సంరక్షణ కన్నా మించిన ప్రేమ మరొకటి ఏం వుంది. !!!?
కాకరపాదుకు గోరు వెచ్చని నీళ్ళు పోస్తే పూత పిందె నిలబడతాయి నాయనమ్మ మాటలు జ్ఞాపకం చేసుకుంది. కాకరపాదుకు గుండ్రంగా పాదుచేసి కుదురు చుట్టూ తవ్వి తీగకు ఎడంగా నాపబండ వేసింది. పిల్లాడిని ఆ బండపై నిలబెట్టి కబుర్లు చెపుతూ ఒళ్ళు రుద్దుతూ గిలిగింతలు పెడుతూ ఇద్దరూ కలిసి నవ్వుకుంటూ తుళ్ళుకుంటూ స్నానం అయిపించేది. సున్నిపిండితో కలిసిన గోరువెచ్చని నీరు తాగిన కాకరపాదు అమ్మ కొడుకు సరదా కబుర్లు అల్లిబిల్లి పాటలు విన్న కాకరపాదు విరగబడి పూచేది,ఆరోగ్యంగా కాచేది. కాయలు కోయాలి అన్నప్పుడు అమ్మ అబ్బాయి ముఖముఖాలు చూసుకునేవారు. వాళ్ళిద్దరూ మనసొప్పక మాలుకున్నా కోసే చేయి కోయక మానేదికాదు,కూర అవ్వకుండా ఊరుకునేది కాదు. అది నా ఒకప్పటి సంగతి.
కరివేపాకు మొక్కకు బియ్యం కడిగిన నీరు రోలు కడిగిన నీరు పొయ్యి… బాగా గుబురుగా పెరుగుతుంది అని అమ్మ చెప్పింది. ఆ మాటలు గుర్తు చేసుకుంటూ ఆచరణ. ఈ రోజుకి కుండీలో పెరిగే కరివేపాకు మొక్కకు అదే తిండి అదే దాహం. రోజూ.. కచ్చితంగా చెప్పాలంటే 365 రోజులూ నాలుగైదు రెమ్మల కరివేపాకు సంకోచం లేకుండా తెంపుకొచ్చి నలిపి కూరలో వేయడమే! ఇది ఇప్పటి సంగతి.
ఇక పూల మొక్కలకు చెట్లకు వేర్వేరు సూచనలు. నేల కరువై వాష్ ఏరియాలో ఎండ తగిలే చోట నాలుగైదు పూల మొక్కలు పెట్టుకుని వాటికి చేసే సంరక్షణ. ఫిల్టర్ లో వడపోత అయ్యాక మిగిలిన సారం లేని గుప్పెడు కాఫీపొడి ముద్ద, వడపోసాక కూడా అల్లం యాలకులపొడి లవంగం మొగ్గల పరిమళంతో కూడిన ఘాటు లేని టీ పొడి, పాల గిన్నె కడిగిన నీళ్ళు, పెరుగు గిన్నె తొలిపిన నీళ్ళు, బియ్యం కడుగు, అన్ని రకాల పప్పు కడిగిన నీళ్ళు, ఆఖరికి సగ్గు బియ్యం కడిగిన నీళ్ళు ఏది వృధా గా పోయేది లేదు. ఆఖరికి కాఫీ టీ కప్పు కడిగిన నీళ్ళు కూడా.
శంఖుతీగె పెద్ద పెద్ద పూలు ఇస్తుంది. కనకాంబరాల చెట్లు ప్రాణశక్తి నంతా ధారపోసి సహజ వర్ణానికి మెరుపు జతచేసి పిగిలిపడతాయి. ఇక తామరలు నిద్రాణవస్థను భంగపరిచి పూలు నిస్తాయి. మెక్సికన్ పెటూనియా, అడేనియం పూలు ఆరోగ్యంగా హాసం వెదజల్లుతాయి.పుదీనా కోసిన కొలదీ విరగబడి పెరుగుతుంది. కోయకపోయినా మరువం మరి మరీ కొమ్మ రెమ్మలతో కుండీ నిండా పరుచుకుంటుంది. ఇక ఇండోర్ ప్లాంట్స్ నన్ను ఇబ్బంది పెట్టకుండా నిదానంగా పెరుగుతుంటాయి.
రోజూ పూజకు పూలు కోసుకుంటూ అనుకుంటాను. నేను పరిశుభ్రమైన తిండి తింటూ పానీయాలు తాగుతూ మీ ముఖాన ఎంగిలి నీళ్ళు పోస్తాను. అవేమీ మనసుకు తీసుకోకుండా ప్రతి ఉదయం తాజా తాజా పువ్వులను ఇస్తుంటారు. మీది ఎంతో ఉదార హృదయం అంటూ చెట్టుకు కృతజ్ఞతలు చెప్పి క్షమాపణలు చెప్పి.. దేవుని పూజ కొరకు పువ్వులు కోసుకుంటున్నాననే మాట విన్నమించి పువ్వులు కోస్తాను.
మనం ఎవరికైనా.. భూమి కైనా సరే ఏమి ఇస్తున్నాం ఏం తీసుకుంటున్నాం !? ఎప్పుడేనా ఆలోచిస్తున్నామా!? మన బిడ్డలకు ఎలాగూ త్యాగాలు చేసి మరీ నాణ్యమైనవి ఇవ్వడానికి తాపత్రయ పడతాం. మన తల్లిదండ్రులకు కూడా ఇవ్వడానికి ప్రాణం వొప్పదు ఒకోసారి. అసలు మనని భరిస్తున్న భూమికి పర్యావరణానికి ఏం ఇస్తున్నాం!? కాలుష్యం కాలుష్యం కాలుష్యం. విషం విషం విషం. తోటి ప్రాణులను ప్రాణాలు తీసి మన జిహ్వలను చల్లార్చుకుంటున్నాం.
ఇక తోటి మనుషుల పట్ల మన చర్యలు ఎంత అహేతుకం !!!? అర్ధం పర్ధం లేని ఈర్ష్యలు ద్వేషాలు అనుమానాలు,వంకర మాటలు. ఆంటోని చెకోవ్ “మాస్క్” కథ విన్నాను ఈ రోజు. పంచతంత్రం కథల్లో “మిత్రలాభం” చదివాను పొద్దున్నే! ఈ రోజుల్లో అసలైన మిత్రులు వున్నారా!? అవసరాలు తప్ప అభిమానాలు వున్నాయా!? ఒక్క హితమైన మాట చెబితే శత్రువైపోతున్నాం.
మనం ప్రకృతిని చూసి అయినా నేర్చుకుందాం.వీలైనంత భరించి ఇతరులకు ఆహ్లాదం పంచుదాం.
నా చిన్ననాటి నుండి మొక్కల సంరక్షణ పోషణ నుండీ ఈనాడు నా బాల్కనీ గార్డెన్ లో మొక్కలు పెంపకం నుండి నేను నేర్చుకున్న పాఠం ఇది.
మన బిడ్డల వలెనె మనని కన్న తల్లిదండ్రులకు మన అత్తమామలకు, మన బిడ్డలకు జీవితాంతం తోడు నీడగా నిలబడటానికి వచ్చిన వారిని అత్యున్నతంగా భావించండి. వారికి మంచివే ఇవ్వండి మన స్నేహితులను ఎవరినీ తక్కువ చేసుకోవద్దు. వారు ఎలాంటి వారైనా సహృదయంతో వుండండి.దుష్టులు కానంత వరకూ వారికి సన్నిహితంగానే వుండండి. కాలక్షేపపు కబుర్లలో వారి గురించి చెడుగా ప్రచారం చేయకండి. పరిస్థితుల వల్ల డబ్బు ఇచ్చి ఆదుకోలేకపోవచ్చు. కానీ హితం కల్గించే మాట చెప్పడానికి కష్టంలో వెళ్ళి పక్కన నిలబడటానికి నిర్లక్ష్యం పిసినారితనం చూపకండి.
Learn more Do more Give more Forgive more Become more.
కనీసం నాలుగు మొక్కలు పెంచండి. రెండు చెట్లు పెంచండి. 💚🍀🌿🌴
సంరక్షణ కన్నా మించిన ప్రేమ మరొకటి ఏం వుంటుంది!?
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మిత్రులందరికీ .. నా ప్రేమ 💚💚💚

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి