3, ఏప్రిల్ 2020, శుక్రవారం

రేడియో కాలంలో

కాలానికి ఏదో ఒక  పేరుపెట్టుకోవడం  ఆనవాయితీ అనుకుంటే నేనొక కాలానికి రేడియో రోజులు అని పేరు పెట్టదలుచుకున్నాను. ఆరేడు దశాబ్దాలు రేడియో వినడం అనేదాన్ని కూడా ఆశ్చర్యంగా చూసిన కాలం దాటి  ఇంట్లో రేడియో వుండటమనేది హోదాకి దర్పానికి చిహ్నమై.. తర్వాత తర్వాత సామాన్యుడి ఇంట కూడా.. “బహుజన హితాయా బహుజన సుఃఖాయ” కి నిజమైన అర్దాన్ని ఇచ్చి సమాచార విజ్ఞాన వినోద కార్యక్రమాలను సాహిత్యాన్ని  ప్రజల మనసుల్లో ముద్ర వేసుకునేటట్లు శ్రవణపేయంగా అందించిన కాలానికి రేడియో కాలం అని గర్వంగా చెప్పుకోవచ్చు. 

ఇపుడంటే ఎపుడు కావాలంటే అపుడు అరనిమిషంలో కావాల్సిన పాటను వినే చూసే అవకాశం వచ్చి అంతే తొందరగా విరక్తి తెచ్చుకునే కాలంలో వున్నాము కానీ.. 

ఒకప్పుడు ఇష్టమైన పాట వినాలంటే .. ఎంత వేచి చూడాల్సివచ్చేది. చిత్రలహరిలో వేసే పాటలలో మనకిష్టమైన పాట వస్తే ఎంత సంబరం. అనుకోకుండా నాన్న బహుమతి ఇచ్చిన ఆనందం. ఇక 25 పైసల కార్డు కొనుక్కొచ్చి జనరంజని కార్యక్రమానికి కావాల్సిన పాటను కోరుకుంటూ ఉత్తరం రాసిన మూడో నాటి నుండి రేడియోకి చెవులప్పగించి ఎదురుచూడటం అనేది ఎంత మధుర జ్ఞాపకం. ఎపుడో ఒకపుడు మన పేర్లు వినిపిస్తూ మనం కోరిన పాటని వినిపిస్తూ.. వుంటే.. ఆ పాటతో గొంతు కలిపి ఎవరు ఏమనుకుంటారోనన్న బిడియం మరిచి హాయిగా గళం విప్పి గళం కలపడంతో పాటు గబ గబా చేతికందిన పుస్తకంలో పాట సాహిత్యాన్ని బర బరా రాసుకోవడం ఎంత ఆనందం.  


అలా సినీ సాహిత్యంలో మునిగి మునిగి ఆలోచనామృతం సాహిత్యం అనుకుంటూ.. డా. సి. నారాయణ రెడ్డి సాహిత్యం పై ఇష్టం పెంచుకుని.. “సిపాయీ.. ఓ సిపాయీ.. నీకై ఎంత ఎంత వేచి చూసాను ఈ వాలు కనుల నడుగు అడుగు ఇకనైనా.. “ అన్న పాటపై ఇష్టాన్ని.. మహ్మద్ రఫీ సుశీలమ్మ గళ మాధుర్యాన్ని సి.రామచంద్రన్ స్వరకల్పననూ వింటూ ఆనందడోలికలపై తేలియాడిన రోజులు.. రేడియో కాలం. .. అంటే అభ్యంతరమా.. 
సిపాయీ ..ఓ సిపాయీ ... పాట ఇక్కడ చూడండి . మేకప్ ఎక్కువై ఒకింత ఎబ్బెట్టు తప్ప .. బాలకృష్ణ దీప.. 💞 ఇక NTR దర్శకత్వం.. చూడవచ్చు ఇన్నేళ్ళ తర్వాత కూడా విసుగు పుట్టకుండా. 😊కామెంట్‌లు లేవు: