నువ్వేమిటి అక్కడున్నావ్ !?
ఏయ్ ! నువ్వేమిటి అక్కడున్నావ్
నా నుండి నువ్వు అక్కడికి ఎప్పుడెళ్ళావ్
ఎందుకెళ్ళావ్
నేను నిన్ను బాగా చూసుకోలేదా,
పట్టించుకోలేదా, నా నిర్లక్ష్యానికి విరక్తి చెంది
కొత్త తావు వెతుక్కొన్నావా?
తప్పంతా నాదేనా నెపం నాపైనే వేసావా
పోన్లే, అక్కడైనా సౌఖ్యంగా వున్నావా?
మనసు శాంతంగా వుందా?
ఆత్మకు దేహం ఆనవాలం కదా!
దేహాన్ని జాగ్రత్తగా చూసుకో
మనిద్దరి పునఃకలయిక గురించి
చింతపడుతూ కూర్చోను నేను.
నువ్విప్పుడు మధువును
సేకరించే తేనెటీగ.
నేనేమో జీవితాస్వాదనలో
క్షణం తీరిక లేని సీతాకోకచిలుక.
ఎదురుచూస్తూ ఏడేడు జన్మలకు
ఎదురెదురుపడతాం.
సూర్యుడికి వారిజాక్షిలా
చంద్రుడికి కుముదవల్లిలా
భూమికి వరుణుడిలా, ఇంకా..
ఇప్పటి నీలా నాలా అనేకాలుగా.
దేహ సౌఖ్యమే ఆనందం అనుకునే ఆత్మలకు
అద్వైతం అర్థం కాదు.
అశాంతితో అశాశ్వతమైన జీవితాన్ని
కొలిమిలో పెట్టి కాల్చుతుంటారు.
ఆత్మబంధాన్ని ఉపేక్షిస్తారు.
కొన్ని ఆత్మలకు
అలమటించడమే స్వీయ శిక్ష.
22 May 2026. 05:30 am.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి