11, ఏప్రిల్ 2011, సోమవారం

అమ్మ చేతి గాజులు ...

అమ్మచేతిగాజులు 

గోరుముద్దలు  తినిపిస్తున్న   ఆ చేతి గాజులతో ఆడుకుంటూ
రంగులన్నింటిని చూడటం అక్కడే మొదలయింది.
అమ్మ పూజ చేసేటప్పుడు ఆరాధనతో పవిత్రంగా
నలుగురికి సాయం చేస్తున్నప్పుడు ఇంటిపనులు చేసేటప్పుడూ
ఎంత అందంగా ఉండేవో ఆ మట్టిగాజుల చేతులు
పెళ్ళిళ్ళకి పేరంటాలకి శుభకార్యాలకి వెళ్ళినప్పుడూ
అందరి చూపులు ఆమె మెడ మీదకన్నా
గాజుల పొట్లంలా ఉన్న బంగారు గాజుల చుట్టూనే
గిర్రున  తుమ్మెదల్లా తిరుగుతూ ఉండేవి
అబ్బురంగా ఆశక్తిగా ప్రశంసగా ఈర్ష్యగా
అన్నింటిని మెత్తగా పువ్వులా నవ్వుతూ
స్వీకరించే.."అమ్మ"నట్టింట్లో నడయాడే ప్రేమ పాతర

రిక్త హస్తాలు చూపడం తెలియని అమ్మకి
అమ్మమ్మ ఇచ్చిన గాజులు
ఇంటిముందు ఉండే గాదెలా అందరి అవసరానికి
మా ఇంటికి అలవాటైన తీరులో పంటలకి పెట్టుబడులు కావాలన్నా
నాన్న చేసే వ్యాపారం బాగా తిరగాలన్నా
అన్నయ్య చదువులకి ఫీజులు కట్టాలన్నా
చుట్టపక్కాలకి  అత్యవసర సాయం కావాలన్నా
టక్కున ఆదుకునేందుకు గుర్తొచ్చేవి
సాయం చేయడానికి కంకణం కట్టుకున్నట్లుఉండే
అమ్మ చేతి కంకణాలే

నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించేటప్పుడు
నా భుజాన్ని నొక్కుతూ నా దూకుడికి కళ్ళెం వేస్తున్నప్పుడూ
నా కన్నీటిని  ప్రేమగా తుడుస్తూ ఒదార్చుతున్నప్పుడూ
ఒడిదుడుకుల నడకలో సొలసినప్పుడూ
నా తల నిమురుతూ ఓదార్పు నిచ్చి నమ్మకం పెంచినప్పుడూ
ఆ చల్లని చేతి స్పర్శతో  పాటు ఆ గాజుల చిరు సవ్వడిని
ముద్రించుకున్ననా  జ్ఞాపకం  ఇప్పటికి
గుడిలో మంద్రంగా  మోగుతున్న చిరుగంటల ధ్వానంలా  తోస్తాయి

అర్దాయుషుతో  లోకానికి సెలవు చెప్పడం తప్పదని తెలిసినప్పుడు
పరామర్శించడానికి వచ్చిన వారికి
చేతులు జోడించి చేసిన కృతజ్ఞతా నమస్కారంతో పాటు
తన రంగు రంగుల గాజుల సవ్వడిని పంచిన
"అమ్మ"ని ఎవరుమర్చి పోగలరు
ఆమె జ్ఞాపకార్ధం పంచిన గాజులని ఊరంతా
పోటీ పడి అందరు పంచుకున్నాక 
ఏమి మిగలనప్పుడు నాకు దక్కాయి
అపురూపంగా "అమ్మ"పుత్తడి గాజులు.

ఆ గాజులలో అమ్మ మనసు 
అంతకన్నా పచ్చగా తోచిన కాలాలు ఎన్నో
 ఆ గాజుల్ని స్పృశించి నప్పుడల్లా
 నా కన్నుల నిండుగా అమ్మ వెన్నెల
 అమ్మ ప్రేమ వెన్నుదన్నుగా అందరిలో మెండుగా
 అందరికీ  దండుగా  నాకు జగమంత ఉగాదిగా
 ఆ గాజులతో పాటు అమ్మ వారసత్వాన్ని
 అమ్మంతగా కాకపోయినా "అమ్మలా
అందుకున్ననేననుకుంటూ ఉంటాను  అమ్మలా

 అందరూ ఉంటే  జగమంతా నిత్య ఉగాదే కదా అని
         
       (అమ్మ జ్ఞాపకం తో..కళ్ళు చిప్పిల్లగా ..ప్రేమతో.. అమ్మకి అంకితం .. ఈ కవిత)    

1 వ్యాఖ్య:

సామాన్య చెప్పారు...

yentha baaguno hrudayam aartramayyelaa ...