అంతరంగమాలిక లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అంతరంగమాలిక లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, జులై 2026, బుధవారం

ముఖే ముఖే సరస్వతి

 



ముఖే ముఖే సరస్వతి అంటారు కదా! 

మనకెదురైన ప్రతి మనిషి నుండి చదివిన వాక్యం నుండి అన్నింటికన్నా ముఖ్యంగా ప్రకృతి నుండి.. తల్లి నుండి తండ్రి నుండి ఎంతో కొంత కాదు చాలా నేర్చుకుంటాం. మనం నేర్చుకున్న ప్రతి దానికి గురువు వుంటారు. నేను నా మనుమరాళ్ళ ఇద్దరి నుండి కూడా నేర్చుకుంటాను. నాకైతే గూగుల్ కూడా పెద్ద గురువు.  ప్రత్యేకంగా వీరి నుండి నేర్చుకున్నాను అని చెప్పను. నిత్య విద్యార్థిగా వుండటం నాకిష్టం. 

ఇంకొకటి కూడా నమ్మకంగా చెప్పగలను. 

మన లోపలి నుండి అనుక్షణం ఓ గొంతుక వినిపిస్తూ వుంటుంది. దానిని మనం పట్టించుకోము. నిజానికి అది ఏం చేస్తుందంటే .. మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. తల్లిదండ్రులు స్నేహితుడు గురువు జ్ఞాని లాంటి వారికన్నా మనల్ని సరైన మార్గంలో నడిపించడానికి ప్రయత్నిస్తుంది. మనకు తెలుస్తుంది. అది సరైన మాట చెబుతుందని మార్గాన్ని సూచిస్తుంది అని. కానీ మనం వినం. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు.. పదే పదే వాపోతాము. 

మీకేది సరైనదో అది తెలుసుకోవాలంటే మన లోపలి గొంతుక ఏం చెబుతున్నదో వినండి. కొన్నిసార్లు కొన్ని పనులు ఆలస్యం కావచ్చేమో కానీ సరైన పంథాలో నడుస్తాం. 

అంతరాత్మ ప్రబోధాన్ని పాటిస్తూ వుండండి. నమ్మకంగా చెప్పవచ్చు. అది మీకు హాని చేయదు అని.

మిత్రులందరికీ గురుపూర్ణిమ శుభాకాంక్షలు. 

మనిషి వికసిస్తూనే వుండాలి. ప్రేమ శాంతి సౌభాగ్యం అలరారుతూ వుండాలి. 

ముఖే ముఖే సరస్వతి. 🙏

కృష్ణమ్ వందే జగద్గురుమ్ 🙏

2, జులై 2026, గురువారం

అప్ డేట్

 



కవిత/రచన అద్దం లాంటిది. కానీ ఆ అద్దంలో ఎప్పుడూ కవి/రచయిత మొహమే కనిపించాలని లేదు.

ఒక్కోసారి సమాజం కనిపిస్తుంది. ఒక్కోసారి కాలం కనిపిస్తుంది.

ఒక్కోసారి కవి/రచయిత ఊహించిన ఒక పాత్ర కనిపిస్తుంది.

"ఇంత బాగా ఎలా రాసావు?" అని అడిగితే…

కవి/రచయిత నవ్వి ఊరుకుంటాడు. ఎందుకంటే…

- అది స్వీయానుభవం అయితే- గాయాన్ని మళ్ళీ తవ్వాలని ఉండదు.

- ఇతరుల బాధ అయితే- వాళ్ళ గోప్యతని కాపాడాలి.

- పూర్తిగా కల్పన అయితే - "అబ్బే, ఊరికే రాశాను" అనడం కవికి ఇష్టం వుండదు.

మానవ స్వభావం అంటే ఇదే!

అందరూ అన్నీ పంచుకోరు. పంచుకోవాల్సిన అవసరం లేదు.

కొన్ని గాయాలు మాటల్లోకి వస్తే కవిత అవుతాయి.

కానీ ఆ గాయం ఎవరిది అని అడగకూడదు.

కవి/రచయిత  కెమెరా లాంటివాడు. ఒక్కోసారి తనని తాను సెల్ఫీ తీసుకుని చూపుతాడు. గ్రూప్ సెల్ఫీ కూడా కావచ్చు.

ఒక్కోసారి లోకాన్ని ఫోటోలు తీస్తాడు.

ఒక్కోసారి ఊహల్ని సెట్టింగ్స్ వేసి చిత్రాలు తీస్తాడు.

మూడు చిత్రాలు కవి తీసినవే, కానీ మూడింట్లో అతను ఉండవచ్చు ఉండకపోవచ్చు. అలాగే  ప్రతిది కవి/రచయిత కథ/ కవిత కాదు. 

సంవత్సరాల తరబడి చదువుతున్న పాఠకులు కూడా పిచ్చి ప్రశ్నలు వేయకూడదు. Update కావాలి


27, ఏప్రిల్ 2026, సోమవారం

జ్ఞానగుళికలు

 ఈ ఉదయం completely నా మిత్రులకు అంకితం.. ఈ పోస్ట్. ముఖాన తిట్టలేక.. ఇలా! ఈ విషయంతో సంబంధం లేని వారు లైట్ తీసుకోండి. పోనీ చదివారా! ఈ జ్ఞానగుళికల్లో ఏదో మీరూ ఏరుకోవచ్చు. 😊👍

********

ఇతరులు మనకు చేసే హాని కన్నా మనకు మనం చేసుకునే హాని యెక్కువ. 

ఎవరో ఏదో అంటూంటారు అని మానసికంగా ఇబ్బంది పడతుంటారు. 

లేదా ఎదుటి వారు మోసం చేసారని మోసపోయామని బాధపడతారు. 

ఇతరుల తప్పు ఎంతుందో మన తప్పు కూడా కొంత వుండనిదే ఏమీ ఏవీ జరగవు. పోనీ..జరిగినాయా.. తట్టుకోవాలి. చతికిలపడకూడదు.  శక్తి ఉడిగి ముదుసలి అయి పరుగులు తీయలేకపోవచ్చు కానీ నడవగలరు, లేదా ప్రాకగలరు. అంతంత చదువులు చదివి వుంటారు. వేలమందికి బోధించి వుంటారు. చేతిలో యేదో ఒక సృజన వుంటుంది. అయినా.. యేదో కోల్పోయినట్టు వుండటం బాగుండదు. 

జీవితం యేమి నేర్పింది!? మీరు యేమి నేర్చుకున్నారు!? కడుపున పుట్టిన బిడ్డలే ద్రోహం దగా చేస్తున్న కాలంలో కుడి చెయ్యికి యెడమచెయ్యికి ద్రోహం చేస్తున్న కాలంలో 

యెవరో మోసం చేసారనో అవమానించారనో బాధపడటం మన లోపాలను మనమే బయటపడేసుకుంటూ ఆప్తులను దూరం చేసుకోవడం యెందుకు? 

తత్వశాస్త్రం చదవడం మొదలుపెట్టండి. లేదా నాలుగు కథలు చదవండీ. వేటి మీద ఆసక్తి లేకుండా యే పని పై శ్రద్ధ లేకుండా జీవితాల్లో అద్భుతాలు జరగవు. 

ఆలోచనలంత వృధా ప్రయత్నం వేరొకటి లేదు. 77 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారిని చూడండి. ఎలా కష్టపడుతున్నారో! మనం కీ బోర్డ్ పై నాలుగు పేరాలు రాయడానికి బాధపడి పోతాం. అనవసర దుఃఖాలు మోస్తూ.. కాలం బలవంతంగా అరగదీయడం. 

తెలుగు సాహిత్యం అనువాదానికి నోచుకోక ఏడుస్తుంది. ఆంగ్ల సాహిత్యం యూరోపియన్ కవిత్వం అర్థం చేసుకోలేని విద్యార్థులు వున్నారు. ఆన్ లైన్ పాఠాలు చెప్పవచ్చు. పోసుకోలు కబుర్లు అతి తక్కువ జ్ఞానాన్ని మాత్రమే ఇవ్వగలవు. మనుషులు వారి ప్రభావాలు చైతన్యం ఇవ్వాలి. బాధను మిగల్చకూడదు. మనం ఇతరులను బాధ పెట్టకూడదు. ఇతరులకు నువ్వు యేమి ఇచ్చావో అదే వస్తుంది. గుర్తు పెట్టుకోండి. 

నన్ను చూడండి, తెల్లవారుజామున లేచి నాలుగు కథలు చదువుకున్నాను. నా ఆనందం కోసమే! తర్వాత ఇది రాస్తున్నాను. 

ZEE5 లో కొరియన్ సీరీస్ “మదర్” చూడమని చెప్పాను, అన్నా కరెనినా నవల చదవండి. కానీ అన్నా లాగా ఆత్మ హత్య చేసుకోవద్దు అని చెప్పాను. అమృత సంతానం, ఆ వెన్నెల రాత్రులు నవలలు చదవమని చెప్పాను. ఒక్కరు కూడా చదివామని చూసామని చెప్పలేదు. కనీసం ఒక కథ చదవమని సూచిస్తే చదవలేరు. ఒక్క కవిత చదవలేరు. మేం గీసుకున్న గీతల్లోనుండి బయటకు రాలేము. కానీ..

మా జీవితాల్లో అద్భుతాలు మాత్రం జరగాలి అంటారు. 

హే.. పోండి. మీతో స్నేహం చేస్తే.. నా మైండ్ ఖరాబు అవుతుంది. మా ప్రకాశం బ్యారేజ్ వరకూ వెళ్లి కాసిని చిల్లర నాణాలు నదిలో వదిలినట్టు మిమ్మల్ని వొదిలేస్తాను. పీడా పోద్ది. ఎక్కువకాలం toxic people ని నేను మోయలేను. 

కనీసం స్త్రీ మిత్రులు అయినా “దారులేసిన అక్షరాలు“ చదవండి. అది చదివాక కూడా.. మీ ఏడుపుగొట్టు మాటలు చేతలు స్థితి మారకపోతే.. అది మీ ఖర్మ. 

ఎవరూ ఏమీ చేయలేరు. మీ సొద వ్యథ నేనూ వినలేను. నా గుండె కూడా అనేక రకాలు మోయలేకపోతుంది. 

ఎవరికి యెవరు యీ లోకంలో .. 

ఎవరో వస్తారని యేదో చేస్తారని.. 

రెండు పాటలు అయినా వినండీ. 

కనీసం.. మీ ఆలోచనలు అయినా లిపిబద్దం చేయండి. నేనిప్పుడు అదే చేశాను. 

PS: ఈ పోస్ట్ నా దగ్గర మిత్రులను ఉద్దేశించి రాసింది. మీరు లైట్ గా తీసుకోండి. వాళ్ళు సీరియస్ గానే తీసుకుంటారు. నాకు తెలుసు. ఈ మాత్రం dose సరిపోతుందని నేను అనుకుంటున్నాను. 😊👍😘

Phone చేస్తే పీక నొక్కుతా! 😊😘


#వనజతాతినేని

#vanajatatineni

13, ఏప్రిల్ 2026, సోమవారం

వెక్కిళ్ళు పెడుతున్న ఊరు



 వెక్కిళ్లు పెడుతున్న ఊరు

                    - వనజ తాతినేని. 


ఊరు నిన్ను కడుపులో పెట్టుకొని 

చూసుకుంటుంది. అయినా

నువ్వు నీ ఎదుగుదలను కోరుకుంటూ

అప్పటిదాకా నిన్ను పెంచిన ఊరికి వీడ్కోలు చెబుతావు. 

ఊరికి చుట్టం చూపుగా రావడం కూడా మరిచిపోతావ్. 

ఎక్కడెక్కడో తిరుగుతావ్ 

జ్ఞాపకాల పొరల్లో ఊరిని దాచుకుంటావ్


తిరిగి తిరిగి తిరిగి.. అలసి ఊరిని వెదుక్కుంటూ వస్తావ్

అప్పుడు మసకబారిన ఊరు చూపు నిన్ను గుర్తు పట్టదు. పైగా.. 

ఎవరూ .. ఈ అపరిచితుడు అని 

అనుమానంతో పట్టి పట్టి చూస్తుంది. 


నాది ఈ ఊరే అని గొంతెత్తి అరిచినా.. 

వినిపించుకోదు ఊరు. 

ఊరిలో ఎవరు నీ వారు అని ఆరాగా అడుగుతుంది. 


నువ్వు తెగనమ్ముకుని వెళ్ళిన బంధాల ఆచూకీ మచ్చుకైనా కానరావు. 

బడి గుడి మంచినీళ్ళ ట్యాంకు ఆసుపత్రి లేదా 

నలుగురు కూర్చునే బెంచీల పైనో నీ పేరు లిఖించి వుండదు. 

నీ వాళ్ళ పేరిట నువ్వు నాటిన నాలుగు మొక్కలు 

వృక్షాలై కనిపించవు. నిన్ను పోల్చుకోవడానికి.

నీ బంధువుల పిల్లలో.. నీ స్నేహితుల పిల్లలో 

ఎవరూ ఉండరు.ఏ పెళ్ళికో పేరంటానికో  

పోనీ.. చావు పరామర్శ కో ఏనాడైనా నువ్వు వస్తేనేగా? 

ఊరు నెంబర్ కూడా un known లో సేవ్ చేసుకుని వుంటావ్ 


చెక్ బుక్ పై సంతకం గీకేసినట్లైనా.. 

ఊరంతా గాలించినా నీకొక సంతకం లేదు


ఊరికి ఏం ఇచ్చావ్ అని  నోరు తెరిచి అడిగితే.. తెల్లబోతావ్. 

అయినా.. ఊరికి నువ్వు గుర్తు లేకపోయినా తన చూపులతో 

కుశల ప్రశ్నలు వేస్తుంది. చెంబుడు మంచినీళ్లు ఇచ్చి 

దాహం తీరుస్తుంది. నీ కళ్ళు చూసి ఆకలి గుర్తించి 

పండో ఫలహారమో పెడుతుంది. 

మౌనంగా వీడ్కోలు చెప్తుంది. 

ఊరి గుండె బరువు నీకు తెలియదు. 

నీకే కాదు ఊరిని వదిలి వెళ్ళిన ఎవరికీ 

తెలియదు. 

పెళ్ళైన ఆడపిల్ల వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ కన్నీళ్ళు పెట్టుకున్నట్లు 

ఊరిని వదిలి వెళ్తున్న వారిని చూసి ఊరు వెక్కిళ్ళు పెడుతుంది. 

అమావాస్య ఎరగని వెన్నెల లాంటి చల్లని అమ్మ ఊరు. 

మీ పాద ముద్రలను పదిలంగా గుండెల్లో దాచుకుంటుంది. 

తల్లిలా ఊరు వెక్కిళ్లు పెడుతూ ఏడుస్తుంది. 


11 April 2026. 07:50pm.


#వనజతాతినేని

#vanajatatineni

#వనజవనమాలి


10, ఏప్రిల్ 2026, శుక్రవారం

గిల్లికజ్జాలు



 గిల్లికజ్జాలు.. 


ఏమే! టీ పెడతావా! ఫ్యాక్టరీకి పోయిరావాలి.  ట్రక్కులన్నీ ఆడ్నే ఇరుక్కపోయాయ్, దగ్గరుండి అన్ లోడు చేపిచ్చాలి. 


పక్కనే వున్న ఆమెలో ఉలుకు పలుకూ లేదు.అట్టా అని నిద్రపోవడం లేదు.


మళ్ళీ.. అతని పిలుపులు. .. ఆమెను పేరుతో పిలుస్తూ.


ఈసారి ఆమె చికాకుగా రియాక్ట్ అయింది.


“ఎందుకలా గట్టిగా అరుస్తారు, నాకేమన్నా చెముడా ఏంటి!?” విసుగ్గా టీ పెట్టడానికి లేచింది. 


ఐదంతస్థుల అపార్ట్మెంట్ లో modular kitchen లో .. ఐదు బర్నర్ ల స్టౌవ్ ముందు నిలబడి ఒకదానికి అగ్గి ముట్టించింది.నీళ్ళు పోసి తాజ్మహల్ టీ పొడి మూడు స్పూన్ లు  వేసింది. అల్లం కొమ్ము చాకుతో గీరి  ఒక పెద్దముక్కను నాలుగైదు చిన్నముక్కలను చేసి అందులో వేసింది.చిన్న రోట్లో రెండు యాలక్కాయలు కొట్టి మరుగుతున్న టీ నీళ్ళలో పడేసింది. ఫ్రిడ్జ్ లో పాలు తెచ్చి పావుశేరు పాలు మరుగుతున్న టీ డికాషన్ లో పోసింది.ఐదు నిమిషాలు గడిచాక అతను వచ్చాడు. ఇంకా అవలా.. అంటూ. 


“అవుతున్నయిలే, అంతా తొందర,టీ మరగకపోతే ఏం బావుంటాయి? చూరు నీళ్ళు లాగా రంగు, నీళ్ళ కంపు” అంది ముఖం చిట్లించి. 


“మొన్న శ్యామ్ మనింటి దగ్గర టీ తాగి పోయి కవిత తో చెబుతున్నాడు. అన్న వాళ్ళింటికి పోయినా. వదిన టీ చేసి ఇచ్చింది. టీ రుచి బ్రహ్మాండంగా వుంది కానీ అంత స్ట్రాంగ్ మనం తాగలేం. పాపం!  అన్న రోజూ అట్టాంటి టీ తాగుతూ మనింటికాడ ఈ టీ ఎట్టా తాగుతాడో అన్నాడు.”

అని భార్య ముఖంలోకి చూసాడు. 


“ఏ రోటి కాడ పాట ఆ రోటి కాడ పాడతాను నేను అని చెప్పలేక పోయినావా?” అంది ఆమె.


“నీ యమ్మ, కొట్టానంటేనా?అని మీదకు వచ్చాడు. 


“ఇదిగో టీ, తాగి పో, కబుర్లు చెప్పింది చాలు కానీ.” 


“ట్రాక్టర్ లో ఆయిల్ పోయించాలి. డబ్బులున్నాయా?” 


ఆమె మాట్టాడకుండా ఎమర్జన్సీ మనీ లో నుండి 320 రూపాయలు అతనికి ఇచ్చింది. పుల్ ట్యాంక్ డీజిల్ ధర అంతే, అప్పుడు. 


“సర్లే కానీ.. ఎందుకు?  ఆ మురుగు చెరువుని అందంగా ఫోటోలు తీసుకుని వచ్చి ఫేస్ బుక్ లో పెడుతున్నావు. నీ లాంటి తిక్కల మేళాన్ని నా జన్మలో ఎక్కడా చూడలేదు. దొరికావ్ నాకు.” ఇంకా ఏదో వినబడని సణుగుడు. 


ఆమె పళ్ళు బిగించి కళ్ళు పెద్దవి చేసింది. తర్వాత నిదానంగా అంది. “నువ్వు నాకు దొరికినట్టే”.


“అది కాదే! అది మురుగు చెరువు కదా! పక్కనే వాకింగ్ చేస్తంటే కంపు కొట్టట్లేదు.” ఆరా తీసాడు. 


“కంపు లేదూ ఏమి లేదు. అయినా ఎవరి కంపు నీళ్ళేమిటి? అసలు చెరువు ఎంత గొప్పదో! ఊర్లో వాళ్ళు వాడిన నీళ్ళేగా. జనాల మురికిని నీళ్ళ ద్వారా మోసుకొచ్చి చెరువుకి చేరుతుంది. జనాల మురికిని భూమి పీలుస్తూ ప్రక్షాళనం చేస్తుంది. ఇంక కంపు ఏమిటి? చచ్చిన కుక్కలను, కోళ్ళను, ప్లాస్టిక్ కవర్లను టైర్లను అన్నిటినీ తెచ్చి అక్కడ పడేసేది కాక రోజూ తగలబెట్టేది గాక. మళ్ళీ చెరువు కంపు అంటావా? అది వుండబట్టే ఊర్లో గ్రౌండ్ వాటర్ లెవల్ తగ్గకుండా ఉంటుంది. ఇంకోసారి మురికి కంపు అన్నావంటే ఊరుకోను”  అంది ఆమె. 


“నీ అంత రెటమతం దాన్ని చూడలేదు.నీతో వాదులాడను నాకు తీరిక లేదు పోమ్మా, నే పోతన్నా! 


“సరేలే.. ఒక మాట చెబుతా విను.”

 

“సరే! తొందరగా చెప్పు.? “


“అబ్బయ్య నీకు లాగా చెడ్డమాటలు మాట్లాడుతున్నాడు.  ఈ మధ్య విన్నాను వాడి మాటల్లో.ఆడ్ని నేను ఎంత బాగా పెంచాను. ఏంటి వీడూ వాళ్ళ నాన్న లాగా చెడ్డ  పదాలు మాట్లాడుతున్నాడు అని దిగులు పుట్టింది అనుకో. వాడికి ఒకసారి చెప్పు పో, మీ అమ్మ బాధపడతా వుంది. కోడలు ఏమనుకుంటుంది?  మా అత్త కొడుకుని దరిద్రపు సంస్కారం లేని పెంపకం పెంచింది అని అనుకోదు. అసలు వాడు చిన్నప్పుడు నిన్ను చూసే నేర్చుకుని వుంటాడు. ఇప్పుడు అసహనంలో లోపల్నుండి తోసుకుంటూ వస్తున్నాయి. ఎక్కడికి పోతాయ్ జీన్స్. కోపం ఆమె మాటల్లో. 


“ఎందుకే.. అబ్బాయి కోపంగా వుండటం? అంతా బాగానే ఉంది కదా! ఏం .. ఏమైనా ఇబ్బందులా!? మనకేమైనా చెబుతాడా, ఏంది?  అయినా నీకు తెలిసి వుంటదిలే! ఏమైంది?” 


“ఏం కాలేదు లే, ఇల్లు కట్టుకోవడం కుదరడం లేదు గా. ప్లాట్ కొనమని అడుగుతున్నా. అలాగే అన్నాడు. ప్రాసెస్ జరుగుతుంది. ఎందుకో stress గా వుండినాడు బిడ్డ. ఆ బ్యాంక్ వాడు కూడా తెగ విసిగిస్తున్నాడులే!” 


“ప్లాట్ కొనడం ఎందుకు? మన స్థలంలో duplex ఇల్లు కట్టుకోండి. చక్కగా ఉంటది.”

 

“ఆ.. .. దీర్ఘం తీసింది ఆమె. నువ్వు చెప్పావనే.. ఈ ఊరు వచ్చిపడ్డాను. నిన్ను కట్టుకొని 40 ఏళ్ళు అయ్యింది. నువ్వు  గనుక సదరంగ వుంటే మాకెందుకు ఈ తిప్పలు?  ఇంత చిన్నగూడు కట్టుకోలేకపోయాం. ఇంక నా తోట, పూల మొక్కలు ఏడ లే! ఉన్నదాంట్లో సర్దుకుందాం అని తీర్మానం చేసుకున్నా,” అంది ఆమె కినుకగా.


“అయ్యో!” అన్నట్టు చూసాడు అతను జాలిగా ఆమె వైపు. కదిలాడు వెళ్ళబోతున్నట్లు.

 

“వైట్ డ్రెస్ ఎందుకు!? మార్చుకుని పో! మళ్ళీ నేను అంత తెల్లగా బాగా ఉతకలేను.”

 

“హే పో! నేనిట్టాగే పోతా!”


“నువ్వు ఏ నాడు నా మాట విన్నావు కనుక. నేను మాత్రం నీ మాట తు చ తప్పకుండా వింటా! అందుకే నువ్వు చెప్పినట్టు ఈ ఊరు వచ్చి.. నువ్వు పెరిగిన తావుల్లో చేలల్లో తిరుగుతూ వుంటా. ఆఖరికి నువ్వు పోయిన వల్లకాడు కే పోవాలని నిశ్చయించుకుని ఈ ఊరు వచ్చాను.” అంది ఆమె. 


అట్టాగే కాసేపు నిలబడి ఆమె ముఖం లోకి బాధగా చూసాడు. నెమ్మదిగా కదిలాడు. 


“ఇదిగో..చూడు ! పోరంకిలో  వియ్యాల వారింటికి వెళ్ళి.. చిన్న మనుమరాలు ని చూసి పో! చిన్నది.. అచ్చం నీలాగానే వుంది. పోలికలు రంగు జుట్టు చూపు మాట చేత అన్నీ.. నువ్వే! నీ కొడుకు నీ పేరు కలిసి వచ్చేటట్టు పేరు పెట్టుకున్నాడు. పిల్ల ని చూసి పో. అబ్బాయి కి కూడా  కనబడు ఓ సారి. మీ అమ్మకు కూడా కనబడి పో! అన్నీ నేనే చెప్పాలా!  నా ఒక్కదానితోనేనా  వాదులాడేది!. వాళ్ళేం పుణ్యం చేయలా!? పాపం.”


“సరే లేవే! ఒక్కదానివే ఉన్నావని నీకు కనబడి పోతున్నా! ఫ్యాక్టరీ లో సీరియల్ వచ్చేసే వుంటంది. బిన్నా పోవాలి. పోయొస్తా! “


“ ఇదిగో ఏమండీ, ఇంకొకటి చెబుతున్నా విను. నువ్వు చెరువు ఫోటోలు తీయొద్దు అన్నా, ఫేస్ బుక్ లో పెట్టవద్దు అన్నా పెట్టేది పెట్టేదే! నేనేం నీ మాట వినను.వినను, వినను. చెరువు మన ఊరి జనాల  మురికిని మోసే మహాతల్లి. మహాతల్లి 🙏 చేతులు జోడించాను నేను. 


చేతులు జోడిస్తూనే వున్నానా! ఎక్కడ నుండో పెద్ద మెరుపు చెళ్ మని శబ్దం. పక్కనే పిడుగు పడ్డట్టు.. గుండెలదిరిపోయే ఉరుములు. ఠక్కున లేచి కూర్చున్నాను. 


కాసేపు అయోమయం. కాసేపటికి స్వాధీనంలోకి వచ్చాను. ఏంటి!? కల ఇలా వచ్చింది  మిట్ట మద్యాహ్నపు  కలలో. ఎంత స్పష్టంగా కనబడ్డారు ఆయన.🤔🤔🤔

 

ఇప్పుడు అసలు నేను నేనే నా!,  వేరేనా? కలలో నిజంగా నన్ను నేను చూసుకున్నానా? 

ఏమిటబ్బా! కలలో.. ఇలా కనబడ్డాడు ఆయన. ఇల్లు కట్టుకోండి  అని చెప్పిన  తన కోరిక పక్కన పెట్టానని ఇలా కలలో కనబడ్డారా? నెల్లూరు జిల్లాలో మా వ్యవసాయ క్షేత్రంలో కాసేపు, ఇక్కడ మా ఇంట్లో కాసేపు నాతో మెసిలి మేమిద్దరం వాదులాడుకుంటూనే కష్టసుఖాలు పంచుకున్నాం. ఏవో హెచ్చరికలు చేసుకున్నాం. మంచి సెబ్బర చెప్పుకున్నాం, సూచనలు చేసుకున్నాం.. 

95 లో రూపంతో ఆయన. వర్తమానం లో ఉన్న నేను. అచ్చం ఇట్టాగే వుండేవి మా ఇరువురి మధ్య సంభాషణలు. ఆయన నెల్లూరు మాండలికం. నాది పడమట కృష్ణా జిల్లా భాష.

ఫ్రాయిడ్ కలల గురించి ఏం చెప్పారు? తెలుసుకోవాలి.

అసలు నాకు కలలో జరిగిన విషయాలు ఇంత బాగా గుర్తు వుండటం ఏమిటి? అందరికీ ఇలాగే గుర్తు వుంటాయా? 2016 -17 లలో  ఫేస్ బుక్ లో నా ఫోటోలు పెట్టడం ఇష్టం వుండేది కాదు ఆయనకు. చుర చుర చూసేవారు. ఏమిటో ఈ కలలు.. అర్థాలు. 

హే మై మేన్… అనుకోలేదు నువ్వొస్తావని. 


ఈ కల గురించి చెపితే.. మా అత్తమ్మ కంటి వంక చుక్క నీరు కారకుండా ఏడుస్తారు. ఆమెది  రహస్య దుఃఖం.😢నాకు ఒక్కసారి కూడా కనబడలేదు అంటారు. 


(ఉదయం ఏమి రాయడం లేదు అనుకున్నాను కదా! ఇప్పుడు రాయించేసింది కల. అంతే! ఏదీ మన చేతుల్లో వుండదు. జరిగేదే జరుగుతుంది) 





 


9, ఏప్రిల్ 2026, గురువారం

ప్రతి కథ కవిత వ్యక్తిగతం కావు.

 ప్రతి కథ కవిత వ్యక్తిగతాలు కావు. లోకానుభవాలు, కల్పితాలు కావచ్చు. 

మనసు దారంతో పతంగాన్ని యెగరవేసినట్టు..

ఏం బాధలండీ ..బాబూ ! కంటి మీదకి కునుకే రాదు.. కథో , కవితో అయ్యిందాకా మనసు తేలికా పడదు .

పేరు పక్కన  రచయిత,కవి అని  నమోదు కావాలంటే " ప్రపంచమంతా నిద్ర పోతుంటే మేల్కోవాలి. ప్రపంచం తన గురించి చేయని ఆలోచన చేయాలి,  ప్రపంచం నుండి తనని తానూ వెలివేసుకోవాలి, ఎన్ని ఎదల బరువునో మోయాలి. మోసి మోసి కునారిల్లిపోవాలి". అదంతే ! ఎవరి కోసం వాళ్ళు వ్రాసుకుంటున్నామంటే అది ఆత్మవంచన. ఎవరికోసం  వాళ్ళు వ్రాసుకోవాలంటే డైరీ చాలు. మనసు కవి ఆత్రేయ గారన్నట్టు .. రచయిత బాగా వ్రాయగల్గితే పాఠకులకి బాధ. బాగా వ్రాయలేకపోతే రచయితకి బాధ.

అనుభవం మనది కాకపోయినా.. వినడం చూడటం ద్వారా .. మనకు ఒక పాఠం నేర్చుకున్నట్టుగా వుంటుంది. #lifelessons అవి. 

ఒక కథ, లేదా కవిత్వం రాద్దాము అని కూర్చుంటే  విషయం మనది కాకపోయినా.. అందులోకి మన అనుభూతి లేదా మన అనుభవాలో వచ్చి ఆటోమేటిక్ గా వచ్చి కూర్చుంటాయి. అందువల్ల దానికి ఇంకా బరువు పెరుగుతుంది. స్త్రీల వేదనలు బరువైనవి! ఏ స్త్రీ చదివినా బాధపడతారు. అది సహానుభూతి మాత్రమే! జాలి కరుణ తర్వాత సంగతి. 

దారం నా చేతిలో ఉంది దీపం నా చేతిలోనే వుండి.. అయినా.. నువ్వెటో తప్పిపోయావు

అంటాను.. ఒక కవితలో నేను. 

ప్రతి కవిత, కథ.. రాసినవారివి అయివుండవు. నేనెప్పుడూ చెపుతాను.. అన్ని కథలు అన్ని జీవితాలు.. రచయిత కు కవికి వుండవు. అలాగని తన అనుభవంలోకి రాని విషయాన్ని కవి,రచయిత అంత గాఢంగా రాయలేరు. ఎవరో వుంటారు ప్రతిభావంతులు. ప్రతిభను కూడా చూడండి. 

మా ఫ్రెండ్ మొదటిసారి ఒక కథ రాసారు అంట. అందులో స్త్రీ.. గుంటూరు నుండి విజయవాడ కి నడిచి వచ్చారంట.ఆ కథ ప్రచురితం అయ్యాక.. ఆమెను పరిచితులు బంధువులు అందరూ.. మీరు గుంటూరు లో ఎప్పుడు వున్నారు? అని అడిగారంట. అలా వుంటుంది పాఠక పరిచితులతో. 

అన్నట్టు.. నిజంగా జరిగిన విషయం.. ఒకటి వుంది. నా ఫ్రెండ్ భర్త అర్ధరాత్రి తాగి వచ్చి ఆమె వద్దనున్న పసిబిడ్డను లాక్కొని.. రోడ్డు మీదకు నెట్టేస్తే.. ఎవరి ఆశ్రయం పొందాలో తెలియక.. చేతిలో చిల్లిగవ్వ లేక..దుఃఖంతో అయోమయస్థితిలో..  రైల్వే ట్రాక్ వెంట నడుస్తూ.. నడుస్తూ తెనాలి చేరుకుంది. 

అలా వుంటాయి.. జీవిత దుఃఖాలు. 

రాయకుండా ఉండనీయని దుఃఖాలు. 

మీరేమి అనుకున్నా.. నేను రాయకుండా వుండను. ఆ కథలో కవితలో.. నేను వున్నానేమో అని భూతద్దంతో వెతుకున్నా సరే! 

ఆ మాట.. ఇన్ బాక్స్ లోకి వచ్చి నన్ను అడగవద్దు.. ప్లీజ్! 🙏🤔😢


జీవితమంటే మార్పు, 

జీవితమంటే సంచలనం 

జీవితమంటే పయనం 

దీనికి ఎవరూ బెదరకూడదు 

పారిపోకూడదు -రావి శాస్త్రి


#lifegriefs


19, మార్చి 2026, గురువారం

ఛాయా చిత్రం

 అప్ డేట్.. 


ఔద్దత్యం లేనే లేదు

అది నా ఔన్నత్యం అవునో కాదో నాకే తెలియదు. 

అందరి దృష్టి ని ఆకర్షించాలని కాదు. 

నా వాల్ .. నా ఇష్టం. 

కనీసం profile pic పెట్టుకునే స్వాతంత్ర్యం 

లేదా.. నాకు !?

మొన్నామధ్య ఇదే శారీ తో వున్న ఫోటో పెట్టుకుంటే.. ఎవరో వచ్చి ఏదో.. వాగుతాడు. 

ఫోటో తో సహా డిలీట్ చేసాను కోపంగా. 

కథలు కవిత్వం పెడతాను కాబట్టి Public comment చేయవచ్చు అనే option ఇచ్చాను. ఎవడో ఏదో వాగుతాడు. Friends and Friends option లోకి మార్చుకున్నాను. 

ఈ Option లో కూడా ఎవడో ఒకడు ఏదో ఒకటి వాగుతున్నాడు. Only Friends వరకూ comment పెట్టే Option లోకి కుదించేసాను. 

ఏంటి బాబూ ! అసలు మీ సమస్య! ? అని అడగాల్సిన అవసరం వస్తుంది. జాగ్రత్త!!

ఫోటోతో సహా డిలీట్ చేసానని అప్పుడే  మా వదిన మళ్ళీ తీసింది ఈ ఫోటో. చేతిలో రెండు Chaco Bar లు ఉన్నాయని నవ్వకండి. నేనసలు తినను. ఫ్యామిలీ మెంబర్స్ వి పట్టుకున్నాను. 

14 th న కజిన్ కూతురు పెళ్ళి లో.. 

ఆ పెళ్ళికి చాలామంది వచ్చారు. మనమేం ఎగబడి ఫోటోలు దిగం వారితో. 

రచయితలు కూడా సెలబ్రిటీ లే.. కదా! 

PS: జాగ్రత్తగా కామెంట్ చేయండి. 

ఎప్పుడో ఒకప్పుడు కాస్త మంచి చీర కట్టుకుని.. సింపుల్ గా ఓ నగ పెట్టుకొని.. కాస్త ఓ ఫోటో తీసుకుని ఇక్కడ పోస్ట్ చేసుకుంటాం. అంతే! అదో సరదా! కట్టిన చీరే కట్టి బిళ్ళ మడతలు పెట్టి కట్టి తిప్పి కట్టి.. 

అన్నమాట. 

ఈ ఫోటో అస్సలు డిలీట్ చేయను. నవ్వకపోయినా బాగానే వున్నాను.. వెనుక వున్న పువ్వుల గుత్తులు వల్ల. 😍❤️😘

ప్రశంసలు ఎన్నైనా స్వీకరిస్తాం. విమర్శ ను కూడా భరిస్తాం. కానీ అవాకులు చెవాకులు, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం సరికాదు. అది నేను భరించలేని విషయం కాబట్టే.. ఈ బ్లాగ్ లో కూడా కామెంట్ ఆప్షన్ తీసివేయబడింది. 

14/03/2026 . 


17, మార్చి 2026, మంగళవారం

కుశలం




 నా కనురెప్పల క్రింద దాగున్న నిదురను ఎవరో దొంగిలించారు. 

పోనీ రాత్రి గస్తీ కాస్తున్న జాబిలికైనా  బహుమానం ఇచ్చారు కాదు. 

వీధి కుక్కలతో మంతనాలు జరుపుతున్నారు దుర్మార్గులు. 

వేకువ దయతలచి ఒడిలోకి తీసుకుని 

జోల పాడింది. కలల నిదుర కలత నిదుర..

ఏదో తెలియదు. 

రోజూ పలకరించే నేను ఇంకా పలకరించలేదని

మిత్రులు కంగారు పడ్డారు. కుశలం అడిగారు.

ఇది చాలు కదా! 


13, మార్చి 2026, శుక్రవారం

జీవితానికి కూడా అవకాశం ఇద్దాం..




 జీవితానికి కూడా అవకాశం ఇద్దాం కృతజ్ఞతలు తెలియజేయడానికి. 🙏. 

మనిషి పుట్టిన దగ్గర నుంచి ఏమి నేర్చుకుంటాడు!? పుట్టగానే ఆకలి స్వచ్చత అమాయకత్వం.. కనుల భాష కూడా తెలియకపోవడం .. తల్లి స్పర్శ తప్ప ఏమీ తెలియనితనం నుండి ఇతరులను గుర్తించడం.. వినికిడి శక్తి వల్ల చూడటం వల్ల చుట్టూ వున్న పరిసరాలను మనుషులను గుర్తించడం.. పరిచయం పెంచుకోవడం. క్రమంగా మనుషులు వారి మాటలు చర్యలు అన్నీ గ్రహించి తను కూడా ఆ బాటలో నడవటం మొదలుపెట్టడం. మనిషి ఎదుగుదల లో కుటుంబం నేర్పిన సంస్కారం తో పాటు గా పరిసరాల ప్రభావం సమాజ ప్రభావం ఎంతగానో వుంటుంది. 


నేను కూడా ఉన్నత మధ్యతరగతి కుటుంబం లో పుట్టాను పెరిగాను. పరిస్థితులు వల్ల ఓ రెండేళ్లు పేదరికం అనుభవించాను. తర్వాత 17 ఏళ్ళ వయసు లో మరో మంచి కుటుంబం లోకి వెళ్ళాను. ఆ వయసులో వుండే ఆశలు ఆకాంక్షలు కలలు ఎన్నో! కొన్ని నెరవేరితే కొన్ని అదఃపాతాళానికి తొక్కేసాయి. పొరబాట్లు తెలియక చేసిన తప్పులు అన్నీ వున్నాయి అవగాహన లేక అమాయకం వల్ల. ఇంకా పట్టుదల, మొండితనం, ఆత్మాభిమానం ఆత్మవిశ్వాసం అన్నీ వెరసి జీవితాన్ని ముప్పై సంవత్సరాల వయసులో సవాల్ చేస్తూ నిలబెట్టాయి. అన్నీ అధిగమించాను.  ఎవరి ఆర్థిక సాయం కోరలేదు. ఆఖరికి పుట్టింటి నుండి ఒక బియ్యం గింజ కూడా! మానసికంగా అండగా కుటుంబం వుంది. నా అత్తమామలు అండగా నిలిచారు.  అప్పటి నుండి ఈ 58 ఏళ్ళ జీవితం వరకూ నేను  ఎంతో నేర్చుకున్నాను. ఒకరిచ్చే సాయాన్నో ఉదారత నో ఇంకా దేన్నో  దేన్నో నేను స్వీకరించలేదు. నిర్విద్దంగా తోసి పారేశాను. ఏది చేసినా నా కోసం నేను చేసుకున్నాను. నా బిడ్డ కోసం చేసుకున్నాను. ఎవరు ఎన్ని అన్నా అపవాదుల బాణాలు వేసినా ఈర్ష్య ద్వేషాలు వొలకబోసినా విషం విరజిమ్మిన నిబ్బరంగా తట్టుకున్నాను. అనారోగ్యంతో వున్నప్పుడు కూడా నా బిడ్డ ను ఊతగా చేసుకుని నిలబడ్డాను. ప్రతికూలతలు తట్టుకున్నాను. గృహ హింస మానసిక హింస వరకట్న హింస నాకు తెలియనివి కావు. నా జీవితంలో నాకు ఎదురైన ప్రతి అనుభవం ఒక గొప్ప పాఠం. ఎవరి దగ్గర ప్రత్యేకించి పాఠాలు నేర్చుకోలేదు. కానీ ఎంతో నేర్చుకున్నాను. 


నేను సాధించినది ఏమిటంటే.. అది గర్వంగా చెప్పుకుంటాను. ఇతరులు నన్ను చూసి నేర్చుకున్నారు. చాలామంది అమ్మాయిలకు నేను రోల్ మోడల్. అమ్మా అనే పిల్లలు ఆంటీ అనే పిల్లలు, అక్కా అని ఆత్మీయంగా పిలిచే చెల్లెళ్ళు మేడమ్ అని గౌరవంగా విలిచేవారు.. వారి జీవితాల్లో నాకు ఒక ప్రత్యేక స్థానం ఇచ్చారు. వనజ గారితో మాట్లాడితే దైర్యం వస్తుంది. సమస్య ల్లో నుండి బయటపడే దారి తప్పకుండా దొరుకుతుంది అని అంటారు. ఇప్పుడు వనజ గారి కథలు చదవండి అని ఇతరులకు చెబుతారు. నా చుట్టూ ఈ సోషల్ మీడియా కి తెలియని ఒక సమూహం ఉంటుంది. ఆ సమూహం ఎల్లప్పుడూ నాతో టచ్ లో వుంటుంది. ఇక్కడ ఉన్న స్నేహితుల్లో కూడా మెసెంజర్ లో నాతో ఎన్నో విషయాలు పంచుకుంటారు. వారి ప్రైవసీ ని నేను సదా కాపాడతాను. వారు రాయమని అడిగితే తప్ప ఆ విషయాలు కథల్లో నేను రాయను. వారి వ్యక్తిగత విషయాలు ఇతరులకు చెప్పి వారి గౌరవానికి భంగం కలిగించను. అది నా నిబద్ధత. 


నా జీవితం కొత్త పుంతలు త్రొక్కాక పరిణామక్రమంలో నేను చాలా యెదిగాను. వికాసం వైపు ఎదిగాను. ఈర్ష్య ద్వేషాలు నాకు ఎప్పుడూ ఉండవు. లేశ మాత్రం వున్నా వాటిని జయించాను. ప్రేమగా ఇచ్చినా ఉదారంగా ఇచ్చినా సాయం గా ఇచ్చినా నేను ఏదీ స్వీకరించను. నా దగ్గర వున్నది ఇవ్వగల్గినది అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఒకోసారి ఇవ్వలేను. ఒకరిపై ఆధారపడను. ముక్కు సూటిగా వుంటాను. కొంచెం కఠినంగా ఉంటాను. నేను సేప్ గా వుండటానికి కంఫర్ట్ గా వుండటానికి అది అవసరం. ద్రోహం చేసిన వారిని కూడా క్షమిస్తాను కానీ పనిగట్టుకొని విషం చిమ్మేవారిని క్షమించను. ఇద్దరు వ్యక్తులను  క్షమించాల్సిన బాకీ వుంది. బహుశా జీవితం లో క్షమించలేను వారిని. 

ఎవరైనా ఇది చదివి మెచ్చుకున్నా మెచ్చుకున్నట్టు మెచ్చుకుని నొసలు పైకి లేపి ఎగతాళిగా నవ్వుకున్నా.. నేను పట్టించుకోను. సత్యం వైపు ధర్మం వైపు.. వికాసం వైపు.. దయ కరుణతో ప్రేమతో నా పరిధిని బట్టి నేను ముందుకు వేస్తున్న అడుగులు ఇవి. ఎవరిపై ఆరోపణలు లేవు. ప్రశాంతంగా చదువుకోవాలి రాసుకోవాలి అనే కోరిక తప్ప. 


నా ఈ ప్రయాణం లో.. సాహిత్యం సంగీతం ప్రకృతి స్నేహితులు నాకు బాసటగా నిలిచారు. 

నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పుకోవాల్సి వస్తే.. ముందుగా వాటికే చెప్పాలి. నిస్వార్థంగా నా స్నేహితులు నా వైపు వున్నారు. నా చెలిమి కలిమి బలిమి కన్నా ఈ లోకంలో మరేది లేదు లోకాన మేలిమి గా. 


నేను ఏదీ అతిశయంగా రాయడం లేదు. జీవితాన్ని జీవితానుభవాన్ని తేటతెల్లం చేస్తున్నాను. కాలక్షేపం కోసం రాసుకునే రాతల్లో కూడా చిన్న సందేశం స్ఫూర్తి వుంటాయి. నా రాతలో అవి దొరికితే అదే మహాభాగ్యం నాకు. 


ఈ ఉదయం నుండి నా పుట్టినరోజు సందర్భంగా మీరందరూ.. మనస్ఫూర్తిగా  ఇచ్చిన ప్రేమ, శుభాకాంక్షలు నాకు ఎంతో సంతోషాన్ని కలిగించాయి. అందరికీ వారు అందించిన శుభాకాంక్షలు క్రింద ధన్యవాదాలు తెలిపాను. ఎవరికైనా ధన్యవాదాలు తెలియజేయకపోతే మన్నించండి. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు. 

నమస్కారాలు 🙏






12, మార్చి 2026, గురువారం

నను గన్న తల్లిదండ్రులకు…



 "Think like a queen. A queen is not afraid to fail. Failure is another stepping stone to greatness." - Oprah Winfrey

Happy Birthday  “V”

❤️నాకు జన్మనిచ్చిన  తల్లిదండ్రులకు వినమ్రపూర్వక నమస్సులు. నా జన్మంతా ప్రణామాలు 🙏 🙏

నా లోపాలతో సహా నన్ను భరించే నా తోబుట్టువులకు కృతజ్ఞతలు. నా ప్రేమలు ❤️❤️🌹🤗

🙏మంచి గానో చెడుగానో.. నన్ను నిలబెట్టిన  నా భర్త  Mr. Ashok Tatineni గార్కి జీవితాంతం ధన్యవాదాలు, కృతజ్ఞతలు 🙏🙏😢❤️🌹

❤️నా కడుపున పుట్టినా నన్ను బిడ్డలా కాచి నా ఇష్టాన్ని నా గౌరవాన్ని ఏ మాత్రం  తగ్గకుండా  నన్ను నిలబెట్టిన వాడు సదా ఛత్రపతి శివాజీ లా నడుచుకుంటూ నన్ను జిజియాబాయి గా నిలబెట్టిన వాడు.. నా బంగారు తండ్రి.. నిఖిల్ చంద్రుడి కి.. అమ్మ ప్రాణాలన్నీ కూర్చి అందిస్తున్న శుభాశీస్సులు. మల్లన్న కృపాకటాక్ష ప్రాప్తిరస్తు. ❤️❤️

❤️మా ఇంటి మహారాణి “హారిక” కి శుభాశీస్సులు. దీర్ఘ సుమంగళీభవ!! సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లు తల్లీ! ❤️🌹🤗

❤️నా పెద్ద మనుమరాలు “చిత్కళ” బంగారు తల్లి. నా వరాల దేవత. శ్రీమాత్రే నమః. శుభాశీస్సులు బంగారు తల్లి. ❤️😘🤗🌹🌹🌹🌹🌹unconditional love ❤️ 

❤️చిన్న మనుమరాలు “అనిక” అచ్చంగా My Man 🤗😅😘 శుభాశీస్సులు రా చిన్నోడా! 🤗😍😘❤️🌹🎈

నాకు తల్లిదండ్రులు గానే ప్రేమను పంచిన నా అత్తమామలకు కృతజ్ఞతలు పాదాభివందనం 🙏🙏

❤️తమ బిడ్డనిచ్చి నా ఇంటికి వెలుగులు నింపిన సహృదయులు మంచివాళ్ళు కోడలు తల్లిదండ్రులైన అన్నయ్య గారికి మణి గారికి  హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు.🙏🌹❤️

❤️ అడుగడుగునా ప్రేమను పంచి సలహాలిచ్చే నా స్నేహసౌధానికి మూలస్తంభాలు గా నిలిచిన  నా స్నేహితులకు.. ఆత్మీయ స్పర్శ తో .. గాఢాభిమాన ఆలింగనాలు. ❤️❤️🌹🎈

నేను ఏం రాసినా చదివి మీ సంజ్ఞల వ్యాఖ్యల ద్వారా నన్ను ప్రోత్సహించిన FB మిత్రులందరికీ.. హృదయపూర్వక నమస్కారములు.. ధన్యవాదాలు  కృతజ్ఞతలు . 🙏💐💐

నేను కాలూని వున్న ఈ భూమికి ఈ ప్రకృతికి ఈ సమాజానికి .. నమస్సులు🙏

ఫాల్గుణ పంచమి ఆదివారం 05:30 am  ఉత్తరాభాద్ర నక్షత్రం లో మీన రాశి లో జన్మించాను అని మా అమ్మ చెప్పింది. మా ఇంటి భగవద్గీత లో  నోట్ చేసి వుంచారు. 

ఎందుకు పుట్టానో .. ఎవరికి ఏం ఇచ్చానో ఏం లభించిందో  అంతా భగవంతుడికి ఎరుక. 🙏  వనమాలి ❤️🙏

58 సంవత్సరాల కి ధన్యవాదాలు కృతజ్ఞతలు  🙏🌹

#వనజతాతినేని #vanajatatineni #hilights #follower #thankful #శుభాకాంక్షలు



17, ఫిబ్రవరి 2026, మంగళవారం

క్షమయా ధరిత్రి




 పంట కోసాక ఖాళీగా ఉన్న భూమిని  చూస్తూ ముచ్చట్లు చెపుతున్న  గులాబీ ని చూస్తూ వచ్చిన ఆలోచనలను ఇలా!  . 

అనగనగా ఒకానొక కాలంలో అంకితభావంతో సేద్యం చేసే రైతు వుండేవాడు. 

కాలం ఏదైనా ప్రకృతి కి నాగరికత కు మధ్య వారధిగా నిలిచినవాడతను.  

ఒయాసిస్సు ను నమ్ముకొని ఎడారి సేద్యం చేసినటువంటి వాడు. 

నెర్రెలిచ్చిన నేలను దున్ని విత్తనం నాటతాననే ఆశ కలవాడు. 

ధాన్యం ఏమిటీ ధనం కూడా పండించగల మనుకునే అతిశయం ప్రదర్శించేవాడు. 

నదులన్నా ఏరులన్నా సరస్సులన్నా వాగు వంకలన్న ఆరాధ్య భావం కల్గినవాడు. 

గుప్పిళ్ళతో జల్లి కుంచాలతో గాదెను నింపేవాడు. 

ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని 

అమ్మడానికి వస్తుమార్పిడికి ఇచ్చగించేవాడు కాదు. నాణాలను వేసిన సంచీని  నిప్పు ను ఒడినగట్టుకుని తిరిగినట్లు తిరిగేవాడు. తరాలు మారాయి అతని కొడుకులు మనుమలు అందరూ సేద్యంలో ఆరితేరిన వారయ్యారు. కానీ అతను పండించినట్లు పండించలేకపోతున్నారు. బాట మళ్ళారు కొందరు. సాయగాళ్ళు లేని సేద్యం 

పుట్టెడు అప్పుల్లో మునిగిపోయింది

భార్యబిడ్డలు అతన్నొదిలేసిపోయారు. పొలం ఇల్లు వాకిలి దొడ్డి గొడ్డు అన్నీ కొత్త సంరక్షణలో సర్దుకున్నాయి.  

అడిగిన వారికి అడగని వారికి దారిన పోయేవారిని ఆపి.. తన ఆలోచనలను వినిపించేవాడు. 

నాకు మూడు తలంపులు  వున్నాయి. 

క్షామం అనేది ఎరుగని కాలం వొకటి వుండాలని కోరిక. 

జగతిలో వున్న మానవులందరికి  ప్రతిరోజూ పట్టెడన్నం పెట్టగల్గాలని వ్యామోహం.

ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ రైతే రాజుగా అధికారంలో వుండాలి. అప్పుడే ప్రజలకు రక్షణ. 

ప్రతి మానవుడు భావోద్వేగాలను అనుభవించడానికి కారణం  పై మూడే! అని చెప్పేవాడు. 

అతన్ని పిచ్చివాడిని చూసినట్లు చూసేవారు జనం. 

అతను ఊరు విడనాడాడు. కాలు వెళ్ళిన చోటుకల్లా వెళ్ళాడు. 

పవిత్ర గంగ లో సాగర సంగమం లో  త్రివేణి సంగమం లో 

కుంభమేళాలో  అనేక పుష్కరాల సమయంలో  పుణ్య స్నానం చేసాడు. 

కానీ..  అతని తపన తీరలేదు. 

నది జాలిపడి అతని చెవిలో ఒక రహస్యం చెప్పింది. 

నువ్వు భూమిని నాగలితో దున్నిన పాపం  వదిలిపోలేదు. 

పచ్చి బాలింతరాలు అని కూడా చూడకుండా మళ్ళీ మళ్ళీ దున్నావు విత్తులు చల్లావ్  అని. 

అతను కనులు మూసుకుని గతం లోకి కళ్ళు తెరిచాడు. 

“ధరణి బాధతో అల్లాడింది,శపించింది. . దున్నడానికి భూమి లేకుండా పడి వుండు అని. ప్రకృతి శక్తులు భూమికి మద్దతు పలికాయి. అతివృష్టి అనావృష్టి. జనులు క్షామంతో  అల్లాడిపోతున్నారు.”

అతను భూమిని క్షమించమని చేతులు జోడించి వేడుకున్నాడు. అలాగే నేలకొరిగాడు. 

కొన్నేళ్ళకి భూమి తల్లి శాంతించింది. ప్రకృతి సహకరించింది. ధాన్యం విరివిగా పండింది. ఆశ కి అంతు లేకుండా ధనం కోసం మళ్ళీ చేసిన తప్పు చేస్తూనే వున్నారు  అతని లాంటి అనేకులు.  


************

సుద్దాల అశోక్ తేజ గారి గీతం లో చిన్న భాగం .. 

పరువమోచ్చి సేను వంగే పైరు

కాపు మేను పొంగే పంట

బిడ్డను రైతు బండికెత్తినంక

పగిలిపోతుంది నీ గుండె

నేలమ్మా....! నేలమ్మా…..!

నేలమ్మ నేలమ్మ నేలమ్మా 

నీకు వేల వేల వందనాలమ్మా 💚🙏❤️


#వనజతాతినేని #vanajatatineni #hilights #follower #MobilePhotography #shortstory

14, ఫిబ్రవరి 2026, శనివారం

సంరక్షణ కన్నా మించిన ప్రేమ ఏముంటుంది !?



సంరక్షణ కన్నా మించిన ప్రేమ మరొకటి ఏం వుంది. !!!?

కాకరపాదుకు గోరు వెచ్చని నీళ్ళు పోస్తే పూత పిందె నిలబడతాయి నాయనమ్మ మాటలు జ్ఞాపకం చేసుకుంది. కాకరపాదుకు గుండ్రంగా పాదుచేసి కుదురు చుట్టూ తవ్వి తీగకు ఎడంగా నాపబండ వేసింది. పిల్లాడిని ఆ బండపై నిలబెట్టి కబుర్లు చెపుతూ ఒళ్ళు రుద్దుతూ గిలిగింతలు పెడుతూ  ఇద్దరూ కలిసి నవ్వుకుంటూ తుళ్ళుకుంటూ స్నానం అయిపించేది.  సున్నిపిండితో కలిసిన గోరువెచ్చని నీరు తాగిన కాకరపాదు అమ్మ కొడుకు సరదా కబుర్లు అల్లిబిల్లి పాటలు  విన్న కాకరపాదు విరగబడి పూచేది,ఆరోగ్యంగా కాచేది. కాయలు కోయాలి అన్నప్పుడు అమ్మ అబ్బాయి ముఖముఖాలు చూసుకునేవారు. వాళ్ళిద్దరూ మనసొప్పక మాలుకున్నా కోసే చేయి కోయక మానేదికాదు,కూర అవ్వకుండా ఊరుకునేది కాదు. అది నా ఒకప్పటి సంగతి.


కరివేపాకు మొక్కకు బియ్యం కడిగిన నీరు రోలు కడిగిన నీరు పొయ్యి… బాగా గుబురుగా పెరుగుతుంది అని అమ్మ చెప్పింది. ఆ మాటలు గుర్తు చేసుకుంటూ ఆచరణ. ఈ రోజుకి కుండీలో పెరిగే కరివేపాకు మొక్కకు  అదే తిండి అదే దాహం. రోజూ.. కచ్చితంగా చెప్పాలంటే 365 రోజులూ  నాలుగైదు రెమ్మల కరివేపాకు సంకోచం లేకుండా తెంపుకొచ్చి నలిపి కూరలో వేయడమే!  ఇది ఇప్పటి సంగతి. 


ఇక పూల మొక్కలకు చెట్లకు వేర్వేరు సూచనలు. నేల కరువై వాష్ ఏరియాలో ఎండ తగిలే చోట నాలుగైదు పూల మొక్కలు పెట్టుకుని వాటికి చేసే సంరక్షణ. ఫిల్టర్ లో వడపోత అయ్యాక మిగిలిన సారం లేని గుప్పెడు కాఫీపొడి  ముద్ద, వడపోసాక కూడా అల్లం యాలకులపొడి లవంగం మొగ్గల పరిమళంతో కూడిన ఘాటు లేని  టీ పొడి, పాల గిన్నె కడిగిన నీళ్ళు, పెరుగు గిన్నె తొలిపిన నీళ్ళు, బియ్యం కడుగు, అన్ని రకాల పప్పు కడిగిన నీళ్ళు, ఆఖరికి సగ్గు బియ్యం కడిగిన నీళ్ళు ఏది వృధా గా పోయేది లేదు. ఆఖరికి కాఫీ టీ కప్పు కడిగిన నీళ్ళు కూడా. 


శంఖుతీగె పెద్ద పెద్ద పూలు ఇస్తుంది. కనకాంబరాల చెట్లు ప్రాణశక్తి నంతా ధారపోసి సహజ వర్ణానికి మెరుపు జతచేసి పిగిలిపడతాయి. ఇక తామరలు నిద్రాణవస్థను భంగపరిచి పూలు నిస్తాయి. మెక్సికన్ పెటూనియా, అడేనియం పూలు ఆరోగ్యంగా హాసం వెదజల్లుతాయి.పుదీనా కోసిన కొలదీ విరగబడి పెరుగుతుంది. కోయకపోయినా మరువం మరి మరీ కొమ్మ రెమ్మలతో కుండీ నిండా పరుచుకుంటుంది. ఇక ఇండోర్ ప్లాంట్స్ నన్ను ఇబ్బంది పెట్టకుండా నిదానంగా పెరుగుతుంటాయి. 

రోజూ పూజకు  పూలు కోసుకుంటూ అనుకుంటాను. నేను పరిశుభ్రమైన తిండి తింటూ పానీయాలు తాగుతూ   మీ ముఖాన ఎంగిలి నీళ్ళు పోస్తాను. అవేమీ మనసుకు తీసుకోకుండా ప్రతి ఉదయం తాజా తాజా పువ్వులను ఇస్తుంటారు. మీది ఎంతో ఉదార హృదయం అంటూ చెట్టుకు కృతజ్ఞతలు చెప్పి క్షమాపణలు చెప్పి.. దేవుని పూజ కొరకు పువ్వులు కోసుకుంటున్నాననే మాట విన్నమించి పువ్వులు కోస్తాను. 


మనం ఎవరికైనా.. భూమి కైనా సరే  ఏమి ఇస్తున్నాం ఏం తీసుకుంటున్నాం !? ఎప్పుడేనా ఆలోచిస్తున్నామా!? మన బిడ్డలకు ఎలాగూ త్యాగాలు చేసి మరీ నాణ్యమైనవి ఇవ్వడానికి తాపత్రయ పడతాం. మన తల్లిదండ్రులకు కూడా ఇవ్వడానికి ప్రాణం వొప్పదు ఒకోసారి. అసలు మనని భరిస్తున్న భూమికి  పర్యావరణానికి ఏం ఇస్తున్నాం!? కాలుష్యం కాలుష్యం కాలుష్యం. విషం విషం విషం. తోటి ప్రాణులను ప్రాణాలు తీసి మన జిహ్వలను చల్లార్చుకుంటున్నాం. 


ఇక తోటి మనుషుల పట్ల మన చర్యలు ఎంత అహేతుకం !!!? అర్ధం పర్ధం లేని ఈర్ష్యలు ద్వేషాలు అనుమానాలు,వంకర మాటలు. ఆంటోని చెకోవ్ “మాస్క్” కథ విన్నాను ఈ రోజు. పంచతంత్రం కథల్లో “మిత్రలాభం” చదివాను పొద్దున్నే! ఈ రోజుల్లో అసలైన మిత్రులు వున్నారా!? అవసరాలు తప్ప అభిమానాలు వున్నాయా!? ఒక్క హితమైన మాట చెబితే శత్రువైపోతున్నాం. 


మనం ప్రకృతిని చూసి అయినా నేర్చుకుందాం.వీలైనంత భరించి ఇతరులకు ఆహ్లాదం పంచుదాం. 


 నా చిన్ననాటి నుండి మొక్కల సంరక్షణ పోషణ నుండీ  ఈనాడు నా బాల్కనీ గార్డెన్ లో మొక్కలు పెంపకం నుండి నేను నేర్చుకున్న పాఠం ఇది. 


మన బిడ్డల వలెనె మనని కన్న తల్లిదండ్రులకు మన అత్తమామలకు, మన బిడ్డలకు జీవితాంతం తోడు నీడగా నిలబడటానికి వచ్చిన వారిని అత్యున్నతంగా భావించండి. వారికి మంచివే ఇవ్వండి మన స్నేహితులను ఎవరినీ తక్కువ చేసుకోవద్దు. వారు ఎలాంటి వారైనా సహృదయంతో వుండండి.దుష్టులు కానంత వరకూ వారికి సన్నిహితంగానే వుండండి. కాలక్షేపపు కబుర్లలో వారి గురించి చెడుగా ప్రచారం చేయకండి.  పరిస్థితుల వల్ల డబ్బు ఇచ్చి ఆదుకోలేకపోవచ్చు. కానీ హితం కల్గించే మాట చెప్పడానికి కష్టంలో వెళ్ళి పక్కన నిలబడటానికి నిర్లక్ష్యం పిసినారితనం చూపకండి. 


Learn more Do more  Give more Forgive more Become more. 


కనీసం నాలుగు మొక్కలు పెంచండి. రెండు చెట్లు పెంచండి. 💚🍀🌿🌴

సంరక్షణ కన్నా మించిన ప్రేమ మరొకటి ఏం వుంటుంది!? 


ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మిత్రులందరికీ .. నా ప్రేమ 💚💚💚