నీతో కలిసి అడుగులేస్తుంటే
నడిచే గ్రంధాలయం తోడున్నట్లు
నువ్వు పెదవి విప్పితే
నేను రాగ దర్బార్ లో ప్రవేశించినట్లు
కళ్ళు కళ్ళు కలుసుకుంటే కలలు
సీతాకోకచిలకలై యెగురుతున్నట్లు
చేతిలో చెయ్యేసి నడుస్తుంటే
నిండుగా పూచినవనంలో నిలువెల్లా తడిచినట్లు
ఎన్నాళ్ళకైనా
నా అనుభవంలోకి వచ్చిన నిన్ను స్వీకరిస్తూ
దేహం దేహంలో ముంచినట్లు కలాన్ని సిరాలో ముంచి
సంపూర్ణ ప్రేమలేఖ వ్రాయాలనుకున్నా...
నా లోలోపల ఓ స్వేచ్చా పిపాసి దాక్కుని
నను వశీభూతుడుని చేసుకోవాలని పన్నాగం
ఈ ఉద్వేగాలని ఉన్మత్తాన్ని దాటెల్లి
జీవితాన్ని చూడాలని
ఉన్నదానితో వుత్సవం చేసుకోవాలని
జీవితాన్ని రసభరితం చేసుకోవడం నేర్చుకోవాలని
ఎల్లప్పుడూ భోధిస్తూ వుంటాడు
తుదకు విజయుడయ్యాడు
లోనికి రానిదల్లా ఓ అసంపూర్ణ చిత్రపటమేనని
నిన్ను అనవసరంగా మోస్తున్నానే బాధనుండి విముక్తి కల్గించిన
ఆ ప్రేమికుడికి కృతజ్ఞత తెలుపుకుంటున్నా
అందుకే...
నడిచొచ్చిన రాతిమెట్ల కాలానికి వినయంగా నమస్కరిస్తున్నాను
ఇన్నేళ్లు జారకుండా ప్రేమగా హత్తుకున్నందుకు
ఇకపై అడుగులు కలిసి వేస్తున్నందుకు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి