30, ఏప్రిల్ 2011, శనివారం

నీవే లేని నేనట - నీరే లేని ఏరట

వేటూరి పాట వినని పూట..ఏదో ఒక వెలితి  వెంటాడుతున్నట్లే ఉంటుంది..
ఒకప్పుడైతే..ఆడియో షాప్ ల చుట్టూ తిరిగి ఇష్టమైన పాటల లిస్టు ఇచ్చి అపురూపమైన కలెక్షన్ తో గర్వంగా ఫీల్ అవుతూ.. పెద్ద సౌండ్ తో వింటూ..వినిపిస్తూ.. ఇంకా చెప్పాలంటే తిట్టించుకుంటూ  వింటూ ఉన్న ఆనందం..

ఇప్పుడు  ఒక నిమిషం లోపే ఏ  పాట కావాలంటే ఆ పాట వినే ఈ రోజుల్లో.. లేదండీ..! నిజం  నేను ఇప్పుడు అంతగా పాటలు వినే ప్రయత్నం చేయడం లేదు.

చాలా బాగుంది అనుకున్న పాట కూడా వినబుద్దికావడం లేదు. అయితే.. ఎందుకో వేటూరి పాట పై.. కూసింత మమకారం ఎక్కువ. వేటూరి పాటల పై.. పి.హెచ్ .డి  చేయాలని నాకు  కోరిక ఉండేది అండీ అనేదాన్ని.అది ఒక కల లెండి. చేయ్యాలనుకున్నవన్ని చేస్తామా ఏమిటీ !? ఎవరో.. జయంతి గారని చేసేసారులెండి.

తెలుగు సిని సాహిత్యం ఎంత విస్తృతమైనమైనది!!. అందులో.. వేటూరి గారి..కలం చిందించిన భావాలు,పద ప్రయోగాలు.. ఆ సాహిత్యాన్ని మధించి భావామృతాన్నిగ్రోలితే కానీ తెలియరాదు.

 వేటూరి గారి పాటల్లో.. నాకు "గ్యాంగ్ లీడర్ " చిత్రంలో.. అన్ని పాటలకన్నా.. "వయసు వయసు వరుసగున్నది వాటం.. తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం " అనే పాట అంటే చెవి కోసుకుంటాను.

లేడీ అమితాబ్ గా పేరు గాంచిన విజయశాంతి ఆ.. చిత్రంలో.. చిరంజీవి పై పడి పడి.. నటించింది అని చెప్పుకునేవాళ్ళు. ఆ చిత్రం తర్వాత ఆవిడ చిరంజీనితో.. కలసి నటించ లేదనుకుంటాను.. ఆ సంగతి వదిలేసి.. అసలు సంగతి పాట విషయంలోకి వద్దాం.ఈ   పాట సాహిత్యం అంటే నాకు చాలా ఇష్టం. అందమైన సాహిత్యం మనసుని అంతగా దోచేసింది మరి.


వేటూరి పాటల్లో.. అసలే మాస్ పాట అంటే.. పదాల  పండగే..కదా!! అందులో బప్పిలహరి స్వరాలూ.. మెగా.. స్టార్..డాన్సు ఓరియంటెడ్ మూసలో నుండి విజయశాంతి  బయట పడే ప్రయత్నం. వెరసి ఈ పాట  సాహిత్యం  టిపికల్ ఏం కాదు.. అందరికి అర్ధమయ్యే అలతి అలతి పదాలు.. సూపరో సూపర్..

అసలు వేటూరి పాటల్లో.. శృంగారరసం పాళ్ళు ఎక్కువ. ఈ పాటలో.. మరీ ఎక్కువ. "శృంగేరి చేత్ కవి కావ్యేజాతం రసమయం జగత్ "అంటాడు ఆనందవర్ధనుడు. శృంగారి  అంటే కాముకడని భావం కాదు. ప్రకృతి సౌందర్యాన్ని  రసిక చిత్తంతో  ఆరాదించ గల్గె చిత్త వృత్తి కలవాడే కవి...ఆ కవి వేటూరి.

గాఢమైన ప్రేమ ఉంటే సహృదయుడు .. సౌందర్య రస సాధనతో.. కూడిన ప్రేమ ఉంటే సత్కవి...ఈ..రెండు ఉన్నవాడు.. "వేటూరి".. అందుకే.. ఆయన పాటలో.. చిరంజీవి.     


ఇక ఈ పాటలో..
"ఉదయం చుంబన  సేవనం, మద్యాహ్నం కౌగిలి భోజనం,సాయంత్రం పుష్ప నివేదనం,రాతిరి వేళ మహా నైవేద్యం.. " అని చక్కిలగింతలు.. పెట్టారు..

ఇంకో చరణంలో.. తారా తారా సందునా ఆకాశాలే అందునా.. నీవే లేని నేనట, నీరే లేని ఏరట.. కాలాలన్ని కౌగిట.. మరెందుకాలస్యం.. నయమారా అంటారు.

వేటూరి పాట చిత్రీకరణ కళ్ళల్లో మెదలుతుంది.. ఇక నేను చెప్పను, చెవులారా.. వినండి. లీనమై అర్ధం చేసుకోండి.  "వేటూరి " రసమయ హృదయానికి హాట్సాఫ్  చెప్పండి.. వయసు  వయసు వినండి..  నచ్చితే మరీ మరీ.. వినండి..చూడండీ !

 
.

ఎంతో రసికుడు దేవుడు

వసంతం .. ఆ.. మాట  వింటేనే.. మొహం విప్పారుతుంది.. అనంత  సౌందర్యానికి.. వసంత ఋతువు ప్రతీక.శిశిరం మిగిల్చిన  మోడులపై..చివురులు మొలిచి.. మొగ్గలు తొడిగి.. తొలి పూత పూసిందా..? అవనికే కొత్త అందాలు.. అందరికి ఆనందాలు.. ప్రకృతి కాంత తనని తాను అలంకరించుకుంటుంది. అందుకేనేమో..! ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలో.. పదము కలిపితే అన్నన్ని లయలు..అని సిరివెన్నెల, ఎంతో రసికుడు దేవుడు.. ఎన్ని పూవులు ఎన్ని రంగులు ఎన్ని సొగసులిచ్చాడు..అంటూ.. మనసు కవి.. అ పూల రంగు నీ చీర చెంగు రాశాయి నాలో.. గీతాలు.. అంటూ.. పాటలకి.. ఊపిరి పోసి.. పూలు.. కవుల కల్పనలో..కలికితురాయి గా వన్నెకేక్కేయేమో!

  ఈ వసంతంలో.. ఎక్కడ చూసినా.. ముఖ్యంగా రహదారుల ప్రక్కన దారి పొడవునా... ఆకు కనపడకుండా.. ఎఱ్ఱగా, చైతన్యవంతంగా  అందరి మనసులని దోచేసే.. గుల్మొహర్,  అగ్నిపూలు, తురాయి పూలు,.(పేరు ఏదైతేనేమి? ) ఆకర్షణీయంగా కనబడతాయి. మా  చిన్నప్పుడు మైలవరం లో.. చదువుకోవడానికి ..దాదాపు ఆరు కిలోమీటర్లు ఆరుగురుము  కలసి గూడు రిక్షాలో.. (పన్నెండు సంవత్సరాలు) వెళ్ళిన కాలంలో.. ప్రతి ఏడాది.. దారి పొడవునా.. మాకు స్వాగతమిస్తూ.. మాకు యెనలేని సంతోషం కల్గించే.. ఆ.. పూల సౌందర్యం .. మా మదిపుటల్లో..  ఎఱ్ఱని.. ఎన్నటికి..మాయని జ్ఞాపకం. నాకు నలుపు తర్వాత ఎరుపు రంగంటే ఇష్టం కావడానికి అదే కారణం ఏమో! 

ఇంతకి.. నేను..ఎందుకు ఈ పూల గురించి చెపుతున్నానంటే.. ఈ రోజు బెంగళూర్  గురించి తలచుకోగానే మళ్ళీ  నాకు.. గుల్మొహర్ ..గుత్తులు గుత్తులు కళ్ళముందు కదలాడాయి.ఎంత అందమైన నగరం.నాలుగేళ్ల క్రిందటి వరకు.. ఆ నగరాన్ని సంవత్సరానికి నాలుగైదు సార్లు..గిరగిర  చుట్టేసేదాన్ని.. అప్పుడు అంతే.. రోడ్లన్నీ ఎక్కడ చూసినా  యెర్రని పూల తివాచి  పరచినట్లు ఉండేవి.. నడుచుకుంటూ వెళ్ళడానికి కూడా మనసు ఒప్పేది కాదు.

యద్దనపూడి సులోచనా రాణి గారి "అగ్నిపూలు" నవల చదివాను.. సినిమా చూసాను.. ఆ.. సినిమాలోనూ.. ఆ పూలు చూసాను..నా..  చిన్నప్పుడయితే.. చెట్లు ఎక్కి మరీ.. కొమ్మలు విరిచి.. ఆ..పూల మద్య ఉండే కొంకీల లాటి..వాటితో.. కోడి పందాల ఆటలు ఆడేవాళ్ళం. మా అబ్బాయి చిన్నప్పుడూ.. అంతే.. వాడితో..అలా ఆడటం.. ఆడటాన్ని వాడికి నేర్పించడం నాకు యమ సరదాగా ఉండేది. ఇప్పుడు మాత్రం ఆ చెట్లు అంతగా ఎక్కడా కనబడటం లేదు. రహదారుల విస్తరణ లో.. మొదలంటా నరికిన చెట్లు.. అక్కడక్కడా.. చైతన్యంని ఎవరు మాపగలరు అన్నట్లు..ఆ మోడులపైనే చివురించే..కొమ్మలు..వాటి మద్య  పూలగుత్తులు.. ఇది..నేటి సౌందర్యం.

ఎంత చైతన్యంఎరుపు  చైతన్యానికి ప్రతీక. అలాగే..కవయిత్రి "మహజబీన్" కూడా.. తన కవితలో.. గుల్మొహర్ లు   గురించి.. ప్రస్తావించినట్లు గుర్తు. ఆమె.. "ఆకురాలుకాలం"...కవితా సంకలనం నా.. ఆలోచనలపై.. బలమైన ముద్ర..
అందులో..గుల్మొహర్ ఒకటి  ఇలా చెప్పుకుంటూపోతే.. ఎంతని చెప్పను.. యెర్రని,పచ్చని,  రంగులెన్నో! కానీ..యెర్రని  గుల్మొహారుల అందాలు.. అరుణారుణ భావ మందారాలు.. మట్టి ఒకటే! ఆ మట్టిలో..పెరిగిన మొక్కలకి.. చెట్లకి పూసే పూల రంగులు..వేరు వేరు. ఆ రంగులే..మనలోని  భావాలకి ప్రతీకలు. ఓహ్...ఎంత  శోభానమయం. అనంత శోభానమయమైన..ఈ ప్రకృతి ఒడిలో.. సేదతీరడం..నిత్యం ..ఓ.. నూతన ఉత్తేజం...


          
ఇకపొతే అక్కడక్కడా కనిపించే పలాస (మోదుగు) పుష్పాలు

నా అభిమాన రచయిత "దాశరధి కృష్ణమాచార్య "  ..వారి.. "అగ్నిధార"   కావ్యానికి స్పూర్తి మోదుగ పూలేనట...

    నా చెవులలోన   రుధిర వీణాకటోర
    ఘోర ఝుంకార మేళ డాగుకొన జూచే
    వో.?నిశాహిమానీ తరుణీ నితంబ
    లంబి వేణిక నగ్ని పుష్పంబు లేలనో!
  
అని దాశరధి.. ఆత్మావలోకనం చేసుకున్నారు ..ఆయన కావ్యాలలో.. ఎక్కడ చూసినా పలాస పుష్పాల ప్రస్తావన ఉంటుంది.  ఇది ఎర్రెర్రని పూల అందం .. 
   

27, ఏప్రిల్ 2011, బుధవారం

దిగులు మేఘం ఈ "అమ్మలేఖ"

మనలో చాలా మంది ఉత్తరాలు వ్రాసి  చాలా కాలం అయి  ఉంటుంది.  ఉత్తరం అంటేనే భావాల మూట. ఆ మూట విప్పగానే ఆత్మీయ పరిమళం మనలని చుట్టేస్తుంది. ఒక ఉత్తరం వ్రాసే ఓపిక, తీరిక రెండు ఉండటం లేదు. ఫోన్ ల పుణ్యమా అని వ్రాయటానికి నిమిషం పట్టే విషయాన్ని  అర నిమిషంలో మాట్లాడేసి  హమ్మయ్య! ఒక పని అయిపోయిందనుకోవడం అలవాటయిపోయింది...కదా!?

                             "చినుకు" మాసపత్రికలో ఆఖరి పేజీ లో.. ప్రియతమ్ అమృత కి వ్రాసే ఉత్తరం చూస్తే నేను వెంటనే అర్జెంట్ గా  ఒక ఉత్తరం వ్రాయాలనిపిస్తుంది అనుకుంటాను.. కానీ ఆచరణ శూన్యం.

                               ఈ రోజు ఫోటో ఆల్బుం చూస్తుంటే నా కొడుకు తనకి అప్పుడు అయిదేళ్ళు అనుకుంటాను.. ఇన్లాండ్- కార్డు  పై నాకు వ్రాసిన ఉత్తరం చూసాను.. కళ్ళమ్మట గిర్రున నీళ్ళు తిరిగాయి.. అప్పుడు "అమ్మ" కోసం వాడు దిగులుగా  వ్రాసిన ఉత్తరం అది.. నేను ఆ ఉత్తరాన్ని భద్రంగా దాచాను ఇప్పుడు  ఆ ఉత్తరాన్ని  మళ్లి  మళ్ళీ చదువుతుంటే నాకు ఆ దిగులు తెలుస్తుంది. వెంటనే.. నా కొడుకుకి ఒక ఉత్తరం వ్రాస్తున్నాను.. ఇలా బ్లాగ్ ముఖంగా.. మనసుని తడిమే ఓ.. దిగులు మేఘం ఈ అమ్మ లేఖ.
                                         
                         చిన్ని..! నాన్నా!!  బంగారం..ఎలా ఉన్నావు ? నీతో.. మాట్లాడి ఒక వారం రోజులైంది  చూసి ఒక నెల రోజులపైనే అయింది..ఇరవైనాలుగు గంటలు నీ గురించే ఆలోచిస్తూ దిగులు పడుతూ నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను.. నాన్నా!నీకు తీరిక లేక టచ్ లోకి రావడం లేదని అర్ధం అవుతూ ఉంది. నాన్నా .. నీవు ఎలా ఉన్నావ్?నాలుగైదు రోజుల క్రితం మన "కైలాష్" తన బైక్ ని   మన ఇంటి ముందు గేటు పక్కనపార్క్ చేసుకుని  ప్రక్కన ఉన్న దియేటర్ లో.. 'మిస్టర్ ఫర్పెక్ట్ " సినిమాకి వెళ్లి తిరిగి వెళ్ళేటప్పుడు చూసాను. హటాత్తుగా నువ్వే ననుకున్నాను కానీ వెంటనే నాకు కదా ! నువ్వు కళ్ళల్లో మెదిలావు ఏడుపు వచ్చేసి లొపలకి వచ్చేసాను.ఇదంతా నీకు చెప్పకూడదనే అనుకుంటాను..కానీ.. చెప్పకుండా ఉండలేను. మీ.. "నాన్నగారు'' కాల్ చేసి అడిగారు.. చిన్నిని చూసావా? ఎలా ఉన్నాడు, బాగున్నాడా? అని.. నేను అబద్దం చెప్పాను. చూసాను.. బాగానే ఉన్నాడులే! అన్నాను. నాన్నా! ఎలా ఉన్నావు బంగారం..?

                   నీకు  ఒక సంతోషకరమైన వార్త. కుండీలో నువ్వు నాటిన చిట్టి గులాబీ మొక్కకి తెగ పూలు పూస్తున్నాయి.. నిన్ను అడగకుండా కోసి దేవుడి పాదాల దగ్గర  కూడా పెట్టను కదా.!నీ అనుమతి కావాలి.. నాన్నా! పూలు కోయడం నీకు ఇష్టం ఉండదు కదా! పువ్వు లాంటి సున్నితమైన మనసుతో.. క్రొత్త చోటున దేశం కాని దేశంలో కొత్త వారితో ఎలా కలసి ఉంటున్నావో? అని ఒకటే దిగులు.సిటీ లోకి వెళుతూ మీ కాలేజి ప్రక్కనే బండి ఆపుకుని గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్న మీ కాలేజ్ మేట్స్ లో నిన్ను చూసుకుంటాను. బంగారం.. గ్రౌండ్ లోకి  బాటింగ్ కి  దిగితే అర్ధ శతకం అయినా  చేయకుండావెనుదిరగని  నీ  బాట్.. ఝుళుపించుని అక్కడ  వెతుకుతాను. నీ తరువాత నీ స్నేహితులు కొనసాగింపుగా ఇంటర్ యునివెర్సిటీ విజేతగా మీ వి ఆర్ ఎస్ సి ని నిలుపుతున్నారు టీం కెప్టన్ గా..ఎన్ని విజయాలు సాధించి ఇచ్చావు.  నేను.. ఇవన్నీ.. ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే.. ఆట అయినా.. జీవితం అయినా ఆది గెలవాలి నాన్నా! ఓడినా సరే.. మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయాలి. నీకు.. "ఫీనిక్స్" కధ చెప్పేదాన్ని .. కదా! గుర్తు తెచ్చుకో.. నీ పోరాటం ఇప్పుడు బ్రతుకు పోరాటం.ఉన్నత విద్య + కష్టించి పని చేయడం,పరిస్థితులకి అనుగుణంగా నడుచుకోవడం . ఇవన్నీ.. నీకు చాలెంజ్  అన్నమాట. నీకు నీవే నిర్ణయాలు తీసుకోవడం,ఆటుపోట్లు ఎదుర్కోవడం నేర్చుకోవాలి. అవన్నీ నేర్చుకోవాలవే నా తాపత్రయం కూడా.

                   అమ్మా! ఇప్పటికిప్పుడు ఇండియా వచ్చేసి క్రికెట్ ఆడుకోవాలనిపిస్తుందంటే నేను ఎంత నవ్వుకున్నానో తెలుసా? ఇరవై రెండేళ్ళు వచ్చినా  ఇంకా చైల్దిష్ మెంటాలిటీ,అంతే బోల్డ్ నెస్. మనిషికి అంతరంగాన్నివెలిబుచ్చే స్వేచ్చ ఉండాలి.అది నా దగ్గర నీకు ఎప్పుడూ ఉండాలి,ఉంటుంది కూడా.నీ మనసులో మాట ఏదయినా నీ ఇబ్బంది ఏదైనా చెప్పు బంగారం. నీకు నేను ఏమైనా హెల్ప్ చేయగలనేమో.. చూద్దాం. ఎప్పుడూ  మెయిల్స్ పెట్టే అమ్మ ఈ రోజు ఇంత పెద్ద ఉత్తరం వ్రాస్తుంది. చదివే తీరిక ఎక్కడ అని ప్రక్కన పడేయడానికి ఇదేం పేపర్ కాదు కదా! ఇల్లు గుర్తుకొచ్చినప్పుడు అమ్మ   గుర్తుకొచ్చినప్పుడయినా.. నిద్ర రానప్పుడయినా చదువుకుంటావు కదా బంగారం. అందుకే.. ఈ.. వ్రాయడం అన్నమాట.

                                       మా అమ్మ అంటే.. నాలుగు రోజుల తర్వాత డబ్బు ఇచ్చే   ఏ.టి.ఏం ..అనుకోవడం లోనే ఉన్నావా? నువ్వు అడిగితే నేను ఎప్పుడు ఇవ్వడానికి సిద్ధం నాన్నా! నేను డబ్బు పంపుతానంటే వద్దని అన్నావంటే.. నువ్వు ఆలోచించడం నేర్చుకున్నావని  సంతోషమేసింది. ఎప్పుడైనా..  అత్యవసరం పనులకి తప్ప మిగతా అప్పుడు నువ్వు ఏమడిగినా  నాలుగు రోజులపాటు కావాలని    ఆలస్యం ఎందుకు చేసేదాన్నో.. తెలుసా? అవసరానికి-అనవసరానికి తేడా.. తెలుస్తుందని. ఇప్పుడు.. నీకు నీ మంచి-చెడు చూడటానికి నీకు దగ్గరలో లేను కదా.. బంగారం! అందుకే  ఈ.. దిగులు.. బిడ్డకి  ఎప్పుడు ఏ అవసరం కల్గినా  తల్లి తీర్చాలనే అనుకుంటుంది.

                               అప్పుడప్పుడు  నిన్ను నా ప్రక్కన పడుకోపెట్టుకుని నువ్వు ఆసక్తిగా వినే నీ చిన్నప్పటి విషయాలతో  పాటు ఎన్నో మంచి మాటలు  చెప్పాలనుకున్నాను కానీ ఎప్పుడు పని ఒత్తిడిలోనేను. నీ గదిలో నువ్వు.అందుకే.. ఇప్పుడు రోజు ఇలా.. చెప్పాలనుకుంటున్నాను. నువ్వు దూరంగా ఉండటం వల్ల  అనుక్షణం జాగ్రత్తలు చెప్పి విసిగించనులే! జాగ్రత్త అంటే.. గుర్తుకు వచ్చింది..  నేను ఇప్పుడు వెహికల్ ని ఏమంత స్పీడ్ గా నడపడం లేదులే! దిగులు వద్దు.. బంగారం. నేను స్పీడ్ గా వెళ్ళేటప్పుడల్లా.. నువ్వు నా వెనుక ఉండి.. నా భుజం పై చేయ్యిసి..నొక్కి పెట్టి  "అమ్మా! స్లో..గా వెళ్ళు" అని కంట్రోల్ చేస్తున్నట్లే ఉంటుంది.నేను అప్పుడు స్పీడ్ ఎందుకు వెళ్ళే దాన్నో  తెలుసా!  నువ్వు నా వెనుక ఉన్నావనే  ధైర్యం.. అంతే..! ఇప్పుడు నేనసలు ఎక్కువ బండి తీయడం లేదు నాన్నా! మన విజయవాడ లో మెట్రో సర్వీస్ ల పని తీరు బాగుంది..బస్సు ప్రయాణం చేస్తున్నాను. నువ్వు డ్రైవింగ్ లో జాగ్రత్త బంగారం.

                 అన్నట్లు.. నీకిష్టమైన "బెండకాయ ఫ్రై" చేసుకోవడం కుదురుతుందా! కాఫీ.. తాగుతున్నావా? డెబ్బయి రూపాయలని లెక్క వేసుకుంటున్నావా? నాన్నా! నువ్వు వెళ్ళిన తర్వాత.. ఒకే ఒకసారి బెండకాయ  ఫ్రై చేసాను. నువ్వు తినకకుండా  తినలేక  పోయాను.మళ్ళీ .. ఇంతవరకు  ఆ కూర చేయ్యనేలేదు బంగారం.  నువ్వు దూరంగా ఉంటె  మన ఇంట్లో అక్వేరియం లో.. రంగు రంగుల జల పుష్పాలని,  బుజ్జి బుజ్జి కుక్కపిల్లలని,  మన ఇంటి ఎదురుగా బేబి ఆంటీ వాళ్ల గన్నేరు చెట్టు పై వ్రాలె సీతాకోక చిలుకలను చూసి సంతోషించే నీ అందమైన స్వచ్చమైన  పసి పిల్లల మనసు..నేను.. ఎవరిలో..చూడను? ఈ రోజు వాకింగ్ కి వెళ్ళినప్పుడు రెండు బుజ్జి కుక్కపిల్లలని చూసినప్పుడు మన "వాఘ్య"గుర్తుకు వచ్చింది. నా అశ్రద్ధ,అతి శుభ్రం గుర్తుకు వచ్చి.. సిగ్గుపడ్డాను. అందువల్లనేగా మన "వాఘ్య"  చనిపోయింది. అప్పుడు నువ్వు ఎంత ఎడ్చావో గుర్తుకు వచ్చింది.సారీ ..బంగారం!

                        ఈ ఉత్తరం వ్రాసి విసిగిస్తున్నానా! నేను ఎప్పుడూ ఏమనే దాన్నోగుర్తుందా.. ? నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు నాకు తెలుగులో నే ఉత్తరం వ్రాయాలి లేకపోతే నేను ఊరుకోను అనేదాన్ని. తెలుగుని అశ్రద్ధ చేయకు బంగారం.మన మాతృ బాషని తక్కువ చేయకండి. వెంటనే మెయిల్ ద్వారా ఒక ఉత్తరం వ్రాయి బంగారం. అమ్మకి నీ క్షేమం వ్రాస్తూ ఆ వ్ర్రాతలోమన మాతృబాషని ఒకసారి గుర్తుకు తెచ్చుకో. చాలా విషయాలు చెప్పాలి.రోజు రోజు  కొంచెం కొంచెం చెబుతాను, సరేనా.. బంగారం ! ఇందాకటి నా దిగులు తగ్గిందిలే! ఇలా.. అయినా  మనసారా నీతో.. సంభాషించినందుకనుకుంటా!  ఇక ఉంటాను మరి.

                                                                                                    ఇట్లు.. ప్రేమతో, దీవెనలతో
                                                                                                              మీ అమ్మ.   

22, ఏప్రిల్ 2011, శుక్రవారం

ఆంధీ..

                                                                                                                                                                                                                            
        ఆంధీ

యవ్వనపు పుటపై 
తొలి వలపు సంతకం నీది
ఏ సుడి గాలి తాకిడికో
ఆకస్మికంగా దూరంగా
విసిరివేయబడిన కొన్నేళ్ళకి
నీ జ్ఞాపకాల సాంద్రత,గాడత
తగ్గుతున్న తరుణాన
గాలి దుమారంలా
నీ పునరాగమనం
నన్ను చుట్టేస్తుంది.

తలుపుకావల నీవు
ఈవల నేను నిలబడే ఉంటాం
పరిచితులమైన అపరిచితుల్లా..
కొత్తగా కనపడ్డ చూపులో
పాత భావాలు వెతుక్కుంటూ..
వెన్నెల తూట్ల చూపులతో
ఎదబీటిపై చివురులు మోలిపిస్తూ
మౌన బాషతో ఊసులాడుతూ..
రేపు మాపులని కలిపి ఉంచే
సంధ్య సందిట.. పూచే..
కొత్త - పాత రేడువైతే
నా భ్రమణం నీచుట్టూనే..

స్థాన భ్రంశాలు మనకి చేతకాక  ఏమో
నిట్టూర్పుతో నేను లోపలి గదిలోకి
ముడుచుకుంటూ వెళుతుంటే
నా అందెల సవ్వడిని గుండె జేబులో
పదిలపర్చుకుని వెనుతిరుగుతావు
వెనక్కి వెనక్కి చూసుకుంటూ
పెరిగిన ఎడద బరువుని మోసుకుంటూ..
నీవు వెళ్ళే దృశ్యాన్నిశూన్యమైన
గుండె గావాక్షంలో నుండి
భావ రహితంగా చూస్తుంటాను.          

కాలం కాగితాన్ని ఉండచుట్టి విసిరిపడేసి
కొత్త పుటపై నీ ఎడబాటుని అక్షరీకరిస్తే..
కావ్యాలు చిన్నపోతున్నాయి
గ్రంధస్తమైన నా జ్ఞాపకాల పుటలలో
రోజు ..ఓ..సరికొత్త జ్ఞాపకం
నిదురలేస్తుంది గాలి దుమారంలా..

ఎన్నటికి కలవని రెండు తీరాలని
ఎప్పుడు కలిపి ఉంచే నీటిలా..
నిన్ను నన్ను కలిపే జ్ఞాపకం..
ఓ.. ప్రేమ పరిమళం..

17, ఏప్రిల్ 2011, ఆదివారం

ఈ అమ్మలకి ఏం పని లేదు


ఎంతో మంది పిల్లలు ఉన్నత చదువుల పేరిట ,ఉద్యోగాల పేరిట ఇంటికి దూరంగా ఉన్నప్పుడు.. కమ్యునికేషన్  లేనప్పుడు కలిగే ఆదుర్దా ఎలా ఉంటుందో..నేను స్వయంగా అనుభవిస్తూ..చెబుతున్న పోస్ట్ ఇది. అమ్మలకి ..ఓ..మాటగా.. ఈ పోస్ట్  చదివిన పిల్లలకి  ఓ.. సూచనగా..ఈ ..మాట.

తల్లిదండ్రులకి..పిల్లలకి మద్య దూరం ఉంటె అక్కడ నిత్యం మాట ఒక వారధి. ఆ వారధి కట్టకుంటే అమ్మలకి..మనసంతా గుబులు. బిడ్డ తిన్నాడా..?సరిగా నిద్ర పోతున్నాడా..? కాలేజ్ కి సరిగ్గా వెళుతున్నాడా!? మంచి స్నేహితులేనా? ఇంకా అమాయకంగా మోసపోతున్నడా? ఇలా ఆలోచనల రైళ్ళు  గుండెల్లో పరుగులేడతాయి.

ఈ అమ్మలకి ఏం పని లేదు..బిడ్డలు  ఏడిస్తే ఏడుస్తారు నవ్వితే నవ్వుతారు. అనుక్షణం వారి  గురించే ఆలోచిస్తారు. టన్నులు కొద్ది  పుస్తకాలని చదివి రుబ్బేసి జ్ఞానాన్ని పిండుకుని మెదడులో స్టోర్ చేసుకుని ఉద్యోగాల వేటలో, లేదా ఉన్నత చదువుల  కోసం దూరంగా వెళ్ళేసి వారి వారి పనులతోనో, స్నేహితులతోనో గడుపుతూ ఇంటిని మరచిపోతారు అంత మాత్రాన పెద్ద వాళ్ళు ఓ..హైరానా పడిపోయి ఫోనులు మీద ఫోనులు చేసేయడం.. దిగులు పడుతూ.. కూర్చవడం ఏమన్నా బాగుంటుందా! మొన్న మొన్నటి దాకా అమ్మ-నాన్న కనుసన్నలలోనే ఉన్నారు కదా! వెంటబడి వెంటబడి మరీ జాగ్రత్తలు చెప్పే వాళ్ళం కదా! ఇప్పుడు చెప్పేవాళ్ళు లేక వాళ్ళు తప్పటడుగులు వేస్తారేమో!? అయినా.. వాళ్ళు చిన్న పిల్లలా ఏమిటి?విచక్షణతో,వివేకం తో.. మెలగడం నేర్చుకోవాలి  కదా! ముఖ్యంగా పని విలువ,శ్రమ విలువ,డబ్బు విలువ అన్ని తెలుసుకుంటున్నారు. దిగులు ఎందుకు చెప్పండీ? 


అన్ని అమర్చిపెడితే ..లైట్ గా తీసుకున్నవాళ్లకి అమ్మ-నాన్న విలువ, మంచి-చెడు విలువ బాగా తెలియాలి కదా!తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉంటుందో..అనుబంధాల విలువ ఎంత గొప్పవో..వాళ్ళు కోల్పోతున్నది ఏమిటో తెలుసుకోవాలి కదా! అలా తెలుసుకున్నప్పుడు..అయినా అమ్మ-నాన్న గుర్తుకు రాకుండా ఎలా ఉంటారు?
 పిల్లలు తమ వాళ్ళతో..ప్రేమగా మాట్లాడాలి. మొక్కుబడిగా మాట్లాడకూడదు. వాళ్ళని దూరంగా ఉన్నప్పుడు మనతో మాట్లాడటం అన్నదానిని ఒక డ్యూటీగా చేయమని ఆజ్ఞాపించకూడదు. వాళ్ళు ఎప్పుడు మిస్ అవుతున్నారు అనుకుంటారో అప్పుడు కాల్ చేసి మాట్లాడితే కలిగే ఆనందాన్నివాళ్లకి మనం దూరం చేస్తున్నాం.కొత్త చోటు, కొత్త అలవాట్లు, కొత్త ఆహార పద్దతులు..వీటన్నిటి మద్య నిరంతర ఒత్తిడి కల్గిన జీవన పోరాటంలో.. బిడ్డలు అలసిపోతున్నారు.వాళ్ళని తల్లితండ్రులు అర్ధం చేసుకోవాలి. మీ బిడ్డలకి ఒక ఉత్తరం వ్రాయండి. అది చదివి  మీకు ఆన్సర్ ఫోన్  కాల్ తో అయినారాలేదంటే అప్పుడు ఆదుర్దా పదండి తప్పు లేదు. వాళ్ళని కొత్త కోణంలో ప్రపంచాన్ని చూడ నివ్వండి.

ఇంకా  ఇంకా బాగా చదివేసి ఉద్యోగాలు చేసేసి  కాసుల వర్షం లో.. మిమ్మల్ని తడిపెయాలని.. లేదా.. మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారనో.. బాధ పడవద్దు. పిల్లలని ప్రోత్సహించడం తో పాటు..వాళ్ళకి కలిగే ఇబ్బందులని గమనించి..వాళ్ళకి చేయూత నిచ్చి.. సానుభూతి చూపించి.. వీలైతే పిల్లల మనస్తత్వాన్ని బట్టి  కోప్పడి..ఎప్పుడూ.. తోడుగా ఉండటమే..అమ్మ నాన్నల పని.పిల్లలు అమ్మానాన్నలని, వాళ్ళ సాన్నిహిత్యాని ఇష్టంగా కోరుకోవాలి.కష్టంగా భరించడం కాదు.

పిల్లలు కూడా.. ప్రపంచంలో.. అన్నిటికన్నా విలువైనవి తల్లిదండ్రుల ప్రేమ.. మంచి నడవడిక,భాద్యత  అని తెలుసుకుంటే..ఎవరు ఎవరికికి ఎంత దూరంలో ఉన్నా.. మనసంతా ప్రేమగా.. స్నేహంగా ఉండటం సాధ్యమే కదా! అమ్మానాన్న స్నేహంగా ఉండటం ఎంత అదృష్టం.ఆ.. స్నేహాన్ని అందరు ఆస్వాదించాలని కోరుకుంటూ..

ఈ..పోస్ట్ ని తప్పకుండా  చదివే ఐ మీన్ చూసే.. నా బంగారుకొండకి.. (నా కొడుకు కి) అలసి,సొలసి పోయే చిరునవ్వుల చంద్రుడికి ఈ..అమ్మలాలి. ఈ ప్రక్కనున్న లింక్ లో మీరు వినండి.

 లాలి పాడుతుంది గాలి ..ఆ గాలిలో..హాయిగా ఊయలలూగాలి..

14, ఏప్రిల్ 2011, గురువారం

"జ్ఞానార్జన ఇక్కడ - ధనార్జన అక్కడ"


చిలక పలుకులు పలికే చిన్నారులు సైతం నేను ఇంజినీర్ ని అవుతాను,డాక్టర్ ని అవుతాను,కంప్యుటర్ సైన్సు చేస్తాను.తర్వాత     అమెరికా వెళతాను అక్కడ  బోల్డన్ని డబ్బులు సంపాదిస్తాను..అంటూ ఉంటారు తర్వాత తర్వాత..ఏమిటో..వివరించలేరు. ఇది నిజంగా బాలల ఆలోచనా?కాదు..కాదు..పెద్దలు నూరిపోసిన ధోరణి. దేశం లో మూడోవంతు మంది అజ్ఞాన అంధకారంలో మునిగి ఉంటె మరోవైపు అంది వచ్చిన   అవకాశాలు  అంది పుచ్చుకుని రెక్కలు కట్టుకుని మేధావులంతా  విదేశాలకి valasa  వెళుతున్నారు. విద్యావంతులు వలస వెళ్ళడానికి కారణం ఉన్నత విద్యా అవకాశాల కోసం కావచ్చు .అక్కడ లబ్యమయ్యే సౌకర్యాలే కావచ్చు.లేదా అక్కడ లభించే ఆకర్షణీయమైన జీతం లభించే ఉద్యోగం కావచ్చు. . కానీ వెళ్ళిన  వారు తిరిగి రావడం  లేదు.
మన ప్రతిభ విదేశాలలో..మారు మ్రోగుతుంటే సంబర పడుతున్నాం.మనకి ఉపయోగపడటం లేదన్న బాధ మటుకు వెక్కిరిస్తుంది.కొన్ని దేశాల వారు  వలస వెళ్ళినా అక్కడ సంపాదించిన ఆస్తులను,తమ నైపుణ్యాన్ని  తీసుకు వచ్చితిరిగి తమ తమ దేశంలలో స్థిర పడి దేశ అభివృద్దిలో పాలు పంచుకుంటున్నారు.కొన్ని దేశాలు మేదోవలసని నియంత్రిస్తున్నాయి.ఆ బాటలో మనము నడవాలి.మేధోవలస ఆగాలి .ఎవరికైనా సేవలకి ప్రతిఫలం ధనం మాత్రమే కాదు.అన్నిటికన్నా మించినది ఆత్మ సంతృప్తి.ఏ దేశ అభివృద్ధి అయినా అ దేశ ప్రజల కృషిలోనే ఉంటుంది అని గుర్తించి  తమ అభివృద్ధిని దేశ అభివ్రుద్ధిలోనే కాంక్షించి ..జన్మ భూమి రుణాన్ని తీర్చుకోవాలి. వలస పక్షులు ఎన్నటికైనా సొంత గూటికి చేరడం పరిపాటి. పక్షులైనా మన వలస వాదులకి పథా నిర్దేశాని సూచించాలి.  
నేను ఈ పోస్ట్ (క్షమించాలి } ఈ చిరు వ్యాసం వ్రాసి 8 సంవత్సరాల అయిదు నెలలు దాటింది. సకల ఆంధ్రజ్యోతి దిన పత్రికలో..అచ్చుఅయ్యింది {నవంబర్ 7 గురువారం 2002 } "జ్ఞానార్జన ఇక్కడ - ధనార్జన అక్కడ" అన్న శీర్షికతో..అచ్చు అయింది.ఇప్పుడు అయితే కొన్ని ఆలోచనలు రూపాంతరం చెందవచ్చు కానీ..ఇప్పటికి ఫై అభిప్రాయంతో   ఏకీభవిస్తాను...  ఈ వ్యాసాన్ని అనుకోకుండా ఈ రోజు గుర్తుకు తెచ్చుకోవడం వెనుక ఒక కారణం ఉంది. ఒక బ్లాగ్ మిత్రుడు మీరు మీ అభిప్రాయాలని పత్రికలలో.. ప్రచురణ కోసం ఎందుకు పంపకూడదూ..అని అడిగారు.వివిధ పత్రికలలో వచ్చిన నా ఆర్టికల్స్ ని  వీలు వెంబడి బ్లాగ్లో..పెడతాను. మిత్రునికి ధన్యవాదములతో  ..  .

13, ఏప్రిల్ 2011, బుధవారం

ప్రజావేదిక కార్యక్రమం

 ఇటీవల వీక్షకులకి తమ దృష్టి మారుతుంది అననిపిస్తుంది.

ప్రతి ఆదివారం జెమిని  చానల్ లో ప్రసారమయ్యే ప్రజావేదిక కార్యక్రమాన్ని చాలా మంది చూస్తున్నారు.

నేను ఎక్కడ మర్చిపోతానో అని..పది  ఇళ్ళ అవతల ఉన్న మా చెల్లెలు ఫోను చేసి మరీ  గుర్తుచేస్తుంది.

విజయవాడలో జరుగుతున్న ప్రజావేదిక కార్యక్రమానికి  నీవు వెళ్ళ లేదే?   అని  చాలామంది అడుగుతున్నారు..

మరి కొందఱు. అక్కడికి  వెళ్ళడం ఆ చర్చాకార్య క్రమం లో.. చర్చించడం కన్నా ముఖ్యమైనది ఏమిటంటే..

మన ఇంట్లో.. ఆ వేదికలో చర్చించాల్సిన అంశాలు పట్ల కాక పోయినా సమస్యల పట్ల అవగాహన పెంచుకున్టున్నామా!? అసలు సమస్య ఉందని మనకి మనమే గుర్తు ఎరిగామా?? ఎందుకంటే సమస్యలు మన ఇంట్లో ఉన్నాయి అని ఒప్పుకోము. సమాజంలో ఉన్నాయి అని అనుకుంటారు.ఇక్కడ  "గురువిందగింజ" సామెత గుర్తు తెచ్చుకోవాలి.

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే  రెండు వారాలుగా ప్రసారం  అవుతున్నఅంశం.

"యువత అదుపు తప్పి ప్రవర్తిస్తుంది.దానికి కారణం ఎవరు!?"

ఇంకెవరు?మూకుమ్మడి సమాధానం ముమ్మాటికి తల్లి దండ్రులదే!తర్వాత మీడియా. ఇవి అస్త్రాలు.

యువత దేమి తప్పులేదు.పాపం. అసలు యువత లోనే రకరకాల ప్రవర్తనలు. తల్లి తండ్రుల వేదనలు.. ఏమి చేయలేని నిస్సహాయత. అయ్యో.. మా పిల్లలని బాగానే పెంచాము. వాళ్ళు అభివృద్ధి పథంలోకి రావాలని ఎన్నో కష్టాలు అనుభవించాం..రెక్కలు ముక్కలు చేసుకుని ఎన్నో ఫీజులు కట్టాం. అడిగినవన్నీ ఇచ్చాం అంటున్నారు.

కానీ యువత మాత్రం చిన్నప్పుడు నుండి  పుస్తకాల పురుగులుగా  మారి ఆటా-పాట మఱచి  ఉన్నత స్థానం కోసం తాపయత్రపడుతూ..అదే బాటలో.. నడిచే వారు క్రమ శిక్షణతో నడుచుకునేవారుగా తప్పక ఉంటున్నారు. వ్యక్తి అభివ్తుద్ధి మాత్రమె వీరు కాంక్షించే ఉత్తమ యువకులు.వీరి గురించి ఎవరికి చింత లేదు.. ఆఖరికి తల్లిదండ్రులకి కూడా..వీళ్ళని నేను హర్శించను. వీళ్ళకి సమాజం తో పని లేదు సమాజం  కోసం ఆరాటపడరు..వాళ్ళు చేయగల్గింది మాత్రం ఉద్యోగరీత్యా మాత్రమె సేవ చేయ గలరు..అంతే! వీళ్ళకి సమాజం లో జరిగే అన్ని విషయాలు కావాలి కానీ వారు సమాజానికి ఏమి చేయజాలరు .

ఇక రెండవ రకం వారు..  చదువంటే  నిర్లక్ష్యం .. కానీ..  బాగా చదవగలగడం వీరికి తెలుసు. అయినా జీవితం లో.. ఎంజాయ్ చేయడం అంటే విద్యార్ధి దశ లోనే.. అనే అభిప్రాయం తో..నిర్లక్ష్యం.వీళ్ళకి మంచి కౌన్సిలింగ్  ఇస్తే మంచి పౌరులుగా మారడం చాలా తేలిక. ఇలాటి యువతే ఎక్కువ  ఉంటుంది. మనందరి పిల్లలు వీళ్ళలోనే ఉంటారు. నాకు గొప్ప నమ్మకం. మంచి మార్గం ని సూచించే వారు కొరవయి మన బిడ్డలతో.. గడపడం తక్కువై.. మన ఆశలని వాళ్ళ మీద బలవంతంగా రుద్ది.. వాళ్లకి ఇష్టం లేని రంగాల వైపు వారిని మరల్చి..యువతలో..కసిని,హింసాతత్వాన్ని పెంచి పోషిస్తుంది.. ముమ్మాటికి తల్లి తండ్రులే. వాళ్లకి మార్కులు ఎక్కువ తెచ్చుకుంటే అవి ఇవి కొని ఇస్తామని లంచాల ఆశ చూపి..5 స్టార్ చాక్లెట్ల సంస్కృతి, పుట్టినరోజు  పార్టీ ల సంస్కృతి .. బైక్ ల మీద తిరిగే సంస్కృతికి మనమే ఆజ్యం పోశాం. వాళ్ళు తగలబడ కుండా ఆపడం ఎవరి తరం.!? గంజాయి విత్తనాన్ని నాటి తులసి  మొక్కలు రమ్మంటే ఎలా వస్తాయి?

పిల్లలు అదుపు తప్పుతున్నారు .. అంటే ఇంట్లో..ఆంక్షలు,  వారి పై విపరీతమైన ఆకాంక్షలు.. బయటికి వెళితే ప్రక్కన వాడితో పోల్చుకోవడం...అమ్మ - నాన్న చెప్పిన నీతులకి విరుద్దంగా సమాజం కనబడటం.. ఇలాటి వైరుధ్య భావాల మద్య తిక మక.. తో.. మీడియా చూపే ఆకర్షణ ల వలయంలో.. సమాతరం గా నడుస్తూ..గతి తప్పి ఉన్మాదులుగా మారి.. నాశనం అయిపోతున్నారు. తప్పు వారిది కాదు..తల్లి దండ్రులది,మీడియాది.

తల్లిదండ్రులుగా  మనలని మనం సంస్కరించుకుని బిడ్డలకి మంచి సంస్కారాన్ని నేర్పలేకపోవడం అనేది ఖచ్చితంగా వైఫల్యమే!

అందుకే నైతిక విలువలు లోపించిన యువతరాన్ని చూస్తున్నాం.ఆడ-మగ తేడానే లేదు.ఒక్కసారి..రవీంద్రుని కవీంద్రుని మాటలు గుర్తు తెచ్చుకుంటే...మనం తల్లిదండ్రులుగా ఎలా మెలగాలో.. తెలుస్తుంది."ఎక్కడైతే మనసు నిర్భయంగా ,శిరస్సు నిటారుగా ఉంటుందో .. ఎక్కడైతే విజ్ఞానం స్వేచ్చగా మనగల్గుతుందో.. ఎక్కడైతే అడ్డుగోడల అల్పత్వంతో..ఈ లోకం ముక్కలుచెక్కలు కాకుండా ఉంటుందో.. అటువంటి స్వాతంత్ర్య ధామంలోకి ఈ.. దివ్యదాత్రిని మేలుకొలుపు... మహాప్రభూ!అని.. వ్రాసారంటే..

పిల్లల పెంపకం పట్ల, విద్యావిధానాల పట్ల వారి దృకోణం ఎలా ఉందో.. కనీసం మనం అర్ధం చేసుకోగలితే చాలు.

కులం,మతం,అంతస్తుల బేరీజులు, వెనకబాటుతనంతో.. పాశ్చాత్య సంస్కృతి దిగుమతి తో.. విలాస జీవనంలో.. బ్రతుకుతూ..పిల్లకి అదే త్రోవ చూపుతూ..వాళ్ళ మనసులని వికశించ నీయకుండా చేస్తే..  కుహన సంస్కారంతో...పెరిగి పెద్దయి..వికృత  మనస్తత్వంతో.. వాళ్లకి  ఏం కావాలో తెలియని స్థితిలో.. కొట్టుకుంటున్నారు.

మూలాలు విశ్లేషించ కుండా అదుపు తప్పిన యువత తప్పు ని ఎత్తి చూపడం వలన తల్లితండ్రుల పాత్ర కప్పదాటు పద్దతిని.. అవలంబిస్తే .. ప్రపంచ దేశాలలోకి తలమానికంగా నిలవ గల్గిన యువత 2020 వచ్చేటప్పటికి లార్జెస్ట్ పోటాన్షియల్  స్టేట్ గా  నిలవగల్గిన దేశం మత్తుమందుల మైకం లో,రోగగ్రస్త బతుకులతో..అవినీతి వలయంలో..అర్ధాయుషుల..యువతని మనం తయారు చేసుకుంటున్నాం .. ఖచ్చితంగా పెద్దలదే తప్పు..అని  నేను చెప్పేదాన్నిఏమో!

ఏమైనా వాస్తవం మాత్రం ఇదే!పోటీలు పడి మరీ అమ్మాయిలు సమానత్వం  సాదిస్తున్నారు.. మొబైల్  పోనులు,చాటింగ్లు,ప్రేమ పారాయణాలు..ఆనక మౌన ప్రదర్శనలు ..

ఏమిటో..ఈ.. యువత..  ఎన్ని ప్రజావేదికలు పెట్టి వాదించినా...నిజం ..నిప్పులాటిది.తప్పు మీదంటే  మీదని తూర్పారబట్టుకోకండి.. జెమిని సాక్షిగా అసహ్యంగా ఉంది.

ఆ వేదికపై చెప్పేది చెబుతున్నది అదే.. ఓ"మాట.అంతే!

11, ఏప్రిల్ 2011, సోమవారం

అమ్మ చేతి గాజులు ...


గోరుముద్దలు  తినిపిస్తున్న   ఆ చేతి గాజులతో ఆడుకుంటూ
రంగులన్నింటిని చూడటం అక్కడే మొదలయింది.
అమ్మ పూజ చేసేటప్పుడు ఆరాధనతో పవిత్రంగా
నలుగురికి సాయం చేస్తున్నప్పుడు ఇంటిపనులు చేసేటప్పుడూ
ఎంత అందంగా ఉండేవో ఆ మట్టిగాజుల చేతులు
పెళ్ళిళ్ళకి పేరంటాలకి శుభకార్యాలకి వెళ్ళినప్పుడూ
అందరి చూపులు ఆమె మెడ మీదకన్నా
గాజుల పొట్లంలా ఉన్న బంగారు గాజుల చుట్టూనే
గిర్రున  తుమ్మెదల్లా తిరుగుతూ ఉండేవి
అబ్బురంగా ఆశక్తిగా ప్రశంసగా ఈర్ష్యగా
అన్నింటిని మెత్తగా పువ్వులా నవ్వుతూ
స్వీకరించే.."అమ్మ"నట్టింట్లో నడయాడే ప్రేమ పాతర

రిక్త హస్తాలు చూపడం తెలియని అమ్మకి
అమ్మమ్మ ఇచ్చిన గాజులు
ఇంటిముందు ఉండే గాదెలా అందరి అవసరానికి
మా ఇంటికి అలవాటైన తీరులో పంటలకి పెట్టుబడులు కావాలన్నా
నాన్న చేసే వ్యాపారం బాగా తిరగాలన్నా
అన్నయ్య చదువులకి ఫీజులు కట్టాలన్నా
చుట్టపక్కాలకి  అత్యవసర సాయం కావాలన్నా
టక్కున ఆదుకునేందుకు గుర్తొచ్చేవి
సాయం చేయడానికి కంకణం కట్టుకున్నట్లుఉండే
అమ్మ చేతి కంకణాలే

నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించేటప్పుడు
నా భుజాన్ని నొక్కుతూ నా దూకుడికి కళ్ళెం వేస్తున్నప్పుడూ
నా కన్నీటిని  ప్రేమగా తుడుస్తూ ఒదార్చుతున్నప్పుడూ
ఒడిదుడుకుల నడకలో సొలసినప్పుడూ
నా తల నిమురుతూ ఓదార్పు నిచ్చి నమ్మకం పెంచినప్పుడూ
ఆ చల్లని చేతి స్పర్శతో  పాటు ఆ గాజుల చిరు సవ్వడిని
ముద్రించుకున్ననా  జ్ఞాపకం  ఇప్పటికి
గుడిలో మంద్రంగా  మోగుతున్న చిరుగంటల ధ్వానంలా  తోస్తాయి

అర్దాయుషుతో  లోకానికి సెలవు చెప్పడం తప్పదని తెలిసినప్పుడు
పరామర్శించడానికి వచ్చిన వారికి
చేతులు జోడించి చేసిన కృతజ్ఞతా నమస్కారంతో పాటు
తన రంగు రంగుల గాజుల సవ్వడిని పంచిన
"అమ్మ"ని ఎవరుమర్చి పోగలరు
ఆమె జ్ఞాపకార్ధం పంచిన గాజులని ఊరంతా
పోటీ పడి అందరు పంచుకున్నాక 
ఏమి మిగలనప్పుడు నాకు దక్కాయి
అపురూపంగా "అమ్మ"పుత్తడి గాజులు.

ఆ గాజులలో అమ్మ మనసు 
అంతకన్నా పచ్చగా తోచిన కాలాలు ఎన్నో
 ఆ గాజుల్ని స్పృశించి నప్పుడల్లా
 నా కన్నుల నిండుగా అమ్మ వెన్నెల
 అమ్మ ప్రేమ వెన్నుదన్నుగా అందరిలో మెండుగా
 అందరికీ  దండుగా  నాకు జగమంత ఉగాదిగా
 ఆ గాజులతో పాటు అమ్మ వారసత్వాన్ని
 అమ్మంతగా కాకపోయినా "అమ్మలా
అందుకున్ననేననుకుంటూ ఉంటాను  అమ్మలా

 అందరూ ఉంటే  జగమంతా నిత్య ఉగాదే కదా అని
         
       (అమ్మ జ్ఞాపకం తో..కళ్ళు చిప్పిల్లగా ..ప్రేమతో.. అమ్మకి అంకితం .. ఈ కవిత)    

9, ఏప్రిల్ 2011, శనివారం

మూడో మనిషినిన్ననీవుకనిపించావు
నీతలపులలో నేనింకా ..సజీవంగానేఉన్నానని
ఇంకా  నీసొంతమనే
బ్రాంతిలోనేఉన్నావని,
స్తబ్దత ఆవరించిన  నీ  నిస్తేజజీవనంలో
నాతలంపే  దారిచూపే  దీపమని,
నేను సృష్టించిన నీఎదలోనికార్చిచ్చు
ప్రజ్వలిల్లుతూనే ఉందని,
నాలో  నీప్రేమతాలూకు  అవశేషాలు
ఏమైనా మిగిలున్నాయేమోనని...
వెతుక్కుంటూ..వచ్చానన్నావు
నేను నీకన్నా తక్కువేమీ కాదుకదా!
నేను  ఏనాడైనా  నీప్రేమను   ఆశించనే లేదే?అంటూ..
మూడు ముళ్ళబంధం నిప్పుల కుంపటి అయిందని..
మనసు పరాధీన భావనలో..
అతిభద్రంగానే ఉందని, లోలోపల ఛిద్రమై
పై మెరుగులతో తళుకులీనుతూ...
నిట్టూర్పు సెగల మద్య,
అనాదరణ అనే ఎడారియానంలో..
ప్రేమ ఒయాసిస్సుకై అన్వేషిస్తుంటే..
ఆకస్మికంగా నీ ప్రేమ..
జీవ నదిలా ప్రత్యక్షమైతే ..
సర్వం మరచి మీనమై విహరించాలని..
అతిగా ఆశించాను...
అంతలో వివేకం వీపు పై చెళ్ళుమని చరచింది..
వయసు ఎలాంటిదైనా.. మనసు పారేసుకోవడం
అనే మంచి - చెడ్డ గుణం..
మనిషికి శాపమే కాదు.. తాపం కూడా!
విచక్షణ మరచినది కూడా!!
కాలం గారడీలు చేస్తుంది.
పేరడీలు సృష్టిస్తుంది.
నీసంగతి నా సంగతి....
కలిపేమాట అటుంచి
కాస్తంత ఆలోచించి చూస్తే సమిధ మాత్రం
నీకు - నాకు మద్య వచ్చిన మూడోమనిషి.

ఆఖరి వరకు అంటి పెట్టుకుంటాననే ఆశతోవచ్చిన మనిషి.

మనమధ్య వచ్చిన మూడో మనిషికి
మరో మూడో మనిషి తారసపడితే !?