నా కవిత్వానికి మంచి పరిచయం.. డా. రాధేయ గారి సమీక్ష.
కవితా సంపుటి వెలువడిన రెండేళ్ళ తర్వాత... ఈ సమీక్ష రావడం.. కవిత్వంపై కల్గిన అయిష్టాన్ని కొద్దిగా మటుమాయం చేసింది.
***********************
అతివల ఆత్మ రక్షణాయుధం
వనజ తాతినేని -"వెలుతురు బాకు'!
****************************
. ...డా.రాధేయ
నన్ను నేను వ్యక్తీకరించు కోలేనప్పుడు వేరొకచోట స్పష్టతని చేజిక్కించుకోవడం లో విఫలమైనప్పుడునాకునేనేఅర్థంకానప్పుడు
ఓ అస్పష్ట కవిత్వాన్ని అవుతాను.
మళ్లీమళ్లీ చదువుకుంటూ మరల మనిషి నవుతాను.మరో రోజు మొదలైన చోట
కవి నవుదామని అత్యాశతో,
మధనపడిన,వేదనకి అక్షర రూపమే ఈ "వెలుతురు బాకు" అంటూ తనకు తాను
పరిచయం చేసుకున్న కవయిత్రే..
వనజ తాతినేని గారు.
కవిత్వాన్ని నేనొక సాహిత్య ప్రక్రియ గా మొదలు పెట్టలేదనీ,చెప్పలేని అసంతృప్తి ఏదోఏదో అలజడి చేస్తే రాశాను.తిలక్ అన్నట్లు నాలో నేను దొరుకు తానని,
చాలా ఓపెన్ హార్ట్ గా చెప్పిన వనజ తాతినేని గారి కవిత్వం ఇటీవలే నాకు అందింది.ఈ కవిత్వం 2018 లో
వచ్చినట్లు తెలుస్తోంది.
వీరు వర్ధమాన రచయిత్రి గా ఇటీవలే సాహిత్య రంగం లోకి ప్రవేశం పొందినప్పటికీ
ఏదో చెప్పాలన్న తపన ,అంతే గాకుండా
సమాజంలో సాటి స్త్రీ ,ఎదుర్కొనే సామాజిక అవమానాల పట్ల దుఃఖ పడుతూ ,మగవారికి స్త్రీ ఒక ఇంస్టెంట్ ఫుడ్ లా,నిల్వ ఆహారాల్ని వెచ్చజేసుకునే
ఓవెన్ లా కన్పించడాన్ని సహించలేని సగటు ఇల్లాలిగా,
అభ్యుదయ భావుకు రాలిగా కవిత్వమై పలికింది ఈ కవయిత్రి.
"మీ కన్నా ఒక ద్వారం ఎక్కువ ఉన్న వాళ్ళం. ఆ ద్వారం నుండే లోకాన్ని చూడటానికి అనుమతిచ్చిన వాళ్ళం.
నిత్య సాంగత్యపు గాయాల సలుపు తీరకుండానే
జీవనౌషదాన్ని పూసుకుంటూ యంత్రాల్లా
పరిగెడుతున్న వాళ్ళం.
ప్రేమతోనూ చెపుతున్నాం..పరుషంగానూ చెపుతున్నాం
ఎలా చెప్పినా మీరిది విని తీరాలి ఇది రుధిర ద్వారాల మాట
ఇది దశమ ద్వారాల మాట" పుట 30
ఒక స్త్రీ గా,సాటి స్త్రీలపై జరుగుతున్న అకృత్యాలపట్ల ఇటీవల ఇంత క్రోధం తో ,ఇంత సూటిగా ,ఇంత నిర్భీతిగా,ఒక వర్ధమాన రచయిత్రి హెచ్చరించిన సందర్భాలు నేను చూడలేదు,
అందుకే ఈ కవయిత్రిని, వీరు రాసిన వెలుతురు బాకు కవిత్వాన్ని పరిచయం చేయాలన్పించి చేస్తున్నా..
ప్రసవ వేదన తర్వాత అపురూపంగా బిడ్డని చేతుల్లోకి తీసుకున్న తల్లి చిరునవ్వు లా నాకీ 'వెలుతురు బాకు' అనిపించింది.
ఓట్లడిగే అధికారం వారి కున్నప్పుడు ప్రశ్నించే అధికారం మనకూ ఉందని మర్చి పోకండి.ఎవరి ఆయుధం వారి చేతిలోనే ఉండాలి.అరువు ఆయుధాలు ఎన్నటికీ అవసరం లేదంటారు .కవయిత్రి.
రక్షణ లేని వ్యవస్థలో ఎవరిని వారే రక్షించు కోవాలంటారు
"అమ్మల్లారా
చీరకొంగుల్లో చిటికెడు కారమైనా దాచుకోకుండా
చేతిలో చిన్న చుర కత్తెయినా లేకుండా
ఫిర్యాదు చేయడానికి వెళ్ళకండి"..పుట33
వయసుడిగినా సరే,పరస్త్రీఅనాటమీలో
అమ్మ అనాటమీ చూడలేని అనాగరిక సంస్కృతిని నిరసిస్తారు
హాస్టల్ లో ఉన్న ఆడపిల్లలని చూస్తే అక్వేరియం లోఅలుపు లేకుండా తిరిగే
రంగురంగుల చేపల్ని చూసినట్లు గా ఉంటుందట వీరికి.
నాలోనూ ఒక నది,నీలోనూ ఒక నది అంతర్లీనంగాప్రవహిస్తూ ఉంటుంది.
మనమంతా మత మవసరంలేని
మానవాలయాలను నిర్మించుకుందాం.
డాలర్ల వేటకోసం పల్లెలు ,పంటపొలాలన్నీ
జిల్లెళ్ళవనాలు కావడంసహించలేకున్నారు.
నాగలి బతకాలి,పచ్చదనం ఆవిరి కాకూడదంటారు.
14 సంవత్సరాల బాలికను 12 మంది యువకులు సామూహికంగా అత్యాచారం చేశారన్న వార్త చదివాక చలించిపోయి అవయవ దానం పేరుతో తీక్షణంగా ధిక్కార స్వరం వినిపించారు కవయిత్రి.మనిషి జీవించడానికి రోటీ కపడా మకాన్ కాదు
వాటికంటే ముందు..
విసర్జించడానికి,స్ఖలించడానికి ఓ క్షేత్రం కావాలి మరుగు దొడ్డి కన్నా మగువ అల్పంగా తోస్తోందా,ఆవు కన్నా ఆడది స్వల్పంగా కనపడుతోందా..అంటూ నిలదీసే స్వరం ఇవాళ ఎంతమంది కవయిత్రులకుంది?
"అమ్మల్లారా !
మూకుమ్మడిగా అవయవాల ఆయుధాలని విసర్జించేద్దాం కడలండి.
అవయవ దానానికి కూడా పనికిరాని అవయవాల కోసం నిత్యం
కాట్లాడే కుక్కల్లా పొంచి ఉండే నక్కల్లా వేటాడే హైనాల్లాంటి వారి నరాల తీపుల కి కోట్ల యోనుల ని ఈ నేల మీద పరిచి
రేప్ కోర్టులు నిర్మిద్దాం రండి" ...పుట 87
ఇంత తీక్షణ స్వరం ఎంతమంది కుంది చెప్పండి.ఇంతే కాదు,కవిత ముగింపు లో
కుట్టేసిన యోనులు,కోసేసిన కుచద్వయాలు వంటి పద ప్రయోగాలు కూడా చేశారు.
అమ్మంటే అస్థిత్వమని,ఆవలి గట్టు కు వంతెననీ,తొందర పడి కురవని ఓ బరువు మేఘమని చెబుతూ,అమ్మమనసు లోని మాటను,అమ్మచేతి గాజులను కవిత్వం చేస్తుంది.
ఆకాశాన సగం మనమే,అణిచి వేతలోనూ
అందరి కన్నా ముందు మనమే ఎందుకీ వివక్ష .?
ఆధునిక మహిళ అంటే అంతర్జాతీయ అంగడి సరుకా ?
ఆమె ఇప్పుడు ఆధునిక మహిళ..
"స్త్రీల ఆస్తిత్వ మంటే
చెప్పుకింద తేలు కాదు నలిపేయడానికి
తోక త్రొక్కిన త్రాచు లాంటిదని
నిద్రాణంలో ఉన్న మగువలు మేల్కొంటే పర్వతాల కూసాలే కదులుతాయనే నిజాన్ని చాటుతూ
మగువ మండే భాస్వరం కావాలంటూ
గౌరవాల నిశ్శబ్దాన్ని భగ్నం చేయాలన్నట్టు
సాగుతుందామె" .పుట156
నిత్యం గర్వం గా భాషించే నా ఇంటి పేరు, పలానావారి అమ్మాయినని గుర్తింపునిచ్చిన ఇంటిపేరు, నిర్దాక్షిణ్యంగా చెరిపేసి,కొత్తగా పెనిమిటి ఇంటిపేరును చేర్చడం ఏమాత్రం
ఇష్టపడని ఇల్లాలు..
"నాకు ఎంతో బరువనిపించిన ఇంటి పేరు నేను మోయలేని ఇంటి పేరు
ఆడదో ఈడదో లేకుండా
ఏదో ఒకటి ఉండకుండా
వదిలించుకోవాలని ఉంది
నన్ను నేను నిరూపించుకోవాలని ఉంది.
పుట"౬..159
నువ్వు పునీతవు.అగ్నిపుత్రిక వారసురాలివి .మాన ధనం ,అభిమాన ధనం నీది.నీ దేహం దేహమే ఓ ఆయుధం కావాలి...అంటూ పిలుపు నిచ్చే చైతన్య దేహిత గా..
"అభయ,నిర్భయ,అజేయ నమూనా నీకొద్దు శరీరాలోచనల మురికిని
నీ కన్నీటి శుభ్రజలం తో జాడించేయి నువ్వొక పునీతవి కావాలి
నువ్వొక అపరాజిత గా మారాలి".16పుట..
ఇలా కవయిత్రి "వెలుతురు బాకు" లోని కవితలన్నీ అతివల నిప్పురవ్వలే.
బాలికగాఅమ్మాయిగా
గృహిణిగా,తల్లిగా నిత్యం అనుభవించే
సామాజిక,మానసిక,వ్యక్తిత్వ హింస పట్ల ధిక్కారస్వరమే,ఆత్మరక్షణ ఆయుధమే వనజ తాతినేని-వెలుతురు బాకు అని
నేను భావిస్తున్నాను.
ఇందులోని కవితలన్నీ దాదాపుగా ఒక స్త్రీ చైతన్యపు స్వరం లోంచీ దూసుకొచ్చిన అస్త్రాలే.
ఇంకా చెప్పాలంటే ఇవాళ స్త్రీ వాదులుగా
ముద్రపడి రాస్తున్న వారి కవిత్వం కంటే ఎలాంటి లేబిల్ అంటించుకోని స్త్రీ హృదయవాది కవిత్వం ఇది .కవిత్వం లో చిక్కదనం,లోతైన అవగాహనే వనజ గారి కవిత్వం .పుస్తకం పేరు కూడా తగినట్లు గా ఉందనిపించింది నాకు.
భావ పరిమళం నా కవిత్వం అని కవయిత్రి అన్నా, అందుకు తగ్గ లోతైన అభివ్యక్తి కూడా ఉందని నేనంటాను.
రెండ్రోజులు గా వెలుతురు కవిత్వాన్ని
నాతో చదివించి,ఈ నాలుగు మాటలు
నాతో పలికించిన కవయిత్రి కి అభినందనలు ధన్యవాదాలు..
....డా.రాధేయ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి