16, మే 2026, శనివారం

కృష్ణ చూర



కృష్ణ చూర  - వనజ తాతినేని.


మా వీథి అంతా కొత్త పెళ్ళి కూతురు శోభతో దీప్తిల్లుతుంది. 

అప్రయత్నంగా నువ్వు గుర్తొస్తావు. 

కొన్ని జ్ఞాపకాలు గుండెను తడి చేస్తాయి. 


మా ఊర్లో వాటిని కృష్ణ చూర పూలు అంటారు. 

వసంత గ్రీష్మ రుతువులో పిగిలిపడే పచ్చని ఆకుల మధ్య 

అరుణ వర్ణంలో ఆకర్షణీయంగా మనసు దోచేస్తాయి. 


ఆ పూలు పూచే కాలంలో అంతే ఆకర్షణీయంగా

ఎర్రని చీరతో పసుపు రంగుపై ఎర్రని పూలున్న కంచుకం ధరించి 

నుదుటిపై ఎర్రని కుంకుమతో వెలిగిపోతూ నువ్వొచ్చావు. 

తోడుగా ఆ వెన్నెల రాత్రి చందమామ పాటతో కలిసి 

చల్లగా పలకరించావు. మర్నాడు నల్లంచు తెల్ల చీర 

ముత్యాలహారం  చిరుదరహాసం చల్లనిచూపు  పుణ్యదీప్తితో 

ప్రత్యక్షమై నీ స్నేహాన్ని కానుక చేసావు. 


నేను ఇళయరాజా నువ్వు కీరవాణి

నేను షేక్స్పియర్ నువ్వు గురుదేవ్

నేను రైలింజన్ నువ్వు సైకిల్ . 

ఇలా మన మధ్య అనేక భావ వైరుధ్యాలు 

అయినా మన చెలిమికి అవరోధం లేదు.


పోను పోను నా ఎండిన హృదయాన్ని 

వర్ష రుతువు రాగాలతో నిలువెల్లా తడిపేసావు.

శరదృతువు కాలానికి నువ్వు నా కొత్త బంగారు లోకానివి. 

జీవితంలో రెండోసారి వసంతం వచ్చింది. 


నలుచెరుగులా చెదిరిపోతున్న మనసును కూడదీసుకుని 

రాశి గా పోసి బంగారు పళ్ళెరంలో అమర్చి భక్తితో  సమర్పించాను.

ప్రేమని భక్తి చేయడం నాకు చేతనైనట్లు పురుషులెవరికీ 

చేతకాకపోవచ్చు. అయినా పిసరంత ప్రేమను విదిలించక ఏడిపించావు. 


శూన్య సభలో వెలుగుతున్న దీపం అన్నావు. 

అంతర్వేదన అతి పురాతనం అన్నావు

సూదిమందు వేసినంత చల్లగా  మెదడుకి విచక్షణ మందు యెక్కిస్తావు. 

పూలదానల అలంకరించే లిల్లీ పూల కన్నా 

ఇంటి తోటలో వికసించే మందారకెందారాలు మేలు అన్నావు. 


మనసుకు కష్టంగా వున్నప్పుడల్లా నేను విసిరిన  

శరాలకు గాయపడినా  వాటిని దాచి అమృతాన్ని పదే పదే ఊరించే దానివి.

నా భావోద్వేగాలకు రసోద్రేకాలకు  మోహభరిత కాంక్షలకు

ముకుతాడు వేసావు. ఆకర్షణలను జయించే దోవ చూపావు. 

మలినాలను వడపోసి నన్నొక మనిషిగా మార్చావు 

నీకన్నా అన్యదేవత యెవరు నాకు !? 


ప్రతియేటా  కృష్ణ చూర పూలను చూసినప్పుడల్లా నువ్వు 

గుర్తుకొస్తావు. కానీ నా లోలోపలా నల్లంచు తెల్లచీర 

ముత్యాలహారం ధరించిన కరగని తరగని వెన్నెల దీపం

చల్లగా వెలుగుతూ మృదువుగా నవ్వుతుంటుంది.

పిపాసిని బైరాగిగా మార్చిన రక్కసి చెలిమి అది.

మరణానంతరం కూడా వీడని బంధం అది.


కృష్ణ చూర అంటే గుల్మొహర్ పూలు  మన తెలుగులో పెద్ద తురాయి పూలు (flame of the forest) 








కామెంట్‌లు లేవు: