6, జులై 2018, శుక్రవారం

నీకు నాకు మధ్య

నీకు నాకు మధ్య  12 -  (24) - 06

రాయాల్సింది ఇంకా బోలెడు మిగిలే వుంది

ఇప్పటికి సంక్షిప్తంగా ఇలా ..

నా కలలకు రంగులద్దింది నువ్వేనని

నీకు నాకు వర్ణ సామరస్యం కుదిరందనీ

నా కన్ను తడిస్తే నీ హృదయం చెమ్మగిల్లిందనీ

నేను గొప్పగా పూజించాననో

నువ్వెంతగా ప్రేమించావనో నేనస్సలు చెప్పను.

కాల ప్రవాహంలో

యెనిమిది చేతులు కలిసి దడి గట్టి పనిగట్టుకుని

అంటు కట్టబడిన రోజది అదే .. మే 12.


శలభంలాంటి ఆకర్షణ శక్తి కో

అణిగి పడుండని మూర్తిమత్వమో కానీ

గాలి వాటుకు కొట్టుకుపోయే విత్తులా నువ్వు

చెట్టు క్రిందనే రాలిన పువ్వులా నేను

ఓ ముడి మాత్రం బిగిసి పడుందక్కడే

నిజమో కాని అబద్దమో..

ఓ జీవిత కాలపు వాగ్దానం నిలబడింది

నీకూ నాకు మధ్య

అమ్మలా నాన్నలా...నవంబర్ 24


రెండు పుష్కరాలకు యేడాది తక్కువగా

సాలుకొక తూరి తొలకరి చినుకుకి

తడిసిన భూమిపై లేచిన ఆవిరిలా

ఓ జ్ఞాపకపు చెమ్మ

మనువు కొమ్మను పట్టుకుని వూగుతూ

జీవిత కాలపు నెగడు సెగకు కాగుతూ.

చతురంగబలంతో పోరాడి వోడిన రాణిలా..

అపజయానికి కృంగని ధీరలా

విధిపై నెపమేయకుండా

మరతనం వెనుక కూడా

ఆ.. మే 12 ని గుర్తు చేసుకుంటూనే ..


వస్తా వొంటిగానూ పోతునూ వొంటిగానే

తామరాకుపై నీటి బొట్టు బంధాలన్నాక

యేది గాఢం యేది సాంద్రం.

నేలరాలిన ఆకులా నువ్వలా..

కడతేరింది ఈ బంధమిలా..

ఆ ..జూలై 06 లా.

కామెంట్‌లు లేవు: