఎవడన్నా బిడ్డను చూసి యెదవ్వేషాలేస్తే దుడ్డు కర్ర తీసుకొని వాడి నడుం యిరగ్గొట్టాలి. తాగుడికి డబ్బులొస్తయి అని పెళ్ళాన్నో కడుపునబుట్టిన బిడ్డనో యెవడి పక్కలోనో పండబెట్టే తార్పుడుగాడి అవతారం యెత్తడు. సరళమ్మ యింట్లో పని మానేసింది యిందుక్కాదు,నేను తప్పించుకున్నాననుకుంటే బిడ్డను ఆడికి అప్పగించబోయాడు. తలుచుకుంటే భయమేస్తంది,వొళ్ళంతా కంపరంతో వుడికిపోతుంది. నీ కొడుకుని మాత్రం వొదుల్తానా? రానీ ఆడి పని చెప్తా”. కుంపట్లో మంట గంగ ముఖంపై తారట్లాడింది కాసేపు.
ఆమె పిండి గిన్నె తీసుకొని వుండలు చుడుతుండగా..
“ఇదిగో గంగా! ఆడిని నేను తిట్టలేదనుకునేవు,ఆడికి ఫోన్ చేపిచ్చి తిట్టా. దైవసాచ్చిగా చెపుతున్నా! ఇంకెప్పుడైనా ఆయన దగ్గరకు డబ్బెట్టుకు రమ్మని పిల్లను పంపావా కాళ్ళిరగ్గొడతా సన్నాసెధవా! మరీ యింత సన్నాసి యెధవ్వి అవుతావనుకుంటే పురిట్లోనే వడ్డ గింజేసి చంపి వుందును” అని తిట్టిపోసా. ఆ రమణారావును మాత్రం నేను వొదిలాననుకున్నావా?, నడివీధిలో పెట్టకపోయినా యింటెనకమాలకు పిలిచి ఆడి పెళ్ళాం పిల్ల ముందర బుగ్గల్లో బుగ్గల్లో పొడిచి మొకాన ఊసి వచ్చా! నువ్వొచ్చాక నీకొక మాట చెప్పి పోలీసు స్టేషన్ కి పోదాం అని చూత్తన్నా, నువ్వేమంటావ్ మరి”
“ఇప్పుడేడ పోతాం, ఆలోచిచ్చుకోని నన్ను. ఏ సంగతి రేపు చూద్దాం.”
ఈ మాటలేవిటికీ అర్దం తెలియని కృష్ణుడు అమ్మ చేతిలో పిండి రొట్టైలయ్యీ పళ్ళెంలోకి పరుగెత్తి వచ్చే గోధుమ వర్ణపు చంద్రుడై నోట్లో వెన్నముద్దై కరిగి భగభగమని మండే జఠరాగ్నిని చల్లబరుస్తాయని ఆత్రంగా యెదురుచూస్తున్నాడు. నవ్య మంచంపై ముడుచుకుని ఆలోచిస్తుంది.
పిల్లలకు అత్తకు రొట్టెలు పెట్టి తను మజ్జిగ తాగి పడుకుంది గంగ. ప్రసాద్ పేరుకు ఆటో తోల్తాడు. అంగట్లో సరుకుల్లా ఆమ్మాయిలను బుక్ చేసి రమణారావుకు అప్పగించేవాడు. భార్య గంగ తన సొంత ఆస్థి అనుకుని ఆమెను రమణారావు వైపుకు నెట్టడానికి శక్తియుక్తులన్నీ ప్రయోగించాడు. గంగ మొగుడిని ఛీత్కరించుకుంది. పెట్టెబేడా సర్దుకుని పిల్లలను వెంటబెట్టుకుని పల్లెటూరుకు బయలెల్లింది. కాళ్ళబేరానికి వచ్చినట్టే వచ్చాడు కానీ యింటికి రావడమే మానేసాడు. గంగ కాకపోతే మంగ అన్నట్టు వేరొక స్త్రీతో రెండో యిల్లు యేర్పరుచుకున్నాడు. ఆ సంగతి తెలిసినా పట్టించుకోలేదు గంగ. పట్టించుకుని గనుక యేమి చేయగలను,ఎక్కడైనా రెక్కలు ముక్కలు చేసుకుని బతకాల్సిందే కదా బిడ్డల చదువు కోసమైనా పట్నాన్ని అంటిపెట్టుకుని వుండాలి తప్పదు అనుకుంది.
సన్నగా మొదలైన వాన కుంభవృష్టి గా మారింది. గంటల్లోనే లోతట్టు ప్రాంతంలో వుండే వారిళ్ళ మధ్య కలకలం.దాదాపు అందరి ఇళ్ళను వరద చుట్టేసింది. పిల్లలు గగ్గోలు పెట్టి ఏడుస్తున్నారు. ఆడాళ్లు కంగారుగా చేతికందిన చెంబూ తపేళ మూటాముల్లె నెత్తినెట్టుకుని పిల్లలను పట్టుకుని మోకాలు లోతు నీళ్ళలో కాళ్ళీడ్చుకుంటూ నడుస్తున్నారు. మగవాళ్లు ఇళ్ళ వరుసను బట్టి రోడ్డును అంచనా వేసుకుంటూ అందరినీ హెచ్చరిస్తూ ముందుగా నడిచారు.
నర్సమ్మ అందరికన్నా చివరన నడుస్తూ వెనక్కి వెనక్కి చూసుకుంటుంది. “నాయనా.. కిట్టయ్యా కుక్క పిల్లను చంకనేసుకున్నావా లేదా? పిచ్చిముండ మునిగి చచ్చిపోద్ది” అంది.
“నానమ్మా, నేను కుక్క పిల్లను భుజానేసుకుని నడుస్తున్నా. నువ్వు గబగబ రా.. నీళ్లు పైకొచ్చేస్తున్నాయి” అని అరిచాడు కృష్ణుడు. అందరూ భయం గుప్పిటబెట్టుకుని వానలో తడుస్తూనే ఎత్తైన ప్రదేశానికి చేరుకున్నారు. గంగ చేతిలో వున్నవి తలపై వున్న మూటను దించి అక్కడే పిల్లలను కూర్చోబెట్టి నర్సమ్మ కోసం వెనక్కి వచ్చింది. భుజం పట్టుకుని నడిపిస్తుంటే నర్సమ్మ వెనక్కి తిరిగి ఇంటి వైపు చూసుకుంటూ కళ్లు తుడుచుకుంటూ గొణుక్కుంటూ కోడలితో నడిచింది. ఎత్తుపై నుండి కూడా తదేకంగా కనీకనబడని తన ఇంటిని చూసుకుంటూ వుండిపోయింది. ఆ రాత్రి కాళరాత్రే అయింది వారికి. అధికారులు వచ్చి అందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు. రాజకీయ నాయకుల సహాయ కార్యక్రమాలు జరుగుతూనే వున్నాయి.
తెల్లారినాక కూడా వాన కురుస్తూనే వుంది. గంగ నర్సమ్మకు టీ టిఫిన్ తీసుకొచ్చి యిచ్చి “ఇంకా రెండు రోజులు వాన యిట్టాగే వుంటదంట. ఇక మనం ఇంటి ముఖం చూత్తామో లేదో, అంతా నానిపోయి కూలిపోద్దో యేమో, తలదాచుకోడానికి ఆ నీడ కూడా లేకుండా పోద్దేమో అత్తా! ఈ కష్టం పగోడికి కూడా వద్దు’’ అంది దిగులుగా.
“నాకు అదే దిగులుగా వుందే గంగా”
“నీ కొడుకెక్కడికి వెళ్లాడో. మిత్తవల్లే యింత వరదొచ్చి పడిందే,పిల్లలు తల్లి పెళ్లాం యెట్టా వుండారో యెక్కడ వుండారో అన్న ఆలోచన ఇంగితగానం వుండొద్దు. ఇట్టాంటి వాడు బతికి వుంటే యేంటి చస్తే యేంటి?’’ అంది కోపంగా.
“అంత మాట అనకే గంగా” అంటూ గట్టిగా ఏడ్చింది నర్సమ్మ. తెల్లారితే చాలు గుక్కెడు టీ కోసం పెర పెరలాడే ఆమె ఆ రోజు టీ ముట్టలేదు, టిఫిన్ తినలేదు.గోడకు ముఖం పెట్టుకుని ముడుచుకుని వుండిపోయింది.
అప్పుడప్పుడూ “గంగా, అట్టా బయటకుపోయి మన ఇళ్ల దగ్గరోళ్ళకు ప్రసాదు యేడన్నా కనబడ్డాడేమో అడిగి రా పో..” అనీ, పిల్లలను “మీ నాన్న వచ్చాడేమో చూసిరండి పోండి’’ అని తరుముతానే వుంది. నర్సమ్మ నసకు విసుగొచ్చిన పిల్లలు దగ్గరకు రావడం మానేసారు. గంగ కాలుగాలిన పిల్లిలా తిరుగుతూ మొగుడి కోసం ఆరా తీస్తానే వుంది.
మూడో రోజుకు వాన తెరిపిచ్చింది. నాలుగో రోజుకు మునిగిన కాలనీ ఇళ్లు బురద మేటేసుకుని దుర్గంధం కొడుతూ బయటపడ్డాయి. పశువుల కళేబరాలు కుక్కల కళేబరాలతో పాటు కరెంట్ స్థంభానికి తట్టుకుని ఆగిపోయిన ప్లాస్టిక్ నవ్వారు మంచం.నవ్వారు పట్టెల్లో చిక్కుకున్న కాళ్ళతో ఉబ్బిపోయిన శరీరంతో వున్న శవం. మంచం, వొంటిపై అరకొర బట్టలు చూసి నర్సమ్మ కొడుకు ప్రసాద్ గా గుర్తించారు. నర్సమ్మ కుప్ప కూలిపోయింది. గంగ నిబ్బరంగా పిల్లలిద్దరిని పట్టుకుని నిలబడింది.
నర్సమ్మ మనసులో కుళ్ళి కుళ్ళి యేడుస్తుంది. “అయ్యో కొడుకా! నా చేత యెంత పని చేయించావురా. నన్నెంత కటికదానిగా చేసావ్ రా అయ్యా! నీ బుద్ధి సక్రమంగా లేదని కోపంతో ఈ పని చేసాను. తాగొచ్చి వొళ్లు తెలియకుండా మంచం మీద పడిపోతే నిన్ను లెగవకుండా కట్టి పడేసా కదరా. ఆ తాడే నీకు ఉరితాడు అయ్యి నీళ్ళలో మునిగిపోతున్నా లెగవకుండా చేసింది కదరా అయ్యా. నన్ను బిడ్డను చంపిన పాపిని చేసావు కదరా అయ్యా” అని.
సరళ వచ్చి గంగ కు అండగా నిలబడింది. నర్సమ్మ వచ్చి రమణారావు పై కేసు పెడతానని అనేసరికి భయపడి ఫిట్స్ లాగా వచ్చి పడిపోయాడని హాస్పిటల్ కు వేసుకుని వెళితే పక్షవాతం వచ్చే సూచనలన్నారని చెబుతూ…
“గంగా..నీ మొగుడు చచ్చాడని నువ్వు యేడుస్తున్నావు నా మొగుడు యింకా యెందుకు చావలేదని నేను యేడుస్తున్నా” అంది సరళ.
“అయ్యో! అంతమాట యెందుకులేమ్మా, ఊరుకోండి అమ్మ గారూ” అంది. గంగ జాలి నిండిన గొంతుతో చెమ్మగిల్లిన మనసుతో.
కూలిపోయిన యింటిలో అప్పుల వాళ్ళ తాకిడితో చాలీ చాలని పరదా పట్టాల కింద తలదాచుకుంటుంది గంగ కుటుంబం. బతుకు భారంగా రోజులు వేగంగా గడుస్తున్నాయి. పశ్చాతాపంతో నర్సమ్మ గుండెలు మండిపోతున్నాయి. తప్పు చేసిన బిడ్డను మందలించవచ్చు దండించవచ్చు గానీ ప్రాణం తీసే హక్కు తనకు యేముందనీ అని లోలోపల కుమిలిపోయింది. ఎక్కువ కాలం రహస్యం కప్పిపెట్టలేక మనసు ఉగ్గబట్టుకోలేక చేసిన పాపం చెబితే పోతుంది అన్నట్టు గంగ కాళ్ళు పట్టుకుని తను చేసిన పని గురించి చెప్పింది క్షమించమని ప్రాధేయపడింది.
గంగ నిర్లిప్తతంగా చూసి “ఇట్టా జరుగుద్దని నువ్వు మాత్రం అనుకున్నావా యేంటి, ఊరుకో అత్తా” అంది. “ఈ మాట మరెక్కడా అనబోకు కడుపులో దాచుకో” అని కూడా చెప్పింది. నర్సమ్మ పాప భారాన్ని యెక్కువ కాలం ఓపలేకపోయింది.గంగ మోసే తన భారాన్ని కూడా తగ్గించేసి లోకం నుండి నిష్క్రమించింది. ఆ రోజు అండ పోయిందో బరువు తగ్గిందో యేమి బోధ పడలేదు గంగకు. అప్పు కోసం సరళ యింటి మెట్లెక్కింది మళ్ళీ.
*********
జ్ఞాపకాల్లో నుండి బయటపడి.. అపార్ట్మెంట్ లో త్వరగా పని ముగించుకుని కృత నిశ్చయంతో సరళ యింటి మెట్లు యెక్కింది గంగ.
రెండు గంటల తర్వాత పార్క్ లో కూర్చున్న సరళ ఫోన్ మోగింది. “పని అయిపోయిందమ్మా యింటికి వెళ్ళండీ”
సరళ ఇంటికి చేరింది. బెడ్ రూమ్ లో భర్త విడిచిన షర్ట్ ని ముఖంపై కప్పుకుని మూడెంక వేసుకుని పడుకుని వున్నాడు.
ఆమె ముఖంలో క్రూరమైన నవ్వొకటి తొంగిచూసింది.
“ఏమిటలా ముఖం పై మసుగేసుకుని చేతకాని దద్దమ్మాలా పడుకున్నారు. రంధి, అదే నిద్ర రంధి తీరిందా” అని నర్మగర్భంగా అడిగింది.
ఉలికిపడి అనుమానంగా భార్య ముఖం వైపు చూసాడు.
“నీ స్త్రీ వ్యసనంతో నన్నెంత రంపపుకోతకు గురిచేసావు మదపత్రాష్టుడా! నా శరీరాన్ని రోగాల పుట్టగా మార్చావు. పసివాళ్ళని కూడా చూడకుండా చిన్న పిల్లలపై అఘాయిత్యాలకు పూనుకుంటున్నావ్ . నీ పురుషత్వం తలెత్తి చూడకుండా మానసికంగా నిన్ను బలహీనుడిని చేయడమే నీకు సరైన శిక్ష. నువ్వు ఈ గదిలో మగ్గి మగ్గి ఇలా కుమలాల్సిందే.” కసిగా తిట్టింది.
అవమానంతో దిండు లో ముఖం దాచుకున్నాడు రమణారావు.
“నీ బతుక్కి సిగ్గు వొకటి వుండట్టు..ఆ ముఖం దాచుకోవడం వొకటే తక్కువ. కొడుకనే కనికరం లేకుండా తెగువగా ఆ నర్సమ్మ చేసిన పని నేను చేయలేకపోతున్నా” అంటూ కోపంగా జుట్టు పట్టుకుని తల గుంజింది.
భార్య వైపు భయంగా చూస్తూ “వద్దు వద్దు. నా తప్పు తెలుసుకున్నాను మారిపోయాను. నన్ను క్షమించు సరళా” అన్నాడు. ఏడుస్తూ.. ఛీ అనుకుంటూ అతనికి దూరంగా వెళ్ళింది ఆమె.
చీకటి పడుతున్న వేళ గంగ వచ్చి వంట ఇంటి గుమ్మం దగ్గర నిలిచింది. కూర్చోమని అన్నా కూర్చోకుండా..
“సరళమ్మా ! నిలువెల్లా కామంతో రగిలిపోయే మనిషిని ఉసిగొల్పి మానసికంగా కుంగదీయాలి అని నాకో పని అప్పజెప్పావ్. డబ్బు అవసరం యెంతున్నా నేను అన్నీ ఇడిసేసిన మనిషిని మాత్రం కాదండీ. నీ అంత చదువుకున్నదాన్ని కాకపోయినా మనుషులను వస్తువులను వాడుకున్నట్టు వాడుకోకూడదనే ఇంగితగేనం వుంది. నువ్వు చెప్పినట్టు కాకుండానే నీ భర్తకు నాలుగు మంచి మాటల్జెప్పి ఇకనైనా మార్పు తెచ్చుకో. లేకపోతే నీ బిడ్డలకు మొహం కూడా చూపించలేక పోతావు అని మందలిచ్చాను యెత్తి పొడిచాను చీత్కరిచ్చాను. ఇని యిని ఆఖరికి దిండులో తలదాచుకుని ఎక్కిళ్లు పెట్టి యేడిసాడు. ఇక ఆయన నడుము యిరిగిన పాము అనుకో”
“చాలా చాలా థ్యాంక్స్ గంగా! నువ్వన్నట్టు యికనైనా ఆయన మారిపోతే చాలు” కృతజ్ఞత తో తేలికైన మనసుతో చిరునవ్వు ముఖంతో.
“అమ్మా! ఇంకో మాట విను. నా బిడ్డలకు పొట్టనిండా కూడు పెట్టుకోలేకపోతే పస్తు పడుకోబెడతాను కానీ జారతనం చూపెట్టను. ఆపదలో వున్నప్పుడు సాయం చేసావని నీ మాట కాదనలేకపోయాను కానీ అది నీలాంటివాళ్ళు చెప్పదగ్గ పని కాదు నేను చేయదగ్గ పని కాదు. ఇంటి పని వంట పని యివ్వాలనుకుంటే యివ్వండి. కష్టం చేసుకుని మీ బాకీ తీరుస్తాను కానీ యిట్టాంటి పని యింకెప్పుడూ చెప్పబాకమ్మా” బాధ నిండిన గొంతుతో కళ్లు తుడుచుకుంటూ వెళ్ళిపోయింది.
చెంప పై చెళ్ళున కొట్టినట్లైంది సరళ కు. గంగను నేనెంత తక్కువగా అంచనా వేసాను. నాకు నా భర్త కు తేడా ఏం వుంది? నేను పురమాయించిన పని కూడా అత్యాచారం కన్నా తక్కువేం కాదు.తనెంత దిగజారిపోయి భర్తను రెచ్చగొట్టి నీరు కారిపోయేటట్టు చేయమని అడిగింది? గంగ కాబట్టి నర నరం పదునుగా కోసినట్టు మెత్తగా స్పష్టంగా తనేంటో చెప్పింది. తల భూమిలో పెట్టుకున్నంత పనైంది సరళ కు. ఇంకా ఆలోచిస్తూ... దీనినే వ్యక్తిత్వం అని అంటారేమో! పరిస్థితులు యెలా వున్నా గంగ లాంటి వారు విలువలను పణంగా పెట్టలేరు, తమ ఆత్మాభిమానాన్ని పోగొట్టుకోలేరు. గంగ ముందు నేను నిత్యం సిగ్గుతో తలొంచుకోలేను పని కూడా ఇవ్వలేను అనుకుంది.
ఎదురుగా టివి లో .. గంగా పుష్కరాల ప్రత్యక్ష ప్రసారంలో వేటూరి పాట బ్యాక్ గ్రౌండ్ లో వినబడుతూ వుంది. “గండాలను పాపాలను కడిగివేయగా ముక్తినదిని మూడు మునకలే చాలుగా” తెర వైపు చూస్తూన్న సరళ మానసిక స్నానం చేస్తూ గంగలో మూడు మునకలు మునిగింది.
*******************0**********************
“బహుళ త్రైమాసిక వెబ్ పత్రిక “ జూన్ 2023 సంచికలో ప్రచురితం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి