27, జులై 2018, శుక్రవారం

ఈ కవిత్వం ఆత్మజనిత వాక్యం

జీవన విధానంలో కాస్తంత సంఘర్షణ,సమాజంలోని సంక్షుభిత సంఘటనలకు స్పందించే హృదయం, మనసులో మరి కాస్తంత చెమ్మదనం, ఆలోచనల్లో పరిస్తితులన్నింటినీ విశ్లేషించే స్వభావం ఇవి ఉన్న వ్యక్తి తప్పనిసరిగా ఎప్పుడో ఒకప్పుడు కవి కాగల్గుతాడు. వీటన్నింటికి మాతృ భావనలు తోడైతే ఇదిగో ఇలా వెలుతురు బాకై అక్షరాల్ని చెక్కుతారు.

"నన్ను నేను కోల్పోయిన చోటే తనని తానూ వెలిగించుకుంటూ తరిగిపోతున్న కాలంతో పాటు జీవించడం తెలిసిన వారు అక్షరప్రవాహమై పరుగులు తీస్తారు వనజ తాతినేని మాదిరిగా.

ప్రపంచీకరణ నేపధ్యంలో రెక్కలు విచ్చుకోవడం మొదలు పెట్టిన దగ్గర్నుండీ యువతరం చూపు పడమటి దిశ వైపుగానే ఉంటుంది. ఆ సందర్భంలో ఈ కవయిత్రి పలు విధాలుగా అనేక కవితల్లో స్పందించారు. ఇంత కాలం తమ కళ్ళ ముందు తిరిగిన పిల్లలు ఎగిరివెళ్ళిపోతుంటే వారి కళ్ళలో మెరుస్తున్న భవిష్యత్ పైన ఆశని చూస్తూ వాళ్ళ బాగుని కోరడం తప్ప ఏమనలేని నిస్సహాయత్వంతో మరబొమ్మలుగా నిలబడిపోయిన అనేకానేక తఃల్లుల మౌన భాషణాన్ని అక్షరీకరించారు పిల్లల ఆలోచనలు కొత్తపుంతలు తొక్కుతున్నాయనీ, శ్రమని మారకపు విలువతో లెక్కించుకుంటూ మేధోసంపత్తి పడమటికి వలసపోతుందని అమ్మ మనసులో మాటగా ప్రతిధ్వనించారు.

ఎన్నెన్నో శాస్త్ర విజ్ఞాన పరిశోధనల ఫలితంగా అరచేతిలోనో , ముందున్న టేబుల్ పైనో వేల మైళ్ళ దూరంలోని కన్న బిడ్డని తెర మీది బొమ్మలుగా చూస్తూ ఉంటోన్నా సరే స్పర్శని కనిపెట్టడం తెలియని శాస్త్ర విజ్ఞానాన్ని పరిహసిస్తారు కవయిత్రి.

"ఏడాదికి ఒక ఎకరా లెక్కన తెగనమ్మి

పదిలంగా పెంచిన ఒకే ఒక వృక్షం

పదిమందికి.. నీడ నిస్తుంది అనుకుంటే..

పరాయి క్షేత్రంలో వేసిరివేయబడ్డ విత్తులై.. ..

డాలర్ల కాపు కాసే చెట్లైతే.. పెరడే కాదు..

ఊర్ల కు ఊర్లే.. బావురుమంటున్న దృశ్యాల్ని .

ప్రత్యక్ష ప్రసారాలతొ .. చూపించాలని ఉంది " అంటూ ఈ నాడు అనేక కుటుంబాలలోని అనుభవాన్ని ,మేధో వలసల్ని బలమైన అభివ్యక్తితో దృశ్యమానం చేసారు కవయిత్రి.

అందుకనే జీవితం జీవితాన్నే ఖాళీ సంచిగా మార్చి బిడ్డలెప్పుడో చేతికి తగిలించుకుని వెళ్ళారని వేదన చెందుతారు.

ఈ కవయిత్రి నదిపై ,జలవనురలపై గల అమితమైన ప్రేమని అనేక కవితల్లో, పద చిత్రాల్లో,భావ చిత్రాలుగా ప్రదర్శించారు. ఆమె చినుకులో చినుకుగా,వరదగా ,నదిగా ,ప్రవాహంగా పరవళ్ళు తోక్కాలనే భావన అనేక పంక్తులలో అలలు అలలుగానో , కెరటాల రూపమై ఉవ్వెత్తున ఎగసిపడుతూనో, ప్రవహిస్తూనో ఉంటుంది. అతని ప్రేమలో మునుగీతలు కొట్టాలనుకుంటారు. చదువుల సముద్రంలో రేంకుల ఓడలపై ప్రయాణిస్తున్న యువతరాన్ని చూసి దిగులు పడతారు. సెజ్ ల పేరిటా , ఆనకట్టల పేరిటా నదీ ప్రవాహాలని మానవ దేహాల మీదుగా మళ్ళించే ప్రయత్నాలకి నిప్పులు చెరుగుతారు. మానవత్వపు జీవనదికై అలమటిస్తూనే ఉంటారు తన కవితల్లో.

నువ్వోదిలేసిన కాడితో అనే కవితలో .. "బాధల్లన్ని మరిచిపోవాలని

అప్పుడు ఆ మందు తాగినావు ..

ఏకంగా ఇప్పుడు ఈ మందు తాగేసి

పురుగులా మాడిపోయావు.

నన్ను గాలికి ఒగ్గేసి..

నువ్వు గాలిలో కల్సిపోయాక

నేను రోజూ ధైర్యం అనే మందు తాగుతూనే ఉండాను " అంటూ రైతు ఆత్మహత్య అనంతరం రైతు భార్య మనోగతాన్ని ఈ కవితలో చూపించారు . నిజానికి ఆత్మహత్య చేసుకోవాలనుకునే వాళ్ళు ఒక్క క్షణం తమ తదనంతరం మిగిలిన వారి దుస్థితి గురించి ఆలోచిస్తే ఆ పని చేయలేరు. పాదాలన్నీ సాధారణమైనవే అయినా ఈ ఫంక్తులు మనసుని మెలిపెడతాయి. ఇక్కడ రైతు భార్య పక్షాన నిలబడ్డారు కవయిత్రి.

అదే విధంగా వేటాడ్డం ,భూమిని దున్నడం మాత్రమే తెలిసిన గిరిపుత్రులకి సాన పెట్టడమూ తెలుసనీ , మౌనంగా గుండెల్ని తడమడమే గాక బాణాలతో గుచ్చి చంపడమూ తెలుసని అంటారు.

అందుకే .. మూగబోయిన కలం నాలుక చీలికలు చీలికలుగా మారి దునుమాడటానికి సిద్దంగా ఉందని " వాకపల్లి బాధితులకి సానుభూతి ప్రకటిస్తారు. అదే విధంగా ఒక కవితలో చీకటి మాటున గిరి పుత్రులని మట్టుబెట్టి ఆ తల్లులకి గుండె కోటని మిగిల్చి అమాయకుల ప్రాణాల్ని ఎగరేసుకుపోతున్నందుకు రాజ్య హింసపై నిరసన తెలపడమే కాకుండా, అందుకే మర్నాటికి మరింత ఉద్యమ స్పూర్తి నింపుకున్న సూర్యుళ్ళుగా మారే గిరిపుత్రులకు తన సంఘీభావాన్ని ప్రకటించింది కవయిత్రి.

మనది కాని జీవితంలో నటిస్తున్న

నట ఊర్వశి' లం మనం.

విజ్ఞానపు పూలతో అలంకరించుకున్న

వసంత భామినిలం ..మనం..

వ్యక్తిత్వపు పరిమళాలు ,సమర్ధతా నైపుణ్యాలు ఉన్న

పట్టమహిషి "లం మనం.. అంటూనే మగువాని కొలతల మధ్య తయారుచేస్తున్న వస్తువులాగో , అంగడి సరుకు లాగో ,దేహ సంపదని బజారుపాలు చేస్తున్న వ్యవస్థ పై తిరుగుబాటు బావుటా ఎగరవేశారు కవయిత్రి. ఏ స్త్రీ అలా కాకూడదనే చింతనతో చరిత్రలో తమకొక అధ్యాయాల్ని మిగుల్చుకోవాలంటారు .

భారతీయతను అడ్డుకున్న స్త్రీ తనను తానూ కొవ్వొత్తిలా జీవితాన్ని కుటుంబం కోసం కరిగించుకుంటూ బతికే విధానాన్ని ఉగ్గుపాలతోనే వంటబట్టించుకుంటుంది. తీరా జీవితం చివరికైనా "అంతా ఇచ్చేశాను జవసత్వాలన్నీ ధారపోసి ఇంటి గుమ్మానికి తోరణమయ్యాక " అపుడు తనకోసం మిగిల్చుకున్నదేవిటని తనను తానూ ప్రశ్నించుకుంటుంది ఇవ్వడం మాత్రమే తెలిసిన స్త్రీ మరణం వెతుక్కుంటూ వస్తే ఇవ్వకుండా ఉంటానా ? అనుకుంటుందంటారు కవయిత్రి .

అలా కాకుండా తనకొక అస్తిత్వం ఉందని ప్రతి స్త్రీ భావించాలని, ఎదిగే దిశలో ప్రయాణించాలని మనతో మనం మనలో మనం అంటూ పిలుపునిచ్చారు.

సమాజంలో స్త్రీలపై జరుగుతున్నా అత్యాచారాలకు,అణచివేతలకు తల్లడిల్లుతూ ..

"వయసు ఉడిగినా సరే / పరస్త్రీ అనాటమీ లో

అమ్మ అనాటమీ చూడలేని /అనాగరిక సంతతి వారిది " అని వికృతాభిరుచి కలిగి నది రోడ్డు మీద మృగాళ్ళుగా మారుతున్నవారిని వారు వారే . ఎన్నటికి మారని జాతి అని చీదరించుకుంటారు . బలమైన వ్యక్తీకరణతో అచ్చెరువు చెందిస్తారు కవయిత్రి

దుఃఖాల వారసత్వాలని మోయాలని లేదు నాకని అంటూనే ఒక సందర్భంలో "నన్ను నేను సేద తీర్చుకోవడానికి / చేద అరువు తీసుకునైనా దుఃఖాన్ని చేదుకోవాలని కోరుకుంటారు . నదిని ఈదిన నన్ను సముద్రం సవాల్ చేస్తుందంటారు. దుఃఖంతో కుమిలిపోవడం కాదు సవాళ్ళు ఎదుర్కునే దైర్యాన్ని సంతరించుకోవాలనే సందేశం నర్మగర్భంగా చెప్పారనిపించుతుంది.

"రెండు దేశాల మద్యనో రెండు ఇజాల మద్యనో

సరిహద్దుల వెంబడి మానవత్వపు నది

మెలికెలు తిరుగుతూ ప్రవహిస్తూనే ఉంది

దానిని మళ్ళించి మన హృదయసీమల్లో

శాంతిని పండించే విత్తనాలు నాటాలి" అంటూ తన శాంతి సందేశాన్ని ముంబై పేలుళ్ళ సందర్భంలో ఒక ఆశావాద దృక్పదాన్ని వెలుతురుబాకు కవితగా మెరిపించారు వనజ తాతినేని .

ఏ రంగంలోనైనా చొచ్చుకుపోయే స్వభావమే కాక తానూ చేస్తున్న కృషిని భూతద్దంలో జనానికి చూపి తమని తాము శిఖరంపై నిలబెట్టుకుని ప్రచారార్భాటం చేస్తేనే గాని ఇతరుల దృష్టికి ఆనం అనే దృక్పదం ఈ ప్రచార యుగంలో ప్రబలంగా ఉంది. అన్ని రంగాలలో లాగానే సాహిత్య రంగంలో కూడా దీనికి భిన్నంగాలేదు . సమాజంలోకి వచ్చి ప్రచారార్భాటం చేయనప్పుడు,చేసుకోలేనప్పుడు ఆ రంగంలో ఎంత కృషి చేసినా గుర్తింపు లభించదనే వాస్తవాన్ని "అక్షర శిఖరం" కవితగా అక్షరీకరించారు కవయిత్రి.

అమ్మ చేతి గాజులు గురించి వ్రాసినా,ఆర్ధిక సంబంధాలు గురించి చెప్పినా నిజాయితీ నిక్కచ్చితనం స్పష్టంగా ఉంది. అంత స్పష్టంగానూ చీకటి నిజాలను చూడగల్గే సహస్రాక్షుడైన పాత్రికేయ ఇంద్రుడు రావాలని అభిలషిస్తారు. కొన్ని కవితల్లొ స్వచ్చమైన ప్రేమ భావం గుభాళిస్తుంది. మరికొన్ని కవితల్లో ప్రేమ పొందలేక పోవడంతో ప్రేమరాహిత్యంతో కూడిన వ్యధాభరిత గాధల హృదయ స్పందనలు వినిపిస్తాయి. తన కోసం ఒక ఆలంబన కోసం వెతుకులాట ఉంటుంది. ఒక ఎడ తెగని నిరీక్షణ, తనని నమ్మిన వారి కోసం జీవితాన్ని సైతం ధారపోసేందుకు సిద్దపడే అమృతత్వం గుర్తించగలం. స్త్రీని ఆట బొమ్మగా,ఒక శృంగార చిహ్నంగా మాత్రమమే చూసేవారి పాలిట వెలుతురు బాకుగా మెరుపులు చిమ్ముతూ పదునైన వ్యక్తీకరణతో చీల్చి చెండాడేందుకైనా సిద్దపడే కఠినత్వాన్ని సంతరించుకున్న ఒక స్త్రీ మాతృ హ్రుదయాలాపనలు వినగలం.

సమాజంలో మహిళల జీవితాన్ని అల్లకల్లోలం చేస్తున్న సందర్భాలకి ఒకింత ఆవేశం,మరికొంత సహానుభూతితో చెమ్మగిల్లిన కళ్ళని ఈ కవయిత్రి లో పరికించగలం.

నేల రాలిన ఆశల్ని మిణుగురుల వెలుగులో ఏరుకుంటూ "

" వద్దన్నా పక్షి మనసు పై పిచ్చి నాట్యం చేసి

ఆలోచనలని కెలికి వెళుతుంది "

కష్టమైనా ఇష్టంగా అగాధాల అంచున ఆమె పులి స్వారీ చేస్తూనే ఉంటుంది " వంటి కవితాత్మక పంక్తులు పాఠకులని బాగా ఆకట్టుకుంటాయి.

మంచి ప్రతీకలతో బరువైన పద చిత్రాలు లేకుండా సరళమైన బాషలో సున్నితమైన భావ ప్రకటనలతో కవిత్వం సాగుతుంది. మరీ ఆవేశం వచ్చినప్పుడో,ఉద్యమ స్వభావంతో రాసినప్పుడో ఒక్కొక్కసారి కవితాభివ్యక్తి పలచని వచనంగా సాగిపోవడం అత్యంత సహజం. అటువంటప్పుడే మరికొంత సాధన అవసరమవుతుందని . రెండు మూడు కవితల్లో కవిత్వీకరణ తగ్గినట్లుగా ఉన్నా కానీ సమాజం పట్లా కవిత్వం పట్లా కవయిత్రికి గల అంకితభావం గమనించినవారికి అదంతా ప్రధానంగా తోచదు. అందుకే "పడి లేచే కెరటానికి ప్రతీకను ,అనంత కాలానికి ఉనికిని ..నేను స్త్రీని " అని తనని తానూ ప్రకటించుకోవడమే కాకుండా "మనల్ని మనంగా ప్రేమించే హృదయానికి చిరునామా ని " అంటూ దృఢ చిత్తాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారు.

కొన్ని కవితల ప్రచురణా కాలాన్ని బట్టి పది పన్నెండేళ్ళు గా కవిత్వం రాస్తున్నా ఇన్నాళ్ళకి పుస్తక రూపంలో తీసుకువస్తున్నందుకు వనజ తాతినేనికి అభినందనలు. కవితా హృదయం ప్రతీక్షణం ఆత్మజనిత వాక్యంతో జ్వలిస్తూనే ఉంటుందని అందుకే ఆమె కలం రాస్తూనే ఉంటుందన్న వనజ తాతినేని ఇకముందు కూడా మంచి కవిత్వానికి ఆనవాలుగా ఉండాలని మనసారా కోరుకుంటూ .

శీలా సుభద్రాదేవి.

19 నవంబర్ 2015.

హైదరాబాద్



కామెంట్‌లు లేవు: