అమ్మకు వంట గది నుంచి విరామం - వనజ తాతినేని
పొగ చూరిన ఇల్లు కట్టెల మంట మారాయన్నమాటే ..
అమ్మకి వంటింటి చిరునామా మారలేదు.
ముడ్డి కడుగుళ్ళు నుండి డైపర్ మార్చడం లోకి మారినా కానీ..
ఇంటి చాకిరీ మారలేదు
రోలు రోకలి తిరగలి నుండి గ్రైండర్ మిక్సీలకు మారినా కానీ
అమ్మ మరో యంత్రంలా పనిచేయాల్సిందే.
ఉమ్మడి కుటుంబం నుండి న్యూక్లియర్ ఫ్యామిలీ కి మారినా
బిడ్డలందరికీ అమ్మ సహాయం అత్యంత అవసరమే.
అమ్మ చేతిలో ఏం మహత్తు వుందో మరి!
చేదు కాకరకాయను కూడా అమృతతుల్యంగా మార్చేస్తుంది.
వంటలో ఉప్పు తక్కువైంది కదా అని అమ్మ తన కన్నీళ్ళను ఒంపలేదు
తనకు కోపం తెప్పించారని కూరలో కారం గుమ్మరించలేదు.
తన లాలనకు తోడు అనేక దినుసుల సువాసన కలగలిపి
ఇంటికి ఆకలిని రగిలించేది
సరుకుల గది నిండుకున్నా గుంభనంగా రోజును ఏమార్చేది.
ఇంటికి గుండె లాంటి వంటగది అది అమ్మ గది.
అక్కడ అనేక రుచులు పుట్టేవి.
జీడి పాకంలాగా కథలు సాగేవి
మోతాదు మించని దండనలు వుండేవి
చెప్పే ప్రతి విషయంలోనూ ఓ సందేశం వుండేది
అత్తింట్లో అందరికీ తలలో నాల్కలా మెలుగుతూ
గరళాన్ని గొంతులో మింగడం తప్ప బతుకు తీపి రుచి
ఏం తెలుసు అమ్మకి !? చూపించేది ఎవరూ అని?
పుల్లటి పదార్థాలకు తూకం వేసినట్టు ఏవేవో కలిపి
మంచి రుచిని తెప్పించినట్లు ఇంట్లో అందరి రుచులను
సంతృప్తి పరచడానికి అమ్మ తన జీవన మాధుర్యాన్ని
సంకోచం లేకుండా త్యాగం చేసింది
అందరి సంతోషమే తన సంతోషం అనుకున్న అమ్మ
అది ఎక్కువైనప్పుడు కూడా ఆ తీపిని కూడా
ముఖంలో ప్రదర్శించేదే తప్ప పదార్థాలకు అంటించేది కాదు.
కుటుంబం అంతా అవసరమైనప్పుడు కురిపించే
తీపి వెగటు రుచి అమ్మకు బాగా తెలుసు.
ఎనబై పైబడిన అమ్మ ఒకనాడు
కాలు చెయ్యి విరిగి మంచాన పడితే..
భోజనాల బల్లమీద తాజా వంటలను వేడి వేడిగా
ప్రేమ సువాసనలు అద్ది వఢ్డించే అమ్మకి
వేడి వేడి కాఫీ ఇచ్చే చెయ్యి కరువు
దశాబ్దాల పాటు కుటుంబానికి దాస్యం చేసిన అమ్మకు
గుక్కెడు నీళ్ళు ఇవ్వడానికి వంతులు
వెలిగించని స్టవ్ మీద మరుగుతున్న
అమ్మ వంటింటి జ్ఞాపకాలు
అమ్మని బలవంతంగా విశ్రాంత జీవనంలోకి మళ్ళించినా
అమ్మ ఆలోచనలన్నీ వంటగది చుట్టూనే..
కూరలు తక్కువ మంటతో వండాలి.
పాలు సన్న సెగ మీద కాయండి
మజ్జిగ కుండ తొలిపి మొక్కలకు పోయండి
పాలు వేడిగా వున్నప్పుడే మజ్జిగ చుక్క కలిపి
బాగా తిప్పి మూత పెట్టండి. తోడు మజ్జిగ చుక్క
చీపురు పుల్ల ముంచి తీస్తే వచ్చినంతే వుండాలి సుమా.
పెరుగు పుల్లగా వుంటే మీ నాన్న తినరు
అంటూ హెచ్చరికలు పంపేది.
కోడళ్ళకు వండే పదార్థంలో శ్రద్ధను ప్రేమను
గుమ్మరించమని హితబోధ చేసేది
బిడ్డ కడుపుకి తల్లి చేతి ముద్దకి వున్న
అవినాభావ సంబంధాన్ని అమ్మకి బిడ్డకు వున్న
నాభి బంధాన్ని విడమర్చి చెప్పేది.
అన్యోపదేశంగా తన బిడ్డలకు తనకు మధ్య వున్న
ప్రేమాభిమానాలను కంచుకోటలాంటి తమ కుటుంబ
అనుబంధాన్ని విశదపరిచేది.
.
టీచర్ గా పనిచేస్తున్న పెద్ద కోడలికి భర్త జేబు బరువుని
బట్టీ కాక కడుపు ఆకలిని బట్టి ప్రేమించమని
అతని జిహ్వ చాంచల్యాన్ని గ్రహించి ఆకర్షణీయంగా
వండి వడ్డించి పక్కదారులు పట్టకుండా కాపాడుకునే
సూక్ష్మ గ్రాహ్యత ను రహస్యంగా బోధించేది.
చార్టర్డ్ అకౌంటెంట్ గా పనిచేస్తున్న చిన్న వదినకు
వంటింటి పొదుపు సూత్రాలు అవలీలగా బోధిస్తుంటే
ఆమె పాఠం విన్నంత శ్రద్దగా వినేది. ఇక కూతుళ్లకు
విలువైన పాఠాలను సారెగా పెట్టి పంపింది.
అమ్మకు ఎప్పుడూ వంటింటి ధ్యాసే!
అని ఆమెను విసుక్కోవడం ఎందుకు
ఆమె శ్వాస ను ధ్యాసను ఇంటికి వంటింటికి
పరిమితి చేసింది ఎవరూ!?
ఇంట్లో అందరికీ వంటగది అవసరం వున్నా
ఒక మనిషిని యంత్రంలా మార్చింది ఎవరూ?
చాదస్తం అంటూ విసుక్కునే మనం కాదూ
ఆమె ఒక్కసారి చెబితే ఎన్నడైనా విన్నామా?
పదే పదే చెప్పినా పెడచెవిన పెట్టిన మనం కాదూ
అమ్మకి వంట గది నుండి విరామం దొరికితే
రుచులు కూడా జ్ఞాపకాలుగా మారతాయి ,
అమ్మ బిడ్డలతో చేసిన సంభాషణలు
ఆ ఇంటి సంప్రదాయాలుగా మారుతాయి.
అమ్మ కుటుంబం కోసం త్యాగాలు ఎందుకో
అర్థం లేనివిగా అనిపిస్తాయి.
సాయంత్రం అయ్యేటప్పటికి అమ్మ చెట్టుపై సేదతీరే మనం
చెట్టుకొకరు పుట్టకొకరై ఎక్కడెక్కడో పిట్టగూడుల్లో తలదాచుకుంటాం
జీవితంలో పెద్ద పెద్ద ఆశయాల సాధనలో..పడి
వంటింట్లో అమ్మ చుట్టూ జరిగే ఆత్మీయ సమావేశాలు
చిన్న చిన్న ఆనందాలు గుర్తొచ్చినా గొంతెత్తి పాడకుండా నొక్కి పడేస్తాం.
అమ్మ కు మన ఇంట్లోనే కాదు మన మనసులోనే
చోటు లేకుండా విసిరి కొడతాం. ఎదుగుదల మంత్రంతో
కుటుంబ విచ్ఛిన్న యజ్ఞానికి సమిధలుగా మారతాం.
వంట గది విరామం ప్రకటన వెనుక హృదయం
సంగతి ఏమో కానీ ప్రకటనలో ఆకర్షణ వుంది.
వేళకింత వండి పిడికెడు ముద్దను ప్రేమగా
వడ్డించలేని అసమర్దత అసహనం వుంది.
అవును, అమ్మలకు వంటింటి విరామం కావాలి కానీ
బిడ్డలకు దూరంగా జైలు గది లాంటి వనవాసం కాదు
అమ్మ లేని ఇల్లు అతి తేలికగా విభజింబ పడటమే కాదు
ధ్వంసం అయిపోతుంది. కలలు పగలకొట్టబడతాయి
ధ్వంసమైన ఇంటి నిర్మాణాలపై కొత్త సంస్కృతులు మొలకెత్తుతాయి
కమ్యూనిటీ కిచెన్ లు సీనియర్ సిటిజన్ హోమ్ లు.
మరో తరానికి మైలు మైలుకి
అమ్మ - ఇల్లు లేని ఆర్ఫనేజ్ హోమ్స్ లో స్వేచ్ఛ
హాయిగా ఊపిరి పీల్చుకుంటుంది.
ఆహార వ్యాపారం దేశ ప్రగతిలో కీలకస్థానంగా వర్ధిల్లుతుంది.
అమ్మ సూక్ష్మగ్రాహి. అందుకే శక్తి అడుగంటినా
ఊపిరి వున్నంత వరకూ వంటింటిని
తన పది చేతులతో నిలబెడుతుంది.
వంటింటి విరామం అమ్మ కోరుకుంటుందా?
ఎందుకైనా మంచిది..
అమ్మను మరొకసారి అడిగి చూడండి.
ఏం చెబుతుందో చెవి ఒగ్గి వినండీ!
Tue 24 Feb 2026. 05:45 pm.
డబ్బున్న వాళ్ళు సీనియర్ సిటిజన్ హోమ్స్ కి
డబ్బు లేని వాళ్ళు అనాధ ఆశ్రమాలకు
అసలు మనసే లేని వాళ్ళు బతికి వుండగానే కాటికి ఈడుస్తున్న వాళ్ళు
ఉన్న సమాజంలో అమ్మ వంట గది విరామం కోరుకుంటుందా
లేక కావాలని ఇంటికి దూరం చేస్తున్నారా!?
అనేక ప్రశ్నలు. చదివిన వారు మీకు మీరు ప్రశ్నించుకోండి చాలు. 🙏

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి