9, ఏప్రిల్ 2011, శనివారం

మూడో మనిషి



నిన్ననీవుకనిపించావు
నీతలపులలో నేనింకా ..సజీవంగానేఉన్నానని
ఇంకా  నీసొంతమనే
బ్రాంతిలోనేఉన్నావని,
స్తబ్దత ఆవరించిన  నీ  నిస్తేజజీవనంలో
నాతలంపే  దారిచూపే  దీపమని,
నేను సృష్టించిన నీఎదలోనికార్చిచ్చు
ప్రజ్వలిల్లుతూనే ఉందని,
నాలో  నీప్రేమతాలూకు  అవశేషాలు
ఏమైనా మిగిలున్నాయేమోనని...
వెతుక్కుంటూ..వచ్చానన్నావు
నేను నీకన్నా తక్కువేమీ కాదుకదా!
నేను  ఏనాడైనా  నీప్రేమను   ఆశించనే లేదే?అంటూ..
మూడు ముళ్ళబంధం నిప్పుల కుంపటి అయిందని..
మనసు పరాధీన భావనలో..
అతిభద్రంగానే ఉందని, లోలోపల ఛిద్రమై
పై మెరుగులతో తళుకులీనుతూ...
నిట్టూర్పు సెగల మద్య,
అనాదరణ అనే ఎడారియానంలో..
ప్రేమ ఒయాసిస్సుకై అన్వేషిస్తుంటే..
ఆకస్మికంగా నీ ప్రేమ..
జీవ నదిలా ప్రత్యక్షమైతే ..
సర్వం మరచి మీనమై విహరించాలని..
అతిగా ఆశించాను...
అంతలో వివేకం వీపు పై చెళ్ళుమని చరచింది..
వయసు ఎలాంటిదైనా.. మనసు పారేసుకోవడం
అనే మంచి - చెడ్డ గుణం..
మనిషికి శాపమే కాదు.. తాపం కూడా!
విచక్షణ మరచినది కూడా!!
కాలం గారడీలు చేస్తుంది.
పేరడీలు సృష్టిస్తుంది.
నీసంగతి నా సంగతి....
కలిపేమాట అటుంచి
కాస్తంత ఆలోచించి చూస్తే సమిధ మాత్రం
నీకు - నాకు మద్య వచ్చిన మూడోమనిషి.

ఆఖరి వరకు అంటి పెట్టుకుంటాననే ఆశతోవచ్చిన మనిషి.

మనమధ్య వచ్చిన మూడో మనిషికి
మరో మూడో మనిషి తారసపడితే !?





కామెంట్‌లు లేవు: