12, సెప్టెంబర్ 2022, సోమవారం

వాతాపి జీర్ణం - విషాద నిశ్శబ్దం

 ఈస్తటిక్ సెన్స్  కథాసంపుటిలో మొదటి కథ ‘వాతాపి జీర్ణం’ కథకు ‘పద్మజ సూరపరాజు’ గారి వ్యాఖ్యానం

వనజ తాతినేని గారు సుపరిచిత రచయిత్రి. వారి కథలలో స్త్రీ , వివాహ వ్యవస్థ విషయాలు.  తన చుట్టూ ఉన్న  మహిళలు వివాహజీవితం లో ఎదుర్కొంటున్న సమస్యల గూర్చి చెప్పవలసిన కథలు ఆమె చెప్పారు. నిజాయితీతో , సహానుభూతితో తోటి స్త్రీ ల క్లేశాలను సమీపం నుంచి చూసి, చలించిన ఒక రచయిత్రి వ్రాసిన కథలు ఆమెవి.


 ‘వ్యవస్థ‘, అది ఏదైనా, ఎటువంటిదైనా అందులో  సౌలభ్యాలు కొన్ని, అవకతవకలు కొన్ని తప్పనిసరి. మనిషి తన శ్రేయస్సుకు అని చెప్పుకుంటూ ఏర్పరుచుకున్న ప్రతి ఒడంబడిక, సంస్థ, వ్యవస్థ ఇలా పేరు  ఏదైనప్పటికీ అందులో అనతికాలంలోనే ఒక అధికారవర్గం, ఒక పాలిత లేదా పీడిత వర్గం అంటూ విభజన ఒకటి తలెత్తుతుంది. ఇది తెలియకుండా చాపకింద నీరులా వచ్చిచేరుతుంది. 


మానవ క్రమబద్ధమైన పురోగతికోసం అంటూ ఏర్పరుచుకున్న కూటమిలో అభివృద్ధి మాట అటుంచి రెండు వర్గాల పరస్పర అసూయాద్వేషాల వల్ల తీవ్ర నష్టమే జరగడం చూస్తుంటాం. ఇందుకు కారణం అసమాన సమీకరణాలు. ఒకళ్ళను రెండోవారు తన అధీనంలో ఉంచుకోవడమే తనకు అక్కడ మనుగడ అని భావించడం. ఈ అసమానత అతి భయంకర రూపాలు దాల్చుతూ వస్తోంది. పని సజావుగా విజయవంతంగా సాగాలంటే ఒకరి నాయకత్వం లో తక్కిన సభ్యులు అనుగమించాలి అనే ప్రతిపాదన లో విషాదం ఏమిటంటే ప్రతి సభ్యుడు నాయకుడు తానే అవ్వాలని అనుకుంటాడు. మానవ నైజంలో అనుసరించటానికి, బానిసత్వానికి గల తేడా తెలుసుకునే విచక్షణ ఉండదు.


‘వివాహం‘ లో  సమానత్వ సమీకరణాన్ని సాధించటం అన్ని వ్యవస్థల లోకి కష్టమైన పని. ఇష్టం గా మొదలైన ఒక వర్గపు బానిసత్వం అతి సులభంగా ఒక బలమైన ఒరవడిలో పడిపోతుంది. అదే పురుషాధిక్యపు పోకడ. భాషా, ప్రాంత భేదాలు లేకుండా ప్రపంచం అంతా ఇదే ఎక్కువగా కనపడుతుంది, కొండొకచో రెండోరకమూ ఉన్నా కూడా. 


పెళ్లి ఒక తప్పనిసరి సాంఘిక దురాచారం అని వేళాకోళం చేయగలిగేంతగా పరిణమించి చాలా రోజులయింది. సంతోషం గా ఉండిఉండవలసిన గృహస్థాశ్రమం జీవితఖైదు గా మారింది కొందరికి.

 

శారీరకంగా ఎక్కువ బలవంతులైన పురుషులు తమ స్త్రీ పై అధికారం సంపాదించడం పరిపాటి. వాళ్ళ ఈ బలం ఎంత కారణమో, వాళ్ళ మనోదౌర్బల్యం కూడా ఈ పరపీడనకు కారణం అవడం విచారకరం.

ఆడది తనకంటే రూప,  గుణ, విద్యాఉద్యోగాలలో అధికురాలైనపుడు ఆత్మన్యూనతాభావం తో ఈ పీడనకు దిగుతుంటారు పురుషులు. ఈరకమైన పీడనకు స్త్రీ ప్రతిస్పందన సామాన్యంగా ఒకటి నిశ్శబ్దం గా లొంగిపోవటం, రెండు నచ్చనిదాన్ని ప్రశ్నిస్తూ వాగ్యుద్ధానికి దిగటం, మూడవదీ అన్నింటిలో కి ప్రభావవంతమైనదీ, నిశ్శబ్దంగా ప్రతిఘటించడం, ‘సత్యాగ్రహం‘ ! 


సత్యాగ్రహం కన్నా శత్రువును దెబ్బకొట్టగల అస్త్రం మరొకటి లేదు. అదీ భార్యభర్తల బంధం లో . ఎంత insensitive గా ఉంటూవచ్చినవారిని కూడా సత్యాగ్రహం క్షతగాత్రులను చేస్తుంది. కనిపించని కముకుదెబ్బ ఇది. పరాజయం పైకి ఒప్పుకోకపోయినా ఇక్కడ ఎదిరి లోలోపలే అవమానంతో పెద్ద శిక్ష అనుభవిస్తాడు. విషాదం ఏమిటంటే ఇటువంటి పోరాటం రెండువైపులవారినీ నిర్జీవులను చేస్తుంది బ్రతికి ఉన్నన్ని నాళ్ళూ. 


ఇక్కడ సమీక్షకు ఎంచుకున్న వనజ గారి రచన "జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం". 

ఒక కప్పు కిందే ఉంటూ, ఒక నేల మీదనే నడుస్తూ, ఎప్పటికీ ఇక కలవలేనంతగా విడివడి రెండు సమాంతర రేఖలలా బ్రతుకుతున్న దంపతుల కథ. 

ఈ పరిస్థితి రావటానికి ఎవరెంత కారణమో మొదట్లో పాఠకులకు తెలియదు. యాభైలు దాటిన వయస్సులో ఉన్న ఈ ఇద్దరూ ఈ చివరి దశలో పరస్పరం ఆసరాగా ఉండవలసిన సమయం.

ఆసరా ఉంది. అయితే ఒకవైపునుంచే. ఆమె అతనికి ఇస్తున్న ఆసరా అనురాగం తో కాక నైతిక బాధ్యతలా ఉంది. ఆమె కాళ్ళు, మోకాళ్ళు సహాయనిరాకణోద్యమంసాగిస్తున్నా, కేవలం ప్రేక్షకుడైన అతనికి ఇప్పటికీ తిండీ, వైద్య పరమైన శుశ్రూష మౌనంగానే అయినా ఆమె అది  నియమబద్ధంగా అందించడం మానలేదు. 

అతనికి ఇది అసహనంగా ఉంది, పరాశ్రయుడిలా ఆమెతో సేవలు చేయించుకోవడం కాదు. ఆమె apathy. తనను నిశ్శబ్దంగా నిర్లక్ష్యం చేయడం తీవ్ర అవమానకరంగా ఉందతనికి.

ఈ స్థితికి ఆమెను నెట్టిన గతంలోని తన చర్యలకు అతని కళ్ళు మూసుకున్నాయి. సగటు పురుషుడిలాగే తను ఒక భర్త గా తన బాధ్యత, ఉద్యోగం చేయటం, సగం జీతం ఇంట్లో ఇవ్వడం, భార్యను హింసించకపోవడం, ఇలా చాలా సవ్యంగానే నెరవేర్చాను నా కర్తవ్యం అనుకుంటుంటాడు. 


కథ మొదలే అతను భార్య కుంటుకుంటూ వచ్చి మొక్కలకు నీళ్ళు పోయడం చూస్తూ కాస్త తమ నేపథ్యం మనకోసం విప్పుతుంటాడు. సారాంశం, ఆమె ఏ చర్య లో కూడా దోషం లేదు, ధర్మబద్ధత, నైతికత, సామాజిక స్పృహ, సేవా కార్యక్రమాలు చేయడం లో ఉత్సుకత తప్ప . ఆమెవి అన్నీ మంచి లక్షణాలు తనను కించపరిచే లక్షణాలు గా ఎందుకు కనిపిస్తున్నాయి? ఆత్మన్యూనతాభావం ! ఆంతర్యం లో తానేమిటో, ఆమె ఏమిటో తనకు క్షుణ్ణంగా తెలుసు కనుక. ఆమెకూ తెలుసు. ఇంత తెలిసీ ఆమె తనను గౌరవం గా  చూస్తూ యజమానిపగ్గాలు ఇంకా తన చేతికే ఇవ్వాలనుకోవడం వల్ల. ఆమె పైన, ఇంటిపైన బాధ్యత లేని ఆధిపత్యం కోరుకోవడం వల్ల.


తను ఆమెకు చేసిన అన్యాయం పూర్తిగా మర్చిపోయాడు. ఆమెకు అసలు తెలియదు అనుకున్నాడు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగింది. 

కథ ఉత్తమపురుషలో నడుస్తుండగా అతని perception లో ఆయన భార్య ‘ యూ ఎమ్ ‘ ఉదయమిత్ర ను చూస్తాడు పాఠకుడు. ఆమెను చూస్తున్న అతని చూపే అతనేంటో పాఠకుడికి చూపిస్తుంది. 


భార్యాభర్తల మధ్య నమ్మకం నష్టం అయినపుడే పరస్పర గౌరవం, మర్యాదా, జాలీ జారిపోతాయి. మిగిలేది రెండు ఎండు గడ్డి దిష్టి బొమ్మలు. వాళ్ళది ఇల్లని, వాళ్ళు చేస్తున్నది సంసారం అనీ అనలేరు. 


సంతోషం గా ఉండే కుటుంబాలన్నిటివీ ఒకటే కథ, కష్టాలు పడే కుటుంబాలకి ఒక్కో దానికి ఒక కథ అంటాడు Tolstoy. 

 ఆ కథలన్నీ చెపుతూనే ఉన్నారు, వ్రాస్తూనే ఉన్నారు చాలా ప్రపంచ ప్రఖ్యాత కథకులు పురుషులు, స్త్రీలు. 

నిజం ఉన్న కథ చెప్పాలంటే ఎవరైనా తానున్న తలంనుంచీ, తరం నుంచీ తనదైన సత్యమైన పరిశీలన నుంచీ చెప్పాలి. 


వనజగారి కథలన్నీ మంచిపరిశీలన నుంచి వచ్చినవి.

పై కథలో స్త్రీ ఎదిగిన ఎత్తు చాలా గొప్పది. పరస్త్రీ తో సంబంధం పెట్టుకుని సంతానాన్ని కని, సంవత్సరాల పర్యంతం రెండో కాపురాన్ని దాన్ని గురించిన రహస్యాన్ని కప్పెట్టి లాక్కొస్తున్న  భర్తను ఆమె సహించడమే కాక ఇంకా అతన్ని, ఆపదలో ఉన్న తన ప్రత్యర్థి నీ కాపాడుతుంది. 

 భర్త నిజస్వరూపాన్ని తను జీర్ణం చేసుకుంది. 

 ఆమెకు అన్నీ తెలిసీ ఇన్ని రోజులుగా తనను సహించి భరిస్తూవస్తున్నదన్న విషయాన్ని, మనిషిగా తన భార్య తన కంటే ఎన్నో మెట్లు పైన ఉన్నదన్న సత్యాన్ని భర్త హరాయించుకోవాల్సి వచ్చింది చివరకు. 

    ఆమెను కాదని , మనగల సత్తా తనకు లేదని, ఆమె దయాదాక్షిణ్యాలపైననే తన మనుగడ జరగక తప్పదని తనకు తెలుసు. కష్టం అయినా ఈ సత్యాన్ని అతను జీర్ణం చేసుకోక తప్పదు.

తనకున్న జబ్బులకు తను వేసుకోవలసిన మాత్రల పేర్లు కూడా తెలుసుకోకుండా రోజులు వెళ్ళదీయగల భర్త జబ్బుకు ఏ మందు వేయాలో భార్యకు తప్ప మరే వైద్యులకు తెలుస్తుంది? 


విషాదమేమంటే ఈ నిశ్శబ్ద సత్యాగ్రహం వివాహబంధం లోని ఇద్దరినీ సమానంగా దహిస్తుంది. 

సంగీతం లా సాగవలసిన సంసారం ఘనీభవించిన శిలాసదృశంగా మూగపోవడం, సహజంగా కలికి చిలుక లాంటి స్త్రీ కి ఎందుకు ఇష్టం అవుతుంది?


చాలా తక్కువ మాటలలో విస్తారమైన పాత్ర చిత్రణ లతో కథ చెప్పారు రచయిత్రి. 

కథంతా భార్య పాత్ర తాలూకు విషాద నిశ్శబ్దం వింటారు పాఠకులు.




కామెంట్‌లు లేవు: