1, ఫిబ్రవరి 2026, ఆదివారం

50+ లో యాక్టివ్ గా ఉండటం ఎలా!?

 50 + లో   సంకోచాలు జయించి యెలా వుండాలి!!?. 

సాధారణంగా నేను చాలా ఉత్సాహంగా ఉంటాను. నాకు అడ్డుకట్ట వేయగల్గినవి సీరియస్ కండీషన్స్ మాత్రమే! లేకపోతే కారణం లేకుండా ఎవరైనా డిస్ట్రబ్ చేస్తే ముభావంగా మారిపోతాను. ఎవరైనా పలకరిస్తే మాటల ప్రవాహమే! అందులో వ్యక్తిగతం పదిశాతం సామాజికం నలబై శాతం.. మిగతాది పుస్తకాలు గురించిన మాటలు వుంటాయి. పాతికేళ్ళుగా నా మైండ్ అలా ట్యూన్ అయిపోయింది మరి. ఆపాత మధురం సంగీతం -  ఆలోచనామృతం సాహిత్యం అని సిరివెన్నెల అన్నారు కదా! 


పిల్లలు మనని వదిలి దూరంగా వెళ్ళే సమయానికి మనకు చేతినిండా సరిపడా పని లేదా కాలక్షేపం వుండాలి. వ్యక్తిగతంగా మన అభిరుచులకు సమయం కేటాయించుకోవాలి. లేకపోతే డిప్రెషన్ కి గురి అవుతాము. మా అబ్బాయి 15 ఏళ్ళ క్రితం USA వెళ్ళేటప్పుడు డెస్క్ టాప్ ఓపెన్ చేయించి మౌస్ చేతిలో పెట్టి వెళ్ళాడు. ఇక నా కాలక్షేపం అభిరుచి అవసరం అన్నీ.. ఇంటర్నెట్ తో అనుసంధానం అయిపోయింది. బ్లాగ్ ఓపెన్ చేసాను.. ఏవో కాలక్షేపం కోసం రాస్తూ.. నాకున్న సాహిత్య అభిలాషను సీరియస్ గానే తీసుకున్నాను. ఇదిగో ఇప్పుడు ఇలా వున్నాను. ఎక్కువగా ఒంటరితనం కోరుకుంటాను. అలా అని నేను ఇంట్రావర్ట్ ని కాదు. ఒకోసారి చుట్టుపక్కల వందమంది వున్నా నేను నాతో ఏకాంతంగా వుండగలను. నన్ను నేను యాక్టివ్ గా వుంచుకోవడానికి నా చుట్టూ చిన్నపిల్లలు వుంటే వారితో మాట్లాడతాను.వారితో ఆటలాడతాను. మంచి పాటలు వింటాను. మూడీగా వుంటే పెద్ద సౌండ్ పెట్టి ఫాస్ట్ బీట్ పాటలు వింటాను. డాన్స్ చేస్తాను. ఫ్రెండ్స్ తో బాతాఖానీ వేస్తాను. క్రమం తప్పకుండా మా పెద్దవారిని పిల్లలను పలకరిస్తాను. 

ఎన్ని ఆర్థిక ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా వచ్చినా నేనెప్పుడూ కృంగిపోను. కానీ ఎవరైనా అసంబద్ధమైన ఆరోపణలు చేసినా, నిందించినా చాలా బాధ పడతాను. త్వరగా అందులో నుండి బయటకు రాలేను. కరోనా సమయంలో పద్దెనిమిది నెలలు చాలా ఇబ్బంది పడ్డాను. తర్వాత నా మనుమరాలుతో గడిపి ఆ గాయం మాన్పుకోగల్గాను. పుస్తకాలు చదవడం.. అదీ నేను సీరియస్ సాహిత్యం చదువుతాను రాస్తాను కాబట్టి ఎక్కువగా పెయిన్ మూడ్ లో వుంటాను. నన్ను సేదదీర్చేది సంగీత సముద్రమే! పాటలు.. పాటలు.. పాటలు.  Instrumentals music వింటాను.ఎక్కువగా flute base వినడం నాకిష్టం. నాకు వినడమే తప్ప సంగీత పరిజ్ఞానం లేదు. వృద్ధాప్యం ముంచుకొస్తుంటే మనుషులు యాక్టివ్ గా వుండాలంటే సంగీతం తప్పక వినాలి పసిపిల్లలతో గడపాలి. లేకపోతే స్థబ్దత ఆవరిస్తుంది. హాస్యం కూడా మనిషిని యాక్టివ్ గా వుంచుతుంది. నేను హాస్య రసాన్ని ఎంజాయ్ చేయలేను. 


నేను ఎప్పుడైనా.. పాటలకు తగ్గట్టు డాన్స్ వేస్తుంటే మా నాన్న చూస్తే సన్నగా నవ్వుకుంటారు. మా అన్నయ్య పరుగులు పెడుతున్నా, డాన్స్ వేస్తున్నా “ఏంటి చిన్న పిల్లలాగా “ అని మందలిస్తాడు. మా అబ్బాయి అయితే “అమ్మా! నీ ఏజ్ ఎంత?” అంటాడు. ఇవ్వన్నీ అసలు పట్టించుకోను నేను. మన శరీరం మైండ్ హెల్దీ గా ప్రెష్ గా వుండాలి అంటే.. మనకి నచ్చిన పనులు చేయాలి. మొక్కలు పెంచడం, పాటలు వినడం, నలుగురితో కలవడం, మాట్లాడటం వల్ల యాక్టివ్ గా వుంటాము. అంతే తప్ప stage యెక్కి డాన్స్ చేస్తామని కాదు.ఊరికే సరదాగా  ఇంట్లోనే, అంతే! సినిమాల్లో పాటలు మనలోని కాల్పనిక భావాలకు రూపాలు. కాకపోతే మనమందరం ఎందుకు చూస్తున్నాం చెప్పండి!? 

నా మనుమరాళ్ళు ఇద్దరూ డాన్స్ చేస్తారు. చిన్నామె 20 నెలలు. చాలా యాక్టివ్. డాన్స్ లో మంచి ఈజ్ అండ్ గ్రేస్ వుంటుంది.ఆరేళ్ల పెద్దామె.. వీడియో కాల్ లో సంగీత పాఠాలు చెబుతుంది. వాళ్ళతో ఓ పదేళ్ళు యాక్టివ్ వుండి ఆడుకోవాలి,పాడుకోవాలి 


మన శంకరవరప్రసాద్ గారు.. ఆ వయసులో డాన్స్ వేస్తుంటే మనక్కూడా వేయాలనిపిస్తుంది కదా! 😊. నేనైతే  డాన్సింగ్ హిట్ ఫెయిర్ చిరంజీవి - రాధ గారి కాంబినేషన్ లో ఏ పాటకైనా పదం కలపాలి వచ్చీ రానట్టు అయినా సరే.😊😊


డాన్స్ అయినా సరే,  డ్రెస్సింగ్ అయినా సరే, హెయిర్ స్టైల్ అయినా సరే, రాత అయినా సరే, డ్రైవింగ్ అయినా సరే! నన్నెవరూ ఆపలేరు. ఇవి నా వ్యక్తిగతం. విచక్షణ హద్దులు నాకు తెలుసు. 

I am most responsible citizen. 


మనుషులు,పరిస్థితులు,సంఘటనలు మనని బాధపెడతాయి. కానీ మనుషులు సృజించిన సాహిత్యం సంగీతం మనకి మూలమైన ప్రకృతి మనని సేదదీరుస్తాయి. మనకు ఎవరో తోడుంటారని వస్తారని ఆశించకండి. ఎవరికి వారే తోడు. ఎవరికి వారే ఒక సైన్యం. ఎవరికి వారే బుల్లెట్ ప్రూఫ్,శిరస్థ్రాణం. 

మన పిల్లలు ఎక్కడో దూరంగా వారి జీవనపోరాటంలో వారుంటారు. వారికి ప్రతిరోజూ మనని పలకరించే ఓపిక ఆసక్తి కూడా లేకపోవచ్చు. వారు పలకరించడం లేదనే కినుక కూడా అనవసరం.

మనని మనమే ఎంగేజ్ చేసుకోవాలి. ఇంకా మన తరానికి కొద్దో గొప్పో రక్తస్పర్శ విలువ తెలిసిన తోడబుట్టినవారు, బంధువులు వున్నారు. వారితో చిన్న చిన్న విషయాలకు విభేధాలకు పోకుండా జాగ్రత్తగా బంధాలను కాపాడుకోండి. ఒకరికొకరు తోడుగా నిలబడండి. సోషల్ మీడియా స్నేహాలతో జాగ్రత్తగా వుండండి. పర్సనల్స్ వరకూ వెళ్ళకండి. మన గాడ్జెట్ నుండి app delete చేస్తే వారెవరో మనం ఎవరమో అన్నది బాగా గుర్తు పెట్టుకోండి. నమ్మకమైన మిత్రులు నలుగురు వున్నా చాలు. వీలైనంత ప్రశాంతంగా వుండేటట్లు జాగ్రత్త వహించండి. వీలైనంతగా నెగిటివ్ స్ప్రెడ్ చేయకండి దూరంగా వుండండి . పాజిటివ్ గా వుండండి. మూఢనమ్మకాలను విడనాడండి. చాదస్తం పెంచుకోకండి. డిప్రెషన్ కి సంగీతం మంచి మందు.  ముఖ్యంగా YouTube video’s చూసి ప్రతి రోగం మనకు వుందని టెన్షన్ పడకండి. వారు చెప్పే వాటిలో లక్షణాలు సగం పైగా వుంటేనే డాక్టర్ ని చూడండి.


ఏ ఏజ్ గ్రూప్ వారైనా సరే సంగీతం వినండి. ఉత్సాహంగా వుండండి. మన కుటుంబ సభ్యులకు మన గురించి దిగులుపడే అవకాశాన్ని మనకు అధిక సమయం కేటాయించాల్సిన అవసరాన్ని తగ్గించే విధంగా.. నడుచుకోవాలి. వీలైనంత తక్కువగా ఇతరులపై ఆధారపడండి. గౌరవంగా వుంటారు. 

మంచి పాట ఒకటి వినండి మరి. 

పాట సాహిత్యం సంగీతం చిత్రీకరణ అన్నీ బాగుండే పాట ఇది. 

Happy day.. and Good night.

నా పోస్ట్ లకి ఎన్ని లైక్స్ కామెంట్ షేర్ లు వచ్చాయి అన్నది పట్టించుకోను.

ఏదైనా మిత్రులతో పంచుకోవాలి అనుకున్నప్పుడు.. ఇలా వచ్చేయ్యడమే! 😊


కామెంట్‌లు లేవు: