31, మార్చి 2023, శుక్రవారం

యాభై యేళ్ళ జ్ఞాపకం


గతాన్ని తవ్వుకుంటేనూ బాల్యాన్ని స్మరించుకుంటేనూ.. మధుర జ్ఞాపకాలూనూ అనుభూతులూనూ.. 


ఎన్టీ వోడిని నేను సినిమాల్లో కాకుండా రెండు సార్లు సమీపంగా చూసానని.. తెలుగుదేశం పార్టీ ఆవిర్బావ దినోత్సవం జరుపుకుంటున్న తరుణంలో గుర్తొచ్చింది. 


మొదటిసారి చూసిన సంగతి కన్నా ముందు…

రెండవసారి చూసిన సంగతి మాత్రం తేలికగా గుర్తుంది.. 1982 లో అనుకుంటాను.నేను ఇంటర్మీడియట్  చదువుకుంటున్నాను. ఆయన పర్యటనలో భాగంగా మైలవరం లో సభ నిర్వహించినప్పుడు ఆయన వెనుకనే వేదికపై కూర్చోగల్గే అదృష్టం దక్కింది. ఎన్టీ ఆర్ కూడా మాతో పాటు వేదికపై పద్మాసనంలో కూర్చున్నారు. 


ఇక మొదటిసారి చూసిన జ్ఞాపకం కోసం యాభై యేళ్ళు వెనక్కి వెళ్ళి  జ్ఞాపకాలను తడుముకున్నాను.


బెజవాడ (విజయవాడ) నేను పుట్టినవూరుకు నా స్వస్థలానికి జంక్షన్ లా వుండేది. కనకదుర్గ గుడికి వెళ్ళి అమ్మవారిని యిప్పటి వరకూ  రెండు లేక మూడుసార్లు మాత్రమే దర్శించాను. మొదటిసారి.. మా పెద మామయ్య చిన్న పిన్ని తో కలిసి వెళ్ళినట్టు లీలగా గుర్తుంది. అదీ దసరా పండుగ తర్వాతని గుర్తు. 


మా అమ్మమ్మ గారింటి దగ్గర పెరిగే నేను పెదమామయ్య చిన్న పిన్ని తో కలిసి మా వూరు వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు వుండి తిరుగు ప్రయాణంలో కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ఆ తర్వాత మ్యాట్నీ షో   “పండంటి కాపురం” సినిమా చూసినట్టు గుర్తు. సినిమా కథ నా మెదడుకు యెక్కేంత వయసు నాకు లేదు కానీ.. ఆ సినిమా పూర్తి అయ్యేటప్పటికి చీకటి పడిందని, సినిమా అయిపోగానే.. ఆ సినిమా తెర ముందు వున్న పెద్ద అరుగుపైకి యెన్ టి రామారావు అక్కినేని నాగేశ్వరరావు కృష్ణ ఇంకా పేరు తెలియని సినిమాల్లో నటించే అమ్మాయిలు వొకరి తర్వాత వొకరు ఆ అరుగుపైకి వచ్చి కూర్చుని వొకరి తర్వాత వొకరు మాట్లాడి పూలగుత్తులు ఇచ్చుకుని దండలు వేసారని శాలువాలు కప్పారని గుర్తు వుంది. నాకు బాగా గుర్తుంది మాత్రం గంభీరంగా కోటు ధరించిన  యెన్ టి రామారావు గారు సన్నగా వున్న కృష్ణ గారు. వాణిశ్రీ వున్నట్టు కూడా లీలగా జ్ఞాపకం. వారందరూ సంచీ పట్టి హాలంతా తిరుగుతూ డబ్బులు సేకరించినట్టు కూడా జ్ఞాపకం. కరువొచ్చిందట, వారికి సహాయం చేయడం కోసం అలా చేస్తున్నారని మామయ్య అన్నట్టు జ్ఞాపకం. 


నేను మొదటిసారి చూసిన సినిమా అది. సినిమా లో అట్లా నటించి సినిమా అయిపోయాక తెర ముందుకు వచ్చి కనబడతారని అప్పుడు అనుకున్నాను. ఆ కార్యక్రమం అయ్యేటప్పటికి బాగా పొద్దుపోయింది. సినిమా నటులందరూ వెళుతుంటే అందరూ కాగితాల మీద సంతకాలు పెట్టించుకోవడానికి చేయి అందించడానికి పోటీపడ్డారు. ఆ గుంపులో పడి నాక్కూడా వూపిరి ఆడలేదు. తర్వాత జనసందోహాలతో కలిసి కాలువ మీద వంతెన దాటి బస్టాండ్ కి నడిచివెళ్ళి నూజివీడు వెళ్ళే లాస్ట్ బస్ యెక్కి అమ్మమ్మ యింటికి చేరుకునేటప్పటికి అర్థరాత్రి అయిందని జ్ఞాపకం. ఆ తర్వాత రోజు సినిమా యాక్టర్స్ అందరూ.. కొందరు తెనాలి, కొందరు గుడివాడ వెళ్ళి విరాళాలు సేకరిస్తారని అక్కడ సినిమా యాక్టర్స్ ను చూడొచ్చు అని మామయ్య ఇంటి చుట్టుపక్కల వారికి చెప్పాడు. 


అప్పట్లో రేడియో వినడం వీక్లీలు మాస పత్రికలు చదవడం బెజవాడ వెళ్ళి  సినిమాలు చూడటం గొప్పగా వుండేది. ఎవరైనా బెజవాడ వెళ్ళి బట్టలు కొనుక్కొచ్చుకున్నా సినిమా చూసొచ్చినా మర్నాడు చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళందరూ యెంతో ఆత్రుతగా ఎదురు చూసేవారు. సినిమా కథ చెబుతారని కొనుక్కొన్నవి చూడాలని. 


ఆ తెల్లవారి పెదమామయ్య పిన్ని తాము చూసిన సినిమా యాక్టర్స్ ని గురించి గొప్పగా చెప్పడం, వారు మాట్టాడిన మాటలను విరాళాలు సేకరించడం గురించి చెబుతూ గర్వపడటం జ్ఞాపకం వుంది. 


ఎందుకో ఇదంతా లీలగా గుర్తొచ్చింది. పండంటి కాపురం సినిమా యేనా లేక మరేదైనా నా అని అనుమానం. మా పెదమామయ్యను పిన్ని ని ఫోన్ చేసి అడుగుదామనుకున్నాను. నవ్వుకున్నాను.. ఈ విషయమై ఫోన్ చేయాలా అని. మరెలా!? ఒక ఐడియా తట్టింది. . రుజువు పరుచుకోవడానికి పండంటి కాపురం సినిమా రిలీజ్ యెప్పుడైందో గూగుల్ లో వెతికాను. 1972. నా కప్పుడు ఐదేళ్ళు అని గుర్తు. లెక్క సరిపోయింది. ఆ సినిమా శత దినోత్సవం బెజవాడ లో జరిగిందని ఊర్వశి ధియేటర్ అని.. అక్టోబర్ 28 వ తేది న అని ఆ కార్యక్రమానికి పైన పేర్కొన్న అనేకమంది నటీ నటులు హాజరైనారని.. రాయలసీమ కరువు సహాయనిథి కి విరాళాలు సేకరించారని. ఈ వివరాలున్నీ వున్న ఆంధ్రజ్యోతి దిన పత్రికలో లభించింది. భలే సంతోషపడ్డాను. అప్పుటి నా జ్ఞాపకాలు యింకా లీలగా దాగివున్నాయని అర్థమైంది. వావ్ అనిపించింది నాకైతే! 


ఇక తర్వాత మెట్టినిల్లు బెజవాడ ను ఆనుకుని అవడం వల్ల

ముఫ్పై యేడేళ్ళ నుండి బెజవాడ నాలుగు దిక్కులతోనూ కలిసి.. మనుగడ సాగిస్తూ వీధి వీధి.. తిరిగినట్టుగానే వుంటుంది. మన బెజవాడ కదా.. అని ఒడలు ఉప్పొంగుతూ వుంటుంది.


యాభై యేళ్ళ జ్ఞాపకం. వావ్ వనజమ్మా అని భుజం చరచుకున్నాను. 


మెదడు ని చురుగ్గా వుంచుకోవాంటే జ్ఞాపకాలను తవ్వుకోవాలి. భాష మర్చిపోకుండా తప్పులు రాయకుండా వుండాలంటే కాగితంపై రాసుకోవాలి. బిగ్గరగా చదవాలి.



ఉదయం అంటే కలలో నుండి కల లోకి మేల్కొనడం. ఈ ఉదయం.. నేను తీసిన చిత్రాలు. అట్లాంటా నగరం.


 

29, మార్చి 2023, బుధవారం

సంపెంగపువ్వు

ఊహ అందంగా ఉంటుంది.. అక్షరాల్లోకి  వొంపకపోయినా మనసులో మెదిలినప్పుడు ముఖాన  దరహాస చంద్రికలు విరబూస్తాయి. 

రవీంద్రనాథ్ టాగూర్ చిన్న కథలు చదివినప్పుడు ఆ కథల్లో కనబడే బాల్యం అమాయక ఊహలు ఆనందం కల్గిస్తాయి. మనం మరిచిపోయిన బాల్యాన్నో మన పిల్లల బాల్యాన్నో పిల్లల పిల్లల బాల్యాన్నో మన కళ్ళముందు సాక్షాత్కరిస్తాయి. కథలు వినడం వల్ల చదవడం వల్ల బాలల్లో సృజనాత్మక శక్తి పెంపొందుతుంది. 

ఈ మధ్య మనుమరాలితో పాటు .. రష్యన్ కార్టూన్ ఫిలిమ్స్  Masha and the Bear చూస్తూ ఉన్నాను.  పాపాయి నిద్రపోతున్నప్పుడో  టీవీ  పెడితే ఏం చూడాలనిపించదు. అప్రయత్నంగా అదే పెడుతుంటాను .తర్వాతెప్పుడో గ్రహింపుకు వచ్చి నవ్వుకుంటాను. 

ఇక నేను పరిచయం చేయబోయే  కవిత్వ కథ లో  ఒక పువ్వు స్థానంలో రచయిత లో బాల్య రచయిత ఊహ కనబడుతుంది. పాపాయి పువ్వు అవడం పువ్వే పాపాయిలా చిలిపి పనులు చేయడం ఆ పనులన్నీ అమ్మకు తెలుస్తూనే ఉండటం .. పాప అల్లరి  పాప తల్లి దినచర్య యెలా వుంటుందో తెలుపుతూ వుంటుంది.   మనం కూడా ఆ ఊహలో లీనమై. తర్వాత ఆలోచిస్తూ వుంటే భలే బావుంటుంది. పువ్వులు పాపలు బావుంటారు కదా! పిల్లలో ఊహ శక్తి ఇలా వుంటుందని తెలియజేయడమే కవి ఉద్దేశం.  

సంపెంగ పువ్వు అనే రచన రవీంద్రనాధ్ టాగూర్ The Champa flower అనే కవిత. నిజానికి Champa flower అంటే బెంగాలీ లో మనం దేవ గన్నేరు గా వ్యవహరించే plumeria flowers.


The Champa flower

by Rabindranath Tagore కవితా సంపుటిలో శీర్షిక కవిత యిది. 



Supposing I became a champa flower, just for fun, and grew on a branch high up that tree, and shook in the wind with laughter and danced upon the newly budded leaves, would you know me, mother?

You would call, "Baby, where are you?" and I should laugh to myself and keep quite quiet.

I should slyly open my petals and watch you at your work.

When after your bath, with wet hair spread on your shoulders, you walked through the shadow of the champa tree to the little court where you say your prayers, you would notice the scent of the flower, but not know that it came from me.

When after the midday meal you sat at the window reading Ramayana, and the tree's shadow fell over your hair and your lap, I should fling my wee little shadow on to the page of your book, just where you were reading.

But would you guess that it was the tiny shadow of your little child?

When in the evening you went to the cow-shed with the lighted lamp in your hand, I should suddenly drop on to the earth again and be your own baby once more, and beg you to tell me a story.

"Where have you been, you naughty child?"

"I won't tell you, mother." That's what you and I would say then.


చంపా పువ్వు దేవ గన్నేరు స్థానంలో మనమిప్పుడు. సంపెంగ పువ్వు అని చదువుకుందాం.


సంపెంగపువ్వు… రవీంద్రనాథ్ టాగూర్, భారతీయ కవి.

సరదాకి, నేను సంపంగి పువ్వునై చిటారుకొమ్మన పూచేననుకుందాం. గాలి కితకితలకి నవ్వుతూ కొత్తగా చిగురించిన ఆకులమీద ఊగుతుంటే, అమ్మా, నీకు తెలుస్తుందా?

నువ్వు “అమ్మాయీ? ఎక్కడున్నావు?” అని పిలుస్తావు. నేను నాలోనేను నవ్వుకుంటూ మౌనంగా మాటాడకుండా ఊరుకుంటాను. నేను మెల్లగా రేకల కన్నులు విప్పి నువ్వు చేస్తున్న పనులన్నీ గమనిస్తుంటాను.

నువ్వు స్నానం చేసేక, తడిజుత్తు నీ భుజం మీద పరుచుకుని ఉంటే, సంపెంగచెట్టు నీడవెంబడే నువ్వు తులసికోటదగ్గరకి పూజచెయ్యడానికి వెళతావు. నీకు సంపెంగపువ్వు వాసన తెలుస్తుందిగాని నా దగ్గరనుండి వచ్చిందనిమాత్రం తెలీదు.

మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత నువ్వు కిటికీ పక్క రామాయణం చదవడానికి కూర్చున్నప్పుడు, చెట్టు నీడ నీ జుత్తు మీదా ఒడిలోనూ పడ్డప్పుడు, నేను నా చిన్ని నీడని నువ్వు చదువుతున్న పేజీ మీదకి సరిగ్గా నువ్వు చదువుతున్న చోటే పడేలా కదిలిస్తాను.
కానీ, నీకు అది నీ చిన్నారి కూతురు నీడే అని పోల్చుకోగలవా?

సాయంత్రం చీకటి పడ్డాక చేతిలో లాంతరు పట్టుకుని నువ్వు గోశాలలోకి వెళ్ళినపుడు, నేను అకస్మాత్తుగా మళ్ళీ భూమిమీదకి రాలి, మరోసారి నీ కూతుర్ని అయిపోయి నీ కాళ్ళు పెనవేసుకుని కథ చెప్పమని మారాం చేస్తాను.

“పెంకి పిల్లా? ఇంతసేపూ ఎక్కడికెళ్ళావు?” అని నువ్వు దెబ్బలాడతావు.

“నేను చెప్పనుగా,” అని నేనంటాను.

******************
చిన్నపాప కోణంలో ఈ కథ బావుంది కదా ! 

 అలాగే  టాగూర్ చిన్న కథలు చదవండి ఈ కథ .. కె వి రమణారెడ్డి గారు అనువదించిన "పద్మ పూజ" కథలు కూడా బాగుంటాయి.  పద్మపూజ కథా సంపుటి అనువాద ప్రతి ఇక్కడ ఉచితంగా లభ్యమవుతుంది. డౌన్లోడ్ చేసి పిల్లలతో చదివించవచ్చు. మనం కూడా చదువుకోవచ్చు. 

 https://ia801405.us.archive.org/35/items/in.ernet.dli.2015.328806/2015.328806.Padmapooja.pdf



 .. 


27, మార్చి 2023, సోమవారం

రైటర్ పద్మభూషణ్

 


వర్ధమాన రచయిత కథ లో … లోపలి కథ యిది. ఎంతో బాగుంది.. ఇప్పుడే చూడటం ముగించాను. మనసు తడి కనుల నీరు. 

ఈ కథలో పద్మ భూషణ్ వొక వర్ధమాన రచయిత. స్నేహితుడి సాయంతో వడ్డీకి డబ్బులు తెచ్చి ఒక పుస్తకం ప్రచురిస్తాడు. గొప్ప పేరు వచ్చేవరకూ యింట్లో ఆ విషయం తెలియనివ్వకూడదు అనుకొంటాడు. కానీ అతని పుస్తకాలు అమ్ముడుపోక ప్రోత్సాహం లేక నిరాశపడుతుంటాడు. పద్మభూషణ్  తల్లిదండ్రులతో కలసి బంధువుల ఇంటికి ఓ శుభకార్యానికి వెళతాడు. అక్కడ ఒక కొత్తపుస్తకం రచయితగా బంధువులకు పరిచయం అవుతాడు. అతని పేరిట వొక బ్లాగ్ కూడా నిర్వహించబడుతుంది అని  అతనికి షాకింగ్ గా తెలుస్తుంది. రచయితలు అంటే గౌరవం వున్న  బంధువు మామయ్య తన కూతురిని  ఫణిభూషణ్ కిచ్చి  వివాహం చేస్తానంటాడు. ఎంగేజ్ మెంట్ కూడా  నిశ్చయింపబడుతుంది. ఆ శుభముహూర్తంలో బ్లాగ్ లో రాయబడుతున్న ధారావాహిక రచనను పుస్తకంగా ప్రచురించి ఎంగేజ్మెంట్ ఫంక్షన్ లో ఆవిష్కరణ చేయాలనే తన ఆలోచనను వెలిబుచ్చుతాడు కాబోయే మామగారు.  

ఫణిభూషణ్ లో   టెన్షన్ మొదలవుతుంది.  నేను రాయని రెండో పుస్తకం నా పేరున యెందుకు ప్రచురించారు.? అసలు ఆ పుస్తకం రాసి ప్రచురించింది యెవరు? బ్లాగ్ కూడా యెవరు రాస్తున్నారనే సందేహం వస్తుంది కానీ బ్లాగ్ లో  రచన ఏ ఇబ్బంది లేకుండా సాగిపోతుంది కదా.. అదే ప్రింట్ లోకి వెళుతుందని రిలాక్స్ గా వుంటూ కాబోయే వధువుతో షికార్లు చేస్తూవుంటాడు. అంతలోకి షడన్ గా  బ్లాగ్ లో రచన ఆగిపోతుంది. ఎగేంజ్మెంట్ తేది దగ్గరకు వస్తూ వుంటుంది… 

తర్వాత కథ యెలా నడుస్తుందనేదే… సినిమాలో ముఖ్యభాగం.

ఇక ఫణిభూషణ్ తల్లి సరస్వతి. చిన్నతనంలో క్లాస్ లో టీచర్ అడిగిన ప్రశ్నకు నేను రచయిత ను అవుతాను. నాకు కథలు రాయడమంటే చాలా యిష్టం అని చెప్పిన ఆ అమ్మాయి. ఆ అమ్మాయి పెరిగి పెద్దదై పెళ్ళైన తర్వాత సగటు భారతీయ యిల్లాలి  గానే  ఆమె ఆశలు ఇష్టాలు   అణచివేయబడతాయి. 

సినిమా ఆఖరిలో.. 
అమ్మాయిలకు యెన్ని కలలున్నా.. 
 “మధ్యలో పెళ్ళనేది  వొకటి వుంటుంది” కదా! అది అన్ని కోరికలను అణచివేస్తుంది… అంటుంది సరస్వతి. 

కుటుంబంలో స్త్రీ లను పెళ్ళైన తర్వాత అమ్మాయిలను ఇంట్లో యెవరైనా నువ్వేం కావాలనుకుంటున్నావ్ అని అడిగి వుంటారా? ఒకవేళ వారి ప్రతిభ వెలిబుస్తే తగిన ప్రోత్సాహం లభిస్తుందా?  

మంచి  ప్రశ్నలతోనూ పాజిటివ్. సందేశంతోనూ ముగుస్తుంది కథ. 

చిత్రీకరణ 90% విజయవాడ లోనే చిత్రీకరించిన సినిమా.. నాకు చాలా నచ్చింది. కొత్త నటీనటులే.. కానీ కథ సినిమాకి మూలాధారం. చూడటానికి హాయిగా వుంది. విడుదలై రెండు నెలలు దాటింది కాబట్టి చాలామంది చూసేవుంటారు. రివ్యూ లు కూడా వచ్చే వుంటాయి. పరిచయం చేయాలనిపించి చేసాను. ఒక గృహిణిగా రైటర్ గా నేను బాగా కనెక్ట్ అయ్యాను ఈ సినిమాకి.

వీలైతే మీరు కూడా చూడండి. Zee 5 లో వుంది సినిమా.. 


26, మార్చి 2023, ఆదివారం

చిత్కళ పుట్టినరోజు..




 నేడు నా మనుమరాలు చిరంజీవి “నిహిర తాతినేని” మూడవ పుట్టిన రోజు జరుపుకుంటుంది.. 

అమ్మనాన్న ఏ పేరైనా పెట్టుకోనీ.. నేను నీకు పెట్టుకున్న పేరు నామ నక్షత్రం ప్రకారం “చిత్కళ”


శుభాశీస్సులు బంగారూ.. ఆ శ్రీగిరి పర్వతం నుండి జగత్ మాతాపితురుల కరుణ కటాక్షాలు నీపై సర్వకాలాలు ప్రసరిస్తూనే వుంటాయని నా ప్రగాఢ విశ్వాసం.


పుట్టినరోజు శుభాకాంక్షలు ..బంగారం .. 

ఇలాంటి పుట్టిన రోజులు నిండు నూరేళ్ళు జరుపుకోవాలని ..

సుఖసంతోషాలతో..ఆయురారోగ్యములతో.. పుత్ర పౌత్రాభివృద్దితో..యశస్విభవ గా దేదీప్యమానంగా వెలుగొందాలని ..మనసారా దీవిస్తూ..


భగవంతుని కరుణా కటాక్షములు అన్నింటా లభించాలని కోరుకుంటూ...

హృదయపూర్వక శుభాకాంక్షలు .. శుభాశీస్సులు బంగారుతల్లీ.. 






22, మార్చి 2023, బుధవారం

ఏనాటికీ ముగియని కథ

 ఏనాటికీ ముగియని కథ

కన్నడమూలం :డా॥ యు, ఆర్. అనంతమూర్తి


తెనిగింపు: శ్రీ శంకరగంటి రంగాచార్యులు.


ఏనాటికి ముగియని కథ 

టైమ్ ప్రెజెంట్ అండ్ టైమ్ పాస్ట్


ఆర్ బోత్ పర్ హాప్స్ ప్రెసెంట్ ఇన్ టైమ్ ఫ్యూచర్


 అండ్ టైమ్ ఫ్యూచర్ కంబైన్డ్ ఇన్ టైమ్ పాస్ట్


టి. ఎస్. ఎలియట్.



"బయట శానా చలిగా వుండాలి.".


పండు పండు ముసలివాడు మనస్సులోనే చలిని వూహించుకుని వణకి, ధగధగ మండుతూన్న కుంపటి వద్ద ఒళ్ళు కాచుకుంటూన్నాడు. ఏవేవో స్మృతులు మనస్సులో మెదలాడుతాయి.... ఎన్నేళ్ళ క్రిందటివో ఏమో!


కాంతిగా నుండే నిప్పుల్లా వెలుగుతున్నాయి... ఆ ముసలికళ్ళు.. ఏమో తృప్తి! ....


దేవుడి దయ అనాలి. సుఖమైన బదుకు. నిండుగృహం. వయస్సయినా ఇంటి బాధ్యతనంతా అతడి కొడుకే వహిస్తున్నాడు. అతడికి చేతికి అందుబాటులోకి వచ్చిన నలుగురు కుమారులు, అందరికీ లక్ష్మీదేవుల్లాంటి భార్యలు... మళ్ళీ ముద్దుముద్దుగా పుట్టిన ఆ మనముల పిల్లలు మునిమనుములు!!


ఎంత అదృష్టవంతుడు ముసలివాడు!


రెండు పూటలకూ అయి మిగిలేటట్టు వడ్లు పండుతూన్న మాగాణి !  చిన్నదైనా ఉత్తమంగా పంటనిస్తున్న పోకతోటా! కొట్టం నిండా పాడి పశువులూ అన్నీఉన్నాయి.


ఇంకేం కావాలి, ఇంతకన్నా?


తొంభై ఏళ్ళు వచ్చినా రాయిలాంటి ఒళ్ళు, కొడుకు అధికారంలోకి వచ్చినా తన్నడగకుండా ఏపనీ చేయడు. అదలా వుండనీ... ఎంతభక్తి వాడికి! ఈనాటికీ తన్ను తలయెత్తి చూడడుగదా!.... ఇక ప్రాయపు మనుమలు... ఈకాలం వాళ్ళయితే ఏమంట? తాతయ్యంటే వాళ్ళకు నాన్న గార్ల కన్నా ఎక్కువ ప్రేమ....


... లోపల్నించీ జోలపాట వినవస్తోంది.....


ఏడ్తువేల రంగ, 

ఏమికావలె నీకు.... 

నాలుగెనుములు పిండినట్టి పాల్ చక్కెరా

నీ నడిగినపుడంత ఇస్తానులేరా

వోవలా హోనీ.... ... చిట్టి జోజో

జోజో బాబూ..జోజో…


ఇంకెవరంట బాగా జోలపాట పాడతారు. అతడి ముసల్దే!..... ఆ చిన్న మనునుడి పాపడిని ఊదుతూండాలి....


ఔను! ఆ పాపడిరి అతడి పేరే పెట్టారు. అతడి ముఖంలాగే వాడి ముఖమూనూ హుం! అతడి లాగే హదమారి తనం కూడా!.. .....


ఇప్పటికి ఎనభై రెండేళ్ళక్రితం... శానా కాలం క్రితం అతడూ అలాగే ఏడ్చేవాడు! అపుడు అతడి అవ్వకూడా పూచి లాలి పాడుతూండేది.


ఏడ్తువేల రంగ, ఏమికావలె నీకు.... 

నాలుగెనుములు పిండినట్టి పాల్ చక్కెరా..


ఆ జోలపాటకు ముగింపే లేదేమో!


ఆ తొట్లలోనే .... తాను ! ....


తన కొడుకూ!.....


కొడుకు కొడుకూ!.....


అతడి కొడుకు కొడుకూ


ఆ తొట్ల ఊగక ఆగిన దినమే లేదు!


ఆ జోలపాట పాడని దినమూ లేదు!

అతడి పాలిట ఆ జోలపాట ఎంత సత్యం


అతడి ఇంట్లో పుట్టిన పిల్లలు ఎందుకేడ్వాలి? కావలసినవన్నీ ఉన్నాయి. ఇంట్లో నాలుగెనుములెందుకు? అరెనుములున్నాయి! ఇంట్లో ' జనం నిండుగా వున్నారని ఇంకా మొన్నే అతడి కొడుకు జాతరకు వెళ్ళి మరొక ఎనుము తెచ్చాడు.


ఆ నాలుగెనుములంటేనో తన ఇంట్లోనే పుట్టి పెరిగాయి,. వాటి తల్లి, తల్లి, తల్లి,తల్లి, ఆవ్వ పాలో ఏమో తను తాగి పెరిగింది......


హూం! మొదలైంది హదమారితనం! వాడే పెద్ద మనుమని కొడుకు! ...ఇంకేముంటుంది! 'కథ చెప్పు..... ఒకటే పోరు! అతడి ముసల్దానికి ప్రతి నిత్యపు గోడు!…


ఔను! అతడి లానే కదా అతడి మనుమలు! 'తాత ప్రతి బింబాలు' అంటూ వాళ్ళ తల్లులు ఎందుకు దూరుతూంటారు... ముసలివాడి ముఖం తృప్తితో విప్పారుతుంది .... ఔను! అతడూ అలానే చేస్తూవుండలేదా, పిల్లవాడై వుండినప్పుడు, అవ్వ కధ చెబితే తప్ప నిద్రపోయిన దినం ఒకటైనా వుందా?....


ఆ ఒక కథను మాత్రం.... హో! అదే! అదే కథ! అతడి అవ్వ అతడికి చెప్పిన కథ.

అతడి లానే అతడి మనుమడి కొడుకూ తన అవ్వను వేధించి, కథ వింటూన్నాడు...

ముసలిదానికి ఆకథ ఎవరు చెప్పారు? అతడి అవ్వ అతడి కొక్కడికే చెప్పిన కథ అతడి ముసలిదానికెలా తెలిసింది? ... ఏమో జ్ఞాపకమే రాదు!


అతడే కదా..


ఆరోజు! .... సంక్రాంతికి ముందు!... పొలంలో వంగి పనిచేస్తూ వున్నపుడు ఆమె చెంపకు తన చెంపను సోకిస్తూ.....

ముసలివాడి ముఖం ముడతలు పడి వుండినా సిగ్గుతో ఎర్రబారుతుంది.

మనస్సులోనే ముసి ముసి నవ్వు నవ్వుతాడు.


అతడని ఆ అవ్వకు ఎవరు చెప్పి వుంటారు.

ఇంకెవ్వరూ..అతడి ఆ తాతయ్యే! 

అతడికి అతడి అవ్వ


ముసలివాడు తన ఆలోచనలకు తనే నవ్వుకుని మంటను మరింత పెద్దదిగా చేసి వీపు రాచుకుంటాడు.


ఔను,అదోకథ! వంశపారంపర్యంగా తామందరూ వింటూ వచ్చిన కథ! అదే ముగియని కథ. ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎందుకు ఏళ్ల తరబడి చెప్పినా ముగియని కథ! 

అతడు తన అవ్వను అడిగినప్పుడంతా ఆమె చెప్తూండేది.

రేపు ముగుస్తుందా

ఊహూ

ఎల్లుండి..

ఊ హూ..

ఇంకెప్పుడూ

“ఎప్పుడూ ముగియదు”

“ఎందుకు”

 అతడు ఎనభై రెండేళ్ళక్రితం అతడి అవ్వను కుతూహలంగా అడిగాడు. 

అపుడామె బహు గంభీరధ్వనితో చెప్పింది. 

ఈ కథ చివరికి వస్తే పొద్దు పొడవదు చెట్టులో పండ్లు కాయవు తీగలో పూలు పూయవు. మనుషులకు కథలు చెప్పే అవ్వలు బతకరు”


ఇప్పటికీ ముసలివాడు అవ్వ మాటల్లో నమ్మకం పెట్టాడు.ఆ కథ ఏనాడు తుదముట్టరాదు.. ముట్టితే? 


అతడి అవ్వ ఆ రోజు చెప్పి వుండలేదా? ఏమవుతుందని? 


************


ముసలివాడికి చెవులు చాలా చురుకైనవి. అతడి ముసలిది


మునిమనుమనికి చెప్తూన్న కథను చెవియొగ్గి వింటాడు.


తను పాపడై వుండినపుడు అవ్వ తొడమీద పడుకొని వింటూవుండిన చిత్రం కనులముందు కదలుతుంది.


అతనికేమో ఆశ్చర్యమవుతుంది. అతడి ముసలిది ఆ కథనింకా సాగదీసి, సాగదీసి చెప్పుతూవుంది......


నిదానంగా.... పాపడికి నిద్రను తెప్పించే గంభీరమైన, కంపి స్తున్న స్వరంతో..


ఎక్కడో కొంచెం కొంచెంగా వినబడుతోంది.


" ... తరువాత.... ఆ రాజకుమారుడూ, రాజకుమారీ నిండు ప్రేమతో బదుకుతూంటే.... ఒకానొక దినం.. అయి, చనిపోయారు... చనిపోయినా తోడుగానే వున్నారు.... ఇద్దరూ ఆకాశానికి పోయి, రెండు మేఘాలై, అక్కడంతా సందరిస్తూ సుఖంగా వున్నారు .. ఒకదినం రాజ కుమారుని మేఘం బరువెక్కి, వానై క్రిందపడింది... ఒక కొలనులో నీళ్ళలో చేరుకుంది... అప్పుడు రాజకుమారి కొలనులో చేపగా వచ్చి చేరుకుంది.... తర్వాత ఇట్లే ఉంటూండగా, ఒకానొక దినం ఒక బెస్తవాడు ఆ చేపను పట్టుకుని తినేశాడు..... నీళ్ళై వుండిన రాజకుమారుడు కృశించి, కృశించి, చిక్కి పోయి, మేఘమైనాడు….. చేపను తిన్న బెస్తవాడు ఇట్లే వుంటూ ఒకదినం చచ్చి మన్నయ్యాడు. ఆమట్టి నుంచి చెట్టొకటి పుట్టింది, చూడు, బాబూ, చేపై బెస్తవాడిలో చేరి వుండిన రాకుమారియే ఇలా అంటుంది. మేఘమైన రాజకుమారుడప్పుడు అచెట్టుకు వానై కురిశాడు. .... ఒకటి అక్కడినించీ కూడా వాళ్ళిద్దరికీ ఎడబాటు కలిగింది. రాజకుమారి పోయి చంద్రుడిని చేరింది. రాజకుమారుడు వెళ్ళి సూర్యుడిని చేరాడు. చూడు బాబూ, అందుకే చంద్రుడు రాజకుమారిని మోసుకుని ఆకాశంలో తిరుగుతాడు.... అయితే సూర్యుడు క్రూరుడు చూడు... అతడికి దూర దూరంగా పరుగెత్తిపోతాడు... అప్పుడు రాజకుమారి, రాజకుమారుడూ శానా దుఃఖంతో ఏడుస్తాను.... అందుకే తెల్లవారు జామున ఈ భూమి మీదంతా మంచు బొట్లు బొట్లుగా పడివుంటుంది..... పిల్లవాడు ఉత్సాహంగా నడుమ అడుగుతున్నాడు:


"ముగిసిందేమవ్వా, కథ"


"లేదు. బాబూ...."


"రేపటికి ముగుస్తుందా?"


“ఏ నాటికి ముగియదు బాబూ”


"ఎందుకవ్వా!"


ఆ పిల్లవాడు అతడు అతడి ఆవ్వను ప్రశ్నించినట్లే, ఇపుడు తన అవ్వను మొండిగా అడుగుతున్నాడు.... ఔను.... అతడి అవ్వ జబాబునే ఇపుడు అతడి ముసలిది తన మనుమలకు చెబుతూవుంది. అతడి అవ్వ మాదిరిగానే అతడి ముసలిది కూడా నెలల తరబడి ఆ కథను కొత్తకొత్తగా అల్లి, ముందుకు లాక్కుని పోతుంది.... ఇంట్లో పుట్టిన పిల్లలందరూ ఆ ముగియని కథను వింటూ ఎన్నో రోజులు నిద్రపోయారు,


ఇలానే.. .


ఆ రాజకుమారీ రాజకుమారుల కథ ఇంకా కొనసాగి ముందుకు పోవడం విన్నాడు అతడు....ప్రతీసారీ ఎలాగో ప్రయత్నించి, మళ్ళీ కలుసుకుంటారు. అలాగే ప్రతిసారీ వేర్పడతారు..... మళ్ళీ కలుసుకుంటారు.


తుది మొదటిలేని అనంతమైన కథ.... అనంతములైన రూపాల్లో వాళ్ళ ప్రేమ.... పూవై, కాయై, నీళ్ళై మేఘమై, గాలై, అగ్గియై, ఒకటా? రెండా.... ముగియని కథ.... ఏనాటికి ముగియని కథ!....


అతడికి అన్నం పెట్టిన పొలంలానే .... అతడిని ఊచిన తొట్లలానే...


తన్ను లాలిలో నిద్రపోగొట్టిన - ఆ జోలపాటలానే....


కొడుకులూ, మనునులూ, మునిమనమలూ అనక సతతంగా, అనంతంగా ఒకరినుంచీ ఒకరికి సంక్రమించిన కథ!


_ఔను! ఆది ముగియరాదు, ముగిస్తే? —


_అతడి అవ్వ చెప్పి వుండలేదా? ఏమవుతుందని?


************

.... పాపడికి నిద్రవచ్చివుండాలి ముసలిది చలికాచుకోవాలంటూ ముసలివాడి పక్కన వచ్చి కూర్చుంటుంది.


"శానా  వీపు దురద...."


థూ! ఏం సుఖమాశిస్తూందీ ముసల్ది! మొగుడంటే కొంచమైనా సిగ్గులేదు? ఇలా వీపు గీరమని అడుగుతుంది నిత్యమూ.....


ముసలివాడు నవ్వి, గుద్ది, ఆమెకు కొంచెం బాధకలిగేటట్టే అదేపనిగా గట్టిగా గీరుతాడు.


ఔను! ఆ ముసలివాడి అవ్వకూడా అలాగే....


మనుమలకు, 'అర్థరాజ్యమిస్తాను వీపు గీరితే' అని ఒప్పించి, గీరించుకున్నది చాలక, అతడిప్పుడు, చలికాచుకుంటూన్న కుంపటి ముందే కూచుని, తన మొగుడిచేత కూడా గీరించుకుంటూవుండేది.


అతడి ముసలిది అతడి అవ్వలానే. అన్నిటిలోనూ, 


కొంతవరకూ రూపంలోనూ,


...ఏమో కిలకిల నవ్వినలా వినబడుతోంది. ముసలివాడు వీపు గీరడం నిలిపి చెవియొగ్గి వింటాడు.....


ఓ, అతడి చిన్న మనమడూ, అతని భార్యా,


ఇంకేం! పగడకాయలు కావొచ్చు..... ముప్పొద్దులూ అదే పిల్లాట.... ఎంత ధైర్యంగా, గట్టిగా నవ్వుతారు!... ఏం ముద్దో, ఏమో!.....


గొణుక్కుంటూ ముసలివాడు ముసిముసి నవ్వుతాడు.


పాపం ... ఇంకా పసివాళ్ళు  పెళ్ళై ఇంకా ఎక్కువ రోజులు కాలేదు. ముసలివాడు నవ్వుతూ దూరుతాడు.


ముసలి సిగ్గుపడి, కుంపటిముందు పెళ్ళికూతురిలా ముసలి వాడితో కూర్చుని, చిరునవ్వు నవ్వుతుంది.


మనమలను ఎందుకు దూరాలి?.... ఎంత దొంగ ఆ ముసలి వాడు! .... ముసలిదాని సిగ్గుతో ఎరుపెక్కిన ముఖం చూస్తే తెలియడంలేదా?.... చాలా కాలం క్రితం.... వాళ్ళిద్దరూ పగడకాయలాడాక, ఆడుతూ కొట్లాడక.... పడుకొనడానికి వెళ్ళిన దినం ఒకటైనా వుండేదా?


అవే పాచికలు,

అదే పట్ట

అవే కాయలు, 


ముసలివాడి అవ్వ, తరువాత ఆ ముసలివాడు, తరువాత అతడి కొడుకు, ఇపుడు మనుమడు, అందరూ వాటితోనే తమ ప్రేమ క్రీడలు కొనసాగించారు.


జీవన ప్రవాహం నిరర్గళంగా సాగుతోంది....


ఊహు!... ఏనాటికీ ముగియదు...


ఇది ఎపుడైనా ముగుస్తుందా? ఆ కథలాగే ఈ ప్రేమక్రీడలు ఏనాటికీ ముగియవు.


ఎపుడైనా ముగిసిపోతే?.....


అతడి అవ్వ చెప్పి వుండలేదా? ఏమవుతుందని?_


"అప్పుడు పొద్దుపొడవదు- చీకటిపడదు. చెట్టులో పండ్లు కాయవు. తీగపూలు పూయదు ..."


*****************0****************



చిత్రం: 

Gibbs Garden GA





అనగనగ…

 కొందరు కథకులు కవులు ప్రపంచ కథల దినోత్సవం ప్రపంచ కవితా దినోత్సవం.. అంటూ రెండూ వరుసగా వచ్చాయని  వున్నాయని గుర్తు చేసారు.  పాఠకుడికి రోజూ కథ కవిత దినోత్సవమే కదా! కథ గురించి రాసిన మంచి కథ గురించి చెప్పుకుందాం. .. అనుకున్నాను.  


కథ అనగానే నాకు నాయనమ్మ చెప్పిన కథలే జ్ఞాపకం వస్తాయి. 


నాయనమ్మా ఈ కథ నీకు యెలా తెలుసు నీకు యెవరు చెప్పారు అని అడగడం తెలియని వయస్సులో అమాయకంగా  ఆమె చెప్పే కథ వింటూ.. ఆశ్చర్యపోతూ అనుమానంగా ఆలోచిస్తూ కళ్ళ మూసుకుంటే ఊహా ప్రపంచంలో  అనేక దృశ్యాలు మెదులుతూ కళ్ళు తెరిస్తే అవన్నీ మాయమై అయ్యో అవన్నీ యేమైపోయాయని దిగులుపడుతూ.. మళ్ళీ  యేదేదో వూహించుకుంటూ కళ్ళు మూసుకుంటే  కనబడే వేరొక దృశ్యాలు నిరాశ పెడితే వుసూరుమంటూ.. నాయనమ్మ చెప్పే కథలకు ఊ కొడుతూ ఊ కొడుతూ.. నిద్రలోకి జారుకోవడం.  కలల మధ్యలో పొంతనలేని కథలకు  కలవరింపులతోనో గావుకేకలతో యింట్లో అందరినీ నిద్ర లేపడం... అవ్వన్నీ  యిపుడు తలుచుకోవడం మధురంగానే వుంటాయి.


ఇప్పుడు నా మనుమరాలికి కథ చెబుతుంటాను. ఐ పాడ్ కనబడకపోతేనో టివీ పెట్టకపోతేనో మెల్లగా నాయనమ్మ పక్కన చేరి కథ చెప్పుకుందామా అని అడుగుతుంది. అనగనగా వొక రాజు అంట అనే కథ తనకు చెప్పడం వచ్చేసాక మరికొన్ని కథలు చెబుతుంటే ఊ హూ.. అంటూ కళ్ళు విప్పార్చుకుని చెవులు రిక్కించి శ్రద్దగా వింటూ వుంటుంది. విశ్యజనీయమైన ముచ్చట కూడా  యిది.. 


కథ గురించి చెప్పుకుని ఆ తర్వాత కథ చదివేద్దాం

కథ మనది కాదని కొందరంటే.. భలే వారు కథ మనది కాకపోడమేమిటీ? మనమేమి కథను విదేశీయుల నుండి అరువు తెచ్చుకోలేదు. విదేశాల్లో short story పుట్టకముందే మనకు సంస్కృతంలో కథలు ఉప కథలు వుండేవనే ఆధారాలు వున్నాయని చెపుతారు. లిపి పుట్టకముందు వాగ్రూపంలో కూడా కథలు చెప్పుకునేవారు.  తరతరాలుగా కథ సజీవ స్రవంతిలా ప్రవహిస్తూనే వుందని వుండబోతుందని కొందరు అన్నారు.


నేను పరిచయం చేయబోతున్న కథ “ఏ నాటికి ముగియని కథ” రచన.. యు ఆర్ అనంతమూర్తి. కన్నడ రచయిత. కన్నడంలో రాసిన యీ కథ శంకరగంటి రంగాచార్యులు తెలుగులో అనువాదం చేసారు. ఈ కథ గురించి సూచనాప్రాయంగా చదివి  వెబ్ అంతా వెదికాను. ఒక కథల ప్రేమికుడు యీ కథను పంపించారు. ఈ కథలో  వొక సౌందర్యం వుంది. భావుకత వుంది.తరతరాల పాటు విస్తరించిన ప్రయాణం వుంది. అదే ఈ కథను మర్చిపోనివ్వని కథగా నిలిపింది. ఇది మీ కథ నా కథ అందరి కథ. కథ చదివాక భలే వుంది కథ.. నిజమే కథ.. మన అవ్వలకు యెవరు చెప్పారో యీ కథ అనుకుంటాం.. 


తొంభై యేళ్ళు వున్న వొక వృద్ధుడు తన భార్య మునిమనుమడికి చెపుతున్న కథ ను వింటూ.. తన బాల్యం గురించి జ్ఞాపకం చేసుకుంటాడు. తన మునిమనుమడు లాగే తాను కూడా అవ్వ వొడిలో పడుకుని ఆమె చెప్పే కథను వింటూ… తర్వాత ఏమైంది కథ  అయిపోయిందా  అని అడిగేవాడినని గుర్తుచేసుకుంటాడు. ఆమె కథ అయిపోలేదని అయిపోదు కూడా అని చెబుతూ వుంటుంది. నాలుగైదు తరాలు ఆ కథను వింటూ తన కొడుకులు మనుమనుమలు మునిమనుమలు ఆ కథ వింటూనే వుంటారని ఆ ముదుసలి భార్య కథను సాగదీసి సాగదీసి యింకా యేవో జతకూరుస్తూ కథ చెబుతూనే వుంటుందని విసుగుపడుతూనే ఆ కథ ముదుసలికి యెవరు చెప్పివుంటారు నేనే కదా చెప్పి వుంటానని యవ్వనకాలం నాటి ఆలు మగల సరాగాలను గుర్తుకు తెచ్చుకుంటాడు. సాధారణంగా జేజమ్మలు అమ్మమ్మలు నాయనమ్మలు చెప్పినట్టు కథ కంచికి మనమింటికి అని తేలికగా ముగించి పిల్లలను నిద్రపుచ్చే కథ ను ఆ అవ్వ చెప్పదు. ఆ కథ యేమిటంటే.. 


ఆ కథ ఒక రాకుమారుడు రాకుమారి ప్రేమను వారు మరణించాక వారిరువురు మళ్ళీ మళ్ళీ పుట్టడం ఒకో జన్మలో కలిసి వుండటం వొకో జన్మలో యెడబాటుతో దుఃఖించడం.. తో కథలో అనేక మార్పులు కూర్పులు చేరుతూ కథ సాగిపోతూనే వుంటుంది. స్త్రీ పురుషుల మధ్య ప్రేమ అనురాగబంధం అది వొక జన్మతో తీరిపోయేదికాదని ఏడేడు జన్మల వరకూ అది ముడిపడే వుంటుందని అవ్వ చెప్పే కథ అంతర్లీనంగా బోధిస్తూ వుంటుంది. ఆ తర్వాత ఏమైంది కథ అయిపోయిందా అని పిల్లలు అడుగుతూనే వుంటారు. కథ అయిపోతే ఈ ప్రకృతి లో చెట్లు కాయలు కాయవు తీగలు పూలు పూయవు అని అవ్వ చెప్పే వుంటదని అది తను భార్యకు చెప్పే వుంటానని ముదుసలి పురుషుడు అనుకుంటూ వుండగా రచయిత కథ ను ముగిస్తాడు. 


అనాదిగా స్త్రీ పురుషులిరువురూ వొకరి కోసం వొకరు పుడుతూనే వుంటారు. ప్రకృతిలో వివిధ రూపాల్లో జీవిస్తూ మరణిస్తూ వుంటారు.. అదొక కాల జీవ ప్రవాహం. అది కొనసాగుతూనే వుంటుంది. 


కాలమూ ప్రవాహం జీవితం వెనక్కి మళ్ళటం అంటూ వుండదు అనేక మార్పులు చేర్పులు చేసుకొంటూ ముందుకు సాగిపోవడమే .. .. ఇదెన్నడూ

 కంచికి చేరని కథ.. తరతరాలు వంశపారంపర్యంగా అవ్వలు  పిల్లలకు చెప్పే కథ లాంటి కథను యీ రచయిత యెంత హృద్యంగా చెప్పాడో.. 

మీరూ చదవండి యీ కథ. .. ..


అనగనగా.. అనగనగా.. ఒక రాకుమారుడు ఒక రాకుమారి.. 


….. అంట.. కథ చదివించేది.. రేపు అంట..( పైన వున్న టపాలో.. )