27, ఏప్రిల్ 2018, శుక్రవారం

ప్రేమకి బందీ

ఈ విశాల ప్రపంచంలో స్వేచ్ఛగా యెగిరే పక్షినవ్వాలనో, ఓ స్వచ్చమైన  సరస్సులో క్షణం కూడా ఖాళీ లేకుండా అల్లనల్లగా యీదులాడే వో చేపనవ్వాలని, పచ్చని తోటలో రంగుల సీతాకోక చిలకనవ్వాలని అలా పుట్టి వుంటే బాగుండేది కదా అని తలంపులు  యెన్నో యెన్నెన్నో లోలోపల. ఇవన్నీ కాకున్నా  ప్రవరుడిలా  దివ్య లేపనం  పూసుకుని హిమాలయాల్లోనూ , అందమైన కాశ్మీరంలోనూ తిరిగి వచ్చే లేపనం అయినా  పొంది వుండకూడదా అని వగచిన సందర్భాలు యెన్నెన్నో! కాళ్ళకి  చక్రాలు ధరించి రయ్యి రయ్యిమంటూ  భారత దేశమంతా  తిరగాలని  జీవ వైవిధ్యాన్ని రికార్డ్ చేయాలని, వీలైనన్ని సార్లు  హంసల దీవిలో సాగరసంగమం  వద్ద  పొద్దస్తమాను తిష్ఠ వేసుకుని అలల ఘోషని హృదయం పెట్టి వినాలని యిలా చాలా చాలా వున్నాయి.  చెప్పుకుంటే బాగోదని లోలోపల అనుకుంటాను కానీ యిలా చెప్పుకునే సందర్భం వస్తుందనుకోలేదు కానీ వచ్చింది మరి.


మనలో చాలామందికి ఈ నాగరిక జీవనం పట్ల, వొత్తిడితో కూడుకున్న జీవిత పట్ల వో విముఖత. వొక విధమైన నైరాశ్యం కూడా ! ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి,అనురక్తి వున్నవాళ్ళు అంత తొందరగా వైరాగ్య భావనలోకి వెళ్ళలేరు. ప్రకృతి ప్రేమికులు మాత్రమే అదీ వొక passion వున్నవాళ్ళు మాత్రమే ఆధునిక  సౌకర్యాలని, సౌకర్యవంతమైన జీవితాన్ని వొదిలి అలా అరణ్యాల అందాలని ఆస్వాదించాలి, యింకా యేదో కొంగ్రొత్తగా తెలుసుకోవాలనే ఆసక్తితో,జిజ్ఞాసతో  వారు అభిలషించిన మార్గంలో నడిచే సాహసం చేస్తారు. అలాంటి వారిలో ఫేస్ బుక్  ఫ్రెండ్  జయతీ  లోహితాక్షన్ జనబాహుళ్యంలో తక్కువగానూ అరణ్యాలలో (అనకూడదేమో ) అడవి సౌందర్యాన్ని చూస్తూ, అన్వేషిస్తూ అక్కడి అందాలని ఛాయాచిత్రాలుగా బంధించి అందరికీ చూపిస్తూ  అందర్నీ వూరిస్తున్నారు.నిజానికి ఆమె నాకు పరిచయమయ్యాక ఆమెలా జీవించాలని, లేదా ఆమెని అనుసరిస్తూ నడవాలని కోరిక నానాటికి వృద్ధి చెందుతుంది. కానీ అడుగు కూడా ముందుకు వేయలేని ఆసక్తురాలిని. ప్చ్ .. అందుకు ఒక కథ వుంది.


మనం యేవేవో అనుకుంటాం అందుకు యిల్లు మనకి అనుమతి యివ్వదు. ఇల్లు అంటే నా దృష్టిలో నాలుగు గోడలు, పై కప్పు నాలుగు గదులు యిది కాదు నా దృష్టిలో. ఇల్లంటే ప్రేమాభిమానాలు అనుబంధాలు ఆప్యాయతలు కొన్ని విమర్శలు, కొంత ఆధిపత్య భావజాలం, కొంత ఈర్ష్యలు, కొంత నిస్వార్ధ త్యాగాలు, సర్దుబాట్లు యివన్నీ కలగలిసిన మనుషులు. ఇంట్లో వాళ్ళు బయటకి వెళుతుంటే యెన్నో జాగ్రత్తలు చెపుతాము. బయటకి వెళ్ళిన మనిషి తిరిగి గూటికి చేరేదాకా గుమ్మానికి చూపులు వ్రేలాడదీసి వుంచుతాం. మరికొంత ఆత్రుత, లోలోపల యేవో భయాలు తారట్లాడుతుంటే గుమ్మందాటి రహదారి పైకి వచ్చి వీధి మలుపు దాకా దృష్టి సారిస్తాం కదా ! అలా ..నా కొడుకు నేను యెక్కడికైనా వెళతానని చెపితే అనేక జాగ్రత్తలు చెపుతాడు. ఈ మధ్య ... బంగారం, నేను  ఉత్తర భారత దేశం చూడటానికి వెళతాను, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది  వెళుతున్నారు, అన్ని యేర్పాట్లు బాగా చేసుకుంటున్నారు యిబ్బంది యేమీ వుండదులే అన్నాను కొంచెం అనుమానం గానే ! వెంటనే టపీమనే సమాధానం " వద్దు " అని.  నేను ముఖం చిన్నది చేసుకుని దిగులుగా "యే౦. యెందుకని ? " అన్నాను .


" ఇప్పుడెందుకమ్మా ! అక్కడ వర్షాలు ముందుగా కురుస్తాయి. కొండ చరియలు విరిగిపడటం, రోడ్లు పై వెళ్ళడానికి అడుగగునా అంతరాయం, బోలెడు ఇబ్బందులు. నేను వచ్చినప్పుడు అందరం కలిసి వెళదాం.. ఇప్పటికి వాయిదా వేసుకో " అన్నాడు .


ఓ భారమైన నిట్టూర్పుతో నాకు తెలుసు నువ్వు యిలా అంటావని, అసలు నీకు చెప్పకుండా ప్రయాణం ఖరారు చేసుకుని వెళ్లి వచ్చాక చెప్పాల్సింది అన్నాను. నువ్వేం అలా చేయవని నాకు తెలుసులే ..అని నవ్వు.


ఇక రెండో విషయం .. కార్ డ్రైవింగ్ నేర్చుకుని కూడా వొంటరిగా తీయడానికి అనేక ఆంక్షలు. నేను వచ్చినప్పుడు నువ్వు డ్రైవింగ్ యెంత బాగా చేస్తున్నావో చూసి అప్పుడు ఒకే చేస్తాను. అప్పడి దాకా డ్రైవర్ లేకుండా కార్ తీయోద్దమ్మా ..నువ్వు చాలా స్పీడ్ వెళతావ్, వెళ్లనని ప్రామిస్ చేయి అంటూ నా ఉత్సాహానికి బ్రేక్ వేసేసాడు.సరే ! అదలా అయిందా .. మళ్ళీ ఇంకో సంగతి.  ఉదయాన్నే చాలా బద్దకంగా వుంటుంది మళ్ళీ వాకింగ్ కి  వెళ్ళాలనిపిస్తుంది . మనకి ఒక కిలోమీటర్ దూరంలో వాకింగ్ ట్రాక్ వేసారు, అక్కడికి బండి మీద వెళ్లి అక్కడ వాకింగ్ చేస్తాను, మనకి తెలిసిన అక్క వాళ్ళు రోజూ నాలుగు కిలోమీటర్ల దూరంనుండి వస్తున్నారు అక్కడికి. ఆ యేరియా చాలా ప్రశాంతంగా వుంది నాకు బాగా నచ్చింది అని చెప్పాను . అందుకూ సమాధానం వద్దు అనే ! నాకైతే భలే  కోపం వచ్చేసింది. ప్రతి చోటుకి వెళ్లొద్దు,వెళ్లొద్దు అంటావ్ ..  అసలు నీ పెత్తనం యేమిటీ  నాపై అన్నాను కోపాన్ని ప్రకటిస్తూ ..


అబ్బాయి మాత్రం తన సహజమైన నెమ్మదైన గొంతుతో .. యిదిగో, యిలాంటి ఆవేశమే వద్దనేది. నేను యెందుకు వద్దంటున్నానో అర్ధం చేసుకోవాలి నువ్వు. మన ప్రక్క రోడ్లు పెద్దవి చేస్తున్నారు కదా !  ట్రాఫిక్ అంతా అస్తవ్యస్తంగా వుంది కదా ! మొన్న నువ్వే చెప్పావు పిన్ని వాళ్ళ వెనకింట్లో వుండే అతను రోడ్డు దాటి మన సందులోకి వస్తుంటే రోడ్డు పని చేసే టిప్పర్ గుద్దేసిందని. పనులు జరుగుతున్న రోడ్డు పై రోజూ బండి వేసుకుని వెళ్ళడం యెందుకమ్మా ... వాకింగ్ వద్దు యేమీ వద్దు. నాకుంది నువ్వొక్కదానివే అమ్మా ! నీకేమన్నా అయితే  నాకెవరు వున్నారు అన్నాడు.


నాకు కళ్ళ నిండా నీళ్ళు. ఈ అవధుల్లేని ప్రేమకి నిలువెల్లా తడిసిపోవడం తప్ప ..నేనింకేం మాట్లాడగలను. అంగుళం కూడా ముందుకి కదలలేను. ఈ అనుబంధాల వానలో తడుస్తుంటే యే విహార యాత్రలకో తీర్ధయాత్రలకో వెళ్ళాలని యెందుకు  అనిపిస్తుంది ?  రెక్కలు ముడుచుకున్న పక్షినై గూటిలోకి జేరి మౌనంగా .. నేను వూహించుకున్న అందమైన లోకాలని గూగుల్   ద్వారా విహంగ వీక్షణం చేస్తూ సంతోషంగా కాలం గడిపేస్తున్నా! నాలో కలిగే  ఆధ్యాత్మిక  భావనలను హృదయానుభూతితోనూ సందర్శనం చేసుకుంటూ   నా భ్రమణ కాంక్షకి తిలోదకాలిచ్చేసి ...  "బంగారం...మీ అమ్మ నీ ప్రేమకి బందీ కానిదెన్నడు, నీ ఆజ్ఞలకి లోబడనిదెన్నడూ " అనుకుంటాను.యెవరైనా అవధుల్లేని ప్రేమతో తన వారిని శాసించగలరు తప్ప .. వేరొక విధంగా కాదు. తమ వారి పట్ల ప్రేమ, భాద్యత వుంటేనే అలా ఆంక్షలు విధించగలరు కదా !  ఆఖరికి మా అబ్బాయి ఫినిషింగ్ టచ్ యెలా యిచ్చాడు అంటే .. నాకు ఇరవై యేళ్ళప్పుడు  సెకండ్ షో  సినిమాలకి వెళ్లొద్దు, జీరో అవర్స్ లో ఫ్రెండ్స్  చేసుకునే బర్త్ డే పార్టీలకి వెళ్లొద్దు  అంటే నేను నీ మాట వినలేదూ, అలాగే నువ్వు వినాలిప్పుడు " అంటే  లోలోపల మురిసిపోతూ నవ్వుకున్నాను. ఆ సందర్భాన్ని తలుచుకుంటూ యిప్పుడూ నవ్వుకుంటూ ..ఏ ప్రేమలైనా తల్లి బిడ్డల ప్రేమ బంధం ముందు తీసి కట్టే .. అని నా అభిప్రాయం.అమ్మని నాగురించి నా బిడ్డ చెబితే బాగుంటుందేమో ..కానీ నా వైపు నుండి ఈ ప్రేమ ప్రకటన ..

నా కడుపున పుట్టిన వాడు

నా కన్న తల్లై నన్ను హత్తుకుని నడిపించే వాడు

కాబట్టి ..26, ఏప్రిల్ 2018, గురువారం

కథని అర్ధం చేసుకోవడం ఎలా ?

1) కథ వ్రాసిన (వ్రాయబడిన అంటే గతంలో  చాలా ఏళ్ళ క్రితం జరిగిన విషయాలని జ్ఞాపకానికి తెచ్చుకుని వ్రాసిన  ) కాలాన్ని,ఆ నాటి సామాజిక, ఆర్ధిక, రాజకీయాలని దృష్టిలో ఉంచుకుని కథని చదవడానికి పూనుకోవాలి. 

2) కథల్లో నవరసాలలో దేనికో ఒక దానికి ప్రాధాన్యత ఉంటుంది. రచయిత కోణంలోనే పరకాయ ప్రవేశం చేసి  అర్ధం చేసుకోమని ఎవరూ చెప్పరు. పాఠకులు  తమ అభిరుచి మేరకే  తమకున్న  అవగాహన మేరకే కథని అర్ధం చేసుకుంటారు. అంటే పాఠకుల  ఆలోచన, వికాస పరిధిని బట్టీ ఆ సూక్ష్మ గ్రాహ్యత లభిస్తుంది. ఉదాహరణకి ప్రపంచ పోకడలు తెలియని  పల్లెటూరి  పాఠకులకి అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్టు ఉండాలి.  వారికి ఎక్కువ సమాజ రీతికి అనుగుణంగానే కథలుండాలి  అవే నచ్చుతాయి వారికి.  అదే పల్లెటూరులో ఉన్నా ఎక్కువ  చదువుకుని అనేక  పుస్తకాలు చదివి, లేదా వివిధ దేశాలు పర్యటించడం వల్ల  విస్తారమైన లోకజ్ఞానం ఉన్నవారికి వాస్తవ జీవితాల్లో ఉన్న సంక్లిష్టత తెలిసినవారికి కథ ఎలా ఉన్నా  అర్ధంచేసుకోగలరు. కథా వస్తువు విభిన్నంగా ఉండి (సాంఘిక నియమాలని దాటి నైతిక విలువలు లోపించి,నీతి బాహ్యమైన పనులు చేసే పాత్రలున్న కథలు  ) వ్యక్తి పరిధిని దాటి సమాజ (అనేక సమూహాల)  పరిధి లోకి వెళ్ళినప్పుడు వ్యక్తి సంస్కారం (సహానుభూతి చెందడం ) ఆ కథని చదవడంలో తప్పక అవసరం అవుతుంది. జీవితాన్ని వాస్తవిక కోణంలో అర్ధం చేసుకుని యధాతదంగా తీసుకునే వారి అవగాహనకి, అవి లోపించిన వారికి ఉన్న తేడా కూడా సంస్కారమే అనుకుంటాను నేను.

(ఉదాహరణ కి చలం గారి కథలు అందరికి నచ్చవు ఆకోణంలో ఆలోచించాలి ) (కొందరికి క్రైమ్,హార్రర్,శృంగార కథలు నచ్చవు) పాఠకులలో సాధారణ పాఠకులు, రచనలు చేసే పాఠకులు, విమర్శకులు అందరూ ఉంటారు. ఎవరి దృష్టి వారిది. ఎవరైనా కథ బాగోలేదని కితాబులివ్వలేదని బెంగ పడాల్సిన పనిలేదు. ఒక కథ మంచి కథో కాదో తెలియాలంటే కనీసం వో యాబై యేళ్ళు కాలానికి తట్టుకుని నిలబడితే ..అది మంచి కథ అవుతుందని కథల వుత్శవంలో పెద్దలు చెపితే విని .. సంతోషించాను. కాలమే కదా నిగ్గు తేల్చేది అని.

ఇకపోతే నేనూ పాఠకులకి అర్ధం కాని కథ వ్రాసానని "మొదటి మరణం " ప్రచురితమైనాక తెలిసింది. చాలామంది క్లారిటీ లోపించింది అన్నారు. మరికొందరు పాఠకులు బాగా అర్ధం చేసుకున్నారు. అప్పుడు నేను పెట్టిన కథ పేరుకి, కథా ప్రారంభానికి, ముగింపుకి సమన్వయం కుదిరిందని అనిపించింది. ఒక కథని ప్రచురించే ముందు ఆ పత్రిక ఎడిటర్స్ ఆ మాత్రం జాగ్రత్త తీసుకుంటారు కదా ! అందుకే కథలని అర్ధం చేసుకునేవాల్లకి అర్ధం చేసుకున్నంత. సహ బ్లాగర్ నేను వ్రాసిన కథపై .ఇలా స్పందించారు.. మంజు యనమదల (కబుర్లు కాకరకాయలు బ్లాగు )

కథను అర్దం చేసుకోవడమిలా అనిపిస్తుంది.ఈ రోజు మనం పత్రిక ఆదివారం సంచిక మకుటంలో ప్రచురితమైన వనజ గారి కథ “మొదటి మరణం” గురించి..
" మొదటి మరణం .. ఇదేంటి !? మొదటి మరణం రెండో మరణం చివరి మరణం అంటూ వుంటాయా? కథ టైటిల్ ఇలా వుందేమిటని ఆలోచిస్తూ వున్నాను. కథని మరొకసారి చదివాను. రెండు క్లూ లు దొరికాయి. హేమ వివాహం తర్వాత పేరు మారిన వసంత అని అన్పించింది. బట్టలుతికే లక్షయ్య కూడా వురి వేసుకున్న హేమ కాళ్ళు యెత్తి పట్టుకుని వూపిరి వున్నట్టా లేనట్టా అని కనీళ్ళతో చూస్తుంటాడు. ఇక ఆఖరిగా పెళ్ళి పోటోలు చూస్తున్న వసంత దగ్గరకొచ్చి కూర్చుని మీ పెళ్ళి ఫోటోలు చూసుకుంటున్నావా.. అంటాడు కొడుకు. చనిపోయిందేమో అనుకుంటున్న హేమే వసంత అని క్షణం సేపు రిలీఫ్ కల్గినా అంతలోనే బోలెడంత దిగులు చుట్టేసింది. నిత్య గాయాలతో రోజుకో మరణాన్ని, క్షణానికో మరణాన్ని అనుభవించే స్రీలకి మొదటి,రెండు,వందల మరణాలు వుంటాయని సూక్ష్మంగా  చెప్పారు  వనజ గారు. మంచి కథ. వ్రాస్తున్నకొద్దీ పదునుదేలుతున్న మీ కలానికి అభినందనలు. మీరు మరిన్ని కధలు వ్రాయాలని కోరుకుంటూ, స్తీ సమస్యలను చెప్పడానికి మీ ఆలోచనలు వెన్నుదన్నుగా వుండాలని కోరుకుంటూ అభినందనలు."
అని వ్రాసారు . 

కథని అర్ధం చేసుకున్న మంజు యనమదల గారికి  ధన్యవాదాలు.

ఈ టపా వుద్దేశ్యం కథ  అర్ధం కాని వారికి నా మనసులో మాట చెప్పుకున్నాను అంతే ! 

22, ఏప్రిల్ 2018, ఆదివారం

మొదటి మరణం


ఫోటో ఆల్బం చూస్తున్న వసంత ఒక్కసారిగా త్రుల్లిపడింది.
ఆరెంజ్ పింక్ కలనేత బెనారస్ పట్టు చీర మోచేతి  దాకా తొడిగిన జాకెట్ తో అలంకరించినది అరువు నగలతో అయినా సహజమైన అందంతో పెళ్ళి కూతురిగా మెరిసిపోతూన్న హేమ ఫోటోని అబ్బురంగా చేతితో తడుముతూ యెంత బాగుంది యీమె అనుకుంది. దుర్మార్గుడు చేతిలో పడి పదునెనిమిదో యేటనే  అఘాయిత్యం చేసుకుందీ పిల్ల. పువ్వులా వుండే పిల్ల జీవితం అట్టా ఆగమాగం అయిపోయిన రోజులని గమనం చేసుకుంటూ ముప్పై రెండేళ్ళ కాలాన్ని గిర్రున్న యెనక్కి తిప్పేసింది.   
 ************
ఆ ఇంట్లో పిల్లనిస్తే  సుఖపడుద్ది. పైగా చెల్లెలికి కూతుళ్ళు కూడా లేకపోయే,బాగా చూసుకుంటుంది కూడా  అని తీర్మానించేసి పదిమంది బంధువులు కలిసి చెల్లెలి౦టికి పోయి  పూట పూటా యిందు భోజనాలు చేస్తూ .. అబ్బో యేమి పంట యేమి పంట ? నాలుగరకల సేద్యం, ట్రాక్టర్ బండి,స్కూటర్, పైగా పిల్లగాడు  కృష్ణ మంచి చదువు చదివి టవున్ లో వుజ్జోగం కూడా చేస్తావుండే! బావ కాళ్ళు యేళ్ళు పట్టుకుని అయినా సరే సంబందానికి వొప్పించాల్సిందే అని నాలుగు దినాలుండి అడిగినాటికన్నిటికీ తలూపి సంబంధం ఖాయం జేసికోస్తిరి.
హేమా ! మంచి సంబంధం. ఆడపిల్లనిచ్చేచోట అన్నీ బాగా చూసుకోమని చెప్పారు పెద్దోళ్ళు. అదృష్టం కొద్దీ అట్టాంటి సంబంధమే దొరికింది. వాళ్ళు పిల్లని చూసుకోవడానికి వచ్చారు రా ..పోదాం రా  అని క్లాస్ లో కూచున్న హేమని  తీసుకొచ్చి వాళ్ళ ముందు కూచోబెట్టింది పెదనాయన కూతురు కుమారి. వాళ్ళు  హేమని పరీచ్చగా చూసి పిల్ల నచ్చింది,  మంచిది చూసి లగ్గాలు పెట్టుకుందాం అని చెప్పేసి పోయాక "నేను పెళ్ళి చేసుకోను, బాగా చదువుకొని డాక్టర్ నవ్వాలని కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుంటే అంత చదువులు చదివిచ్చే వోపిక వుందా, మీ నాయన అన్నీ అప్పులు చేసుకుని కూర్చుని వుండాడు. నీ యెనక యింకో పిల్ల వుంది. నువ్వు మొండికేసుకు కూర్చుంటే యెట్టా, మీ అమ్మని చూడు వొకతూరి అని మందలిచ్చింది కుమారి. తల్లి వొంక చూసింది, గుడ్ల నీళ్ళు గుడ్ల కుక్కుకుంటూ తనేపే చూస్తున్న తల్లి, రోజూ తాగొచ్చి గొడవజేసే తండ్రిని గుర్తుచేసుకుంటూ సరే మరి అంది ఉదాసీనంగా .
హేమకి పిల్లాడిని చూపించకుండా, చూసాక పిల్లకి నచ్చకుండా ఈ పెళ్ళి చేయడానికి ఈల్లేదు అని రెండో మేనమామ  ప్రయాణమవుతూ తేల్చి చెప్పాడు.పువ్వంత మెత్తగా వుండే మేనకోడలికి సరైన జోడీ కాదనిపించింది ఆయనకీ.
"మనందరం చూడలేదా, పిల్లాడికి యేమి తక్కువ. అత్త ముగ్గురు కొడుకుల్లోనూ మధ్యనోడే చక్కనోడు" అని రూడీగా చెపుతూ "పిన్నమ్మ పుట్టింటాళ్ళకి మనేపాళ్ళు  యే౦ చేసినా వొంకలు పెట్టడమే సరిపోయే " అనేసరికి  "సరే మరి, మీ ఇష్టం " అనేసింది గాబరాగా, గొడవలు యిష్టం లేక.
 పెళ్ళి జరిగి మణుగునుపులుకి తన వూరికి పొయ్యోచ్చాక పెదనాయన కూతురు జయక్క అడిగింది. ఆ అమ్మాయి యెక్కడు౦న్డింది అని. ఏ అమ్మాయక్కా అని అడిగింది అమాయకంగా . అప్పుడు పెద్దమ్మ వైపుకి చూసి ఈ అమ్మికి సంగతి చెప్పాలా అంది. చిన్నాయనకి పిన్నమ్మకే చెప్పినాము. ఇప్పుడు తెలిసాక మేమ్మాత్రం యే౦ చేయగలం? ఆ అమ్మి రాత యెట్టుంటే అట్టా తెలారుద్ది. పీటల మీదకి వొచ్చిన పెళ్ళి ఆగిపోయిందంటే యెంత నామర్దా మాకు అని ముక్కు చీదుకుని గుండెల్లో బాధ కప్పెట్టుకుని ముఖాన గింత నవ్వు పులుమ్కుని పెళ్ళి అయిన్దనిపిస్తిరి.
అమ్మా! మీ వరుస యేమీ బాగాలేదు.  అమ్మికి చెప్పకుండా ఎట్టా చేస్తిరి. పెళ్ళికి వచ్చినోళ్ళందరూ యితనికి బంగారంలాంటి పిల్లని ఎట్టా ఇస్తున్నారని చెవులు కొరుక్కుంటిరంట గదా ! నేనుంటే ఈ పెళ్ళి జరగనిచ్చేదాన్నే కాదు. ఆడపిల్లకాయల గొంతులు కోస్తన్నారు. అయినపొయినాళ్ళే ఇట్టా చేస్తే యెట్టబ్బా! అని వాళ్ళమ్మని కసురుకుంటూ "ఇదిగో హేమా మీ ఆయన పెళ్ళికి ముందే ఒకమ్మాయిని  లేవదీసుకుపోయి  ఆడేడో మునిపల్లెలో కాపురం పెట్టాడు. పెళ్ళి రేపనంగా కదా అతనిని  యెతికెతికి పట్టుకొచ్చింది. దానికి యిద్దరు బిడ్డలు కూడా వుండారు" అని చెప్పేసరికి పెళ్ళి పందిరికి వేసిన గుంజకి ఆనుకుని గుంజలా నిలబడిపోయింది హేమ.
 అమ్మానాయన   బిడ్డని పెళ్ళి పేరుతో  వూబిలోకి దించుతూ  విధిరాతని నెట్టేయడం యెనుక వున్న కారణమేందో యిట్టే గ్రహించేసింది.హేమకి పెళ్ళి కోసం బయలుదేరి వచ్చే రోజున జరిగిన సంగతి గమనం చేసుకోసాగింది. పెళ్ళికి రెండు  రోజులుందనంగానే హేమని తీసుకుని పెళ్ళి జరగబోతున్న వూరికి బయలు దేరారు. రైలు స్టేషన్ కి రిక్షా బండి  కట్టించుకుని వొస్తుంటే తండ్రికి బాకీ యిచ్చిన వడ్డీల వీరాస్వామి రిక్షా బండికి అడ్డం నిలుచుండి నా బాకీ తీరకుండా పిల్లకి పెళ్ళి ఎట్టా చేస్తారో చూస్తాను అని యాగీ చేసాడు.
వూళ్ళో పెద్దమనుషులు ఆడు ఆడి డబ్బులు పెట్టి చేస్తన్నాడా యే౦ది ? బంధువులాయన, పెళ్ళికొడుకు మేనమామ నా యింకో కూతురనుకుని మా యింటి ముందట ఆ నాలుగక్షింతలు వేయిస్తామంటే   పెళ్ళికి తరలి పోతున్నారు. ఇప్పుడిట్టా ఆపడం పద్దతి కాదు, ఆడి దగ్గర డబ్బే ఉంటే లగ్గాలు పెట్టుకున్న పెళ్ళి ఒకతూరి ఆగి పోయి వుండేదా ? మళ్ళీ సంవత్సరానికి కదేసిమెలేసి యెట్టాగొట్టా జరుగుతున్న పెళ్ళి, యిప్పుడైనా సక్రమంగా జరగనీయ్  అని నచ్చజెప్పపోయారు.
"అయ్యన్నీ నాకు తెలియదు. ఆయన భార్య పేరున వున్నవొకటిన్నర యెకరా కయ్యి నాకు బాకీ కింద జమ చేయిస్తానని హామీ యివ్వండి అప్పుడు పెళ్ళికి కదలనిస్తా అన్నాడు. పెళ్ళి అవగానే వచ్చీరావడంతోనే కయ్యి నీ పేరున రాసిస్తా. బిడ్డ పెళ్ళికి అడ్డం రాబాకయ్యా అని చేతులెత్తి దణ్ణం పెట్టింది రాజేశ్వరి. అంత  అగుమానం తట్టుకోలేక అందరి ముఖాలు నెత్తురు చుక్కలేకుండా తెల్లబడ్డాయి. అన్నట్టుగానే కూతురిని అల్లుడ్ని మూడు నిద్రలకి తీసుకెళ్ళిన మర్నాడే తాలూకాఫీసుకి పోయి వీరాస్వామి పేరున కయ్యి రాసిచ్చి వొచ్చి తెరిపిన పడింది.
    అత్తారింటికి వచ్చిన అల్లుడు కృష్ణ   అట్టా టౌన్ దాకా పోయి నా ఫ్రెండ్ ని కలిసి వొస్తా అని పోతుంటే తలూపింది హేమ. పోయే అల్లుడు కూతురి చేతి ఉంగరం అడిగి తీసుకుపోయాడని గమనించి నీ చేతి ఉంగరం యెందుకిచ్చావ్ అని తిట్టింది రాజేశ్వరి.  యియ్యకూడదని నాకేం తెలుసు అడిగాడు ఇచ్చేసా అంది హేమ. అట్టా పోయినల్లుడు మూడోనాటికి గానీ తిరిగి రాలేదు. కొత్తల్లుడుని చూద్దామని వచ్చినాల్లందరికి కొత్త ఉజ్జోగానికి ఇంటర్యూ ఉందంట. మెడ్రాస్ పోయినాడు అని చెప్పడం యెందుకో అర్ధమైపోయింది.  పుట్టింటాళ్ళు పెనిమిటి చేతులకి తొడిగిన  రెండు ఉంగరాలతో పాటు తన వుంగరం యేమై వుంటుందనే  సంగతి  గ్రహింపుకి వచ్చిందిపుడు హేమకి. పేరుకి మూడ్నిద్రలు జరిగాయి. కొత్త బిందె నిండా చలిపిండి పెట్టి హేమని అత్తారింటికి పంపిచ్చారు. పెళ్ళి అరుగు చూసి అత్తారింటికి పోవాలని చెబితే లగ్గం జరిగిన యింటికి వచ్చారు. తెల్లారే చెప్పా పెట్టకుండా హేమని అక్కడే వొదిలేసి ఇంటికి పోయాడు కృష్ణ. పెళ్ళికి ముందూ యెనకా జరిగిన సంగతులు గుర్తు తెచ్చుకుంటూ అట్టే నిలబడిన హేమ దగ్గరికి  అత్త  వొచ్చి యింటికి పిలుచుకుని పోయింది .
కొత్తకోడల్ని  చూసి పోయేదానికి వచ్చిన వాళ్ళ  గుసగుసలు  హేమ చెవిన పడతానే ఉండేయ్.
"నాగుబాములాంటి జడ, మప్పిదమైన పిల్ల. చూత్తేనే కడుపు నిండుద్ది. ఈ హెచ్చరకారికి ముంతలకొద్దీ తాగేతోడికి యెట్టా ఇచ్చారబ్బా”"ఆ నీల సంగతి తెలియదేమో,యెవురన్నా వుప్పందించకుండా  ఉంటారంటావా? వొదినా అని యింకొకరు."దగ్గిర బంధువులేనంట. అందుకే మరి బొక్క బోర్లా పడ్డారు బంగారంలాంటి పిల్ల గొంతు కోసేసినారు"
అంతగా ఆమెనిష్టపడినప్పుడు నన్నెందుకు చేసుకున్నావ్, ఆమెతోనే వుండొచ్చును కదా అని అడిగింది కృష్ణ ని .
"రంభని యెతుక్కుని యెతుక్కుని  తీసుకోస్తిరి. నువ్వుకూడా  నన్నే చేసుకుంటానని అన్నావంట కదా ! అంత యిష్టపడి చేసుకున్నప్పుడు నేను  యే౦చేసినా గమ్మున ఉండాలి, రచ్చలు రావెళ్ళు చేస్తే నా దగ్గర కుదరవు యిరగదీస్తా" అన్నాడు తర్జనగా వేలు చూపిస్తూ.
నాల్గు దినాలు జరిగాకా " మునిపల్లె పోయి రావాలి, మళ్ళీ వస్తానని జెప్పి ముఖం  చాటేసి వచ్చా. అది అక్కడ తినడానికి తిండి లేక యెన్ని అవస్థలు పడుతుందో, నీ చేతికి ఉన్న యింకో వుంగారం యియ్యి "అన్నాడు.
" నా దగ్గర లేదు. వస్తువలన్నీ తీసుకుని మీ అమ్మ బీరువాలో దాపెట్టింది"
రెండు రోజులు కాలుగాలిన పిల్లిలా తిరుగుతూ హేమపై కస్సు బుస్సులాడుతూ వుంటే జాలేసి  సూట్కేస్ లో  దాపెట్టుకున్న యెనిమిది వందలు తీసి యిచ్చింది. అత్తారింటికి పోయోస్తామని యింట్లో చెప్పి హేమ నొక్కదాన్నే  బస్ యెక్కించి నీల కాడికి పోయేదానికి  అటుపోయే రైలెక్కి నాక ఇటువచ్చే రైలు దిగింది ఆమె . మోజు తీరిందాకా వాడుకుని  అక్కడే వొదిలేసి వచ్చాడని అర్ధమయ్యి  వూరికి రావడానికి దారి ఖర్చులకి  కూడా లేకుంటే  మంచం కంచం అన్నీ అమ్ముకుని  వచ్చానని చెప్పుకుంటే యిరుగుపొరుగు కృష్ణ  పెళ్ళి చేసుకున్నాడని చెప్పి ఇక నీ బతుకు బస్టాండ్ లెక్కే నే అమ్మీ అని  యెగేసారు కూడా!  మద్దేనం పూట నీల  వొచ్చి    ఇంటి ముందరగా  వీధిలో నిలబడి  దుమ్మెత్తి పోస్తూ తిట్టి పోయిందని యింటి మాలతి చెప్పింది. మీ అత్త బయటకి కూడా రాలే, మీ ఆయన దాన్ని యేమన్నాడో తెలుసా ! నువ్వేమన్నా పత్తిత్తు ముండవంటే, పిల్లలు నాకే పుట్టారని గేరంటీ యే౦టి? వీధిలో రోలేసి పెట్టావు అందరూ పోటేసినట్టే నేను వొక పోటేసి పోయా " అన్నాడు. అది మీ ఆయన ముఖాన ఖాండ్రించి ఉమ్మేసి పోయింది" అని జరిగిన ఇషయాలన్నీ చెప్పింది.
  "నీల వొచ్చి తిట్టి పోయిందంట, నువ్వన్న  మాటలు కూడా యిన్నానులే, అసహ్యమేసింది" అంది హేమ.
"అది తిడితే నేను వూరుకుంటానేంటి, దాన్ని చంపి పారేయాలని దానింటికి వెళ్ళా. ముఖం మీద గోనె సంచి కప్పి వూపిరాడ కుండా చేసి చంపేద్దామనుకున్న, దానికి మెలుకువ వచ్చి కుదిరిచావల" అన్నాడు విసుగ్గా. అరికాళ్ళలో నుండి వొణుకు పుట్టుకొచ్చింది హేమకి. ఆడాళ్ళని హింస పెట్టకూడదు,వాళ్ళ ఉసురు తగులుద్ది,నీలని యేమి చేయబాకు ఆమె తిట్టిందంటే నీ తప్పు కూడా వుండబట్టే గా" అంది.  ఆ రాత్రంతా  పెద్దపులి  ప్రక్కన పడుకున్నట్టే వుండి చెమటలు పట్టుకొచ్చాయి.
 నాల్గున్నెల్లు  తిరిగొచ్చేసరికి  మొగుడు  యెట్టాంటాడో యెరికయింది హేమకి. అమ్మాయిలతో  సంబంధాలు కృష్ణ కి కొత్తేమి కాదు. ఇద్దరి బిడ్డల తల్లి నీల అయితేనేమి ఆమె కన్న ఒక బిడ్డకి తండ్రైతేనేమి ? అతన్ని చూడగానే రంగురంగుల పువ్వుల చుట్టూ జుయ్ మని  శబ్దం చేస్తూ తిరిగే తుమ్మెద గుర్తొస్తుంది.లచ్చిమి, కన్య, సంపూర్ణ, వసంత అందరూ పూలే.
దీపాల అమాస యెల్లినాక కూతురిని చూడటానికి వచ్చింది రాజేశ్వరి.  తల్లి కాడ తన గుండెల్లో  దాపెట్టుకున్న దుఃఖాన్ని యాష్టని బయటకి తోడిపోసింది  "మిమ్మల్ని పెళ్ళి చేయమని  నేనడిగానా, నా పాటికి నేను చదువుకుంటానే వుంటిని కదమ్మా! పోనీ మగపిల్లకాయలతో సావాసం జేసి ప్రేమా దోమా అని తిరుగుతూ మీకేమన్నా తలొ౦పులు తెచ్చానా ? గుండెల మీద కుంపటిని అనుకుని నిండా కాలే కొలిమిలోకి పారేసి పోయారు. ఇంతకన్నా పీక పిసికి చంపేయకపోయినారా"
బిడ్డమాటలకి తల్లి గుండె బ్రద్దలైపోయింది.తల్లీ అంటూ బిడ్డని కావిలిచ్చుకుని భోరున యేడిసేసింది. "నగలు పెట్టలేదని, రొక్కం యివ్వలేదని, పెళ్ళి చేయడానికి గతి లేదని యెన్నెన్నిమాటలు అంటా ఉండారో, మా అత్త కొడుకుని బయటకిపోనీయకుండా కాపలాలు కాసి రూమ్ కి బయట బీగాలు పెట్టి బలవంతంగా కాపరం చేయించాలని చూస్తది. రాత్రుళ్ళు బయటకి పోనీయలేదని చూడు నన్నెట్టా హింస పెడుతున్నాడో" అని తల్లికి చేతులు ముందుకి జాచి చూపెట్టింది. ముంజేతి బొమికలపై పచ్చగా నెత్తురు గూడు కట్టుకున్ననరాలు, గుండెలపై యెర్రగా నల్లగా కదుములు. హేమ అడిగే  ఒకో మాటకి  ఆమె అత్తకి  బాకులు గుచ్చినట్టు అనిపిస్తే తల్లి మాత్రం కదిలి కదిలి  కన్నీరైంది.
"ఏం వొదినా , అయినపోయినదానివని, బిడ్డని బాగా చూసుకుంటారని నీ యింటో బిడ్డని యిస్తే  ఇట్టా  చేయడానికి మనసెట్ట వొప్పుతుంది? యిస్తానంత కాకపోయినా అందులో సగమైనా రెండెకరాల కయ్యి అమ్మి పేరున రాసిస్తిమి గందా, ఏందో మీ తమ్ముడు నష్టాల పాలై బిడ్డకి నగానట్రా పెట్టలేకపోయినాం కానీ యిచ్చేయన్నీ యిస్తిమి కందా !అసలు  అన్నీ బాగుంటే పిల్లని మీకెందుకు యిచ్చేటోళ్ళం. బాగా సదివిచ్చి మంచి పిల్లగాడికి యిచ్చి వుండేవాల్లమి"   అంది ఉక్రోషంగా.
"బిడ్డలు మంచి వాళ్ళుగా ఉండేది తల్లిదండ్రి సేతుల్లోనూ, మొగుడు మంచోడు అనిపిచ్చుకునేది పెళ్ళాం సేతుల్లోనూ వుండే పనైతే యియన్నీ యె౦దుకుంటై మరదలా ! అన్నట్టు నీ నగలన్నీ మా తమ్ముడు  వుంచుకున్నవాళ్ళ వొంటిపై కులుకుతా వుంటాయని, రోజూ తాగొచ్చి రచ్చ చేస్తాడని మన బంధువులే చెబుతావుండారు , యింటికొకళ్ళు వుంటారు యిట్టాంటి వ్యసనపరులు. ఆడాళ్ళు రాత యింతే అని సర్దుకోవాలి, నువ్వు సర్దుకోవట్లా" మాటకి మాట వొప్పజెప్పి ఆడ నుంచి లెగిసిపోయింది.
 "చూసావా, గురువెంద నలుపు యెరగదు అన్నట్టు దెప్పిపొడిచింది. నేనడిగింది యేమిటి ఆమె అనింది యేమిటీ ? ఇంత అన్యాయంగా మాట్లాడే ఆడమనిషిని నేనేడా చూడలా "
"ఎన్ని బాధలైనా పడతాకానీ మొగుడితో గొడవపడి పుట్టింటికి రాను లేమ్మా, యెనకాల చెల్లెలు కూడా వుంది  పెళ్ళికి.చిన్నతనం నుండి నిను చూస్తూనే వుండానుగా,నీకుమల్లేనే వోర్సుకుంటాలే" అంది కన్నీళ్ళతో. పెళ్లైన ఆరుమాసాలకే కూతురు యింత యెదిగిపోయిందా పేరుతో సహా మారిపోయిందా  అన్నట్టు చూసి అసలు ఆడోళ్ళకి  మూడొంతులు కష్టాలన్నీపెళ్ళితోనే మొదలు గదా అనుకునింది మనసులో. ప్రయాణమై పోతూ అల్లుడితో "అమ్మి ని బాగా చూసుకోయ్యా" అని మాత్రమే అనగల్గింది.
బంధువుల యింటిలో పెళ్ళికని యింటో అందరూ బయలెల్లి పొతే కృష్ణ హేమ మాత్రం యింట్లో ఉండారు ఆరోజు. తెల్లారి మసక చీకటిలో  పాలు పిండుతూ ఉండగానే మొగుడు కాళ్ళు కడిగి ఇంటిలోనికి  వెళ్ళడం గమనించింది.చాకలోళ్ళ లక్ష్మయ్య  రావడం కనబడింది. దూడనిప్పి పాలబిందె తెచ్చి వరండా అరుగుమీద పెట్టి కాళ్లుచేతులు కడుక్కోవడానికి పంపుకాడికి పోయింది హేమ.  ఇంటో మైలు పెట్టెలో వున్న బట్టలెయ్యమ్మా! కరెంటు పోయ్యేలోపు అన్నీ వుతికేసి మోటార్ కాడ జాడిచ్చేయాలి. కరెంట్ గనక పొతే  పంపులో నీళ్ళు కొట్టి జాడించడం నా వల్ల కాదు.పెద్దామె ఒకో గుడ్డని మూడుసార్లు జాడిచ్చమంటది అనుకుంటూ  బాత్ రూమ్లో గుడ్డలు తెచ్చుకోను పోయాడు. హేమ లోనికి వచ్చి మంచం పై పడుకున్న భర్త దగ్గరగా వచ్చి 'కాఫీ యియ్యనా " అని అడిగింది. వూ అన్నాడు కళ్ళ మీదకి కప్పుకున్న దుప్పటిని తీయకుండానే.
కుంపటిపై పాలు పెట్టి మైలు పెట్టెలో వేసి ఉంచిన బట్టలన్నీ తీసి వేస్తూ జాగ్రత్తగా లెక్కపెట్టుకుంది.  వాటిని మడుచుకుంటూ  "యేమ్మా వొకేసారి మూడు కొత్తచీరలు యేసి పెట్టావు " యాడికైనా పోయినావా యేమిటీ అన్నాడు.  కొత్త చీరలేంటి అంది  హేమ అర్ధం కాక. అదేనమ్మా బాత్ రూమ్లో  తీగ మీద వేసి వుంచినావు గందా, ఆ చీరలు సంగతి అడుగుతుండా ! ఆటిని నన్ను వుతకమంటావా వద్దంటావా, మీరే వుతుక్కునే పనైతే మూటలో కట్టుకోకుండా ఆడనే పడేసి పోతా అన్నాడు. ఆ చీరలు ఇటు పట్రా, చూడనిదే నేను వుతుక్కునేయా నీకేసేయా అని  యెట్టా చెప్పేది అంది. ఇయిగో ఈ చీరలు అంటూ తీసుకొచ్చి కుంపటికి యివతలగా   హేమ ముందు పడేసాడు లక్ష్మయ్య. వాటిని చూడగానే మనసులో సవాలక్ష సందేహాలు పుట్టుకొచ్చాయి ఆమెకి.  ఏమి సమాధానం చెప్పాల్నో తోచక  ఈ కాఫీ తాగు, ఈ లోపు  దుప్పట్లు, దిండు గలీబులు తెచ్చి పడేస్తా అంటూ కాఫీ తీసుకుని లోపలికి పోయింది.
కాఫీ గ్లాస్ చేతికిచ్చి  "ఏం బావా ! చీరలు పట్టుకుపోతివి,మళ్ళీ వెనక్కి తెస్తివి, యేమైంది" అని అడిగింది.
ఆ అమ్మికి నచ్చలేదంట, ఈ సారి ఎప్పుడైనా కొత్త చీరలు తీసియ్యి  అనింది, అందుకే వెనక్కి తెచ్చేసా ! అన్నాడు.
అయ్యి కొత్త చీరలే గందా ! పెళ్ళికి కొన్న చీరలే ! అందులో వొక చీర యిప్పటికి కట్టలేదు కూడా '' అనంటూ తను కప్పుకున్న దుప్పటి దిండు గలీబు తీసుకెళ్ళి లక్ష్మయ్య కిచ్చి ఆ చీరలు కూడా ఉతికేయి పో  అన్జెప్పి కాఫీ గ్లాస్ తెచ్చుకుని భర్త ముందు కూర్చుని "ఇయ్యి ఇయ్యి అన్నావ్,  ఇయ్యకుంటే ఇచ్చే మనసు లేదని తుస్కారంగా మాటలు, తీరా ఇచ్చాక మళ్ళీ వెనక్కి తెచ్చావ్, యేమీ, ఆ దొరసానికి యీ కొత్త చీరలు అంత తీసిపారేసినవిగా కనబడినాయా? " అంది ఉక్రోషంగా.
 " పొద్దున్నే మొదలు పెట్టింది నస. ఇదొక రాణి, దీనికి  పుట్టింటోళ్ళు పెట్టిన  నాలుగు పెట్టెల కోకల్లోంచి దయతలచి ఇచ్చినట్టు కోతలు కోస్తా వుండావ్. మేము కొన్న చీరల్లో నుంచేగా నువ్విచ్చింది " వెటకారంగా అన్నాడు లేచి  వెళుతూ.  చప్పున  కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి హేమకి. "మీరు పెట్టిన చీరలని,నాకు నచ్చనివని  ఆమెకి ఆ చీరలు  ఇవ్వలేదు. నువ్వే  బీరువా తెరిచి  మడతల్లో పెట్టినవన్నీ కెలికి కావాల్సినవి యేరుకుని పోయావు, ఇంకెప్పుడూ  మా వాళ్ళనేమీ అనకు . అంతకు తిండికి గతిలేక నీకేమీ పిల్లనీయలా " అంది రోషంగా
"మరి మహా రోషగత్తె వయ్యే నువ్వు. నీల కూడా అంది  " నేను ఇడిసిపెట్టిన యెంగిలి మనిషికి ఆశ పడి వచ్చిన మనిషి నీ పెళ్ళాం.  యెంగిలి కూడు ఆమె తింటుందేమో కానీ ఆమె కట్టి  ఇడిసేసిన చీరలు నేను కట్టను  అని యిసిరికోట్టింది" అన్నాడు. పక్క దులిపేస్తున్న హేమ  చేతిలో దుప్పటి అలాగే జారిపోయింది.
అయిదు నిమిషాలు గడిచాక లక్ష్మయ్య వచ్చి అమ్మా ! సబ్బు అయిపొయింది,  మంచి సబ్బు ఇయ్యమ్మా కొత్త చీరల్నిండా బురద మరకలు కూడా ఉండాయి. అట్టాగే ఆ చేత్తో గంజి కూడా ఉడకపెట్టి ఉంచు. నేను బిన్నా పోవాలి అంటూ గుమ్మం ముందు నిలబడ్డాడు. లోపల్నుంచి సమాధానం లేదు. టప్ మని యేదో పడిన చప్పుడు యినబడి హేమమ్మా  పలకవేంటి తల్లీ ! అంటూ వరండాలోకి వెళ్లి హాలు లోపలికి తొంగి చూసాడు. తెరిచిన తలుపుల్లో నుంచి ప్యాన్ కి వేలాడుతున్న హేమ శరీరం కనబడి"ఓయమ్మో  బిడ్డ వురేసుకుంది" అని గట్టిగా అరిచి వీధిలోకి ఒక్క గెంతు గెంతి  "నాయుడోళ్ళ కోడలు ఉరేసుకుంది. చప్పున రండి" అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి హేమ రెండు కాళ్ళు పైకెత్తి పట్టుకుని  వూపిరి ఉన్నట్టా లేనట్టా  అని కన్నీళ్ళతో చూస్తూ నిలబడ్డాడు.
**************
అమ్మా !  పెళ్ళి ఫోటోలు చూసుకుంటున్నావా ? యేదీ నన్ను చూడనీ అని కొడుకు అంటుంటే ఉలికిపడి బయటపడింది వసంత. కుర్చీ జరుపుకుని తల్లి కెదురుగా కూర్చుని  తన భార్యతో చెపుతున్నాడు "మా అమ్మని జూడు పెళ్లప్పుడెంత బాగుందో ఓల్డ్ హీరోయిన్ లెక్క న." అని.

(మనం మకుటం ఆదివారం సంచికలో ప్రచురితం 22/04/2018)