2, నవంబర్ 2018, శుక్రవారం

అడిగి / అడగక


అడిగి / అడగక 

 రాని నవ్వు నవ్వడమంటే..  
వికసించే కాలానికన్నా ముందే 
రేకలు విడదీయడంలా 
బలవంతపు పెళ్ళి చేసుకునే వధువు ముఖంపై 
సంతోషాన్ని  పూయించాలనుకోవడంలా 
ఆజన్మ ఖైదు నుండి   విడుదలిప్పించి 
బానిసగా పడివుండు అన్నట్లుగా   
అలుముకున్నవిషాదపు రంగుపై  
హోళీ రంగులు పూయడంలా      

అడగక పోయినా ఆగని నవ్విలా ...

విత్తనాన్ని చీల్చుకుని వచ్చే చిరు మొలకలా 
దేహం మోడు చిగురించినట్లుగా        
నూగు అంటుకున్న పూమొగ్గ విరియబోతున్నట్లుగా   
నిద్ర పోతున్న పసిపాప నవ్వులా  నగ్నంగా  
హృదయాన్ని తెరవబోతున్న  తాళం చెవిలా 
మొత్తంగా ....
రహస్య స్నేహితుడు  నీ  ఆలోచనల్ని 
హత్తుకున్నప్పుడు కలిగే పరవశంలా..



కామెంట్‌లు లేవు: