#వనజవనమాలి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
#వనజవనమాలి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, జులై 2023, సోమవారం

దీప వృక్షం


దీప వృక్షం - వనజ తాతినేని


ఊరికి వొక చివర వూడలు దిగిన మర్రిమాను. టౌన్ కి  వెళ్ళే బస్  ప్రయాణికుల యెదురు చూపుపై పడే యెండకు వానకు గొడుగు పడుతుంది.బస్ వస్తుందని గంటకి పైగానే యెదురు చూస్తున్న  ప్రయాణికులు. కాళ్ళ నొప్పులతో కొందరు అటు ఇటు పచార్లు చేస్తుంటే   యింకొందరు  చెట్టుకింద వేసిన సిమెంట్ బల్లలపై కూర్చుని కూడా ఆపసోపాలు పడుతూ విసుగు ప్రదర్శిస్తున్నారు. మరికొందరు కటిక నేలపై చతికిలబడి ఆశగా మలుపు వైపు చూస్తున్నారు.మనుషులసు తరగతులుగా విభజించబడును అనేదానికి ఆ చెట్టు కూడా వొక  సాక్ష్యం. 


రెండు రకాలుగా వొళ్ళు మండుతున్న నీలవేణి అడుగెత్తు కూడా లేని బొంత రాతిపై కూర్చుని కూర్చుని విసుగొచ్చి లేచి నిలబడింది. “ఈ బస్ వచ్చేది చచ్చేది తెలియదు. నేను నడిచిపోతున్నా. ఇంకా యెక్కువసేపు కూర్చుంటే ఎగ్జామ్ కి అందుకోలేను” అని రోడ్డెక్కింది. 


“జ్వరంతో వొళ్ళు కాలిపోతుంటే రెండు మైళ్ళు యెక్కడ నడుస్తావ్,  మా అన్నతో  సైకిల్ మీదన్నా పోకపొయ్యావ్” అంది బెంచీ పై కూర్చుని పుస్తకం చదువుకుంటున్న వకుళ. ఆమె నీలవేణి కన్నా చిన్నది. బస్ వస్తేనే కాలేజ్ కి వస్తుంది. లేకపోతే డుమ్మా కొడుతుంది. పరీక్షలున్నా సరే. 


“ఇంతకీ, నువ్వొస్తావా లేక యింటికి పోతావా”


“నేనంత దూరం నడవలేను. ఐ యామ్ సఫెరింగ్ ఫ్రమ్ ఫీవర్ ఆయుధం వుందిగా” నవ్వుతూ చెప్పింది. 


చిరాకును అణుచుకుంటూ విసురుగా వెనక్కి తిరిగి ముందుకు అడుగులు వేసింది నీలవేణి. ఆ విసురుకు పొడవాటి జడ పాములా కుడి భుజంపై నుండి ముందుకు పడింది. దూరంగా రెండతస్తుల మిద్దెపై నుండి ఆమెనే చూస్తున్న రెండు కళ్ళు. ఆ కళ్ళను ఆసక్తిగా  గమనించింది వకుళ. 


వడివడిగా నడుసున్న నీలవేణి వూరు ని దాటింది.ఓ కారు ఆమెను దాటి ముందుకెళ్ళి పక్కగా ఆగింది. 


 కారు తోలుతున్న   శేఖర్ రెడ్డి “ఏమ్మే, నడిచిపోతున్నావ్. ఇయ్యాల బస్ రాలే, ఆ డిపో మేనేజర్ తొత్తుకొడుక్కి యెన్నిసార్లు అర్జీలు పెట్టినా బుద్ది లే. టైయానికి బస్ రాకుంటే చదువుకునే పిల్లకాయలకు యెంత యిబ్బంది? రా..  యెక్కి కూకో, కాలేజీ కాడ దించుతా, నేను కూడా మండలాఫీసుకు పోతున్నా లే” అన్నాడు. 


నీలవేణి ఒక్క క్షణం తటపటాయించింది.నాలుగేళ్ళ కిందట పొలం పనికి పోయినప్పుడు  మోటరు షెడ్ లోకి పిలిచి వొంటిపై చెయ్యేసినప్పుడు లాగి పెట్టి  వొక తన్ను తన్ని తప్పించుకుంది. దారిలో మళ్ళీ అలాంటి ప్రయత్నమే చేస్తే అని ఆలోచించింది క్షణకాలం. కానీ పరీక్ష కి వెళ్ళాల్సిన అవసరం గుర్తొచ్చి  అనుమానాన్ని జయించి  వెనుక డోర్ తెరిచి కూర్చుంది. 


“ఏమ్మే, యింకా నీ చదువు పూర్తి కాలే, నీకు పెళ్ళి చేసి కానీ మీ అన్న శీనడు పెళ్ళి చేసుకుంటా అంటాడు. నువ్వేమో యింకా పై చదువులు చదవాలని అంటావంట. నువ్వు చదివిన చదువుకి నీకు వుద్యోగం రానే వస్తది.మీ వాళ్ళల్లో వుద్యోగం చేసే ఆడోల్లకి మంచి వుద్యోగస్తుడైన మొగుడే దొరుకుతాడు. ఈ యేటితో చదువు ముగిచ్చి వుద్యోగానికి అర్జీ పెట్టుకో. గవర్నమెంట్ లో మనకు కావల్సినవాళ్ళు చాలామంది వుండారు. నిను పోస్ట్ లో యేపియ్యడం యేమంత కష్టం కాదు” భరోసాగా అన్నాడు 


“లేదు రెడ్డీ, నేను గ్రూప్ వన్ కి పోవాలనుకుంటున్నా. మా అన్నకు పెళ్ళికి తొందరైతే చేసుకోమను. నేనేమి నా పెళ్ళి చేసి  నువ్వు చేసుకో అని చెప్పలేదే, మా అమ్మా నాయన నా బరువేదో తీర్చుకోవాలనే తాపత్రయంతో యేదో అంటా వుంటారు. మా అన్నతో పెళ్ళి  కోసం ఆ గమలాళ్ళ పద్మ ఎదురుచూస్తుంది. ఆమె యిష్టం లేని పెళ్ళి చేసుకుని మొగుడుతో కాపురం చేయకుండా వచ్చేసింది వీడి కోసమే కదా! మా అన్న అంటే ఆ అమ్మికి చానా యిష్టం . ఆమె మనసెరిగి కూడా నా పెళ్ళితో ముడిపెడతం నాకు నచ్చలేదు. పెళ్ళి చేసుకుని అమ్మ నాయన్ని వొదిలేసి  యేరు కాపరం పోయినా పర్లేదు. నేను చూసుకుంటా వాళ్ళని. ఆడ్ని పెళ్ళిచేసుకోమని చెప్పు” అంది. 


“నేను చెబుతాలే, ఆ బ్యాంక్ లో ట్రాక్టర్ లోను రెండు లక్షలు బాకీ వుండె. నేను హామీ వుండా కాబట్టి బ్యాంక్ వాళ్ళు చూసి చూడనట్టు పోతన్నారు.  మీ అన్నకు కావరం జాస్తి. సొంత కయ్యిలు వున్న వాడికి ట్రాక్టర్ వుంటే లాకీ కానీ వూళ్ళో వాళ్ళ పొలాలు దున్ని కుప్పలు నూర్చితే యేడ డబ్బులు మిగులుతాయ్. డీజిల్ రేటు పెరిగిపోయే, వద్దురా, నువ్వు డ్రైవర్ గా పోతేనే డబ్బులు కనబడతాయి అంటే యినకపోయే. కాపు లతో పోటీ పడితే అప్పుల చిప్పే మిగిలేది. ఇప్పుడు యేమైంది వున్నదీ పోయే అప్పు మిగిలే” అన్నాడు వెటకారంగా, 


వొళ్ళు మండింది నీలవేణికి. “మా అన్నకు ఆవేశం యెక్కువ ఆలోచన తక్కువ లే రెడ్డి. రెండేళ్ళు వోపిక పడితే లోను నేను కట్టేస్తా” అంది . 


క్రాస్స్ రోడ్స్ వచ్చేసరికి వూర్లోకి వచ్చే బస్ యెదురయ్యింది. బస్ చూసిన నీలవేణి ముఖంలో రంగులు మారాయి. రావాల్సిన సమయం కన్నా గంటన్నర ఆలస్యం. రోజూ యిదే తంతు. మనసులో మెదిలిన ప్రశ్నను బాణంలా వొదిలింది.


“రెడ్డి, నిజం చెప్పు. ఊర్లోకి బస్ రానీయకుండా చేసేది నువ్వే కదూ” 


అతను భళ్లున నవ్వి “భలేదానివే, నేనెందుకు ఆ పాపపు పని చేస్తానమ్మే, వూరిలో వున్న కాపోళ్ళ అందరిలోకి  తక్కువ కులపోళ్ళకు  అండగా వుండేది నేనొక్కడినే, ఎన్నిసార్లు డిపో మేనేజర్ దగ్గరికి పోయి కంప్లైంట్ పెట్టి వచ్చాము. అందుకు సాచ్చ్యం మీ అన్నే. కావాలంటే పోయి వాడినే అడుగు ” అన్నాడు.


“లేదులే రెడ్డి , ఊర్లోకి వచ్చే బస్ వూరి చివర వున్న హరిజన వాడ దాక వస్తుంది. ఊర్లోకి వచ్చేసరికి సీట్లన్నీ నిండిపోయి వూళ్ళో వాళ్ళంతా నిలబడి టౌన్ కి పోవాల్సి వస్తుంది. నిలబడి పోతున్నందుకు కాదు అలగాజనం అంతా కూచుని వుంటే మనం నిలబడి వుండటం ఏమిటన్న అహంకారం కదా వూళ్ళో బక్కచిక్కిన పెద్దకులాల వాళ్ళది. సమయం తప్పించి బస్ వస్తే ఆపాటికే యెటాళ్ళు అటు సర్దుకుంటారు. తర్వాత హాయిగా గౌరవంగా కూర్చుని పోవచ్చు అని కదా మీ పెద్దాళ్ళ పన్నాగం. బస్ డ్రైవర్ లకు మేతేసి నువ్వే మేనేజ్ చేసివుంటావ్ అది కూడా ” అంది నిర్మొహమాటంగా, 


 “నీయన్ని పిచ్చి ఊహలు,చదువుకున్న అతి తెలివితేటలు చూపుతున్నావ్. అంత దూరం మేమెప్పుడూ ఆలోచించలేదు. ఆ తేడా, గిరిగీసి కూచేబెట్టటమే వుంటే.. మా యిండ్లల్లో పెళ్ళికి విందు భోజనాలకి  మీ వాళ్ళను యెందుకు పిలుస్తాము. ఒకే బంతిలో కూర్చుని భోజనాలెందుకు చేస్తాము. అయినా కులాలేడ వున్నాయమ్మీ,  నా ముందు అంటే అన్నావు గానీ మరెవరి ముందు అనబాకు, నీ మంచి కోసమే చెబుతున్నా” అన్నాడు. మనసులో మాత్రం  “అఖండమైన తెలితేటలమ్మీ నీయి, మీ వాళ్ళందరికీ యీ తెలివితేటలుంటే మాబోటి వాళ్ళం వూరు వదిలేసి పోవాల్సిందే” అనుకున్నాడు.


కాలేజీ గేటు ముందు కారాపి “నీ పరీక్షలు అయిపొయ్యాక అర్జీ రాసి చదువుకునే పిల్లకాయలందరి చేత  సంతకాలు పెట్టించి తీసుకురా. డిపో కి పోయి మేనేజర్ తో మాట్లాడేసి వద్దాం. నీ అనుమానాలు అన్నీ తీరిపోతయి” అన్నాడు. 


థాంక్స్ చెప్పి లోపలికి వెళుతున్న నీలవేణిని చూసి పెదవి కొరుక్కున్నాడు. సాలోచనగా తలపంకించాడు. 


పదిరోజులు గడిచాక శేఖర్ రెడ్డి లేకుండానే నలుగురి పెద్దాళ్ళను పదిమంది పిల్లకాయలను పోగోసుకొని వెళ్లి డిపో మేనేజర్ ని కలిసింది నీలవేణి. నిర్ణీతవేళలకు బస్ నడపకపోవడం వల్ల వూరి వాళ్ళకు విద్యార్థులకు కలిగే ఇబ్బందులను వల్లెవేసారందరూ.ఇకపై సక్రమంగా నడిపితే నడపండి లేకపోతే బస్ ని వూర్లోకి రానీయకుండా అడ్డుకుంటాం. సమ్మె కూడా చేస్తాం అని చెప్పి వచ్చారు. 


సెలవల్లో ఆడపిల్లలందరికీ ఇంగ్లీష్ నేర్పడం సైకిల్ తొక్కడం నేర్పడం చేస్తుంది నీలవేణి. “ఈ అమ్మి కి వూళ్ళో సంగతులన్నీ యెందుకు? ఇంకో రెండు నెల్లకు తిరుపతికి పోయి చదువుకుంటానంటుండే. మొన్నకూడా అట్టాగే పరీక్షలప్పుడు యెర్రటి యెండలపుడు నడిచిపోతుందని ఆలీస్యమైపోతుందని జాలిపడి కారెక్కించుకొని కాలేజీ కాడ దింపేలోపు యేమేమో మాట్టాడిందంట రెడ్డి ని” అని కస్సుబుస్సులాడాడు శీను. అన్యోపదేశంగా రెడ్డి జోలికి వెళ్ళొద్దని అమ్మ నాయన చేత చెప్పిస్తున్నాడని అర్ధమైంది నీలవేణికి. 


“రెడ్డమ్మ మద్రాసుకు పోయిందంట చెల్లెలు కాన్పు కోసం. పది రోజులు యింటికొచ్చి వంట చేసి పెట్టమని అడుగుతున్నాడు రెడ్డి. పోదామా చెల్లీ” అని అడిగాడు శీను. 


నీలవేణి రెడ్డి చూపుల్లో తేడాని చాలాసార్లు గమనించింది.

గతంలో అంత తిరస్కారం జరిగాక కూడా అతను అతని ప్రయత్నాలు చేయడం మానలేదు. “లేదన్నా నేను చదువుకోవాలి. అమ్మతో కూడా పొలం పనికి పోవాలి. ఫీజులకు డబ్బులు పోగుచేసుకోవాలి గందా” అంది.


“నేను కూడా వస్తాను లే నీ యెమ్మెట. కాదంటే బాగోదు. చిన్నదానికి పెద్దదానికి ఆయనే అండ మనకు”  అన్నాడు వొప్పించే రీతిలో. అన్నకు సమాధానం చెప్పకుండా దాటేసి సాయంత్రానికి స్నేహితురాలి వూరికి పోతున్నానని తల్లికి చెప్పి బయలుదేరింది. 


ఓ పది రోజులకు హైదరాబాద్ లో వుద్యోగం దొరికిందని వుద్యోగం చేస్తానే అక్కడే చదువుకుంటా అని అన్నకు ఫోన్ చేసి చెప్పింది. “నేను యింటికి పోవడంలేదు. నువ్వే చెప్పుకో ఆ సంగతి” అని చెల్లిని కసిరి ఫోన్ పెట్టేసాడు శీను. 


నీలవేణికి యేదో అనుమానం కల్గి చిల్లరఅంగడి దేవసేనకు ఫోన్ చేసింది.  “మీ అన్న ఆ గమళోళ్ళ పద్మను తీసుకుపోయి జొన్నవాడ లో పెళ్ళి చేసుకొని వచ్చాడు.అటు ఆళ్ళు రానీయలే, మీ వాళ్ళు గడప తొక్కనీయలా, పాటూరు రోడ్ లో యిల్లు దీసుకుని పెట్టినాడంట. మీ అమ్మ నాయన వొకటే యేడుపనుకో. బిడ్డలిద్దరూ మమ్మల్ని వీధిన బెట్టారని” అని చెప్పింది. 


 “ఆలస్యంగా అయినా మా శీనన్న మంచిపని చేసాడు. ఏదైనా అర్జెంట్ అయితే నాకు ఫోన్ చేయక్కా” అని చెప్పి ఫోన్ పెట్టేసింది.


ఉరుము లేని పిడుగులా మర్నాడే.. దేవసేన నుండి ఫోన్. “మీ అన్న ట్రాక్టర్ లోను తీసుకొని డబ్బు కట్టటంలేదంట. ట్రాక్టర్ కూడా కనబడకుండా అమ్మేసినాడంట. ఆ డబ్బు కట్టమని లేకపోతే యిల్లు జప్తు పెడతామని వచ్చి పడ్డారు బ్యాంక్ వాళ్లు. మీ అమ్మ ఏడుస్తుంది. నువ్వు వెంటనే బయల్దేరి రా అమ్మి” అంది. 


బేగ్ లో రెండు జతల బట్టలు కుక్కుకుని తెల్లారేపాటికి యింటికి చేరింది. నీలవేణి అమ్మ నాయన నిలవనీడ లేకుండా పోద్దని వొకటే యేడుపు, అన్న అయిపు లేడు. ఆమె ఆలోచనల్లో రెడ్డి మెదిలాడు. దారులన్నీ వొక్కొక్కటిగా మూసుకుపోయి వొకే దారి మిగిలింది. అది రెడ్డి చేలో పంపు షెడ్ కి దారి. పులి బోను లోకి పులి లాగానే వెళ్ళింది నీలవేణి. 


“ఏమ్మే, చదువుల రాణీ, ఇట్టా  దారి తప్పి మా పంట పొలం లోకి వచ్చింది.” వెటకారంగా అన్నాడు.


“రాజకీయం చమత్కారం వ్యంగ్యం అన్నీ నీ దగ్గర నేర్చుకోవాలని వచ్చాను రెడ్డి. బ్యాంక్ వాళ్ళ ని నువ్వే రెచ్చగొట్టావని నాకు తెలుసు. ఏళ్ళ తరబడి నీ దగ్గర గొడ్డు చాకిరి చేసినవాడికి సాయం చేయాలనుకుంటే చేయవా? బ్యాంక్ వాళ్ళను యెట్టా ఆపుతావో నీ యిష్టం. ఇదిగో నా ఫోన్ నెంబర్. హైదరాబాద్ లో వున్నా. నువ్వు యెక్కడికి రమ్మంటే అక్కడకు వస్తా, పోయొస్తా” మరొక మాటకు అవకాశం యివ్వకుండా వెనక్కి తిరిగింది. 


“రెడ్డి ది మంచి మనసు.  ఆయన బ్యాంకీ వాళ్ళను పిలిపించి ఆళ్ళతో నా యెదురుగుండానే మాట్టాడినాడు. ఆళ్ళు ఆయన మాట విని కొన్నాళ్ళు ఆగుతాం. ఈ లోపు  యెంతో కొంత కడతావుండండి” అన్నారు అనే వార్తను కళ్ళు తుడుచుకుంటూ సంతోషంగా చెప్పాడు నీలవేణి నాన్న. 


 సాయంత్రం బస్ యెక్కించడానికి వచ్చిన తల్లి నెమ్మదిగా తెలివిగా చెప్పింది. “యెట్టాగొట్టా ఆ బాకీ కట్టు బిడ్డా. నీ అన్న ఆ బాకీ కట్టలేడు. ఆడికి యేం పాలుబోటం లేదు. ఆ అమ్మి కి ఐదో నెలంట” అని. కంట్లో నీరు పైకి  వుబకకుండా తలవూపి బస్ యెక్కాక..జలజలా కన్నీరు కార్చింది. 


నీలవేణి వెనుక సీట్లో కూర్చున్న సుధాకర్ కి  ఆ కన్నీటి చెమ్మ తగిలిందేమో  సీటు మారి ఆమె పక్క సీట్లో కూర్చుని ప్రశ్నార్థకంగా చూసాడు. ఏమీ లేదన్నట్టు తల వూపింది. అతను కూడా తన వాడ వాడే. ఇద్దరూ కలిసి చదువుకున్నారు.అతను  పై చదువులకు రాకుండా మగతా కయ్యలు చేసుకుంటూ వూర్లో ఆగిపొయ్యాడు. కష్టం సుఖం మనసిప్పి చెప్పుకునే స్నేహితుడు. మూగ ప్రేమికుడు. నెల్లూరు బస్టాండ్ లో హైదరాబాద్ బస్ కదిలిందాకా పక్కనే వుండి కళ్ళతోనే ప్రశ్న వేసి వేసి అలసి సమాధానం దొరక్కుండానే వెనక్కిమళ్ళాడతను. 


 బస్ ప్రయాణం లో నీలవేణి లో వొకటే ఆలోచన. ఈ ధనస్వామ్యం పీచమణచాలంటే గొర్రెలమందలా తలలూపే తమ వారంతా విద్యాధికులు కావడం అత్యవసరం. అంతకన్నా  ముందు ఆర్ధికంగా బలపడటం సంఘంలో హోదా పెరగడం. వీటి మీదనే దృష్టి పెట్టాలి అనుకుంది దృఢంగా. 


వారం రోజుల వరకూ రెడ్డి నుండి యేదో వొక సమయంలో ఫోన్ వస్తుందని వూహించింది.నెల రోజులు దాటినా ఫోన్ రాకపోయేసరికి ఆశ్చర్యపోయింది. ఏదైతేనేం  పొగరుగా మాట్లాడే తన ఆత్మాభిమానం అతని కాళ్ళ దగ్గరికి వెళ్ళి సాయం కోరడం వల్ల అతని అహం తృప్తి పడివుంటుంది అది చాలనుకున్నట్టు వున్నాడు అని రిలీఫ్ గా ఫీల్ అయ్యింది. . 


మధ్యలో చిల్లర అంగడి దేవసేన ఫోన్ చేసింది. ఆమె “నీలవేణీ! నువ్వు రెడ్డికి లొంగిపోయి బాకీ నుంచి బయటపడ్డావని వాడంతా కోడై కూస్తుంది. నిజమేనా” అని ఆరా తీసింది. 

  

అసహనం కట్టలు తెంచుకుంది. “అట్టాగే అనుకోనీయ్, వాడి పక్కలో నలిగితే పోయేది యేముంది? పవిత్రత మనకెంతో వాడికి అంతే!  పల్లెలో యెంతోమంది అమాయకంగానూ భయంతోనూ భక్తి తోనూ  మోజుతోనూ లేదా పదో పరకకో ఆశపడి నలిగిపోయి కామందుల ముందు మనను మనమే హీనంగా దిగజార్చుకున్నాం.ఆ సంగతి మొగుళ్ళకు తెలిసినా గమ్మున వూరుకుంటున్నారు. లేదా తన్ని తగలేస్తున్నారు. వాళ్ళ దృష్టిలో పడని యే  కొద్దిమందో నీలా  ప్రతివతలగా నీతి నిజాయితీ వున్నవారిగా నీలా టెక్కులు పోతూ నోటితో మాట్లాడి నొసటితో యెక్కిరింపు. నేను అవునని చెబితే తప్ప నీకు మనఃశ్శాంతి కల్గదనుకుంటే, అట్టాగే అనుకో” అంది కఠినంగా. 


దేవసేన ఠక్కున ఫోన్ పెట్టేసి.. కసిగా విషయానికి చిలువలు పలవులు చేసి అంగడికొచ్చిన అందరి చెవ్వుల్లో వూదడమే పనిగా పెట్టుకుంది. 


ఆరు నెలల తర్వాత..అనూహ్యంగా  రెడ్డి నుంచి నీలవేణికి ఫోన్.  “మొత్తానికి భలేదానివి నీలవేణి. నిప్పు లేకుండానే పొగ సృష్టించావ్, నేనేదో యింకా నీ కోసం చిత్తకార్తె కుక్కలా వెంటబడ్డట్టు వూహించేసుకోకు.కాదన్న ఆడదాని జోలికి నేను యేనాడు పోలే. సినిమా హీరోయిన్ లాంటోళ్ళని అజంతా ఎల్లోరా శిల్పాల లాంటి అందగత్తెలను కొనుక్కొని మరీ అనుభవించా. నువ్వొక అతిలోక సుందరి వని  అనుకొంటివా? కొంచెం నీ హెచ్చు నీ టెక్కు తగ్గించు. ఏదో రాజకీయం అని మాట్టాడావు కదా రా నేర్పుతాను నేర్చుకుందువు గాని. నీ వెనకున్న బలమేమిటో నా వెనక బలమేమిటో తేల్చుకుందాం రా” అని సవాల్ విసిరాడు. 


లోలోపల వుడికిపోయింది నీలవేణి. 

ఛత్.. నా ఆడతనానికి  యెంత అవమానం జరిగింది. అతనెప్పుడో మోజు పడ్డాడని తనెందుకు తెగించి ఆహ్వానం పలకాలి. అతని పట్ల తమ వాడలో వారికున్న హీరో వర్షిప్ తనలో కూడా రహస్యంగా దాగివుందేమో! లేకపోతే తనెందుకు అతని ఫోన్ కోసం యెదురు చూసింది. అతను యెత్తు వేసాడు.అతను పులి నేను మేక కాకూడదు అని వూహించుకుని కూడా  ఆఖరికి ఆవేశంలో  మేకను కావడానికే వొప్పుకుని వచ్చింది. కానీ అతను యెత్తుకు పై యెత్తు వేసి తనను చిత్తు చేసాడు. తనిప్పుడు చదువు మానేసి పోయి వూర్లో కూర్చుని మాములు ఆడదానిలా వోడిపోకూడదు అనుకుంది. ఇంత అనాలోచితంగా  ఆ మాటలు యెందుకన్నాను అనుకుని సిగ్గు పడింది.  సుధాకర్ గుర్తుకొచ్చాడు. వెంటనే అతనికి ఫోన్ చేసింది.  


“నువ్వు రా అమ్మీ, ప్రెసిడెంట్ గా పోటీ చేద్దువుగాని. మనం మన ఊరిని బాగుచేసుకుందాం, ఎన్నాళ్లు పెద్దకులాల వారికి బానిసల్లా పడి వుందాం. ఊళ్ళోకి బస్ కూడా రాటం లే. పిల్లకాయలందరూ చదువులు ముగిచ్చి ఆగమాగంగా తిరుగుతం, కాపోళ్ళ యిళ్ళలో పనికి పోతున్నారు.ఈ సారి వూరికి ప్రెసిడెంట్ పదవి జనరల్ మహిళ కు  కేటాయించారంట. నువ్వు పోటీ చెయ్యాలి వాళ్ళతో ఢీ కొట్టాలి” అన్నాడు.


“వాళ్ళను మనం ఢీ కొనాలంటే సొమ్ములు కయ్యలు కార్లు మంది మార్బలం వుండాలి. ఆటిని యేడ తీసుకొని రాగలం”అంది నిసృహగా. 


“మనం గెలుస్తామని చెప్పలేం కానీ మన స్టాండ్ యేమిటో మనం చూపిద్దాం. నువ్వు రావాలి మన బలం నిరూపించుకోవాలి. రామ్మే నీలవేణి” అని బతిమాలాడు.  


“ఎలక్షన్ నోటిఫికేషన్ రానీయ్. అప్పుడు వస్తానులే. ఈ సంగతి రహస్యంగా వుండనీయ్, తెలిస్తే మా యింటోనే వ్యతిరేకత మొదలైద్ది” అంది. 


“సరే నీలవేణి” అన్నాడతను.


ఉద్యోగం చేసి తన ఖర్చులకు పోనూ మిగిలిన సొమ్మును బ్యాంక్ లోను కు జమ చేస్తూ వచ్చింది. శీనుకి కొడుకు పుట్టి మొదటి పుట్టినరోజు పండగ కూడా వచ్చింది.ఫోన్ చేసి చెల్లీ నువ్వు రా! అని పిలిచాడు.”నువ్వు రాకుండా వుండేవ్ గట్టిగా రావాలి” అంది తల్లి.


ఊరికి వచ్చాక సుధాకర్ రిమాండ్ లో వున్నాడని తెలిసింది. అతని యింటికి పోయి అతని తల్లి నర్సమ్మను విచారించింది నీలవేణి. 


“సేద్యంలో నష్టం వచ్చింది మగతా తగ్గియ్యమని నాయుడుతో వాదులాడాడంట. అమ్మలక్కలు కూసి మగతా కట్టలేకపోతే నీ యింటి ఆడోళ్ళను తీసుకొచ్చి పండబెట్టమని నాయుడి కొడుకు నోరు తూలాడని వీడు కోపంతో కర్రతో తల పగలగొట్టాడు.హంగు ఆర్బాటం వున్నోళ్ళు వూరుకుంటారా?  హత్య చెయ్యబొయ్యాడని కేసు పెట్టారు. రెండు వారాలు జైలు లో వున్నాడు. శేఖర్ రెడ్డి బెయిల్ మీద విడిపిచ్చి తీసుకొచ్చాడు” అని చెప్పింది ఆమె.


“నువ్వూరుకోవే అమ్మా.. రెడ్డి దేవుడులాంటాడని నీ లాంటి వెర్రిమాలోకం వాళ్ళే అనేది. అగ్గి పెట్టి యెగదోసేది నీళ్ళు పోసి ఆరిపేసినట్టు నటించేది కూడా ఆయనే నీలవేణి. పెత్తందార్ల వైరం పైపైనే!  అన్నను మగతా తగ్గియ్యమని అడగమని చెప్పింది ఆయనే,  గొడవ జరిగాక మనపై దాడి చేస్తే వూరుకుంటామా అని వాళ్లను యెగదోసి అన్నపై కేసు పెట్టమని వొత్తిడి చేసింది శేఖర్ రెడ్డి నే. మళ్లీ బెయిల్ యిప్పించి బయటకు తీసుకొచ్చిందీ ఆయనే. రెండు వర్గాల మధ్య బలి పశువులం మనమే! మనోళ్ళకు యివ్వన్నీ చెప్పి నమ్మించలేం వొప్పించలేం” అంది సుధాకర్ చెల్లి వకుళ.  ఆమె నిర్మొహమాటి.పెళ్ళి అయిన నాలుగు నెలలకే  తాగుబోతు భర్తతో తెగతెంపులు చేసుకుని పుట్టింటికి చేరింది. కూలి పనులకు పోయి తన వాళ్ళకు బరువు కాకుండా తన బతుకు తను బతుకుతుంది. వకుళ సూక్ష్మగ్రాహ్యత కు అభినందించింది నీలవేణి. 


సుధాకర్  “నేను కూడా కేసు నుండి బయటపడి వూరు వదిలేస్తా. ఏదో వొక వుద్యోగం చేసుకుంటా. ఇక్కడుంటే మన బతుకులింతే! మారవు మారనివ్వరు” అన్నాడు నిరాశగా ఆవేదనగా. నీలవేణి ఆలోచనలో పడింది.


శీను తన  కొడుకు పుట్టినరోజు ను అట్టహాసంగా చేసాడు. శేఖర్ రెడ్డి వచ్చి బంగారు చేతి గొలుసు బహుమతి గా యిచ్చాడు. శీను భార్య నీలవేణి పిల్లాడి వేలికి తొడిగిన వుంగరాన్ని చూసి ముఖం మాడ్చింది. వేడుకకు వచ్చిన వారందరి మధ్య రెడ్డి రాజులా వెలిగాడు. మధ్య మధ్యలో నీలవేణి వైపు చూస్తూ చూసావా నేనంటే యేంటో అన్నట్టు ఒక చూపు విసిరాడు. 


వకుళ నీలవేణి పక్కన చేరి..చెవిలో గుసగుసలాడింది.

 “ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. రెడ్డి భలే అందగాడు.ఆ అందం నువ్వు గుర్తించలేదని తెగ పాట్లు పడుతున్నాడు” అంది. 


“భలేదానివి వకుళా! అతనికి నేనంటే వొళ్ళు మంట. బంతిని కాలికిందేసి తొక్కిపడదామని చూస్తారే అలా చూస్తాడు” వివరణ యిచ్చింది. 


“ఏమో నీలవేణి నాకలా అనిపించదు.నీపై తగని యిష్టం వున్నట్టు కనబడుద్ది. అందుకే వూర్లో అందరూ మీ యిద్దరి గురించి చెప్పుకుంటారు” అని చప్పున అనేసి తర్వాత నాలుక్కరుచుకుంది. నీలవేణి ముఖం గంభీరంగా మారింది. 


సుధాకర్ కూడా రెడ్డిని అంటి పెట్టుకునే తిరగడం చూసి నీలవేణి నవ్వుకుంది.ఆలోచనలు ఆచరణలోకి రాకుండానే యెలా ఆవిరైపోతాయో స్పష్టంగా తెలుసుకుంది. ఆమె మనసులో సంకల్పం మరింత దృఢం గా రూపుదిద్దుకుంది. 


పంచాయితీ యెలక్షన్ రాకుండానే నీలవేణి  పి జి అయిపోయింది.గోల్డ్ మెడల్ సాధించి సెలవివ్వని వుద్యోగాన్ని వదిలేసి స్టడీ మెటీరియల్ తీసుకొని వూరికి పయనమైంది.రాత్రులు సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూనే.. పగలు వూరితో సన్నిహితంగా మెసిలింది. సుధాకర్ తనూ అనుకున్నంత అమాయకంగా అజ్ఞానంగా తమ వాడ వాళ్ళు లేరన్నది సులభంగా అర్థమైంది. పొద్దంతా గొడ్డులా పని చేసి సాయంత్రానికి సారా బుడ్డికి కల్లు ముంతకు బానిసలుగా మారిన మగవాళ్ళ కంటే స్త్రీలు పిల్లలు చైతన్యంగా వున్నారని అందులో వకుళ లాంటి వాళ్ళు మరీ తెలివిగా వున్నారని గ్రహించింది.  గ్రామస్తులు భూస్వాములపై ఆధారపడకుండా అప్పులకు వారినే ఆశ్రయించకుండా చేయగల్గితే సగం బానిసత్వం పోయినట్లే అని భావించింది. 


తన ఆలోచనలు  సుధాకర్ తో పంచుకుందామని ప్రయత్నించింది. అదివరకంతా ప్రేమగా ఆరాధనగా చూసే సుధాకర్ తనకిపుడు  దూరంగా మసలడం ఆమెకు ఆశ్చర్యం కల్గించింది. ఇందుకూరుపేట పిల్లను చూసి లగ్గం పెట్టుకుని వచ్చేదాక అతను తనవాడే అనుకుంది. తప్పించుకు తిరుగుతున్న అతన్ని వరి చేను గట్టు పై నిలదీసింది. 


“నీలవేణీ, నువ్వు రెడ్డికి వుంపుడుగత్తెవని అందుకే హైదరాబాద్ లో వుండి అంత చదువు చదవగల్గావని అందరూ అనుకుంటా వుండారు.  ఇక నిన్నెట్టా చేసుకునేది నేను” అన్నాడు కింది చూపులు చూస్తూ. 


స్థాణువైంది. కోపంగా అరిచింది. “సుధాకర్! నువ్వేనా యిట్టా మాట్టాడేది. నాకు నమ్మబుద్ది కావడంలేదు. అలా యెలా అనగల్గావ్! నా కష్టం నీకు తెలియనిదా? “


“ఏమో! నాకవన్నీ తెలియవు, నీకు నాకు కుదరదు లే నీలవేణి” అని ఆమె ను దాటుకుని మడికి అడ్డంగా పడి అవతల వైపుకు వెళ్ళాడు. 


పొలంలో కలుపు తీస్తున్న వకుళ సంభాషణంతా వింది. అన్నకేసి చూసి “ఒరేయ్, లోకుల మాటలు విని విషం నెత్తికెక్కించుకున్నావ్. అమూల్యమైనదాన్ని జారవిడుచుకుంటున్నావ్. నీలవేణి కి నువ్వే తగినోడివి కాదు పోరా అర ముండా” అని అరిచి గబ గబ నీలవేణి దగ్గరకొచ్చి భుజంపై చెయ్యేసి “వాడన్నవన్నీ మనసులో పెట్టుకోకు, అసలు వీడిలాంటి వాడిని చేసుకుంటే నీకు అడుగడుగుకి సంకెళ్ళే, బాగా చదువుకుని కలెక్టెర్ అవ్వాలి నువ్వు” అంది. 


మనసు వికలమై పొలం గట్టుపై కూలబడింది.ఆమెది ఏడుపుగొట్టు లక్షణం కాకపోయినా ఆ క్షణం యేరు తెగిన గట్టే అయింది. 


“ఇంట్లో వాళ్ళు వెన్నువిరిచే మాటలెన్ని మాట్లాడినా గరళంలా దాచుకున్నాను వకుళా! మీ అన్న కూడా యెంత మాట అనేసినాడు చూసావా!?” వెక్కిళ్ళు పడింది. 


“మా అన్నతో నీది స్నేహమే అనుకున్నాను నీలవేణి. నేను వూహించనే లేదు. ఈ సంగతి నాకు తెలిసివుంటే లగ్గం పెట్టుకువచ్చిందాకా నీకు చెప్పకుండా వుంటానా” 


“నా సంకల్పబలం వొక్కటే కాదు  స్నేహితులు యెవరో వొకరు అభిమానంతో సహాయం చేయబట్టో   వుద్యోగ అవకాశం యివ్వబట్టో నేను గౌరవంగా యెవరిపైన ఆధారపడకుండా చదువు పూర్తిచేసుకున్నాను. ఎర్రబస్సు యెక్కి వున్నత విద్య కోసం వచ్చిన వారి పట్ల వుండే చులకన భావం కని కనబడని వివక్ష, లింగ వివక్ష యెదుర్కొన్నాను. సాయం చేస్తున్నట్టు వుంటూనే అవకాశం కోసం పొంచి వుండే వారిని ఫేస్ చేసాను. ఒంటరి ఆడదాన్ని  నిస్సహాయరాలిని అని వాసన  పసిగట్టిన కుక్కలు అనేకం యెంతో యిబ్బంది పెట్టాయి.  ధైర్యం సడలినప్పుడల్లా  నా లక్ష్యాన్ని అందుకోలేక జారిపోతానేమో అని అనిపించేది.  అవన్నీ చెప్పి నిన్ను భయపెట్టలేను కానీ,  ఆ పెద్దగీత ముందు  యిక్కడవన్నీ చిన్న గీతలా అనిపించేయి. మీ అన్న కొండలా అండగా వుంటాడనుకున్నా. ఇంతగా అవమానం చేస్తాడనుకోలేదు” ఆవేదనతో ముఖం మోకాళ్ళ మధ్య దాచుకుంది. 

“బంగారం పుటం పెట్టాక శుభ్రపడినట్టు కష్టపడి రాటుదేలావు లే  నీలవేణీ, ఊరుకో బాధపడకు” 

ఆ మాటలకు మరింత యేడ్చింది.

ఇక తన వద్ద వోదార్పు మాటలేవీ లేకుండా పోయినందుకు వకుళ సిగ్గుపడింది. 


కాసేపటి తర్వాత తేరుకుని లేస్తూ.. వకుళ కు చేయి అందించి.. “ఒంటరి స్త్రీ అస్తిత్వ పోరు  సముద్రపు హోరు లాంటిది. అది తీరం వెంబడి నడిచే వారికే వినిపిస్తుంది” అంది నీలవేణి. బలంగా ఊపిరి తీసి వొదులుతూ  సుధాకర్ పై ప్రేమను మనసులో నుండి బలవంతంగా పెకిలించి విసిరి పడేసింది. వారం తర్వాత తన కళ్ళెదుట అతని పెళ్ళి జరుగుతుంటే అతి  మాములుగా చూసింది. వకుళ కర్తవ్యబోధ ఆమె బాటను స్పష్టం చేసింది. రాత్రింబవళ్ళు మరింత కష్టపడింది.వకుళ స్నేహం ఆమె సంకల్పాన్ని సడలనీయకుండా నిలబెట్టింది. మొదట విడత పరీక్షలు రాసింది. తిరిగి వూరికి వచ్చింది. 


నీలవేణి వకుళ  యిద్దరూ కలిసి యిల్లిల్లు తిరిగి పిల్లలను బడికి పంపించే ప్రయత్నం చేసారు.పెద్దాళ్ళతో మాటామంతీ కలిపి కష్టసుఖాల అజ కనుక్కొని వీలైనంత పరిష్కార మార్గాలు చెప్పారు. చిన్న చిన్న సాయాలు చేసారు.  వీరి మాటలు విన్న కొందరు తమ వెన్నుపై తాము నిలబడే సులభం గ్రహించారు.  


ఆ మార్పును చూసిన సంతోషంతో నీలవేణి  “ఇది చాలు మనకు. ఇంకొన్నేళ్ళు కష్టపడితే గ్రామ స్వరాజ్యం అంటే మన వూరినే వుదాహరణగా చూపొచ్చు” అంది వకుళ తో. 


రెండోసారి రాసిన పరీక్షతో అనుకున్నది సాధించింది నీలవేణి.  మంచి ర్యాంక్ సాధించిన ఆమెకు అభినందనల వెల్లువ. 


“మా వూరి చదువుల రాణి మాకు గర్వకారణం” అన్నాడు రెడ్డి. “మన జిల్లాకే కలెక్టర్ గా రావాలి నువ్వు” అన్నాడు. నీలవేణి చిరునవ్వు నవ్వింది. మళ్ళీ అతనే…“గొప్ప ఆశయాలతో పనిచేద్దాం అనుకున్న వాళ్ళు కూడా అధికారం ముందు తలొంచాల్సి వుంటుంది. గమనం వుంచుకో నీలవేణీ”అన్నాడు. తలవూపింది. 


వకుళ కల్పించుకుని “నీలవేణి యెక్కడికి కలెక్టర్ గా పోయినా మీలాంటి పెత్తందారుల పెత్తనాలు చెల్లవులే రెడ్డి.  చలిచీమల రాజ్యం వస్తుంది. మన వూర్లో కూడా అదే జరుగుద్ది” అంది. 


“కాలం మారతా వుండలా, మనుషులు కూడా మారాలి. నువ్వు ప్రెసిడెంట్ గా నిలబడితే మీకే అండగా వుంటా. ఇప్పుడు మాత్రం వుండలా అట్టాగే ముందు ముందు కూడా ” అన్నాడు.


నీలవేణి వకుళ కళ్ళతో నవ్వుకున్నారు. 


నాలుగు నెలల ట్రైనింగ్ కోసం ముస్సోరి కి వెళ్ళి వచ్చింది. 

రాగానే వకుళ ఆత్రంగా అడిగింది.  “ఇక మన జిల్లాకు కలెక్టర్ గా రావచ్చా నువ్వు “ అని. 


నీలవేణి చిన్నగా నవ్వి “అప్పుడేనా, ఇంకో రెండేళ్ళ పాటు అక్కడే వుండి చాలా విషయాలు తెలుసుకోవాలి నైపుణ్యం సాధించాలి. అప్పుడు కలెక్టర్ అయ్యేది” అని వివరించి చెప్పింది. 


“నువ్వు కూడా ఆగిపోయిన చదువు మొదలు పెట్టు.చదువు దైర్యం యిస్తుంది.ముందుకెళ్ళే శక్తిని యిస్తుంది” అని దూర విద్యా కోర్స్ లో చేరడానికి కావల్సిన అఫ్లికేషన్ ఆమె చేతిలో పెట్టింది. “ప్రతి తరమూ తమకు కావాల్సిన నాయకుడిని తామే సృష్టించుకుంటుంది.అలా మన వూరు కి నువ్వు నాయకురాలివి అవుతావు వకుళా” అంది. 


రెండేళ్ళు ఇట్టే గడిచిపోయాయి. వకుళ ఆ వూరి ప్రెసిడెంట్ అయింది. రెడ్డి పిల్లల చదువు కోసం అని ఆ వూరు ని వదిలి నెల్లూరు చేరాడు. అక్కడ రాష్ట్ర రాజకీయాలలో ముఖ్యపాత్ర వహిస్తున్నాడు. ఊర్లో చాలా మార్పులు వచ్చాయి. ప్రతి యింట్లో పిల్లలు బడి మెట్లు యెక్కుతున్నారు.

ఆ మార్పు మంచిదే అనుకున్నారందరూ.


నార్త్ ఇండియా లో ఓ మారుమూల జిల్లాకు కలెక్టర్ గా  పోష్టింగ్ అందుకుంది నీలవేణి. అన్న శీను మురిసిపోయాడు. బూడిద గుమ్మడికాయ మీద కర్పూరం వెలిగించి దిష్టి తీసాడు. ఇంటి నుండి ఆ రోజు సాయంత్రం బస్ కు బయలుదేరింది. బస్ కూడా పచ్చని తోరణాలతో అలంకరించుకుని వచ్చింది. 


నీలవేణి బస్ యెక్కి కూర్చుంది. ఎవరినీ స్టేషన్ వరకూ రానవసరం లేదని తిరిగి వచ్చేటప్పుడు  వారికి యిబ్బంది అవుతుందని గట్టిగా వారించింది.


బస్ స్టేషన్ చేరుకునే సమయానికి  తనకన్నా ముందు చేరుకొన్న ఊరును చూసి ఆమెకు కళ్ళు చెమ్మగిల్లాయి. ఆమెను యిష్టపడిన వారు ఆమెకు యిష్టమైన వారు వీడ్కోలు పలకడానికి చాలామంది వచ్చారు. పూలు పండ్లు పుస్తకాలు తినుబండారాలు యిచ్చారు. కొందరు స్నేహితులు ఎడబాటుతో కలిగే దుఃఖం కూడా తెచ్చి  యిచ్చి వెళుతున్నారు. అదీ స్వీకరించింది.వకుళ వాటేసుకుని సంతోషంగా దుఃఖించింది. “నీలవేణీ, నువ్వొక దీప వృక్షానివి. ఈ కాంతులు చాలా దూరం వెదజల్లాలి. నీ నీడన యెన్నో దివ్వెలు వెలగాలి. ఎవరి సాయం లేకుండా వొంటరిగా గొప్ప విజయం సాధించావు. మన వూరు ను బాగుచేసుకునే పని లేకపోతే నేను నిన్ను అంటిపెట్టుకుని వుండేదాన్ని” అంది. నీలవేణి వకుళ చేతిని ఆత్మీయంగా పట్టుకుంది. 


“నీలవేణీ.. మనకి ప్రియమైన వారు అనుకున్న వాళ్ళు చేసే గాయం కన్నా మనం శత్రువుల్లా భావించే వారే కనబడని మేలు చేస్తారు.మొదటి వారిని పెద్ద మనసుతో మన్నించు, రెండో వారిని గుర్తుంచుకో ” అంది వకుళ నర్మగర్బంగా. సజల నేత్రాలతో “అలాగే వకుళా” అంది.


“సరైన జోడి వెతుక్కొని పెళ్ళి చేసుకో నీలవేణీ”


తల అడ్డంగా వూపి “ఒంటరి మహిళ లకు ఆలంబనగా వుండటం కోసం అల్పజీవుల ఆర్తనాదాలను గమనించి వారికి సాయపడటం కోసమే పని చేయాలని నిర్ణయించుకున్నాను” అంది. 


ఆఖరి గా సుధాకర్ వచ్చాడు. ఆమెకు ఒక పుస్తకాన్ని మరువం మల్లెలు కలగలిపి కట్టిన పూల పొట్లం అందించాడు. అతని కళ్ళల్లోకి చూసింది.కాదనకుండా తీసుకుంది. ఏ ఆశయమో మరేదో స్వార్దమో తమను కావాలని విడదీసిందో  తెలుసుకుంది గనుక మనఃస్పూర్తిగా థాంక్స్ చెప్పింది. 


రైలు కదిలింది. నీలవేణి అందరికీ వీడ్కోలు చెబుతూనే వుంది. అయినా ఆమె కళ్ళు ఫ్లాట్ఫారమ్ పై యెవరి కోసమో వెతుకుతున్నాయి. ఆమె యెవరి కోసం యెదురుచూస్తుందో ఆ వ్యక్తి రానేలేదు.  స్టేషన్ దాటి పెన్న బ్రిడ్జి ని  దాటి పరుగందుకుంది రైలు. తన సీట్ లో కూర్చుంటూ  రాని వ్యక్తికి మనసులో  కృతజ్ఞతలు తెలుపుకుంది. పులి యింకో పులికి స్వాగతం వీడ్కోలు రెండూ పలకదు.తన రాజ్యంలో తనే పులి. ఎవరి మనోవరణంలో వారే పులి. 


నిరాశ అలసట జంట దాడి చేసినట్లుగా అనిపించి కళ్లు మూసుకుంది. మూసిన రెప్పలక్రింద ఊరే కన్నీటిని ఆపే ప్రయత్నం చేయలేదు. కొంత సమయం తర్వాత తన ముందు నిలబడిన మనిషి అలికిడిని కళ్లు విప్పకుండానే గ్రహించింది.  ఎదురుగా ఎర్రని రోజా పూల గుత్తిని పట్టుకుని వున్న అతన్ని చూసి సంతోషపడింది.


 “రాకుండా వుండాలనే అనుకున్నాను కానీ వుండలేకపోయాను నీలవేణీ”  అన్నాడు శేఖర్ రెడ్డి.  ఆ మాటల ద్వారా ప్రకటితమైన మనోసాంద్రతని గుర్తించింది.


 ఏళ్ల తరబడి ఊగిసలాడిన ఆమె మనస్సు బింకం కోల్పోయింది.  పక్కకు సర్దుకుని సీట్ చూపించింది. మనసైన వాడితో కాస్త లాలన కోరుకుంటే తప్పేముంది? అనుకుంది. ప్రయాణం సాగుతూ వుంది. 


………. ………సమాప్తం…………….






 

1, జూన్ 2023, గురువారం

జీవనగంగ

 గబగబ నడుస్తూ పని చేసే యింటికి  వెళుతుంది గంగ. చేతిలో వున్న ఫోన్ మోగింది. సరళ నుండి ఫోన్. యెత్తగానే అవతలి నుండి ప్రశ్న.

“ఎక్కడ వున్నావు” 


“ మీ యింటికి దగ్గరలో వున్నానండి అపార్ట్మెంట్ లో పని చేసుకుని వస్తాను”


“నేను యింట్లో లేను కానీ నువ్వు యింటికి వెళతావుగా , నేను చెప్పిన పని చేస్తావు కదా” అదో రకం వొత్తిడి పెడుతూ అడిగింది సరళ.


ఇబ్బంది పడుతూ నిమిషం పాటు ఆలోచించి “గంట తర్వాత వెళతాను, పర్వాలేదా అండీ”


“బయటకు వచ్చాక ఫోన్ చేయి, యెక్కడో వొక చోట కాలక్షేపం చేస్తాను. చెప్పిన మాట మర్చిపోకు. బుస్స్ మనే ఆ పాము కోరలు పీకి పడేసేలా వుండాలి. ఇంకెప్పుడూ బుస కొట్టకూడదు,కాటు అసలే వేయకూడదు”


“సరేనండీ”.. నడుస్తూ ఆలోచిస్తుంది. ఇలాంటి వొక రోజే కదా..ఉన్నపళంగా తన యింటి రాతంతా మారిపోయింది అని బాధగా అనుకుంటూ రెండు నెలల కిందట జరిగిన చేదును గుర్తుచేసుకుంది గంగ. 


**********

మసక చీకట్లోనే తడుము కుంటూ మెల్లగా యింటి వెనక్కి నడిచింది నర్సమ్మ. ఈడుస్తున్న కాళ్ళతో రెండడుగుల యెత్తులో వున్న బాత్రూమ్ లోకి పోవడానికి చానాసేపు పట్టింది. పది నిమిషాల తర్వాత తలుపు తీసి చుట్టూరా చూసి నివ్వెరపోయింది. ఐదారు ఆకులతో వొత్తుగా నవనవలాడుతూ గోడ వారగా పెరుగుతున్న కొత్తిమీర మడి తోటకూర మడి మాయమైపోయాయి. 


“అయ్యో అయ్యో, నా ఆక్కూర మడంతా మాయమై పొయ్యింది. నిన్న పొద్దుటేల కూడా చూసేను కదా. ఏ ముదనష్టపు చేతులు పడ్డాయో,పరక్కూడా లేకుండా పీక్కుపొయ్యాయి,ఆ చేతులిరగిపోనూ ఆళ్ళకు కుష్ఠు రోగం రానూ, ఆళ్ళ అమ్మ కడుపు కాల”.. తిట్ల దండకం తో సన్నటి దుఃఖపు గొంతుతో మడి దగ్గరకు నడిచింది నర్సమ్మ.


“అత్తా, యెవరో యెందుకు చేత్తారు, నిన్న మజ్జేనం నీ కొడుకే పీక్కుపోయి అమ్మేసుకుని తాగేసాడు” అన్జెప్పి బాత్రూమ్ లోకి వెళ్ళి తలుపేసుకుంది గంగ.  


“ఓరి దుర్మార్గుడా, నీకు పోయేకాలం వచ్చింది రా,” అని తిట్టుకుంటూ రేకుల వసారాలోకి జేరి మంచంపై కూలబడింది. ఇంటిని వొకసారి కలియదిప్పి చూసుకుంది. ఒక పెద్ద గది దానిముందు రేకు వసారా.అందులో చిన్న వంట గది. వసారా లో తన మంచం. గవర్నమెంట్ కట్టించిన యిల్లు అది.  ఈ యింటి మీద కూడా వీడికి యిక అప్పు పుట్టనట్టు వుంది.అందినకాడికి యేదిబడితే అది యెత్తుకుపోవడమే మిగిలింది.ఇల్లు వొల్లు గుల్ల చేసుకుని నూరేళ్ళు బతికింది యెవరూ.. అందులో సగం ఆయువుంటే మా గొప్ప “ అనుకుంది ఖాళీ గా వున్న తన నుదుటిని తడుముకుంటూ. 


 తన చేత్తో తన కన్ను ని తానే పొడుచుకుంటున్నట్లు తమ బతుకుల్లో నెలకొన్న పేదరికాన్ని  యెన్నడూ జయించనివ్వని వ్యసనానికి బానిసైన కొడుకుని తలుచుకుని దిగులుపడింది. కళ్లల్లో గుచ్చుకుంటున్న పొద్దుకి యెదురుగా కూర్చుని కోడలిచ్చిన టీ తాగి నెమ్మదిగా లేచి గోనెపట్టా చేతబట్టుకుని కర్రపోటు సాయంతో ఆ కాలనీ సెంటరుకు బయలుదేరింది. 


మార్కెట్ లో గుత్తానికి  ఆకు కూర కట్టలు కొని మార్కెట్ బయట గోనెపట్టా పరుచుకుని కూర్చునేదాకా రోజూ కోడలు వచ్చి సాయపడుతుంది. ఆ రోజు కోడలిని సాయమడగాలన్నంత బుద్ది పుట్టక ఒంటరిగానే బయలెల్లింది. 


 నర్సమ్మ ఆకు కూరలు అమ్ముకుంటూనే కూసింత ఖాళీ దొరికితే చాలు కట్టల మట్టి దులిసేసి చీడ పట్టిన ఆకులేరేసి పచ్చబడిన ఆకులను తుంచేసి శుభ్రం చేసి క్యారీ బేగ్ లలో పెట్టి వుంచుతుంది.ఆ పనులన్నీ చేసుకునే తీరిక ఓపిక లేని కొందరు వాటిని వతనుగా ఆమె దగ్గరే కొంటూ వుంటారు. మరికొందరు ఆమెతో కూడా గీచి గీచి బేరమాడతారు. దయాశీలురు కొందరు ఆ వయస్సులో కూడా యేదో వొక పని చేసుకుని బతకాల్సిన అవసరాన్ని గుర్తించి గ్రహించి యింకొంత డబ్బును వుదారంగా యిచ్చిపోతారు. 


మధ్యలో నాలుగు ఇడ్లీలు తిని యింకోసారి టీ తాగి మధ్యాహ్నం దాకా పనిచేసుకుని యాభై వంద మధ్య డబ్బు చేసుకుని యింటికి చేరుకుంటుంది. కోడలు వుదయాన్నే వంట చేసి పెట్టి వెళ్ళి నాలుగిళ్లల్లో పనిచేసుకుని వచ్చేటప్పటికి .. నర్సమ్మ ఓ కునుకు తీసే వుంటుంది. 


కానీ ఆ రోజు గంగ ఇంటికి రావడం ఆలస్యం అయింది. 

నక్షత్రాలు కనబడనివ్వని కారు మేఘాలు నగరాన్ని కమ్మేసాయి. నగర శివారు  రాత్రి  దీపాలతో వెలుగుతుంది. మెయిన్ రోడ్ లో అడపాదడపా తిరిగే ఆటోలు తప్ప పెద్దగా సందడి లేని రోడ్డు. బస్టాఫ్ దగ్గర ఆగిన ఆటో లోనుండి  దిగిన గంగ నడుస్తుంది. 


వర్షాకాలపు గంభీరమైన నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ వీధి కుక్కల కాట్లాట. చేతిలోని గొడుగుని వాటికి  తర్జన గా చూపిస్తూ వడి వడిగా యింటికి చేరుకుంటూ.. మొగుడిని తలుచుకుని మహానుభావుడు ఖాళీ అయిన గ్యాస్ బండ యిచ్చేసి నిండు బండ తెచ్చాడో లేదో. అప్పు దొరికిందో లేదో అనే ఆలోచనలతో  యిల్లు చేరింది. 


వరండాలో మంచంపై కూర్చున్న అత్త.. “ఇంత ఆలస్యమైందేమే గంగా” అని అడిగింది. 


“యాభై మందికి వంట చేయడం చిన్నమాటా.. అన్ని చేసి సర్ది వచ్చేటప్పటికి యీ టైమైంది. కాళ్ళు పడిపోయినయ్యి అనుకో” 


“ఆడింకా రాలేదు.  నువ్వు కూడా యేమి తేకుండా చేతులూపుకుంటా వచ్చావే! అంత మందికి వండిచ్చుకుని నీకేం పెట్టలేదా” అడిగింది ఆరాగా ఆకలిగా. 


“వాళ్ళ పార్టీ అవ్వలేదు,రాత్రి పన్నెండింటికి అంట. అదవకుండా చుట్టాలు తినకుండా నాకెట్టా పెడతారు”అంటూ కాళ్ళు కడుక్కొని లోపలికి నడిచింది. 


“పిల్లలూ నేనూ  మద్దేనం యేదో వొకటి తిన్నాం. ఇప్పుడు యేం తినాలో యేంటో చూడు. సరిగ్గా కళ్ళు కనబడని నేను యేమి వండేది యెట్టా వండేది” అంది నర్సమ్మ. 


కుక్కపిల్లను వొళ్ళో కూర్చోబెట్టుకుని ఆడుకుంటున్న కృష్ణుడు తల్లిని చూసి గబుక్కున లేచాడు. 


మెటల్ గాజుకు గమ్ రాసి మునివేళ్ళతో చకచక దారాన్ని అల్లుతూన్న నవ్య తల్లిని చూసింది.చేతిలో గాజుని కిందేసి వొక్క వుదుటున లేచొచ్చి తల్లిని చుట్టేసి గగ్గోలు పెట్టి యేడ్చింది. . 


బడికి వెళ్ళి ఆరవ తరగతి చదువుకుంటూనే తల్లికి  ఉదయం యింటి పనిలో సాయం చేయడం సాయంకాలం  గాజులకు రంగులు అద్దడం రాళ్ళు అతకడం దారం చుట్టటం ద్వారా రోజుకు పాతిక ముప్పై రూపాయల సంపాదించి తల్లి చేతికిస్తుంది. అట్టాంటి పిల్ల అంతలా బావురమనడంతో బిత్తరపోయింది గంగ. . 


“ఎందుకు యేడుస్తున్నావే బంగారు తల్లీ,యేం జరిగిందో నువ్వైనా చెప్పవే అత్తా” అంది కంగారుగా. 


“ఏం జరగలేదులే గంగా, నువ్వు బెంబేలుపడమాకు. ఆ యెదవ సచ్చినోడు యేదో చేయబోయాడట. బిడ్డ బాగా భయపడినట్టుంది” అంది. 


“ఎవడాడు?


కూతురిని వొళ్ళోకి తీసుకొని వోదార్చి కాసిని మంచినీళ్ళు తాగిచ్చి యేం జరిగిందో చెప్పమని అడిగింది. 


 “ఆ రమణారావు డబ్బు యిస్తానన్నాడు. ఆ యింటికి వెళ్ళి డబ్బు తీసుకురా అన్నాడు నాన్న” అంటూ మొదలెట్టి జరిగిందేమిటో మననం చేసుకుని చెప్పసాగింది నవ్య. . 


 **********


సన్నగా రివటలా వుండి  పత్తికాయలంటి కళ్ళేసుకుని పెదాలు తడుపుకుంటూ ఆడాళ్ళని అదోరకంగా చూసే రమణారావు యింటికి వెళ్ళమంటే వెనక్కి తగ్గింది నవ్య. 


“ఆ యింటికి నేనెళ్ళను నువ్వే వెళ్ళు”  అంది తండ్రిని.   


“ఎల్లమని చెబుతుంటే నీక్కాదు. నా నాలుగు నాకు పడితేకాని కదలవేమో” అని కసిరాడు. 


అయిష్టంగానే కదిలింది.మూడొంతస్తుల  ఇంటి గేటు ముందు నిలబడి బెల్ కొట్టింది నవ్య. రమణారావు కుక్క తో కూడా వచ్చి తలుపు తీసాడు.ఆ యిల్లు చిన్నతనం నుండి నవ్య కు పరిచయమే.  తమ్ముడు పుట్టక ముందు తన తల్లి ఆ యింట్లో పనిచేస్తున్నప్పుడు  తనను కూడా తీసుకొచ్చి పెరట్లో కూర్చోబెట్టి పని చేసుకునేది. రమణారావు భార్య సరళమ్మ. అప్పుడామె యింట్లో లేదు. 


“ఎంత పెద్దదానివైపోయావే..నువ్వు అంటూ   బుగ్గ గిల్లాడు... టీచరమ్మ యింట్లో లేదు. కూతురిని తీసుకుని షాపింగ్ కి వెళ్ళిందంట. కాసిని కాఫీ కలిపియ్యవే నవ్యా.. తల పగిలిపోతుంది అన్నాడు. “నాకు కాఫీ పెట్టడం రాదండీ. మీరు డబ్బులిస్తే వెళ్ళిపోతా”.. అంది జంకుగా. 


“అదేం బ్రహ్మ విద్యా? నేను యెలా చేయాలో చెబుతాను నువ్వు చేద్దువుగాని. లోపలకు రా” అంటూ చొరవగా చెయ్యి పట్టుకుని వంటింట్లోకి లాకెళ్ళాడు. పాల గిన్నె పొయ్యి మీద పెట్టించి “నేను పైకి వెళ్ళి డబ్బులు పట్టుకొస్తా, పాలు పొంగకుండా చూడు” అని పైకి వెళ్ళాడు. నవ్య పాల వంక చూస్తూనే వుంది. లోలోపల బితుకు బితుకు మంటూ యేదో భయం.  కొద్దిసేపటికి పిల్లిలా చప్పుడు చేయకుండా వెనక నుంచి వచ్చి కొండచిలువలా వొళ్ళంతా చుట్టేసాడు. భయంతో అరుస్తూ విదిలించుకుంటూ గుమ్మం వైపు చూస్తే. తలుపులు  మూసేసి వున్నాయి. నవ్య వణికిపోతూ  బిగ్గరగా అరిచినా బయటకు వినబడని పెద్ద శబ్దంతో  టివి లో పాటలు. 


యెరుపెక్కిన కళ్ళతో  ముఖమంతా తడిచేసి  గుండెలపై కర్కశహస్తాలతో తడిమి తడిమి తర్వాత అకస్మాత్తుగా నీరుకారిపోయి కుర్చీలో కూలబడిపోయాడు. షాక్ నుండి అయోమయం లోకి తర్వాత  అసహ్యంలోకి మారిన ముఖంతో బయటకు రాబోతున్న నవ్య చేతిలో వెయ్యి రూపాయలు పెట్టాడు. “ఇక్కడ జరిగింది యెవరికీ చెప్పకు. అప్పుడప్పుడు వస్తూ వుండు. నీకు చాలా డబ్బులిస్తాను” అన్నాడు.


ఆ డబ్బులు అక్కడే విసిరేసి పరిగెత్తుకుని యింటికి వచ్చి పడింది. డబ్బు కోసం యెదురుచూస్తున్న తండ్రికి  జరిగింది చెప్పింది. డబ్బులెందుకు  పడేసి వచ్చావని తండ్రి వొక్కటిచ్చాడు. ఏడ్చుకుంటా వెళ్ళి నాయనమ్మకు చెప్పింది. అది విన్నాక ఆవేశపడిన నర్సమ్మ యెదురుగా లేని కొడుకుని తిట్టిపోసింది, దినవారాలు చేసేసింది. 


తల్లితో ఆ విషయమంతా చెప్పిన నవ్య  మళ్ళీ వెక్కుతూ యేడ్చింది. వింటున్న గంగ కోపంతో వణికిపోయింది. పిల్ల ఏడుపు చూసి కడుపు తరుక్కుపోయింది.తల్లి ముఖంలో కోపం, ఏడుస్తున్న అక్కను చూసి బిక్కముఖం పెట్టుకున్నాడు కృష్ణుడు.  


గంగ కాసేపటికి మనస్సు చిక్కబట్టుకుని కూతురి వైపు చూసింది.  నవ్య కళ్ళలో యింకా వీడని భయం. చీటికిమాటికి తాగుబోతు తండ్రి తిట్టే తిట్లకు కన్నీళ్ళు తప్ప మరే యితర కలలు కనని ఇంద్రధనుస్సు లసలే  పూయని అమాయకమైన సోగ కళ్ళు అవి. అమ్మ ను యెప్పుడూ విసిగించకూడదని వొట్టు పెట్టుకున్నట్టు వుండే ముఖం.  నాన్నను యేవీ తెచ్చిమ్మని అడగని నోరు అది.  జరిగినదాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే యెట్టా! ఆ సంగతి మర్నాడు చూద్దాం, పిల్లలు ఆకలి తీర్చాలి ముందు అని నెమ్మదిగా లేచింది.

 

స్టీల్ బేసిన్ లో పిండిని ముద్దగా కలుపుతున్న తల్లి చేతి కదలికను తదేకంగా  చూస్తున్నాడు కృష్ణుడు. అమ్మెందుకో బాగా కోపంగా వుందని అర్దమై దిగులేసింది.  కసిగా కదిలే ఆ వేళ్ళ కదలికల్లో కట్టుకున్న వాడిపై వున్న కోపావేశాలు కళ్ళలో బిడ్డలకు పట్టెడన్నం వొండి పొట్ట నింపలేని ఆక్రోశం వాడికేమీ తెలియకపోయినా నెమ్మదిగా తల్లి పక్కన చేరాడు. 


గంగ యేడేళ్ళ కొడుకు వైపు చూసింది. మాములుగా అయితే ఆమెతో పాటు పీటపై కర్రతో రొట్టెలు చేయడానికి సరదా పడేవాడు. కానీ వుదయం నుండి అర్దాకలితో వున్నాడయ్యే. ఆ పనిజోలికి వెళ్ళకుండా పక్కనే కూర్చున్నాడు. వాడి చిన్ని పొట్ట ఆకలిని కళ్ళలో వినబడని ప్రశ్నలను అర్దం చేసుకున్నది గంగ. పిండి కలిపిందే కానీ సిలిండర్  లేని పొయ్యి పై రొట్టె యెట్లా కాల్చాలో  పాలుపోలేదు.మూడు రాళ్ళ పొయ్యి కింద  మండటానికి కట్టెలు గతి లేని కిరోసిన్ లేని యిల్లే గాని ఆమె గుండెల్లో మొగుడు రగిలించిన  నెగడు మండుతూనే వుంది. కలిపిన పిండి డిప్పను పక్కన పెట్టి వరండాలో మూలనున్న అట్టపెట్టె తెరిచి చూసింది. రొండే దోసిళ్ళు వున్న కర్ర బొగ్గుల సంచి కనబడింది.  కుంపటిని తీసుకొచ్చి గుమ్మం ముందు కూర్చుని కుంపట్లో బొగ్గులేసి నిప్పు పుట్టించే పని మొదలెట్టింది. 


అత్త నర్సమ్మ కోడలు  గంగ ఆలోచనలు కనిపెట్టింది. 


“పొద్దుననగా యెల్లాడు గేస్ బండ పట్టుకొత్తానని. ఇంతవరకు అయిపులేడు.ఏడ తాగి తందనాలు ఆడుతున్నాడో.” అంది. గంగ మాట్టాడలేదు. మళ్ళీ నర్సమ్మే అంది.  “పిల్ల అంతా చెప్పేసి వుంటదని నీకు మెుకం చూపిచ్చడానికి సిగ్గేసి యేడాడ తిరుగుతున్నాడో” అంది.


అత్త వైపు చురుగ్గా చూసి  “నీ కొడుకు సిగ్గు పడటమా, అదో యెనిమిదో వింత అయ్యిద్ది. గేస్ బండ తెస్తాడని నీకు నమ్మకం వుందా యేంటి, చేసే యెదవ పనుల చిట్టా రోజు రోజుకి పెచ్చరిల్లిపోతుంది. ఎవడన్నా బిడ్డను చూసి యెదవ్వేషాలేస్తే దుడ్డు కర్ర తీసుకొని వాడి నడుం యిరగ్గొట్టాలి. తాగుడికి డబ్బులొస్తయి అని పెళ్ళాన్నో కడుపునబుట్టిన బిడ్డనో యెవడి పక్కలోనో పండబెట్టే తార్పుడుగాడి అవతారం యెత్తడు. సరళమ్మ యింట్లో పని మానేసింది యిందుక్కాదు,నేను తప్పించుకున్నాననుకుంటే బిడ్డను ఆడికి అప్పగించబోయాడు. తలుచుకుంటే భయమేస్తంది,వొళ్ళంతా కంపరంతో  వుడికిపోతుంది.  నీ కొడుకుని మాత్రం వొదుల్తానా? రానీ ఆడి పని చెప్తా”. కుంపట్లో మంట గంగ ముఖంపై తారట్లాడింది కాసేపు. 


ఆమె పిండి గిన్నె తీసుకొని వుండలు చుడుతుండగా.. 

“ఇదిగో గంగా! ఆడిని నేను తిట్టలేదనుకునేవు,ఆడికి ఫోన్ చేపిచ్చి తిట్టా.  దైవసాచ్చిగా చెపుతున్నా! ఇంకెప్పుడైనా ఆయన దగ్గరకు డబ్బెట్టుకు రమ్మని పిల్లను పంపావా కాళ్ళిరగ్గొడతా సన్నాసెధవా! మరీ యింత సన్నాసి యెధవ్వి అవుతావనుకుంటే పురిట్లోనే వడ్డ గింజేసి చంపి వుందును” అని తిట్టిపోసా. ఆ రమణారావును మాత్రం నేను వొదిలాననుకున్నావా?, నడివీధిలో పెట్టకపోయినా యింటెనకమాలకు పిలిచి ఆడి పెళ్ళాం పిల్ల ముందర బుగ్గల్లో బుగ్గల్లో పొడిచి మొకాన ఊసి వచ్చా!  నువ్వొచ్చాక నీకొక మాట చెప్పి పోలీసు స్టేషన్ కి పోదాం అని చూత్తన్నా, నువ్వేమంటావ్ మరి” 


 “ఇప్పుడేడ పోతాం, ఆలోచిచ్చుకోని నన్ను. ఏ సంగతి రేపు చూద్దాం.” 


ఈ మాటలేవిటికీ  అర్దం తెలియని కృష్ణుడు అమ్మ చేతిలో పిండి రొట్టైలయ్యీ  పళ్ళెంలోకి  పరుగెత్తి వచ్చే గోధుమ వర్ణపు చంద్రుడై నోట్లో వెన్నముద్దై కరిగి భగభగమని మండే జఠరాగ్నిని చల్లబరుస్తాయని ఆత్రంగా యెదురుచూస్తున్నాడు. నవ్య మంచంపై ముడుచుకుని  ఆలోచిస్తుంది. 


పిల్లలకు అత్తకు రొట్టెలు పెట్టి తను మజ్జిగ తాగి పడుకుంది గంగ. ప్రసాద్ పేరుకు ఆటో తోల్తాడు. అంగట్లో సరుకుల్లా ఆమ్మాయిలను బుక్ చేసి రమణారావుకు అప్పగించేవాడు.  భార్య గంగ తన సొంత ఆస్థి అనుకుని ఆమెను రమణారావు వైపుకు నెట్టడానికి శక్తియుక్తులన్నీ ప్రయోగించాడు. గంగ మొగుడిని ఛీత్కరించుకుంది. పెట్టెబేడా సర్దుకుని పిల్లలను వెంటబెట్టుకుని పల్లెటూరుకు బయలెల్లింది. కాళ్ళబేరానికి వచ్చినట్టే వచ్చాడు కానీ యింటికి రావడమే మానేసాడు. గంగ కాకపోతే మంగ అన్నట్టు వేరొక స్త్రీతో రెండో యిల్లు యేర్పరుచుకున్నాడు. ఆ సంగతి తెలిసినా పట్టించుకోలేదు గంగ. పట్టించుకుని గనుక యేమి చేయగలను,ఎక్కడైనా రెక్కలు ముక్కలు చేసుకుని బతకాల్సిందే కదా బిడ్డల చదువు కోసమైనా పట్నాన్ని అంటిపెట్టుకుని వుండాలి తప్పదు అనుకుంది. 


సన్నగా మొదలైన వాన కుంభవృష్టి గా మారింది. గంటల్లోనే లోతట్టు ప్రాంతంలో వుండే వారిళ్ళ మధ్య కలకలం.దాదాపు అందరి  ఇళ్ళను వరద చుట్టేసింది. పిల్లలు గగ్గోలు పెట్టి ఏడుస్తున్నారు. ఆడాళ్లు కంగారుగా చేతికందిన చెంబూ తపేళ మూటాముల్లె నెత్తినెట్టుకుని పిల్లలను పట్టుకుని  మోకాలు లోతు నీళ్ళలో కాళ్ళీడ్చుకుంటూ నడుస్తున్నారు. మగవాళ్లు  ఇళ్ళ వరుసను బట్టి రోడ్డును అంచనా వేసుకుంటూ అందరినీ హెచ్చరిస్తూ ముందుగా నడిచారు. 


నర్సమ్మ అందరికన్నా చివరన నడుస్తూ వెనక్కి వెనక్కి చూసుకుంటుంది.  “నాయనా.. కిట్టయ్యా కుక్క పిల్లను చంకనేసుకున్నావా  లేదా? పిచ్చిముండ మునిగి చచ్చిపోద్ది” అంది. 


 “నానమ్మా, నేను కుక్క పిల్లను భుజానేసుకుని నడుస్తున్నా. నువ్వు గబగబ రా.. నీళ్లు పైకొచ్చేస్తున్నాయి” అని అరిచాడు కృష్ణుడు. అందరూ భయం గుప్పిటబెట్టుకుని వానలో తడుస్తూనే ఎత్తైన ప్రదేశానికి చేరుకున్నారు. గంగ చేతిలో వున్నవి తలపై వున్న మూటను దించి అక్కడే పిల్లలను  కూర్చోబెట్టి నర్సమ్మ కోసం వెనక్కి వచ్చింది.  భుజం పట్టుకుని నడిపిస్తుంటే నర్సమ్మ వెనక్కి తిరిగి ఇంటి వైపు చూసుకుంటూ కళ్లు తుడుచుకుంటూ గొణుక్కుంటూ కోడలితో నడిచింది. ఎత్తుపై నుండి కూడా తదేకంగా  కనీకనబడని తన ఇంటిని చూసుకుంటూ వుండిపోయింది. ఆ రాత్రి కాళరాత్రే అయింది వారికి. అధికారులు వచ్చి  అందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు.  రాజకీయ నాయకుల సహాయ కార్యక్రమాలు జరుగుతూనే వున్నాయి.


తెల్లారినాక కూడా వాన కురుస్తూనే వుంది.  గంగ నర్సమ్మకు టీ టిఫిన్ తీసుకొచ్చి యిచ్చి “ఇంకా రెండు రోజులు వాన యిట్టాగే వుంటదంట. ఇక మనం ఇంటి ముఖం చూత్తామో లేదో,  అంతా నానిపోయి కూలిపోద్దో యేమో, తలదాచుకోడానికి ఆ నీడ కూడా లేకుండా పోద్దేమో అత్తా! ఈ కష్టం పగోడికి కూడా వద్దు’’  అంది దిగులుగా.


“నాకు అదే దిగులుగా వుందే గంగా”


“నీ కొడుకెక్కడికి వెళ్లాడో.  మిత్తవల్లే యింత వరదొచ్చి పడిందే,పిల్లలు తల్లి పెళ్లాం యెట్టా వుండారో యెక్కడ వుండారో అన్న ఆలోచన ఇంగితగానం వుండొద్దు. ఇట్టాంటి వాడు బతికి వుంటే యేంటి చస్తే యేంటి?’’ అంది కోపంగా. 


“అంత మాట అనకే గంగా” అంటూ గట్టిగా ఏడ్చింది నర్సమ్మ. తెల్లారితే చాలు గుక్కెడు టీ కోసం పెర పెరలాడే ఆమె ఆ రోజు టీ ముట్టలేదు, టిఫిన్ తినలేదు.గోడకు ముఖం పెట్టుకుని ముడుచుకుని వుండిపోయింది. 


అప్పుడప్పుడూ “గంగా, అట్టా బయటకుపోయి మన ఇళ్ల దగ్గరోళ్ళకు  ప్రసాదు యేడన్నా కనబడ్డాడేమో అడిగి రా పో..”  అనీ, పిల్లలను “మీ నాన్న వచ్చాడేమో చూసిరండి పోండి’’ అని తరుముతానే వుంది.  నర్సమ్మ నసకు విసుగొచ్చిన పిల్లలు దగ్గరకు రావడం మానేసారు. గంగ కాలుగాలిన పిల్లిలా తిరుగుతూ మొగుడి కోసం ఆరా తీస్తానే వుంది.


మూడో రోజుకు వాన తెరిపిచ్చింది. నాలుగో రోజుకు మునిగిన కాలనీ ఇళ్లు బురద మేటేసుకుని దుర్గంధం కొడుతూ బయటపడ్డాయి. పశువుల కళేబరాలు కుక్కల కళేబరాలతో పాటు కరెంట్ స్థంభానికి తట్టుకుని ఆగిపోయిన ప్లాస్టిక్ నవ్వారు మంచం.నవ్వారు పట్టెల్లో చిక్కుకున్న కాళ్ళతో ఉబ్బిపోయిన శరీరంతో  వున్న శవం. మంచం, వొంటిపై అరకొర బట్టలు చూసి నర్సమ్మ కొడుకు ప్రసాద్ గా గుర్తించారు. నర్సమ్మ కుప్ప కూలిపోయింది. గంగ నిబ్బరంగా పిల్లలిద్దరిని పట్టుకుని నిలబడింది.  


నర్సమ్మ మనసులో కుళ్ళి కుళ్ళి యేడుస్తుంది. “అయ్యో కొడుకా! నా చేత యెంత పని చేయించావురా. నన్నెంత కటికదానిగా చేసావ్ రా అయ్యా!   నీ బుద్ధి సక్రమంగా లేదని కోపంతో ఈ పని చేసాను. తాగొచ్చి వొళ్లు తెలియకుండా  మంచం మీద పడిపోతే   నిన్ను లెగవకుండా కట్టి పడేసా కదరా. ఆ తాడే నీకు ఉరితాడు అయ్యి నీళ్ళలో మునిగిపోతున్నా లెగవకుండా చేసింది కదరా అయ్యా.  నన్ను బిడ్డను చంపిన పాపిని చేసావు కదరా అయ్యా” అని. 


సరళ వచ్చి గంగ కు అండగా నిలబడింది.  నర్సమ్మ వచ్చి రమణారావు పై కేసు పెడతానని అనేసరికి భయపడి ఫిట్స్ లాగా వచ్చి పడిపోయాడని హాస్పిటల్ కు వేసుకుని వెళితే పక్షవాతం వచ్చే సూచనలన్నారని చెబుతూ…

 “గంగా..నీ మొగుడు చచ్చాడని నువ్వు యేడుస్తున్నావు నా మొగుడు యింకా  యెందుకు చావలేదని నేను యేడుస్తున్నా” అంది సరళ.  


“అయ్యో! అంతమాట యెందుకులేమ్మా, ఊరుకోండి అమ్మ గారూ” అంది. గంగ  జాలి నిండిన గొంతుతో చెమ్మగిల్లిన మనసుతో.  


కూలిపోయిన యింటిలో అప్పుల వాళ్ళ తాకిడితో చాలీ చాలని పరదా పట్టాల కింద తలదాచుకుంటుంది గంగ కుటుంబం. బతుకు భారంగా రోజులు వేగంగా గడుస్తున్నాయి. పశ్చాతాపంతో  నర్సమ్మ గుండెలు మండిపోతున్నాయి.  తప్పు చేసిన బిడ్డను మందలించవచ్చు దండించవచ్చు గానీ ప్రాణం తీసే హక్కు తనకు యేముందనీ అని లోలోపల కుమిలిపోయింది. ఎక్కువ కాలం  రహస్యం కప్పిపెట్టలేక  మనసు ఉగ్గబట్టుకోలేక చేసిన పాపం చెబితే పోతుంది అన్నట్టు  గంగ కాళ్ళు పట్టుకుని తను చేసిన పని  గురించి చెప్పింది క్షమించమని ప్రాధేయపడింది.


 గంగ నిర్లిప్తతంగా చూసి “ఇట్టా జరుగుద్దని నువ్వు మాత్రం అనుకున్నావా యేంటి, ఊరుకో అత్తా”  అంది. “ఈ మాట మరెక్కడా అనబోకు కడుపులో దాచుకో” అని కూడా చెప్పింది. నర్సమ్మ  పాప భారాన్ని యెక్కువ కాలం ఓపలేకపోయింది.గంగ మోసే తన భారాన్ని  కూడా తగ్గించేసి లోకం నుండి నిష్క్రమించింది. ఆ రోజు అండ పోయిందో బరువు తగ్గిందో యేమి బోధ పడలేదు గంగకు. అప్పు కోసం సరళ యింటి మెట్లెక్కింది మళ్ళీ. 


*********

జ్ఞాపకాల్లో నుండి బయటపడి..  అపార్ట్మెంట్ లో  త్వరగా పని ముగించుకుని కృత నిశ్చయంతో  సరళ యింటి మెట్లు యెక్కింది గంగ.


రెండు గంటల తర్వాత పార్క్ లో కూర్చున్న సరళ ఫోన్ మోగింది. “పని అయిపోయిందమ్మా యింటికి  వెళ్ళండీ” 


సరళ ఇంటికి చేరింది. బెడ్ రూమ్ లో భర్త విడిచిన షర్ట్ ని ముఖంపై కప్పుకుని మూడెంక వేసుకుని పడుకుని వున్నాడు. 


ఆమె ముఖంలో క్రూరమైన నవ్వొకటి తొంగిచూసింది.

 

“ఏమిటలా ముఖం పై మసుగేసుకుని చేతకాని దద్దమ్మాలా పడుకున్నారు. రంధి, అదే నిద్ర రంధి తీరిందా” అని నర్మగర్భంగా అడిగింది. 


ఉలికిపడి అనుమానంగా భార్య ముఖం వైపు చూసాడు. 


 “నీ స్త్రీ వ్యసనంతో నన్నెంత రంపపుకోతకు గురిచేసావు మదపత్రాష్టుడా! నా శరీరాన్ని రోగాల పుట్టగా మార్చావు. పసివాళ్ళని కూడా చూడకుండా చిన్న పిల్లలపై  అఘాయిత్యాలకు పూనుకుంటున్నావ్ . నీ పురుషత్వం తలెత్తి చూడకుండా  మానసికంగా నిన్ను బలహీనుడిని చేయడమే నీకు సరైన శిక్ష. నువ్వు ఈ గదిలో మగ్గి మగ్గి ఇలా కుమలాల్సిందే.” కసిగా తిట్టింది. 


అవమానంతో దిండు లో ముఖం దాచుకున్నాడు రమణారావు.


“నీ బతుక్కి సిగ్గు వొకటి వుండట్టు..ఆ ముఖం దాచుకోవడం వొకటే తక్కువ. కొడుకనే కనికరం లేకుండా  తెగువగా ఆ నర్సమ్మ చేసిన పని నేను చేయలేకపోతున్నా” అంటూ కోపంగా జుట్టు పట్టుకుని తల గుంజింది. 


భార్య వైపు  భయంగా చూస్తూ “వద్దు వద్దు. నా తప్పు తెలుసుకున్నాను  మారిపోయాను. నన్ను క్షమించు సరళా” అన్నాడు. ఏడుస్తూ.. ఛీ, థూ.. అనుకుంటూ అతనికి దూరంగా వెళ్ళింది ఆమె.


చీకటి పడుతున్న వేళ గంగ వచ్చి వంట ఇంటి గుమ్మం దగ్గర నిలిచింది. కూర్చోమని అన్నా కూర్చోకుండా.. 


“సరళమ్మా ! నిలువెల్లా కామంతో రగిలిపోయే మనిషిని ఉసిగొల్పి  మానసికంగా కుంగదీయాలి అని నాకో పని అప్పజెప్పావ్. డబ్బు అవసరం యెంతున్నా నేను  అన్నీ ఇడిసేసిన మనిషిని మాత్రం కాదండీ. నీ అంత చదువుకున్నదాన్ని కాకపోయినా మనుషులను వస్తువులను వాడుకున్నట్టు వాడుకోకూడదనే ఇంగితగేనం వుంది. నువ్వు చెప్పినట్టు కాకుండానే నీ భర్తకు  నాలుగు మంచి మాటల్జెప్పి ఇకనైనా మార్పు తెచ్చుకో. లేకపోతే నీ బిడ్డలకు మొహం కూడా చూపించలేక పోతావు అని మందలిచ్చాను, యెత్తి పొడిచాను, చీత్కరిచ్చాను. ఇని యిని  ఆఖరికి దిండులో తలదాచుకుని ఎక్కిళ్లు పెట్టి యేడిసాడు. ఇక ఆయన నడుము యిరిగిన పాము అనుకో”


“చాలా చాలా థ్యాంక్స్ గంగా! నువ్వన్నట్టు  యికనైనా ఆయన మారిపోతే చాలు” కృతజ్ఞత తో తేలికైన మనసుతో చిరునవ్వు ముఖంతో.


“అమ్మా!  ఇంకో మాట విను. నా బిడ్డలకు పొట్టనిండా కూడు పెట్టుకోలేకపోతే పస్తు పడుకోబెడతాను కానీ జారతనం చూపెట్టను. ఆపదలో వున్నప్పుడు సాయం చేసావని నీ మాట కాదనలేకపోయాను కానీ అది నీలాంటివాళ్ళు చెప్పదగ్గ పని కాదు నేను చేయదగ్గ పని కాదు. ఇంటి పని వంట పని  యివ్వాలనుకుంటే యివ్వండి. కష్టం చేసుకుని మీ బాకీ తీరుస్తాను కానీ యిట్టాంటి పని యింకెప్పుడూ చెప్పబాకమ్మా” బాధ నిండిన గొంతుతో  కళ్లు తుడుచుకుంటూ  వెళ్ళిపోయింది. 


చెంప పై చెళ్ళున కొట్టినట్లైంది సరళ కు. గంగను నేనెంత తక్కువగా అంచనా వేసాను. నాకు నా భర్త కు తేడా ఏం వుంది? నేను పురమాయించిన పని కూడా అత్యాచారం కన్నా తక్కువేం కాదు.తనెంత దిగజారిపోయి భర్తను రెచ్చగొట్టి నీరు కారిపోయేటట్టు చేయమని అడిగింది? గంగ కాబట్టి నర నరం  పదునుగా కోసినట్టు మెత్తగా స్పష్టంగా తనేంటో చెప్పింది. తల భూమిలో పెట్టుకున్నంత పనైంది సరళ కు.   ఇంకా ఆలోచిస్తూ...  దీనినే వ్యక్తిత్వం అని అంటారేమో!  పరిస్థితులు యెలా వున్నా గంగ లాంటి వారు విలువలను పణంగా పెట్టలేరు, తమ ఆత్మాభిమానాన్ని పోగొట్టుకోలేరు. గంగ ముందు నిత్యం సిగ్గుతో తలొంచుకోలేను పని కూడా ఇవ్వలేను అనుకుంది సరళ. 


ఎదురుగా టివి లో .. గంగా పుష్కరాల ప్రత్యక్ష ప్రసారంలో వేటూరి పాట బ్యాక్ గ్రౌండ్ లో వినబడుతూ వుంది. “గండాలను పాపాలను కడిగివేయగా ముక్తినదిని మూడు మునకలే చాలుగా”  తెర వైపు చూస్తూన్న సరళ మానసిక స్నానం చేస్తూ గంగలో మూడు మునకలు మునిగింది.


*******************0**********************

“బహుళ త్రైమాసిక వెబ్ పత్రిక “ జూన్ 2023 సంచికలో ప్రచురితం.




Pic: Gibbs Garden GA USA