23, ఫిబ్రవరి 2015, సోమవారం

అలవాటుగా





అలవాటుగా

పచ్చని చెట్టుపై చిక్కటి నిశ్శబ్దంలో
ఒంటరి పక్షి ..
మౌనిలా ధ్యానం చేస్తుందో
పరద్యానంలో మునిగి పోయిందో

పంజరంకాని చోట కూడా
నిశ్శభ్దాన్ని పూరించేవారు లేక
ఒంటరి తనాన్ని ఆశ్రయించలేక
దిగులు మేఘం తొడుక్కుని
గుబులుగా కూర్చుంది ఒంటరి పక్షి

ఒకోసారి ప్రవాహంలా
మరొకసారేమో ఘనీభవించి
నీటి లాంటిదే పలుకు కూడా
కుట్టేయడం కట్టేయడం దాచేయడం
మంత్రనగరిలో చాలా మామూలైన విషయం

అప్పుడప్పుడూ ఏవేవో జాడలు
వద్దన్నా పక్షి  మనసు పై  పిచ్చి  నాట్యం చేసి
ఆలోచనలని కెలికి వెళతాయి
 హృదయానికొక రక్షణ కవచం తొడగబట్టి సరిపోయింది కానీ . .
లేకపోతే ఎన్ని  గాయాలు?

అంతదాకా కూర్చుంది చెట్టుపైనే కాబట్టి
పూలు ముల్లు రాళ్ళు ఏవి  పడతాయోనన్న ఆలోచనే లేదు
అచేతనలో అలా బయటకడుగు వేసిందేమో
ప్రమేయమేమీ లేకుండా  ప్రమోదం సంగతి ప్రక్కనబెట్టి
ఎవరి తీర్పులు వారు ఇచ్చేసాక
 ఎవరి తీర్మానాలు  వారు చేసేసాక
జరగాల్సిందేదేదో జరిగిపోతూనే ఉన్నప్పుడు
 నిర్లిప్తతతన్న నేస్తం ఉంటే చాలనుకుంది

ఆవరించుకున్న స్తబ్ధతలు
ఆశ్రయించే మౌన వచనాలు
అన్నీ జన్మసహిత శిశిరంలో
రాలుతున్న ఆకుల్లాంటివే కదా !

మాట్లాడటానికైనా పోట్లాడటానికైనా
పలుకు వసంతం కోసం వేసారి పోతుంటుంది
ఓ రవం ఒడలెల్లా చుట్టేస్తుందని
నిశిరాత్రులని కరగదీస్తుంటుంది
నిశ్శబ్దాన్ని గెలిచి బ్రతకడమంటే
లోకాలని గెలిచి బ్రతకడం కన్నా
గొప్పని తెలిసి  పచ్చని చెట్టుపై
గుబులుగా కూర్చుందీ ఒంటరి పక్షి అలవాటుగా

కామెంట్‌లు లేవు: