6, జనవరి 2023, శుక్రవారం

సంఖ్య కాదు డబ్బు కాదు -జీవితం

 శ్రీమతి వనజ తాతినేనిగారు పరిచయం అక్కర్లేని రచయిత్రి. పైకి సాధారణంగా కనిపించే జీవితాల పైపొరలు తొలగించి లోపలి మర్మాన్ని సమర్ధవంతంగా ముందుంచుతారు.  ప్రస్తుతపు కథ "రెండు లక్షలు". అది కేవలం ఒక సంఖ్య కాదు. అలాగే డబ్బు మాత్రమే కాదు. జీవితాలని నడిపించే చోదకశక్తి. అది పరిస్థితులని, మనుషులనీబట్టి మంచికీ చెడుకీ కూడా నడిపిస్తుంది.

భూషణం అసమర్ధుడు. డబ్బు లేదు. చిన్న రైతు. ఆస్తికి సరిపడా అప్పులున్నవాడు. అన్నిటినీమించి భార్యకి విలువ యివ్వనివాడు. ఈరోజుని సమాజంలో జరుగుతున్న పెళ్ళిళ్ళలో చాలావరకూ విలోమ వివాహాలంటే అతిశయోక్తి లేదు. ఏమీ చాతకాకపోయినా, పెత్తనం మాత్రం వదలని మగవారి చేతిలో స్త్రీ ఎలా వోడిపోతుందో కళ్ళకి కట్టినట్టు కనబడుతుంది. శారద భర్తకన్నా తెలివైనది. కష్టపడుతుంది. నీతిగా బతకాలనుకుంటుంది. తనకి చేతనైంతలో కొద్దోగొప్పో సంపాదించి అతనికి సాయపడుతుంది. అతనికి తాగుడికికూడా తనే ఇస్తుంది. అదంతా అతను గుర్తించని కష్టం. ఇంత చేసినా ఆమె మాట ఎక్కడా నెగ్గనివ్వడు. అతని తోబుట్టువులమధ్య ఆమెకి ఎలాంటి విలువా వుంచడు. ఒక స్త్రీ ఇంటికి ఆదాయవనరు అయికూడా పరాధీనగా ఎలా మారిపోతుందో  స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వాళ్ళ కూతురు వుమకి పెళ్ళి కుదుర్చుతాడు భూషణం. రెండులక్షల కట్నం. అదీ వెంటనే ఇవ్వక్కర్లేదు. పెళ్ళికూడా  శక్తి కొలదీ చేయచ్చు.  పెళ్ళికొడుకు ఫణీంద్ర. బాగా డబ్బు, దానికి సరిపడా దగుల్బాజీతనం వున్నవాడు. ఆడవారిమీద వ్యాపారం చేస్తాడు. ఎలాంటి విలువలూ, వావివరుసలూ వుండవు.  శారదకి అతనెలాంటివాడో తెలుసు. భర్తకి చెప్తుంది. సంబంధం వద్దని వారిస్తుంది. అతను వినడు. కూతురికి చెప్తుంది. చదువైతే మంచిసంబంధం తనే చూసి చేస్తానంటుంది. ఆమెకి అర్థమవదు. అర్థమవటానికి ఇద్దరు పిల్లలు పుట్టేంత సమయం, ఒక తప్పటడుగూ అవసరమౌతాయి.

ఇంట్లోవాళ్ళకి అంత గొప్పసంబంధం తమని వెతుక్కుంటూ రావటమే గొప్ప. పెళ్ళిరోజంతా దిగులుగా ఆలోచనలతోనే గడుపుతుంది శారద. అదేరోజు పొరపాట్న గంజిలో జారిపడి, కాలు విరిగి హాస్పిటల్లో పడుతుంది శారద. ఆమె లేకుండానే పెళ్ళి, అంపకాలు జరిగిపోతాయి. ఇంట్లోంచీ వచ్చేసి వేరే వుంటూ తన బతుకు తను బతుకుతుంటుంది. దానికి ఒక బలమైన కారణం వుంటుంది. దాన్ని కారణంగా ఎవరూ వప్పుకోరు. ఆఖరికి కూతురుకూడా.  

మిగిలింది రెండులక్షల కట్నం బాకీ. ఎటువంటి పరిస్థితుల్లోనూ దాన్ని తీర్చలేడు భూషణం. తను తీర్చాలని కష్టపడుతుంది శారద. అత్తని తన మార్గంలోకి రమ్మని ప్రోత్సహిస్తాడు ఫణీంద్ర. పక్కదారి పడుతుంది ఉమ. అది అవకాశంగా తీసుకుంటాడు ఫణీంద్ర. తన వ్యాపారంలోకి ఆమెనీ లాగాలనుకుంటాడు. ఆమె యింట్లోంచీ వెళ్ళిపోతుంది. ఆమెని వెతికే క్రమంలో శారద యింటికి వస్తాడు ఫణీంద్ర. ఆ సందర్భంగా అతనన్న మాటలద్వారా మనుషులకి జీవితంపట్ల గల రెండునాలుకల ధోరణిని  రచయిత్రి సమర్ధవంతగా చూపించి కథకి అందమైన ముగింపు ఇచ్చారు.  

వనజ గారు తన అముద్రిత కథలను సంపుటిగా తీసుకురావాలనుకోవడం సాహసమైన నిర్ణయం. ప్రచురణ వేదికల రాజకీయాల వల్ల గ్రూప్ ల వల్ల తమ రచనలకు వేదిక లభించకపోవడం వల్ల రచయితలు నేరుగా కథాసంపుటాలు ప్రచురించుకోవాల్సివస్తుంది. అందులో కొంత నష్టం ఉన్నప్పటికీ ఈ పని సమంజసనీయమైంది అనిపిస్తుంది. ఈ కథా సంపుటిలో లో ఒక కథకు సహరచయితగా  నేను విశ్లేషణ వ్రాయాల్సిరావడం గౌరవంగా భావిస్తూ .. రచయితకు అభినందనలు తెలియజేస్తూ ... -శ్రీదేవి సోమంచి. 



కామెంట్‌లు లేవు: