6, నవంబర్ 2018, మంగళవారం

విదిలించరాదా విభో నీ విబూది

                                                      ఓం నమః శివాయ 


సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు శివదర్పణం అనే కావ్యం రచించారని చదివాను. యూ ట్యూబ్ లో వారు స్వయంగా ఆలపించిన గీతం కూడా చూసి .. ఆ సాహిత్యాన్ని వారి గళంలోనే వింటూ వ్రాసుకున్నాను. ఇది బ్లాగ్ లో ప్రచురించడం ద్వారా ఇంకొంతమందిని చేరే అవకాశం ఉంటుంది కదా అనే వుద్దేశ్యంతోనే.  భక్తి భావంతో అర్పించిన సుమాక్షరాలలో  ఆర్తి నెలకొనివుంది. ఆ దేవదేవుడిని వేడుకునే  ఈ గీతం అందరిని అలరిస్తుందన్న నమ్మకం.  

శివదర్పణం లో  సిరివెన్నెల  

విదిలించరాదా విభో నీ విబూది 
విడిపించరాదా విరాగి విపత్తి 
వినిపించలేదా విలాపించు వినతి 
విసుగైనరాదా విరించన విరోధీ 

ఇసుక రేణువుపాటి విసిరితే తరిగేనా 
రసశేవిధీ  నీ వరవార్నిధీ 
దశదిశాళికి చాటి విశదీకరించనా 
గిరిజాపతీ నీ కరుణాకృతీ  
నిరుపేదవైపోవు నడివీధి పడిపోవు || ని || 
కరిగేది కాదు కాణాచి కించిత్ పంచి 
పొందరాదా విపులకీర్తి 
వెలిగించరాదా కృపా కిరణ జ్యోతి 
కలిగించరాదా కపర్దీ విముక్తి 
తొలగించరాదా విషాదా నిశీధీ 
కనిపించలేదా ప్రభో ఈ కబోది  || వి || 

గిరిని పెకిలించేటి  పెంకితనమే 
ప్రీతి కల్గించెనా నన్ను కదిలించెనా 
పెనుగులాడు కిరీటి సింగాణి శిరమంటి 
మురిపించెనా నిను కరిగించెనా 
నాకేవి పదితలలు, లేవు గాండీవములు || నా || 
దయ చూపమంటు కైమోడ్చి యేడ్చె భక్తి 
పనికిరాదా మౌనమూర్తీ... 
వికటించె నాథా వివాదాల వితతి
విషమించెకాదా విషాదార్చి వ్యాప్తి 
వీక్షించరాదా విరూపాక్ష నా..గతి 
వినిపించలేదా శివా నాడు ఆర్తి 

విదిలించరాదా విభో నీ విబూది ||వి||  
విడిపించరాదా విరాగి విపత్తి 
వినిపించలేదా విలాపించు వినతి 
విసుగైనరాదా విరించన విరోధీ ||వి||