27, సెప్టెంబర్ 2022, మంగళవారం

నూనె కుండ

 మెయిన్ రోడ్ ని ఆనుకుని  వున్న సినిమా హాలు. దాని ప్రక్కనే ఓ పెట్రోల్ బంక్. ఆ రెండింటి ప్రక్కన  నాపరాళ్ళు, చలువ రాళ్ళు పేర్చిన అడితీ. ఆ అడితీ  యెదురుగా రోడ్డుకి అవతలి వైపున యెత్తుగా గుబురుగా పెరిగిన చెట్లు. ఆ చెట్లు బాటసారులకి యెండా వాన నుండి రక్షణ యివ్వడమే కాకుండా  ఆ రోజు  కుల పెద్దల పంచాయితీ కి వచ్చినవారికి నీడనిచ్చాయి.


భర్త వైపు నుండి నాలుగు ఆటోల జనం దిగారు. భార్య వైపు నుండి పట్టుమని నలుగురు  కూడా లేరు. అయితేనేం ? నలబై మంది మనుషుల లెక్కన ఒకే ఒక స్త్రీ స్వరం  సివంగిలా  విరుచుకుపడుతూ తన వాదన వినిపిస్తూ వుంది. కుల పెద్దలు ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ వున్నారు. అప్పటికే తీర్పు జరిగి పోయింది. మెల్లగా కొందరు లేచి కల్లు  పాకల వైపు, దగ్గరలో వున్న బార్ & రెస్టారెంట్ ల వైపు దారి పట్టారు.


మిగిలిన కొంతమంది ఆడవాళ్ళు  " ఇది చేసిన తప్పు యెనక పెట్టుకుని నోరేసుకుని చెలుగుతుంది. ఆడదానికి యింత  కావరం పనికి రాదు. అయినా యిదొక్కతే యీ నూనె కుండ ప్రెమాణంకి తయారైందా  యే౦టీ ? ఎన్ని చూళ్ళా మనం " అంటూ దుమ్మెత్తి పోస్తుండగా ..


వారికి యెదురుగా  పెద్ద కారు ఆగింది. అందులో నుండి కెమారాలు పెట్టుకుని యిద్దరు దిగారు . ఇంకొకతను చేతిలో మైక్ పట్టుకుని  కెమరా ఆన్ అన్నట్టు కెమెరా మెన్ వంక చూస్తూ, వీళ్ళ దగ్గరికి వచ్చి…


 " ఏమండీ ! యిక్కడేదో కుల పంచాయితీ జరుగుతుందని  తెలిసింది . అసలు అలా పంచాయితీలు చేయవచ్చా,  యిక్కడున్న అందరికి తెలియదా? ఏమైనా గొడవలు వుంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి, కోర్టుకి వెళ్ళాలని అనుకోకుండా యింకా యిలా పంచాయితీలు పెడుతున్నారు. ఇది తప్పని మీకు తెలియదా” అంటూ   ఆతను  అలా అడగగానే అదేదొ టీవిలో మనం కనబడతాము అనుకుని కొందరు ఉత్సాహంగా ముందుకు వచ్చి చెప్పబోతుండగా,  యింకొకరు వచ్చి గబా గబా వాళ్ళని వెనక్కి నెట్టి.


 "ఇక్కడ ఆట్టాంటివి  యేమి జరగటం లేదండి, యేదో మొగుడు పెళ్ళాం తగువులు పెట్టుకుంటే సర్ది చెపుతున్నాం " అని ఒకరికొకరు సైగ చేసుకుని అక్కడ నుండి జారుకున్నారు .


ఇక అక్కడ అప్పటిదాకా సివంగిలా తిరగబడ్డ "రమణ "  అక్కడే నిలబడి వుంది.  ఆమె ప్రక్కనే వున్న తల్లి, అమ్మమ్మ,చెల్లి కూడా మీడియా వాళ్ళని చూసి వేగంగా వచ్చే వాహనాలని తప్పించుకుంటూ రోడ్డు దాటి అడితీలోకి వెళ్ళిపోయారు. రమణ వొంటి పై చీర కూడా లేదు "ఇది ఆడు కొనిచ్చిన చీర, ఈ చీర కూడా నాకొద్దు.  వాడే వద్దనుకుంటే వాడు  కొన్న చీర నా వొంటిపై  యె౦దుకు? అంటూ చీరిప్పి మొగుడి మొహాన కొట్టింది. వెంటనే ఆమె తాత తన భుజం పై వున్న తువ్వాలుని వేసి ఆమెని నలుగురి దృష్టిలో పడకుండా చేసి ఆడ  దాక పోయొస్తా!  అంటూ కుల పెద్దలతో కలిసి కల్లు దుకాణానికి పోయాడు.


చానల్ వారికి అర్ధమైంది. తమకి కావాల్సిన విషయాన్ని  వాళ్ళెవరూ చెప్పరని. ఆఖరిసారి ప్రయత్నించి చూద్దాం అనుకుని ఆశతో వారు కూడా రోడ్డు దాటి  ఇవతలి వైపుకి వచ్చారు.  తర్వాత "రమణ" కూడా రోడ్డు దాటి  అడితీలోకి వెళ్లింది.


నేను అక్కడి నుండి కదలబోతుండగా మీడియా విలేఖరి నన్ను అడిగాడు "ఇక్కడ యే౦  జరుగుతుంది ? అసలు యిప్పటి వరకు యే౦   జరిగింది?మీరు చూస్తూనే వున్నారు కదా ! చెప్పండి” అన్నాడు .


నేను చిన్నగా నవ్వి వాళ్ళతో చెప్పాను " స్పెషల్  కథనం కాదగ్గ విషయం కొద్దిసేపటి క్రిందే జరిగిపోయింది. ఇక యిప్పుడేమి లేదిక్కడ”.


అదేమిటో  కొంచెం వివరిస్తారా ? జిడ్డు ప్రశ్న. 

వదిలేటట్టు లేరు వీళ్లు అనుకుంటూ  "నిజంగా యిలాంటి కథనాన్ని మీరు నిత్యం ప్రసారం   చేసేంత ముఖ్యమైనదే ! ఇప్పటికిప్పుడు నేను రెండు ముక్కల్లో చెప్పే విషయం కాదిది.  మీరు యీ ప్రత్యక్ష ప్రసారం కాస్త ఆపేసి ఓ  గంట సేపు  కూర్చోగల్గితే వివరంగా చెపుతాను " అన్నాను .


సరే,  యిప్పుడే చెప్పడానికి మీకు అభ్యంతరం లేదుగా ? అడిగాడు. నేను కొంచెం అసహనంగా ముఖం పెట్టి వారి కెమెరాలవైపు చూసాను .


ఆతను నా అసహనాన్ని గమనించి కెమెరా వారిని  వెళ్ళిపొమ్మని చెప్పాడు.


వాళ్ళు వెళ్ళిన తర్వాత “ఇప్పుడు మీకు యెలాంటి యిబ్బంది లేదు, వ్యక్తిగతంగా  యిక్కడ యే౦  జరిగిందో తెలుసుకోవాలని వుంది చెప్పండి ప్లీజ్ !” అడిగాడతను .


“నూనె కుండలో చేయి పెట్టడం అనేది  మీరెప్పుడైనా  విన్నారా ?’ అడిగాను.


"ఎస్,ఎస్  విన్నానండీ ! అబద్దం చెపుతున్నారనే అనుమానం వుంటే   మరగ కాగుతున్న నూనె కుండలో చేయి పెట్టి తీయాలి నిజం చెపితే చేయి కాలదు లేకపోతే  కాలుతుంది, అలాంటిదే కదా " అడిగాడు ఆసక్తిగా, వుత్సాహంగా  చూస్తూ.


అలాంటి నిరూపణే  చెయ్యాలనే  "కుల పంచాయితీ" జరిగింది యిక్కడ  .


మై గాడ్ ! యిప్పుడు  కూడానా ?  అసలు మనమెంత  అనాగరిక కాలంలో బ్రతుకుతున్నాం,  అలా నూనె కుండలో చేయి పెట్టడం  జరిగిందా ? మీరు అదంతా చూస్తూనే నిలుచున్నారు . ఒక బాధ్యత గల పౌరురాలిగా మీకు బాధ్యత వుంది కదా ! పోలీస్ కి ఫోన్ చేసి నోటీస్  చెయ్యవచ్చు కదా ! అన్నాడు .


"మీరు కూడా నేను ఫోన్ చేస్తేనే వచ్చారు"  నా సమాధానం.


నూనె కుండ పంచాయితీ యె౦దుకు జరిగింది?  అతని ప్రశ్న .


నా మొహం వివర్ణమయింది ." ఇది  యుగ యుగాల తరతరాలగా జరుగుతున్న పరీక్ష . ఆడదానికి శీల పరీక్ష "  మొగుడు అనుమానపడితే నిరూపించుకోవాలి,  తప్పదు అని చెప్పిన   కుల పురుష పంచాయితీ   తీర్పు చెప్పిన కథ”  అసహ్యంగా, ఆవేదనగా చెప్పాను. 


“అసలు నూనె కుండ యెలా  పెడతారో.. ఐ మీన్  ఆ ఆచారం యెలా  వచ్చిందో, యిప్పుడు యెలా ఆచరించాలని తీర్పు చెపుతారో  మీకు తెలుసా !" అడిగాడతను.


చూడండి అంటూ అతని పేరు తెలియక అర్ధోక్తిలో ఆగిపోయాను."రమేష్” అండీ..అని తనను పరిచయం చేసుకున్నాడు. 


“చూడండి రమేష్, ఈ ఆచారం నేను వినడమే కాని యెప్పుడు చూడలేదు. ఈ విషయం గురించి చెప్పడానికి ఒకామె ని పిలుస్తాను ఆమె మీకు అన్నీ వివరంగా  చెపుతుంది” అంటూ .. అడితీ ముందుకు వెళ్ళి


“సుబ్బమ్మా ఓ సుబ్బమ్మా! ఓ మారు యిట్టా రా ! అని పిలిచాను.


సుబ్బమ్మ అడితీ దుకాణంలో నుండి బయటకి వచ్చింది. “ఏమ్మా ! దొరసాని యే౦ పని బడింది, యిప్పుడు పిలుస్తా వుండావు . మా ఇంట్లో రచ్చ రచ్చగా వుంది మూడు రోజుల నుండి తిండి తిప్పలు లేవు. ఆ పిల్ల కాపరం అట్టా అయిందని నా కూతురు యేడస్తా వుంది. తీర్పు అయిపోయిందిగా, ఉడుకునీల్లు కాసి దానికి కాస్త తలారా స్నానం చేయించాల.” అంది.


“అయన్నీ నీ చిన్న మనవరాలు చూసుద్దిగాని, టీవీ లలో పనిజేసే ఈయన నూనె కుండ సంగతి యివరం చెప్పమని అడగతా వుండాడు . నువ్వు చెపుతా వుంటావ్ కదా ! అదేందో యిప్పుడు చెప్పు” అన్నాను


“ఏయ్యా! ఆయన్నీ పేపర్లో రాస్తావా? టీవిలో చెపుతావా? చెపితే చెప్పావుగాని ,మా పేర్లు రాయబాకయ్యా , ఇట్టాంటివి  వుండాయని లోకానికి తెలియాల, ఆడకూతుళ్ళు యెన్నెన్ని బాధలు పడతన్నారో.. చెప్పుకోవాల , మా గోడు యినేదేవరాయ్యా.. మా కన్నోల్లే మొగుడి యెదాన వేసి యెనక్కి తిరిగి చూడరయ్యే! మేము మొగుడి జాలి ధర్మాన బతికితే బతికినట్టు,చస్తే చచ్చినట్టు” అంటూ వెతలు చిట్టా యిప్పింది .


నేను మౌన౦గా వింటున్నాను “ వీరి కథలు యెన్ని కావ్యాలతో సరితూగ గల్చమా,  ఎన్ని కాన్వాస్ లలో చిత్రించగలమా అని”


"నూనె కుండ సంగతి చెప్పు " తొందర పెట్టాడు రమేష్.


"ఆ మాట తలచుకుంటే.. వొళ్ళంతా భగ భగ మండిపోతా వుంటాది .. ఎల్లమ్మ తల్లి దయ వుండబట్టి నేనింకా బతికి వుండాను కాని లేకపోతే దినంబు నూనె కుండ సాచ్చెం చెప్పమని అడిగేవాడు నా మొగుడు"  అంది.


రమేష్ ఆలస్యం భరించలేనట్టు నా వైపు చూసాడు


“అదే ఆ విషయమే చెప్పు” అన్నాను సుబ్బమ్మ నుద్దేశించి.


మా ఆయన నాకు మేన మావ అవుతాడు. రెండు మనువులు చేసుకుని ఐదుగురు బిడ్డలని పెట్టుకుని  నన్ను మూడో మనువాడాడు.  మా అమ్మ తమ్ముడు కిచ్చిచేస్తే కళ్ళ ముందు పడి  ఉంటానని, మా నాయనేమో  అర్ధ నూట పదహార్ల  వోలికి ఆశపడి   యేబయ్యేళ్ళాడికిచ్చి పెళ్ళి చేసారు . అప్పుడు నా వయసు పదమూడేళ్ళు.  మా ఆయన సాముగరిడీలు ఆడేవాడు . హరికథలు చెప్పేవాడు . ఎప్పుడు వూర్లెంబడి తిరగతా  వుండేవాడు. నేను మున్నేరు చుట్టుపక్కల  మేక పిల్లలని కాసుకుంటూ వుండేదాన్ని. నా మొగుడొకసారి వూళ్ళకి బోయి రెండు నెలలకి  యింటికి వచ్చాడు . ఆయనొచ్చేటప్పటికి  నేను యేవిళ్ళు  పడతా వున్నాను . ఆయనలో అనుమానం మొదలైంది. నేను లేకుండా నీకు కడుపు యెట్టా అయిందే ! నాకు యీ పెళ్ళాం వద్దు అని  పంచాయితీ పెట్టి తప్పు కట్టి నన్ను తీసుకుపొమ్మని మా వాళ్లకు కబురంపాడు .


రోజూ రభసే! పద్నాలుగేళ్ళ దాన్ని యేడవడం కూడా చేతయింది కాదు. కులపంచాయితీ పెట్టారు. నేను నా మొగుడుని  తప్ప పరాయివాడిని యెరగనని వొట్టు పెట్టాను  పంచాయితీలో అందరూ మగొళ్ళే కదా! ఒక్కరు కూడా కనికరం చూపించాలా, ఆడు చెపుతున్నాడు కదా! ఇల్లు మొగం చూసి రెండు నెలలయ్యిందని. నువ్వు యెవడినో వుంచుకున్నావ్  తప్పు కట్టు. లేదా నూనె కుండలో చేయి పెట్టి తప్పు చేయలేదని నిరూపించుకో అన్నారు. 


“మేము తప్పు కట్టలేం నూనె కుండలో చెయ్యి పెట్టి నువ్వు నిరూపించుకో అని మా  అమ్మ అయ్య అన్నారు.   తప్పు చేయనప్పుడు నాకెందుకు భయం ? నూనె కుండలో చెయ్యి పెట్టడానికే వొప్పుకొన్నాను .


పంచాయితీ పెద్దలు, ఇరుగు పొరుగు, చుట్టాలు అందరూ బయలేల్లి యెడ్ల బండ్లలో  అడవిలో వున్న  "ఎల్లమ్మ " తల్లి గుడికెల్లాం . ఆ రాత్రి నన్ను వుపాసం వుండమన్నారు . వచ్చినోల్లంతా కోళ్ళు కోసుకుని వండుకుని తిన్నారు . ఖర్చు అంతా  మా ఆయనే భరించాలి. తెల్లారుఝామునే నూటొక్క బిందె నీళ్ళతో నా చేత తలారా స్నానం చేయించారు . బిందె మార్చి బిందె నీళ్ళు  గుమ్మరిస్తా వుంటె వూపిరి తిరగలా. గుప్ప తిప్పుకోనీయకుండా నూటెనిమిది బిందెల నీళ్ళు గుమ్మరించారు . పసుపులో ముంచిన తెల్లని గుడ్డలు కట్టించారు. ఎల్లమ్మ తల్లి గుడి కెదురూగా  మూడు రాళ్ళ పొయ్యి పెట్టి ఆ పొయ్యిలోకేయడానికి  నూటొక్క పిడకలు తయారుగా వుంచారు . ఒక పాత కుండ నిండా రెండు మానికల నూనె పోశారు. మా ఆడాల్లలోని పెద్ద ముత్తైదువని  పిలిచి యెల్లమ్మ తల్లికి దణ్ణం పెట్టుకుని పొయ్యి ముట్టించి నూనె కుండ పెట్టమని చెప్పారు. అట్టా  చేసాక నన్ను  యెల్లమ్మ తల్లి గుడి చుట్టూతా ప్రదక్షిణాలు  చేయమన్నారు .


నేను ప్రదక్షిణాలు చేస్తా వున్నాను. నూనె మరుగుతా వుంది. నా గుండెల్లో దడ  మొదలయింది . కూర తిరగమాత యేసేటప్పుడు  చుక్క నూనె పడితేనే కాలిపోయి మంట పుట్టుద్దే,అట్టాంటిది నిండు కుండ నూనెలో నేను చేయి పెట్టి ప్రమాణం చేసేదాకా చెయ్యి తీయకుండా వుంటే చెయ్యి కాలదా !? అమ్మా,  యెల్లమ్మ తల్లీ ! యే౦టమ్మా, ఈ అగ్గి పరీక్ష ? నేను నా మొగుడ్ని తప్ప యెవరిని యెరగనే ! అందుకే గద ఈ పరీక్షకి అంత నమ్మకంగా వొప్పుకున్నా.నా నిజాయితీ యేమిటో  నిరూపించు తల్లీ! అని మొక్కుకుంటూ  గుడి చుట్టూ తిరగతా  వుండాను, నా కాళ్ళు తేలిపోతన్నాయి. నేను అడుగడుక్కి  పడిపోబోయి నిలదొక్కుకుంటూ తిరగతా  వుండాను.


అప్పుడే ఒక యిచిత్రం జరిగింది. ఎల్లమ్మ తల్లి వుందని నిరూపించింది ..   సత్తె ప్రమాణం జరిగింది.


 అప్పటికప్పుడే దట్టంగా మబ్బులు కమ్ముకొచ్చాయి. గాలి వాన మొదలయింది. నూనె కుండ కింద పొయ్యి ఆరి పోయింది ..  పంచాయితీకి వచ్చినాల్లందరూ చెట్ల కిందకి పోయారు.  నేను వానలో తడుస్తూనే గుడి చుట్టూ తిరుగుతానే వుండాను. కాసేపటికి యేమైందో తెలియదు,నేను కళ్ళు తిరిగి పడిపోయాను.


కళ్ళు తెరిచి చూసేసరికి  మబ్బులు ఎట్టా పోయ్యాయో! కళ్ళల్లో చురుక్కుమని సూరీడు గుచ్చుతున్నాడు. నీరసంగా కళ్ళు తెరిచాను.


మా అమ్మ చెప్తా వుంది.  నూనె కుండ పంచాయితీ తప్పి పోయిందంట " ఎల్లమ్మ తల్లి సత్తెం కలది అందుకే నూనె  కుండ క్రింద పొయ్యి కూడా చిత్రంగా ఆరిపోయింది. ఇక నూనె కుండలో చెయ్యి పెట్టె పనే లేదు .. నీ పెళ్ళాం యే  తప్పు చేయలేదని  ఋజువైనట్టే,  పంచాయితీ అయిపోయింది అన్నాలు వొండుకుని తిని  యిక యిళ్ళకి బోవటమే!  " అని పంచాయితీ చెప్పారని సంతోషంగా చెప్పింది .


అట్టా… నేను నూనె కుండలో చెయ్యి పెట్టకుండా తల్లి కాపాడిందని  నేను యే  తప్పు చేయలేదని చెపుతా వుంటారు.  నేను ఆ ముక్కే నోరు చించుకుని చెప్పినా యినలేదు, యేడ్చి చెప్పినా యినలేదు. నూనె కుండలో చెయ్యి పెట్టాల్సిందే అన్నారు . ఆ తర్వాతయినా మా ఆయనలో అనుమానం జబ్బు పోలేదు. తర్వాత ఆ వూరిడిచి వచ్చేసాము. ఈ బెజవాడ చుట్టుపక్కల బతుకుతున్నాం, ఇంటోనుండి కాలు బయటకి పెడితే చాలు "ఎవడ్ని ఉంచుకున్నావే ... "(అభ్యంతర పదం) తో .. తిడతా వుంటాడు. ముగ్గురి బిడ్డలని కన్నా. ఏళ్ళతరబడి అన్నం తిన్నట్టు తిట్లు తింటానే వుండాను. శుభ్రంగా గుడ్డ కట్టుకోనీయడు,పూలు బెట్టనీయడు, నలుగురితో మాట్టాడనీయడు. కాలు చెయ్యి ఆడక పదేళ్ళు అయ్యింది. ఏ పని చేయకుండా తిరుగుతున్నా  పాచి పని చేసి పసి బిడ్డని సాకుతున్నట్టు సాకుతున్నా. ఇప్పుడూ  తిడతానే వుంటాడు. ఆ తిట్లు తిని తిని యిట్టా అయిపోయా అంటూ చెప్పింది. 


సన్నగా కట్టేబారిపోయి ఉన్న ఆమెని చూస్తూ జాలిపడ్డాడు రమేష్.


“నీకెన్నేళ్ళు అవ్వా” అడిగాడు 


“అరవయ్యి వుంటాయయ్యా.  ఈ కళ్ళతో యెన్నో చూసా, చెప్పుకుంటే బోలెడు కథలు” అంది


 “అది సరే ఆ తర్వాత నీకు తెలిసీ యెవరన్నా యిట్లాంటి పరీక్షలో నూనె కుండలో చేయి పెట్టారా ?” రమేష్  గుచ్చి గుచ్చి అడుగుతున్నాడు సుబ్బమ్మని.


“మా కులంలో మొగుడు అనుమానిత్తే అట్టా నూనె కుండలో చేయి పెట్టి నిరూపించుకోవాల్సినదేనయ్యా. ఇద్దరు ముగ్గురు కాలి నయం గాక చచ్చిపోయారు . కొంత మందేమో చేయి పెట్టడానికి భయపడి తప్పు చేయకపోయినా చేసామని వొప్పుకుని డబ్బు కట్టి మొగుడ్ని వదిలేసుకుని యెల్లిపోతారు మొగుడు నిందేస్తే ఆడదాని జీయితం అయిపోయినట్టేనయ్యా! అందుకే మాలో ఆడైనా, మగైనా  మారు మనువులు జాస్తి.  అని చెప్పి  అక్కడినుండి కదిలింది.


“దొరసాని,  నేను పోయోస్తా, రేపు  కనబడతానమ్మా  కాసిని డబ్బులు అప్పు యియ్యాలి నువ్వు” అంటూ అడితీలోకి వెళ్ళిపోయింది


నేను ఆలోచిస్తూ వున్నా.. ఆ రోజు గాలి వానా రాకుండా వుండి వుంటె... ఆ  కుండలో  మరుగుతున్న నూనె లో  సుబ్బమ్మ చేత చేయి పెట్టించి ప్రమాణం చేయించి వుండేవారు . కచ్చితంగా చేయి కాలి చర్మం కూడా వుడికి పోయి వుండేది.  ఊహించు కుంటేనే వొళ్ళు జలదరిస్తుంది . శీల౦ పరీక్ష పేరిట అమాయుకులైన ఆడవాళ్ళని యిలా హింసించే ఆచారాల్ని కూకటి వేళ్ళతో పెకిలించి వేయాలి  ఆవేశంగా అనుకుని ..


 రెండు  తరాల తర్వాత కూడా .. సుబ్బమ్మ మనుమరాలు "రమణ" కి మళ్ళీ నూనె కుండ పరీక్ష పెట్టమని పంచాయితీ చెప్పిన కుల పెద్దల తీర్పు తో .. వాళ్ళ జీవనంలో యెలాంటి మార్పు రాలేదని  అర్ధమవుతుంది కదా రమేష్ గారు .... అడిగాను


అవునండీ! ఇంతకీ ఈ సుబ్బమ్మ మనుమరాలికి యీ పరీక్ష పెట్టమన్నారా  యేమిటీ అడిగాడు.


అవునని తలూపాను .


మైగాడ్ !  అలా జరిగిందా ?  అడిగాడు అతను ఆశ్చర్యంగా ..


“అలా జరగడానికి "రమణ " యేమన్నా  సుబ్బమ్మ లాంటి మామూలు ఆడమనిషి కాదు  ఆభిజాత్యం యెక్కువ. నేను చెప్పడం కాదు కాని మీరు రెండు మూడు రోజుల తర్వాత తీరిక చేసుకుని వస్తే  స్వయంగా ఆమె నోట వెంబడే ఆమె కథ చెప్పిస్తాను”అన్నాను


మళ్ళీ .. సస్పెన్స్ లో పెట్టారా మేడమ్ అన్నాడతను నవ్వుతూ ....


కొన్ని కథలు మనం చెప్పుకోవడం కన్నా వారి కథ వారి నోటి వెంట వచ్చినప్పుడు వింటేనే బావుంటుంది అన్నాను.  రమేష్ నా ఫోన్ నంబర్ తీసుకుని  రెండు రోజులలో వీలుని బట్టి కలుస్తానని చెప్పి నా   వద్ద సెలవు పుచ్చుకుని . వెళ్ళిపోయాడు



సరే.ఫ్రెండ్స్... నా కథ  యిక్కడ ఆగింది .


"రమణ"  రమేష్ తో  ఆమె  తన కథ  చెప్పేటప్పుడు  మీరు విందురుగాని  ఐ మీన్ చదువుదురుగాని  ఇక వుండనా మరి.


(బ్లాగ్ ను ఆధునీకరించే క్రమంలో అదివరకు సీరియల్ గా రాసిన కథలను తుడిపేసి ఒకే కథగా ఇవ్వడమైనది. బ్లాగ్ మిత్రులు గమనించగలరు.)




కామెంట్‌లు లేవు: