నక్షత్రాల నవ్వులు
చీకటి పడితే చాలు ..
నక్షత్రాలు కిందకు వొంగి
ఒక చెవి నా వైపు
వేసి వుంచుతాయి
ఎంతో ప్రియంగా దాచుకున్న
రహస్య ఆశలను వినడానికి.
అప్పుడు నేనంటాను.
నా రహస్యాలు చంద్రునితోనే
చెబుతాను. ఎందుకంటే..
మేమిద్దరం మిత్రులం.
అందుకే..
వెన్నెల నాపై కురుస్తుంది కానీ
మీపై కురవటం కుదరదు కదా
ఎంతైనా. .. నాకెంతో భాగ్యం అంటాను.
నక్షత్రాలు ఫక్కున నవ్వుతాయి..
నేను ఉక్రోషంతో తలుపులు మూసుకుంటాను.
అప్పుడు చంద్రుడు నా వైపు వకల్తా
పుచ్చుకుని అంటాడిలా..
పాపం చిన్న పిల్ల. తనకేం తెలుసు?
నేనూ అంతే అనుకో.
క్షమించండి దయ వుంచండి.
నక్షత్రాల్లారా! మీరు ఎన్నటికి..
మీలాగే ఉజ్వలంగా వుండండి
కాలాన్ని లెక్కించండి అని.
అప్పుడు మళ్ళీ నేనంటాను..
నక్షత్రాలు మన అజ్ఞానం చూసి
నవ్వుతాయి అనుకుంటా!
అందుకే ..
అవి సదా వెలుగుతుంటాయి.
ఈ సారి చంద్రుడు కూడా నవ్వాడు.
నేను నవ్వలేదు.కినుక వహించాను.
12 May 2026. 08:00pm.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి