22, ఏప్రిల్ 2011, శుక్రవారం

ఆంధీ..

                                                                                                                                                                                                                                  


        ఆంధీ

యవ్వనపు పుటపై 
తొలి వలపు సంతకం నీది
ఏ సుడి గాలి తాకిడికో
ఆకస్మికంగా దూరంగా
విసిరివేయబడిన కొన్నేళ్ళకి
నీ జ్ఞాపకాల సాంద్రత,గాడత
తగ్గుతున్న తరుణాన
గాలి దుమారంలా
నీ పునరాగమనం
నన్ను చుట్టేస్తుంది.

తలుపుకావల నీవు
ఈవల నేను నిలబడే ఉంటాం
పరిచితులమైన అపరిచితుల్లా..
కొత్తగా కనపడ్డ చూపులో
పాత భావాలు వెతుక్కుంటూ..
వెన్నెల తూట్ల చూపులతో
ఎదబీటిపై చివురులు మోలిపిస్తూ
మౌన బాషతో ఊసులాడుతూ..
రేపు మాపులని కలిపి ఉంచే
సంధ్య సందిట.. పూచే..
కొత్త - పాత రేడువైతే
నా భ్రమణం నీచుట్టూనే..

స్థాన భ్రంశాలు మనకి చేతకాక  ఏమో
నిట్టూర్పుతో నేను లోపలి గదిలోకి
ముడుచుకుంటూ వెళుతుంటే
నా అందెల సవ్వడిని గుండె జేబులో
పదిలపర్చుకుని వెనుతిరుగుతావు
వెనక్కి వెనక్కి చూసుకుంటూ
పెరిగిన ఎడద బరువుని మోసుకుంటూ..
నీవు వెళ్ళే దృశ్యాన్నిశూన్యమైన
గుండె గావాక్షంలో నుండి
భావ రహితంగా చూస్తుంటాను.          

కాలం కాగితాన్ని ఉండచుట్టి విసిరిపడేసి
కొత్త పుటపై నీ ఎడబాటుని అక్షరీకరిస్తే..
కావ్యాలు చిన్నపోతున్నాయి
గ్రంధస్తమైన నా జ్ఞాపకాల పుటలలో
రోజు ..ఓ..సరికొత్త జ్ఞాపకం
నిదురలేస్తుంది గాలి దుమారంలా..

ఎన్నటికి కలవని రెండు తీరాలని
ఎప్పుడు కలిపి ఉంచే నీటిలా..
నిన్ను నన్ను కలిపే జ్ఞాపకం..
ఓ.. ప్రేమ పరిమళం..నదీ పరివాహక ప్రాంతాలలో,ఎడారి ప్రాంతాలలో ఒకేసారి వేడి చల్లని వాతావరణం ఏర్పడినప్పుడు ఇసుక తుపాన్ లు వస్తాయని శాస్త్రజ్ఞులు చెపుతున్న విషయం "ఆంధీ" అనే పదానికి తుఫాన్ అనే అర్ధం ఉంది. ఎడారి ప్రాంతాలలో వారు వాతావరణం చల్లబడాలంటే తుఫాన్ రావాలని కోరుకుంటారట. ఇసుక తుఫాన్ అతలాకుతలం చేస్తుందని తెలిసి కూడా తుఫాన్ రావాలని కోరుకుంటారంటే వేడిమి భరించలేకే కదా! "ప్రేమ" వైఫల్యం" కూడా అలాంటివే నన్న భావంతో అంటే "వైఫల్యం" కూడా ఉంటుందని తెలిసి కూడా ప్రేమించడం ఇసుక తుఫాన్ ని కోరుకోవడంలాంటిదే అని నా భావన . ఇది నా కవిత వెనుక భావన

4 వ్యాఖ్యలు:

Avineni Bhaskar / అవినేని భాస్కర్ చెప్పారు...

ఈ కవిత భలే నచ్చింది నాకు... ముఖ్యంగా కింద లైన్స్ చాలా బాగున్నాయండి.

"కాలం కాగితాన్ని ఉండచుట్టి
విసిరిపడేసి కొత్త పుటపై
నీ ఎడబాటుని అక్షీకరిస్తే..
కావ్యాలు చిన్నపోతున్నాయి"

వనజవనమాలి చెప్పారు...

ధన్యవాదములు.స్పందనతో వ్రాసినప్పుడు అభివ్యక్తీకరణ బలంగా ఉంటుంది.బాష కోసం తడుముకోవడం ఉండదని నా అభిప్రాయం .. మీకు నచ్చినంధులకు మరిన్ని ధన్యవాదములు

అక్షర మోహనం చెప్పారు...

కలవని తీరాలని కలిపిఉంచే నీటిలా...nice expression..!

వనజవనమాలి చెప్పారు...

ధన్యవాదములు..ధన్యవాదములు.. రామ్ మోహన్ గారూ.