23, మే 2026, శనివారం

దిగులు నగ

 



దిగులు నగ   - వనజ తాతినేని.


భద్రంగా దాచుకున్న బహుమతిగా ఇచ్చిన పెట్టె తెరిచాను. 

నాలుగు దశాబ్దాలుగా కష్టాలే రానీయ్ నష్టాలే కానీయ్ దానిని 

ఎంత  పదిలంగా కాపాడుకుంటూ వచ్చానో; 

అందులో కొన్ని పాత ఉత్తరాలు దొరికాయి 

అవి అచ్చంగా నావే. 


ఆ జ్ఞాపకాల వాకిలి తెరిస్తే ఉప్పెనలా నన్ను చుట్టేసావు.

అంతర్యంలో అంతర్వాహినిగా వున్న అనురాగం చిటికెడు 

తరగలేదు కానీ.. హృదయంలో కొలువై వున్న  

నా దుఃఖ రహస్యం కూడా నువ్వే అని మర్చిపోను.


యవ్వనకాలంలో జలపాతం నేనై, నేనే జలపాతమై ఒంపిన 

ప్రేమానుభూతిని దోసిళ్ళతో  తాగిన నువ్వు అవలీలగా మర్చిపోయావు. 

బిందెల కొద్దీ వాంఛించి తప్పుకున్నావు 


ఎప్పుడో నా నుండి నిష్క్రమించిన నువ్వు మళ్ళీ అతిథిగా వచ్చావు. 

గుండెల్లో అగ్నిపర్వతాలు బ్రద్దలవుతున్నా మర్యాదలు బాగా చేసాను.


ఆఖరికి నువ్వు సాధారణంగా నా నుండి ముగిసిపోయావు

ఎంత సాధారణంగా అంటే.. 

కొద్ది క్షణాలు సముద్రం విశ్రమిస్తే వుండే  

ఏకాంత నిశ్శబ్ద విషాదంలా. 

నా రెండు చేతుల మధ్య నా కళ్ళలోకి చూస్తూనే ముగిసిపోయావు.  


మళ్ళీ.. ఇదిగో ఇలా 

ఈ ఉత్తరాలు ఈ బహుమతి చూస్తే ఎదలో  కార్చిచ్చు మళ్ళీ రగిలింది.

వేదన పాలు లాగా  పొంగుతోంది. పంచుకోవడానికి ఎవరూ లేరు.

రాళ్ళేసినవారే కాని దయతో  ఎవరు తడిమారు

ఇన్నేళ్ళ జీవితపు వ్యధ, దాని అంతు పట్టని లోతుని. హ్మ్. 


మళ్ళీ .. ఆ ఉత్తరాలు, బహుమతిగా ఇచ్చిన పెట్టెను రహస్య అరలో 

దాచి తాళం వేసాను. మళ్ళీ ఎప్పుడో తెరుస్తాను.

దిగులు నగను ధరించాలని అనుకున్నప్పుడు. 


22 May 2026. 09:45 pm.

.



కామెంట్‌లు లేవు: