9, సెప్టెంబర్ 2022, శుక్రవారం

నొప్పి అందరికీ సమానమే!

(ఏనుగు అంబారీ కథ గురించి రచయితగా నా వివరణ. ఇది నా కోసమే నేను ఇచ్చుకున్న ఫీడ్ బ్యాక్ )

నొప్పి అందరికీ సమానమే! 

గుచ్చకపోయినా గుచ్చారని చెప్పి రోడ్డుకెక్కడం ఆరోపణలు చేయడం సానుభూతి పొందాలని ఆశించడం కొందరికి సర్వసాధారణం కావచ్చు. 

కానీ నొప్పిని నొప్పిగా వ్యక్తీకరించుకోవడం మన తప్పొప్పులను మనం విశ్లేషించుకోవడం కూడా నేరం అయి కూర్చుంటుంది. 

పీడించే దశ నుండి పీడింపబడే దశలోకి నెట్టబడిన వొదగబడిన వారికి.. బతకడానికి విదేశాలు వేదిక కలిపిస్తున్నాయన్నమాటే కానీ నిలదొక్కుకోవడానికి అనేక అగచాట్లు. 

అన్నీ వడ్డించిన విస్తరి ముందు కూర్చుని కబుర్లు చెప్పడం చాలా తేలిక. అనుభవం నీదైతే కానీ తెలియదుగా మరి.

సహానుభూతి లేని చోట మానవత్వానికి చోటే లేదు. అది కథైనా జీవితమైనా.. 

మళ్లీ చెబుతున్నాను నొప్పి ఎవరిదైనా ఒకటే!  స్వల్పంగా అల్పంగా తీసేయకూడదు.

కోడిగుడ్డు మీద ఈకలు పీకడం తమ మెదడులోని గుజ్జు అంతా తీసి గోడల మీద పరవడం కాదు.. Metaphor ఏం చెబుతుంది అని ఆలోచించాలి. 

సరైన ఊత లేకుండా F1 వీసా లపై వచ్చినవారి మనుగడ OPT లో వున్నప్పుడు జాబ్ దొరకని వాళ్లు చెప్పుకోలేని కష్టాలు వచ్చి ఇతరుల దగ్గర చేయిచాచడానికి ఇష్టం లేని ఆత్మాభిమానం కలవారు చిన్న చిన్న ఉద్యోగాలను గౌరవంగా చేసుకుంటూ అష్టకష్టాలు పడి నిలదొక్కుకున్నవారు తమ అనుభవాలను ఇతరులకు చెబుతూ సరైన అవగాహనతో ముందుకు రావాలని హెచ్చరించడమే.. కదా ఈ కథ. 

దీప చెప్పిన ప్రతి విషయం వెనుక రచయిత అక్కడ చెప్పని కథ చాలా వుంది. అక్కడ అగ్రవర్ణ పేద కుటుంబం యొక్క ఆర్థిక స్థితి గురించి ఆమె అందంగా వుంటూ ప్రతిభ తో చదువుకోవడం గురించి సమీపంలో వుంటున్న ఏ మాత్రం ప్రతిభ లేకపోయినా రిజర్వేషన్ కేటగిరిలో ఠక్కున వెళ్ళి ఉద్యోగంలో కూర్చుని ఆ ఆర్థికభరోసా కల్గిన గర్వంతో దీప తల్లిని ఆమె పని సంస్కృతిని హేళన చేయడం, దీప పై అకారణ ఈర్ష్యద్వేషం ప్రకటించడం ఆ యువతి సోదరుడు వొంకరతనంగా వ్యవరించడం ఇవన్నీ సూక్ష్మంగా చెప్పిన విషయాలు. ఇక్కడ కూడా వొంకరతనం తగ్గలేదు అంటుంది. అంటే అంతకుముందు కూడా అతను ఆ వొంకర చేష్టలు చేసాడనే కదా!   (అలాంటివన్నీ ఇక్కడ లేనే లేవని అలాంటి అసంగత విషయాలు చెప్పకూడదని రచయిత ఆ విషయాలు చెప్పి నిమ్న కులంపై దాడి చేసారని అనడం ఏ మాత్రం సమంజసమో వారే చెప్పాలి) 

 దీప తల్లితో ఎన్నో విషయాలు పంచుకుంది. అవన్నీ గాలికి వొదిలేసి ప్రాధాన్యం లేని అంశాన్ని పట్టుకుని సాగదీయడమే కథా విమర్శ కాబోలనిపిస్తుంది. దీప పెయిన్ ఆమె బీదరికంపై చేసిన కామెంట్ తద్వారా ఆమెకు కల్గిన అవమానం అవమానం కాదా.

మన గురించిన కలలు మన తల్లిదండ్రులు కని.. మెడకు గుదిబండను వేసి.. వదిలేయడం సర్వసాధారణం అయిపోయింది. డాలర్ అంత ఎత్తుకు మన రూపాయి ఎగరలేదు అంటే తల్లిడండ్రులు ఊరుకోరు. 

సరే ఎక్కడైనా కష్టపడితేనే కదా ఉజ్వల భవిత అనుకుని రెక్కలకు అరువు ఈకలను తగిలించుకుని ఎగురుతారు.. అప్పులకు తడిచిన రెక్కలు బరువవుతాయి. అరువు ఈకలెపుడో రాలిపోతాయి. అన్నీ బాగుంటే కలలు నెరవేరతాయి. లేకపోతే బొమ్మ తిరగబడుతుంది. 

ధన బలం తోనూ అగ్రకుల అహంకారంతోను దిగువ కులంపై ప్రదర్శించిన కావరమో లేక సెక్సువల్ మెంటల్ టార్చర్ కూడా కాలగతిలో తిరగబడి ధనబలం వున్న నిమ్నకుల పురుషులు పేదలైన అగ్రవర్ణ మహిళలపై జులుం ప్రదర్శించడానికి ఆస్కారం వుంది కదా.. అదీ అత్యవసరంగా ధనం అవసరమైన నిస్సహాయ స్థితిలో తామే సరెండర్ అయ్యే దౌర్బాగ్యపు పరిస్థితికి ఆ అమ్మాయి వగచింది తప్ప సెల్ఫ్ పిటీ కాదు.

అన్న ఎన్టీఆర్ పూనతాడు అంటే ఆయన కేవలం ఒక కులానికి మాత్రమే అన్నగారు కాదు, యావత్త్ తెలుగు ప్రజలు అందరి చేత అన్నగా పిలిపించుకున్నారు. అందువల్ల ఆమెను అన్న గారి కులంగా పరిగణించవసరం లేదు. ఆమెకు కుల వివక్ష అంటగట్టాలిసిన అవసరంలేదు. 

ఇక కిరస్థానీ పిల్ల అంటే మీరన్నట్టు దిగువకులం వారే ఇవాళ కిరస్థానీలు కాదు. గ్రామాల్లో అగ్రకులం అని చెప్పుకునే చాలామంది ఇవాళ క్రిష్టియానిటిని ఎంతో యిష్టంగా స్వీకరించారు. వారిని వారి బంధువులు కూడా కిరస్థానీ వారిగానే సంభోదించడం కద్దు. 

కళ్యాణి బిర్యానీ కొంతమంది మాత్రమే తినరు. ఆ బిర్యానీ తినే ముస్లిమ్స్ తెలుసు బిసి కులాలు వారు తెలుసు.  నిత్య ఆహారంగా తీసుకునే  ఆస్ట్రేలియాలో నివసించే హిందువులు నాకు తెలిసినవారు వున్నారు. 

మీకున్న అవగాహన వల్ల మీకు అలా అర్దమై వుండొచ్చు. కానీ రచయిత ధృక్ఫథం మీకర్దం కాలేదేమోనని నాకనిపిస్తుంది. 

ఇక ఇరవై సంవత్సరాల క్రితమే వచ్చి USA లో సెటిల్ అయిన మా కుటుంబ సభ్యులు వున్నారు బంధువులున్నారు. పద్దెనిమిది ఏళ్ళుగా కన్సెల్టెన్సీ నడిపి వందల వేలమంది విద్యార్థులను దగ్గరగా చూసిన అనుభవజ్ఞులు మా కుటుంబ సభ్యులు, పదమూడేళ్ళ క్రితం USA కి వచ్చిన నాకొడుకు, అమెరికన్ బ్యాంక్స్ ఎడ్యుకేషన్ లోన్ ఇస్తే చదువు పూర్తి చేసుకున్న నా చెల్లెలి కూతురు (బోస్టన్ యూనివర్సిటీ) నా ఫ్రెండ్ కూతురు (purdue university) ఇలా ఎంతోమంది వున్నారు. వీరే గాక ఎంతోమంది పరిచితుల పిల్లలు ఇక్కడ చదువుకున్నారు, ఇప్పుడు కూడా చదువుకుంటున్నారు. లోన్ తీసుకొని వచ్చినవారు కొందరైతే  వడ్డీలకు అప్పులు చేసి వచ్చి వడ్డీలు కడుతూ చదువుకుని జాబ్ వచ్చిన తర్వాత అప్పులు తీర్చిన వారు కొందరు. Opt లో వుండగా జాబ్ దొరకని వాళ్ళు తర్వాత cpt లోకి మారినవారు H1B వుండి జాబ్ లేనివారు.. H1B రాక తిరిగి వెళ్ళిన వారు.. ఇలా ఎన్నో కథలు. అందులో వొక అమ్మాయి దీప కావచ్చు కదా!  దీప అనే అమ్మాయి తన తల్లికి బాధతో ఉత్తరం రాసుకుంది. విజ్ఞత ప్రదర్శించింది. తల్లిదండ్రుల కుల అభిమానాన్ని ఫాల్స్ ప్రిస్టేజ్ ని నిరసించింది.నల్లవాడితో పెండ్రిఫ్ చేస్తుంది.  ఠాగూర్ కి లాగా నాది విశ్వప్రేమ అంది కూడా! బ్రాడ్ మైండ్ తో ఎన్నో విషయాలను పంచుకొంది. సరైన ఆర్ధిక భరోసా లేకుండా ఇతరులు ఇక్కడకు రావడం వల్ల ఎంత ఇబ్బందులో చెప్పింది తప్ప మరెవరిని నిందించలేదు. ఫండ్ రైజ్ చేయించుకునే వెసులుబాటు సమయం ఆలోచన ఆ అమ్మాయికి లేకపోవచ్చేమో అని ఊహించని పాఠకుల ఆలోచనాధోరణికి ఒకింత విచారం కలుగుతుంది నాకు. 

ఆ అమ్మాయి లోపాలున్న కారెక్టర్ కల్గిన అమ్మాయే అనుకున్నాం. అలాంటి వారు వుండకూడదా.. లేదా రచయితలు సృజించకూడదా.. !? మూతపోసిన ఆత్మవిశ్వాసం వున్న అమ్మాయిలే కథల్లో కేరక్టర్ గా వుండాలా?

కథ లో ఉదహరించిన పాయింట్ పాయింట్ కు నా దగ్గర వివరణ వుంది. కానీ నేను ఎవరితోనూ వాదించదల్చుకోలేదు. 

ఎప్పుడో రాసిన కథ పాఠకులలోకి వెళ్ళిన కథ. ఆ కథ గురించి చర్చించడం వివరణ ఇవ్వడం రచయిత పని కాదు. 

ఈ మాత్రం ఎందుకంటే ఇది నా సొంత బ్లాగ్ కాబట్టి.

ఏనుగు అంబారీ దీప ను నేను సృజించినందుకు చింతించడంలేదు అని చెప్పదల్చుకున్నాను. 👍😇

సాధారణంగా ఒక పాత్ర యొక్క ఆలోచనలు గతి తప్పినట్లు అనిపిస్తే నాలోని రచయిత ఉలికిపడి మేల్కొని విజ్ఞత పాటించాలి.అది నేను ఈ కథలో ప్రదర్శించాననే అనుకుంటున్నాను.. ఈ కథ వచ్చి నాలుగేళ్ళు అవుతుంది. బహుమతి కూడా ఇచ్చారు. కొందరి పాఠకుల దృష్టికోణంలో ఇది వేరేగా కనబడినందుకు నో కామెంట్. 

Do not judge my story by the chapter you walked in on. 

కామెంట్‌లు లేవు: