27, ఏప్రిల్ 2011, బుధవారం

మనసుని తడిమే ఓ..దిగులు మేఘం ఈ "అమ్మలేఖ"

మనలో చాలా మంది ఉత్తరాలు వ్రాసి  చాలా కాలం అయి  ఉంటుంది.  ఉత్తరం అంటేనే భావాల మూట. ఆ మూట విప్పగానే ఆత్మీయ పరిమళం మనలని చుట్టేస్తుంది. ఒక ఉత్తరం వ్రాసే ఓపిక, తీరిక రెండు ఉండటం లేదు. ఫోన్ ల పుణ్యమా అని వ్రాయటానికి నిమిషం పట్టే విషయాన్ని  అర నిమిషంలో మాట్లాడేసి  హమ్మయ్య! ఒక పని అయిపోయిందనుకోవడం అలవాటయిపోయింది...కదా!?

                             "చినుకు" మాసపత్రికలో ఆఖరి పేజీ లో.. ప్రియతమ్ అమృత కి వ్రాసే ఉత్తరం చూస్తే నేను వెంటనే అర్జెంట్ గా  ఒక ఉత్తరం వ్రాయాలనిపిస్తుంది అనుకుంటాను.. కానీ ఆచరణ శూన్యం.

                               ఈ రోజు ఫోటో ఆల్బుం చూస్తుంటే నా కొడుకు తనకి అప్పుడు అయిదేళ్ళు అనుకుంటాను.. ఇన్లాండ్- కార్డు  పై నాకు వ్రాసిన ఉత్తరం చూసాను.. కళ్ళమ్మట గిర్రున నీళ్ళు తిరిగాయి.. అప్పుడు "అమ్మ" కోసం వాడు దిగులుగా  వ్రాసిన ఉత్తరం అది.. నేను ఆ ఉత్తరాన్ని భద్రంగా దాచాను ఇప్పుడు  ఆ ఉత్తరాన్ని  మళ్లి  మళ్ళీ చదువుతుంటే నాకు ఆ దిగులు తెలుస్తుంది. వెంటనే.. నా కొడుకుకి ఒక ఉత్తరం వ్రాస్తున్నాను.. ఇలా బ్లాగ్ ముఖంగా.. మనసుని తడిమే ఓ.. దిగులు మేఘం ఈ అమ్మ లేఖ.
                                         
                         చిన్ని..! నాన్నా!!  బంగారం..ఎలా ఉన్నావు ? నీతో.. మాట్లాడి ఒక వారం రోజులైంది  చూసి ఒక నెల రోజులపైనే అయింది..ఇరవైనాలుగు గంటలు నీ గురించే ఆలోచిస్తూ దిగులు పడుతూ నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను.. నాన్నా!నీకు తీరిక లేక టచ్ లోకి రావడం లేదని అర్ధం అవుతూ ఉంది. నాన్నా .. నీవు ఎలా ఉన్నావ్?నాలుగైదు రోజుల క్రితం మన "కైలాష్" తన బైక్ ని   మన ఇంటి ముందు గేటు పక్కనపార్క్ చేసుకుని  ప్రక్కన ఉన్న దియేటర్ లో.. 'మిస్టర్ ఫర్పెక్ట్ " సినిమాకి వెళ్లి తిరిగి వెళ్ళేటప్పుడు చూసాను. హటాత్తుగా నువ్వే ననుకున్నాను కానీ వెంటనే నాకు కదా ! నువ్వు కళ్ళల్లో మెదిలావు ఏడుపు వచ్చేసి లొపలకి వచ్చేసాను.ఇదంతా నీకు చెప్పకూడదనే అనుకుంటాను..కానీ.. చెప్పకుండా ఉండలేను. మీ.. "నాన్నగారు'' కాల్ చేసి అడిగారు.. చిన్నిని చూసావా? ఎలా ఉన్నాడు, బాగున్నాడా? అని.. నేను అబద్దం చెప్పాను. చూసాను.. బాగానే ఉన్నాడులే! అన్నాను. నాన్నా! ఎలా ఉన్నావు బంగారం..?

                   నీకు  ఒక సంతోషకరమైన వార్త. కుండీలో నువ్వు నాటిన చిట్టి గులాబీ మొక్కకి తెగ పూలు పూస్తున్నాయి.. నిన్ను అడగకుండా కోసి దేవుడి పాదాల దగ్గర  కూడా పెట్టను కదా.!నీ అనుమతి కావాలి.. నాన్నా! పూలు కోయడం నీకు ఇష్టం ఉండదు కదా! పువ్వు లాంటి సున్నితమైన మనసుతో.. క్రొత్త చోటున దేశం కాని దేశంలో కొత్త వారితో ఎలా కలసి ఉంటున్నావో? అని ఒకటే దిగులు.సిటీ లోకి వెళుతూ మీ కాలేజి ప్రక్కనే బండి ఆపుకుని గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్న మీ కాలేజ్ మేట్స్ లో నిన్ను చూసుకుంటాను. బంగారం.. గ్రౌండ్ లోకి  బాటింగ్ కి  దిగితే అర్ధ శతకం అయినా  చేయకుండావెనుదిరగని  నీ  బాట్.. ఝుళుపించుని అక్కడ  వెతుకుతాను. నీ తరువాత నీ స్నేహితులు కొనసాగింపుగా ఇంటర్ యునివెర్సిటీ విజేతగా మీ వి ఆర్ ఎస్ సి ని నిలుపుతున్నారు టీం కెప్టన్ గా..ఎన్ని విజయాలు సాధించి ఇచ్చావు.  నేను.. ఇవన్నీ.. ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే.. ఆట అయినా.. జీవితం అయినా ఆది గెలవాలి నాన్నా! ఓడినా సరే.. మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయాలి. నీకు.. "ఫీనిక్స్" కధ చెప్పేదాన్ని .. కదా! గుర్తు తెచ్చుకో.. నీ పోరాటం ఇప్పుడు బ్రతుకు పోరాటం.ఉన్నత విద్య + కష్టించి పని చేయడం,పరిస్థితులకి అనుగుణంగా నడుచుకోవడం . ఇవన్నీ.. నీకు చాలెంజ్  అన్నమాట. నీకు నీవే నిర్ణయాలు తీసుకోవడం,ఆటుపోట్లు ఎదుర్కోవడం నేర్చుకోవాలి. అవన్నీ నేర్చుకోవాలవే నా తాపత్రయం కూడా.

                   అమ్మా! ఇప్పటికిప్పుడు ఇండియా వచ్చేసి క్రికెట్ ఆడుకోవాలనిపిస్తుందంటే నేను ఎంత నవ్వుకున్నానో తెలుసా? ఇరవై రెండేళ్ళు వచ్చినా  ఇంకా చైల్దిష్ మెంటాలిటీ,అంతే బోల్డ్ నెస్. మనిషికి అంతరంగాన్నివెలిబుచ్చే స్వేచ్చ ఉండాలి.అది నా దగ్గర నీకు ఎప్పుడూ ఉండాలి,ఉంటుంది కూడా.నీ మనసులో మాట ఏదయినా నీ ఇబ్బంది ఏదైనా చెప్పు బంగారం. నీకు నేను ఏమైనా హెల్ప్ చేయగలనేమో.. చూద్దాం. ఎప్పుడూ  మెయిల్స్ పెట్టే అమ్మ ఈ రోజు ఇంత పెద్ద ఉత్తరం వ్రాస్తుంది. చదివే తీరిక ఎక్కడ అని ప్రక్కన పడేయడానికి ఇదేం పేపర్ కాదు కదా! ఇల్లు గుర్తుకొచ్చినప్పుడు అమ్మ   గుర్తుకొచ్చినప్పుడయినా.. నిద్ర రానప్పుడయినా చదువుకుంటావు కదా బంగారం. అందుకే.. ఈ.. వ్రాయడం అన్నమాట.

                                       మా అమ్మ అంటే.. నాలుగు రోజుల తర్వాత డబ్బు ఇచ్చే   ఏ.టి.ఏం ..అనుకోవడం లోనే ఉన్నావా? నువ్వు అడిగితే నేను ఎప్పుడు ఇవ్వడానికి సిద్ధం నాన్నా! నేను డబ్బు పంపుతానంటే వద్దని అన్నావంటే.. నువ్వు ఆలోచించడం నేర్చుకున్నావని  సంతోషమేసింది. ఎప్పుడైనా..  అత్యవసరం పనులకి తప్ప మిగతా అప్పుడు నువ్వు ఏమడిగినా  నాలుగు రోజులపాటు కావాలని    ఆలస్యం ఎందుకు చేసేదాన్నో.. తెలుసా? అవసరానికి-అనవసరానికి తేడా.. తెలుస్తుందని. ఇప్పుడు.. నీకు నీ మంచి-చెడు చూడటానికి నీకు దగ్గరలో లేను కదా.. బంగారం! అందుకే  ఈ.. దిగులు.. బిడ్డకి  ఎప్పుడు ఏ అవసరం కల్గినా  తల్లి తీర్చాలనే అనుకుంటుంది.

                               అప్పుడప్పుడు  నిన్ను నా ప్రక్కన పడుకోపెట్టుకుని నువ్వు ఆసక్తిగా వినే నీ చిన్నప్పటి విషయాలతో  పాటు ఎన్నో మంచి మాటలు  చెప్పాలనుకున్నాను కానీ ఎప్పుడు పని ఒత్తిడిలోనేను. నీ గదిలో నువ్వు.అందుకే.. ఇప్పుడు రోజు ఇలా.. చెప్పాలనుకుంటున్నాను. నువ్వు దూరంగా ఉండటం వల్ల  అనుక్షణం జాగ్రత్తలు చెప్పి విసిగించనులే! జాగ్రత్త అంటే.. గుర్తుకు వచ్చింది..  నేను ఇప్పుడు వెహికల్ ని ఏమంత స్పీడ్ గా నడపడం లేదులే! దిగులు వద్దు.. బంగారం. నేను స్పీడ్ గా వెళ్ళేటప్పుడల్లా.. నువ్వు నా వెనుక ఉండి.. నా భుజం పై చేయ్యిసి..నొక్కి పెట్టి  "అమ్మా! స్లో..గా వెళ్ళు" అని కంట్రోల్ చేస్తున్నట్లే ఉంటుంది.నేను అప్పుడు స్పీడ్ ఎందుకు వెళ్ళే దాన్నో  తెలుసా!  నువ్వు నా వెనుక ఉన్నావనే  ధైర్యం.. అంతే..! ఇప్పుడు నేనసలు ఎక్కువ బండి తీయడం లేదు నాన్నా! మన విజయవాడ లో మెట్రో సర్వీస్ ల పని తీరు బాగుంది..బస్సు ప్రయాణం చేస్తున్నాను. నువ్వు డ్రైవింగ్ లో జాగ్రత్త బంగారం.

                 అన్నట్లు.. నీకిష్టమైన "బెండకాయ ఫ్రై" చేసుకోవడం కుదురుతుందా! కాఫీ.. తాగుతున్నావా? డెబ్బయి రూపాయలని లెక్క వేసుకుంటున్నావా? నాన్నా! నువ్వు వెళ్ళిన తర్వాత.. ఒకే ఒకసారి బెండకాయ  ఫ్రై చేసాను. నువ్వు తినకకుండా  తినలేక  పోయాను.మళ్ళీ .. ఇంతవరకు  ఆ కూర చేయ్యనేలేదు బంగారం.  నువ్వు దూరంగా ఉంటె  మన ఇంట్లో అక్వేరియం లో.. రంగు రంగుల జల పుష్పాలని,  బుజ్జి బుజ్జి కుక్కపిల్లలని,  మన ఇంటి ఎదురుగా బేబి ఆంటీ వాళ్ల గన్నేరు చెట్టు పై వ్రాలె సీతాకోక చిలుకలను చూసి సంతోషించే నీ అందమైన స్వచ్చమైన  పసి పిల్లల మనసు..నేను.. ఎవరిలో..చూడను? ఈ రోజు వాకింగ్ కి వెళ్ళినప్పుడు రెండు బుజ్జి కుక్కపిల్లలని చూసినప్పుడు మన "వాఘ్య"గుర్తుకు వచ్చింది. నా అశ్రద్ధ,అతి శుభ్రం గుర్తుకు వచ్చి.. సిగ్గుపడ్డాను. అందువల్లనేగా మన "వాఘ్య"  చనిపోయింది. అప్పుడు నువ్వు ఎంత ఎడ్చావో గుర్తుకు వచ్చింది.సారీ ..బంగారం!

                        ఈ ఉత్తరం వ్రాసి విసిగిస్తున్నానా! నేను ఎప్పుడూ ఏమనే దాన్నోగుర్తుందా.. ? నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు నాకు తెలుగులో నే ఉత్తరం వ్రాయాలి లేకపోతే నేను ఊరుకోను అనేదాన్ని. తెలుగుని అశ్రద్ధ చేయకు బంగారం.మన మాతృ బాషని తక్కువ చేయకండి. వెంటనే మెయిల్ ద్వారా ఒక ఉత్తరం వ్రాయి బంగారం. అమ్మకి నీ క్షేమం వ్రాస్తూ ఆ వ్ర్రాతలోమన మాతృబాషని ఒకసారి గుర్తుకు తెచ్చుకో. చాలా విషయాలు చెప్పాలి.రోజు రోజు  కొంచెం కొంచెం చెబుతాను, సరేనా.. బంగారం ! ఇందాకటి నా దిగులు తగ్గిందిలే! ఇలా.. అయినా  మనసారా నీతో.. సంభాషించినందుకనుకుంటా!  ఇక ఉంటాను మరి.

                                                                                                    ఇట్లు.. ప్రేమతో, దీవెనలతో
                                                                                                              మీ అమ్మ.   

2 వ్యాఖ్యలు:

సామాన్యుడు చెప్పారు...

అమ్మ మనసును ఆవిష్కరించారండీ... కళ్ళు చెమ్మగిల్లాయి...

వనజవనమాలి చెప్పారు...

thankyou very much.