కాలక్షేపం కబుర్లు .. ఈ మాట వినగానే బ్లాగర్లందరికీ కష్టేఫలే శర్మ గారు గుర్తుకువస్తారు. వారి బ్లాగ్ ని 13 భాగాలుగా ఈ -బుక్ రూపంలో మనముందుకు తీసుకువచ్చారు. అందులో ''గఱికెల మాన్యం" అనే భాగానికి నేను స్పందన వ్రాయడం జరిగింది. ముందుమాట అని ఘనమైన మాటను నేను వాడదల్చుకోలేదు. ఆ స్పందన మీతో పంచుకుని .. కినిగె లో ఉన్న ఆ ఈ పుస్తకాన్ని పరిచయం చేస్తూ .. శర్మగారికి నమస్సులతో ..
''గఱికెల మాన్యం" ఈ బుక్ ఈ లింక్ లో లభ్యం.
కబుర్ల ఊటబావి
వేదాలను కావ్యాలను ఇతిహాసాలను ఔపాసన పట్టి లోకజ్ఞానం సముపార్జించిన యోగి కూడా జ్ఞానాన్ని శిష్యుల రూపంలో పరంపరగా అందిందించి లోకం నుండి నిష్క్రమించినట్లే శతాయుష్షు చేరుకొని జీవితాన్ని విస్తారంగా చవిచూచిన వృద్ధులైననూ జ్ఞాన ఛాయలు వొదిలి వెళ్లాల్సి వుంది. ఆ జ్ఞానఛాయలు భావితరాలకు చుక్కానిలా దారి చూపుతుంటాయి. మన సంస్కృతిలోనే వొక నిరంతర ధార వుంది. అది పెద్దలమాట చద్దిమూట లాంటిది. అలాంటి మంచి పనిని శర్మ గారు "గఱికెల మాన్యం" రూపంలో చేస్తున్నందుకు సంతోషంగా వుంది.
మనుషులు ఏళ్ళు గడిచే కొద్దీ తోటి మనుషులకు దూరంగా స్వంత కాలక్షేపానికి దగ్గరగా లేకపోతే ఏకాంతంగా వొక యోగిలా జీవించడం నేర్చుకోవాలి. ఇతరులనుండి ఏమీ ఆశించకుండా వాళ్ళ ప్రవర్తన వలన క్షణ కాలమైనా మనసు కలుక్కుమనకుండా ఇతరులు మనని అర్ధం చేసుకోవడంలేదు అని అనుకోకుండా వాళ్లనే మనము అర్ధం చేసుకుంటూ వీలైనంత దూరంగా జరుగుతూ అంతర్ముఖులై జీవించడం ప్రకృతికి దగ్గరగా జీవించడం ఉత్తమం.శర్మ గారి జీవన విధానం చూస్తే నాకలాగే అనిపించింది. అలాంటి ఉత్తమమైన జీవన విధానంతో జీవిస్తూ వారి అనుభవాలను జ్ఞాపకాలను మనందరికీ చెప్పిన బ్లాగ్ కాలక్షేపం కబుర్లు ఈ బుక్ గా రావడం సంతోషకరం. ఈ పుస్తకానికి నన్ను ముందు మాట వ్రాయమని అడగడం నా భాగ్యంగా భావించాను. నిజానికి నాకంత అర్హత లేదు. వ్యక్తిగతంగా పార్వతీ పరమేశ్వరుల లాంటి దంపతులను వారింటికి వెళ్లి కలుసుకోవడం వారి ఆతిధ్యం ఆదరణ నా మనసులో చాలా విలువైనవిగా మిగిలి వున్నాయి. వారి కుటుంబం పట్ల ఉన్న ఆత్మీయతపరంగానూ వారి బ్లాగ్ ని యెక్కువ చదవడం మూలంగా నాకు ఈ అవకాశం లభించినందుకు ధన్యురాలిని.
మొదటిసారిగా శర్మ గారి బ్లాగ్ చదివినప్పుడు చాలా ఆసక్తితో ఒకరోజంతా చదువుకుంటూ వెళ్ళిపోయాను . నిషేదంలో ఉన్న అనేకానేక విషయాలను వస్తువులను యథేచ్ఛగా వాడేస్తున్నాం జరపకూడనివి నిరభ్యంతరంగా జరిపేస్తున్నాం . ఈ బ్లాగ్ చదవకూడదు అనే నిషేధం పెడితే బాగుండును. మరింత చదివేస్తారు అనుకునేదాన్ని.
ఇక ఈ గఱికెల మాన్యం గురించి నా స్పందన
మనకు ప్రపంచ జ్ఞానమైతే వుంది కానీ సంప్రదాయ జ్ఞానం లేదు. సంప్రదాయం మారుతూనే వుంటుంది. మార్పులకు అనుగుణంగా మనం మారలేక మళ్ళీ గతం వైపు మళ్ళి చూస్తాం . అలాంటపుడు మనకు గత కాలపు మనుషులు మౌఖిక రూపంలో లభించనపుడు లిఖితరూపంలో లభ్యమవుతున్న వాటిపై ఆధారపడతాం. సాంప్రదాయపు అట్టడుగు పొరల్లోకి వెళ్లి చూసే తీరిక ఎవరికీ వుందిపుడు? అదిగో అలాంటప్పుడే ఈ గఱికెల మాన్యం పెద్దమ్మలా ఆదుకుంటుంది.
ఒక పుస్తకం చదివినా ఒక ప్రసంగం విన్నా ఒక సినిమా చూసినా మనకేమి కావాలో అదే తీసుకుంటాం. ఈ పుస్తకం మొత్తాన్ని తీసుకోగల్గడం ఒక భాగ్యంగా భావించాలి మనమందరం. ఎన్నెనో తెలుగు పదాలు ఏది సంస్కృతంమో ఏది తెలుగు పదమో వివరించే క్రమాలు ఆ నుండి ఱ వరకూ ,సామెతలు,ఛలోక్తులు,నానుడి అన్నీ మిళితమై ఉంటాయి. కథలు, మళ్ళీ అందులో ఉప కథలు, అనుభవాలు. గారెలకు చిల్లు యెందుకు, తోడికోడళ్ళు దెప్పుకున్నట్లు నాయకులు దెప్పుకోవడాలు ప్రపంచ రాజకీయాలు, సమకాలీన సమస్యలు ఆసక్తికరమైన విషయాలు అన్నీ ఉంటాయి.. సూక్ష్మంగా సలహాలు కూడా లభిస్తాయి చదువుతుంటే కాలం తెలియదు. చదివి కాలాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు మన అనుభవంలో మనకి తెలుస్తూంటుంది అంతే.
కాలక్షేపం కబుర్లు చదవడం ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. పూర్తిగా చదివి ఆకళింపు చేసుకునేవారికి యిది ఒక ఊట బావి. పెద్ద పెద్ద గ్రంధాలు చదవలేనివారికి సూక్ష్మంలో మోక్షంలా ఉంటాయి. అమ్మమ్మ అమ్మ చెప్పే కథలు ఉంటాయి. చిటికినవేలు పట్టుకుని నడిపించే తాత ప్రేమ కబుర్లు ఉంటాయి. నాన్న నడుస్తున్న నడక ఉంటుంది. మొత్తంగా శర్మ గారి వ్రాతలను వొడపోయడం మాత్రం చాలా కష్టం. ఇది బాగుంది యిది బాగోలేదు అని విభజించడం మరీ కష్టం. వారికి యెంతోమంది అజ్ఞాత అభిమానులు వున్నారు. ఎక్కడో వొకచోట ఆ పెద్దాయన వొకసారి యిలా చెప్పారు అని గుర్తుచేసుకోక మానరు. ఈ కబుర్లలో అత్యద్భుతమైన జీవన విధానం వుంది. అనుభవాలున్నాయి. సూక్ష్మ రహస్యాలున్నాయి. మొత్తంగా మన తెలుగువారికి ఒక పాఠ్య గ్రంధం యిలా భద్రపరచి వుంది. అతిశయోక్తి అనుకోవద్దు. పిల్లలకు తెలుగు చదవడం వచ్చిన తర్వాత ఈ బ్లాగ్ పుస్తకం చేతికి అందించగలిగితే చాలు. జీవితంలో ముఖ్యంగా నేర్చుకోవాల్సినదల్లా చాలా వరకూ లభ్యమైనట్లే. మొత్తంగా ఈ రాతలు మన శ్రేయస్సును కోరుకునే వెంపటారి దెయ్యం అని మనవి చేస్తున్నాను. ఒకటే లోటు ఈ పుస్తకం ముద్రణలో కూడా వుంటే హాయిగా చదువుకోవడానికి అనువుగా ఉండేదని చాలా సార్లు అనుకున్నాను. ఆ లోటు కూడా తీరుతుందని ఆశిస్తున్నాను
ఆఖరిగా ఒక మాట. అదీ శర్మ గారి మాటల్లోనే ..
"మీ నాన్న బహుమతి ఏమీ యివ్వలోదోయ్ అన్నాడట భర్త. మా నాన్న కష్టపడి కని పెంచి మీకివ్వడమే ఒక బహుమతి. ఇంతకంటే యేమిస్తాడు బహుమతి అందంట భార్య".
.
శర్మ గారికి అర్ధాంగి కీ శే శ్రీమతి బాలబాస్కర ఆది శేషారత్నం గారు అలాంటి బహుమతి.అనిపించింది. అందుకే ఆమెకు గఱికెల మాన్యం ను జ్ఞాపకార్థముగా ప్రచురించడం జరిగిందని తలుస్తాను.వారిని ఆత్మీయంగా తలుచుకుంటూ ... "గఱికెల మాన్యం" పై నా చిరు స్పందన. నాకీ అవకాశం యిచ్చిన శర్మ గారికి ధన్యవాదములు. నమస్సులు.
వనజ తాతినేని
13/11/2018
విజయవాడ.
(అట్లాంటా నగరం USA నుండి వ్రాయడమైనది )