కన్నీటి పడవ
కల్లోల కడలిలో
కన్నీటి పడవ ప్రయాణం చేస్తూ
ఎదురుగాలిలో ఒంటిచేత్తో తెడ్డేస్తూ
పుడమికే కరువైన పచ్చదనం
లోగిళ్ళలో లోపించిన పచ్చదనం
ఎండిన మానుపై పక్షులు గూళ్ళని వదిలి
వలస బాట పట్టి మనిషికి దారి చూపిస్తూంటే
తల్లి కన్నీరెడుతుంది
ఒంటెద్దు పోకడలకి కుదేలైన రైతు
నోవాక్రాన్ తీర్ధంతో జన్మ సాఫల్యం వెతుక్కుంటుంటే
దింపుడు కళ్ళం ఆశతో ఇల్లాలి నిరీక్షణని చూసి
తల్లి కన్నీరెడుతుంది
బుసలు కొడుతున్న పెట్టుబడిదారీ పశుత్వం
రక్త పన్నీరు చిందిస్తున్న కత్తుల కర్కశం
అబలలపై అత్యాచారాలు కామాంధుల క్రీడా వినోదాలు
ముంచుకొస్తున్న ప్రేమ విఫత్తులు
బలవన్మరణాల విషాద కావ్యాలని విని
తల్లి కన్నీరెడుతుంది
అనాధలవుతున్న అమ్మానాన్నలని
పట్టెడు మెతుకులకోసం
అభిమాన యాచక పాత్రని చాచే చేతులని చూస్తూ
పానాలు, సేవనాలు, మత్తుమందుల ఉచ్చులలో
బిడ్డలా అధోగతిని చూస్తూ
తల్లి కన్నీరెడుతుంది
జ్ఞానదీపపు వెలుగుల్లో అతివల ఆలనా పాలన
చీకట్లో చిగురాశలా గోచరిస్తుంటే
భావి భారతానికి అహింసా మార్గాన్ని బోధిస్తూ
పతాక రెప రెపల్లో ప్రాణాన్నీ నిలబెడుతూన్న
భరతమాత ప్రయాణమిది
కన్నీటితో తనని తాను నింపుకున్న
ఓటి పడవ ప్రయాణం ఇది
28/02/2015.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి