26, సెప్టెంబర్ 2022, సోమవారం

ఆధిపత్య అహంకార పీడ జాడలను విడిచిన ‘కుబుసం’

“ కుబుసం” కథ  ఈస్తటిక్ సెన్స్ కథాసంపుటిలో  ఉన్న కథ. వెబ్ పత్రికలో ప్రచురింపబడిన కథ. అంజని యలమంచిలి ఈ కథకు వ్యాఖ్యానం రాసారు. చదవండీ.. వారి వ్యాఖ్యానం. 



సూర్యుడికి గ్రహణం పడుతుంది. 


చంద్రుడికి గ్రహణం పడుతుంది. 


మహిళకూ గ్రహణం  పడుతుంది. 


సూర్యచంద్రులకు పట్టిన గ్రహణం కొద్ది నిమిషాల్లో వదిలేస్తుంది. 


కానీ మహిళలకు పట్టిన గ్రహణం... 


అనాదిగా తరతరాలకు పట్టి పీడిస్తున్నది. 


మహళలకు పట్టిన ఆ గ్రహణం తాలూకు అనేక రూపాలే ఈ ‘కుబుసం’ కథ. 


సాంప్రదాయాల సంకెళ్లను ఛేదించకుండా స్త్రీ జాతికి స్వేచ్ఛా సమానత్వాలు లభించవని చాటిచెప్పే  కథ ఈ కుబుసం.  


ప్రేమ్ చంద్ తన ‘కర్మభూమి’ నవలలో  కార్యోన్ముఖులు, సాహసులు, త్యాగశీలురైన స్త్రీ పాత్రల్ని సృష్టించినట్లుగానే... ఈ కథలో రచయిత్రి వనజ తాతినేని  సృష్టించిన రామేశ్వరి పాత్ర కూడా అంతటి ఔన్నత్యం వున్న వ్యక్తిత్వం గలది.  


అందుకే అంటాడు చలం... ‘స్త్రీకి కూడా శరీరం వుంది. దానికి వ్యాయామం యివ్వాలి.ఆమెకీ మెదడు వుంది. దానికి విజ్ఞానం యివ్వాలి. ఆమెకు హృదయం వుంది.  దానికి అనుభవం యివ్వాలి అని


స్త్రీల శరీరంపైన, ఆలోచనలపైన, హృదయంపైన అడుగడుగునా అనాధిగా ఈ సమాజం పెడుతున్న అనేక ఆంక్షల వొత్తిడిని కుబుసంలా విడువగల్గితేనే... స్త్రీ కుబుసం విడిచిన నాగులా చైతన్యశీలిగా మారుతుంది. 


గతంలో ఒక తరం స్త్రీలందరూ బడి మెట్లు ఎక్కేందుకు కుటుంబాన్ని వొప్పించడానికి ఎంతో నొప్పిని భరించారు. తర్వాత తరం వారు ఉద్యోగం చేయడానికి కుటుంబంతో యుద్దాలే చేశారు. తర్వాత తరం ఆస్తి హక్కు పొందడానికి సమాన హక్కులు సాధించడానికి లింగ వివక్ష లేని కుటుంబం కోసం సమాజం కోసం కృషి చేస్తూనేవున్నారు. 


కుబుసం కథలో రామేశ్వరి కూడా అదే చేసింది. పేద మధ్య తరగతి కుటుంబాల్లో ఆడ పిల్లలకు చదువు అందని ద్రాక్ష. తనకు లభించని  చదువుకునే స్వేచ్ఛను ఆస్థి హక్కును నచ్చిన వ్యక్తితో కోరుకున్న వివాహాన్ని కూతురికి లభించేటట్లు చేయడానికి శతవిధాలా కృషిచేసింది. కుటుంబ సహకారం లభించకపోయినా ఆర్థిక స్వావలంబన దిశలో నడక సాగిస్తూ పురుషాహంకార పితృసామ్య భావజాలాన్ని అడుగడుగునా ఎదిరిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిచింది. రామేశ్వరి ఒక తరానికి ప్రతినిధి. కచ్చితంగా చెప్పాలంటే రచయిత కాలానికి చెందిన స్త్రీ ప్రతినిధి. 


ఎన్ని విప్లవాలు నడిచినా పర్వాలేదనే ధోరణిలో కళ్లు మూసుకొని, 

తలవొంచుకొని తప్పుకెళ్లే ఈ సమాజంలో  కుటుంబ వ్యవస్థకు  ప్రమాదం జరుగుతుందంటే కూలిపోతుందంటే మాత్రం... దాన్ని ఆధారం చేసుకుని అధికారం చెలాయిస్తున్న పురుషాధిక్య సమాజం విపరీతమైన కలవరపాటుకు గురవుతుంది.  


అలాంటి పురుషాధిక్యతకు నమూనా... అతిపెద్ద ఉదాహరణ... ఈ కథలోని వీరయ్య పాత్ర.  


సాంప్రదాయం పేరుతోనో, కట్టుబాట్ల పేరుతోనో స్త్రీలపై జరిగే అణచివేత, 

పురుషాధిక్య పెత్తందారీతనాన్ని జయించి, తన కుటుంబాన్ని కుటుంబాన్ని ప్రగతిపథం వైపు నడిపించేందుకు... కుటుంబంలోని పురుషాధిక్యతను ఎదిరించి... భర్తను, పిల్లలను ఒక ఉన్నతమైన మార్గం వైపు మళ్లించగలిగిన చైతన్యం, ఔన్నత్యం కలిగిన పాత్ర రామేశ్వరి. 


గ్రహణం విడిచిన సూర్యుడు జగజగ్గీయమానంగా, గ్రహణం విడిచిన చంద్రుడు ఎంతో ప్రశాంతతో కనిపించినట్లుగా... రామేశ్వరి కూడా చుట్టూ వున్న అనేక సమస్యలను ఓపికతో, చాకచక్యంగా పరిష్కరించుకొన్న తీరును నాగును వీడిన కుబుసంతో పోల్చడం.. రచయిత్రి యొక్క అక్షర విన్యాసానికి,  రచనా కౌశలానికి నిదర్శనమని చెప్పొచ్చు.

 

వాస్తవానికి ఈ కథాంశం సాధారణమైనదే. సమాజంలో నిత్యం మన కళ్ల ముందు కనిపించే సంఘటనే. కానీ, ఈ కథలోని శైలి, శిల్పం అసాధారణం. 


రామేశ్వరి పాత్రను నడిపిన తీరు వల్లే  ఈ కథకు ఇంతటి ప్రాధాన్యత సమకూరింది.  


ఒక సందర్భంలో ‘రామేశ్వరి అలా ఎక్కువ కాలం మౌనంగా వుండలేకపోయింది. ఉత్సాహంగా కదిలే కాళ్లను, చేతులను స్తబ్దత నుండి విముక్తి కల్గించి పనికి మళ్ళించింది’ అంటూ రామేశ్వరి పాత్ర నైజాన్ని, ఆమె స్వేచ్ఛా ప్రియత్వాన్ని, ఆమె చైతన్యశీలతను సుస్పష్టంగా చెబుతారు రచయిత్రి.  


మరో సందర్భంలో తన పుట్టింటి నుంచి తెచ్చిన డబ్బుతో కొన్న భూమిని తన పేరున ఎందుకు పెట్టలేదని భర్తని ప్రశ్నిస్తుంది. 


‘మా నాయన ముందు ఈ మాట అనేవు. కత్తి తీసుకుని నరుకుతాడు’ 


అంటాడు రామేశ్వరి భర్త సిద్ధప్ప.  


ఈ ఒక్క వాక్యం సీమలో ఒక సాధారణ రైతు కుటుంబంలో వుండే ఆధిపత్యం వీరయ్యలో కనిపిస్తే... తండ్రి ముందు కనీసం మాట్లాడలేని ఒక మామూలు వ్యక్తిగా సిద్ధప్ప కనిపిస్తాడు. 


అంతేకాదు... సిద్ధప్ప మాటకు రామేశ్వరి గట్టిగానే కౌంటర్ ఇస్తుంది.  


అంత చేతకాని వాళ్లు ఎవరూ లేరులే ఇక్కడ’ అంటుంది.  


అలాగే  ఇద్దరు బిడ్డలు చాలని,  పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటానంటుంది రామేశ్వరి.  


ఇంకో రెండుతూర్తు చూద్దాం. ఆపు అన్నాడు వీరయ్య.


ఆ మాటలేవీ లెక్క చేయకుండా ఆపరేషన్ చేయించుకుంటుంది రామేశ్వరి. 


అప్పుడు అందరి ముందు భార్య చెంపపై కొట్టి తన అధికారం ప్రదర్శిస్తాడు సిద్ధప్ప.   


లోను డబ్బుతో ఒక పాడి గొడ్డును కొంటుంది. 


సొంతగా నూనె గానుగ పెట్టాలనుకుంటుంది.  


మగ పెత్తనం సాగే ఆ ఇంట్లో రామేశ్వరిని అడుగడుగునా అణచివేయాలని చూస్తారు. పిల్లలకు కాన్వెంట్ చదువులు చెప్పించాలనుకున్నప్పుడు కూడా ఇంట్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.ఇలాంటి సందర్భంలో ‘మా వాటా ఎంతొస్తే అంత మాకు పంచి ఇవ్వండి’ అంటూ వీరయ్యను నిలదీస్తుంది రామేశ్వరి. 


తనపై చెయ్యెత్తిన మామను ఎదిరిస్తుంది.  


కొడుకుని, మనవడిని ఇంట్లోవుంచి, కోడలిని, మనమరాలిని వీధిలోకి నెట్టేస్తాడు వీరయ్య.అలాంటి సందర్భంలోనూ ధైర్యం కోల్పోకుండా... 


ఎదురింటి వారి ఆశ్రయం తీసుకుంటుంది. 


పొలం పనికి, కోళ్ల ఫారంలో పనికి వెళుతూ ధైర్యంగా బతుకుతుంది. 


ప్రభుత్వం ఇచ్చే సాయంతో ఇల్లు కట్టించుకోవాలని అనుకున్నప్పుడు సొంత స్థలం కోసం...  ఊరి పెద్దల దగ్గర పంచాయితీ పెట్టించి మరీ పదిసెంట్ల భూమిని రాయించుకుంటుంది. 


భర్తను, కొడుకుని కూడా ఇంటికి రప్పించుకుంటుంది.  


పిల్లల చదువు విషయంలోనూ  ఆడపిల్లకు అంత చదువెందుకని అడ్డుతగులుతాడు సిద్ధప్ప. 


ఆ సందెవేళ.. భర్తకు వినబడేలా 


‘తాను సృష్టించిన స్త్రీ తన తలనెక్కింది


తాను సృష్టించిన స్త్రీ తన ఒడికెక్కింది


తాను సృష్టించిన స్త్రీ బ్రహ్మ నాలుకెక్కింది


తాను సృష్టించిన స్త్రీ నారాయణుని ఎడదకెక్కింది


అందువల్ల... స్త్రీ స్త్రీకాదు, స్త్రీ అబల కాదు... స్త్రీ రాక్షసి కాదు


స్త్రీ ప్రత్యక్ష కపిల సిద్ధ మల్లికార్జునుడే కనవయ్యా..’ 


అంటూ వచనం చదువుతుంది. అది అర్థం చేసుకున్న సిద్ధప్ప.. ఆ తర్వాత ఎప్పుడూ బిడ్డల మధ్య ఆడ మగ భేదం చూడలేదు.


ఎదురైన అన్ని ప్రతికూలతలను... తనకు అనుకూలంగా మార్చుకుంటూ... కొడుకును ఇంటర్ లో చేర్పిస్తుంది. 


కూతురు మల్లి బిటెక్ పూర్తి చేస్తుంది.  


తల్లి మాదిరిగానే ఆత్మవిశ్వాసంతో ఎదుగుతుంది. 


తల్లి మాటలను నిత్యం  మననం చేసుకుంటుంది.  ‘


ఎవరి కాళ్ల మీద వాళ్లు నిలబడి సంపాదించుకున్న రోజే ప్రేమ పెళ్లి ఆలోచన చెయ్యాలి. ఆడమగ పిల్లలు కలిసి చదువుకునేచోట అనేక ఆకర్షణలు వుంటాయి. అలాంటి సాలెగూడులో పడకుండా బాగా చదువుకో. తర్వాత నీకిష్టమైన వాడిని ఎంచుకో. అంతేకాని తప్పుదారి పట్టకు’ అని మల్లికి చెప్పించడం ద్వారా రామేశ్వరి పాత్ర మరో మెట్టు ఎక్కుతుంది. 


మల్లి ప్రేమ విషయంలోనూ  అండగా నిలుస్తుంది.  


వీరయ్యదగ్గర పంచాయితీ నడుస్తుంది.  


వీరయ్య ఎలా ఒప్పుకుంటాడో తెలిసిన రామేశ్వరి... ఒక అబద్ధం చెప్పి, మల్లి పెళ్లి తాను ప్రేమించిన వాడితోనే చేసేందుకు మార్గం సుగమం చేస్తుంది.  


ఆ విషయంలో మల్లిని క్షమాపణ అడుగడం ద్వారా తన ఔన్నత్యాన్ని మరోసారి చాటుకుంటుంది రామేశ్వరి. 

 

అంతేకాదు... 


పెళ్లికి ముందు రోజే.. నాలుగు సెంట్ల స్థలాన్ని కూతురికి సర్వహక్కులతో రాసిస్తుంది. 


తల్లిదండ్రులకు బిడ్డలందరూ సమానమే. 


మన అబ్బాయికి ఈ విషయం అర్థమయ్యేలా చెప్పు అని భర్తకు చెబుతుంది. కులాంతర వివాహం చేసుకుంటున్నందుకు ఆస్తిని చెల్లికి రాసినందుకు పెళ్లికి రానని కొడుకు చెప్పినట్లు సిద్ధయ్య చెబుతాడు.

 

అప్పుడు రామేశ్వరితో చెప్పించిన మాట రచయిత్రి పోరాట పటిమ కి నిదర్శనం. 


‘నేను జీవితకాలం యుద్ధాలు చేస్తూనే వుండటానికి ఓపిక తెచ్చుకుంటాను తప్పేదేముంది’ అంటుంది రామేశ్వరి.  


కథ ముగింపు కూడా అద్భుతంగా మలిచారు వనజ తాతినేని.


 రామేశ్వరి అత్తారింట అడుగుపెట్టిన నాటినుంచి ఆమె ఎదుర్కొన్న ప్రతి సంఘటనలోనూ సిద్ధప్పకు పాము కుబుసం కనిపిస్తుండేది.


 సిద్ధప్ప దాన్ని చూసి భయపడేవాడు.  


‘ఇంట్లోకి వెళ్లి భార్యని నిద్ర లేపబోయి ప్రశాంతంగా నిద్రపోతున్న ఆమె ముఖం చూసి వద్దులే అనుకుని బయటకు వచ్చాడు. 


గడ్డి దూయడానికి వామి దగ్గరకు వెళ్లాడు. 


భయం భయంగా గడ్డివాము మీద చెయ్యేసి గడ్డిని దూసాడు


 రెండు వాట్లు దూసాక గడ్డితో పాటు మధ్యలోకి తెగని అయిదున్నర అడుగుల కుబుసం చేతిలోకి వచ్చింది.   


కుడికాలి దగ్గర జరజర మని శబ్దం. కదలకుండా ఊపిరి బిగబట్టి నిలుచున్నాడు. 


అప్పుడే కుబుసం విడిచిన గోధుమవన్నె తాచు నిగనిగలాడుతూ... బిరబిర సాగిపోయింది. 


ఆ మెరుపును ఎక్కడ చూసినట్లనిపించింది. 


గుర్తు చేసుకోడానికి ఒక్క క్షణం కళ్లు మూసుకున్నాడు. 


రామేశ్వరి కనుల  మెరుపు అది.  


ఆమె ఆలోచనలు చెల్లుబాటు అయిన ప్రతిసారీ ఆమె కళ్లలో వెలిగే మెరుపు అది’.  


ఇక్కడే రచయిత్రి యొక్క ఆలోచన, శిల్పం లోని వైవిధ్యం పతాకస్థాయికి చేరుకుంటుంది. కథ ఎత్తుగడ ముగింపు  కూడా  రచయిత నైపుణ్యం కనబడింది.కథకు శీర్షిక “కుబుసం” సరిగ్గా సరిపోయింది. 


ఈ కథలోని రామేశ్వరి... అణచివేతను ఎదుర్కొనే మహిళాలోకానికి ప్రతినిధి.అందరికీ  రామేశ్వరి ఎదుర్కొన్నటువంటి సమస్యలే వుండకపోవచ్చు. కానీ... సమస్య ఏదైనా, అణచివేత ఏ రూపంలో వున్నా దాన్ని ఎదుర్కోవాలి. తనకు అనుకూలంగా మలచుకోవాలి.  కుటుంబానికి, సమాజానికి వెలుగు దివ్వెగా మారాలి.  రామేశ్వరి ఆలోచనలు ఆత్మ విశ్వాసంతో కూడిన ఆచరణ కుబుసం విడిచిన పాముకు ప్రతీకగా కథా సంవిధానం వుండటం వల్ల మంచి కథను చదివిన అనుభూతితో పాటు ఇంకా రచయిత చెప్పని కథను ఖాళీలను పూరించుకుంటూ ఈ కథ మిగిల్చిన ఆలోచనలు పాఠకుడిని వెంటాడతాయి.


రామేశ్వరిలా ..కుబుసం విడిచిన తాచు నిగనిగలాడుతూ... బిరబిర సాగిపోయినట్లు... ఈ వ్యవస్థలో ఎదురయ్యే 

ప్రతిఘటనలు తొక్కుకుంటూ స్త్రీ బిరబిర సాగిపోవాలి.  అప్పుడే గురజాడ వారు అన్నట్లు... ‘ఆధునిక స్త్రీ  చరిత్రను పునర్లిఖిస్తుంది’. 


మంచి కథను రాసిన వనజ గారిని అభినందిస్తూ.. “ఈస్తటిక్ సెన్స్” కథాసంపుటికి  శుభాకాంక్షలు తెలుపుతూ..



- అంజని యలమంచిలి




కామెంట్‌లు లేవు: