వెలుతురు బాకు సృజనలో ..
ఆలోచనా కెరటాలు విరిగిపడ్డ మనసు తీరాన
ఉనికిని వెతుక్కుంటూ..నాలోపటికి నేనే వంతెన వేసుకుంటూ ..
ఏవేవో అస్పష్ట భావనలు మోస్తూ మోస్తూ
నేనలసి పోతాను, అక్షరీకరణలొను సొమ్మసిల్లి పోతాను
పొద్దంతా అదే పనైతే రేయంతా ఇంకో రకం సడి
కవితాలాలస జడి అనుకుంటా
బాహ్యాంత సంఘర్షణల మధ్య నేనొక ఒంటరి యోధురాలిని
నన్ను నేను వ్యక్తీకరించుకోలేనప్పుడు
వేరొక చోట స్పష్టతని చేజిక్కించుకోవడంలో
విఫలమైనప్పుడు నాకు నేనే అర్ధం కానప్పుడూ
ఓ అస్పష్ట కవిత్వాన్ని అవుతాను
మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ మరల మనిషినవుతాను
మరో రోజు మొదలైన చోట కవి నవుదామని అత్యాశతో ..
ఎదురైన కొన్ని సంఘటనలను,యెద తట్టిన దృశ్యాలను కలగాపులగం చేసుకుని నాలో నేనే మధనపడి ఆ వేదనకి అక్షర రూపమిచ్చిన కవిత్వమే వెలుతురు బాకు. నేను నత్త నడక కవయిత్రిని. నిత్యం పుంఖానుపుంఖాల కవిత్వం వ్రాయలేను. పదిహేనేళ్ళుగా కవిత్వం వ్రాస్తున్నాను. మొత్తం యెనబైకి పైగా కవితలు మళ్ళీ అందులో కొన్ని చచ్చువి,పుచ్చువి వున్నాయి. ఏదైనా వ్రాయాలనుకున్నప్పుడే వ్రాస్తాను తప్ప ప్రత్యేకంగా కవిత్వం వ్రాయాలని కూర్చుని వ్రాసినవి కాదు.
దారెంట వెళుతూ వుంటే వో దురహంకార పురుషుడు వొక బలహీన స్త్రీని "ఒసేయ్ .. ఇక్కడొక బూతు మాట .... నిన్ను గుడ్డలిప్పదీసి తంతానంటాడు, బస్ ప్రయాణంలో తోటి ప్రయాణికుడు ముందు నుంచున్న స్త్రీ తో అసహ్యంగా ప్రవర్తిస్తాడు, ఎవరికో సాయంగా హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు అక్కడ వ్యాధిగ్రస్తమనుషులని ఆ వ్యాధి తెచ్చిపెట్టిన సంక్షోభాన్ని విని విచలితమైపోతాను. ఏ స్నేహితురాలి కూతురినో చూడటానికి హాస్టల్ కి వెళతాను పిల్లల బాధల నది పై నేను కాసేపు ప్రయాణించి వస్తాను. ఊరికెళ్ళి శిధిలమైన యిళ్ళని, కాటికి కాళ్ళు జాపుక్కూర్చున్న వృద్దులని చూసి కన్నీరవుతాను. ప్రక్కదేశంలో రాజ్యం దురాగతాలని యె౦డగడుతూ అక్షరాలని శరాలని జేసి ప్రశ్నిస్తున్న పాత్రికేయుడిని పొట్టన బెట్టుకున్నతీరుకి స్పందిస్తాను. ఉగ్రవాదం రక్కసికోరలకి చిక్కి ప్రాణాలు కోల్పోయిన అభం శుభం తెలియని చిన్నారులని చూసి వేదన చెందుతాను. దృశ్య మాధ్యమం జన బాహుళ్యంలోకి జొచ్చుకొనిపోయి యె౦త హాని చేస్తుందో తల్చుకుంటూ వుడికిపోతాను తోటి స్త్రీల భాధలు విని గాయం వేల సందర్భాలు అనుకుంటాను, రైతు ఆత్మహత్య చేసుకుంటే అతని భార్య చావలేక బ్రతికి చస్తూ ఉండే వైనాన్ని చూసి ఆవేదన చెందుతాను.
నా చుట్టూ వున్న స్త్రీల జీవితాలని, వారిపై వున్న అణచివేతని చూస్తూ వున్నప్పుడు అందులో నన్ను నేను చూసుకుంటాను. అప్పుడు నేనూ తోటి స్త్రీల పక్షాన నిలిచి కవిత్వపు జెండానవ్వాలనిపిస్తుంది. నేను విన్నవి, కన్నవి యిన్ని బాహ్య ప్రపంచపు బాధలు నాకు నిద్ర లేకుండా చేసి కలవరపెడతాయి. అలాగే ప్రొద్దునే కురిసే మంచులో కావాలని తడిసి చలికి యె౦డ దుప్పటి కప్పుకోవాలని కూర్చున్నప్పుడు నా చీర చెంగు గాలికెగిరి యే గుత్తుల గులాబీ కొమ్మకి చిక్కు కున్నప్పుడో, యెదురుగుగా వున్న పచ్చని చెట్టుపై మౌనంగా తలవాల్చి కూర్చున్న వొంటరి చిలకని చూసినప్పుడో తోటంతా తిరిగే సీతాకోక చిలకల ఉత్సాహాన్ని చూస్తున్నప్పుడో అలా నాకవి హృదయం రాగరంజితమై కవిత్వం వ్రాస్తుంటాను తప్ప నేనేమి పెద్ద కవయిత్రిని కాను.
జీవితాన్నుండి, జీవితానుభవాన్ని నుండి నేనంటే యేమిటీ అనే చేతన నుండి కవిత్వం వ్రాయడం మొదలెట్టాను . దాదాపు పదిహేనేళ్ళ క్రితం వ్రాసిన మొదటి కవితకి మొన్న మొన్నే వ్రాసిన అక్షరాత్మ ఆశ్లేషం కి మధ్య ఎన్నో అనుభవాలున్నాయి. చెప్పలేని యేదో అసంతృప్తి యి౦కా చెప్పడానికి మిగిలిపోయినట్లు ఉంటుంది . కవిత్వాన్ని నేనొక సాహిత్య ప్రక్రియగా భావించలేదు కవిత్వం మానసిక సంవేదన. ఇంకా వివరంగా చెప్పాలంటే లోపలి వెలుగు. నాతో నేను మాట్లాడుకుంటున్న మాటలని అక్షరాలలో పెడతాను. కోపం,బాధ, నిస్సహాయత, కరుణ,జాలి,ఆవేశం,ఆక్రోశం ,ఆఖరికి ద్వేషం కూడా ఉంటుంది నా కవితల్లో. తిలక్ గారన్నట్లు నా కవిత్వంలో నేను దొరుకుతాను.
పూర్వ కవుల, నా సమకాలీనుల కవిత్వాన్ని చదువుతాను కానీ యే౦ చదివాను అంటే చెప్పడం కష్టం . అంతెందుకు నేను యే౦ వ్రాసానో నాకే యేమీ గుర్తు ఉండదు. ఎవరైనా మీ కవిత చెప్పండి అనడిగితే అప్పటికప్పుడు చెప్పలేను. నాకు దృశ్యాలే గుర్తుంటాయి కానీ అక్షర రూపం గుర్తుండదు. నిత్యం నేను నాతోనే సంఘర్షించుకుంటాను. పుడక పుడక కలిపి పక్షి గూడు అల్లుకున్నట్లు పదిహేనేళ్ళుగా నేను వ్రాసిన కవిత్వమే ..ఈ కవితా సంపుటి. నిజంగా చెప్పాలంటే నాకోసమే నేను ఈ కవిత్వం వ్రాసుకున్నాను. అందుకే పత్రికలకి పంపడం కూడా యిష్టం వుండేది కాదు. నాకు దాశరధి గారి రచనలంటే యెంతో యిష్టం . మహోంద్రదయం అనే పద్య కావ్యంలో ఈ వెలుతురు బాకు అనే పదం వస్తుంది . అర్ధం తెలుసుకుంటే చాలా బాగుంది అనిపించింది. 2006 లో ముంబాయి పేలుళ్ళ నేపథ్యంలో వ్రాసిన కవితకు వెలుతురు బాకు అనే శీర్షిక పెట్టాను. అదే ఈ కవితా సంపుటి టైటిల్ గా పెట్టాలని పదేళ్ళ పైగా నా కోరిక. దాదాపుగా అయిదారేళ్ళుగా వాయిదా పడుతున్న ఈ కవితా సంపుటి యిప్పుడు రావడమే నాకెంతో సంతసం.
నేను అడగగానే నా కవిత్వానికి ముందుమాట వ్రాయడానికి సంతోషంగా పెద్దమనసు చేసుకుని అంగీకరించిన సీనియర్ కవయిత్రి,రచయిత్రి శీలా సుభద్ర గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కొంచెం జాప్యంగా అయినా మరొక ముందుమాట వ్రాసిచ్చిన కల్పన రెంటాల గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. వీరిరువురు ముందుమాట రాసి పంపిన రెండేళ్ళ తర్వాత కూడా నేను నా కవితా సంపుటిని తెచ్చే ప్రయత్నానికి యేవో అవరోధాలు కలుగుతూనే వున్నాయి. కారణాలేదైనా కవిత్వమంటే విరక్తి కల్గిన దశలో వున్నాను.అప్పుడే ఒక వేదికపై కలిసిన శిలాలోలిత (లక్ష్మి) గారూ మీ కవిత్వం బాగుంటుందని ప్రశంసిస్తే మళ్ళీ కవినై జీవించిన క్షణాలవి. వెంటనే మీరు ముందు మాట వ్రాయాలని మాట అడిగి ఇప్పించుకుని ..ఇదిగో ఇలా "వెలుతురు బాకు" తో మీ ముందుకు వచ్చాను. ప్రతి కవితని చదివి ముందుమాట వ్రాసిన డా. శిలాలోలిత గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. శీలా సుభద్ర గారు శిలాలోలిత గారు వ్రాసిన ముందు మాటల మధ్య కాల వ్యవధి రెండేళ్ళు. ఆ కాలంలో ఓ ఇరవై కవితలు కొత్తవి వ్రాసాను.
కవిత్వం వ్రాయడమంటే రేడియో కార్యక్రమాలు విని అభిప్రాయ ఉత్తరాలు వ్రాసినంత సులభం కాదనే నిజాన్ని చెప్పిన నాగసూరి వేణుగోపాల్ గారి మాటలే నాలో పట్టుదలని పెంచాయి. కవిత్వం వ్రాయాలనే ఆకాంక్ష అప్పుడే కల్గింది. ఆ మాటలన్న రెండు నెలలకే ఆల్ ఇండియా రేడియో విజయవాడ కేంద్రం ద్వారా నవకవితావేదికలో నా కవిత్వం వినబడటం అది నా తొలి అడుగు. తర్వాతర్వాత నా కవితలు,వ్యాసాలు పత్రికలలో ప్రచురింపబడినప్పుడు చూసి చిరునామా తెలుసుకుని మరీ నన్ను ప్రశంసిస్తూ ఉత్తరం వ్రాసి అభినందించారు. అలా నాకొక సద్విమర్శతో స్పూర్తినిచ్చిన నాగసూరి వేణుగోపాల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
కవిత్వం పట్ల నాకున్న ఇష్టాన్ని గమనించి ఏడేళ్ళపాటు "నెల నెలా వెన్నెల కార్యక్రమాన్ని నిర్వహించే బాధ్యతని అప్పగించి ఆ వేదికపై ఎంతో మంది పూర్వ కవులని, వారి కవిత్వాన్ని పరిచయం చేసిన "ఎక్స్ రే "సాహిత్య సంస్థ విజయవాడ వారికి, నా కవితలని ప్రచురించిన పత్రికా రంగం వారికి, వెబ్ పత్రికల వారికి, పేస్ బుక్ కవిసంగమం ద్వారా కవిత్వాన్ని పాఠకుల దరికి చేర్చుతూ నేనే కవిత వ్రాసినా ప్రత్యేకంగా వుంటుందని ప్రశంసిస్తూ కవిసంగమం 5 సిరీస్ లో నన్ను వర్ధమాన కవయిత్రిగా పరిచయం చేసిన యాకూబ్ సర్ కి, ఇంకా నా కవిత్వాన్ని చదివి సద్విమర్శలు చేసి మిత్రులందరికీ హృదయపూర్వక నమఃస్సుమాంజలి. కవితా సంపుటి ముఖచిత్రం ..కావాలని అడిగిన వెనువెంటనే నా మనసులోని భావాలకి తగ్గట్టుగా చిత్రాన్ని అందంగా అర్ధవంతంగా చిత్రించి యిచ్చిన నేస్తం వారాణాసి నాగలక్ష్మి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. వెలుతురు బాకు ని ఇంత అందంగా ప్రచురించి యిచ్చిన సాహితీ మిత్రులు శ్రీ శ్రీ విశ్వేశ్వరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
వనజ తాతినేని,
విజయవాడ.
o7/07/2018.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి