నాకు నచ్చిన కవితలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నాకు నచ్చిన కవితలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, ఏప్రిల్ 2020, గురువారం

అతివల ఆత్మ రక్షణాయుధం - వెలుతురు బాకు


నా కవిత్వానికి మంచి పరిచయం.. డా. రాధేయ గారి సమీక్ష.
కవితా సంపుటి వెలువడిన రెండేళ్ళ తర్వాత... ఈ సమీక్ష రావడం.. కవిత్వంపై కల్గిన అయిష్టాన్ని కొద్దిగా మటుమాయం చేసింది.

***********************

అతివల ఆత్మ రక్షణాయుధం
వనజ తాతినేని -"వెలుతురు బాకు'!
****************************
                         
                                  . ...డా.రాధేయ
                               
నన్ను నేను వ్యక్తీకరించు కోలేనప్పుడు వేరొకచోట స్పష్టతని చేజిక్కించుకోవడం లో విఫలమైనప్పుడునాకునేనేఅర్థంకానప్పుడు
 ఓ అస్పష్ట కవిత్వాన్ని అవుతాను.
 మళ్లీమళ్లీ చదువుకుంటూ మరల మనిషి నవుతాను.మరో రోజు మొదలైన చోట
 కవి నవుదామని  అత్యాశతో,

మధనపడిన,వేదనకి అక్షర రూపమే ఈ "వెలుతురు బాకు" అంటూ తనకు తాను
పరిచయం చేసుకున్న కవయిత్రే..
వనజ తాతినేని గారు.

కవిత్వాన్ని నేనొక సాహిత్య ప్రక్రియ గా మొదలు పెట్టలేదనీ,చెప్పలేని అసంతృప్తి ఏదోఏదో అలజడి చేస్తే రాశాను.తిలక్ అన్నట్లు నాలో నేను దొరుకు తానని,

చాలా ఓపెన్ హార్ట్ గా చెప్పిన వనజ తాతినేని గారి కవిత్వం ఇటీవలే నాకు అందింది.ఈ కవిత్వం 2018 లో
వచ్చినట్లు తెలుస్తోంది.

వీరు వర్ధమాన రచయిత్రి గా ఇటీవలే సాహిత్య రంగం లోకి ప్రవేశం పొందినప్పటికీ
ఏదో చెప్పాలన్న తపన ,అంతే గాకుండా

 సమాజంలో సాటి స్త్రీ ,ఎదుర్కొనే సామాజిక అవమానాల పట్ల దుఃఖ పడుతూ ,మగవారికి స్త్రీ ఒక ఇంస్టెంట్ ఫుడ్ లా,నిల్వ ఆహారాల్ని వెచ్చజేసుకునే
ఓవెన్ లా కన్పించడాన్ని సహించలేని సగటు ఇల్లాలిగా,

అభ్యుదయ భావుకు రాలిగా కవిత్వమై పలికింది ఈ కవయిత్రి.

"మీ కన్నా ఒక ద్వారం ఎక్కువ ఉన్న వాళ్ళం. ఆ ద్వారం నుండే  లోకాన్ని చూడటానికి అనుమతిచ్చిన వాళ్ళం.
నిత్య సాంగత్యపు గాయాల సలుపు తీరకుండానే
 జీవనౌషదాన్ని పూసుకుంటూ యంత్రాల్లా
 పరిగెడుతున్న వాళ్ళం.
 ప్రేమతోనూ చెపుతున్నాం..పరుషంగానూ  చెపుతున్నాం
 ఎలా చెప్పినా మీరిది విని తీరాలి ఇది రుధిర ద్వారాల మాట
 ఇది దశమ ద్వారాల మాట" పుట 30

ఒక స్త్రీ గా,సాటి స్త్రీలపై జరుగుతున్న అకృత్యాలపట్ల ఇటీవల ఇంత క్రోధం తో ,ఇంత సూటిగా ,ఇంత నిర్భీతిగా,ఒక వర్ధమాన రచయిత్రి హెచ్చరించిన సందర్భాలు నేను చూడలేదు,

అందుకే ఈ కవయిత్రిని, వీరు రాసిన వెలుతురు బాకు  కవిత్వాన్ని పరిచయం చేయాలన్పించి చేస్తున్నా..

ప్రసవ వేదన తర్వాత అపురూపంగా బిడ్డని చేతుల్లోకి తీసుకున్న తల్లి చిరునవ్వు లా నాకీ 'వెలుతురు బాకు'  అనిపించింది.

ఓట్లడిగే అధికారం వారి కున్నప్పుడు ప్రశ్నించే అధికారం మనకూ ఉందని మర్చి పోకండి.ఎవరి ఆయుధం వారి చేతిలోనే ఉండాలి.అరువు ఆయుధాలు ఎన్నటికీ  అవసరం లేదంటారు .కవయిత్రి.
రక్షణ లేని వ్యవస్థలో ఎవరిని వారే రక్షించు కోవాలంటారు

"అమ్మల్లారా
చీరకొంగుల్లో చిటికెడు కారమైనా దాచుకోకుండా
చేతిలో చిన్న చుర కత్తెయినా లేకుండా
ఫిర్యాదు చేయడానికి వెళ్ళకండి"..పుట33

వయసుడిగినా సరే,పరస్త్రీఅనాటమీలో
అమ్మ అనాటమీ చూడలేని అనాగరిక సంస్కృతిని నిరసిస్తారు

హాస్టల్ లో ఉన్న ఆడపిల్లలని చూస్తే అక్వేరియం లోఅలుపు లేకుండా తిరిగే
రంగురంగుల చేపల్ని చూసినట్లు గా ఉంటుందట వీరికి.

నాలోనూ ఒక నది,నీలోనూ ఒక నది అంతర్లీనంగాప్రవహిస్తూ ఉంటుంది.
మనమంతా మత మవసరంలేని
మానవాలయాలను నిర్మించుకుందాం.

డాలర్ల వేటకోసం పల్లెలు ,పంటపొలాలన్నీ
జిల్లెళ్ళవనాలు కావడంసహించలేకున్నారు.
నాగలి బతకాలి,పచ్చదనం ఆవిరి కాకూడదంటారు.

14 సంవత్సరాల బాలికను 12 మంది యువకులు సామూహికంగా అత్యాచారం చేశారన్న వార్త చదివాక చలించిపోయి అవయవ దానం పేరుతో తీక్షణంగా ధిక్కార స్వరం వినిపించారు కవయిత్రి.మనిషి జీవించడానికి రోటీ కపడా మకాన్ కాదు
వాటికంటే ముందు..

 విసర్జించడానికి,స్ఖలించడానికి ఓ క్షేత్రం కావాలి మరుగు దొడ్డి కన్నా మగువ అల్పంగా తోస్తోందా,ఆవు కన్నా ఆడది స్వల్పంగా కనపడుతోందా..అంటూ నిలదీసే స్వరం ఇవాళ ఎంతమంది కవయిత్రులకుంది?

"అమ్మల్లారా !
మూకుమ్మడిగా అవయవాల ఆయుధాలని విసర్జించేద్దాం కడలండి.
అవయవ దానానికి కూడా పనికిరాని అవయవాల కోసం నిత్యం
  కాట్లాడే కుక్కల్లా పొంచి ఉండే నక్కల్లా వేటాడే హైనాల్లాంటి వారి నరాల తీపుల కి కోట్ల యోనుల ని ఈ నేల మీద పరిచి
రేప్ కోర్టులు  నిర్మిద్దాం రండి" ...పుట 87

ఇంత తీక్షణ స్వరం ఎంతమంది కుంది చెప్పండి.ఇంతే కాదు,కవిత ముగింపు లో
కుట్టేసిన యోనులు,కోసేసిన కుచద్వయాలు వంటి పద ప్రయోగాలు కూడా చేశారు.

అమ్మంటే అస్థిత్వమని,ఆవలి గట్టు కు వంతెననీ,తొందర పడి కురవని ఓ బరువు మేఘమని చెబుతూ,అమ్మమనసు లోని మాటను,అమ్మచేతి గాజులను కవిత్వం చేస్తుంది.

ఆకాశాన సగం మనమే,అణిచి వేతలోనూ
అందరి కన్నా ముందు మనమే ఎందుకీ వివక్ష .?
ఆధునిక మహిళ అంటే అంతర్జాతీయ అంగడి సరుకా ?

ఆమె ఇప్పుడు ఆధునిక మహిళ..

"స్త్రీల ఆస్తిత్వ మంటే
చెప్పుకింద తేలు కాదు నలిపేయడానికి
తోక త్రొక్కిన త్రాచు లాంటిదని
 నిద్రాణంలో ఉన్న మగువలు మేల్కొంటే పర్వతాల కూసాలే కదులుతాయనే నిజాన్ని చాటుతూ
 మగువ మండే భాస్వరం కావాలంటూ
  గౌరవాల నిశ్శబ్దాన్ని భగ్నం చేయాలన్నట్టు
    సాగుతుందామె" .పుట156
 
నిత్యం గర్వం గా భాషించే నా ఇంటి పేరు, పలానావారి అమ్మాయినని గుర్తింపునిచ్చిన  ఇంటిపేరు, నిర్దాక్షిణ్యంగా చెరిపేసి,కొత్తగా పెనిమిటి ఇంటిపేరును చేర్చడం ఏమాత్రం
ఇష్టపడని ఇల్లాలు..

"నాకు ఎంతో బరువనిపించిన ఇంటి పేరు నేను మోయలేని ఇంటి పేరు
ఆడదో ఈడదో  లేకుండా
ఏదో ఒకటి ఉండకుండా
వదిలించుకోవాలని ఉంది
నన్ను నేను నిరూపించుకోవాలని ఉంది.
పుట"౬..159

నువ్వు పునీతవు.అగ్నిపుత్రిక వారసురాలివి .మాన ధనం ,అభిమాన ధనం నీది.నీ దేహం దేహమే ఓ ఆయుధం కావాలి...అంటూ పిలుపు నిచ్చే చైతన్య దేహిత గా..

"అభయ,నిర్భయ,అజేయ నమూనా నీకొద్దు  శరీరాలోచనల మురికిని
నీ కన్నీటి శుభ్రజలం తో  జాడించేయి నువ్వొక  పునీతవి కావాలి
నువ్వొక అపరాజిత గా మారాలి".16పుట..

ఇలా కవయిత్రి "వెలుతురు బాకు" లోని కవితలన్నీ అతివల నిప్పురవ్వలే.
బాలికగాఅమ్మాయిగా
గృహిణిగా,తల్లిగా నిత్యం అనుభవించే
సామాజిక,మానసిక,వ్యక్తిత్వ హింస పట్ల ధిక్కారస్వరమే,ఆత్మరక్షణ ఆయుధమే  వనజ తాతినేని-వెలుతురు బాకు అని
నేను భావిస్తున్నాను.

ఇందులోని కవితలన్నీ దాదాపుగా ఒక స్త్రీ చైతన్యపు స్వరం లోంచీ దూసుకొచ్చిన అస్త్రాలే.

 ఇంకా చెప్పాలంటే ఇవాళ స్త్రీ వాదులుగా
ముద్రపడి  రాస్తున్న వారి కవిత్వం కంటే ఎలాంటి లేబిల్ అంటించుకోని స్త్రీ హృదయవాది కవిత్వం ఇది .కవిత్వం లో చిక్కదనం,లోతైన అవగాహనే వనజ గారి కవిత్వం .పుస్తకం పేరు కూడా తగినట్లు గా ఉందనిపించింది నాకు.
   
   భావ పరిమళం నా కవిత్వం అని కవయిత్రి అన్నా, అందుకు తగ్గ లోతైన అభివ్యక్తి కూడా ఉందని నేనంటాను.

రెండ్రోజులు గా వెలుతురు కవిత్వాన్ని
నాతో చదివించి,ఈ నాలుగు మాటలు
నాతో పలికించిన కవయిత్రి కి అభినందనలు ధన్యవాదాలు..

....డా.రాధేయ



18, అక్టోబర్ 2013, శుక్రవారం

రుబాయీలు రెండు

ఉమర్ ఖయ్యాం రుబాయీలు .. రెండు .
చలం గారి అనువాదం .
బాగా నచ్చాయి . ప్రతి ఒక్కరూ .. అన్వయించుకోదగ్గవి కూడా . 


ఈ పురాతన సత్రానికి రెండే వాకిళ్ళు
రాత్రింబవళ్ళు
ఆ ద్వారాలలోంచి సుల్తాను తర్వాత సుల్తాను ప్రవేశించి
పరిపాలించాడు, అనుభవించాడు
ఏ గుర్తూ లేకుండా వొచ్చిన దారినే పోయినాడు

***********************

వారితో కలసి జ్ఞాన బీజాన్ని నాటి మొక్క మొలిపించాను
కష్టించి పోషించి దాన్ని పెంచి పెద్దదాన్ని చేసాను
ఆ వృక్షం నుంచి నేను కొని తెచ్చుకున్న ఫలం ఏమిటంటే ...
"నేను వీళ్ళమల్లే ఈ లోకంలోకి వచ్చాను
గాలి మల్లే ఈ లోకం లోంచి పోతాను"  అని ..

14, మే 2013, మంగళవారం

ఓ.. మంచి కవిత

ఈ రోజు కవిసంగమం లో ఒక కవిత చదివాను . ఎంత బావుందో చెప్పలేను . స్త్రీలో ఉన్న ఉదాత్త కోణం ని చాలా బాగా చూపారు 
ఇలాంటి కవితలు చదవడం "కవి సంగమం " లో ఉండటం మూలంగానే సాధ్యం అయింది

కవిసంగమం తో పరిచయం లేని మిత్రులతో పంచుకోవాలని ఇక్కడ షేర్ చేస్తున్నాను .  మాతృక మళ యాల కవికి ఆగ్లానువాదం చేసిన వారికి అలాగే తెనుగు సేత కవి యాకూబ్ గారికి, ఈ కవితని షేర్ చేసిన కపిల రామ్  గారికి ధన్యవాదములు చెపుదాము 


 ||కవి యకూబ్ - వరద ||

''రెండున్నరకి పైసా తక్కువైనా కుదరదు ''
పైటని పచ్చికమీద పరిచి
వెల్లికిలా పడికుంది ఆమె!
' ఇక్కడ అమ్మకం పన్నేమీ లేదు '
అతగాడు ఊపిరి పీల్చుకున్నాడు.....
శరీరాన్ని విల్లులా వంచి
ప్రణయ పంచబాణాలు వదిలాడు.
ఇప్పుడిక వరద ముంచెత్తింది
సృష్టి యెప్పుడు శిరసెత్తుతుంది?
బహుశ: అది సృష్టించలేని శృంగారమేమొ?

అంతా అయిపోయి, లేచి వెళ్ళిపోనున్న
అతడి ముఖంలో పగుళ్ళువారిన దిగులు చూసి ఆమె....
'' ఈ యాభై పైసలు తీసుకోండి, బస్సుకు పనికొస్తాయి
యిప్పుడు నడవడం కష్టం!''
***
అతడు కాళ్ళీడ్చుకుంటూ యిల్లు చేరేసరికి
కళ్ళలో వత్తులు వేసుకుని
గుమ్మంలో యెదురుచూస్తోంది తల్లి!
_______________________________________________
మలయాళ మూలానికి ఆంగ్లానువాదం - అయ్యప్ప ఫణిక్కర్ -
తెనుగు సేత - మన కవి యాకూబ్ పేజి 64-65
(ప్రపంచ కవిత్వంతో ఒక సాయంత్రం - సంకలనం నుండి.)

14, సెప్టెంబర్ 2012, శుక్రవారం

త్యజించు లేదా ప్రేమించు.....

ఈ రోజు హిందీ దివస్ .

హిందీ జాతీయ భాష.

భారతీయులందరూ రాజ భాషగా అమలుపరచు కుంటున్నాం.

ఈ సందర్భంగా ..ఒక మంచి కవిత.

నా కవిత అనుకునేరు.. హిందీ భాషపై నాకంత పట్టులేదు.

హిందీ భాషా కవయిత్రి "సుభద్రా కుమారీ చౌహాన్ " గారిది.

ఈమే కవితలు సరళంగా,సహజంగా ఉంటాయి. ఆమె కవితలలో దేశభక్తి తో పాటు భగవంతునిని ఏ విధంగా ప్రార్ధించ వచ్చో..తెలుసుకోవచ్చును.

నిర్మలమైన హృదయంతో.భగవతారాధన ఆమె కవితలో చూడవచ్చును. ఆ కవితనే నేను ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను.

ఆమె తన కవితతో..ఇలా ప్రార్ధిస్తున్నారు..




టుకరా దో యా ప్యార్ కరో

"ఓ..దేవా..! నిన్ను పూజించే అనేక మంది అనేక రకాల పద్దతులలో నీ వద్దకు వస్తారు.
నీ సేవకై అత్యంత విలువైన కానుకలు అనేక విధాలుగా తెస్తారు.

వారు అంగరంగ వైభవంగా ఆడంబరంగా.. అలంకరణ లతో ఆలయంలోకి వస్తారు.
ముత్యాలు,మణులు విలువైన వస్తువులు తీసుకు వచ్చి నీకు కానుకలుగా సమర్పిస్తారు.

పేదరాలైన నేను ఏమి కూడా నా వెంట తేలేదు.
అయినప్పటికీ ధైర్యం చేసి ఆలయంలోకి పూజించడానికి వచ్చాను.

ధూపదీప నైవేద్యాలు లేవు. అందమైన అలంకరణ లు లేవు.
అయ్యో! నీ మేడలో వేయడానికి కనీసం పూల మాల కూడా లేదు.

నిన్నేవిధంగా స్తుతించగలను? నా స్వరం లో మాధుర్యం కూడా లేదు
మనసులో ఉన్న భావాన్ని వ్యక్తం చేయడానికి నా మాటలలో చాతుర్యం లేదు.

దానం లేదు,దక్షిణ లేదు రిక్త హస్తాలతో వచ్చాను.
పూజించే విధానం కూడా తెలియదు. అయినప్పటికీ ..ఓ... స్వామీ !! నేను వచ్చాను.

పూజా మరియు పూజా సామగ్రి అయి ఉన్న ..ఓ..ప్రభూ.. ! నీకై ప్రార్దించే నన్ను అర్ధం చేసుకో!
దానాలను,దక్షిణ లను త్యజించి ఈ బికారిణిని అర్ధంచేసుకో..

నేను ప్రేమ మైకం కమ్మిన దాహార్తిని. హృదయాన్ని చూపడానికే వచ్చాను.
కేవలం నా దగ్గర ఏదైతే ఉందొ.. అది.. హృదయం మాత్రమే ! దానిని అర్పించడానికి వచ్చాను.

నీ పాదముల యందు అర్పిస్తున్నాను. ఇది నీకు నచ్చినట్లు అయితే స్వీకరించు.
ఈ వస్తువు (హృదయం ) కూడా నీదే కదా! త్యజించు లేదా ప్రేమించు

ఈ ప్రార్ధన ఎంత బాగుందో..కదండీ! ఎంత స్వచ్చమైన హృదయంతో.. ప్రార్ధన చేసింది.

ఈ కవిత.. అప్రయత్నంగా నాకు మొన్ననే నా ఫ్రెండ్ గుర్తు చేసింది. ఎందుకంటే ఆ రోజు ఆమె నా బ్లాగ్ చూసి.. ఈ కవిత చెప్పింది. నాకు చాలా బాగా నచ్చింది. భగవంతునికి భక్తుడు సమర్పించే స్వచ్చమైన హృదయంతో కూడిన ప్రార్దనే కదండీ!

ఈ కవిత పదవతరగతి.. పాఠ్య భాగంగా కూడా ఉంది అట.

సుభద్ర కుమారీ చౌహాన్ కవితలు మరిన్ని చూడాలనుకుంటే ..ఈ లింక్ లో చూడవచ్చు.

16, ఆగస్టు 2012, గురువారం

ఓ..కవి హృదయం

పిల్ల గాలి ఊదింది పిల్లన గ్రోవి
పల్లవించి ఊగింది గున్నమావి

మా పల్లె మారింది వ్రేపల్లెగా
మనసేమో పొంగింది  ..పాలవెల్లిగా

చెలువ పంపిన పూల  రేకులు
చిలిపి బాసల మూగలేఖలు
మరల మరల చదువు  కుందును
మనసు నిండా పొదుగు  కుందును
చిలిపి బాసల మూగలేఖలు
 చెలువ పంపిన పూల  రేకులు

పరిమళాల పల్లవులగా
ప్రణయ గీతములల్లు కుందును
బ్రతుకు పాటగా పాడుకుందును
చిలిపి బాసల మూగలేఖలు
చెలువ పంపిన పూల  రేకులు

విరహమోపగలేక వెన్నెల్లో పడుకుంటే
పండు వెన్నెలేమో చండ్ర నిప్పులే  ఆయె
మరులు సైపగ లేక మల్లెలను దూయగా
మల్లియలు సైతం పల్లెరులైపోయే
ఇక సైపగా లేను ఈ మధుర బాధ
ప్రియ సఖీ నా పైన దయ చూపరాదా

ఎవరి కోసం రాధ ఏతెంచేనో
ఎదురుపడగా లేక ఎట పొంచెనో
తలుపు చాటున దాగి తిల కించేనో
తిలకించి లోలోన పులకించేనో
చిలిపి కృష్ణుడు అంత చెంగు పట్టగా
నిలువెల్లా ఉలికిపడి  తల వాల్చెనో



21, జులై 2012, శనివారం

ఓ చినుకు కవిత



ఈ చినుకు ..నేను వ్రాసినది కాదు.

ఎక్కడో..చదివాను. నాకు బాగా నచ్చింది. ఈ కవిత వ్రాసిన వారి పేరు గుర్తుకు రావడం లేదు. వెతుకుతున్నాను. కానీ చిక్కడంలేదు.

కానీ చినుకు పడినప్పుడల్లా ..ఈ అక్షర చినుకు నాకు గుర్తుకు వస్తూ ఉంటుంది.

జాన్ హైడ్ గారు.. వాన కవితలని సేకరిస్తున్నానని చెప్పారు. ఓ..అనామిక కవితగా ఈ కవితని పరిచయం చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది.

అందుకే ఈ షేరింగ్. .. (భావచౌర్యం అనుకోవద్దు ప్లీజ్ !!) నాకు ఈ కవిత వ్రాసిన వారు గుర్తుకు రాగానే..ఇక్కడ వారి పేరును పొందు పరుస్తాను.

చినుకు చినుకు రాలి సంద డాయెను
నుదుటిపై జేరి ముత్యమాయెను
అది గుండెపై జారగానే జాతరాయెను
నడుమ పై పడిన చినుకు వీణ ఆయెను
అల్లనల్లన మీటగానే వేణు వాయెను
తడిసి తడిసి తనువంతా బృంద గాన మాయెను
కనులముందు బృందావని కదలి పోయెను
అది మధురమైన జ్ఞాపకమై మిగిలి పోయెను
మరలి వచ్చే చినుకు కోసం కనులు కాయలు కాచెను.

నేను గుర్తుకు తెచ్చుకుని సుమారుగా ఈ కవితని వ్రాసాను. కానీ ఒరిజినల్గా మార్పు ఉండవచ్చేమో కూడా..
ఈ పోస్ట్ చదివి..ఈ కవిత వ్రాసిన వారు ముందుకువస్తే..వారికి నా అభినందన మందారమాల
భావ చౌర్యం గురించి రేపు ఒక పోస్ట్ వ్రాస్తాను .. వెయిట్ ప్లీజ్!!

11, సెప్టెంబర్ 2011, ఆదివారం

ఆకురాలు కాలం

నాకు బాగా నచ్చిన కవితా సంకలనం "ఆకురాలు కాలం"

ఆ సంకలనంలో.. అన్ని కవితలు ఎంతో..బాగుంటాయి. 

అందులోనుండి మచ్చుకి ఒక కవిత.

ఉద్యమ నేపద్యంలో ఉన్న తన చెలికాడు.. రాకని..అతని పోరాట పథాన్ని
అప్పుడప్పుడు చెప్పా పెట్టకుండా అతను వచ్చినప్పుడు ఆమెలో కల్గిన భావాన్ని 
నిర్దాక్షిణ్యంగా రాలిపోయిన వైనాన్ని..
ఆకురాలుకాలం రాకుండానే రాలిపోయిన నిజాన్ని..
యెంత బలంగా వ్యక్తీకరిస్తారో..మెహజబీన్.


                                             ఆకురాలు కాలం 

 -మెహజబీన్ 

అతనెప్పుడూ  అంతే 
ఒంటరిగా  రమ్మంటే  వసంతాన్ని  వెంట  తెస్తాడు

ఆరుబయట  ఆకుల  నిశ్శబ్దంలో
చెట్లు  కవాతు  చేస్తున్నాయి
ఆ  సెలయేటి  నీళ్ళల్లో
ఆకాశ  చిత్రం  ఘనీభవించింది 
చుక్కలు  కరిగి  రాలుతున్న  దృశ్యం
లీలగా  గుర్తుంది

వద్దు ...
నాకు  వెన్నెలా  వద్దు, పున్నమీ  వద్దు
సూర్యుడొక్కడు  చాలు

అతని  నిరీక్షణ లో  ఈ  నల్లని  రాత్రి  అలా
గడవనీ ...

అతనెప్పుడూ అంతే
వస్తూ  వస్తూ పాటల్ని  వెంట తెస్తాడు

అతని సమక్షంలో 
పోగొట్టుకున్న  బాల్యం  తిరిగి  ప్రవహిస్తుంది
శరీరం  అనుభవాల పాఠశాల అవుతుంది 
నేను  అతని గుండెల్లో దాక్కుని  పడుకుంటాను
ఝామురాత్రి
నిర్దాక్షిణ్యంగా  నన్ను  లేపి
మంజీరనాదాల్ని తూటాలు  
వెంటాడిన  వైనం
చెబుతాడు
అప్పుడు భయంగా  అతన్ని  
నా గుండెలోనే  దాచుకుంటాను

అతనిప్పుడు  లేదు
ఈ మధ్య  అర్ధాంతరంగా  వచ్చిన
ఆకురాలే  కాలానికి  ఎక్కడ  రాలిపడ్డాడో  ?