14, సెప్టెంబర్ 2022, బుధవారం

నేను స్కూల్ కి యెల్లను

నేను స్కూల్ కి యెల్లను, నాకు ఫెండ్స్ వద్దు అంటావ్

దిగాలుగా ముఖం పెట్టి.

నా బంగారు తల్లి చిన్నితల్లి.. స్కూల్ కు వెళ్ళి హాయ్ హలో! బాగున్నారా అని చిన్ని చిన్ని పాపలను బాబులను పలకరించాలట  వాళ్ళతో ఆడుకోవాలంట కొత్త కొత్త పద్యాలు నేర్చుకోవాలంట. 

చిన్న వెలుగు చిన్నితల్లి ముఖంలో. అంతలోనే అమ్మ నాన్న కనబడరని బెంగ చుట్టుకుంటుంది. 

ఇలా రోజుల తరబడి స్కూల్ కు పంపడానికి సమాయత్తం చేసాక.. 

గుబులు మొదలవుతుంది నిజంగా స్కూల్ కు పంపాలా

ముప్పై నెలలకు వాళ్ళ నాన్నను పంపినట్టు పంపకపోతే 

యేం!? అని బడిపై కోపం. 

నాయనమ్మ చంకలో వున్న పిల్లను అందుకుని కారు సీటులో కూర్చోబెట్టాక “నాయనమ్మా! నువ్వు రా !! అంటూ కన్నీళ్ళతో అడుగుతుంటే గుండె చిక్కబట్టుకుని కన్నీరు కురవకుండా యెంత ప్రయాసపడినా అయినా ఆగకుండా కారే కన్నీటిని తుడుచుకుంటూ.. 

నేను యిక్కడే వుంటానుగా.. నువ్వు ఫ్రెండ్స్ తో ఆడుకుని రా.. అంటూ రెండు చేతులూ వూపి బై చెప్పి గాలిలో ఓ ముద్దు బట్వాడా చేసాక.. పాప చిన్నగా చేయి వూపింది. 

కారుతో పాటే నాయనమ్మ మనసెళ్ళిపోయింది. 

నన్ను యెత్తుకో అంటూ చేతులు చాచి అడిగితే యెత్తుకునే టీచర్ మనసులో నాయనమ్మ ప్రేమ నిలువెల్లా కొలువై వుండాలని కోరుకుంటూ.. 

నువ్వు యిప్పుడే వచ్చేస్తావని  ఇంటి లోపలకు వీథి మలుపుకు లోలకంలా తిరిగే నేను.. అనుకుంటానిలా. 

నా పిచ్చి గానీ ..  దింపి యింటికి రాకుండా స్కూల్ బయట యెదురుచూసే మీ నాన్నలో కూడా కొండంత గుబులు. నువ్వు యెప్పుడెప్పుడు బయటకొచ్చి  నీ చిన్ని చిన్ని చేతులతో తన మెడను చుట్టేసుకుంటావో అన్న ఆత్రుత కల్గిన  తండ్రి  మనసు. ఇంట్లో చిక్కబట్టుకున్న గుండెతో గుంభనంగా వుండే మీ అమ్మ మనసు. 

నువ్వు అయిష్టంగా స్కూల్ కు వెళ్ళావేమో కానీ .. ఇష్టంగా స్కూల్ కు పంపినదెవరని!? 

మా బెంగంతా గాలిలో చుట్టుకుని నిను చేరకుండా నువ్వు కిలకిలా నవ్వుకుంటూ ఆడుకోవాలి పాడుకోవాలి. ఇల్లు కన్నా ప్రపంచం మరింత పెద్దది కదా!! 

కదా.. బంగారు తల్లీ!💞



#చిత్కళకబుర్లు

కామెంట్‌లు లేవు: