పంట కోసాక ఖాళీగా ఉన్న భూమిని చూస్తూ ముచ్చట్లు చెపుతున్న గులాబీ ని చూస్తూ వచ్చిన ఆలోచనలను ఇలా! .
అనగనగా ఒకానొక కాలంలో అంకితభావంతో సేద్యం చేసే రైతు వుండేవాడు.
కాలం ఏదైనా ప్రకృతి కి నాగరికత కు మధ్య వారధిగా నిలిచినవాడతను.
ఒయాసిస్సు ను నమ్ముకొని ఎడారి సేద్యం చేసినటువంటి వాడు.
నెర్రెలిచ్చిన నేలను దున్ని విత్తనం నాటతాననే ఆశ కలవాడు.
ధాన్యం ఏమిటీ ధనం కూడా పండించగల మనుకునే అతిశయం ప్రదర్శించేవాడు.
నదులన్నా ఏరులన్నా సరస్సులన్నా వాగు వంకలన్న ఆరాధ్య భావం కల్గినవాడు.
గుప్పిళ్ళతో జల్లి కుంచాలతో గాదెను నింపేవాడు.
ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని
అమ్మడానికి వస్తుమార్పిడికి ఇచ్చగించేవాడు కాదు. నాణాలను వేసిన సంచీని నిప్పు ను ఒడినగట్టుకుని తిరిగినట్లు తిరిగేవాడు. తరాలు మారాయి అతని కొడుకులు మనుమలు అందరూ సేద్యంలో ఆరితేరిన వారయ్యారు. కానీ అతను పండించినట్లు పండించలేకపోతున్నారు. బాట మళ్ళారు కొందరు. సాయగాళ్ళు లేని సేద్యం
పుట్టెడు అప్పుల్లో మునిగిపోయింది
భార్యబిడ్డలు అతన్నొదిలేసిపోయారు. పొలం ఇల్లు వాకిలి దొడ్డి గొడ్డు అన్నీ కొత్త సంరక్షణలో సర్దుకున్నాయి.
అడిగిన వారికి అడగని వారికి దారిన పోయేవారిని ఆపి.. తన ఆలోచనలను వినిపించేవాడు.
నాకు మూడు తలంపులు వున్నాయి.
క్షామం అనేది ఎరుగని కాలం వొకటి వుండాలని కోరిక.
జగతిలో వున్న మానవులందరికి ప్రతిరోజూ పట్టెడన్నం పెట్టగల్గాలని వ్యామోహం.
ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ రైతే రాజుగా అధికారంలో వుండాలి. అప్పుడే ప్రజలకు రక్షణ.
ప్రతి మానవుడు భావోద్వేగాలను అనుభవించడానికి కారణం పై మూడే! అని చెప్పేవాడు.
అతన్ని పిచ్చివాడిని చూసినట్లు చూసేవారు జనం.
అతను ఊరు విడనాడాడు. కాలు వెళ్ళిన చోటుకల్లా వెళ్ళాడు.
పవిత్ర గంగ లో సాగర సంగమం లో త్రివేణి సంగమం లో
కుంభమేళాలో అనేక పుష్కరాల సమయంలో పుణ్య స్నానం చేసాడు.
కానీ.. అతని తపన తీరలేదు.
నది జాలిపడి అతని చెవిలో ఒక రహస్యం చెప్పింది.
నువ్వు భూమిని నాగలితో దున్నిన పాపం వదిలిపోలేదు.
పచ్చి బాలింతరాలు అని కూడా చూడకుండా మళ్ళీ మళ్ళీ దున్నావు విత్తులు చల్లావ్ అని.
అతను కనులు మూసుకుని గతం లోకి కళ్ళు తెరిచాడు.
“ధరణి బాధతో అల్లాడింది,శపించింది. . దున్నడానికి భూమి లేకుండా పడి వుండు అని. ప్రకృతి శక్తులు భూమికి మద్దతు పలికాయి. అతివృష్టి అనావృష్టి. జనులు క్షామంతో అల్లాడిపోతున్నారు.”
అతను భూమిని క్షమించమని చేతులు జోడించి వేడుకున్నాడు. అలాగే నేలకొరిగాడు.
కొన్నేళ్ళకి భూమి తల్లి శాంతించింది. ప్రకృతి సహకరించింది. ధాన్యం విరివిగా పండింది. ఆశ కి అంతు లేకుండా ధనం కోసం మళ్ళీ చేసిన తప్పు చేస్తూనే వున్నారు అతని లాంటి అనేకులు.
************
సుద్దాల అశోక్ తేజ గారి గీతం లో చిన్న భాగం ..
పరువమోచ్చి సేను వంగే పైరు
కాపు మేను పొంగే పంట
బిడ్డను రైతు బండికెత్తినంక
పగిలిపోతుంది నీ గుండె
నేలమ్మా....! నేలమ్మా…..!
నేలమ్మ నేలమ్మ నేలమ్మా
నీకు వేల వేల వందనాలమ్మా 💚🙏❤️
#వనజతాతినేని #vanajatatineni #hilights #follower #MobilePhotography #shortstory

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి