28, ఫిబ్రవరి 2015, శనివారం

కన్నీటి పడవ



కన్నీటి పడవ 

తల్లి  కన్నీరెడుతుంది
కల్లోల కడలిలో 
కన్నీటి పడవ ప్రయాణం చేస్తూ 
ఎదురుగాలిలో ఒంటిచేత్తో తెడ్డేస్తూ

పుడమికే కరువైన పచ్చదనం
లోగిళ్ళలో లోపించిన పచ్చదనం 
ఎండిన మానుపై పక్షులు గూళ్ళని వదిలి 
వలస బాట పట్టి మనిషికి దారి చూపిస్తూంటే
తల్లి కన్నీరెడుతుంది 

ఒంటెద్దు పోకడలకి కుదేలైన రైతు 
నోవాక్రాన్ తీర్ధంతో జన్మ సాఫల్యం వెతుక్కుంటుంటే 
దింపుడు కళ్ళం ఆశతో ఇల్లాలి నిరీక్షణని చూసి 
తల్లి కన్నీరెడుతుంది 

బుసలు కొడుతున్న  పెట్టుబడిదారీ  పశుత్వం 
రక్త పన్నీరు చిందిస్తున్న కత్తుల కర్కశం
అబలలపై అత్యాచారాలు కామాంధుల క్రీడా వినోదాలు 
ముంచుకొస్తున్న ప్రేమ విఫత్తులు 
బలవన్మరణాల విషాద కావ్యాలని విని 
తల్లి కన్నీరెడుతుంది  

అనాధలవుతున్న అమ్మానాన్నలని 
పట్టెడు మెతుకులకోసం 
అభిమాన యాచక పాత్రని చాచే చేతులని చూస్తూ     
 పానాలు, సేవనాలు, మత్తుమందుల ఉచ్చులలో
బిడ్డలా అధోగతిని చూస్తూ  
తల్లి కన్నీరెడుతుంది 

జ్ఞానదీపపు వెలుగుల్లో అతివల ఆలనా పాలన 
చీకట్లో చిగురాశలా గోచరిస్తుంటే 
భావి భారతానికి అహింసా మార్గాన్ని బోధిస్తూ 
 పతాక రెప రెపల్లో ప్రాణాన్నీ నిలబెడుతూన్న
భరతమాత ప్రయాణమిది
కన్నీటితో తనని తాను నింపుకున్న 
ఓటి పడవ ప్రయాణం ఇది
28/02/2015. 


Pic Courtesy  Siva Arts  Vijayawada

23, ఫిబ్రవరి 2015, సోమవారం

అలవాటుగా





అలవాటుగా

పచ్చని చెట్టుపై చిక్కటి నిశ్శబ్దంలో
ఒంటరి పక్షి ..
మౌనిలా ధ్యానం చేస్తుందో
పరద్యానంలో మునిగి పోయిందో

పంజరంకాని చోట కూడా
నిశ్శభ్దాన్ని పూరించేవారు లేక
ఒంటరి తనాన్ని ఆశ్రయించలేక
దిగులు మేఘం తొడుక్కుని
గుబులుగా కూర్చుంది ఒంటరి పక్షి

ఒకోసారి ప్రవాహంలా
మరొకసారేమో ఘనీభవించి
నీటి లాంటిదే పలుకు కూడా
కుట్టేయడం కట్టేయడం దాచేయడం
మంత్రనగరిలో చాలా మామూలైన విషయం

అప్పుడప్పుడూ ఏవేవో జాడలు
వద్దన్నా పక్షి  మనసు పై  పిచ్చి  నాట్యం చేసి
ఆలోచనలని కెలికి వెళతాయి
 హృదయానికొక రక్షణ కవచం తొడగబట్టి సరిపోయింది కానీ . .
లేకపోతే ఎన్ని  గాయాలు?

అంతదాకా కూర్చుంది చెట్టుపైనే కాబట్టి
పూలు ముల్లు రాళ్ళు ఏవి  పడతాయోనన్న ఆలోచనే లేదు
అచేతనలో అలా బయటకడుగు వేసిందేమో
ప్రమేయమేమీ లేకుండా  ప్రమోదం సంగతి ప్రక్కనబెట్టి
ఎవరి తీర్పులు వారు ఇచ్చేసాక
 ఎవరి తీర్మానాలు  వారు చేసేసాక
జరగాల్సిందేదేదో జరిగిపోతూనే ఉన్నప్పుడు
 నిర్లిప్తతతన్న నేస్తం ఉంటే చాలనుకుంది

ఆవరించుకున్న స్తబ్ధతలు
ఆశ్రయించే మౌన వచనాలు
అన్నీ జన్మసహిత శిశిరంలో
రాలుతున్న ఆకుల్లాంటివే కదా !

మాట్లాడటానికైనా పోట్లాడటానికైనా
పలుకు వసంతం కోసం వేసారి పోతుంటుంది
ఓ రవం ఒడలెల్లా చుట్టేస్తుందని
నిశిరాత్రులని కరగదీస్తుంటుంది
నిశ్శబ్దాన్ని గెలిచి బ్రతకడమంటే
లోకాలని గెలిచి బ్రతకడం కన్నా
గొప్పని తెలిసి  పచ్చని చెట్టుపై
గుబులుగా కూర్చుందీ ఒంటరి పక్షి అలవాటుగా

15, ఫిబ్రవరి 2015, ఆదివారం

జీవితాన్వేషణ

దొరకాల్సింది ఎంతకీ దొరకదు
వెనక్కి  వెళ్ళి మళ్ళీ వెతుక్కోవాల్సిందే
గంపెడు జ్ఞాపకాలను జల్లెడ పడుతూ
అన్యమనస్కంగానైనా వెతుక్కోవాల్సిందే
ఆచూకీ చిక్కే వరకూ వెతకాల్సిందే!

ఎప్పుడో పారేసుకున్న నన్ను నేను వెతుక్కోవాలి
ఎక్కడ పారేసుకున్నానో ఎంతకీ గుర్తుకు రావడంలేదు

నాతో కలిసి నాలుగడుగులు నడిచావో లేదో
అలుపుతో నేనలా ఆగానో లేదో 
దూరపు కొండల నునుపులు ఆకర్షణతో
నువ్వు దారి తప్పి పోయావు

దీపం నా చేతిలోనే ఉంది
దారమూ నా చేతిలోనే ఉంది
అయినా నువ్వు దారి తప్పి పోయావు

ఈ అరణ్యపు దారులలో ఎక్కడని వెతకను 
ఈ మలుపులోనుండి వెనక్కి మళ్ళి
ఎప్పుడో పారేసుకున్న నన్ను నేను వెతుక్కోవాలి
ఎక్కడ పారేసుకున్నానో ఎంతకీ గుర్తుకు రావడంలేదు
ఓ జీవిత కాలం వెతుక్కోవాలి

నువ్వేమో నా వ్యధల గాథలలో ఒక కథవయ్యావు
నేనేమో మంచి కథకురాలినయ్యాను
ఆఖరికి కథలోనైనా నన్ను నేను వెతుక్కోవాలి
ఎప్పుడో పారేసుకున్న నన్ను నేను వెతుక్కోవాలి



8, ఫిబ్రవరి 2015, ఆదివారం

అరుదైన మ్యూజిక్ బిట్



రావోయి చందమామ చిత్రంలో "స్వప్న వేణువేదో సంగీతమాలపించే " పాటకి  ముందు ఆ చిత్రంలో ఒక సూపర్బ్ మ్యూజిక్ బిట్ ఉంది . ఆ బిట్ అంటే నాకు చాలా ..చాలా  ఇష్టం . ఆ ఇష్టంతో వెబ్ అంతా గాలించాను . ఆ  బిట్ ని  ఆడియోలో జతపరచలేదు  అందుకే ఎంత ప్రయత్నించినా లభ్యం కాలేదు కనుక  నా లాంటి సంగీత ప్రేమికుల కోసం నేనే కొంత శ్రమించి,శ్రద్ధ తీసుకుని ఈ వీడియో చేసాను . నా ప్రయత్నం ఎలా ఉందొ చూసి చెప్పండి ...  అదివరకు కూడా ఇక్కడ ఫ్రెండ్స్ తో  చర్చించాను కదా ! అందరూ అప్పుడు  సాంగ్  లింక్  ఇచ్చారు కదా ! కానీ  నేను అడిగిన బిట్ ఇది . ఎలాగోలా నేనే సాధించానొచ్  !  :)   


7, ఫిబ్రవరి 2015, శనివారం

The story of a flower beaten


countless flowers crushed for ever శీర్షికన 

The story of a flower beaten

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే ...  అన్న  కార్ల్ మార్క్స్ మాడు పగలగొట్టాలి అనేదాన్ని ఎప్పుడూ .. 

ఈ మగువ అంతరంగ వ్యధ  విన్నాక ... నిజమేననిపిస్తుంది.

 
నిన్ను చూశాక .... 
నిన్ను చూస్తే  దుఃఖం రావాలి 
కనీసం కోపమైనా రావాలి 
నిన్నారూపాన  చూసినప్పుడైనా 
కనీసం జాలి కలగాలి 
పోనీ..  తోటి మనిషన్న  సృహ కూడా  రాలేదు  
అందరూ  నాటి రాతి గుండె అంటారు 
ఇష్టమైనవాళ్ళు  నీకు రెండు గుండె లంటారనుకో ! 
నిజమే ముప్పై ఏళ్ళ పాటు 
నా జీవితంలో  నువ్వు భాగమయ్యాక 
మంచిగానో చెడుగానో నీకు ఒక అనుభవమయ్యాక 
నిన్ను చూసాక ఒక చిన్న కదలికైనా ఉండాలి 
ఇవేమీ లేవు ... ఒక నిర్వేదం 
నేను రాముడే కావాలనుకున్నాను 
నాకు రావణుడు తటస్థపడ్డాడు 
తప్పు చేసినా సరిదిద్దుకునే మనిషి కావాలనుకున్నాను 
నూరోక్కతప్పులని మౌనంగా ఉపేక్షించాను
భాద్యతగా ఉండాలనుకున్నాను 
బరువని, నీకడ్డు వస్తున్నాని తోసిపారేసావ్..   
 వాస్తవాన్ని అంగీకరించి హుందాగా నేను తప్పుకున్నాకైనా 
ఎలా ఉండాలి నువ్వు ? 
నీకు నువ్వంటే. ప్రేమ ఉండాలి
కనీసం  నమ్ముకున్న వాళ్ళ పట్ల భాద్యతయినా ఉండాలి
కనీసం చిన్న ఆశ అయినా ఉండాలి 
ఆరోగ్యంపై శ్రద్ద ఉండాలి 
ఇవన్నీ లేకుండా కూడా బ్రతుకుండాలి అంటే 
ఒక వైరాగ్య భావనైనా ఉండాలి . 
కౌగిలించున్నప్పటి సమయాలే కాదు . .. 
తర్వాత బోలెడంత జీవితమ్  ఉంటుందన్న సృహ ఉండాలి . 
 ఇప్పటికి కూడా ఇవన్నీ లేని  నిన్ను చూస్తుంటే 
మనుషులు ఇలా కూడా బ్రతికి ఉంటారా ? అనిపిస్తుంది . 
నీకు నాకు ఉన్న బంధం సహభాగినిగాను  కాదు , సహజీవనిగాను  కాదు 
అయినా ఏదో ఒక బంధం కలుపుతుంది .. అది ఆర్ధిక బంధం .  
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే ...  అన్న  కార్ల్ మార్క్స్ మాడు పగలగొట్టాలి అనేదాన్ని ఎప్పుడూ .. 
ఇప్పుడు నిజమనిపిస్తుంది . 




4, ఫిబ్రవరి 2015, బుధవారం

పులిస్వారీ



(చిత్రం చూసి సరదాగా వ్రాసిన కవిత్వం .. ముఖ్యంగా  అమాయకమైన అమ్మాయిల కోసం )

పులిస్వారీ 

ప్రేమంటే  రాతి ద్రవమని  
ఎంత వొడ పోసినా తొలిపేసినా
బరువైనదేదో మిగిలి ఉంటుందని 
తెలియని పద్మ పత్ర హృదయ ఆమె 

వేష భూషణం ధరించివచ్చినా 
వయసుకి ఒణుకొచ్చినా
మనసుకి జొరం  వస్తూనే ఉంటుంది 
వెలుగు కోసం రాత్రిని దున్నేస్తూ 
స్వచ్చంగా లేదని ప్రేమని  వడపోస్తూ 
ఊహల బాటలో  ముళ్ళు రాళ్ళేరేస్తూ  
 ప్రేమనే జీనుపై కూర్చుని 
కలల ప్రయాణం చేస్తూంటుంది 

వెన్నెల రాత్రులు, అమవాస చీకట్లు 
ఋతుకన్యలు, సీతాకోక చిలుకలు 
నేస్తాలై వెంబడిస్తూనే ఉంటాయి .

పెదవి ఒంపున జారిన మౌనరాగం
కంటిన  మెరిసిన  విధ్యుత్ తరంగం 
జుగల్బందీ ..గా మారి బాట చూపుతాయి  

అగాధాల అంచులపై  స్వారీ చేస్తూ 
మృత్యుకుహరాల ముంగిట్లో  వాలే వలస పక్షి ఓలే 
స్వేచ్చగా తరలిపోతుంటుంది 

దాలిగుంటలో మరుగుతున్న నీళ్ళలా 
ఓ వాంఛ తీవ్ర తరమయితే 
 ప్రయాణ ప్రమాదం
 ప్రమాద ప్రయాణం ... రెంటికీ తేడా తెలియదు 

మాటు వేసి అదును చూసి వేటు వేసే
 పులి పంజా దెబ్బ తెలియజాలకా  
ఓ వంచన  కాలసర్పమై కాటు వేసేదాకా   
కష్టమైనా  ఇష్టంగా  పులి స్వారీ చేస్తూనే ఉంటుంది.  
ఆమె పులిస్వారీ చేస్తూనే ఉంటుంది