17, జనవరి 2023, మంగళవారం

కలల సీతాకోకచిలుక

జాలి తలచి అలసిన కనురెప్పలపై

నిశ్శబ్దంగా వాలింది కలల సీతాకోకచిలుక

జడత్వం నిండిన మనసును రూపం మార్చుకోని 

ఆలోచనలను  యెంతగా కుట్టి కుదిపిందనీ


 అధిరోహించలేని శిఖరాలను దారి తెలియని లోయలను

పచ్చని మైదానాలను యెడారి చెప్పే రాత్రి రహస్యాలను 

మరులు గొలిపే మర్మాలను భ్రాంతిగా తొలిచే సత్యాలను

యెన్నెన్ని పరిచయం చేసిందనీ


మీటబడిన రహస్యతంత్రులు చెలరేగిన అలజడులు

పన్నీటి గంధపు చిలకరింపులు  కలిగిన సాంత్వనలు 

యెన్నింటికి సాక్షీభూతంగా నిలిచిందనీ


మనః దేహాలను రసప్లావితం లో తేల్చిన 

అనుభవైకవేద్యమైన ఆ సంగతులను

పదిలపరుచుకోవడమో పంచుకోవడమో 

యెంత అసాధ్యమనీ


రెప్పలు విప్పితే  రెక్కలు విరుగుతాయనీ 

 బుుతువు మారిందనీ  కలల సీతాకోకచిలుక

యెగిరి పోతుందనీ..






(చిత్రం సేకరణ )

12, జనవరి 2023, గురువారం

కుటుంబ భద్రత లో దృశ్యభూతం

 ఈస్తటిక్ సెన్స్  కథాసంపుటిలో 'దృశ్యభూతం’  కథపై విశ్లేషణ/వ్యాఖ్యానం  అందించిన  వారణాసి నాగలక్ష్మి గారికి ధన్యవాదములు  


మొబైల్ ఫోన్లలో ఇతర దృశ్య మాధ్యమాల్లో అందుతున్న రకరకాల నీలిచిత్రాలూ, పసి వయసులోనే వాటికి ఎక్స్పోజ్ అవుతున్న పిల్లలూ, ఫలితంగా వారిలో ఏర్పడుతున్న మానసిక సమస్యలూ - ఒక పెద్ద భూతంలా తల్లిదండ్రులని భయపెడుతున్న ఈ సమకాలీన సమస్యని వనజ తాతినేని గారు ‘దృశ్యభూతం’ కథగా మలిచి, ఒక చక్కని పరిష్కారాన్ని కూడా సూచించారు. 


పిల్లలు కావాలనుకుంటున్న భార్యాభర్తలూ, చిన్న పిల్లలున్న తల్లిదండ్రులూ తప్పక చదవాల్సిన కథ ఇది. తీరికలేని ఉద్యోగాలతో సతమతమవుతూ, నెల తిరిగేసరికి చేతికొచ్చే జీతాలకి ముందుగానే సిద్ధమై ఉన్న ఈ ఎం ఐ ల లెక్కలతో సంతృప్తి లేని జీవితాలు గడుపుతున్న యువదంపతులు నేటి సమాజంలో ఒక ముఖ్య భాగమైపోయారు. వీళ్ళు తమ పిల్లలపెంపకం కోసం జీతమిచ్చి పెట్టుకునే సహాయకుల మీద ఆధారపడుతున్నారు గాని ఇద్దరిలో ఒకరు ఇంటిని చూసుకుంటూ తక్కువ రాబడిలో జీవితాన్ని గడిపే ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు. భద్రత నివ్వని, నిలకడ లేని ఉద్యోగాలూ దీనికి ఒక కారణమే. 


ఏదేమైనా ఈ పరిణామం వెనుక కనుమరుగైపోయిన పూర్వకాలపు ఉమ్మడి కుటుంబ వాతావరణమూ,  వెల్లువై ముంచెత్తుతున్న అంతర్జాలపు మాయాజాలమూ ఉందన్నది కాదనలేని సత్యం. అపురూపంగా కని పెంచుకుంటున్న ఒకరిద్దరు పిల్లలకి సర్వ సౌకర్యాలూ అమర్చాలని సంపాదన పెంచుకునే ప్రయత్నాల్లో తలమునకలవుతున్న యువదంపతులు ప్రతిచోటా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ భద్రతని గాలికొదిలేయకుండా, రెంటి మధ్యా ఒక సమతుల్యత సాధించడమనేది నేటి యువదంపతులకెదురుగా ఉన్న పెద్ద సవాలు! ఈ సవాలుని వారెంత సమర్ధంగా ఎదుర్కొంటారనే దాని మీదే రేపటి సమాజపు పునాదులున్నాయి.  




8, జనవరి 2023, ఆదివారం

ఔనా!? వొక టార్చ్ లైట్

"ఈస్తటిక్ సెన్స్" కథాసంపుటి లోని "ఔనా!?" కథకు వ్యాఖ్యానం అందించిన జ్వలిత గారికి ధన్యవాదాలు


ఔనా..? -జ్వలిత


బ్రౌన్ నిఘంటువు ప్రకారం కథ అనగా ఇంచుక సత్యమైన కల్పిత ప్రబంధం. కథ చెప్పువాడిని "కథకుడు" అని కథ చెప్పే విధానాన్ని "కథనం" అని చెప్పే విషయాన్ని "కథితమ" అని అంటారు.

 

తెలుగు కథ లేదా కత (Telugu Story) తెలుగులో ఒక సాహితీ ప్రక్రియ. తెలుగు అకాడమి నిఘంటువు ప్రకారం కథ అంటే కొంత సత్యాంశతో కూడిన కల్పిత గద్య గ్రంథం. సాధారణంగా చిన్నపిల్లలకు నిద్రపోవడానికి పెద్దలు చిన్న చిన్నకథలు చెప్పడం అలవాటు.  తెలుగులోను, ఇతర భారతీయ భాషలలో కొత్త కథ పుట్టి  నూరేళ్ళు దాటి చాన్నాళ్ళయింది. ఈ నూటిరవై సంవత్సరాలలో లక్షకు పైగా కథలు రచించబడ్డాయి. ఇవి ఎక్కువగా దిన, వార, మాస పత్రికలలో ప్రచురించబడుతున్నాయి. కొన్ని కథా సంకలనాలు ప్రత్యేకంగా ముద్రించబడ్డాయి. ఈ కథలు ముఖ్యంగా నీతి, ధర్మం, సాహసం, ఔదార్యం, శృంగారం వంటి విషయాలతో పాటు తత్కాల సామాజిక అంశాలు, ప్రకృతి వైపరీత్యాలు ప్రధాన వస్తువుగా నడుస్తాయి. కరోనా కథలు, వానకథలు, జిల్లాల వారి కథలు, చేతివృత్తి కథలు ఉదాహరణగా చెప్పవచ్చు. ఇతర సాహిత్య ప్రక్రియలన్నింటికన్నా కథకి ఆదరణ ఎక్కువ.

 

కథ పర్యాయపదాలు చరిత్ర, గాథ, వృత్తాంతం. కథ ప్రకృతి అయితే కత వికృతి. కథలు చెప్పేవాడిని 'కథకుడు' అంటారు. కథ చెప్పే స్త్రీలను కథయిత్రులు అన్నారు సినారె. కథలో ప్రధాన పురుషుడు 'కథానాయకుడు', ప్రధాన స్త్రీ 'కథానాయకురాలు'. కీర్తిశేషుడైన లేదా మరణించిన పురుషుడు 'కథాశేషుడు', మరణించిన స్త్రీ 'కథాశేషురాలు'. కథకు నిర్వచనాన్ని అనేకులు తమకు తోచినట్టు చెప్తూ వచ్చారు.

 

ఈమధ్య ఎక్కడో చదివినట్టు గుర్తు..


అగ్నిపురాణంలోని ఒక శ్లోకంలో "దీర్ఘంగా కాక పొందికగా ఉండడం, ఉదాత్తత కలిగి ఉండడం, సంభ్రమాశ్చర్యాలు కలిగించి కరుణ అద్భుత రసాలను పోషించడం, ఆనందాన్ని కలిగించడం కథానిక లక్షణాలు" - అని చెప్పబడిందని.

 

తాతినేని వనజగారితో పది సంవత్సరాలుగా పరిచయం. వారి రచనలకు అభిమానిని. వారు రాసిన 'ఔనా..' కథ చదివినప్పుడు సంబ్రమాశ్చర్యాలతోపాటు దుఃఖం కలిగింది. 1970 నుండి నేను చూసిన అనేక మంది స్త్రీలలో 'మీనమ్మ'  వంటి వారు కళ్ళ ముందు కదిలారు.

 

ఔనా.. కథను ఆసాంతం ఆగకుండా చదివేస్తాం. రచయిత్రి తన అనుభవం చెప్తున్నట్టు కథ మొదలుపెట్టడంతో పాఠకుల్లో ఆసక్తిని పెంచారు. ఇదొక టెక్నిక్.. నేనే కాదు మీనమ్మ వంటి స్త్రీలనెందరినో మీరంతా చూసే ఉంటారు.ఈ 'ఔనా..?' అనే ప్రశ్నను కథలో అనేక కోణాల్లో జొప్పించి సమాజంలో నెలకొన్న డొల్లతనాన్ని మన కళ్ళముందుంచారు…

 

దేవాలయాలకి తల్లీకొడుకులు కలిసి వెళ్ళినా అనుమానిస్తారా…? 

 

దైవదర్శనానికి వచ్చే భక్తులకు కులాలవారి, ప్రాంతాల సత్రాల కేటాయిపులు.. అందులోనూ రెకమెండేషన్లుంటాయా..?

 

మండల పూజలు, దీక్షలతో భూతప్రేతాల బాధను తొలగించు కోవడానికి దేవాలయాలకు వస్తారా..?

 

ప్రేమ రాహిత్యంతో బాధపడే వారంతా మీనమ్మ వలె చేయవచ్చునా..?

 

మానసిక రుగ్మతలతో, కుంగుబాటుతో బాధపడే స్త్రీలందరికీ 'అప్రేమ' ప్రధాన కారణం కాదా.. ఇందులో కుటుంబం, సమాజం బాధ్యత ఏమీ లేదా?

 

ప్రేమ రాహిత్యంతో బాధపడి ఆత్మహత్యలు చేసుకోడం కంటే.. మీనమ్మ ఎంచుకున్ళ మార్గం సరైనదే కదా? 

 

మానవ సంబంధాలలో లైంగికత లేని స్నేహం, ప్రేమ అబాసు పాలవడం దుష్ప్రచారాలకు గురి కావలిసిందేనా..? 

 

వంటి అనేక ప్రశ్నలు కనిపించాయి నాకు. కథలో ఎక్కడా రచయిత్రి ప్రవేశించి న్యాయ సూత్రాలను, ధర్మ సూక్తులను బోధించ లేదు. ఒక జరిగిన సంఘటనను ప్రత్యక్ష సాక్షిగా చెప్పుకుంటూ పోయారు.

 

రాయవలసిన కొన్ని విషయాలను రాయకూడదనే సందేహంతో పదిసంవత్సరాలుగా అంతఃసఘర్షణకు లోనయి.. రాయకుండా వుండలేని పరిస్థితిలో ధైర్యం తెచ్చుకొని కథరాశానని పరోక్షంగా చెప్పారు.

 

బ్రౌన్ నిఘంటువు ప్రకారం కథ అనగా ఇంచుక సత్యమైన కల్పిత ప్రబంధం.. 'ఔనా..' కథలో అదే ఉన్నది.. కల్పితం ఏది? సత్యం ఏది ? పసిగట్టవలసినది పాఠకులే..

 

'ఔనా..?' కథలో నాకు బాగా నచ్చిన మాటలు, కథకు సెంట్రల్ పాయింట్, పంచ్ డైలాగ్ లాంటి మాటలు...

 

'బొట్టా..! మనిషన్న వాడికి అన్ని దశల్లోను ప్రేమ, శాంతి దొరకాలి. సముద్రం నుంచి కొంత, బిడ్డల నుంచి కొంత, నాయన నుంచి కొంత, అమ్మ నుంచి కొంత, సేయితుల నుంచి కొంత, భర్త నుంచి కొంత, బిడ్డల నుండి కొంత ఇట్టా అందరి నుండి కొం కొంత గ్రాసం ప్రేమ జవురుకుంటే కానీ ఈ కట్టె చల్లారదు' అని మీనమ్మ తాత మీనమ్మతో చెప్పిన మాటలు.

 

కథలో ఒక చారిత్రక పౌరాణిక అంశాన్ని కూడా ప్రస్థావించారు రచయిత్రి. 'కూతురిని మోహించిన రాజును పచ్చల బండగా పడివుండమని శపించింది అంటగా. మరి నేను కొడుకు వరుసయ్యే వాడిని మోహించాను కదా! లోలోన నేను ఏ బండనవుతానో అని భయం అనుకుంటా.. మనిషి బతికి వుండగా కోరికతో పెయ్య కాలుతుంటే చచ్చినాక పాప పుణ్యాల గురించి చింత ఎందుకు అంటా నేను' అని చెప్తుంది మీనమ్మ  రచయిత్రి తో.

 

'Man is social animal'.. మనిషి సంఘజీవి, ఒంటరిగా దేనినీ ఆస్వాదించ లేడు, అనుభవించలేడు.. ఇప్పటి మనిషిలో స్వార్ధం పెరిగి.. అన్ని రకాల పేరుకు పోతున్నాడు. బ్రమల్లో కూరుకు పోతున్నాడు. కానీ మనిషన్న వాడు కష్టం, సుఖం, మోహం, దాహం, ద్రోహం, గెలుపు, ఓటమి, వేరొకరితో పంచుకోవడం హ్యూమన్ సైకాలజీ. అలా పంచుకునే అవకాశం లేనప్పుడు. మానసికంగా కుంగిపోతారు. కథలో మీనమ్మ జీవితాంతం చెప్పలేక కుంగిపోయిన అంశం Lack of Love' ఎదుర్కొన్న సమస్య 'అప్రేమ' ప్రేమ రాహిత్యం.


చివరికి పొందిన కొడుకు వంటి యువకుని నుండి పొందిన 'ప్రేమ' దాని ద్వారా కలిగిన విజయ గర్వంతో కూడిన సంతృప్తి, దానిని ఎవరికో ఒకరికి చెప్పుకోవలనే తాపత్రయం, మన బుజ్జమ్మకు చెప్పుకునేలా చేసింది. ప్రపంచంలో 90 శాతం ఆడవాళ్ళు మీనమ్మ వలె అప్రేమతో అశాంతితో బాధపడుతున్నారు అంటే అతిశయోక్తి కాదు.

 

స్త్రీలలో వివాహేతర సంబంధాలున్న వారు కూడా చాలా వరకు సెక్సు కోసం కాదు ప్రేమరాహిత్యం నుండి బయట పడటానికే అని నా అభిప్రాయం… అంతే కాదు ప్రేమరాహిత్యంతో బాధపడుతున్న స్త్రీలను లోబరుచుకునేందుకు ప్రేమను స్నేహాన్ని నటించి మోసం చేసే వారే ఎక్కువ సమాజంలో… ఆవిషయాన్నే మీనమ్మ మాటల్లో..


'నలభై ఏళ్ళ కాపరంలో మొగుడి గుండెల మీద పడి ఆదమరిచింది లేదు. నా మనస్సు సేదదీరింది లేదు. కంటికి కనబడని వియోగ దుఃఖం ఏదో ఎప్పుడూ నన్ను అంటిపెట్టుకునే వుండేది. అందుకే ధైర్యం చేసాను. ఈ నలభై రోజులు వాడు నన్ను ప్రియంగా చూసుకున్నాడు. వాడు నా ఆకలిని గుర్తించాడో అశాంతిని కనిపెట్టాడో దుఃఖాన్ని అర్ధం చేసుకున్నాడో కానీ నలభై రోజుల నుండి మరో లోకంలో విహరింపజేసాడు. స్వర్గం అంటే ఇట్టాగే వుంటుందేమో అనిపించింది అనుకో, ఇప్పుడు నా మనసుకు తృప్తిగా పరమశాంతిగా వుంది. ఇలా చేసినందుకు నేనేమి సిగ్గుపడటం లేదమ్మాయ్! పాపభీతి బిడియం నేన్నేం వెంటాడటంలేదు. దేవుడు సాక్షిగా చెబుతున్నా. నువ్వు నమ్మాలి' …..అంటది.


అంతే కాదు మీనమ్మ తనకు దక్కని ఆత్మీయత ఆదరణ ఎలా పంచిందో రచయిత్రి బాగా చెప్పారు.."మా తాత పెద్ద కవిలే కవిత్వం రాసినాడు. గజళ్ళు చదివేవోడు... నోరారా విప్పి చెప్పేవాడు. జమీన్ రైతు చదివి వినిపిస్తా వుండేవాడు. మా నాయన చిన్నగా వున్నప్పుడే మా అవ్వ చనిపోయిందంట. మళ్ళీ పెళ్ళిచేసుకోకుండా నలుగురు బిడ్డలను కాపాడినాడు. రోజు ఆయన వొళ్ళే కూర్చుని ఇన్న మాటలే అనుకో బాగా గమనం వుండాయ్…..


"ఆయనెందుకు చెప్పాడో కానీ ఆయన చెప్పినవేమి నాకూ దొరకలేదు. ఆకులు పోకలు అందుకున్నప్పుడు నుండి ఎదురు చూపే మిగిలింది. మొగుణ్ని మనసు నిండా కరువుదీరా కౌగలించుకున్నది లేదు. ఈ ఆకలి శరీరానిది కాదు. మనసుది బిడ్డల పెళ్ళిళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు పుడుతున్న కొద్దీ.. ముసలిదాన్ని అయిపోతున్నాను, నా మనసు ఆకలి తీరకుండా ఏడ చచ్చిపోతానేమోనని వొకటే దిగులయ్యేది. నేను మాత్రం జీవమున్న ప్రతిదాన్ని నిండా కావిలించుకుంటాను. పిల్లలు, పిల్లల పిల్లలను దూడను పెయ్యను కుక్కను మేకను పిల్లిని ఆఖరికి అంతంతలావు మానులను కూడా వాటేసుకుంటాను. అయినా మనసుకు నెమ్మది లేదు. కంటినిండా నిదుర పట్టేది కాదు. ఆఖరికి నా ఆకలిని కనిపెట్టినవాడు ఒకడు కనిపించాడు. కుడియెడంగా నా కొడుకు వయస్సు వున్న వాడు. వాడిని తగులుకున్నాను. తప్పా ఒప్పా అని ఆలోచించలేదు నేను. శరీరానికేనా భోగానుభవం మనస్సుకు ఉండొద్దూ, ఆకలిగా వున్నప్పుడు అందుబాటులో వున్నది తిని ఆకలి తీర్చుకున్నట్టు మొగుడు పెళ్ళాం మధ్య కాపురం సక్రమంగా వర్దిల్లినా వాళ్ళమధ్య గాఢానురాగం లేకపోతే అది ఓటి కుండ లెక్కే…" అంటుంది. ఇది చెప్పడానికి చాలా ధైర్యం కావాలి… 


కథలో మీనమ్మ కథంతా అనంతపురం యాసలో నడిపించినా రచయిత్రి తన స్వంత మాండలీకంలో  కొంత చెప్పారు… 


బుజ్జమ్మ కొడుకు 'నువ్వు పిచ్చివాళ్ళతో కూడా ఫ్రెండ్ షిప్ చేస్తావమ్మా..' అనడం కొస మెరుపయితే.. కథలో చివరన తాను అడగకుండా మరిచి పోయిన ప్రశ్నలను రచయిత్రి మనను అడగమని ఎస్సైన్ మెంట్ ఇస్తుంది పాఠకులకు.

 

మొత్తానికి కొన్ని ముఖ్యమైన కోణాలకు టార్చ్ లైట్ వేశారు వనజగారు. వారికి అభినందనలు .





7, జనవరి 2023, శనివారం

పద చిత్రాలు

వాగ్దానమిస్తున్నా.. 

నిత్య వసంతోత్సవంతో  

నీ జీవితాన్ని అలంకరిస్తానని..

ఆకుపచ్చని సంగీతమై అలరిస్తానని

కాస్త నమ్మకం వుంచు. 

*********

ఇరుకు త్రోవలను విశాలం చేయడం

 ఏమంత సులువు కాదు. 

మరి అవి కొండలు కాదు గుండెలు

మృదువుగా మార్చడానికి నా గుండెను డైనమేట్ చేయాలని ఆలస్యంగా తెలిసింది

**********

అవ్యక్తానుభవ వీచికలు అటు పయనించవేమో

హృదయగత సంచలనాలు నువ్వు గుర్తించలేదేమో

అద్దంలో తారుమారైన కుడి యెడమల్లా మనం  మారిపోతే

రహస్య మాంత్రికుడు సృష్టించే అలజడి పేరే ప్రణయం

అని నీకు తెలుసా.. 

******************

నాకొకటే భయం 

నువ్వు నన్ను ప్రేమించడానికి పూనుకునే వేళకు

నేను నిన్ను ద్వేషించే పని మొదలెడతానేమోనని

వద్దు వద్దు, భూమిపై కురిసిన వర్షం మేఘమవ్వడం

కాలయాపన కాదని నాకు విదితమే. 

*************************

వంతెనలు కూలిపోయాక  వొడ్డులు వొంటరివి

అనుబంధాలు నెత్తురోడుతూ ప్రవాహంలో కొట్టుకుపోతాయి. కరుణించి దరి చేర్చుకునే దైవం సముద్రం. 

కాగితపు పడవులకు తీరాలుంటాయా?

*****************

విచారపు గొడుగు నీడలో 

రేయింబవళ్ళు  దీర్ఘయాత్రికుడినై సంచరిస్తున్న

భక్షించి శిక్షించి విముక్తి నైనా కలిపించు వలపు రాక్షసీ

Pics: Gibbs garden Ga 





6, జనవరి 2023, శుక్రవారం

సంఖ్య కాదు డబ్బు కాదు -జీవితం

 శ్రీమతి వనజ తాతినేనిగారు పరిచయం అక్కర్లేని రచయిత్రి. పైకి సాధారణంగా కనిపించే జీవితాల పైపొరలు తొలగించి లోపలి మర్మాన్ని సమర్ధవంతంగా ముందుంచుతారు.  ప్రస్తుతపు కథ "రెండు లక్షలు". అది కేవలం ఒక సంఖ్య కాదు. అలాగే డబ్బు మాత్రమే కాదు. జీవితాలని నడిపించే చోదకశక్తి. అది పరిస్థితులని, మనుషులనీబట్టి మంచికీ చెడుకీ కూడా నడిపిస్తుంది.

భూషణం అసమర్ధుడు. డబ్బు లేదు. చిన్న రైతు. ఆస్తికి సరిపడా అప్పులున్నవాడు. అన్నిటినీమించి భార్యకి విలువ యివ్వనివాడు. ఈరోజుని సమాజంలో జరుగుతున్న పెళ్ళిళ్ళలో చాలావరకూ విలోమ వివాహాలంటే అతిశయోక్తి లేదు. ఏమీ చాతకాకపోయినా, పెత్తనం మాత్రం వదలని మగవారి చేతిలో స్త్రీ ఎలా వోడిపోతుందో కళ్ళకి కట్టినట్టు కనబడుతుంది. శారద భర్తకన్నా తెలివైనది. కష్టపడుతుంది. నీతిగా బతకాలనుకుంటుంది. తనకి చేతనైంతలో కొద్దోగొప్పో సంపాదించి అతనికి సాయపడుతుంది. అతనికి తాగుడికికూడా తనే ఇస్తుంది. అదంతా అతను గుర్తించని కష్టం. ఇంత చేసినా ఆమె మాట ఎక్కడా నెగ్గనివ్వడు. అతని తోబుట్టువులమధ్య ఆమెకి ఎలాంటి విలువా వుంచడు. ఒక స్త్రీ ఇంటికి ఆదాయవనరు అయికూడా పరాధీనగా ఎలా మారిపోతుందో  స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వాళ్ళ కూతురు వుమకి పెళ్ళి కుదుర్చుతాడు భూషణం. రెండులక్షల కట్నం. అదీ వెంటనే ఇవ్వక్కర్లేదు. పెళ్ళికూడా  శక్తి కొలదీ చేయచ్చు.  పెళ్ళికొడుకు ఫణీంద్ర. బాగా డబ్బు, దానికి సరిపడా దగుల్బాజీతనం వున్నవాడు. ఆడవారిమీద వ్యాపారం చేస్తాడు. ఎలాంటి విలువలూ, వావివరుసలూ వుండవు.  శారదకి అతనెలాంటివాడో తెలుసు. భర్తకి చెప్తుంది. సంబంధం వద్దని వారిస్తుంది. అతను వినడు. కూతురికి చెప్తుంది. చదువైతే మంచిసంబంధం తనే చూసి చేస్తానంటుంది. ఆమెకి అర్థమవదు. అర్థమవటానికి ఇద్దరు పిల్లలు పుట్టేంత సమయం, ఒక తప్పటడుగూ అవసరమౌతాయి.

ఇంట్లోవాళ్ళకి అంత గొప్పసంబంధం తమని వెతుక్కుంటూ రావటమే గొప్ప. పెళ్ళిరోజంతా దిగులుగా ఆలోచనలతోనే గడుపుతుంది శారద. అదేరోజు పొరపాట్న గంజిలో జారిపడి, కాలు విరిగి హాస్పిటల్లో పడుతుంది శారద. ఆమె లేకుండానే పెళ్ళి, అంపకాలు జరిగిపోతాయి. ఇంట్లోంచీ వచ్చేసి వేరే వుంటూ తన బతుకు తను బతుకుతుంటుంది. దానికి ఒక బలమైన కారణం వుంటుంది. దాన్ని కారణంగా ఎవరూ వప్పుకోరు. ఆఖరికి కూతురుకూడా.  

మిగిలింది రెండులక్షల కట్నం బాకీ. ఎటువంటి పరిస్థితుల్లోనూ దాన్ని తీర్చలేడు భూషణం. తను తీర్చాలని కష్టపడుతుంది శారద. అత్తని తన మార్గంలోకి రమ్మని ప్రోత్సహిస్తాడు ఫణీంద్ర. పక్కదారి పడుతుంది ఉమ. అది అవకాశంగా తీసుకుంటాడు ఫణీంద్ర. తన వ్యాపారంలోకి ఆమెనీ లాగాలనుకుంటాడు. ఆమె యింట్లోంచీ వెళ్ళిపోతుంది. ఆమెని వెతికే క్రమంలో శారద యింటికి వస్తాడు ఫణీంద్ర. ఆ సందర్భంగా అతనన్న మాటలద్వారా మనుషులకి జీవితంపట్ల గల రెండునాలుకల ధోరణిని  రచయిత్రి సమర్ధవంతగా చూపించి కథకి అందమైన ముగింపు ఇచ్చారు.  

వనజ గారు తన అముద్రిత కథలను సంపుటిగా తీసుకురావాలనుకోవడం సాహసమైన నిర్ణయం. ప్రచురణ వేదికల రాజకీయాల వల్ల గ్రూప్ ల వల్ల తమ రచనలకు వేదిక లభించకపోవడం వల్ల రచయితలు నేరుగా కథాసంపుటాలు ప్రచురించుకోవాల్సివస్తుంది. అందులో కొంత నష్టం ఉన్నప్పటికీ ఈ పని సమంజసనీయమైంది అనిపిస్తుంది. ఈ కథా సంపుటిలో లో ఒక కథకు సహరచయితగా  నేను విశ్లేషణ వ్రాయాల్సిరావడం గౌరవంగా భావిస్తూ .. రచయితకు అభినందనలు తెలియజేస్తూ ... -శ్రీదేవి సోమంచి. 



3, జనవరి 2023, మంగళవారం

అనొద్దు


 అనొద్దు.. 

వీడ్కోలు తాత్కాలికం అయినప్పుడు

పర్లేదు, చెప్పకుండా వెళ్ళొచ్చు

నీ కోసం యెదురుచూపులు లేకపోయినా

రావద్దు అని అనుకోవద్దు

మళ్ళీ రా.. అని అస్సలు చెప్పను

వస్తావు కదా.. అని ఆశ వెలిబుచ్చను

కాలాన్ని విభజించే రేపగలు

నీవున్నావనే సత్యానికి సాక్ష్యాలు


మళ్ళీ కలుద్దాం అనే మాట కొందరికి 

కొన్నింటికి అసలు వర్తించదు. 

మరుగుజ్జు మాటలవి

అస్తిత్వరూపానికి అంతెత్తు రూపాలతో నిలిచిన వారికి

ఆ ముచ్చట యెలా చెప్పను.

ఓరి దేవుడా.. ఇంకా యీ మాట వారితో చెప్పాను కాదు

అదెంత హాస్యాస్పదం 😊