13, జులై 2018, శుక్రవారం

గుండుసూది

అభివృద్దికి ఆనవాలు అమరావతి హోరులో యిరవై  యేళ్లుగా నాన్చుతున్న రోడ్డు విస్తరణ కార్యక్రమం నట్లు కొట్టుకుంటూ సాగుతూ వుండటం వల్ల .. విజయవాడ చివరన వున్న మేము కూడా ట్రాఫిక్ పద్మవ్యూహంలో  చిక్కుకోక తప్పడంలేదు. అనుకున్న చోటికి సరైన  సమయానికి  చేరుకోవాలంటే అడ్డదారులు వెతుక్కోవాల్సిన పరిస్థితి. గూగుల్ మ్యాప్ ని శరణు వేడితే మా ఇంటికి వాయువ్య మూలనుండి కేవలం రెండు పర్లాంగుల దూరం వెళితే చాలు సులభంగా IRR కి వెళ్ళే దారి చూపించింది. ఆ రెండు పర్లాగుల దూరంలోనే రోడ్డుకి కుడివైపున అయిదంతస్తుల భవన సముదాయాలు నాలుగైదు కనబడ్డాయి. అరే, ఇవెప్పుడు నిర్మించారు ?  అని ఆశ్చర్యపోయి అవి కార్పోరేట్ కాలేజ్ హాస్టల్ అయివుండవచ్చు అనుకుని సమాధానపడి ప్రశాంతంగా నిద్రపోయాను.

ఉదయాన్నే  ఆఫీస్ కి రెడీ అయిపోయి డ్రైవర్కి రోజూ వెళ్లేదారి కాకుండా రాత్రి నేను చూసిన దారిగుండా పోనీయమని చెప్పాను. తిన్నగా జిల్లా పరిషత్ హై స్కూల్ దగ్గరకి వచ్చిపడగానే ఈ దారెప్పుడు కనుక్కున్నారు సర్ చాలా ఈజీగా ట్రాఫిక్ లో నుండి బయటపడ్డాం  అని నవ్వాడు. గూగుల్ దర్పణం చేతిలో వుండగా  సులభతర దారులకేమి కొదవ బాబూ ..అని నవ్వుకున్నాం.
రోజూ మేము అటువైపు ప్రయాణించడాన్ని కొందరు గమనించి వారూ  రాకపోకలు సాగించసాగారు. అయితే మేము వెళ్ళే దారిమాత్రం ఒక వాడలో నుంచి వెళ్ళాలి. ఆ దారి పదడుగుల వెడల్పుగల రోడ్డు దారి మాత్రమే . ఆ రోడ్డుని ఆనుకున్న చిన్న చిన్న ఇళ్ళు, ఆ ఇంటి ముందు రోడ్డు మీదకి వేసిన చిన్న చిన్నపశువుల పాకలు, రోడ్డు మీదనే బట్టలు వుతుక్కునే వారు కొందరు, కుర్చీలు వేసుకూర్చుని పిచ్చాపాటి కబుర్లు చెప్పుకునే కొందరు,  ఆడుకుంటూన్నపిల్లలు  కనిపించేవారు. ఆ రోడ్డులో యెన్నడూ లేని విధంగా కార్లు బైకులు తిరగడం వాళ్లకేమాత్రం యిష్టం  లేదని వాళ్ళు లేచి దారి యిచ్చేటప్పుడే అర్ధమవుతూ వుండేది.  కాకపొతే అది అందరికి సంబంధించిన రోడ్డు కావడంతో తప్పనిసరై తప్పుకునే వాళ్ళు.
ఆ రోడ్డులోనే ఒకతను యింటి వెనుక చిన్న రేకుల షెడ్ వేసుకుని  నాలుగైదు గేదెలని కట్టేసుకుని పాలు అమ్ముకుంటున్నట్లు గమనించి వొక రోజు కారాపి అతనితో మాట కలిపి  వాడుకగా మాకు పాలు  పోయడం వీలవుతుందా అని అడిగాను . లీటర్ అరవై నాలుగు రూపాయలు. ఉదయాన్నే  ఆరుగంటలకల్లా వచ్చి మీరే   పోయించుకు వెళ్ళాలి అన్నాడు కొట్టినట్టుగా.  ఇంట్లోకి మూడు లీటర్ల పాల అవసరం వుంది.  నేను రావడం అంటే కష్టం, మీరే పంపకూడదా అని అన్నాను. మనిషి యింటికి రావాలంటే మరో ఆరువందలు రూపాయలు యిచ్చుకోవాలి. తీరా తెచ్చిచ్చాక   పాలు బాగోలేదని వొంకలు పెట్టకూడదు అని అన్నాడు. సరే, రేపటి నుండి పాలు పంపండి.  ఇప్పుడే డ్రైవర్ చేత సీసాలిచ్చి  పంపుతాను అని చెప్పి అడ్వాన్స్ ఇవ్వబోయాను. ముందు తీసుకోవడం అలవాటు లేదు. ఒకటవ తారీఖుకి తీసుకుంటాను అడ్రెస్స్ చెప్పండి అన్నాడు. అతను కొట్టినట్లు  అయిష్టంగానే మాట్లాడటం గమనించి మనిషి యింత సీరియస్ అయితే యెట్టా ! నలుగురికి  పాలు అమ్ముకునేవాడు సౌమ్యంగా వుండొద్దూ  అన్నాను డ్రైవర్ తో. అతనికి మన కార్లు యిటువైపు తిరగం యిష్టం లేదండి.  రోజూ ముఖం యింత లావున పెట్టుకుని ప్రక్కకి తప్పుకుంటాడు అన్నాడు.
తెల్లారి ఆరుదాటిన  ఐదో నిమిషాలకల్లా బెల్ మ్రోగింది. తలుపు తీస్తే యెదురుగా అతనే. రోజూ యిదే సమయానికి పాలు గుమ్మం ముందు పెట్టి బెల్ కొట్టి వెళ్ళిపోతాను. తర్వాత పాలు లేవని అదీ ఇదీ అంటే భాద్యత నాది కాదు అన్నాడు. ఇంకో మూడు బాటిల్స్  సంచీలో వేసి అతని చేతికిచ్చి  ఐరన్ హుక్ చూపించి  దానికి పాల సంచీ తగిలించి వెళ్ళమని చెప్పి ..మీ పేరు అని అడిగాను . శ్యాం అంటారు శ్యామూల్ అసలు పేరు అని చెప్పి వెళ్ళిపోయాడు. అతన్ని ప్రతి రోజూ చూసినప్పుడు నవ్వి పలకరించబోయినా తనని కాదన్నట్టు వుండటం చూసి పలకరించడం మానుకున్నాను.

వాడకి చివరగా పంటకాలువ ప్రక్కన శుభ్రం చేసుకున్న స్థలంలో సంచార జీవనం చేసే నాలుగైదు కుటుంబాల  వాళ్ళు ప్లాస్టిక్ పట్టాలతో చిన్న చిన్న గుడిసెలు వేసుకుని వుండేవారు. వాళ్ళలో కొందరు అల్యూమినియం పాత్రలు, కొందరు ప్లాస్టిక్ వస్తువులు, మరికొందరు నాటు కోళ్ళు అమ్ముకోవడానికి బయలుదేరుతూ నాకెదురు పడేవారు రోజూ. ఒకనాడు సాయంత్రం ఆ సంచార జీవనం గడిపే వారితో శ్యాం గొడవపడుతూ కనిపించాడు. అతని చేతిలో ముల్లు కర్ర కూడా వుంది. అతని ముందు తూలుతున్న మధ్యవయసు మహిళ మరొక యువకుడు నిలబడి వాడులాడుతున్నారు. కారాపి  సంగతేమిటీ  అని అడిగాను.  పరదా పట్టాలతో వేసుకున్న వాళ్ళ గుడిసెకి కర్టెన్  కొనుక్కొని రాలేదని ఆమె మొగుడిని  తిడుతుంటే గుడిసెకి కర్టెన్  యేమిటని వాడి తిట్లు అని నవ్వాడు. నేను బిగ్గరగా నవ్వాను .

అక్కడి నుండి ముందుకు నడుస్తూ యెక్కడెక్కడి నుండో  నుండి వచ్చి యిక్కడ గుడిసెలు వేసుకుని వున్నా మేమేమీ  అనడం లేదు.  ఆడమగ తేడా లేకుండా త్రాగడం  వొంటి మీద గుడ్డలు వున్నాయోలేదో చూసుకోకుండా పొర్లాడటం.  అర్ధరాత్రుళ్ళు కూడా గట్టిగా ఇకఇకలు పకపకలు, అంతలోనే  జుట్లు పట్టుకుని కొట్టుకోవడం. ఎవరు మొగుడో యెవరు పెళ్ళామో యెవరికీ తెలియదు,  వీళ్ళని మా పిల్లలు వినోదంగా చూడటం. ఇదొక రచ్చ అయిపోయింది. ఏమోలే అని వూరుకుంటుంటే మరీ రెచ్చిపోతున్నారు. వీళ్ళని చూసి మా పిల్లలు యెక్కడ పాడైపోతారో అని భయంగా వుంది సార్  అన్నాడు . అతన౦త సౌమ్యంగా గౌరవంగా మాట్లాడటం నేను వినడం అదే మొదటిసారి.
వాళ్ళని హెచ్చరిస్తే వినే రకం కాదు గుడిసెలు పీకీసి సామాను యిసిరి పారేస్తే వాళ్ళే పోతారు అని యింకొకరు అందుకున్నారు. మనం ఆ పని చేస్తే యింకో పార్టీ వాడు వచ్చి ఆ స్థలం మన సొంతమా ! పోరంబోకు స్థలం . ఎవరైనా వుండొచ్చు మనకేమి అధికారం వుంది వాళ్ళని లేపడానికి. పంచాయితీ ఆఫీస్ కి వెళ్లి కంప్లయింట్ పెట్టండి  అంటాడు. ఇంకొకడు వెళ్లి మీరందరూ వెళ్లి  ఎం ఎల్ ఏ కాళ్ళ మీద పడి ప్రాదేయపడండి,  ఆయన  జాలి చూపించి మిమ్మల్ని యిక్కడే వు౦డండి అని దయ చూపిస్తాడు అని దారి చూపిస్తారు. మనలో కట్టుబాటు౦టే  యెన్నడూ లేనిది ఈ కార్లన్నీ మన యిళ్ళ మధ్య నుండి తిరిగేవా అన్నాడు యింకొకతను. ఐదు నిమిషాల్లో అక్కడ మూడు పార్టీల  రాజకీయం అంతా అర్ధమైపోయింది నాకు. మెయిన్ రోడ్ పూర్తయితే కార్లు యిటు యెక్కువగా రావులే  అందరూ అటే వెళ్ళిపోతారు అని వచ్చేసాను. ఎక్కువగా మాట్లాడితే వాళ్ళకున్న స్థాన బలం మనకి లేకపోతే యిబ్బంది పడతానని   నాకు తెలుసు కాబట్టి.
చిన్న చిన్నగా సెక్రటేరియట్ లో వివిధ విభాగాల్లో  పని చేసే వాళ్ళు చాలా మంది మా ప్రాంతానికి అద్దెకి వచ్చేసారు. నిర్మానుష్యంగా వున్న మా యింటి వెనుక భాగమంతా  జనసమర్ధంగా మారిపోయింది. కార్లు, ఆటోలు, బైకులు జె ఆర్ నగర్ లో నుండి వెళ్ళడం మరీ ఎక్కువైంది.   "పదేళ్ళ క్రిందట  నేను చూసిన ఈ వూరు యిలా  వుండేది  కాదు దూరంగా విసిరేసినట్లుండే యీ   ప్రాంతం కూడా అభివృద్ధి చెందింది".అన్నాను శ్యామ్ తో. 

"మావూరు రాజధాని రావడం వల్ల కొత్తగా  అభివృద్ది చెందింది యేమీ లేదు . అప్పటికే అభివృద్ధి చెందిన భాగంలో వొకటి.   ఇప్పుడు పెరుగుతున్న యీ అభివృద్దే మా వూరి ప్రశాంతతని కబళిస్తుంది." అన్నాడు . అర్ధం కానట్టు చూసాను .

 నాలుగేళ్ళ క్రిందటే యిక్కడ యెకరం  భూమి విలువ పది కోట్ల పై మాటే. భూమిని కౌలుకి యిచ్చేవాడికి పాతిక  వేలు కౌలు కూడా రాదని బాధ. కౌలుకి తీసుకున్న రైతుకి మగమనిషికి రోజుకి ఆరొందలు కూలిచ్చి పొలంలో పని చేయించుకు౦టే యే౦  మిగులుతాయని వేదన.  ఇప్పుడు వూరి చివర వెలిసిన బార్ అండ్ రెస్టారెంట్. పనికెల్లిన మగాడు అక్కడికెళ్ళి అందులో సగం పైగానే వదిలించుకుని యింటికి జేరతాడు. ఊరి చివర వాడలకి సమీపంగా ఐదు నక్షత్రాల హోటల్ ఆ వాడలకి ఆనుకునే వెలిసిన అపార్ట్మెంట్లు. వాటికి  రెండు ప్రక్కల నుండి దారిని వేసి కొనుక్కునే వాళ్ళ కులాన్ని బట్టి దారిని చూపించే బిల్డర్ల మాయమాటలు. కొన్నాక నిజాన్ని  గ్రహించి అసంతృప్తిగా ముఖాలని పెట్టుకుని తిరిగే విద్యావంతులు. రెండేళ్ళల్లో  నిర్మాణం పూర్తీ చేసుకున్న  తొమ్మిది వందల ప్లాట్స్  అందులో మూడోవంతు మాత్రమే అమ్ముడై నష్టాలలో కూరుకుపోతున్న బిల్డర్స్.  ఎవరికీ చెప్పుకోలేక గుండె పోటులతో కుప్పకూలుతున్న వైనాలు యిదండీ మా వూరి ముఖ చిత్రం . అభివృద్ధి అంతా పోర్ట్ కెళ్ళే రోడ్ దే అన్నాడు వ్యంగ్యంగా.

 తర్వాత మా ఇంట్లో పనిచేసే సుశీల మాటలు వింటే మరింత మతిపోయింది నాకు. "మా వాడలోకి రావడం తప్పుగా అనుకునే జనాలంతా యిప్పుడు మా యింటి ముందు నుంచే వెళ్ళడం యెక్కువైంది. అదివరకు పెద్ద పెద్ద వాళ్ళని చూస్తే మేము కుర్చీలో కూర్చోడానికి భయపడేవాళ్ళం. ఇప్పుడు మా యింటి ముందు కుర్చీలేసుకుని మేము   కూర్చుని వుంటే  వాళ్ళు కారుల్లో పోతూ ఆరిని  చూసి గౌరవంగా లేచి నిల్చోలేదని ముఖం ముటముట లాడించుకుంటూ కూర్చున్నాడు మా వైస్ ప్రెసిడెంట్. మా యింటి  ముందుకొచ్చి మమ్మల్ని మా కుర్చీలలో నుండి లెగవమనడం విచిత్రంగా వుందండీ "అంది.
"చూసి చూడనట్టు కూర్చునే వుండరాదు. అంత  బలవంతంగా గౌరవం యివ్వడమెందుకు,  చాటుగా యిక్కడ వాపోవడమెందుకు" అంది నా భార్య.
"పెద్ద పెద్దాళ్ళతో యేవో అవసరాలు పడతాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు యిలాంటియన్నీ గుర్తుంచుకుని మొండి  చేయి చూపిత్తారమ్మా. దోసిలి పట్టి మంచీళ్ళు తాగడం, చెప్పులు కుట్టుకుని బతకడం, యెనక తాటాకులు కట్టుకుని నడవడం పోయిందన్నమాటే కానీ కనబడని చానా చానా పట్టింపులు వుండాయి కదండీ. ఆ బొచ్చుకుక్క వాళ్ళింట్లో ముందు పని చేస్తే మా యింట్లో పనిచేయోద్దు అని నిలువునా పనిలో నుంచి తీసేసింది వెంకట్రావు గారి భార్య. పనికి కూడా కులమంటుకుంటదో మతమంటుకుంటదో మరి. మీ చదువుకున్నాళ్ళకే  పట్టింపులెక్కువ" అని సణుగుతూనే వుంది పనిజేసినంతసేపు.

మా ఆఫీస్  లో పని చేసే  సుదర్శన్, వెంకటరావు యిద్దరూ  ప్రక్క ప్రక్క సీట్లలో కూర్చునే వుద్యోగం చేసుకుంటారు  ఆఫీస్ లో యిద్దరూ బాగానే మాట్లాడుకుంటారు. అనుకోకుండా యిద్దరూ యెదురుబొదురూ ప్లాట్ లలోనే వుంటారు.  వెంకట్రావ్ అద్దెకి దిగితే సుదర్శన్ సొంతంగా ప్లాట్ కొనుక్కున్నాడు. కానీ  యింటి దగ్గర పలకరించుకోవడం కానీ వొకరింటికి  మరొకరు వెళ్ళడం కానీ వుండదని యిద్దరూ విడి విడిగా చెప్పారు వాళ్ళు. ఎందుకని అంటే  మీకు తెలియదా సర్ వాళ్ళు  ఆ కులం కదా  అంటూ కలవడానికి వున్న  అభ్యంతరం చెప్పారు. పెద్ద పెద్ద చదువులు చదివి వుద్యోగాలు చేస్తున్న వీళ్ళే కుల భావనని జయించలేకపోతే అట్టే చదువుకొని శ్యాం మూర్ఖత్వం ఆక్షేపించ దగినదిగా నాకనిపించలేదు.
 పాలు తెచ్చిచ్చిన శ్యాం ని కూర్చోమని కూడా అనలేదు సుదర్శన్ భార్య.  పైగా భర్తతో అతనేమితండీ అంత అగ్లీగా వున్నాడు  అతనిని యెక్కడ కూర్చోమంటారో,  తెల్లని సోఫాలకి  అతని మురికి యెక్కడ అంటుకుంటుందో అని హడలిపోయాను అందట అని మోసుకొచ్చింది సుశీల.

శ్యామ్ మీకు బంధువట కదా అని అడిగాను  సుదర్శన్ ని. అవును అన్నాడు అయిష్టంగా. అసహనంగా వుంటాడన్నమాటే కానీ మంచివాడే అని నేనంటే  అతను మహా పొగరబోతు. ఇరవై యేళ్ళ నాడే ఎం ఏ వెలగపెట్టి ప్రభుత్వ వుద్యోగం కూడా చేసి అర్దాతరంగా వదిలేసి వచ్చి  పేడ పిసుక్కుంటున్నాడు. పెద్ద చిన్న గౌరవం లేదు, వుద్యోగం చేసినన్నాళ్లు గొడవలే, అతనితో కాస్త జాగ్రత్తగా వుండాలండీ అన్నాడు.

ఆశ్చర్యపోతూ అరే అతనెప్పుడూ యీ విషయం చెప్పనేలేదు అన్నాను. శ్యాం పట్ల  యె౦దుకో గౌరవం కల్గుతుంది ఈ మధ్య .  సాయంత్ర సమయాలలో పాలు తెచ్చిచ్చినపుడు యెప్పుడైనే యింట్లోకి ఆహ్వానిస్తే  అయిష్టంగానే లోపలికి వచ్చేవాడు. టీ త్రాగుతూ అనేక విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. వ్యవస్థ పట్ల అతనికున్న అభిప్రాయాలన్నీ పచ్చి నిజాలేగా అనిపించేది.
మా మధ్య గాజద్దాల అంతస్తులు కడితే  వాటిని రోడ్డు మీద నిలబడి చూస్తూండం అభివృద్ధి కాద౦డీ, మా ఇందిరమ్మ యిళ్ళ మధ్య నుండి కారులు వెళుతుంటే మనమెందుకు అలాంటి కార్లలో తిర్గలేకపోతున్నామో అర్ధం చేసుకోలేని  మా కుర్రాళ్ళ వుక్రోషం అభివృద్ధి అంటారా?  మా యిళ్ళ మధ్యనే వున్న కార్పోరేట్ కాలేజ్ లో మా బిడ్డలని చదివించగలమా ? షాపింగ్ మాల్ లో కెళ్ళి నా బిడ్డకి  ఫ్లోర్ లెంగ్త్ డ్రెస్ కొనివ్వగలనా ? అంతెందుకు ఓ బ్రాండెడ్ నెయిల్ పోలిష్ కొనివ్వగలనా ? ఇవన్నీ మాకు అందుబాటు ధరలోకి లోకి వచ్చినప్పుడో లేదా మా కొనుగోలు శక్తి పెరిగినప్పుడో కదా  అభివృద్ధికి  అసలైన నిర్వచనం అని  ఆవేశంగా మాట్లాడేవాడు.నాలో  ఆనేక ఆలోచనలని రేపి వెళ్ళేవాడు.


రోడ్డు విస్తరణ కార్యక్రమం పూర్తైనాక కూడా రెండు కిలోమీటర్ల దూరం కలిసి వస్తుందని జె ఆర్ నగర్ రోడ్ లోనే వెళుతున్నాను కానీ జె ఆర్ నగర్ లో బంధువులున్న సుదర్శన్ మాత్రం  కొత్త రోడ్ వైపు   ప్రయాణించడం మొదలెట్టాడు.  ఇటువైపు నుండి వెళితే ఫ్యూయల్ సేవ్ అవుతుంది కదా   అంటే   ఛీ ఛీ ఆ మురికి మనుషుల మధ్య నుండి యెవరు వెళతారండీ,  కారుపై  గేదె తోకతో కొట్టుద్దో , పిన్నమ్మ వరసయ్యే ముసలమ్మ కారాపి  యీ కూర పట్టుకెళ్లు  కొడుకా అంటూ  వెంటపడుద్దో, యె౦దుకొచ్చిన గొడవ అని వెళ్ళడం మానుకున్నాను అన్నాడు.

నేను అతని వొక ఆశ్చర్యంగా చూస్తుంటే "సుదర్శన్ ఎలాంటివాడో నేను  చెపితే మీరు నమ్మలేదు, అతనంటే యేమనుకున్నారు యిప్పుడర్ధం అయిందిగా మీకు" అన్నాడు వెంకట్రావు.

ఇంటింటికి పాదయాత్ర చేస్తున్న ఎం ఎల్ యే కి యెదురేగి మరీ స్వాగతం పలికాడు సుదర్శన్. తనెక్కడినుండి  వచ్చింది యే ఆఫీస్ లో పని చేస్తుంది  అన్నీ వివరించాడు. అది మొదలు ఆయనతో తిరగడం మొదలెట్టాడు.

  ఒకరోజు లంచ్ టైం లో  తెలిసో  తెలియకో నేనూ  యిటువైపు వచ్చాను పిల్లలు పెళ్లీడు సమయం వచ్చేసరికి యీ వూరు  వొదిలి రాజధాని పరిధిలో యిల్లు కట్టాలి.  ఎంతైనా అది ప్లాన్డ్ సిటీ కదా, అక్కడుంటే పిల్లలకి మంచి  మంచి సంబంధాలు వస్తాయి  యేమంటారు మీరు  అని అడుగుతుంటే  మళ్ళీ  ఆశ్చర్యపోయాను. వ్యక్తి కులంగా, మతంగా, అధికారంగా, అభివృద్దిగా, స్త్రీగా, పురుషుడిగా, చదువు వున్నవాడిగా, లేనివాడిగా యింకా వేరు వేరుగా చాలా  విడగొట్టబడినాక మనిషిగా  మాయమైపోయాడు. అభివృద్ధి అనే  మిఠాయి పొట్లం  కోసం చిటారు  కొమ్మపైకి యెక్కి కూర్చున్నాడు. ఇప్పుడు దిగడం యెలాగో అర్ధం కాకపోయినా దానిని కప్పి పుచ్చుకుని   నేల పై  బురద  వుందని అసహ్యించుకుంటున్నాడు.

సుదర్శన్  ఆఫీస్ లో ఎం  ఎల్ యే కి బాగా సన్నిహితుడినైనానని చెప్పుకోవడం యెక్కువైపోయింది. అడిగిన వారిని అడగని వారికి  ఆయన చాలా మంచివాడు. మనమంటే అభిమానం చూపుతాడు  ఏదైనా పని కావల్సిదే చెప్పండి. నిమిషాల్లో అయిపోతుందని హామీలు యిచ్చేస్తున్నాడు. అసలదంతా నిజమేనంటావా అనడిగాను శ్యాం ని.

మా   వాళ్ళందరిని కలిపి వుంచే గుండుసూది లాగా పనికొస్తాడని దువ్వుతున్న సంగతి తెలియదు వెఱ్ఱి ముఖం గాడికి. అన్నాడు శ్యాం . అతని సూక్ష్మగ్రాహ్యక శక్తికి అచ్చెరువు చెందుతూనే అర్ధం కాలేదు అన్నాను నటిస్తూ ..
యే కులానికి ఆ కులం లెక్కన   వోటర్లని  పొత్తాలు పొత్తాలుగా ఒక  పొదికలా పెట్టుకుని  వాళ్ళని విడిపోకుండా వుంచడానికి  యీ సుదర్శన్ లాంటి వాళ్ళని గుండుసూదిగా వాడుకుంటారు నాయకులు. ఆర్థికంగా బాగుండి, నమ్మకంగా పడి వుండే  వారిని   గోడకి కొట్టిన మేకులాగా,  పార్టీ  అంటే అభిమానంతో పడి చచ్చేవాళ్ళని పాకలో   గుదికొయ్యలా పాతేసి  వాడుకుంటారు. ఈ తెలివిలేని నాయాల్లందరూ  గొర్రెల మందలాగానో, సొల్లు కార్చుకుంటూ చెప్పులు మోసే వాళ్ళు గానో, చిన్న చితకాకి  ఆశపడి కుక్కల్లా కాపాలా కాయడమేగా చేసేది. అంతకన్నా యే౦ మార్పు వుంటుంది  వీళ్ళల్లో అన్నాడు.

రాజకీయ నాయకుల సంగతి అలా వుండనీయ్, అంత మంచి వుద్యోగాని కెందుకు రాజీనామా చేసావ్ ?

"అన్ని చోట్లా వున్న వివక్షేనండీ కారణం. కులపరంగానో,మతపరంగానో,ఆర్దికపరంగానో, ఉద్యోగ స్థాయిని బట్టో  ఆభిజాత్యాన్ని ప్రదర్శించడం బలహీనంగా వుండవాడిని అణగద్రొక్కాలనుకోవడం చూసి భరించలేకపోయాను.ఒకరి క్రింద పనిచేయడం యెందుకు, నాకు నచ్చిన పని నేను చేసుకుంటున్నా, నా పిల్లలు బాగా చదువుకుంటున్నారు వాళ్లకి రిజర్వేషన్ కేటగిరిలో వచ్చే వుద్యోగం కూడా వద్దు. జర్మనీ కి వెళ్లి  చదువుకోవాలనుకుంటున్నారు" అన్నాడు.

ఆ రాత్రంతా శ్యాం గురించి ఆలోచిస్తూనే వున్నాను. బతక నేర్చినతనంతో  యెక్కడికక్కడ  అవకాశాలు అందిపుచ్చుకునే  సుదర్శన్  కన్నా శ్యాం ఆత్మాభిమానం కలవాడు, చైతన్యం కలవాడుగా అర్ధం చేసుకున్నాను. శ్యాం ని  సామాన్య మానవుడిగా, చేతకాని వాడిగా, పొగరు బోతుగా మాత్రమే అంచనా వేసుకుంటున్నాడు సుదర్శన్. ఇలాంటి సామాన్యుల, సగటు మనుషుల చేతుల్లోనే ప్రభుత్వాలని  మార్చే శక్తి వుందని తెలుసుకోవాలి. మనిషిని వోటర్ గానో లేదా పేడ పిసుక్కునే మనిషిలా  కాకుండా  మనిషిగా గౌరవించాలి. తెల్లవారకుండానే  పాల బాటిల్ల సంచీ పుచ్చుకుని  నేనే శ్యాం యింటివైపుకు దారితీసాను.

(2018 జూలై అరుణ తారలో ప్రచురితమైన కథ)

కామెంట్‌లు లేవు: