8, జులై 2018, ఆదివారం

బిహైండ్ హెర్ స్మైల్

ఈ రోజు ప్రజాశక్తి "స్నేహ" సంచికలో ప్రచురితమైన కథ .....


బిహైండ్ హెర్ స్మైల్


ఆమె అందంగా ఉంది మేకప్ లేకపోయినా. ఒకరిద్దరు తప్ప ఆమెని గుర్తు పట్టే అవకాశమే లేదు. మూతిని సున్నాలా చుట్టి గ్లాస్ డోర్ మీద  వేలితో సున్నాలు చుడుతూ లైట్ల వెలుతురులో మెరిసిపోతున్న నగరాన్ని చూస్తూ ఆలోచిస్తుంది. ఆమె ప్రక్కకి వచ్చి చిన్నగా నవ్వాడతను

"హలో "అంటూ పలకరించాడు. బదులు పలకలేదామె. చిరాకు కనబడనీయకుండా మేనేజ్ చేయాలనుకున్నా నొసలు ముడుచుకున్నాయి.

" కాస్త నవ్వొచ్చు కదా, ఆ ఫీల్ తప్ప మిగతావేవి మీ ముఖానికి అంత సూటవ్వవ్". 

ఆమె ముందుకి నడిచింది, అతనూ వెంటపడ్డాడు.

"మీలా నవ్వడం మరిచిపోయినవారిని కనీసం ఓ ఇరవై మందిని నవ్వించాలని జీవిత ధ్యేయంగా పెట్టుకున్నాను. తప్పంటారా " 

ఆమె  నవ్వింది. "ఆర్ట్ వేయడం మానేసి యిది యెప్పటి నుండి "

అతనూ నవ్వి " చూసారా నా మనసులో మాట చెప్పగానే నవ్వేసారు. కష్టాలు, కన్నీళ్లు, కోపతాపాలు, విషాదాలు అందరి జీవితంలో వుండేవే. కానీ యెప్పుడూ వుండాల్సింది ఓ చిన్న చిరునవ్వు, దానితో ప్రపంచాన్ని జయించవచ్చని తెలియకపోవడమే ఓ పెద్ద విషాదం. "

ఆమె ఇంకా నవ్వింది 

"గుడ్ ..యిలాగే నవ్వుతూ వుండండి"

******************

"నిన్ను లోకానికి సరికొత్త అందాలతో, నవరస భావాలొలికిస్తున్న చిత్రాలతో  పరిచయం చేస్తాను.  ఇప్పటివరకూ యెవరికీ  కనబడని నటిని పరిచయం చేస్తాను. అవకాశాలు లేక ఖాళీగా  వున్నట్టు వున్నావ్ కదా "

 "తొంబై   సినిమాల్లో నటించాక కూడా  యింకా  యెదురు చూపులెందుకు, వాస్తవాన్ని అర్ధం చేసుకుని ఆనందంగా బ్రతకాలి కానీ "

"ఖాళీగా వుండి మాత్రం యే౦ చేస్తావ్, కనీసం తల్లి పాత్రలైనా చేయొచ్చు కదా " 

" ఆ అవకాశాలెందుకు లేవు,  చాలా వున్నాయి, ఆ రోల్స్ చేస్తూ కూడా   అమ్మాయిగా వాళ్లకి లోబడి వుండనందుకే  యీ  ఖాళీలు "

"అసలు నువ్వు ఖాళీగా వుందెప్పుడూ, ఎప్పుడూ యెవరితో వొకరితో యె౦గేజ్ లోనే వుంటావుగా "

ఆమె నవ్వింది

"ఎన్ని పెళ్ళిళ్ళు ,  యెన్ని పెళ్లిదాకా వెళ్ళనీయని డేటింగ్స్"

"నా నిస్సహాయతని యె౦దుకు గేలి చేస్తావ్ కానీ,  మీ మగవాళ్ళ కళ్ళలో కురిపించే ప్రేమకి  దాసోహం  అని అనుకోవచ్చుగా "

" అదర్ధం అవుతుందిలే,ఇంతకీ నేను అడిగినదానికి సమాధానం చెప్పలేదు." 

"రెండు పెళ్ళిళ్ళు, ఒకటి  మ్యూచువల్  అండర్ స్టాండింగ్ తో డివోర్స్ .  మరో కొన్ని బ్రేకప్ లు తర్వాత రెండో పెళ్ళి నాకంత యిష్టం లేకపోయినా చేసుకోవాల్సివచ్చింది" 

"ఎందుకలా "  

"నన్ను నన్నుగా ప్రేమించానన్నాడు. నన్నెప్పుడూ ప్రశ్నించనని చెప్పాడు . సరేనని పెళ్లాడాను. ఏడాదిలోపే గాల్లో  వేలాడాడు  వెళ్లాడదీసిన మాటలకి మల్లే  "

"తర్వాత"

"తర్వాతేముంది,మళ్ళీ పాత జీవితమే "

"ఇన్ని పెళ్ళిళ్ళు, బ్రేకప్ లు, సమాజం దృష్టిలో   స్త్రీగా పాతాళానికి దిగజారిన మనిషివి నువ్వు "

తెరలు తెరలుగా   ఆమె నవ్వు.  ఆ నవ్వుల మధ్యలోనే "నా నటనకే  కాదు నాకు దిగజారుడు తనం లేదు, వాళ్లంతట వాళ్లే వచ్చి వాళ్లే వెళ్లిపోతుంటే వాళ్లని బందీలుగా చేసుకునే జాణతనం నాకబ్బలేదు "

"ఇక యిప్పుడేం చేస్తావ్, ఎవరో వొకరు పాతవాళ్ళతోనే  సరిపెట్టుకుంటావా, మళ్ళీ అందం యెర వేస్తావా" 

"ఎవరో వొకరు తీగని  మీటితే రాగం పలకనంటుదా,  ఎవరో వొకరు, ఖాళీ లోంచి  హృదయానికి నేరుగా  దారేసుకుని వచ్చామంటారు. అది నువ్వే కావచ్చేమో "

" ఛీ .. నిన్ను చూస్తుంటేనే అసహ్యం నాకు , ఏదో మోడల్ కి కావాల్సి కానీ , అసలు నిన్ను మోడల్ గా పెట్టుకున్నానని  నా భార్యకి తెలిస్తేనే విడాకులు యిచ్చేయగలదు". 

"ఆహా అలాగా, అంటుకోలేదన్న మాటే కానీ కళ్ళతో తాగేస్తున్న సంగతి నాకు తెలియదనుకోకు."  

"నా సంగతి సరే, ఆ హీరో వెంట పడతావెందుకు, అతని భార్య చేత  చెంపదెబ్బలు తిన్నాక కూడా "

"ప్రేమ,పెళ్ళి రెండూ శిక్షే మనిషికి. శిక్ష లేకుండా జీవితం వుండదుగా "

*************************

"నీకేమన్నా పిచ్చా, ఎందుకలా నవ్వుతావ్" అన్నాడు విసుగ్గా .

"మరేం చేయను, నాకేడుపు రావడం లేదు" 

"చచ్చిపోయిన నీ  రెండో మొగుడిని తడుచుకుని ఏడువు". 

"ఊహూ ..నాకు రావడం లేదు"  

"పోనీ, నీ ప్రియుడు యాక్సిడెంట్ అయి చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్న సమయాన్ని గుర్తుకు తెచ్చుకుని ఏడ్వు" 

"ఊహూ .. నావల్ల కాదు. అలాంటి సమయాన్ని యెప్పటికీ గుర్తుకు తెచ్చుకోలేను వాటిని  యెప్పుడో తుడిచేసాను" 

"పోనీ కోపంలో కూడా కోపంతో కూడా యేడ్వాలి..ట్రై చెయ్యి "

"అనాధగా  బ్రతికిన తన తల్లిని గుర్తుకుతెచ్చుకుని కన్నీరవుతూ  ఆరో ప్రియురాలితో యిప్పటికి   విలాసంగా బ్రతుకుతున్న  తండ్రిని తల్చుకునికోపంతో మండి పడింది."

"ఎక్స్ లెంట్ .. నాకు కావాల్సింది బాగా దొరికింది. అయినా నిన్ను యేడుపు సీన్ లో చూడటం చాలా కష్టం "

ఆమె నవ్వింది యెప్పటిలాగానే.

***************************

"ఇంతజరిగాక కూడా అంత ఆరాధన పనికి రాదు,అదీ పెళ్ళైన వాడిపై, నీ శ్రేయాభిలాషిగా చెపుతున్నా, అతనితో తిరగడం మానేయ్ "

"మరి నువ్వు పెళ్ళైన వాడివేగా"

"అతను వేరు నేను వేరు. నిన్ను కాలు కందనీయకుండా  బయటపెట్టనీయకుండా చూసుకునే భాద్యత నాది.  ఒప్పుకో"

"నన్ను బంధించడమంటే గాలిని బంధించినట్లే అని నీకు మాత్రం తెలియదూ" ..

"యూ .... అరవై ఆరు కూరలు రుచి చూసేదానికి రోజూ ఒకే కూర యెలా నచ్చుతుంది."

ఆమె పడీ పడీ నవ్వింది. కళ్ళల్లో నీళ్ళతో నవ్వింది. అతను ఆ భావనల్ని నిశ్శబ్దంగా చిత్రీకరించాడు. అరగంట తర్వాత చున్నీ ఆమె ఎదపై కప్పి  "సారీ ..కన్నీళ్ళతో నవ్వితే  యెలా వుంటావో చూడాలని ఆ ముఖాన్ని చిత్రించాలని అలా మాట్లాడాను . ఇక వెళ్ళొచ్చు."

"ఇక నాతో పని పూర్తై నట్టే కదా, రెమ్యూనరేషన్ పంపటం మర్చిపోకు  "

*****************************

"అవకాశాలు బాగా వస్తున్నాయిగా ..చూసావా నా ఆర్ట్ గొప్పదనం "

"కాదంటే నువ్వు బాధపడతావ్ కాబట్టి అలాగే అనుకో "

" నన్ను బాధ పెట్టకూదదనుకుంటే  నువ్వు ఇంకోదానికి  వొప్పుకోవాలి "

"........."

ఇండస్ట్రీ అంతా అనుకుంటుంది. ఆర్ట్ వేసేటప్పుడు  నువ్వు బోల్డ్ గా సహకరించావని, నేను లోలోతులు సృశించానని "

".............."

"ఏమిటీ  సైలెంట్ అయ్యావు,  రేపు రాత్రికి  నేనే వస్తాను మీ ఇంటికి"

"అదే ఎందుకంటున్నా "

" నువ్విచ్చే పార్టీ కి, ఇంకెవరైనా వస్తున్నారా, యేమిటీ "  

"అవును , ఏ కళ్ళైతే నా మనసుని స్వచ్చంగా  తాకాయో ఆ కళ్ళని నేనెప్పుడూ మర్చిపోలేను,ఏ చూపుల వెచ్చదనమైతే నను తాకిందో అప్పుడే నేను మంచులా కరిగిపోతాను.అది మాత్రమే  సత్యం. మిగతాదంతా అబద్దం"
"భ్రమలో బ్రతుకుతున్నావ్, లోకమంతా నిన్ను అతని ఉంపుడుగత్తెవి అనుకుంటుంది "


"లోకంతో నాకెందుకు, నా బ్రతుకు,నా యిష్టం "


"అతని కోసమే మొగుడిని వదిలేసావని, రెండో మొగుడిని నువ్వే చంపేసావని అనుకుంటున్నారు "


"మాటాడుకోవడానికి యేదో వొకటి కావాలి, వాళ్ళ సమయాలని అలా సద్వినియోగం కానీయండి "


"అంతే  కానీ అతనిని వొదలనంటావ్, అది అబద్దం అని కూడా అననంటావ్" .


"పోనీ అది  అబద్దమే  అని నువ్వే అనుకోవచ్చు కదా !"


" వుహూ ఆ అబద్దంలో బ్రతికి చూడాలని నాకు వుత్సాహంగా వుంది కాబట్టి ".


"అబద్దంలో బ్రతికే  మీ సోకాల్డ్  ప్రపంచాన్ని నిజం చేయాలనే ప్రయత్నం యెందుకు గాని, ఆ ప్రయత్నం విరమించుకో "


"కో స్టార్ తోనే కాదు, కొడుకు వరుసతో నటించిన వాళ్ళతోనూ ఎఫ్ఫైర్ నడుపుతున్నావని లోకం కోడై కూస్తుంది.మరి దానికేమంటావ్"


"కడుపాకలి వొకటే కాదని లోకానికి తెలిస్తేనూ, మనిషికి విచక్షణ కూడా వుంటుందని తెలిస్తేనూ బాగుంటుంది"


"పెద్ద ప్రతివతా శిరోమణి బయలుదేరింది లోకానికి నీతులు చెప్పడానికి "


"ఇంటికెళ్ళి నువ్వు చేసే పని అదేగా "


"యూ .. .. " మళ్ళీ తిట్టాడు.


ఆమె  బిగ్గరగా నవ్వి "థాంక్స్ అలోట్, నన్ను  యెల్లప్పుడూ నవ్విస్తాననే మాట నిలబెట్టుకున్నావ్, నిన్ను గుర్తు తెచ్చుకుని నవ్వుకుంటూ వుంటానెప్పుడూ "   అంటూ  నవ్వింది యింకా   తెరలు తెరలుగా .. మనుషులు  పొరలు పొరలుగా  మరింత అర్ధమవుతుండగా .


అతని  యింటి యెదురుగా బీచ్ వొడ్డున పెద్ద పెద్ద కటౌట్ లు నవరసాలు వొలికిస్తూ.  ఆగి చూస్తున్న జనం, స్పీడ్ గా వెళ్ళే కార్లు కూడా  స్లో అయి ఆరాధనగా  మరీ చూస్తూ..


కిటికీ దగ్గర నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తూ కసిగా పెదవి కొరుక్కుంటూ " యూ బిచ్ " అని తిట్టుకుంటూ   


స్వేచ్ఛగా, స్వచ్చంగా, హాయిగా నవ్వుతున్న ఆమె చిత్రం క్రింద అతను వ్రాసిన కోట్ పైనే చూపు ఆగింది.


behind her smile,

there is a story you would never understand.

కామెంట్‌లు లేవు: