18, మే 2026, సోమవారం

హ్యాండ్ బ్యాగ్

 


హ్యాండ్ బ్యాగ్


నాకొక స్నేహితురాలు వుంది. ఆమె పేరు కుముదవల్లి. 

పెద్ద జడతో పాలు గులాబీపువ్వు కలగలిపిన మేని ఛాయ. 

మృదు స్వభావి ఆమె. కూజిత స్వరంతో  పాటలతో అలరించేది. 

పొడవైన కనురెప్పలకు దట్టంగా దిద్దుకున్న కాటుకతో 

ఆ కళ్ళు నల్లని సరస్సులో విరిసిన కలువ పూల లాగానే వుండేవి. 

ఆ కళ్ళు గాఢమైన రహస్యాలను దాచుకున్నట్లు గంభీరంగా కూడా వుండేవి.


ఆమె ఎడమ భుజం కింద చీర చెంగుమాటుగా ఓ మోస్తరు

హ్యాండ్ బ్యాగ్ వుండేది. క్షణకాలం కూడా విడిచిపెట్టేది కాదు.

ఎల్లవేళలా దాన్ని  పసి బాలుడిలా ఇష్టంగా పదిలంగా మోసేది. 

ఆఖరికి శౌచాలయం కి వెళ్ళేటప్పుడు కూడా వెంట తీసుకువెళ్ళేది.

నాకు ఆశ్చర్యం. ప్రాణమిత్రురాలినే కదా! నా దగ్గరైనా దాచేదేముంది! 

ఏమంత గొప్ప నిధులు దాగి వుంటాయి అందులో అని. 


ఏముంటాయి అందులో అని సాధారణమైన ఆలోచన చేసాను.

మహా అయితే ఇంటి తాళాలు, మొబైల్ ఫోన్, డబ్బు, మందులు

ఇంకా మేకప్ కిట్, దువ్వెన, పెన్, శానిటరీ నాప్‌కిన్

ఇంతకు మించి గుప్త నిధులు ఏముంటాయి? 


ఊహూ! మళ్ళీ కవి మనసుతో ఆలోచించాను. 

ప్రియమైన వారి నుండి అందుకున్న ప్రేమలేఖలను 

ప్రాణప్రదంగా దాచుకుందేమో!  ఇంకా డైరీ కూడా వుండవచ్చేమో! 

ప్రేమ వాటికల్లో విహరించిన నాటి జ్ఞాపకాలు పదిలపర్చుకుందేమో! 

 ఆ ఉత్తరాలు రాసిన అతను రహస్య ప్రేమికుడేమో! 

అంత భద్రంగా కాపాడుకుంటున్న ఆమెకు  అవే ఉచ్చాస నిశ్వాసలేమో! 

ఎడతెగని నిరీక్షణతో కూడిన అనేక దుఃఖ రహస్యాలేమో! 

ఒక ఒంటరి స్త్రీకి హ్యాండ్ బ్యాగ్ నిండా ప్రేమ పరిమళాలేమో! 

ఇక నేనెప్పుడూ.. ఆమె భోషాణం గురించి పట్టించుకోలేదు. 

ఓ కొత్త చూపుతో  నిజమైన స్నేహితురాలినయ్యాను. 


18 May 2026. 08:30 pm. 


(చిత్రం Pinterest సౌజన్యం)



కామెంట్‌లు లేవు: