31, డిసెంబర్ 2020, గురువారం

కఠినమే.. అయినా ఎనలేని నిథి నాకు బహుమతి



 2020 వ సంవత్సరం.. ప్రతి వొక్కరికి గడ్డు కాలంగా మిగిలిపోనున్నది. ప్రతి వొక్కరికి సరికొత్త అనుభవాన్ని మిగిల్చి సవాల్ ని విసిరింది. ఊపిరితో మిగిలివున్నాం.. చాలు అనుకుంటూ.. అందుకు భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకుందాం అని అందరూ అనుకోవాలి. 

కరోన కాలం కాకుండా ఇంకొన్ని ఇబ్బందులు పెట్టిన కాలం కూడా 2020 నే. నేను జీవితకాలమంతా పడిన కష్టం కన్నా ఈ సంవత్సరం పడిన మానసిక వ్యథ అంతులేనిది. నన్నెవరో పరులు శత్రువులు గాయపరచలేదు మానసిక క్షోభకు గురిచేయలేదు. నా రక్తసంబంధీకులు నా కొడుకు రక్తసంబంధీకులు ఉచ్చనీచాలు మరిచి తమ ఈర్ష్యద్వేషాలు అసూయలను మాటల్లో ముంచి గుండెల్లో గునపాలు గుచ్చారు. ఎన్నో రాత్రులు అలజడితో మానసిక వ్యథతో బాధపడి కృంగిపోయాను. ఆరోగ్యం దెబ్బతిని మానసిక అశాంతితో వొణికిపోయాను. వారి తిట్లకు భయపడ్డాను కానీ భగవంతుడిపై భారం వేసి వారిని క్షమించమని వారికి వారి బిడ్డలకు మంచే కల్గాలని కోరుకున్నాను.,వారికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నేను కానీ నా కొడుకు కానీ ఎలాంటి అన్యాయం చేయలేదు. ఇంకా పుట్టని పసిబిడ్డను కూడా శపించిన వారిలాంటి వాళ్ళను అంత ఉచ్చనీచాలు మరిచిన మనుషులను నా బంధువులగానే కాదు మనుషులుగా కూడా అంగీకరించలేను. నా జీవితకాలంలో నేనింతవరకూ అలాంటి నీచ నికృష్ఠ మనస్తత్వాలను చూడలేదు. 

భగవంతుడి దయ వలన నేనూ నా కుటుంబం క్షేమంగా వున్నాం. నేనూ మా కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం ఏమిటంటే.. ఇక ఎప్పటికీ అలాంటి దుష్టులకు దూరంగా వుండాలని. ఊపిరి వున్నంత వరకూ వాళ్ళతో మాట్లాడకూడదనీనూ.. అలాంటి విషప్పురుగులకు మనమే దూరంగా వుందామని గట్టి నిర్ణయం తీసుకున్నాను. 

గాయమెంత లోతు అని గ్రుచ్చిన వారికి తెలియదు కానీ నొప్పి అనుభవించిన వారికి తెలుసు కదా..

నేను ఒకటే చెబుతాను.. కష్టాలలో కడిగిన ముత్యాల్లా తేలిన మా వెనుక నిజాయితీతో కూడిన మా కష్టమే వుంటుంది వుంది కూడా. 

ఇతరుల ముందు తలవొంచని నా ఆత్మగౌరవం నా పొగరు నా ఆత్మ విశ్వాసం ఇలాగే నిలిచివుండేలా.. కరుణించు మల్లన్నా..🙏🙏🙏. బ్రతకడానికి కావాల్సిన మనో నిబ్బరాన్ని మంచితనం ముందు వినమ్రతతో తలవొంచి నిలబడే సుగణశీలతనివ్వు తండ్రీ.. అందర్ని చల్లగా చూడు..అనంతమైన నీ కరుణాకటాక్ష రక్షాకవచాన్ని వుంచి నన్ను నా కుటుంబాన్ని చల్లగా కాపాడు తండ్రీ.. అని ప్రార్దిస్తూ..

ఇన్నింటి మధ్య 2020 మాకు ఇచ్చిన అపురూపమైన కానుక...  

నవనిధులు అష్టలక్ష్మి లు అన్నీ కలగలిసిన...  శ్రీగిరి నిలయ శ్రీకరి ప్రసాదిత చిత్కళ  రూప.. “నిహిర తాతినేని’’. నానమ్మకు ‘’చిన్నితల్లి’’ అమ్మనాన్నలకు “Chansi’’ means Dance. (ఫోటో పంచుకోవడం కూడా ఇష్టం లేదు) 

ఎపుడో ఒకపుడు బ్లాగ్ లో అనేక విషయాలు పంచుకునే నేను.. బ్లాగ్ మొదలెట్టిన పది యేళ్ళలో అతి తక్కువ పోస్ట్లు వ్రాసినది కూడా.. ఈ సంవత్సరమే. 

ఈ గడ్డుకాలం దాటి అందరూ సంతోషకరమైన రోజులు గడపాలని మనసారా కోరుకుంటూ.. ఈ సంవత్సరానికి వీడ్కోలు చెపుదాము. సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏

24, నవంబర్ 2020, మంగళవారం

పుట్టినరోజు శుభాకాంక్షలు

 


పుట్టినరోజు శుభాకాంక్షలు ..బంగారం .. ఈ రోజు నీకూ నాకూ ప్రత్యేకమైనదే ..
ఇలాంటి పుట్టిన రోజులు నిండు నూరేళ్ళు జరుపుకోవాలని ..
చైతన్యవంతమైన జీవన గమనం తో..
స్ఫూర్తి కరమైన మార్గంలో నడుస్తూ..
సుఖసంతోషాలతో..ఆయురారోగ్యములతో.. పుత్ర పౌత్రాభివృద్దితో
యశస్విభవ గా దేదీప్యమానంగా వెలుగొందాలని ..
మనసారా దీవిస్తూ..
భగవంతుని కరుణా కటాక్షములు అన్నింటా లభించాలని కోరుకుంటూ...
హృదయపూర్వక శుభాకాంక్షలు ..
నిండు మనస్సు తో.. ఆశ్శీస్సులు .. అందిస్తూ..నా ఆశీస్సులలో సదా ఆ సదాశివుడి దీవెనలు నీవెంట ఉంటాయి. 
"ఎక్కడ నీవున్నా-నా ఆశలు నీవన్నా
నీతో నీడల్లే నా ప్రాణం ఉందన్నా
నీవు ఇంతకు ఇంతై - అంతకు అంతై ఎదగర ఓ..కన్నా" ప్రేమతో ... "అమ్మ"

31, ఆగస్టు 2020, సోమవారం

పిచ్చుకమ్మలూ.. ఇటు రండి

పిచ్చుకమ్మలూ ఇటు రండి... .                            

మీరు కనుమరుగయ్యారని వాపోతుంది లోకం తమ పాపం ఏమీలేనట్లు

జనులపై దయతలచి మీ ఉనికిని చాటుకుంటూ అతిథిలా వేంచేస్తారు నా గృహానికి.

గూడు అల్లకపోయినా మీకొక గూడు కనబడింది నా వరండా ఇంటిలో

నేను కాసిని గింజలు వేలాడదీసి కొబ్బరిచిప్పలో నీళ్ళు పెట్టినందుకేమో.. అతిథిలా నా ఇంటికి వస్తూనే వుంటారు.

మీ క్షేమం సదా నా బాధ్యత అన్న వాగ్ధానం అర్దమయ్యిందో యోమో..

కరెంట్ తీగలచుట్టపై మెత్తని శయ్య ఏర్పరుచుకుని సరాగాలాడుతుంటారు ఆలుమగలు.  ఎంత మురిపెంగా వుందో మిమ్ము చూస్తుంటే..

మిమ్మలను చూస్తూ నాకు నేనే చెప్పుకుంటానిలా వేరొకరితో చెప్పినట్లు.. హృద్యంగా..

 “ఆమె గూటిలో కూర్చుని ఎదురుగా తీగపై కూర్చున్న అతనితో ఊసులాడుతుంటుంది.

అతను అపుడపుడు పెత్తనాలకు వెళ్ళినట్టేవెళ్ళి.. ఏ పురుగునో పుడకనో తెచ్చి అపురూపంగా ఆమెకందిస్తాడు.

ఆమె కిచకిచ మనుకుంటూ ఒక రెక్కను క్రిందికి వొంచి అతని చుట్టూ తిరుగుతూ ఆనందంగా నాట్యం చేస్తుంది.

అతను ఆమె మెడక్రింద తన తలను వొంచి.. ఓసి.. పిచ్చి ప్రేయసీ.. ఈ మాత్రం దానికేనా ఇంత సంతోషం... ముందురోజులకు కాస్త దాచుకో.. కలకాలపు తోడును కదా నేను.

మన వంశాన్ని వృద్ధి చేసి పంటలకు సస్యరక్షణలో తోడవుదాము.ఇక పోదాం పద పద.

మనుషులు చూస్తే మనపై ఈర్ష్య పడతారు. వారికి మనంత తీరిక మనస్సు ఎక్కడిదీ?
రెండు కళ్ళు దేనికో అప్పగించి మన ఉనికికి ఉపద్రవం తెచ్చిపెట్టేపనిలో తలమనకలైవున్నారు.

త్వరగా ఎగిరిపోదాం పద..  పచ్చని లోకం మన నెలవై.. కొలువై. “   అంటూ మీ కథను అప్పటికి ఆపేస్తాను.

పిచ్చుకమ్మాలూ.. ఇటు రండి అని రోజూ పిలవకుండానే వస్తూండటానికి జొన్న కంకుల గుత్తినొకటి వ్రేలాడగడతాను.

మీ సంతతిని కాపాడటానికి బల్లులను ఇటువైపు చూడకుండా భయపెడతాను. పక్షి పశువూ కీటకమూ జంతువూ అన్నీ వుంటేనే కదా.. మనిషి మనుగడ అన్న  కూసింత స్వార్దంతో కూడానూ..




26, ఆగస్టు 2020, బుధవారం

నీటి జాబిలి కాదు మేరు శిఖరం


కవి సాంఖ్య పక్షం,అయినా వాళ్ళు నిందిస్తారు 
అవును వాళ్ళు అసభ్యపు మాటలతో గుండెల్లోగునపాలు దించుతారు

వాళ్ళ రక్తమంతా కులద్వేషంతో కుతకుత ఉడుకుతుంటుంది.

వ్యక్తి పూజకు సమాజ హితానికి తేడా తెలియని మూర్ఖశిఖండులు.

అవినీతి గొంగళిలో పంచభక్ష్యాలు భుజిస్తూ.. పక్కవాడి పళ్ళెంలో మెతుకులను కాజేయాలని పన్నాగాలు

జగన్నాథ రధచక్రాలు వస్తున్నాయ్ అని రంకెలేస్తూ ఎగిరెగిరి పడతారు సరే రాత్రి వేళకు కన్ ఫెషన్ చెప్పుకుంటూ మోకరిల్లుతారు అవసరమైన చోట కాళ్ళు పట్టుకుంటారు

ఆరడుగులు నేల చాలన్న సత్యాన్ని విస్మరించి ఆరొందల పరగణాల భూదాహంతో దప్పికగొని వుంటారు

సురపానానికి స్వాగత ద్వారాలు తెరిచి అమృతమని భ్రమింపచేసి విషపు ఉక్కుకౌగిలిలో నలిపిపడేస్తుంటారు మొసలి కన్నీరు కారుస్తుంటారు రోజుకొక రంగు మారుస్తున్న ఈ ఊసరవెల్లులు

రెండున్నర శతాధికదినాలు దీర్ఘంగా అవిశ్రాంతంగా సాగుతూ మోయలేని బరువుతో కృంగి కృశించి వేదనతో ఆక్రోశంతో అలమటిస్తూ ఆశల చూపులతో బొంద విడిచి పెట్టాయో.
బతికివున్నవాళ్ళు శాపనార్ధాలు పెడుతూ రాజకీయరాబందుల ఇనుప గోళ్ళకు చిక్కి రక్తమోడుతున్నాయో

వేలమంది ప్రజల జీవన విద్వంసం కనబడటంలేదా.. ఈ గాంధారి పుత్రులకు.. 
ఇంటింటికి వొక కథ వేల కుటుంబాల అంతులేని వ్యథ
వేయి పడగల విషనాగు రోజుకొకతూరి విషం చిమ్ముతూనే వుంది .
గారడివాడి మాయాలా మూడు రాజధానుల ఆట ఆడుతూనే ఉంది మాయాలాంతరు ధరించిన రాక్షస మాయ మట్టిదిబ్బలుగా స్మశానవాటికగా మార్చజూస్తేనో  నమ్మశక్యంగా లేదిపుడు

పోరాటదీపం భావితరాల చేతుల్లోకి మారిందిపుడు. నిత్యం పబ్బం గడుపుకోవడానికి ఇది నిత్యాగ్ని హోత్రం కానేరదు. హరితుల పోరాటం వస్త్రంలో దారంలా అభివృద్దిగాముల  ఆరాటం

చట్టం ఎవరికీ చుట్టం కాదు
జడలు విప్పిన అరాచక దృశ్యాలను కళ్ళకు కట్టిన గంతలు
విప్పుకుని మరీ న్యాయదేవత చూస్తూనే ఉంది

కొందరు సత్యగాములు  ఘోషిస్తూనే వుంటారు సముద్రంలా
అది ఆత్మఘోష మాత్రమే అనుకుంటే పొరబాటు. అది పెను ఉప్పెనై  ముంచెత్తడం ఖాయం.
అమరావతి నీటి జాబిలి కాదు  కుయుక్తితో నీలిరంగుఅద్దిన పదహారు కళల ఖ్యాతి చంద్రికుల మేరు శిఖరం 
మసకబారిన జాబిలివెలుగులకు  చీకట్లు తృటికాలం అది ఉండదు కలకాలం   
సత్యమేవ జయతే !!



8, జులై 2020, బుధవారం

క్షమ మహోన్నత గుణం


క్షమ మహోన్నత గుణం

మనిషి శారీరకంగా ఆర్ధికంగా బలహీనమైనపుడు.. ఆ మనిషి ఎన్ని తప్పులు చేసినా అంతకుముందు మన మననును బాధ పెట్టినా అవన్నీ పరిగణనలోకి తీసుకోకుండా.. వారిని ఆదరించి నీకు మేమున్నాం అని భరోసా కల్గించడం మానవీయ లక్షణం. రోగాన్ని రోగ గ్రస్త శరీరాన్ని మనం నయంచేయలేకపోయినా అప్పటి వారి మానసిక స్థితి శరీర దౌర్భల్యానికి ఆదరణతో కూడిన సేవ సాంత్వన కల్గించే మాటలను తప్పకుండా అందించాలి. మనుషుల హృదయాలు రాతి హృదయాలు కరగనివయితే కాదు.. కదా!

మంచిమనుషులకు కోపం తాటాకు మంటలాంటిదంటారు.. కదా.. అలా వుండగల్గాలి. ఎవరూ తప్పులు చేయనివారు లోపాలు లేని వారు వుండరు. క్షమ మనిషిని మహోన్నత శిఖరాల మీద కూర్చుండబెడుతుంది అంటారు కదా.. నిజానికి చాలామంది డబ్బు లేక సరైన వైద్యం లేక పోరాడి అలసి అలసి నిస్సహాయస్థితిలో మరణిస్తారు. కొంతమంది అహంకారంతో అన్నీ వుండి కూడా ఆత్మీయులు లేక అలమటిస్తారు.

మనం భగవంతుని ముందు క్షమసత్వం చెప్పుకున్నట్టే మనవారి ముందు చెప్పుకోవాల్సిన పనిలేదు. ప్రేమ వాత్సల్యం ఎరిగినవారు వారే గ్రహిస్తారు. ఎన్ని కన్నీళ్ళు కుమ్మరించిన మాట చేసిన గాయం మానదు.. అయినా వారినీ క్షమించాలి.

ఉమర్ ఖయ్యామ్ రుబాయీ కి తెలుగు అనువాదం చూడండి. -చలం అనువాదం.,

“భరించే నీక్షమ నాకండగా వుండగా
నా పాపభారాన్ని చూసి నాకేం భయంలేదు.
నా చరిత్ర ఎంత నల్లనిదైనా
నీ కరుణ నన్ను కడిగి శుభ్రంచేస్తే
నీ సమక్షంలో నిలవడానికి నేను జంకను”.

PS: ఇలా అని మనం భగవంతుని ముందే కాదు మన వారి వద్ద అన్నాము అనిపించుకోవడానికి అభిజాత్యం ప్రదర్శించవద్దు. గంగ లాగ పొంగి వచ్చి యమునలా సంగమించేదే ప్రేమ. ప్రేమించడానికి ఒక సాప్ట్ కార్నర్ వుంటుంది ప్రతి ఒక్కరిలో. అది చాలు.


2, జులై 2020, గురువారం

మనసంతా నువ్వే ..

మనసంతా నువ్వే!

నా ప్రేమ వాత్సల్యం వాటాలో మీ నాన్నను వెనక్కి నెట్టేసావ్.

మీ నాన్న ప్రేమ వాటాలో నాకు శాతం తక్కువైపోయింది..

ఈ నానమ్మ ఆరోపణ నీపై మరింత ప్రేమ రంగరించిన మురిపెం ఇష్టంతో.. కూడినది.
నా మనసంతా నువ్వే..

పక్షిలా రెక్కలు లేనందుకు చింతిస్తున్నా .. నీ ముందు తక్షణం వాలిపోవడానికి.

ఈ వాత్సల్య ప్రవాహం.. వీడియో కాల్ లో ప్రవహిస్తుంటే నువ్వు గుర్తిస్తున్నావ్.. అది చాలులే..

పెద్దయ్యాక.. నానమ్మ నీకు చెప్పే కబుర్లలో ఇది కూడా వుంటుంది గా..

నీవేమో నా కబుర్లను ఆశ్చర్యంగా కళ్ళు విప్పార్చుకుని చూస్తూ వింటూంటావ్ గా..

మీ నాన్న మనిద్దరనీ చూస్తూ సన్నగా నవ్వుకుంటాడుగా..

మీ అమ్మేమో.. నాయనమ్మ మనుమరాలికి అన్నీ కథలూ కవిత్వాలే అనుకుంటుందేమో కదా.. 😍😊


(మనుమరాలి కోసం మనసంతా కదిలి)

28, జూన్ 2020, ఆదివారం

ఇవ్వడానికి మనసుండాలి మరి

చాలారోజులవుతుంది .. ఆలోచనలకు అక్షర రూపం కల్పించక. అప్పుడప్పుడూ ఇలా జరుగుతుండటం సహజమే కదా ! ఈ రోజు కొన్ని ఆలోచనలను పంచుకోవాలనిపించిది.. 
మొన్నొకరోజు ఫ్రెండ్ చెల్లెలు ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ నాకు ట్యాగ్ చేసింది. ఒక చిన్నపాపకు ట్రీట్మెంట్ కోసం ఆర్ధికసాయం అందించాలనే విషయం వుంది అందులో ..నేను చదివిన వెంటనే ..ట్యాగ్ తీసేశాను. ఒకరకమైన భయం . భయం అణువణువునా ఆక్రమించుకోవడం ఒక కారణమైతే ..వ్యాధుల బారిన పడిన వాళ్ళ నరకయాతన ఆర్ధిక పరిస్థితులు, తమవారిని రక్షించుకోవాలనే తపన,ఆరాటం అవన్నీ మనసును మెలిపెడతాయి కదా ! అంత చిన్న పాపకు వచ్చిన వ్యాధి కలవరం కల్గించింది .. నేను సహాయం చేయలేకపోయినా ..నా గోడమీద చూసిన మిత్రులు ఎవరైనా సహాయం చేస్తారేమోనన్న ఆలోచన కల్గకుండా ..క్షణాల్లో ట్యాగ్ తీసేశాను . 
నిజానికి నేనున్న పరిస్థితుల్లో నేను సహాయం చేయలేని పరిస్థితి  కూడా .. నేను సంవత్సరానికి కొంత మొత్తాన్ని ఇతరులకు సహాయం చేయడానికి పెట్టి ఉంచుకుంటాను. ఈ సంవత్సరం ఆ పరిమితి దాటిపోయింది. మళ్ళీ పొలంలో పంట వచ్చేదాకా నేను ఎవరికీ  సాయం చేయలేని పరిస్థితి కూడా ! 
కానీ నాలో ఏదో పీకులాట. మళ్ళీ కాసేపటికి మనసుని గట్టి చేసుకుంటాను. ఈ లోకంలో సహాయం అవసరమైన వారు చాలామంది ఉంటారు. వారికి అందరికీ సహాయం చేయగల స్థితిలో మనముండలేము. ఆ చిన్న బిడ్డకి సాయం అంది వైద్యం బాగా జరగాలని కోరుకున్నాను భగవంతుడిని. 
రిక్త హస్తాలతో ఉండటం అంటారే..అలా ఉండిపోవాల్సి వస్తుంది. ప్రస్తుతం నేను విశ్రాంతి జీవనంలో ఉన్నాను. బిడ్డ మీద ఆధారపడి ఉన్నప్పుడూ మన ఉదారబుద్ది వారికి అంటించలేము. అప్పటికప్పుడు అయ్యో ..నేను ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాల్సింది అని అనిపించింది కూడా ! 
అలాగే మిత్రులకు అత్యవసరం అన్నా అప్పుగా కూడా డబ్బు ఇవ్వలేని పరిస్థితి. మాట అడ్డువుండి అయినా ఇప్పించలేని పరిస్థితి. అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలని అంటారు కదా! అందుకనే నేను సున్నితంగా వాస్తవ విషయాన్ని చెప్పి తప్పుకుంటాను. లేదని కాదని అన్నందుకు నాపై కినుక వహించిన మిత్రులను కూడా చూస్తున్నాను. డబ్బు ఇచ్చిపుచ్చుకునే విషయంలో నేను జాగ్రత్తగానే ఉంటాను. ఎందుకంటే జవాబుదారీ వహించాల్సివస్తే ..నాకు చాలా కష్టమైన విషయం. నా కుటుంబం నుండి మాట పడాల్సి వస్తుంది కూడా . అలా కొందరు మిత్రులు దూరం అయ్యారు . 
లేదని చెప్పడం కూడా ఎంత కష్టం అని .. లేదని చెప్పడం కూడా మనిషికి అదొక యాతన. గుమ్మం ముందు నిలిచి భవతి బిక్షాందేహి అని అడిగిన ఆదిశంకరుడికి కేవలం ఉసిరిక మాత్రమే ఇవ్వగల్గిన పేద ఇల్లాలి ఆర్ధిక దుస్థితిలో సిగ్గిల్లుతూ అభిమానం పడే యాతన. That is Power of Money.

అర్ధం చేసుకున్నవారు అర్ధం చేసుకుంటారు ..లేనివారు లేదు. నేను నిర్వేదంగా వున్నాను. స్నేహంలో కూడా డబ్బు ప్రముఖపాత్ర వహిస్తుంది . డబ్బు అవసరం లేని స్నేహాలు కూడా ఉండవు. నిస్వార్ధ త్యాగాలు సహాయాలు కూడా ఉండవు . ఇది చేదు నిజం. జీర్ణించుకోవడమే కష్టం మరి.
ఇక ఆ చిన్న పాపకి వైద్య ఖర్చులకు సాయం అందించడం అనే విషయం గురించే ఇంకా ఆలోచిస్తున్నాను . నేను చొరవచేసి సాయం అందిస్తే .. నా కొడుకేమీ కాదనడు. కానీ మా పరిమితి నాకు తెలుసు. 
ఇలా మల్లగుల్లాలు పడుతూ ... ఉండగా ..ఎప్పుడో ఒకసారి రవీంద్రనాథ్ ఠాగూర్ వ్రాసిన ఒక కథ చదివాను . ఆ కథ గుర్తుకొచ్చి వెతికితే దొరికింది ..ఆ కథ పేరు "విచిత్ర భిక్షువు "  
"పరిత్యాగానికి మించిన ధర్మం మరొకటి లేదు " అన్నది ఆ కథలో సందేశం. 
ఆ కథ మీరందరూ చదువుతారని ఇక్కడ పంచుతున్నాను. ఇవ్వడమంటే ఏమిటో ..మనకందరికి తెలియాలి తెలుసుకోవాలి  అనిపించింది ... చదవండి ఈ కథ. 
నా మనసు కూడా ..ఇప్పుడు నిర్మలంగా ఉంది. సాహిత్యం చేసే పని ఇదే ! మన మనోగవక్షాలను తెరుస్తుంది. ఇది నిజం. 
"విచిత్ర భిక్షువు " రచన:రవీంద్రనాథ్ ఠాగూర్ 







11, మే 2020, సోమవారం

ఆలోచన చేద్దాం కొంచెం ..

మనుషులను మనం విశాల దృష్టితో  వాళ్ళ కోణంలో అర్ధం చేసుకోవాలని అనిపించిన సందర్భం వొకటి చెప్పదలచుకున్నాను.

అది నా కవితా సంపుటి ఆవిష్కరణ రోజు. చాలా యేళ్ళ నుండి వాయిదా వేసి వేసి ఆఖరికి నేను కూడా వొక కవినే అన్న దైర్యం హెచ్చిన పిమ్మట  పుస్తకం ప్రచురణలోకి  వచ్చేసింది. మా అబ్బాయితో ఆవిష్కరణ చేయించాలని నా కోరిక. తనకి వీలవలేదు ఆ సమయానికి కోడలు వచ్చింది . తనచేత ఆవిష్కరింప జేసే ప్రయత్నం. అంతకు ముందు రోజు మా నాన్నగారికి కాల్ చేసి "నాన్నా.. రేపు పుస్తకావిష్కరణ. మీరు రావాలి "అని చెప్పాను. జెట్ స్పీడ్ లో "నాకు రావడం కుదరదు. రేపు మేము పోలవరం ప్రాజెక్ట్ చూడటానికి వెళుతున్నాం " అని సమాధానం వచ్చింది.

నాకు వెంటనే వుక్రోషం పొడుచుకొచ్చేసింది. కూతురి పుస్తకం కన్నా ఈయనకి పోలవరం ప్రాజెక్ట్ చూడటం యెక్కువైపోయింది అని అనేసి  వూరుకున్నానా .. యింకా పొడిగించి "   చూడటానికి ఆ మాత్రం కళ్ళు వుండాలి,మనసుండాలి " అని అనేశాను. అప్పటికి నాన్నగారు ఫోన్ కట్ చేశారు. చేసేది మనమైనా ఇంకేం చెపుతారో అని వేచి వినడం ఆయనకి  లేదు.  ఇంకేమైనా విషయం మిగిలి వుంటే  మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేయాల్సిందే.

అలా జరిగిన కొన్ని నిమిషాల తర్వాత "అయ్యో,నేనలా అనకుండా వుండాల్సిందేమో, ఎవరి భావోద్వేగాలు, ఎవరి సమయనిర్ణయాలు వారివి. ఒక రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తికి అప్పుడో యెప్పుడో  వ్యవసాయం చేసిన రైతుకి ఆ మాత్రం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చూడాలని అనుకోవడంలో తప్పేమి వుంది. నా కవితా సంపుటి భావోద్వేగాలకు సంబంధించినదే అయినప్పుడు ఆయనది కూడా భావోద్వేగమే కదా" అని అనుకున్నాను.

అలాగే కొంతమంది పనిగట్టుకుని రాకూడదు అనుకుని ముఖం చాటేసినా, వొంకలు వెతుక్కున్నా వారిని రాలేదమని అడగను కూడా అడగను. బహుశా నేను వారికి ప్రాధాన్యంగా అనిపించకపోవచ్చును. ఒకవేళ నా పొగరు వాళ్ళని గాయపరచి వుండవచ్చును.. ఇలా అనుకుని మామూలైపోతాను.

ఇలాంటి విషయాలకు ముఖం నల్లగా పెట్టుకోవడం, నిరాశగా వుండటం లేదా కక్ష సాధింపుగా వుండటం లాంటి వాటికి దూరంగా వుంటాను. ఇతరులను అర్ధం చేసుకుంటే మనకు చాలా మనఃశాంతిగా ఉంటుంది కదా!

   అరే జరా సే సోచ్నా   (जरा से सोचना)

1, మే 2020, శుక్రవారం

ఆశతో జీవించడంలోనే..

ఈ సృష్టిలో ప్రతి ప్రాణి మరొక ప్రాణిని సృష్టించకపోయినా సృష్టించబడిన వాటిని ప్రేమిస్తుంది, ప్రశంసిస్తుంది, ఒకోసారి ద్వేషిస్తుంది.
లేదా సృష్టించబడిన వాటి మహిమని ప్రచారం చేస్తుంది. మనమూ అంతే కదా ! కానీ ఒకోసారి మన దగ్గర వారే మనను ద్వేషించిన సందర్భాలు మనకొక జీవిత పాఠాలు నేర్పుతుంటాయి..మనిషి స్వార్ధం ముందు నేను నాది అన్నది తప్ప మిగతా విషయాలన్నీ త్రోసిపుచ్చి వీలైనంత ఎదుటివారిని బాధ పెట్టేవిగా ఉంటాయనే విషయాన్ని మనం జీర్ణించుకోగల్గాలి.   ఆ విషయాన్ని మీతో పంచుకుంటూన్నానిలా..

ఆశతో జీవించడంలోనే అర్దమెంతో వుందిలే..

ఈ “ కరోన” కాలంలో బిడ్డలు దూరంగా వుండటం వల్ల ప్రతి చిన్న విషయానికి చిరుగాలికి కూడా అలఅల్లాడే చిగురుటాకులా వుంటుంది మానసిక పరిస్థితి. నిరంతర వార్తాప్రసారాలలో  వెలువడే వార్తలు గణాంకాలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంటే తమ పక్కనే ప్రమాదం పొంచి వుంటుందనే ఎరుక ఒక విధమైన నిర్వేదాన్ని కల్గిస్తుంది.

మాములుగా స్పందించే చిన్న అనారోగ్య సూచన.. కూడా ముఖ్యంగా జలుబు తుమ్ము లాంటివి గొంతునొప్పి లాంటివి కూడా ఉలికిపడేలా చేస్తున్నాయి. తుడిచినదే తుడవడం కడిగినదే కడగడం ఆహార అలవాట్లలో మార్పు రావడం... మనవాళ్ళ క్షేమసమాచారాల పట్ల ఆదుర్దా.. కొన్ని అర్దంలేని భయాలు అర్ధం గురించి జాగ్రత్తలు ప్రణాళికలు.. చేయాలని వున్నా కూడా చేయలేని సహాయాలు ఇతరులను అంటకూడా సామాజిక బహిష్కరణలు.. ఒక విధంగా ప్రతి మనిషి ఒక వొంటరి ద్వీపమై మనని మనం వెలివేసుకుని పంజరాలలో బిగించుకున్న బతుకులు. నిస్వార్దముగా సేవ చేయడం లేదని ఈసడించుకున్న వైద్యులు ఆరోగ్య సిబ్బంది.. మరికొన్ని వ్యవస్థలు చిత్తశుద్దితో పనిచేస్తుంటే కొన్ని అసహనాలు తమ ఉనికిని బయటపడేసుకుటున్న ఉదంతాలు. వీలైనంత దూరంగా  వుంటూ మనని మనం కాపాడుకోవడం మనవారికి ఒక అమూల్యమైన కానుక. ముఖ్యంగా ఇతరదేశాలలో వున్న పిల్లలు తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా మసలుకోవాలి.

నా ఫ్రెండ్ ఫిబ్రవరి ఆఖరివారంలో USA నుండి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు భర్త ఇద్దరు పిల్లలతో కలసి. ఆమె ఇంట్లో సంస్మరణ కార్యక్రమం. మార్చి 12 కి తిరిగి వెళ్ళబోయేసరికి తిరుగు ప్రయాణానికి ఆటంకం ఏర్పడింది. కాలేజీలో అడ్మిషన్ వుండటం మూలంగా.. పెద్ద అబ్బాయి ఉద్యోగరీత్యా భర్త వీళ్ళిద్దరూ అత్యవసరమై వేరే మార్గం ద్వారా USA చేరుకున్నారు. ఆమె చిన్నబాబు ఆంధ్ర ప్రదేశ్ లో. కుటుంబం అందరికీ కరోన టెస్ట్ లు సెల్ఫ్ క్వారంటైన్. ఇక్కడ అమె కుటుంబం కూడా సెల్ఫ్ క్వారంటైన్. అదృష్టవశాత్తు అందరూ కూడా.. కరోన బారిన పడకుండా.. రక్షణ చట్రంలో వున్నారు.

నా స్నేహితురాలు ఇక్కడ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా  సర్దుకున్నా ఆమె చిన్న కొడుకు ఇక్కడ వాతావరణానికి ఆహారపు అలవాట్లకు ఇంటికి కట్టి పడేసిన ఆంక్షలకు వొత్తిడికి గురవుతున్నాడు. పైగా పుట్టిన తర్వాత దూరంగా వుండని తండ్రి అన్న లను బాగా మిస్ అవుతూ వుంటే.. నా ఫ్రెండ్ ఏమో మనుషుల మనస్తత్వాలకు ప్రవర్తనలో తేడాలు ఇగోలు శాడిజాలకు బలైపోతూ ఉక్కిరి బిక్కిరై పోతున్నారు.  మనిషి స్వార్ధజీవి. పక్కల్లో మిన్నాగు కాటుకు గురైతే తిరిగి ఇంటికి వస్తామో లేదో తెలియని పరిస్థితి కూడా..మన ఇగోలు వర్దిల్లాలి. శాడిజాలు తృప్తి పడాలి లాంటి ఆలోచనలు వుంటాయి చూడండి అవి కరోన కన్నా భయంకరమైనవి. వ్యాధులు ఆకలి బాధల మధ్య కూడా.. “నేను” ‘’నాది‘’అన్న స్వార్ధమే మనిషికి ఇలాంటి పరిస్థితులను తెచ్చిపెడుతుంది. ఎవరూ ఎవరింట్లోనూ వుండాలని అనుకోరు. ముఖ్యంగా స్త్రీలు భర్త పిల్లలతో కలిసి ఒకేచోట వుండాలని కోరుకుంటారు. అనుకోని పరిస్థితుల వల్ల వుండాల్సి వస్తే అది పుట్టిల్లైనా సోదరసోదరీమణుల ఇల్లైనా.. వారిని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి.మరింత మానసిక స్తైర్యానివ్వాలి తప్ప సూటీపోటీ మాటలు అంతస్తుల బేరీజులు డబ్బు లెక్కలు పిసినారితనాలు చూపకూడదు.

నా ఫ్రెండ్ ఒకటే అనింది. ఈ కరోన కళ్ళు తెరిపించింది..  అని. ఈ లాక్ డౌవున్ ఎత్తేస్తే టికెట్స్ ఎంత ఖరీదైనా సరే.. ఎన్ని పరీక్షలు ఎదుర్కోవాల్సి వచ్చినా సరే వెంటనే ఇక్కడినుండి వెళ్ళిపోవాలి అంది. తల్లిదండ్రులు తోబుట్టువులే ఇలా వుంటే మనిషి మంచితనం మానవత్వం పరాయివారిలో వెతకాలనుకోవడం మబ్బు చూసి ముంత వొలకబోసుకోవడం లాంటిదే అనుకోకూడదు. మనిషితనం మానవత్వం ఇంకా చాలా వున్నాయి. లేకపోతే ఈ మాత్రం కూడా మనిషి బతకలేడు... అనిపిస్తుంది. ఫ్రెండ్స్ మనవారే మనని బాధ పెట్టినా నిబ్బరంగా వుండాలి.. ఆశతో జీవించడంలోనే అర్దమెంతో వుందిలే... అనుకుంటూ ఉత్సాహంగా .. మరింత జాగ్రత్తగా వుందాం. వీలైనంత సాయంగా మరింత ప్రేమగా వుందాం.  సరేనా..



30, ఏప్రిల్ 2020, గురువారం

అతివల ఆత్మ రక్షణాయుధం - వెలుతురు బాకు


నా కవిత్వానికి మంచి పరిచయం.. డా. రాధేయ గారి సమీక్ష.
కవితా సంపుటి వెలువడిన రెండేళ్ళ తర్వాత... ఈ సమీక్ష రావడం.. కవిత్వంపై కల్గిన అయిష్టాన్ని కొద్దిగా మటుమాయం చేసింది.

***********************

అతివల ఆత్మ రక్షణాయుధం
వనజ తాతినేని -"వెలుతురు బాకు'!
****************************
                         
                                  . ...డా.రాధేయ
                               
నన్ను నేను వ్యక్తీకరించు కోలేనప్పుడు వేరొకచోట స్పష్టతని చేజిక్కించుకోవడం లో విఫలమైనప్పుడునాకునేనేఅర్థంకానప్పుడు
 ఓ అస్పష్ట కవిత్వాన్ని అవుతాను.
 మళ్లీమళ్లీ చదువుకుంటూ మరల మనిషి నవుతాను.మరో రోజు మొదలైన చోట
 కవి నవుదామని  అత్యాశతో,

మధనపడిన,వేదనకి అక్షర రూపమే ఈ "వెలుతురు బాకు" అంటూ తనకు తాను
పరిచయం చేసుకున్న కవయిత్రే..
వనజ తాతినేని గారు.

కవిత్వాన్ని నేనొక సాహిత్య ప్రక్రియ గా మొదలు పెట్టలేదనీ,చెప్పలేని అసంతృప్తి ఏదోఏదో అలజడి చేస్తే రాశాను.తిలక్ అన్నట్లు నాలో నేను దొరుకు తానని,

చాలా ఓపెన్ హార్ట్ గా చెప్పిన వనజ తాతినేని గారి కవిత్వం ఇటీవలే నాకు అందింది.ఈ కవిత్వం 2018 లో
వచ్చినట్లు తెలుస్తోంది.

వీరు వర్ధమాన రచయిత్రి గా ఇటీవలే సాహిత్య రంగం లోకి ప్రవేశం పొందినప్పటికీ
ఏదో చెప్పాలన్న తపన ,అంతే గాకుండా

 సమాజంలో సాటి స్త్రీ ,ఎదుర్కొనే సామాజిక అవమానాల పట్ల దుఃఖ పడుతూ ,మగవారికి స్త్రీ ఒక ఇంస్టెంట్ ఫుడ్ లా,నిల్వ ఆహారాల్ని వెచ్చజేసుకునే
ఓవెన్ లా కన్పించడాన్ని సహించలేని సగటు ఇల్లాలిగా,

అభ్యుదయ భావుకు రాలిగా కవిత్వమై పలికింది ఈ కవయిత్రి.

"మీ కన్నా ఒక ద్వారం ఎక్కువ ఉన్న వాళ్ళం. ఆ ద్వారం నుండే  లోకాన్ని చూడటానికి అనుమతిచ్చిన వాళ్ళం.
నిత్య సాంగత్యపు గాయాల సలుపు తీరకుండానే
 జీవనౌషదాన్ని పూసుకుంటూ యంత్రాల్లా
 పరిగెడుతున్న వాళ్ళం.
 ప్రేమతోనూ చెపుతున్నాం..పరుషంగానూ  చెపుతున్నాం
 ఎలా చెప్పినా మీరిది విని తీరాలి ఇది రుధిర ద్వారాల మాట
 ఇది దశమ ద్వారాల మాట" పుట 30

ఒక స్త్రీ గా,సాటి స్త్రీలపై జరుగుతున్న అకృత్యాలపట్ల ఇటీవల ఇంత క్రోధం తో ,ఇంత సూటిగా ,ఇంత నిర్భీతిగా,ఒక వర్ధమాన రచయిత్రి హెచ్చరించిన సందర్భాలు నేను చూడలేదు,

అందుకే ఈ కవయిత్రిని, వీరు రాసిన వెలుతురు బాకు  కవిత్వాన్ని పరిచయం చేయాలన్పించి చేస్తున్నా..

ప్రసవ వేదన తర్వాత అపురూపంగా బిడ్డని చేతుల్లోకి తీసుకున్న తల్లి చిరునవ్వు లా నాకీ 'వెలుతురు బాకు'  అనిపించింది.

ఓట్లడిగే అధికారం వారి కున్నప్పుడు ప్రశ్నించే అధికారం మనకూ ఉందని మర్చి పోకండి.ఎవరి ఆయుధం వారి చేతిలోనే ఉండాలి.అరువు ఆయుధాలు ఎన్నటికీ  అవసరం లేదంటారు .కవయిత్రి.
రక్షణ లేని వ్యవస్థలో ఎవరిని వారే రక్షించు కోవాలంటారు

"అమ్మల్లారా
చీరకొంగుల్లో చిటికెడు కారమైనా దాచుకోకుండా
చేతిలో చిన్న చుర కత్తెయినా లేకుండా
ఫిర్యాదు చేయడానికి వెళ్ళకండి"..పుట33

వయసుడిగినా సరే,పరస్త్రీఅనాటమీలో
అమ్మ అనాటమీ చూడలేని అనాగరిక సంస్కృతిని నిరసిస్తారు

హాస్టల్ లో ఉన్న ఆడపిల్లలని చూస్తే అక్వేరియం లోఅలుపు లేకుండా తిరిగే
రంగురంగుల చేపల్ని చూసినట్లు గా ఉంటుందట వీరికి.

నాలోనూ ఒక నది,నీలోనూ ఒక నది అంతర్లీనంగాప్రవహిస్తూ ఉంటుంది.
మనమంతా మత మవసరంలేని
మానవాలయాలను నిర్మించుకుందాం.

డాలర్ల వేటకోసం పల్లెలు ,పంటపొలాలన్నీ
జిల్లెళ్ళవనాలు కావడంసహించలేకున్నారు.
నాగలి బతకాలి,పచ్చదనం ఆవిరి కాకూడదంటారు.

14 సంవత్సరాల బాలికను 12 మంది యువకులు సామూహికంగా అత్యాచారం చేశారన్న వార్త చదివాక చలించిపోయి అవయవ దానం పేరుతో తీక్షణంగా ధిక్కార స్వరం వినిపించారు కవయిత్రి.మనిషి జీవించడానికి రోటీ కపడా మకాన్ కాదు
వాటికంటే ముందు..

 విసర్జించడానికి,స్ఖలించడానికి ఓ క్షేత్రం కావాలి మరుగు దొడ్డి కన్నా మగువ అల్పంగా తోస్తోందా,ఆవు కన్నా ఆడది స్వల్పంగా కనపడుతోందా..అంటూ నిలదీసే స్వరం ఇవాళ ఎంతమంది కవయిత్రులకుంది?

"అమ్మల్లారా !
మూకుమ్మడిగా అవయవాల ఆయుధాలని విసర్జించేద్దాం కడలండి.
అవయవ దానానికి కూడా పనికిరాని అవయవాల కోసం నిత్యం
  కాట్లాడే కుక్కల్లా పొంచి ఉండే నక్కల్లా వేటాడే హైనాల్లాంటి వారి నరాల తీపుల కి కోట్ల యోనుల ని ఈ నేల మీద పరిచి
రేప్ కోర్టులు  నిర్మిద్దాం రండి" ...పుట 87

ఇంత తీక్షణ స్వరం ఎంతమంది కుంది చెప్పండి.ఇంతే కాదు,కవిత ముగింపు లో
కుట్టేసిన యోనులు,కోసేసిన కుచద్వయాలు వంటి పద ప్రయోగాలు కూడా చేశారు.

అమ్మంటే అస్థిత్వమని,ఆవలి గట్టు కు వంతెననీ,తొందర పడి కురవని ఓ బరువు మేఘమని చెబుతూ,అమ్మమనసు లోని మాటను,అమ్మచేతి గాజులను కవిత్వం చేస్తుంది.

ఆకాశాన సగం మనమే,అణిచి వేతలోనూ
అందరి కన్నా ముందు మనమే ఎందుకీ వివక్ష .?
ఆధునిక మహిళ అంటే అంతర్జాతీయ అంగడి సరుకా ?

ఆమె ఇప్పుడు ఆధునిక మహిళ..

"స్త్రీల ఆస్తిత్వ మంటే
చెప్పుకింద తేలు కాదు నలిపేయడానికి
తోక త్రొక్కిన త్రాచు లాంటిదని
 నిద్రాణంలో ఉన్న మగువలు మేల్కొంటే పర్వతాల కూసాలే కదులుతాయనే నిజాన్ని చాటుతూ
 మగువ మండే భాస్వరం కావాలంటూ
  గౌరవాల నిశ్శబ్దాన్ని భగ్నం చేయాలన్నట్టు
    సాగుతుందామె" .పుట156
 
నిత్యం గర్వం గా భాషించే నా ఇంటి పేరు, పలానావారి అమ్మాయినని గుర్తింపునిచ్చిన  ఇంటిపేరు, నిర్దాక్షిణ్యంగా చెరిపేసి,కొత్తగా పెనిమిటి ఇంటిపేరును చేర్చడం ఏమాత్రం
ఇష్టపడని ఇల్లాలు..

"నాకు ఎంతో బరువనిపించిన ఇంటి పేరు నేను మోయలేని ఇంటి పేరు
ఆడదో ఈడదో  లేకుండా
ఏదో ఒకటి ఉండకుండా
వదిలించుకోవాలని ఉంది
నన్ను నేను నిరూపించుకోవాలని ఉంది.
పుట"౬..159

నువ్వు పునీతవు.అగ్నిపుత్రిక వారసురాలివి .మాన ధనం ,అభిమాన ధనం నీది.నీ దేహం దేహమే ఓ ఆయుధం కావాలి...అంటూ పిలుపు నిచ్చే చైతన్య దేహిత గా..

"అభయ,నిర్భయ,అజేయ నమూనా నీకొద్దు  శరీరాలోచనల మురికిని
నీ కన్నీటి శుభ్రజలం తో  జాడించేయి నువ్వొక  పునీతవి కావాలి
నువ్వొక అపరాజిత గా మారాలి".16పుట..

ఇలా కవయిత్రి "వెలుతురు బాకు" లోని కవితలన్నీ అతివల నిప్పురవ్వలే.
బాలికగాఅమ్మాయిగా
గృహిణిగా,తల్లిగా నిత్యం అనుభవించే
సామాజిక,మానసిక,వ్యక్తిత్వ హింస పట్ల ధిక్కారస్వరమే,ఆత్మరక్షణ ఆయుధమే  వనజ తాతినేని-వెలుతురు బాకు అని
నేను భావిస్తున్నాను.

ఇందులోని కవితలన్నీ దాదాపుగా ఒక స్త్రీ చైతన్యపు స్వరం లోంచీ దూసుకొచ్చిన అస్త్రాలే.

 ఇంకా చెప్పాలంటే ఇవాళ స్త్రీ వాదులుగా
ముద్రపడి  రాస్తున్న వారి కవిత్వం కంటే ఎలాంటి లేబిల్ అంటించుకోని స్త్రీ హృదయవాది కవిత్వం ఇది .కవిత్వం లో చిక్కదనం,లోతైన అవగాహనే వనజ గారి కవిత్వం .పుస్తకం పేరు కూడా తగినట్లు గా ఉందనిపించింది నాకు.
   
   భావ పరిమళం నా కవిత్వం అని కవయిత్రి అన్నా, అందుకు తగ్గ లోతైన అభివ్యక్తి కూడా ఉందని నేనంటాను.

రెండ్రోజులు గా వెలుతురు కవిత్వాన్ని
నాతో చదివించి,ఈ నాలుగు మాటలు
నాతో పలికించిన కవయిత్రి కి అభినందనలు ధన్యవాదాలు..

....డా.రాధేయ



21, ఏప్రిల్ 2020, మంగళవారం

జంధ్యాల పాపయ్యశాస్త్రి .. పద్యాలు

అంజలి
పుట్టబోయెడి బుల్లి బుజ్జాయి కోసమై
పొదుగు గిన్నెకు పాలు పోసి పో్సి -
పుట్టబోయెడి బుల్లి బుజ్జాయి కోసమై
పొదుగు గిన్నెకు పాలు పోసి పో్సి -
కలికి వెన్నెలలూరు చలువ దోసిళ్ళతో
లతలకు మారాకులతికి అతికి -
పూల కంచాలలో రోలంబములకు
రేపటి భోజనము సిద్ధపరచి, పరచి -
తెలవారకుండ మొగ్గలలో జొరబడి
వింతవింతల రంగు వేసి వేసి -
తీరికే లేని విశ్వసంసారమందు
అలసిపోయితివేమొ దేవాధిదేవా!
దేవాధిదేవా!
ఒక్క నిమేషమ్ము
కన్నుమూయుదువు గాని రమ్ము, రమ్ము
తెరచితి నా కుటీరమ్ము తలుపు

హృదయ పూజ
కూర్చుండ మాయింట కురిచీలు లేవు,
నా ప్రణయాంకమే సిద్ధపరచనుంటి;
పాద్యమ్ములిడ మాకు పన్నీరు లేదు,
నా కన్నీళ్ళతో కాళ్ళు కడుగనుంటి.
పూజకై మా వీట పుష్పాలు లేవు,
నా ప్రేమాంజలులె సమర్పించనుంటి;
నైవేద్యమిడ మాకు నారికేళము లేదు,
హృదయమే చేతికందీయనుంటి!
లోటు రానీయనున్నంతలోన నీకు,
రమ్ము! దయచేయుమాత్మ పీఠమ్ము పైకి,
అమృత ఝరి చిందు నీ పదాంకములయందు
కోటి స్వర్గాలు మొలిపించుకొనుచు తండ్రీ!



12, ఏప్రిల్ 2020, ఆదివారం

చుక్క పొడిచింది

ఈ రోజు మూడు కథలు చదివాను..
కరివేపాకు, చెప్పుకింద పూలు, చుక్క పొడిచింది..
కథా సంపుటి పేరు: చుక్క పొడిచింది.
రచయిత: పాలగిరి విశ్వ ప్రసాద్
కథలపై నా చిరు అభిప్రాయం..
డబ్బును జీవన సోపానాలుగా మార్చుకునే వాడికి ప్రేమంటే ఏమిటో ఎప్పటికీ అర్దం కాదు. అది ఉప్మా తినేసి వదిలేసిన కరివేపాకు లాంటిది. ఈ కథ చదివాక అప్రయత్నంగా “చలం” గుర్తొచ్చారు. రచయిత వొప్పుకుంటారో లేదో!
చెప్పుకింద పూలు.. కథలో తరతరాల అణచివేత కనబడినా.. అవి అప్పటి పరిస్తితులు.ఈనాటికి దళితుల ఆలోచనలు ప్రగతి బాట పట్టినట్లు కాస్తంత వారి జీవితాలలో చిరుదీపాలు వెలిగాయనే చెప్పచ్చు. చదువుకున్న యువతలో నాకు ఆనాటి శీనడు కనబడ్డాడు. అయితే కథలో రచయిత ఆశాభావం కనబడలేదు. నిసృహ మాత్రమే కనబడింది. ఈ కథకు మాండలికం ప్రాణం పోసింది.
చుక్క పొడిచింది.. ఈ కథ రాసిన కాలానికి ఈకథ గొప్ప ఆలోచన. ప్యాక్షన్ రాజకీయాల మధ్య వేట కొడవళ్ళకు బాంబులకు బలై పోయిన మగవారి కథ. కానీ భర్తల మరణాన్ని తేలిగ్గా తీసుకోని భార్యల కక్ష కార్పణ్యాల విశ్వరూపం ఎలా వుంటుందో ఆ స్త్రీలు ప్రత్యర్ది వర్గం వారి చావును చూడటం కోసం దేనినైనా ఫణంగా పెడుతూ.. అనుకున్న దానిని సాధించేవరకూ .. ప్రశాంతంగా వుండలేరనే విషయాన్ని చెబుతూనే .. అంతకుముందులాగానే ప్రత్యర్ది దొంగ దెబ్బకు కక్షకు బలైపోయిన తన భర్తఎడబాటును జీర్ణించుకుంటూ ఇంకొక తరం.. అలాంటి కక్షలకూ కార్పణ్యాలకు గురి కాకూడదని వీలైతే కుటుంబం మొత్తాన్ని లేకుంటే తన బిడ్డలను దూరంగా తీసుకొని పోవాలని నిర్ణయించుకున్న సుజాత కథ.. ప్యాక్షన్ రాజకీయ కుటుంబాలలోని స్త్రీల ఆలోచనకు అద్దం పట్టింది. ఈ కథ వచ్చి 22 సంవత్సరాలైంది. ఒక సామాజిక అంశాన్ని సృశించి.. చైతన్యవంతమైన మార్పును కోరుకుంటూ సుజాత పాత్రను తీర్చిదిద్దిన విధానం రచయిత ఆలోచనలనూ ఆరోగ్యకరమైన శాంతియుత జీవన విధానం పట్ల వున్న ఆకాంక్షను తమ ప్రాంతంలో జరిగే విధ్వంస జీవన విధానం పట్ల వెగటును పట్టి ఇచ్చాయి.
ఇంకొక కథ "పాములు " విలాస జీవనానికై నైతిక విలువలను ఫణంగా పెట్టె భార్యాభర్త కథ ... సమాజంలో అంతస్తుల పట్ల పెరుగుతున్న వ్యామోహాన్ని నయా ధనవంతుల మేడిపండు జీవితాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించింది. 
ఈ రచయిత ఇకపై సంజాయిషీ చెప్పకుండా మరిన్ని మంచి కథలను అందించాలని కోరుకుంటాను. డిమాండ్ చేస్తున్నాను.
పి.రామకృష్ణారెడ్డి గారు కేతు విశ్వనాథరెడ్డిగారు, బండి నారాయణ స్వామి గారు ఈ కథలకు మంచి కితాబుని ఇచ్చారు.
మిగతా కథలు కూడా చదవాలి. చదవకుండా ఆపలేవు కూడా. ఈ సంపుటిలో మొత్తం పది కథలు ఉన్నాయి. ఏ కథకు ఆ కథ చదవదగిన కథ. గుర్తుండిపోయే కథలు.  
ధన్యవాదాలు పాలగిరి విశ్వ ప్రసాద్ గారూ.. మీ కథల సంపుటి అడిగి మరీ తెప్పించుకుని.. ఈ రోజుకు చదవగల్గాను.


3, ఏప్రిల్ 2020, శుక్రవారం

రేడియో కాలంలో

కాలానికి ఏదో ఒక  పేరుపెట్టుకోవడం  ఆనవాయితీ అనుకుంటే నేనొక కాలానికి రేడియో రోజులు అని పేరు పెట్టదలుచుకున్నాను. ఆరేడు దశాబ్దాలు రేడియో వినడం అనేదాన్ని కూడా ఆశ్చర్యంగా చూసిన కాలం దాటి  ఇంట్లో రేడియో వుండటమనేది హోదాకి దర్పానికి చిహ్నమై.. తర్వాత తర్వాత సామాన్యుడి ఇంట కూడా.. “బహుజన హితాయా బహుజన సుఃఖాయ” కి నిజమైన అర్దాన్ని ఇచ్చి సమాచార విజ్ఞాన వినోద కార్యక్రమాలను సాహిత్యాన్ని  ప్రజల మనసుల్లో ముద్ర వేసుకునేటట్లు శ్రవణపేయంగా అందించిన కాలానికి రేడియో కాలం అని గర్వంగా చెప్పుకోవచ్చు. 

ఇపుడంటే ఎపుడు కావాలంటే అపుడు అరనిమిషంలో కావాల్సిన పాటను వినే చూసే అవకాశం వచ్చి అంతే తొందరగా విరక్తి తెచ్చుకునే కాలంలో వున్నాము కానీ.. 

ఒకప్పుడు ఇష్టమైన పాట వినాలంటే .. ఎంత వేచి చూడాల్సివచ్చేది. చిత్రలహరిలో వేసే పాటలలో మనకిష్టమైన పాట వస్తే ఎంత సంబరం. అనుకోకుండా నాన్న బహుమతి ఇచ్చిన ఆనందం. ఇక 25 పైసల కార్డు కొనుక్కొచ్చి జనరంజని కార్యక్రమానికి కావాల్సిన పాటను కోరుకుంటూ ఉత్తరం రాసిన మూడో నాటి నుండి రేడియోకి చెవులప్పగించి ఎదురుచూడటం అనేది ఎంత మధుర జ్ఞాపకం. ఎపుడో ఒకపుడు మన పేర్లు వినిపిస్తూ మనం కోరిన పాటని వినిపిస్తూ.. వుంటే.. ఆ పాటతో గొంతు కలిపి ఎవరు ఏమనుకుంటారోనన్న బిడియం మరిచి హాయిగా గళం విప్పి గళం కలపడంతో పాటు గబ గబా చేతికందిన పుస్తకంలో పాట సాహిత్యాన్ని బర బరా రాసుకోవడం ఎంత ఆనందం.  


అలా సినీ సాహిత్యంలో మునిగి మునిగి ఆలోచనామృతం సాహిత్యం అనుకుంటూ.. డా. సి. నారాయణ రెడ్డి సాహిత్యం పై ఇష్టం పెంచుకుని.. “సిపాయీ.. ఓ సిపాయీ.. నీకై ఎంత ఎంత వేచి చూసాను ఈ వాలు కనుల నడుగు అడుగు ఇకనైనా.. “ అన్న పాటపై ఇష్టాన్ని.. మహ్మద్ రఫీ సుశీలమ్మ గళ మాధుర్యాన్ని సి.రామచంద్రన్ స్వరకల్పననూ వింటూ ఆనందడోలికలపై తేలియాడిన రోజులు.. రేడియో కాలం. .. అంటే అభ్యంతరమా.. 
సిపాయీ ..ఓ సిపాయీ ... పాట ఇక్కడ చూడండి . మేకప్ ఎక్కువై ఒకింత ఎబ్బెట్టు తప్ప .. బాలకృష్ణ దీప.. 💞 ఇక NTR దర్శకత్వం.. చూడవచ్చు ఇన్నేళ్ళ తర్వాత కూడా విసుగు పుట్టకుండా. 😊



30, మార్చి 2020, సోమవారం

పువ్వై పుట్టి (రాగమాలిక )

ఈ పాటంటే..చాలా యిష్టం . అందుకే .. ఈ శీర్షికతో ఒక కథ కూడా వ్రాసాను. ఆ కథలో ..ముఖ్యపాత్రకు పూవులంటే ఇష్టం. తాను మరణించాక తనకెంతో ఇష్టమైన పూల వృక్షం క్రింద తన గుర్తులను వుంచాలని కోరుకుంది.
ఇక ఈ పాట విషయంలోకి వస్తే ... తెలుగు రీమేక్ చిత్రానికి వేటూరి గారు పాటలకు సాహిత్యం అందించారు. సంగీత నేపధ్యంలో నడిచిన ప్రేమ కథ "రాగమాలిక " చిత్రంలో పాట యిది. ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం ఇళయరాజా.

పాట సాహిత్యం : 

పువ్వై పుట్టి  పూజే చేసి పోనీ రాలి పోనీ
పువ్వై పుట్టి  పూజే చేసి పోనీ రాలి పోనీ
పువ్వుగా ప్రాణాలుపోనీ తావి గా నన్నుండి పోనీ
పువ్వై పుట్టి పూజే చేసిపోనీ.. రాలి పోనీ

నీవే నాకు రాగం సాగనీవే హృదయ తాళం
గీతం నీకు హారం దేవీపాదం  నాకు తీరం
దేవీపూజ వేళకాగ నేనే పూలహారం
నాదం నాకు ప్రాణం చెరగరాదీ చైత్రమాసం
రేగే అగ్ని గుండం నన్ను తాకి పొందు శాంతం
నేనే నాదం
నాదే సూర్య నేత్రం ఇంక  నీదే చంద్రహాసం
నువ్వే చూడకుంటే నాకు లేదే సుప్రభాతం
రాగం వింత దాహం  తీరకుందీ తీపి మోహం
 వీచే గాలిలోనే దాచుకున్నా నాదు గానం
లోకాలేడు నాలో ఆడిపాడే నాట్య వేదం
నీకే అంకితం
పువ్వై పుట్టి  పూజే చేసి పోనీ రాలి పోనీ
పువ్వుగా ప్రాణాలుపోనీ తావి గా నన్నుండి పోనీ

copy rights వుండి video upload చేయడం అభ్యంతరమైతే తెలియజేయగలరు. తొలగించగలను. తెలుగు వెర్షన్ లో ఈ పాట లభ్యం కాకపోవడం వలన ఇక్కడ జత పరిచాను.



27, మార్చి 2020, శుక్రవారం

ఉజ్వల రచనా శిల్పం "దీపశిఖ "

సాహిత్యం యొక్క పరమార్దం హృదయాలను వైశాల్యం చేయడం.. 

రచయితలకు క్రాంతి దర్శనం ఊహలలో దొరుకుతుంది. అర్దం చేసుకోగల పాఠకులకూ దొరుకుతుంది. కానీ రచనలలో రచయిత వెళ్ళినంత దూరం మనిషి వెళ్ళలేడు. అది అర్దం చేసుకుని సమకాలీనతను ప్రతిబింబిస్తూ రచనలు చేయగలవారు మాములు రచయితలు గానూ.. విపరీతధోరణులను సాహిత్యంలో ప్రవేశపెట్టినవారిని సంచలన రచయితలగానూ  గుర్తించడం లెక్కించడం సర్వసాధారణమైపోయిన రోజులివి.

రచయిత వెళ్ళినంత దూరం పాఠకుడు వెళ్ళగల్గినపుడు.. వ్యక్తి స్వేచ్ఛకు ప్రాముఖ్యత ఏర్పడుతుంది. సమాజానికి వ్యక్తికి దూరం పెరుగుతుంది. సమాజంలో ఇమడలేని మనిషి బాహ్య అంతర్యుద్దాలతో అలసిపోతాడు.అలసిపోతూ కూడా తాము కోరుకున్నదానిని సాధించుకుంటారు. అయితే రచయిత సమాజంలో ప్రస్తుత విలువలుకు అనుగుణంగా నడుచుకుంటూనే ఎవరిని నొప్పించకుండా తాను చెప్పే విషయాన్ని వొప్పిస్తూ ..అది సామాన్యమైన విషయమే అని పాఠకుల చేత ఒప్పింపజేస్తూ కథ వ్రాయడం కత్తి మీద సాములాంటిదే. అలాంటి కథను నేను చదివాను. ఆ కథ పేరు దీపశిఖ . కథా రచయిత శ్రీమతి వాడ్రేవు వీరలక్ష్మి దేవి. ఈ కథ ఇతివృత్తం మనకు అక్కడక్కడా తారసపడేదే. అయితే జనబాహుళ్యంలో కుహనావిలువలతో బ్రతికే సమాజంలో ... నీతి తప్పి (??) ఒకడుగు ముందుకు వేసి బిడ్డను కనీ తాను అనుకున్నట్లు ఆ బిడ్డను పెంచిన విషయమే ఈ కథ. ఇష్టమైనదాన్ని కావాలనుకున్నప్పుడు హింస లేకుండా దానిని సాధించడం సాధ్యమా అని ప్రశ్నిస్తుంది కూడా ...  

స్త్రీలు పిల్లలను కనడానికి ఎంత ఇష్టపడతారో తనకు ఇష్టమైన పురుషుడి ద్వారా అక్రమ సంబంధం యేర్పరచుకుని పిల్లలను కనడానికి అంతగా ఆలోచిస్తారు జంకుతారు. పిల్లలను కనడానికి పురుషుడితో కూడిక ఇష్టమైనది కాకపోయినా పిల్లలకోసం అయిష్టంగానే కళ్ళుమూసుకుని .. వంశం నిలబెట్టడం కోసం హింసను అనుభవిస్తారు కొందరు.ఒక వివాహిత స్త్తీ తనకు కల్గిన ఇద్దరు పిల్లల తర్వాత తనకి ఇష్టమైన ప్రియుడుతో కూడి ఇష్టంగా బిడ్డను కనీ మిగతా బిడ్డలకన్నా అమితంగా ప్రేమించి అపురూపంగా పెంచుతుంది. ఆ విషయాన్ని కూతురికి ఆ తల్లి ఎలా తెలియజేస్తుంది ..కూతురు ఆ విషయాన్ని ఎలా స్వీకరిస్తుంది .. వివాహం కాకుండానే తల్లి కాబోతున్న తన రూమ్మేట్ కి ఏమి భోదిస్తున్నది అన్నదే .. ఈ "దీపశిఖ" కథ.  రచయిత చెప్పిన తీరు వలన ఈ కథకు ఒక గొప్పదనము ఆపాదించబడింది. అంతే కాక కుటుంబాలలో వ్యక్తుల ఇష్టాన్నో లేదా వేరొకరకమైన సంబంధాన్నో చూసి చూడనట్లు వదిలేస్తూ పరోక్షముగా సహకరించడం అన్నది అత్యంత సాధారణ విషయంగా ఉంటుందనేది సూక్ష్మప్రాయంగా చెప్పబడింది. ఈ రచయిత కాకుండా వేరొక రచయిత ఈ కథను వ్రాస్తే ఎలా ఉంటుందో ఆలోచించుకుంటే ... చాలా విమర్శలు వస్తాయనే అభిప్రాయం కూడా  యేర్పడింది. 

ఈ కథ చదివేముందు ...మీకు  నేను ఎరిగిన కొన్ని విషయాలను చెప్పదలచాను. ఆ విషయాలకు కథకు ఏమిటి సంబంధం అని అడగకండి. సంబంధం ఉందని నేను అనుకున్నాను కాబట్టీ .. ఆ విషయాలను ప్రస్తావించడం జరిగింది. 

 నా చిన్నప్పుడు జరిగిన కొందరి విషయాలు నాకు బాగా జ్ఞాపకం. ఆ విషయాల గురించి తప్పొప్పుల బేరీజు వేయడం నాకప్పుడే చూఛాయగా తెలుసు. నాకే కాదు నాతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన అదే వయస్సు పిల్లలకు కూడా.. తెలుస్తుంది. అది పెద్దలు మనకు ఉగ్గుపాలతో నేర్పిన సంస్కారం లేదా విలువలు కావచ్చు. మా ఇంటి వెనుక వాళ్ళకు ఒక అమ్మాయి వుండేది. కుడిఎడమగా మా అమ్మ వయస్సు ఆమెది. మా అమ్మ వివాహం చేసుకుని కోడలిగా అడుగుపెట్టిన ఏణర్దానికి ఆమెకు వివాహం అయిందట. మా ఊరికి కొద్ది దూరంలోనే ఆమె భర్త ఊరు. కానీ ఆమె ఎపుడూ అత్తగారింట్లో వుండేది కాదు. ఆమె నాణ్యమైన నల్లని నలుపుతో తీర్చిదిద్దిన శిల్పంలా బారు జడతో అందంగా వుండేది.  ఆమె భర్త ఆమెకు  భిన్నంగా కొద్దిగా పొట్టిగా ఎత్తుపళ్ళుతో  ఏమంత అందంగా కనిపించేవాడు కాదు. నాకు ఉహ తెలుస్తూ వుండేటప్పటికి ఆమెకు నా వయస్సున్న కొడుకు వున్నాడు. ఆ పిల్లాడు మాతో ఆడుతూ పాడుతూ వుండేవాడు. ఆమె భర్త పది పదిహేనురోజులకు ఒకసారి వచ్చి ఆమెను కొడుకును తీసుకువెళతానని బలవంత పెట్టినపుడల్లా.. ఆమె తల్లి అల్లుడిని పట్టరాని కూతలు తిడుతూ.. నీ ఇంట్లో కూటికి గతిలేదు నీళ్ళ మజ్జిగ చుక్కకు గతిలేదు నా కూతురిని పంపను. కావాలంటే నా ఇంట్లోనే పాలేరుగా పడివుండు అని తిట్టిపేసేది. 

ఇక ఆ కూతురేమో సినిమాలో వాణిశ్రీ లాగే పైట వేసుకుని బిగుతు జాకెట్ ధరించి నిత్యం సన్నజాజులు ధరించి.. వయసున్న మగవాళ్లతో పరాచికాలు ఆడుతూ వుండేది. నేను చెంబు తీసుకుని పాటి మీదకు వెళ్ళినపుడో తోటి పిల్లలతో కలిసి ఆడుతున్నప్పుడో నాకు బాబాయి వరుసయ్యే ఆయనతో కలిసి గడ్డి వాముల దగ్గర కనబడేది. అప్పటికి ఆ కనబడటం అనేది పూర్తిగా అర్దం కాకపోయినా అది నాకు తప్పుగా అనిపించేది. అపుడపుడు పెద్దవాళ్ళ మాటల్లో.. ఆ తులసమ్మ కూతురిని మొగుడితో కాపరానికి పంపివ్వదు. దానిపై మన ఇంటి మొగాడికి కన్ను పడకుండా కాపలాకాసుకోలేక చచ్చే చావొచ్చింది అని తిట్టుకోవడం వినబడి మొత్తానికి ఆమె చేస్తున్నది తప్పని బాగా అర్దమైంది. కొన్నాళ్ళకు ఆమె మళ్ళ్ళీ గర్బవతి అయి.. పండంటి బిడ్డను కన్నది. ఆ బిడ్డను చూసి మా వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు చెవులు కొరుక్కొనే వాళ్ళు. తర్వాత బిడ్డలను వెంటబెట్టుకుని భర్త వెంట కాపురానికి వెళ్ళిపోతే పీడా విరగడైంది అని మెటికలు విరుస్తూ తిట్టి పోసిన ఆడవాళ్ళను చూసాను.

నా బాల్యం కనుమరుగై యుక్తవయస్కురాలినై పెళ్ళి అయి నాకెక బిడ్డ పుట్టాక  హఠాత్తుగా మా ఇంటి వెనుక వున్న తులసమ్మ కూతురిని ఆమె చిన్న కొడుకును చూసి ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఆమె చిన్న కొడుకు నాకు బాబాయి వరసయ్యేతను ఎలా వుంటాడో అచ్చుగుద్దినట్టు అలాగే వున్నాడు. నాలో ఎన్నో ఆలోచనలు. అంత స్పష్టంగా మరొకరి రూపంలో తన ఇంట్లో తన బిడ్డగా చెలామణీ అవుతున్న ఆ బిడ్డను.. ఆమె భర్త ఎలా భరించగల్గాడు? లేదా అతనికసలు  భార్య యొక్క ఆ అక్రమ సంబంధం గురించి తెలియదా.. ? తెలియకపోవడానికి ఆస్కారమే లేదు అంత చిన్న చిన్న పక్క పక్కనే పల్లెటూర్లలో చాలా విషయాలు దాయాలని చూస్తే దాగేవి కూడా కాదు. కానీ.. ఆ తండ్రి బిడ్డను ప్రేమించి పెంచి పెద్ద చేసి తన ఆస్తి మొత్తాన్ని పెద్ద కొడుకుకు కొంచెం కూడా ఇవ్వకుండా రెండవ కొడుకుకే వ్రాసి చనిపోయాడు. ఇక ఆమె భర్తతో కలిసి చేసిన కాపురంలో ఎన్ని అనుమానాలు అవమానాలు భరించిందో కానీ.. చిన్న కొడుకంటే ఆమెకు పంచప్రాణాలు. అతనిని ప్రత్యేక ఇష్టంతో చూసేది. 

ఇక మా బాబాయి వరుసయ్యే ఆయనతో ఆకర్షణలో పడిపోయి భర్త దగ్గరకు కాపురానికి వెళ్ళకుండా హిస్టీరియా వచ్చినట్లు ప్రవర్తించే మా బంధువుల అమ్మాయి గుర్తుకొస్తూ వుంటుంది.,ఆమెను భార్య చనిపోయున పెద్ద వయస్సు ఆస్తిపాస్తులున్న పిల్లల తండ్రికిచ్చి వివాహం చేసారు. ఆమె ఆ భర్తతో సరిపెట్టుకోలేక ఎదురుగా ఆకర్షణీయంగా  ఉంగరాల జుట్టతో దబ్బపండులా మెరిసిపోయే నవ యువకుడితో సంబంధం పెట్టుకుని  భర్త దగ్గరకు వెళ్ళమంటే పిచ్చి పట్టినట్లు ప్రవర్తించేది. 

ఇవి వివాహం ముసుగులో కనబడే వ్యక్తి ఆకర్షణ లేదా ప్రేమ లేదా మరొకటో.. పెద్దలు పిల్లల మనసులను అర్దం చేసుకుని వివాహం జరిపించనపుడు వారు తమ అంతరంగాల్లో మరొకరిని జపిస్తూ వారి కోసం తపిస్తూ.. కోరికలతో జ్వలిస్తూ తమను తాము మోసం చేసుకుంటూ జీవిత భాగస్వామికి ద్రోహం చేస్తూ.. వుంటారు. అటువంటి భార్యలను భరించే భర్తలూ వుంటారు. తనకు పుట్టిన బిడ్డ కాదని తెలిసినా ఆ బిడ్డలను ప్రేమించే భర్తలు భార్యను క్షమించే భర్తలు వుంటారని తర్వాత తర్వాత అర్దం చేసుకున్నాను. స్త్రీలు కూడా తనకు యిష్టమైన పురుషుడితో కూడి.. అతని బిడ్డను అపురూపంగా నవమాసాలూ మోసి కనీ యిష్టంగా పెంచే వాళ్ళు వుంటారు. ఇందులో తప్పొప్పులను మనం బేరీజు వేసుకున్నట్లు వుండకపోవచ్చు. మన ఆలోచనలకు అందని ఇంకొక కోణం వుండవచ్చు. స్త్రీ పర పురుషుడితో కూడిన ప్రతి సమాగమూ.. అనైతికం కాకపోవచ్చేనేది.. కొంచెం సానుభూతితో చూడాల్సిన విషయంగా .. అర్దం చేసుకోవాలని ఈ కథ చదివాక నాకు అర్దమైంది. అలా అని అక్రమసంబంధాలను ప్రోత్సహిస్తున్నామని అనుకోకూడదు. మనకు తారసపడిన విషయాలను ఎలా అర్ధం చేసుకోవాలో మాత్రం తెలుస్తుందని చెప్పడమే నా ఉద్దేశ్యం. 

ఈ కథ చదివాక నేను ఎరిగిన ఆ ఇద్దరు స్త్రీలు నాకు మరింత అర్దమయ్యారు. వారిద్దరినీ నేను ఇపుడు అసహ్యించుకోవడం మానేసి.. మాములు స్త్రీలగా  చూడగల్లుతున్నాను. సాహిత్యం యొక్క పరమార్దం హృదయాలను వైశాల్యం చేయడం..  మానసిక పరివర్తన కల్గించడం  కొత్త ఆలోచనలను రేకెత్తించడం అంటే ఇదేనని నాకు అర్దమైంది. వీరలక్ష్మీదేవి గారికి ధన్యవాదాలు .. ఇంతమంచి కథను వ్రాసినందుకు అభినందనలు. 

"దీపశిఖ  " కథ లింక్ లో ఇక్కడ చదవవచ్చు 

"కొండఫలం" కథల సంపుటిలో  కూడా  చదవవచ్చు .. 


26, మార్చి 2020, గురువారం

First Love Letter To My Dear Grand Child..

💕First Love Letter to My dear Grand child💕

ఇదిగో... ఇపుడే కాఫీ కలుపుకుని వచ్చి తూర్పు గవాక్షం తెరిచానా... నారింజ రంగు సూర్యుడు ఎంత అందంగా వున్నాడో.. అనుకుంటూ కాఫీ గ్లాస్ అక్కడ పెట్టి మొబైల్ చేతిలోకి తీసుకుని రెండు క్లిక్ లు మనిపించి ఆ అందాల సూరీడ్ని ఫేస్ బుక్ గోడ మీద అందరికీ చూపించాలనే సౌందర్య ఆరాధన, ఆరాటం తీర్చుకుని .. కె జె ఏసుదాస్ మధురంగా ఆలపించిన శివ తాండవం (లాస్య) ని వింటూ చుక్క చుక్క కాఫీ ఆస్వాదిస్తున్న తరుణంలో... మీ నాన్న నుండి నాకు వాట్సాప్ కాల్ వచ్చింది. వెంటనే కాల్ లిప్ట్ చేసి .. ఏం చేస్తున్నారు బంగారం, డిన్నర్ అయిందా... అని నా ప్రశ్న.

అమ్మా.. బేబి పుట్టిందమ్మా.. అని ఉద్వేగమైన మాటలు. అపుడేనా.. తల్లి బిడ్డలు ఇద్దరూ క్షేమమేనా... అని అడిగాను కంగారుగా. ఎవ్విరిథింగ్ ఈజ్ ఫైన్.. అమ్మా. నీ కోడలికి c section జరిగింది. అని చెప్పాడు.. నాకు ఒకేపరి గంగయమునలు కళ్ళలో ఊరుతున్నాయి. వాటిని అణుచుకుంటూ.. అభినందించాను. ఉద్విగ్నతను అణుచుకుంటూ.. ఆశీర్వదించాను. భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను.

బంగారూ... నువ్వు వచ్చే శుభవార్త ఎలా వచ్చిందో తెలుసా! .. మార్గశిర మాసపు గురువారం మునిమాపు వేళ రోజులాగా కాకుండా మరింత ప్రత్యేకంగా కామాక్షి దీపాలతో పాటు మరికొన్ని నూనె దీపాలు వెలిగించి .. ఆ దీపకాంతులు ఇల్లంతా చైతన్యశక్తిని నింపుతున్న వేళలో నేను శ్రీసూక్తం వింటున్న సమయంలో అదొక శుభ ఆశీర్వచనమై శుభతరుణమై .. మీ అమ్మ కాల్ చేసి.. "అత్తయ్యా... అమ్మాయి పుడుతుందంట" అని చెప్పినపుడు సంభ్రమం చెందానని చెప్పను కానీ క్షణకాలం తర్వాత సర్దుకుని.. నిండు హృదయంతో నీ రాకను ఆనందం చేసుకున్న క్షణాలు అవి. నిజం చెప్పొద్దూ.. నాక్కూడా వారసత్వ వ్యామోహం వుండింది. ఆ వ్యామోహాన్ని పటాపంచలు చేసి.. శుభసమయంలో మా ఇంట్లో మహాలక్ష్మి పుడుతుందనే వార్తను విన్నాను అని వెంటనే అయిన వాళ్ళందరికీ ఆ శుభవార్తను పంచుకున్నాను.

మీ నాన్న పుట్టినపుడు ఆడపిల్ల పుట్టలేదని ఏడ్చిన నేను.. నువ్వు పట్టే సమయానికి కాలానికి ఆడపిల్ల కాకపోతే బావుండుననుకునే కాలానికి నెట్టబడ్డానని అనుకుంటాను.. బంగారూ.. నా ఆలోచనలో తప్పు వుందని నేను అనుకోను కానీ.. నీ రాకను నీ లాంటి ఆడబిడ్డల రాకను మనఃస్పూర్తిగా ఆహ్వానిస్తాను తల్లీ..!

మా ఇంటి మహలక్ష్మివి నీవు. నువ్వు పుట్టావన్న వార్తను తొలుతగా నాతో పంచుకున్న నాకే వినిపించిన మీ నాన్నకు తెలుసు.. మీ నానమ్మ నీ కోసం ఎన్ని కలలు కంటుందో.. నువ్వు మీ నాన్న లాగే వుంటావని నేను అనుకుంటే.. అమ్మా.. బేబీ నీలాగానే వుందమ్మా, వ్రేళ్ళు కూడా నీకు లాగానే వున్నాయమ్మా అని మురిసిపోతున్నాడు. నిన్ను ముందు మీ అమ్మ చూసిన తర్వాతే మాకెవరికైనా చూపమని నేను హెచ్చరిక చేసాను. మీ అమ్మ నాన్న నా రెండు కళ్ళు అయితే.. వారి కలల పంటవి.. నువ్వు నాకు పంచప్రాణాలు బంగారూ.. మీ అమ్మనాన్న ఏ పేరైనా పెట్టుకోనీ.. నేను నీకు పెట్టుకున్న పేరు “చిత్కళ”. శ్రీ శార్వరి నామ సంవత్సర చైత్ర శుద్ద విదియ బుధవారం 07:13 pm కి రేవతి నక్షత్రం నాల్గవ పాదం మీనరాశిలో జన్మించిన నీకు.. శుభాశీస్సులు బంగారూ.. ఆ శ్రీగిరి పర్వతం నుండి జగత్ మాతాపితురుల కరుణ కటాక్షాలు నీపై సర్వకాలాలు ప్రసరిస్తూనే వుంటాయని నా ప్రగాఢ విశ్వాసం.

నేను చూసుకున్నట్టే నా కొడుకుని భద్రంగా ప్రేమగా చూసుకోవటానికి నువ్వు వచ్చావు తల్లీ..
అమ్మా.. నన్ను వదలవే తల్లీ.. ఎక్కడో దూరంగా వున్నావనుకున్నా.. ఇదిగో ఇక్కడ కూడా నా కూతురి రూపంలో వుండి అనేక జాగ్రత్తలు చెప్పి సాధిస్తున్నావే .. అని మురిపెంగా.. మీ నాన్న చెప్పే మాటలను మధురంగా.. ఊహించుకుంటున్నా.

ఈ కరోన కాలం కాకపోతే నిను భద్రంగా మృదువుగా అపురూపంగా ఒడిలోకి తీసుకుని లాలించాల్సిన నానమ్మను. ఉయ్యాలలో పడుకుని కాళ్ళు చేతులు ఆడిస్తూ ఏదో రహస్య భాషలో ఎదురుగా వున్న మీ నాన్నతో సంభాషిస్తున్న నిన్ను మొబైల్ కెమెరాలో చూస్తూ ఆ చూపునుండి హృదయం దాకా ప్రవహింపచేసుకుని గుండెతో గుండెను కలిపి భద్రంగా ముడి వేసుకున్నా బంగారూ..

మీ నాన్న కన్నా ప్రియమైనదానవు.. నిను ఒడిలోకి తీసుకుని ఆ పౌత్రి ప్రేమను నిండుగా ఆస్వాదిస్తుంటే.. నువ్వు నా చిటికెన వేలును నీ చిన్ని గుప్పిటలో బిగించి పట్టుకుంటుంటే.. నేను రాసుకున్న “అమ్మ మనసులో మాట “
లేదా “సాయం చేయడానికి చేతులు కావాలి’’ అన్న కవితలు మదిలో మెదులుతుంటాయేమో మరి.

బంగారూ... ముందు ముందు నా ఊహలు నా ఆశలు నా ఆకాంక్షలు అన్నీ వినే శ్రోతవి నువ్వే. అందుకే.. ఈ అక్షరాలలో నా మనసు మాటలను భద్రం చేస్తున్నా.. తర్వాతెపుడో చదువుకుంటావు కదా..

💕 ✍️ప్రేమతో .. నానమ్మ.🎈🎈💕






ఈ నాటి సూర్యోదయం చిత్రాలు.. 

25, మార్చి 2020, బుధవారం

నా బ్లాగ్ మరియు కథలపై పత్ర సమర్పణ



కొద్దిగా ఆలస్యంగా పంచుకుంటున్న విశేషం. 
47 రోజులకు ... నా గోడపైకి మళ్ళీ తిరిగి వచ్చాను. .నా రాకకు కారణం ... కొంచెం సంతోషంగా అనిపించడమే ...
నా చుట్టూ వున్న స్త్రీల జీవితాలని, వారిపై వున్న అణచివేతని చూస్తూ వున్నప్పుడు అందులో నన్ను నేను చూసుకుంటాను. అప్పుడు నేనూ తోటి స్త్రీల పక్షాన నిలిచి కవిత్వపు జెండానవ్వాలనిపిస్తుంది. నేను విన్నవి, కన్నవి యిన్ని బాహ్య ప్రపంచపు బాధలు నాకు నిద్ర లేకుండా చేసి కలవరపెడతాయి ... అపుడవి కథలుగా రూపం సంతరించుకుంటాయి. వాటిని నా చుట్టూ ఉన్న ప్రపంచం గుర్తించి స్పందన తెలిపినప్పుడు ... నాతో పాటు మరికొందరు సమస్యలను బాధలను గుర్తిస్తున్నారని తెలిసి కొంత తెరిపినపడతాను.
ఇంతకీ విషయం యేమిటంటే ...నా ఫోన్ నెంబర్ కోసం google search చేస్తున్నట్లు నేను గమనించాను. వివరాలు చూద్దామని వెళితే ... ఇటీవలే ప్రచురితమైన ఒక సమీక్ష చదివి ... సంభ్రమాశ్చర్యాలకు లోనై ... వివరంగా చదువుకుంటూ వెళ్ళాను. నేను pen down చేసినప్పుడల్లా ... నన్ను మళ్ళీ నిలబెట్టేవి .ఇలాంటి ఉత్తేజాలే !
Pratyusha Velaga... deportment of English Sri Padmavati Viswavidyalayam ... నేను వ్రాసిన కథలపై సమీక్ష చేయడం (థియరి లో పేపర్ సమర్పించడం )..ఆనందం కల్గించింది ... Thank you so Much ప్రత్యూష .. http://www.jctjournal.com/gallery/107-feb2020.pdf
jctjournal.com gallery లో నేను కనుగొన్న ... ఈ వ్యాసాన్ని మీరు కూడా ఇక్కడ చూడవచ్చు . ప్రత్యూష కి ధన్యవాదాలు.

 వీలు చూసుకుని తనతో ఒకసారి మాట్లాడాలి . నా బ్లాగ్ ని కథలను ఆ అమ్మాయి క్షుణంగా చదివింది . రెండు రోజులు తర్వాత తెలిసింది ..తను పద్మావతి వడ్లమూడి గారి అమ్మాయని. మరింత సంతోషంగా ఫీల్ అయ్యాను.  పద్మ గారు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానని చెప్పారు. 

https://drive.google.com/…/191TgMwpNAvjdOHEhBAwTX4B6w…/view… లింక్ ఇక్కడ ప్రక్కనే తెరవవచ్చు  > నా బ్లాగ్ మరియు కథలపై ఆంగ్లంలో పత్ర సమర్పణ