15, ఫిబ్రవరి 2015, ఆదివారం

జీవితాన్వేషణ

దొరకాల్సింది ఎంతకీ దొరకదు
వెనక్కి  వెళ్ళి మళ్ళీ వెతుక్కోవాల్సిందే
గంపెడు జ్ఞాపకాలను జల్లెడ పడుతూ
అన్యమనస్కంగానైనా వెతుక్కోవాల్సిందే
ఆచూకీ చిక్కే వరకూ వెతకాల్సిందే!

ఎప్పుడో పారేసుకున్న నన్ను నేను వెతుక్కోవాలి
ఎక్కడ పారేసుకున్నానో ఎంతకీ గుర్తుకు రావడంలేదు

నాతో కలిసి నాలుగడుగులు నడిచావో లేదో
అలుపుతో నేనలా ఆగానో లేదో 
దూరపు కొండల నునుపులు ఆకర్షణతో
నువ్వు దారి తప్పి పోయావు

దీపం నా చేతిలోనే ఉంది
దారమూ నా చేతిలోనే ఉంది
అయినా నువ్వు దారి తప్పి పోయావు

ఈ అరణ్యపు దారులలో ఎక్కడని వెతకను 
ఈ మలుపులోనుండి వెనక్కి మళ్ళి
ఎప్పుడో పారేసుకున్న నన్ను నేను వెతుక్కోవాలి
ఎక్కడ పారేసుకున్నానో ఎంతకీ గుర్తుకు రావడంలేదు
ఓ జీవిత కాలం వెతుక్కోవాలి

నువ్వేమో నా వ్యధల గాథలలో ఒక కథవయ్యావు
నేనేమో మంచి కథకురాలినయ్యాను
ఆఖరికి కథలోనైనా నన్ను నేను వెతుక్కోవాలి
ఎప్పుడో పారేసుకున్న నన్ను నేను వెతుక్కోవాలి

కామెంట్‌లు లేవు: